మరుగునపడ్డ మాణిక్యాలు – 51: లివింగ్

0
2

[dropcap]త్వ[/dropcap]రలో మరణిస్తానని తెలిస్తే మనిషి ఏం చేస్తాడు? కొందరు తమ ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. కొందరు తీరని కోరికలు తీర్చుకుంటారు. కొందరు దైవప్రార్థనలో సమయం గడుపుతారు. కానీ ఏం చేయాలో తెలియనివారే ఎక్కువమంది ఉంటారు. జీవితమంతా ఉద్యోగానికే అంకితం చేసినవారు అకస్మాత్తుగా ఈ ఉద్యోగం వల్ల ఒరిగేదేమిటి అనుకుంటారు. ‘చనిపోయేటప్పుడు ఎవరూ నేను ఆఫీసులో ఇంకాస్త కష్టపడి పనిచేయాల్సింది అనుకోరు’ అని అమెరికాలో ఒక నానుడి. మరణించే ముందు ఆలోచనలు ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా ఉంటాయి. అందరినీ ఒకే గాటన కట్టలేం. అలాంటి ఒక వ్యక్తి కథే ‘లివింగ్’ (2022). సోనీ లివ్‌లో లభ్యం. ఈ చిత్రానికి జపనీస్ చిత్రం ‘ఇకిరు’ (1952) ఆధారం. నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన కజువో ఇషిగురో ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశాడు. ఆస్కార్ అవార్డులలో ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే నామినేషన్ వచ్చింది. ఈ చిత్రంలో నటించిన బిల్ నయీ కి ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. అయినా ఈ చిత్రం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.

కజువో ఇషిగురో చిన్నప్పుడే జపాన్ నుంచి బ్రిటన్‌కి వచ్చాడు. ఆంగ్లంలోనే రచనలు చేశాడు. ‘ద రిమెయిన్స్ ఆఫ్ ద డే’ నవల ఆయనకి ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ నవల ఇస్మాయిల్ మర్చెంట్ నిర్మించగా జేమ్స్ ఐవరీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. జీవితంలో ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో, వయసు పెరిగేకొద్దీ వాటిని తలుచుకుని అలా చేయకుండా ఉండాల్సింది అని బాధపడటం ఎలా ఉంటుందో ఒక వయసు వచ్చినవారిలో చాలమందికి అనుభవమే. ఈ అంశమే ఆ నవలలో ప్రధాన ఇతివృత్తం. ఈ అంశమే ‘ఇకిరు’ లో కూడా ఉంటుంది. అదే ఇషిగురోని ఆ కథ వైపు ఆకర్షించిందేమో అనిపిస్తుంది. ఆ కథని 1953లో బ్రిటన్ లోని ఒక ప్రభుత్వోద్యోగి కథగా మార్చాడు. ఆలివర్ హెర్మనస్ దర్శకత్వం వహించాడు. ‘లివింగ్’ అంటే జీవించటం అని అర్థం. మరణించే వ్యక్తి కథకి ‘లివింగ్’ అని పేరు పెట్టటంలోనే ఈ చిత్రంలోని ఆయువుపట్టు ఉంది.

కథ మొదలుపెట్టిన తీరులోనే విశిష్టత కనపడుతుంది. పీటర్ వేక్లింగ్ అనే యువకుడు రైలు స్టేషన్లో ఉండగా కథ మొదలవుతుంది. అతను లండన్ బయట ఒక ఊళ్ళో ఉంటాడు. లండన్‌లో ఉద్యోగం వచ్చింది. చాలామంది రైల్లో లండన్ వెళ్ళి పని చేసుకుని సాయంత్రం తిరిగి రైల్లో ఇంటికి వస్తుంటారు. పీటర్‌కి ఉద్యోగంలో అదే మొదటి రోజు. అతనికి తనతో పాటు ఉద్యోగం చేసేవారు పరిచయమవుతారు. అందరూ గంభీరంగా ఉంటారు. ఇక్కడే బ్రిటిష్ సంస్కృతి కాస్త తెలుస్తుంది. గాంభీర్యం, మర్యాద ఎక్కువ. పీటర్ బృందం రైలు ఎక్కుతారు. రైలు బయలుదేరుతుంది. తమ పై అధికారి మిస్టర్ విలియమ్స్ వచ్చే స్టేషన్లో రైలు ఎక్కుతాడని ఒకాయన పీటర్‌కి చెబుతాడు. ప్లాట్‌ఫారమ్ మీద విలియమ్స్ కనపడగానే అందరూ అభివాదం చేస్తారు. విలియమ్స్ కూడా అభివాదం చేసి రైలు ఎక్కుతాడు. చిరునవ్వులు ఉండవు, కేవలం అభివాదాలే. పీటర్ “ఆయన మన దగ్గరకి వస్తారా?” అని అడుగుతాడు. “ఆయన మన దగ్గరకి రారు” అంటాడు అవతలి ఆయన. రైలు దిగాక స్టేషన్ బయట అందరూ ఆగుతారు. విలియమ్స్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి ఆఫీసు వైపు దారి తీస్తాడు. పీటర్ ఆయన వెనకాల వెళ్ళబోతుంటే ఇతరులు ఆపుతారు. విలియమ్స్ కాస్త దూరం వెళ్ళాక వీరు వెళతారు. అధికారులకి కాస్త దూరంగా ఉండటం అప్పటి పద్ధతి. ఇప్పటికీ మనదేశంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే పద్ధతి ఉంది.

వారు పని చేసే కార్యాలయంలో చాలా విభాగాలు ఉంటాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా పనులకి అక్కడే అనుమతులు తీసుకోవాలి. ప్రజాప్రయోజనాలు, పార్కులు, ప్రణాళికలు, పారిశుధ్యం ఇలా చాలా విభాగాలు ఉంటాయి. విలియమ్స్ ప్రజాప్రయోజనాల విభాగానికి అధికారి. అతని కింద ఐదుగురు ఉద్యోగులు ఉంటారు. ఇంకా టైపిస్టులు, బంట్రోతులు వేరే. ఈ ఆరుగురూ కలిసి ఒక గదిలో ఒకే పెద్ద బల్ల చుట్టూ కూర్చుంటారు. ఎవరి ఫైళ్ళు వారికి ఉంటాయి. కాస్త ఇరుకుగానే ఉంటుంది. విలియమ్స్ వంచిన తల ఎత్తకుండా పని చేస్తుంటాడు. అక్కడ మిస్ హ్యారిస్ ఒక్కతే స్త్రీ. చిన్న వయసు. ఆమె పీటర్ తో “మీ ఫైళ్ళ పర్వతం ఎత్తుగా ఉండేలా చూసుకోండి. లేకపోతే మీరు చేయటానికి పని ఏమీ లేదని అనుకునే ప్రమాదం ఉంది” అంటుంది. ఇది విలియమ్స్‌కి వినపడే ఉంటుంది. అయినా అతను పట్టించుకోడు. తర్వాత తెలిసేదేమిటంటే మిస్ హ్యారిస్ ఒక రెస్టారెంట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేయటానికి వెళ్ళిపోతోందని. అందుకే ఆమె ధైర్యంగా అలా మాట్లాడింది.

ఆ ఆఫీసు పని తీరు చూస్తే ఒక విభాగం పని మరొక విభాగం మీద తోసేయటమే ఎక్కువగా జరుగుతున్నట్టు ఉంటుంది. విలియమ్స్ కూడా అలాగే చేస్తుంటాడు కానీ ఇక ఎవరూ ఆ పని బాధ్యత తీసుకోరు అనిపిస్తే ఆ ఫైలు తన దగ్గర అట్టిపెట్టుకుంటాడు. అలా పెట్టుకునేటప్పుడు “ఫైలు ఇక్కడ ఉంటుంది. మునిగిపోయేదేముంది?” అంటుంటాడు. ఆ రోజు కొందరు మహిళలు వారి విభాగానికి వస్తారు. తమ ఇళ్ళ దగ్గర ఉన్న స్థలంలో పిల్లలకు ఆటస్థలం నిర్మించమని వారి విజ్ఞప్తి. ఆ స్థలంలో రెండవ ప్రపంచయుధ్ధ సమయంలో బాంబు పడింది. దాన్ని అధికారులు అలాగే వదిలేశారు. ఆ మహిళలు చాలా రోజులుగా ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్ని విభాగాల వారూ వారిని అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని తిప్పుతూ ఉంటారు. పీటర్‌ని వారికి తోడుగా పార్కుల విభాగానికి వెళ్ళి అప్పజెప్పి రమ్మని పంపిస్తాడు విలియమ్స్. పీటర్‌కి ఏమీ తెలియదు. ఆ మహిళలు విసిగిపోయి ఉంటారు. తిరిగి తిరిగి చివరికి ప్రజాప్రయోజనాల విభాగానికి తిరిగి వస్తాడు పీటర్. “పారిశుధ్యం వాళ్ళు ఇది మన బాధ్యతే అంటున్నారు” అంటాడు విలియమ్స్‌తో. “వాళ్ళు చెప్పేది తప్పు. అయినా ఫైలు ఇక్కడ పెడతాను. మునిగిపోయేదేముంది?” అంటాడు విలియమ్స్.

ఇక్కడ కథ ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పటి దాకా పీటర్ కథలా అనిపించిన కథ విలియమ్స్ కథగా మారిపోతుంది. విలియమ్స్ స్వభావం ఎలాంటిదో చెప్పటం కోసం ముందు పీటర్ దృక్కోణం చూపించారు. విలియమ్స్ డాక్టర్ దగ్గరకు వెళతాడు. అతనికి క్యాన్సర్ అని తెలుస్తుంది. ఆరు నెలలు బతుకుతాడని డాక్టర్ చెబుతాడు. విలియమ్స్ ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అతని కొడుకు, కోడలు అతనితోనే నివసిస్తారు. కోడలు వేరు కాపురం పెట్టాలని అనుకుంటుంది. వారు ఇంటికి వచ్చి విలియమ్స్ చీకట్లో కూర్చుని ఉండటం చూసి ఉలిక్కిపడతారు. విలియమ్స్ “కాసేపు ఇక్కడ కూర్చోండి” అంటాడు. కోడలు “రేపు ఇద్దరమూ త్వరగా వెళ్లాలి” అని మేడ పైన తమ గదిలోకి వెళ్ళిపోతుంది. కొడుకు ఆమెని అనుసరిస్తాడు. కొడుకు చిన్నప్పుడే భార్య మరణించినా విలియమ్స్ మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయాడు. కొడుకు కూడా తండ్రి మీద ప్రేమ కలవాడే. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చిన్న చిన్న ఫ్లాష్‌బ్యాక్ లలో తండ్రీకొడుకుల అనుబంధం చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

మర్నాడు విలియమ్స్ ఆఫీసుకి వెళ్ళకుండా ఒక రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడొక వ్యక్తి పరిచయమౌతాడు. అతనికి తన క్యాన్సర్ గురించి చెబుతాడు. “నేను ఈ విషయం చెప్పిన మొదటి వ్యక్తి మీరే. నాకు కాస్త ఆనందంగా గడపాలని ఉంది. కానీ అది ఎలాగో నాకు తెలియదు” అంటాడు. ఆ వ్యక్తి అతన్ని బార్‌కి తీసుకువెళతాడు. ఇద్దరూ మద్యం తాగుతారు. అక్కడ గాయకులు పాటలు పాడుతూ ఉంటారు. విలియమ్స్ కూడా పాట పాడతాడు. పాటలో అమ్మ ప్రస్తావన వస్తుంది. విలియమ్స్ గొంత గద్గదమవుతుంది. తర్వాత ఒక బంజారాల గుడారానికి వెళ్ళి నృత్యం చూస్తారు. విలియమ్స్ ఒక దశలో దగ్గుకుంటూ బయటకి వస్తాడు. నోట్లో నుంచి రక్తం వస్తుంది. అతనితో వచ్చిన వ్యక్తి అది చూసి ఏం పాలుపోక ఉండిపోతాడు.

విలియమ్స్ లాంటి వాళ్ళు ఎంతమందో! ఎన్నో ఆశలతో ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో అడుగుపెడతారు. వ్యవస్థలోని లోటుపాట్లు దాటలేక వ్యవస్థలో భాగమైపోతారు. పిల్లలు పెద్దవారయ్యాక వారి జీవితం వారిది. తలిదండ్రుల దగ్గర కూర్చునే తీరిక కూడా ఉండదు. విలియమ్స్‌కి భార్య తోడు కూడా లేదు. బయటికి గంభీరంగా ఉంటూ ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. అనుకోనిదేదైనా జరిగితే పంచుకునేవారు కూడా ఉండరు. విలియమ్స్ నిజానికి కొడుకు కోసం త్యాగాలు చేశాడు. కొడుకు కూడా మంచివాడే. కొడుకుని ఇబ్బంది పెట్టకూడదని అతనికి విషయం చెప్పకుండా ఉండిపోతాడు. పాశ్చాత్య దేశాలలో వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఎక్కువ. మంచి జరిగినా, చెడు జరిగినా ఎవరికి వారే బాధ్యత వహిస్తారు. కానీ రోగాల సంగతి చెప్పకపోవటం మాత్రం వింతే. విలియమ్స్‌కి జీవితంలో ఉద్యోగం తప్ప ఏమీ మిగలలేదు. మరణించే దశలో ఉద్యోగం గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ జీవితానికి అర్థం ఏమిటి అనే ఆలోచిస్తారు. ఏం చేస్తే ఆనందం దక్కుతుంది అనే ఆలోచిస్తారు. విలియమ్స్ ఆ ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు.

విలియమ్స్ ఆఫీసుకి వెళ్ళకుండా బయట తిరుగుతూ ఉంటాడు. అఫీసు వాళ్ళు ఇంటికి ఫోన్ చేస్తే కోడలు ఆయన ఇంటి నుంచి బయలుదేరాడని చెబుతుంది. రెండు రోజుల తర్వాత మిస్ హ్యారిస్‌కి విలియమ్స్ వీధిలో తారసపడతాడు. “మీ గురించి మేమంతా కంగారుపడ్డాం. నాకు మీతో ఇంకో పని కూడా ఉంది. రెస్టారెంట్లో ఉద్యోగానికి మీ సిఫారసు కావాలి” అంటుందామె. “మీకు అందుబాటులో లేకపోవటం నా తప్పే. ముందు భోజనానికి వెళదాం. సిఫారసు ఉత్తరం కూడా అక్కడే రాసిస్తాను” అని ఒక పెద్ద రెస్టారెంట్‌కి తీసుకువెళతాడు. విలియమ్స్ లోని ఈ కొత్త కోణాన్ని చూసి మిస్ హ్యారిస్ ఆశ్చర్యపోతుంది. “మీరిలా ఉంటారని అనుకోలేదు. ఆఫీసులో ఉన్నవారందరికీ పేర్లు పెట్టడం నాకు అలవాటు. మీకేమో మిస్టర్ జాంబీ అని పేరు పెట్టాను” అంటుంది. జాంబీ అంటే చనిపోయినా బతికున్నట్టు తిరిగే మనిషి. జాంబీలో భావోద్వేగాలు ఉండవు. ఆ మధ్య తెలుగులో ‘జాంబీ రెడ్డి’ అనే సినిమా కూడా వచ్చింది. మిస్ హ్యారిస్ ఉద్దేశం ఏమిటంటే విలియమ్స్ ఏ భావోద్వేగాలు లేకుండా తన పని తాను చేసుకుపోతాడని. తనకు ఆమె పెట్టిన పేరు విని అతనికి కొత్త అర్థం తోస్తుంది. త్వరలో చనిపోతాను కదా, నేనిప్పుడు జీవచ్ఛవాన్నే కదా అనుకుంటాడు. పైకి మాత్రం నవ్వుతాడు. సిఫార్సు ఉత్తరం రాసిస్తాడు. తర్వాత ఇద్దరూ నగరంలో వ్యాహ్యాళికి వెళతారు. ఆఫీసులో ఎవరూ విలియమ్స్ గురించి ప్రశ్నించేవారు లేరా అనే అనుమానం వస్తుంది. ఆ విషయం వదిలేద్దాం.

విలియమ్స్, మిస్ హ్యారిస్ రెస్టారెంట్లో ఉండగా చూసిన ఒకామె విలియమ్స్ కోడలికి వార్త మోసుకెళుతుంది. కోడలు కొడుకుకి చెబుతుంది. “ఆఫీసు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. బ్యాంక్‌లో డబ్బు మాయమవుతోంది. ఆయన చేసే నిర్వాకం ఇదన్నమాట. మీరు అడగండి” అంటుంది. అడుగుతానంటాడు కొడుకు. భోజనాల దగ్గర ఆమె భర్తకి సైగలు చేస్తుంది తండ్రిని అడగమని. అతను మౌనంగా ఉంటాడు. విలియమ్స్ వాళ్ళకి తన వ్యాధి గురించి చెబుదామని అనుకుంటాడు. రిహార్సల్ కూడా చేసుకుంటాడు. కానీ అతనూ ఏమీ మాట్లాడడు. కోడలు డొంకతిరుగుడుగా “ఒకప్పుడు లండన్లో జరిగే విషయాలు లండన్ దాటేవి కాదు. ఇప్పుడు మన వీధిలో సగం మంది లండన్లోనే పని చేస్తున్నారు” అంటుంది. “ఔను. నిజమే” అంటాడు విలియమ్స్. కొడుక్కి అందులోని శ్లేష అర్ధమైనా మాట్లాడకుండా ఉండిపోతాడు. కోడలు ఇంకేమీ చేయలేక లోలోపలే కుతకుతలాడుతుంది. ఇప్పటి కోడళ్ళలా కాదు మరి!

ఒక నెల గడిచిపోతుంది. విలియమ్స్ ఆఫీసుకి వెళ్ళకుండా బయట తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు మిస్ హ్యారిస్ పని చేసే రెస్టారెంట్‌కి వెళతాడు. ఆమె విస్తుపోతుంది. అతను ఆమెని ఆమె అభిమాన నటుడి సినిమాకి తీసుకెళతానంటాడు. ఇద్దరూ సినిమాకి వెళతారు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాలని తొందరపడుతున్నా ఆమెని డ్రింక్స్‌కి రమ్మంటాడు. ఆమె వెళుతుంది కానీ “మీ పద్ధతి ఏమీ బాగాలేదు. మీరు నాకంటే చాలా పెద్దవారు” అంటుంది. విలియమ్స్ ఆమెకి తన వ్యాధి గురించి చెబుతాడు. తన కొడుక్కి కూడా చెప్పలేదంటాడు. ఆమె నివ్వెరపోతుంది. అతను “ఆ రోజు వీధిలో మిమ్మల్ని చూసి అలా చూస్తూ ఉండిపోయాను. మీరు జీవితాన్ని ఆస్వాదిస్తారు. నేను కూడా మీ నుంచి జీవితాన్ని ఆస్వాదించటం నేర్చుకోవాలని ఆశించాను. నన్ను మిస్టర్ జాంబీ అంటారు కదా! నేనెప్పుడు అలా మారిపోయానో నాకే తెలియదు. రోజువారీ జీవితంలో పడి ఇలా అయిపోయాను. మీరెప్పుడైనా ఆడుకుంటున్న పిల్లల్ని చూశారా? చీకటి పడగానే వారి తల్లులు వారిని లోపలికి రమ్మని పిలుస్తారు. వారు ఇంకాసేపు ఆడుకుంటామని మారాం చేస్తారు. ఎక్కడో ఒక పిల్లవాడు మాత్రం ఆడుకోకుండా పక్కన కూర్చుని ఉంటాడు. అమ్మ పిలిస్తే లోపలికి వెళ్ళిపోదామని ఎదురుచూస్తూ ఉంటాడు. నేనా పిల్లవాడి లాంటి వాణ్ణి. నేనలా మిగిలిపోకూడదు. ఆ సృష్టికర్త నన్ను పిలిచేలోగా..” అని ఏదో ఆలోచన తళుక్కున మెరిసినట్టు ఆగిపోతాడు. అతనే మళ్ళీ “మీకు చాలా ఆలస్యమైంది. పదండి. బస్ స్టాప్ దగ్గర దింపుతాను” అని ఆమెని తీసుకుని వెళతాడు. ఇలా అకస్మాత్తుగా అతని ప్రవర్తన మారిపోవటానికి కారణం అతను నిజంగా జీవించాలని నిర్ణయించుకోవటమే!

నిజానికి మిస్ హ్యారిస్ సాధారణమైన యువతి. విలియమ్స్ ఆమెని పొగుడుతుంటే ఆమె “నేనూ అందరి లాంటిదాన్నే” అంటుంది. విలియమ్స్‌కి ఆమెలో ప్రత్యేకత కనిపించటం ఆమెలోని ఏవో గుణాల ఉండటం వల్ల కాదు, తన జీవితంలో ఉన్న వెలితి వల్ల. ప్రవాహం లాంటి జీవితంలో కొట్టుకుపోతూ మింగేసే సుడిగుండం నుంచి తప్పించుకోవటానికి ఏదో ఒక ఆసరా కోసం చేతులు కొట్టుకుంటుంటే అతనికి ఆమె చేయి అందింది. ఆమె పలకరింపుకే అతను సేదదీరాడు. ఆమెని వదులుకుంటే ఇంకే ఆసరా ఉండదని భయం. అతనిలో ఏ దురుద్దేశమూ లేదు. తాను ఆడుకోవటం చేతకాని పిల్లవాడినని, దేవుడి పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నానని అంటాడు. ఈ పోలిక ఎంతో భావుకంగా ఉంటుంది. జీవితానికి పరమార్థం ఏమిటని చాలామంది ప్రశ్నిస్తారు. జీవించటమే జీవితం పరమార్థం అని తత్వవేత్తలు చెబుతారు. ఈ నాటకరంగంలో మన పాత్ర మనం పోషించి, సమయం వచ్చినపుడు నిష్క్రమించటమే. మన కర్తవ్యమేదో మనం చేసి, సుఖదు:ఖాలని సమానంగా తీసుకుంటూ సాగిపోవటమే. కర్తవ్యం చేయటమే కీలకం. ఈ చిత్రంలో కూడా అదే కీలకమవుతుంది.

ఆత్మపరిశీలన చేసుకునే విలియమ్స్ పాత్రలో బిల్ నయీ నటన ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ వారిలో ఉండే గాంభీర్యం అతనిలో పోతపోసినట్టు కనిపిస్తుంది. తన వ్యాధి గురించి మాట్లాడే ముందు “ఇది పెద్ద విషయమేమీ కాదు” అంటాడు, అవతలి వారిని ముందే ఆ వార్తకి సిద్ధం చేయటానికన్నట్టు. ‘నేను కుంగిపోవట్లేదు కాబట్టి నువ్వు కూడా తేలికగా తీసుకో’ అని అందులో అంతరార్థం. ఇక్కడ బిల్ నటన సున్నితంగా ఉంటుంది. మిస్ హ్యారిస్‌గా ఏమీ లీ వుడ్ చక్కగా నటించింది. చిలిపితనం కొంచెం, నిర్మొహమాటం కొంచెం కలిసి ఉండే పాత్ర ఇది. అలాగని ఇతరుల మనోభావాలను పట్టించుకోకుండా ఉండదు. ‘మిస్టర్ జాంబీ’ అనే పేరు చెప్పగానే విలియమ్స్ ముఖంలో మారిన రంగులని గమనిస్తుంది. వెంటనే క్షమాపణ అడుతుంది. నిజానికి ముందే “మీకు కోపం రాదంటేనే చెబుతాను” అంటుంది. విలియమ్స్ వ్యాధి గురించి చెప్పినపుడు చిన్న వయసు ఉన్నవాళ్ళు అంత గంభీరమైన విషయానికి ఎలా స్పందిస్తారో చక్కగా అభినయించింది. అతని మాటలు విని కన్నీరు పెట్టుకుంటుంది. “మీ అబ్బాయికి ఎందుకు చెప్పలేదు?” అని మాత్రం అడుగుతుంది. ఎవరైనా అదే మాట అడుగుతారు. దానికి వయసుతో నిమిత్తం లేదు.

ఈ క్రింద చిత్రకథ మరి కొంచెం ప్రస్తావించబడింది. చిత్ర్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

విలియమ్స్ మర్నాడు ఆఫీసుకి వెళతాడు. వర్షం పడుతూ ఉంటుంది. అందరూ అతన్ని చూసి కుశలప్రశ్నలు వేస్తారు. అతను అదేం పట్టించుకోకుండా పిల్లల ఆటస్థలం కోసం మహిళలు విజ్ఞప్తి చేసిన స్థలం పరిశీలించటానికి అందర్నీ బయలుదేరదీస్తాడు. వర్షం పడుతోంది కదా అంటే పర్వాలేదు పదండి అంటాడు. అందరూ ఆ స్థలానికి వెళతారు. అక్కడ మురుగు నీరు ఉంటుంది. అయినా విలియమ్స్ పట్టించుకోడు. మహిళల్లో ఒకామె అతనికి గొడుగు పడుతుంది. అతనిలో ఒక పట్టుదల కనపడుతుంది. విలియమ్స్ ఎందుకు ఈ ఆటస్థలం మీద దృష్టి పెట్టాడు? మిస్ హ్యారిస్‌తో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఆడుకునే పిల్లలు గుర్తు వచ్చి ఈ ఆటస్థలం విజ్ఞప్తి గుర్తు వచ్చింది. చనిపోయే లోపు ఈ ఒక్క పని పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆనందం ఎక్కడో లేదు, కర్తవ్యనిర్వహణ లోనే ఉంది. స్వధర్మనిర్వహణే తపస్సు అంటాయి మన శాస్త్రాలు.

అయితే ఆటస్థలం సంగతి ఏమైందనేది తెలిసే ముందే కథ ఒక్కసారిగా ముందుకి దూకుతుంది. విలియమ్స్ మరణించిన తర్వాత జరిగే సంస్మరణ సభలోకి వెళుతుంది. అక్కడ అందరూ ఉంటారు. ఆటస్థలం కోరిన మహిళలు కూడా ఉంటారు. పీటర్ మిస్ హ్యారిస్‌ని పలకరిస్తాడు. అతనికి ఆమె అంటే ఇష్టం. ఆమెని డేట్‌కి రమ్మని అడుగుదామనుకుంటాడు. ఇంతలో విలియమ్స్ కొడుకు మైకెల్ అక్కడికి వస్తాడు. విలియమ్స్ పీటర్ కోసం వ్రాసిన ఉత్తరం అతనికి ఇస్తాడు. తర్వాత మిస్ హ్యారిస్‌తో మాట్లాడాలని ఆమెని పక్కకి పిలుస్తాడు. అతను ఆమెని ఏం అడగబోతున్నాడో అని మనకి అనిపిస్తుంది. నేనైతే అతను “మీకు, మా నాన్నకి ఉన్న సంబంధం ఏమిటి?” అని అడుగుతాడేమో అనుకున్నాను. కానీ అతను అడిగేది విస్మయం కలిగిస్తుంది. మనసుని మెలిపెడుతుంది. “మా నాన్నకి తాను చనిపోతున్నాననే విషయం తెలుసా?” అంటాడు. మిస్ హ్యారిస్ ఒక్క క్షణం తత్తరపడి “మీకేం చెప్పాలో తోచటం లేదు” అని మాత్రం అంటుంది. అతనికి విషయం అర్థమవుతుంది. “మీకు చెప్పి నాకు చెప్పకపోవటం ఏమిటి?” అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. “నాకు తెలిస్తే ఈ చలిలో ఆయన్ని బయట తిరగనిచ్చేవాణ్ణి కాదు” అంటాడు. అతని మంచితనం చూసి ఆ పాత్రని తక్కువ అంచనా వేసిందుకు నాకు సిగ్గేసింది. అతను తండ్రిని ప్రశ్నించకుండా ఉన్నప్పుడే అతని ఔన్నత్యం కనపడింది. ఎవరినీ అనవసరంగా శంకించకూడదు. మైకెల్‌ని జీవితాంతం వెంటాడే విషయం ఏమిటంటే తన తండ్రి అంత పెద్ద విషయాన్ని తనతో చెప్పకుండా బయటి వ్యక్తికి చెప్పాడు. తండ్రి తనకి భారం కాకూడదనే ఆ పని చేశాడని అతని అర్థమయ్యే ఉంటుంది. కానీ తండ్రిని సరిగా చూసుకోలేకపోయాననే బాధ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

విలియమ్స్ సహచరుల మాటల్లో పిల్లల ఆటస్థలం నిర్మాణం పూర్తయిందని, ఆ ఘనత తమదే అని పార్కుల విభాగం చెప్పుకోవటానికి ప్రయత్నిస్తోందని తెలుస్తుంది. మహిళలు మాత్రం విలియమ్స్ వల్లే పని పూర్తయిందని అంటారు. విలియమ్స్ పట్టుబట్టి ఆటస్థలం పని పూర్తి చేశాడని అతని సహచరులు గుర్తు చేసుకుంటారు. ఒక విభాగం సహకరించకపోతే అతను పని పూర్తయ్యే దాకా అక్కడే కూర్చుని అనుకున్నది సాధించాడు. చైర్మన్ ఒప్పుకోకపోతే అతను “మళ్ళీ ఆలోచించమని ప్రాధేయపడుతున్నాను. ఈ విజ్ఞప్తికి తిరస్కరించకుండా ఒక వారం ఆగండి. మునిగిపోయేదేముంది?” అంటాడు. చివరికి చైర్మన్ ఒప్పుకుంటాడు. చనిపోతున్నానని తెలిసే అతను దృఢసంకల్పంతో పని చేశాడేమో అని అతని సహచరులు అనుకుంటారు. ఒకతను “అవును. ఆయనకి చనిపోతున్నానని తెలుసనే అనిపిస్తోంది” అని ఒక సంఘటన చెబుతాడు. మహిళలతో పాటు ఒక విభాగానికి వెళ్ళి వస్తుండగా విలియమ్స్ “మీరు అధైర్యపడకండి” అంటాడు. అతని సహచరుడు అక్కడే ఉంటాడు. మహిళల్లో ఒకామె “మీరు అక్కడ సహనం కోల్పోకుండా ఎలా ఉన్నారు?” అని అడుగుతుంది. “నాకు సహనం కోల్పోయేంత సమయం లేదు” అంటాడు విలియమ్స్. అందులో నిగూఢార్థం ఉంది. విలియమ్స్ నిబద్ధతకి అతని సహచరులు చలించిపోతారు. ఇంతకు ముందు అతను కూడా వ్యవస్థలో ఇరుక్కుపోయి పని పట్ల ఆసక్తి లేకుండా ఉండేవాడు. కానీ వ్యాధి సంగతి తెలిశాక అతనితో మార్పు వచ్చింది. అతని సహచరులు తమ పని శ్రద్ధగా చేయాలని నిశ్చయించుకుంటారు. అయితే కుక్క తోక వంకర అన్నట్టు మళ్ళీ మామూలే. ఫైళ్ళని పక్కన పెట్టడం యథాపూర్వం జరుగుతూ ఉంటుంది. పీటర్ ఇది చూసి నిరాశ చెందుతాడు.

అయితే పీటర్ స్వభావాన్ని విలియమ్స్ ముందే పసిగట్టాడు. అందుకే అతనికి ఉత్తరం వ్రాసిపెట్టాడు. అందులో నిరుత్సాహపడకుండా పని చేసుకుంటూ పొండి అని చెబుతాడు. ఆటస్థలం మన కృషి వల్లే సాధ్యమయిందని మరచిపోవద్దంటాడు. పీటర్ ఒకరోజు సాయంత్రం చీకటి పడ్డాక ఆటస్థలం దగ్గరకి వెళ్ళి చూస్తుంటాడు. అక్కడ గస్తీ కాసే ఒక పోలీసు అతని దగ్గరకి వస్తాడు. పీటర్ అతనికి విలియమ్స్ గురించి చెబుతాడు. ఆ పోలీసుకి విలియమ్స్ గురించి తెలుసు. అతను “ఒకరోజు ఆయన ఆటస్థలంలో ఉయ్యాల మీద కూర్చుని ఉండగా చూశాను. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే అంత చలిలో కూర్చోనిచ్చేవాణ్ణి కాదు. కానీ ఆయన ఎంతో సంతోషంగా కూనిరాగాలు తీస్తుంటే ఆయన్ని కదపటం ఇష్టం లేక వదిలేశాను” అంటాడు. పీటర్ “ఆయనకి ప్రాణాంతక వ్యాధి వచ్చింది. మీరు ఆయన్ని కదపకుండా వదిలేసి మంచి పని చేశారు. ఆయన జీవితంలో ఎప్పుడూ లేనంతగా అప్పుడే ఆనందంగా ఉన్నారని చెప్పగలను” అంటాడు. తర్వాత ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక తల్లి పిల్లలని ఇంట్లోకి పిలవటంతో చిత్రం ముగుస్తుంది.

పని చేయటం లోనే ఆనందం ఉంటుంది. ఆనందం కోసం పని మానేసి ఎక్కడో వెతకనక్కరలేదు. ఆ పని పట్ల మనకి ఆసక్తి (ప్యాషన్) ఉంటే చాలు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. దాన్ని బట్టి పని చేసుకుంటూ పోవటమే. ‘మీరు ప్రేమించే పని చేస్తుంటే మీకు జీవితంలో ఒక్కరోజు కూడా పనిచేస్తున్నట్టు అనిపించదు’ అని ఒక ఆంగ్ల నానుడి. కొందరు సంపాదన కోసం ఇష్టం లేని పని చేస్తారు. లేదా పనిలో ఇష్టం లేకుండా చేస్తారు. రెండూ తప్పే. సంపాదన ముఖ్యం కాదు. మనలో ఉన్న ఆసక్తి ప్రకారం పని చేయటమే ముఖ్యం. విలియమ్స్ తన పనిని ఆసక్తిగా చేసి ఒక మంచిపని చేసిన సంతృప్తి పొందాడు. ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆ యశఃకాయానికి మరణం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here