Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 53: తిథి

[సంచిక పాఠకుల కోసం ‘తిథి’ అనే కన్నడ సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

ఈ సంవత్సరం తెలుగులో ‘బలగం’ అనే చిత్రం వచ్చింది. ఒక ఇంటి పెద్ద మరణిస్తే అతని కుటుంబసభ్యులు అతనికి కర్మకాండ చేయటం ఆ చిత్రంలో ముఖ్య నేపథ్యం. ఇదే నేపథ్యంతో 2015లో కన్నడంలో ‘తిథి’ చిత్రం వచ్చింది. అయితే ‘బలగం’ లో మానవసంబంధాల మాధుర్యం చూపిస్తే ‘తిథి’ లో మనుషుల స్వార్థాలను చూపించారు. నేపథ్యం ఒక్కటే కావటం కేవలం యాదృచ్ఛికమే అనటంలో సందేహం లేదు. రెండూ ఆణిముత్యాల్లాంటి చిత్రాలే. ‘తిథి’ లో అనుభవం లేని నటులతో కథ నడిపించిన తీరు అబ్బురపరుస్తుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం. ఆంగ్లంలో సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

కథ మొదట్లో ఒక పెద్దాయన రోడ్డు పక్కన కూర్చుని వచ్చేపోయే వారిని సూటిపోటి మాటలంటూ ఉంటాడు. అతని పేరు ఆ ఊరిలో చాలామంది మర్చిపోయారు. 100 ఏళ్ళు బతికాడు కాబట్టి అతన్ని అందరూ సెంచరీ గౌడ అంటారు. గౌడల కులానికి చెందినవాడు. అతని మాటలు ఎవరూ పట్టించుకోరు. కారణం ఆ మాటల్లో ఉన్న వెటకారం, అసభ్యత. అతను ఒకప్పుడు స్త్రీలోలుడు. ఇప్పుడు మాటలతోనే తీట తీర్చుకుంటూ ఉంటాడు. కాసేపటికి లేచి పక్కకి వెళ్ళి కూర్చుని మూత్రవిసర్జన చేస్తూ అలాగే పక్కకి ఒరిగి పడి ప్రాణాలు వదిలేస్తాడు. అతనికి నలుగురు కొడుకులు. పెద్దకొడుకు గడ్డప్ప. బక్కగా ఉంటాడు. అతనికి గడ్డం ఉంటుంది కాబట్టి గడ్డప్ప అంటారు. అతని పేరు కూడా ఊరివారు మర్చిపోయారు. ఈ గడ్డప్పకి రెండే పనులు. రోడ్ల వెంట నడుస్తూ ఉండటం, మద్యం తాగటం. ఊరు దాటి నడుస్తూ వెళతాడు, బుద్ధి పుట్టినపుడు తిరిగి ఇంటికి వస్తాడు. మద్యం కోసం చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తాడు. అప్పుడప్పుడూ పిల్లలతో పులి-మేక ఆడతాడు. అతనికో కొడుకు. పేరు తమ్మణ్ణ. చెరుకు వ్యవసాయం చేస్తాడు. తమ్మణ్ణ కొడుకు పేరు అభి. నూనూగు మీసాల కుర్రాడు. ఏటిలో ఇసుక తీసి అమ్ముకోవటం అతని పని. వీరిద్దరి దగ్గరా ఫోన్లు ఉంటాయి. సెంచరీ గౌడ చనిపోయిన విషయం వారికి చేరిపోతుంది. గడ్డప్ప దగ్గర ఫోన్ ఉండదు. అతను నడుచుకుంటూ వెళుతుంటే దారి పక్కన పొలంలో పని చేసుకునేవాడొకడు ఫోన్లో కబురు విని గడ్డప్పకి చెబుతాడు. “ఏం పర్వాలేదు. మునిగిపోయిందేమీ లేదు” అంటాడు గడ్డప్ప. ఓ పక్కన దహనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. తప్పదన్నట్టు గడ్డప్ప ఊరిలోకి వస్తాడు. ఓ మనిషిని “దహనం ఎక్కడ చేస్తారు?” అని అడిగి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. శవాన్ని ఒక గూడులాంటి పాడె మీద కూర్చోబెట్టి తీసుకువస్తారు. బాజాలు మోగుతూ ఉంటాయి. శవయాత్ర రావటం చూసి గడ్డప్ప దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. అభి వెళ్ళి “ఇక్కడ కూర్చున్నావేం?” అంటే “అక్కడ గలాటా ఎక్కువగా ఉంది” అంటాడు. అతన్ని తీసుకువచ్చి సెంచరీ గౌడకి తలకొరివి పెట్టిస్తారు. తలకొరివి పెట్టేముందు చొక్కా విప్పమంటే విప్పడు. మొత్తానికి దహనం పూర్తి చేస్తారు.

గడ్డప్ప బాధ్యత లేని మనిషిలాగ ఉంటాడు. తమ్మణ్ణ ఇంటి బాధ్యత అంతా చూసుకుంటూ ఉంటాడు. అయితే గడ్డప్పది వైరాగ్యం. సెంచరీ గౌడ పేర్న భూమి ఉంటుంది. ఆ భూమి మీద గడ్డప్పకి ఆశ లేదు. కానీ తమ్మణ్ణకి ఆ భూమి కావాలి. “నేను పోయిన తర్వాత ఆ భూమి నీదే కదా” అంటాడు గడ్డప్ప. “ఈ లోపల నీ తమ్ముళ్ళు ఆ భూమి కాజేస్తే? ఇప్పుడే నా పేర్న రాసెయ్” అంటాడు తమ్మణ్ణ. “ఈ రాతకోతలేం నేను చెయ్యను” అంటాడు గడ్డప్ప. తమ్మణ్ణ దుర్భాషలాడతాడు కానీ ఏం చేయలేని పరిస్థితి. ఓ పక్క పెద్దకర్మకి ఏర్పాట్లు చేయాలి. పెద్దకర్మని వాళ్ళు తిథికార్యం అంటారు. పురోహితుడు “మీ తాత చుట్టుపక్కల ఎంతో పేరున్నవాడు. కనీసం ఐదువందల మందికి భోజనం పెట్టాలి. మీరు గౌడలు కాబట్టి మాంసం వడ్డించాలి” అంటాడు. ఇదో పెద్ద ఖర్చు. తమ్మణ్ణకి భూమి పోతుందనే బాధ ఎక్కువగా ఉంటుంది. తన తండ్రి ప్రమేయం లేకుండా భూమి తనది కావాలంటే ఏం చేయాలని శాంభోగా అనే వ్యక్తిని సలహా అడుగుతాడు. అతను తనకొక ఆసామి తెలుసని, ఎలాంటి పనైనా చిటికెలో చేసేస్తాడని, అతనికి భూమి అమ్మెయ్యమని చెబుతాడు. ఆ ఆసామి పేరు సేతు. పట్నంలో ఉంటాడు. తమ్మణ్ణ అతన్ని కలుస్తాడు. పత్రాలు చూపిస్తాడు. “భూమి మీ నాన్నకి చెందుతుంది. ఆయన్ని తీసుకురా” అంటాడు సేతు. “మా నాన్న కూడా చనిపోయాడు” అంటాడు తమ్మణ్ణ! “డెత్ సర్టిఫికేట్లు తీసుకురా. అప్పుడు భూమి చూద్దాం. ఏ జంఝాటం లేకుండా అక్కడికక్కడే డబ్బు ఇచ్చేస్తాను” అంటాడు సేతు.

గడ్డప్ప వైరాగ్యం లౌకికంగా చూస్తే మొండితనం లాగే ఉంటుంది. వైరాగ్యం ఉన్నవాడు ఇంటిని అంటిపెట్టుకుని ఉండటం ఎందుకు? అతనికి భూమి మీద ఆశ లేకపోయినా కొడుక్కి ఇవ్వవచ్చుగా! మాట వినడు. ఇంత వైరాగ్యం ఎందుకొచ్చింది? అది తర్వాత తెలుస్తుంది. తమ్మణ్ణ భయం ఆ భూమి దాయాదుల పాలవుతుందని. తండ్రికి నయానో భయానో చెప్పుకోవాలి గానీ తండ్రి చనిపోయాడని చెప్పటం దారుణం. తండ్రి సహకరించకపోతే దేవుడి మీద భారం వేసి వదిలేయాలి. ప్రాప్తముంటే అదే వస్తుంది. కానీ ఇలా ఆలోచించేవాళ్ళు కలియుగంలో తక్కువ. అందుకే అవినీతి పెరిగిపోయింది. డెత్ సర్టిఫికేట్లు పుట్టించేవాళ్ళు కూడా తయ్యారయ్యారు. తమ్మణ్ణ తాలూకా ఆఫీసులో పనిచేసే ఒకతన్ని పట్టుకుంటాడు. నకిలీ డెత్ సర్టిఫికేట్ కోసం అతను పాతిక వేలు అడుగుతాడు. “నీ తండ్రి ఎవరికీ కనపడకూడదు. ఏం చేస్తావో చెయ్యి” అంటాడు. తమ్మణ్ణ సరే అంటాడు. తన ఊరిలో సారా కొట్టు నడిపే కమలక్క దగ్గర రెండు లక్షలు అప్పు చేస్తాడు. తిథికార్యానికి కూడా ఖర్చు ఉంది కదా! భూమి అమ్మేసి అప్పు తీర్చేయవచ్చని తమ్మణ్ణ ధీమా.

పాత్రల చిత్రణ అద్భుతంగా చేశారు ఈ చిత్రంలో. తమ్మణ్ణకి సలహా ఇచ్చిన శాంభోగా భార్యకు భయపడే మనిషి. ఇంటి కప్పు బాగు చేయించమని ఆమె వేధిస్తూ ఉంటుంది. తమ్మణ్ణ సేతుని కలవటానికి వచ్చినపుడు శాంభోగా అతనికి తోడుగా పట్నానికి వస్తాడు. అయితే ఇంటి కప్పు బాగు చేసే పనివాళ్ళు సరిగా పనిచేయట్లేదని శాంభోగా భార్య ఫోన్ చేస్తుంది. అతన్ని నానా తిట్లూ తిడుతుంది. అతను “నేను వెళ్ళకపోతే నా భార్య చచ్చిపోతుంది” అని వెనక్కి వెళ్ళిపోతాడు. నిజానికి తనని చంపేస్తుందని అతని భయం. శాంభోగా లాంటివాళ్ళు చాలామంది మనకు కనబడుతూనే ఉంటారు. పైన పటారం, లోన లొటారం. శాంభోగా ఉంటే తమ్మణ్ణ సేతు దగ్గర అబద్ధం చెప్పేవాడు కాదేమో. ఒత్తిడిలో అతను అబద్ధం చెప్పేశాడు. ఇక తాలూకా ఆఫీసు మనిషి ఒక జిరాక్స్ సెంటర్ నడుపుతూ ఉంటాడు. వెనకాల ఒక గది ఉంటుంది. అక్కడ ట్రెడ్ మిల్ ఉంటుంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన అతను తమ్మణ్ణ ఎదుటే బట్టలు మార్చుకుని ట్రెడ్ మిల్ మీద నడుస్తూ తమ్మణ్ణతో నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. అతను కరడుకట్టినవాడని ఈ చర్య ద్వారా తెలిసిపోతుంది. చివరికి “మీ నాన్న కనపడినట్టు తెలిస్తే నీ డెత్ సర్టిఫికేట్ కూడా నేనే తయారు చేస్తాను” అంటాడు. కమలక్క విషయంలో చిత్రణ ఇంత సూక్ష్మంగా ఉండదు. ఆమె సారా కొట్టు నడుపుతుంది. కర్కశంగా ఉంటుంది. సారా తాగి డబ్బులివ్వకుండా పోతున్న ఒకతన్ని పట్టుకుని కొడుతుంది. తమ్మణ్ణని ఐదురోజులకి పదిహేను శాతం వడ్డీ అడుగుతుంది. తీర్చకపోతే ఊరందరి ముందూ పరువు తీస్తానంటుంది. తమ్మణ్ణ గతి లేక ఒప్పుకుంటాడు.

తమ్మణ్ణ కొడుకు అభి ఫోన్లో అసభ్య చిత్రాలు చూసే అలవాటున్నవాడు. అతనికి ఒకరోజు గొర్రెలు కాసుకునే ఓ అమ్మాయి కనపడుతుంది. ఆమె వెంటపడతాడు. ఆ అమ్మాయి పేరు కావేరి. ఇష్టం లేనట్టు ఉంటుంది కానీ ఆమెకి కూడా అతని మీద మోజు ఉంటుంది. అభి తన స్నేహితుడి దగ్గర మోటారు సైకిల్ తీసుకుని తిథికార్యానికి చుట్టుపక్కల ఊళ్ళలో కార్డులు పంచుతాడు. “మీ ముత్తాత పెద్ద తిరుగుబోతు” అంటాడొక ముసలాయన. “మీ ముత్తాతకి కండబలం ఎక్కువ” అంటుందొక ముసలావిడ. దీన్ని బట్టి సెంచరీగౌడ ఎంతటి స్త్రీలోలుడో తెలిసిపోతుంది. తమ్మణ్ణ అభికి ఫోన్ చేసి “మీ తాతని తీసుకుని పొలం దగ్గరకి రా” అంటాడు. అభి గడ్డప్పని తీసుకుని వస్తాడు. అభిని పొలంపని చేయమని చెప్పి తమ్మణ్ణ గడ్డప్పతో “నీకు డబ్బిస్తాను. దేశం తిరిగిరా. ఆర్నెల్లు ఇంటికి రావద్దు” అంటాడు. గడ్డప్ప సరే అంటాడు. “నీ మాట నమ్మను. అభి మీద ఒట్టెయ్” అని ఒట్టేయించుకుంటాడు తమ్మణ్ణ. డబ్బిచ్చి దగ్గరుండి బస్సు ఎక్కిస్తాడు. కాస్త దూరం వెళ్ళాక గడ్డప్ప ఒక మద్యం దుకాణం దగ్గర దిగిపోతాడు. మద్యం కొనుక్కుని పొలాల్లోకి వెళతాడు. అక్కడ అతనికి గొర్రెలు కాసుకునే కాపర్ల తండా కనపడుతుంది. కావేరి ఆ గుంపులోనే ఉంటుంది. ఆ గుంపులో ఆమె బంధువులు ఉంటారు. వాళ్ళంతా బంజారాలు. అప్పటికి ఆ చోట ఉన్నారు. కొన్నాళ్ళకి వేరే చోటికి వెళ్ళిపోతారు. “నన్ను మీతో పాటు తీసుకుపొండి” అంటాడు గడ్డప్ప. వాళ్ళు అతను పరిహాసమాడుతున్నాడని అనుకుంటారు. అయినా తమతో పాటే అతనికి భోజనం పెడతారు. అతను వాళ్ళతో బాగా కలిసిపోతాడు. గడ్డప్ప వాళ్ళతో వెళ్ళిపోయాడా? తమ్మణ్ణ భూమి అమ్మాడా? అభి, కావేరి కథ ఏమైంది? ఇదంతా మిగతా కథ.

ఎరెగౌడ, రామ్ రెడ్డి వ్రాసిన స్కీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. అలాగే రామ్ రెడ్డి దర్శకత్వం కూడా. గడ్డప్పని బస్సు ఎక్కించేటప్పుడు తమ్మణ్ణ “డబ్బు నీ బ్యాగులో పెట్టాను. లెక్కపెట్టుకో” అంటాడు. గడ్డప్ప “నీకు నీ తండ్రి మీద నమ్మకం లేదేమో. నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది” అంటాడు. అక్కడ తమ్మణ్ణ మీద క్లోజప్ షాట్ ఉంటుంది. మొహం తిప్పుకుని కాస్త తల ఊపుతాడు. అందులో అనేక భావాలు తోస్తాయి. తండ్రి తనని దెప్పుతున్నాడనే ఉక్రోషం, తండ్రిని మోసం చేస్తున్నాననే దుఃఖం కలగలిసి ఉంటాయి. ధనాశ మనుషలని ఎలా దిగజారుస్తుందో కదా అనిపిస్తుంది. కథలో తర్వాత ఇంకా విస్మయం కలిగించే విషయాలు తెలుస్తాయి. గడ్డప్ప వైరాగ్యం సమంజసమే కదా అనిపిస్తుంది. అయినా తమ్మణ్ణ చేసిన మోసం బయటపడకూడదని కూడా అనిపిస్తుంది. ఎలాగూ గడ్డప్పకి ఆశ లేదు. తమ్మణ్ణ అయినా బాగుపడాలి అనిపిస్తుంది. అదే ఈ స్క్రీన్ ప్లే లోని గొప్పతనం. అభి, కావేరిల ఉపకథ నడిపించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఒక కొట్టు దగ్గర కావేరి ఉండటం చూసి అభి అక్కడికి వెళతాడు. కావేరి అతన్ని పట్టించుకోకుండా కావలసినవి కొనుక్కుని బయల్దేరుతుంది. ఆమె నడిచి వెళుతుంటే అభి మోటారు సైకిల్ అద్దంలో ఆమెని చూస్తూ ఉంటాడు. కాస్త దూరం నడిచివెళ్ళి ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే! అభి ఆమె వెంటపడతాడు. ఆమె చూడకపోయి ఉంటే అతను తన దారిన తాను వెళ్ళిపోయేవాడు. తర్వాత అభి ఆమె కోసం పిండిమరలో పనికి కుదరుకోవటం నవ్వు తెప్పిస్తుంది. నటులందరూ కొత్తవారే. అంతా చాలా సహజంగా నటించారు. ఈ చిత్రానికి దేశవిదేశాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

గడ్డప్ప బంజారాలకి తన కథ చెబుతాడు. అతని తండ్రి దళారి పని చేసేవాడు. తల్లి జబ్బు చేసి మరణించాక తమ్ముళ్ళని గడ్డప్పే చూసుకున్నాడు. వ్యాపారం మీద ఊరికి వెళ్ళిన అతని తండ్రి ఒక అమ్మాయిని వెంటబెట్టుకు వస్తాడు. “ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో” అంటాడు గడ్డప్పతో. గడ్డప్ప ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఇద్దరు కొడుకులు పుడతారు. ఒకరోజు గడ్డప్ప మేకల కోసం గడ్డి తేవటానికి వెళతాడు. ఒక చెట్టు ఎక్కి చూస్తే అతనికి తన తండ్రి, తన భార్య పొలంలో కనబడతారు. “చూడకూడనిది చూశాను” అంటాడు బంజారాలతో గడ్డప్ప. అతని తండ్రి వెళ్ళిపోయాక అతని భార్య అతన్ని చూస్తుంది. ఇంటికి వచ్చాక ఇద్దరూ ఏం మాట్లాడకుండా ఉంటారు. అర్ధరాత్రి వేళ ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని నూతిలో దూకుతుంది. శబ్దం విని గడ్డప్ప వెళ్ళి నూతిలో దూకి ఒక అబ్బాయిని కాపాడతాడు. భార్య, రెండో కొడుకు మరణిస్తారు. గడ్డప్పకి విరక్తి కలుగుతుంది. అయినా కొడుకుని పెంచి పెద్ద చేసి, పెళ్ళి చేస్తాడు. “జీవితంలో జరగాల్సింది జరగకమానదు. ఉన్నదానితో సర్దుకుని బతకాలి అంతే” అంటాడు. మళ్ళీ “ఇది జరిగి చాలా కాలం అయింది. ఇప్పుడు ఇది నిజమో, రాత్రి కన్న కలో కూడా నాకు తెలియదు” అంటాడు. అతని వైరాగ్యానికి కారణం తెలిసి మన గుండె బరువెక్కుతుంది. ‘ఇది నిజంగా జరిగిందా?’ అనే ప్రశ్నించేంత వైరాగ్యం వచ్చేసింది. అందుకే అతను తండ్రి చనిపోయినా పెద్దగా బాధపడలేదు.

ఇంకో పక్క తిథికార్యం రోజు భోజనాలలోకి మూడు గొర్రెలను తీసుకురమ్మని తమ్మణ్ణ అభికి డబ్బులు ఇస్తాడు. అతను ఆ డబ్బులు తీసుకెళ్ళి పేకాడతాడు. డబ్బంతా పోతుంది. దిక్కు తోచక తిథికార్యం ముందు రోజు రాత్రి తన స్నేహితులతో వెళ్ళి బంజారాల గొర్రెల్లో మూడింటిని దొంగిలిస్తాడు. మర్నాడు బంజారాలు నా గొర్రెలు పోయాయంటే నా గొర్రెలు పోయాయని ఒకరితో ఒకరు గొడవకి దిగుతారు. ఒకతను గడ్డప్పే దొంగిలించాడని అంటాడు. మిగతావారు “కళ్ళుపోతాయి. ఊరుకో” అంటారు. ఇదంతా చూసిన గడ్డప్ప తన దగ్గర ఉన్న డబ్బు బంజారాల్లో ముగ్గురు నాయకులకీ కొంత కొంత చొప్పున ఇచ్చేస్తాడు. అందరూ కలిసి ఆ చోటు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటారు. గడ్డప్ప కూడా వారితో ప్రయాణమౌతాడు. కావేరి అభిని వదిలి పోవాలని బాధపడుతూ ఉంటుంది.

తమ్మణ్ణ ఆస్తి కోసం తప్పుడు పనులు చేస్తే అభి ఇంకాస్త ముందుకెళ్ళి పేకాట ఆడతాడు. ఎవరి స్వార్థాలు వారివి. అభికి త్వరగా డబ్బు సంపాదించి కావేరిని పెళ్ళి చేసుకోవాలని కోరిక. ఒక సందర్భంలో గడ్డప్పతో “నువ్వేమైనా డబ్బు ఎక్కడైనా పాతిపెట్టావా? నాకిస్తావా? పెళ్ళి చేసుకుంటాను” అంటాడు. గడ్డప్ప ఏ బాదరబందీ లేకుండా తిరుగుతుంటే అతనేదో ముల్లె దాచాడని అభి అనుకుంటాడు. డబ్బు లేకపోతే అంత నిశ్చింత రాదని అతని అభిప్రాయం. చివరికి పేకాడి ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. గడ్డప్ప మాత్రం తన తప్పు లేకపోయినా బంజారాలకు జరిగిన నష్టం చూసి వారికి డబ్బులు ఇస్తాడు. గొర్రెలు తమ్మణ్ణ దగ్గరకి చేరాయి. తమ్మణ్ణ డబ్బు బంజారాల దగ్గరకి చేరింది. సరికి సరి. కర్మ ప్రణాళిక ఇలాగే ఉంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

తిథికార్యం రోజు పిండప్రదానం జరుగుతూ ఉంటుంది. ఊరివాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఊరిపెద్దలు గడ్డప్ప కోసం చూస్తూ ఉంటారు. తమ్మణ్ణ గుండు చేయించుకుని పిండప్రదానానికి సిద్ధపడతాడు. ఊరిపెద్దలు వింతగా చూస్తారు. మరోపక్క సేతు భూమి చూడటానికి ఒక పార్టీని తీసుకువస్తాడు. అప్పటికే ఇరవై లక్షలకి తమ్మణ్ణతో బేరం కుదిరింది. మర్నాడు డబ్బు తెస్తానని చెప్పినవాడు ఆరోజే వస్తాడు. ఆ భూమిలోనే పిండప్రదానం జరుగుతూ ఉంటుంది. పిండప్రదానానికి నీళ్ళు తెమ్మని ఒకామెని పంపిస్తారు. ఆమె కాస్త దూరం వెళ్ళి నీళ్ళు తెస్తూ ఉంటుంది. అక్కడ గొర్రెలని తీసుకుని కాలినడకన పోతున్న బంజారాలు కనపడతారు. వారితో పాటు గడ్డప్ప కూడా ఉంటాడు. విషయం గుప్పుమంటుంది. గడ్డప్పని ఊరివారు కొందరు బలవంతంగా పిండప్రదానం జరుగుతున్న చోటికి తీసుకువస్తారు. బంజారాలు కూడా అతనితో వస్తారు. అప్పటివరకు తమ్మణ్ణ చేస్తున్న పిండప్రదాన కార్యక్రమం గడ్డప్పకి అప్పగిస్తారు ఊరిపెద్దలు. సేతుకి గడ్డప్ప బతికే ఉన్నాడని తెలుస్తుంది. తమ్మణ్ణని పిలిచి “ఇంత మోసం చేస్తావా?” అని అతన్ని కొట్టినంత పని చేసి పార్టీని తీసుకుని వెళ్ళిపోతాడు.

తమ్మణ్ణ గడ్డప్ప దగ్గరకి వెళ్ళి “నువ్వు మాట తప్పావు. నా డబ్బు నాకిచ్చెయ్” అంటాడు. “డబ్బు ఖర్చయిపోయింది. ఈ కార్యం పూర్తి కాగానే వెళ్ళిపోతాను” అంటాడు గడ్డప్ప. తమ్మణ్ణకి కోపం కట్టెలు తెంచుకుంటుంది. అందరి ముందూ తండ్రిని దుర్భాషలాడతాడు. కమలక్క ఇదంతా చూసి తన డబ్బు తనకి తిరిగి రాదేమో అని తమ్మణ్ణని నిలదీయటానికి ముందుకొస్తుంది. అయితే ఊరివాడు ఒకతను “ఇక్కడ గొడవ చేయటం పద్ధతి కాదు” అని ఆమెని ఆపుతాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. తమ్మణ్ణ గడ్డప్పని “నువ్వు చస్తే భూమి నాకొస్తుంది కదా. నిన్ను ఇప్పుడే చంపుతాను” అంటాడు. ఊరివాళ్ళందరూ అతని ప్రవర్తన అర్థం కాక విస్తుపోతారు. అతన్ని అడ్డుకుంటారు. అతను కోపంగా వెళ్ళిపోతాడు. గడ్డప్ప పిండప్రదానం పూర్తి చేస్తాడు.

కావేరి అభిని కలుసుకుంటుంది. అతను ఆమెని ఒక పశువుల కొట్టంలోకి తీసుకువెళతాడు. ఇద్దరూ అక్కడ శారీరకంగా కలుస్తారు. తర్వాత కావేరి విచారంగా ఉంటుంది. అభి ఆమెని అనునయించటానికి ఆమె చేయి పట్టుకుంటాడు. కావేరి “నేనెక్కడుంటానో తెలియదు. నన్ను గాలించి పట్టుకుని పెళ్ళి చేసుకో” అని వెళ్ళిపోతుంది. తిథికార్యం భోజనాల్లో గడ్డప్ప, అతని బంజారా స్నేహితులు సుష్టుగా భోంచేస్తారు. బంజారాలకు తెలియనిదేమిటంటే వారు తిన్నది వాళ్ళ గొర్రెల మాంసమే! ఆరోజు రాత్రి ఆచారం ప్రకారం సెంచరీ గౌడ సంస్మరణార్థం ఒగ్గు కథ ఏర్పాటు చేస్తారు. ఊరివాళ్ళు అక్కడ ఉంటారు కానీ సెంచరీ గౌడ కుటుంబం వారెవరూ అక్కడ ఉండరు. గడ్డప్ప మాత్రం పొలాల దగ్గర చలిమంట వేసుకుని నిశ్చింతగా కూర్చుని ఉంటాడు. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.

తన ఊరి స్త్రీ తనని చూసిందని తెలిసినపుడు గడ్డప్ప దాక్కోవటానికి ప్రయత్నిస్తాడు. బంజారాలు కూడా అతన్ని దాచటానికి ప్రయత్నిస్తారు. కానీ గడ్డప్ప దొరికిపోతాడు. దొరికిపోయానని బాధపడడు. “ఎలాగూ తిండి తినాలి కదా. తిథికార్యం భోజనం చేసి వెళదాం” అంటాడు బంజారాలతో. ఏది జరిగినా చలించడు. అయితే అతను కనపడకపోయి ఉంటే బంజారాలు వెళ్ళిపోయేవారు. తమ్మణ్ణకి డబ్బు దక్కేది. కావేరికి తన కన్యత్వం దక్కేది. కాలక్రమంలో అభిని మర్చిపోయేది. అభి కూడా తప్పు చేసేవాడు కాదు. సేతుకి భూమి దక్కేది. కమలక్కకి వడ్డీతో సహా తన బాకీ దక్కేది.

చివరికి నిశ్చింతగా ఉన్నది గడ్డప్ప మాత్రమే. తమ్మణ్ణకి డబ్బు దక్కలేదు. అప్పు మిగిలింది. అభికి కావేరి దక్కలేదు. ఆమె బంజారాలతో కలిసి ఆ చోటు వదిలి వెళ్ళిపోవటానికి బయల్దేరింది. తన పెద్దలకు తన ప్రేమ గురించి చెప్పే ధైర్యం ఆమెకి లేదు. అభికి తన శరీరాన్ని అర్పించింది. కాబట్టి ఆమె దృష్టిలో అతడే ఆమె భర్త. “నన్ను వెతికి పెళ్ళి చేసుకో” అంటుంది. అంత అమాయకురాలు. అభి మోసగాడు కాదు. ఆమె వెంట వెళతాడా? అది మన ఊహకే వదిలేశాడు దర్శకుడు. సేతుకి భూమి దక్కలేదు. కమలక్కకి తన డబ్బు తిరిగివస్తుందో రాదో తెలియదు. ఎవరినీ పూర్తిగా తప్పు పట్టలేం. అలాగని ఎవరూ నిర్దోషులు కాదు. భూమి దాయాదులు పాలవుతుందని తమ్మణ్ణ భయపడటం తప్పు కాదు. కానీ నకిలీ సర్టిఫికేట్లు పుట్టించటం తప్పు. ఆ నకిలీ సర్టిఫికేట్ తయారు చేసినవాడు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్టే. ప్రేమించటం అభి తప్పు కాదు. కానీ కామోద్రేకంతో తొందరపడటం తప్పు. అందులో కావేరి తప్పు కూడా ఉంది. భూమి కొనాలనుకోవటం సేతు తప్పు కాదు. తమ్మణ్ణ “మేం పల్లెటూరి వాళ్ళం. ఆఫీసుల చుట్టూ తిరగలేం. అన్ని పత్రాలు తెస్తాను. రాతకోతలు మీరే చూసుకోండి” అంటే అత్యాశకి పోవటం సేతు తప్పు. కమలక్క వడ్డీ వ్యాపారం చేయటం తప్పు కాదు. కానీ ఎక్కువ వడ్డీకి ఆశపడటం తప్పు. గడ్డప్ప మాత్రం ధర్మానికి, అధర్మానికి అతీతంగా ఉంటాడు. ‘నేనేం చేయలేదు. అది జరిగిందంతే’ అన్నట్టు ఉంటాడు. అది యోగి లక్షణం. లోకానికి మాత్రం అతను పిచ్చివాడిలా కనిపిస్తాడు. గడ్డప్ప దొంగతనం చేసినా అది ఆ పూటకి మద్యం కొనుక్కోవటానికి మాత్రమే. వంద రూపాయల కట్ట ఉంటే అందులో ఒక్క కాగితమే తీసుకుంటాడు. ఆశపడి మొత్తం కాజేయడు. అతను మద్యం తాగకపోతే తన గతాన్ని తలచుకుని పిచ్చివాడైపోయేవాడేమో. మనుషుల చాపల్యాలు, స్వార్థాలు ఇతివృత్తంగా ఇంత చక్కని చిత్రం ఈ మధ్యకాలంలో మరొకటి రాలేదు.

Exit mobile version