Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 54: ఇటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ద స్పాట్‌లెస్ మైండ్

[సంచిక పాఠకుల కోసం ‘ఇటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ద స్పాట్‌లెస్ మైండ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]సై[/dropcap]న్స్ ఫిక్షన్ సాహిత్యం, సినిమాల్లో ఉండేవి చాలా వరకు మన పురాణాల్లో ఉన్న విషయాలే. కొన్ని విషయాలు సాధ్యమయ్యాయి కూడా. అప్పుడు మంత్రశక్తితో సాధించేవారు. ఇప్పుడు యంత్రశక్తితో సాధిస్తున్నారు. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా సైన్స్ ఫిక్షన్ లాగే అనిపించేవి. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే. పురాణకాలంలో ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యం కాని విషయాలు ఇప్పుడు సామాన్యులకి కూడా స్మార్ట్ ఫోన్ కారణంగా సాధ్యమవుతున్నాయి. ఇది అభివృద్ధా? అర్హత లేని వారికి శక్తి అందితే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. స్మార్ట్ ఫోన్ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. ధర్మాధర్మాల విచక్షణ లేనివారికి అసాధారణ శక్తులు వస్తే దురుపయోగమే ఎక్కువ ఉంటుంది. స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన ‘మైనారిటీ రిపోర్ట్’ (2002)లో నేరం జరగక ముందే తెలుసుకుని నేరస్థుణ్ణి పట్టుకునే విధానం వస్తే ఎలా ఉంటుందో చూపించారు. చిత్రంలో ఈ విధానం దురుపయోగమవుతుంది. ‘ఇటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ద స్పాట్‌లెస్ మైండ్’ (2004)లో మనిషి మెదడులో నుంచి జ్ఞాపకాలని చెరిపివేసే యంత్రం ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. ఆ యంత్రాన్ని ఎవరూ దురుపయోగం చేయకపోయినా దాని ప్రభావం వల్ల దుష్పరిణామాలు ఉంటాయి. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది. తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి కానీ వాటి నాణ్యత బాగాలేదు. అసలే కథ జటిలంగా ఉంటుంది. సబ్ టైటిల్స్ బాగా లేకపోతే అర్థం చేసుకోవటం ఇంకా కష్టం.

కథ మొదట్లో జోయెల్ నిద్ర లేచి ఆఫీసుకి బయలుదేరుతాడు. ఆ రోజు వ్యాలెంటైన్స్ డే. అతని కారు బిల్డింగ్ బయట పార్క్ చేసి ఉంటుంది. అతని కారు తలుపు మీద ఎవరో స్వల్పంగా గుద్దినట్టు సొట్ట ఉంటుంది. పక్కనున్న కారు పార్కింగ్ చేసినపుడు తన కారుని గుద్దారని జోయెల్‌కి కోపం వస్తుంది. ఆ కారు ఎవరిదో తెలుసుకునే అవకాశమూ లేదు, సమయమూ లేదు. వ్యంగ్యంగా ‘థ్యాంక్యూ’ అని ఓ కాయితం మీద రాసి ఆ కారు అద్దం వైపర్ కింద పెట్టి బయల్దేరుతాడు. అతని స్వభావం ఇక్కడ తెలుస్తుంది. మెట్రో (అమెరికాలో సబ్‌వే అంటారు) రైలు స్టేషన్‌కి వెళతాడు. వ్యాలెంటైన్స్ డే కావటంతో కాస్త దిగాలుగా ఉంటాడు. వ్యాలెంటైన్స్ డే నాడు తోడు లేకపోతే ప్రపంచమే శూన్యమనే భావన. హఠాత్తుగా ఆఫీసుకి వెళ్ళకూడదని నిశ్చయించుకుని సముద్రతీరానికి వెళతాడు. స్వగతంలో ‘ఎందుకిలా ప్రవర్తిస్తున్నానో తెలీటం లేదు. ఈరోజు లేచిన వేళ బాలేదేమో’ అనుకుంటాడు. సముద్రతీరంలో కూర్చుని తన డైరీ తీస్తాడు. కొన్ని కాయితాలు చింపినట్టు ఉంటాయి. ‘ఎప్పుడు చింపాను? గత రెండేళ్ళలో ఏం రాసినట్టు లేదు’ అనుకుంటాడు. ఏదో రాసుకుంటూ ఉంటాడు. తర్వాత అక్కడో అమ్మాయి కనిపిస్తుంది. అతను సిగ్గరి. ‘నేను ఏ అమ్మయితోనూ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేను. నాకు తోడు ఎక్కడ దొరుకుతుంది? తిరిగి నయోమీ దగ్గరకి వెళ్ళిపోతే మంచిదేమో’ అనుకుంటాడు. అతనికి నయోమీ అనే ప్రియురాలు ఉండేదన్నమాట.

తర్వాత తిరుగు ప్రయాణంలో జోయెల్ రైల్లో కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటాడు. బీచ్‌లో కనపడిన అమ్మాయి అదే కోచ్‌లో ఉంటుంది. జుట్టుకి నీలం రంగు ఉంటుంది. ఆమే అతని దగ్గరకి వస్తుంది. ముందు సీటులో కూర్చుకుని వెనక్కి తిరిగి అతనితో మాట్లాడుతుంది. ఆమె పేరు క్లెమెంటైన్. “నిన్ను ఎక్కడో చూసినట్టుంది. బార్న్స్ అండ్ నోబుల్ బుక్ షాప్ లో కదా. నువ్వూ నన్ను చూసే ఉంటావు. నా జుట్టు రంగు మారుస్తూ ఉంటాను. అందుకే నువ్వు కూడా నన్ను గుర్తు పట్టలేదేమో” అంటుంది. అతను మొహమాటంగా మాట్లాడతాడు. ఆమె మీది మీదికి వస్తూ ఉంటుంది. లొడలొడా వాగుతుంటుంది. అతను ముక్తసరిగా మాట్లాడుతుంటే చికాకు పడుతుంది. అతను “నేను రాసుకోవాలి” అంటాడు. ఆమెకి కోపం వస్తుంది. రైలు దిగాక అతను కారులో వెళుతూ ఉంటే ఆమె నడుస్తూ వెళుతుంటుంది. అతను లిఫ్ట్ ఇస్తాడు. ఆమె “నేను పిచ్చిదానిలా ప్రవర్తించాను. ఏమనుకోకు” అంటుంది. తన ఇంటిలోకి ఆహ్వానిస్తుంది. ఇద్దరూ డ్రింక్స్ తాగుతారు. అతను మొహమాటపడుతూ ఉంటాడు. “నువ్వు ఎక్కువ మాట్లాడవేం?” అంటుందామె. “నా జీవితంలో ఎక్కువ ఏమీ లేదు. పని, ఇల్లు – ఇంతే నా జీవితం. నా డైరీలో కూడా ఏం లేదు” అంటాడతను. “నేను నా జీవితం వెలితిగా ఉండకూడదని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాను” అంటుందామె. హఠాత్తుగా “నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నాకు తెలుసు” అంటుంది. అతను మంత్రించినట్టు ఉండిపోతాడు. ఆమె కబుర్లు చెబుతూ ఉంటుంది. అతను కాసేపటికి తేరుకుని బయల్దేరతాడు. ఆమె తన ఫోన్ నంబర్ ఇస్తుంది. మర్నాడు రాత్రి పూట ఇద్దరూ కలిసి విహారానికి వెళతారు. చార్ల్స్ అనే నది చూడటానికి వెళతారు. చలికాలం కావటంతో నది గడ్డకట్టి ఉంటుంది. దాని మీద నడుస్తారు. అతను భయపడుతూ ఉంటాడు. ఆమె ఆ మంచు మీదే పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. అతను ఆమె పక్కన పడుకుంటాడు. రాత్రంతా అక్కడ ఉన్న తర్వాత అతను ఆమెని ఆమె ఇంటికి తీసుకువెళతాడు. ఆమె “మీ ఇంటికి వస్తాను” అంటుంది. సరే అంటాడతను. ఆమె టూత్ బ్రష్ తెచ్చుకోవటానికి ఇంటిలోకి వెళుతుంది. ఒక యువకుడు అతని కారు దగ్గరకి వస్తాడు. “నీకేం కావాలి? ఇక్కడేం చేస్తున్నావు?” అంటాడు. జోయెల్ “నువ్వేమంటున్నావో నాకర్థం కావట్లేదు” అంటాడు. ఆ యువకుడు వెళ్ళిపోతాడు.

తర్వాతి దృశ్యంలో జోయెల్ ఏడుస్తూ ఉంటాడు. క్లెమెంటైన్ అతన్ని వదిలి వెళ్ళిపోయింది. సస్పెన్స్ కోసం ఇక్కడ కథ కొంచెం గజిబిజిగా ఉంటుంది కాబట్టి కాస్త సవ్యంగా చెప్పుకుంటే బావుంటుంది. వ్యాలెంటైన్స్ డే రాబోతోందని జోయెల్ క్లెమెంటైన్‌కి క్షమాపణ చెప్పుకుందామని అనుకుంటాడు. ఆమె పని చేసే పుస్తకాల దుకాణానికి వెళతాడు. ఆమె అతన్ని చూసి అతనెవరో తెలియనట్టు “మీకేం కావాలో చెప్పండి” అంటుంది. ప్యాట్రిక్ అనే యువకుడితో సరసాలాడుతుంది. అయితే అతని ముఖం జోయెల్‌కి కనిపించదు. అతను హతాశుడై అక్కడి నుంచి వచ్చేస్తాడు. తన స్నేహితులకి విషయం చెబుతాడు. ఆ స్నేహితులు భార్యాభర్తలు. వారికి క్లెమెంటైన్ బాగా తెలుసు. “వదిలెయ్. కొత్త జీవితం మొదలెట్టు” అంటుంది అతని స్నేహితురాలు. ఆమె భర్త జోయెల్ బాధ చూడలేక అతనికి ఒక కార్డ్ చూపిస్తాడు. అది లకూనా అనే కంపెనీ నుంచి వచ్చిన కార్డ్. దాని మీద “క్లెమెంటైన్ జోయెల్‌ని తన జ్ఞాపకాల నుంచి తొలగించింది. వారి సంబంధం గురించి ఆమె దగ్గర ప్రస్తావించకండి” అని రాసి ఉంటుంది!

జోయెల్ లకూనా కంపెనీకి వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడతాడు. “మీరు ఆ కార్డ్ చూడటం విచారకరం. ఆమె అసంతృప్తిగా ఉంది. గతాన్ని మరచి ముందుకి సాగిపోవాలని అనుకుంది. మేము ఆమెకి సాయం చేశాం” అంటాడు డాక్టరు. తర్వాత జోయెల్ స్నేహితురాలు “ఆమె ఎంత దుందుడుకుగా ఉంటుందో నీకు తెలుసు. హఠాత్తుగా ఈ పని చేసేసింది” అంటుంది. జోయెల్ కారులో కూర్చుని రోదిస్తాడు. తాను కూడా ఆమెని తన జ్ఞాపకాల నుంచి చెరిపేయాలని నిర్ణయించుకుంటాడు. డాక్టరు ఆమెకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకురమ్మంటాడు. “ఆ వస్తువుల ఆధారంగా మీ మెదడులో క్లెమెంటైన్ జ్ఞాపకాల పటం తయారు చేస్తాం. ఈరోజు రాత్రి మా టెక్నీషియన్లు మీ ఇంటికి వచ్చి ఆ జ్ఞాపకాలని తొలగిస్తారు. రేపు మీరు ఏం జరగనట్టే నిద్ర లేస్తారు. కొత్త జీవితం ప్రారంభిస్తారు. మీరిచ్చిన వస్తువులు పారేస్తాం” అంటాడు. జోయెల్ వస్తువులన్నీ తీసుకువెళతాడు. జోయెల్ తల పైన ఒక గుండ్రటి స్కానర్ అమరుస్తాడు స్టాన్ అనే టెక్నీషియన్. అతను తెచ్చిన వస్తువులన్నీ ఒక్కొక్కటిగా చూపించి మనసులోనే వాటి జ్ఞాపకాలను తలచుకోమంటాడు. ఆ జ్ఞాపకాలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తమవుతాయి. జోయెల్ డాక్టర్‌ని “మెదడుకి నష్టం జరగదుగా” అని అడుగుతాడు. “సాంకేతికంగా చూస్తే ఈ ప్రక్రియ ద్వారా మెదడుకి నష్టమే జరుగుతుంది. కానీ మద్యం బాగా తాగితే జరిగే నష్టం లాంటిదే ఇది కూడా” అంటాడు డాక్టరు. డాక్టరు క్లెమెంటైన్ గురించి చెప్పమని ఆ మాటలన్నీ ఒక క్యాసెట్లో రికార్డు చేస్తాడు. తాను రెండేళ్ళ క్రితం సముద్రతీరంలో ఒక పార్టీలో క్లెమెంటైన్‌ని కలిశానని అంటాడు జోయెల్. అదేమిటి? అతను ఆమెని కలిసింది రైల్లో కదా!? అలా చెప్పాడేమిటి?

ఆ రాత్రి డాక్టరు ఇచ్చిన మాత్ర వేసుకున్న జోయెల్ స్పృహ తప్పి పడిపోతాడు. టెక్నీషియన్లు అతని ఇంట్లో ప్రవేశించి అతన్ని మంచం మీద పడుకోబెట్టి అతని తలకి యంత్రాలు తగిలిస్తారు. మొదట అతను డాక్టరుతో మాట్లాడిన జ్ఞాపకాన్ని తొలగిస్తారు. ఒక్కో జ్ఞాపకాన్ని తొలగిస్తుంటే జోయెల్‌కి అంతశ్చేతనలో తెలుస్తూ ఉంటుంది. ఈ సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఎడిటింగ్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మనకి గతంలో ఏం జరిగిందో చూపిస్తూనే ఆ జ్ఞాపకం చెదిరిపోవటం జోయెల్‌కి ఎలా అనుభూతికి వస్తుందో చూపిస్తారు. టెక్నీషియన్లు స్టాన్, ప్యాట్రిక్ జ్ఞాపకాలు తొలగిస్తూ ఉంటారు. వారి మాటలు కూడా జోయెల్‌కి వినపడుతూ ఉంటాయి. ప్యాట్రిక్ పేరు వినగానే జోయెల్‌కి ఎక్కడో విన్నట్టుంటుంది. అయితే అతను ప్యాట్రిక్‌ని చూడలేదు. ఈ ప్యాట్రిక్ ఎవరో కాదు, మొదట్లో జోయెల్ దగ్గరకి వచ్చిన వాడే. అంటే ప్యాట్రిక్‌కి క్లెమెంటైన్ ముందే తెలుసా? కానీ ఆమె జ్ఞాపకాలు తొలగించినపుడే ఆమెని మొదటిసారి చూశానని అంటాడు ప్యాట్రిక్. తాను క్లెమెంటైన్‌ని ప్రేమిస్తున్నానని స్టాన్‌తో అంటాడు. ఆమె జ్ఞాపకాలు తొలగించిన తర్వాత ఏమీ తెలియనట్లు ఆమెని డేట్‌కి తీసుకెళ్ళానని అంటాడు. ఇవన్నీ జోయెల్‌కి వినపడుతూ ఉంటాయి. అతను తన జ్ఞాపకాల్లో ఉంటాడు. క్లెమెంటైన్ అతన్ని వదిలివెళ్ళిన రాత్రి జరిగిన సంఘటన అది. ఇద్దరూ కలిసి నివసిస్తూ ఉంటారు. ఆమె ఒక్కతే బయటికి వెళ్ళి తెల్లవారుఝాము మూడింటికి ఇంటికి వస్తుంది. ఆమె అతని కారు పార్క్ చేస్తుండగా ఫైర్ హైడ్రంట్ తలుపుకి తగిలి సొట్ట పడుతుంది. వారిద్దరూ గొడవపడతారు. “నేనెవరితోనో సెక్స్ చేసి వచ్చానని నీ పాడు ఆలోచన” అంటుందామె. “ఎవరన్నా నీతో స్నేహం చేయాలంటే సెక్స్ ఎరగా వేయటం నీకు అలవాటేగా” అంటాడతను. ఆమె కోపంగా వెళ్ళిపోతుంది. అతను ఆమెని కారులో వెంబడిస్తాడు. “నేను నిన్ను నా జ్ఞాపకాల్లో నుంచి తొలగిస్తున్నాను. నువ్వు కూడా అదే చేశావుగా” అంటాడు. అయితే ఆమెని అందుకోలేకపోతాడు. తాను ఒకవైపు వెళుతుంటే ఆమె మరొక వైపు వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఆ జ్ఞాపకం అలా చెదిరిపోతుంది. కొత్త జ్ఞాపకాల నుంచి క్రమంగా పాత జ్ఞాపకాలకి వెళుతూ ఒక్కో జ్ఞాపకాన్ని తొలగిస్తూ ఉంటారు.

ఇంకో జ్ఞాపకంలో క్లెమెంటైన్ తనకి ఒక బిడ్డ కావాలని అంటుంది. జోయెల్ “నువ్వు బిడ్డని సాకగలవా?” అంటాడు. ఆమెకి కోపం వస్తుంది. మరో జ్ఞాపకంలో ఆమె “నేను అన్ని విషయాలు నీతో చెబుతాను. నేను సిగ్గుపడే విషయాలు కూడా. నువ్వు ఏమీ చెప్పవు” అంటుంది. అతను “లొడలొడా మాట్లాడితేనే భావాలు పంచుకున్నట్టు కాదు” అంటాడు. “అంటే నేను లొడలొడా వాగుతాననేగా. నేనేం అలా వాగను” అంటుందామె. అతను “వదిలెయ్. నీకు చెప్పటానికి నా జీవితంలో పెద్ద విశేషాలేమీ లేవు” అంటాడతను. ఇది ఇంతకు ముందు అతను అన్న మాటే.

లకూనా కంపెనీ ఉద్దేశం ఏమిటి? అది హాస్పిటల్ కాదు, ఒక కంపెనీ. దీన్ని బట్టే ఇది వ్యాపారమని తెలిసిపోతుంది. మనిషి ఎన్నో కనిపెట్టవచ్చు, కానీ అవి మనిషికి మంచిదా కాదా అని ఆలోచించాలి. మనిషి బలహీనతలను సొమ్ము చేసుకుంటే పరిణామాలు విపరీతంగా ఉంటాయి. మనిషి తన మనసుని మంచి మార్గంలో పెట్టుకోవాలి కానీ స్వభావాన్ని మార్చుకోకుండా జ్ఞాపకాలు మాత్రం తొలగించుకుంటే ఏం ప్రయోజనం? ఇది ఊహాజనితమైన కథే కావచ్చు కానీ ఆలోచింపజేస్తుంది. క్లెమెంటైన్ ఎప్పుడూ సంతోషాన్ని వెతుక్కునే మనిషి. ఆ సంతోషం బయట ఉంటుందని ఆమె భావన. సంతోషం కోసం బయట వెతకకుండా తన మనసుకి తృప్తి అలవాటు చేస్తే గొడవ ఉండదు కదా? రాత్రి పొద్దుపోయే వరకు బయట తిరగటం ఎందుకు? జోయెల్‌తో ఉంటే ఆమెకి ఉబుసుపోదు. జోయెల్ లాంటివారు ఎక్కువ మాట్లాడరు. అంత మాత్రాన ప్రేమ ఉండదా? అయితే ప్రేమని ఏదో రకంగా వ్యక్తపరచటం జోయెల్ కనీస ధర్మం. అతని తప్పూ ఉంది. ఇద్దరూ మాట్లాడుకుని తమ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. ఇద్దరూ కొన్ని విషయాల్లో రాజీ పడాలి. క్లెమెంటైన్ బిడ్డను కంటానంటుంది. బిడ్డ అంటే పెద్ద బాధ్యత. ఆమె అందుకు సిద్ధమేనా? ఆ విషయాన్ని జోయెల్ సున్నితంగా అడగవచ్చు. ‘నీ వల్ల కాదు’ అనటంతో ఆమెకి కోపం వచ్చింది. ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఆ బాధ్యత నెత్తి మీద వేసుకోవటానికి సామర్థ్యం ఉందా లేదా అనేది తేలిపోతుంది. అంతే కానీ తెగతెంపులు చేసుకుని జ్ఞాపకాలని తొలగించుకుంటే తర్వాత వచ్చేవాళ్ళతో అవే సమస్యలు రావని నమ్మకం ఏమిటి? మనిషి మనసు అనే చెట్టుకున్న కాయలు పరిపక్వం కావాలి కానీ పచ్చిగా ఉన్నప్పుడే కాయలు రుచిగా లేవని కోసి పడేసి కొత్త కాపు కోసం చూస్తే లాభం ఏమిటి?

జోయెల్ జ్ఞాపకాలు తొలగించే ప్రక్రియ జరుగుతుండగా ప్యాట్రిక్ క్లెమెంటైన్‌కి ఫోన్ చేస్తాడు. ఆమె “నాకంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు” అంటుంది. జ్ఞాపకాలు తొలగించుకున్న తర్వాత ఆమెకి ఏదో వెలితిగా ఉంటుంది. అతను ఆమె దగ్గరకి వెళతాడు. ఆమె “నన్ను నేనే కోల్పోతున్నట్టు ఉంది” అంటుంది. మళ్ళీ తనే “చార్ల్స్ నదికి వెళదాం. ఇప్పుడే!” అంటుంది. అతను సరే అంటాడు. ఆమె సిద్ధమవుతుంటే అతను బ్యాగులో కాయితాలు చూసుకుంటాడు. అవి జోయెల్ డైరీలోని కాయితాలు! క్లెమెంటైన్ గురించి రాసుకున్నవి. జోయెల్ వాటిని డాక్టరుకి ఇచ్చాడు. క్లెమెంటైన్‌కి ఏమి ఇష్టమో తెలుసుకోవటానికి ప్యాట్రిక్ వాటిని దొంగిలించాడు. ఒక కాయితంలో చార్ల్స్ నదికి వెళ్ళినపుడు ఏం మాట్లాడుకున్నారో జోయెల్ రాసుకుంటాడు. ఇద్దరూ చార్ల్స్ నది మీద పక్కపక్కన పడుకున్న బొమ్మ వేసి ఉంటుంది. “ఇలాగే చచ్చిపోవాలని ఉంది. ఇంత సంతోషం ఎప్పుడూ లేదు” అని రాసుకుంటాడు జోయెల్. ఈ మాట జోయెల్ మొదట్లో అన్నాడా? ఆమెని కలుసుకున్న రెండు రోజుల్లోనే ఇంత గాఢంగా ప్రేమించాడా?

‘ఇటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ద స్పాట్‌లెస్ మైండ్’ అనేది అలెగ్జాండర్ పోప్ రాసిన కవితలో పంక్తి. ఈ కవిత అర్థం చేసుకునేంత పాండిత్యం నాకు లేదు. మచ్చలేని మేధ ఎప్పుడూ సూర్యుడిలా ప్రకాశస్తుందని స్థూలంగా ఆ పంక్తి భావం. అయితే మచ్చలేకుండా పవిత్రంగా ఉండాలి కానీ గంగలో మునిగి పాపాలు కడుక్కోవాలని ప్రయత్నిస్తే బుర్రలోని కల్మషం పోదుగా. మన ఆలోచనల్ని మనమే మార్చుకోవాలి కానీ ఆ ఆలోచనల ఫలితమైన జ్ఞాపకాల్ని తొలగించుకుంటే సరిపోదు అనేది ఈ చిత్రం సందేశం. జోయెల్‌గా జిమ్ క్యారీ, క్లెమైంటైన్‌గా కేట్ విన్స్లెట్ నటించారు. జిమ్ క్యారీ ‘ద మాస్క్’, ‘లయర్ లయర్’ లాంటి హాస్యప్రధాన చిత్రాల్లో నటించి పేరు సంపాదించాడు. తర్వాత ‘ద ట్రూమన్ షో’ చిత్రంలో గంభీరమైన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సిగ్గరి పాత్రలో ఒదిగిపోయాడు. జ్ఞాపకాలు చెరిగిపోతుంటే అయోమయంలో ఉండే సన్నివేశాల్లో చక్కగా నటించాడు. కేట్ విన్స్లెట్ ఈ చిత్రం విడుదలయ్యే నాటికే మూడు ఆస్కార్ నామినేషన్లు అందుకుంది. అందులో ముఖ్యమైనది ‘టైటానిక్’ చిత్రానికి ఉత్తమ నటి నామినేషన్. ఈ చిత్రం చివరిలో ఆమె నటన చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ చిత్రానికి ఆమెకి నాలుగో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. అయితే ‘ద రీడర్’ (2008) చిత్రం వచ్చేదాకా ఆమెకి ఆస్కార్ దక్కలేదు. మిషెల్ గాండ్రీ దర్శకత్వం అబ్బురపరుస్తుంది. రచయిత చార్లీ కాఫ్‌మన్ అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశాడు. ఆస్కార్ అందుకున్నాడు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

కథ సాగుతున్న కొద్దీ మనకి అసలు విషయం అర్థమవుతుంది. మనకి మొదట్లో చూపించినవి క్లెమెంటైన్, జోయెల్ జ్ఞాపకాలు తొలగించుకున్న తర్వాత జరిగిన సంఘటనలు. ఇద్దరూ అనుకోకుండా మళ్ళీ కలుసుకున్నారు! ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోయారు కాబట్టి అపరిచితుల్లాగే కలుసుకున్నారు. జ్ఞాపకాలు పోతే పోతాయి కానీ స్వభావాలు మారతాయా? అతను సిగ్గరి. ఆమె చలాకీ పిల్ల. భిన్న ధ్రువాలు ఆకర్షణకి లోనయినట్టే వారు మళ్ళీ ఆకర్షణకి లోనయ్యారు. డాక్టరు జ్ఞాపకాలను తొలగించగలిగాడు కానీ వారు మళ్ళీ కలుసుకోకుండా చేయలేడు కదా! ఇప్పుడు మొదటికి వెళ్ళి మళ్ళీ కథ చదవండి. కారుకి సొట్ట చేసింది క్లెమెంటైన్. జోయెల్ డైరీలో చిరిగిపోయిన కాయితాలు క్లెమెంటైన్ గురించి రాసి ఉన్న కాయితాలు. వాటిని డాక్టరుకిస్తే ప్యాట్రిక్ దొంగిలించాడు. జోయెల్, క్లెమెంటైన్ రెండేళ్ళ క్రితం సముద్రతీరంలో జరిగిన పార్టీలో కలుసుకున్నారు. అంతకు ముందు అతనికి నయోమీ అనే ప్రియురాలు ఉండేది. అతనూ, క్లెమెంటైన్ చార్ల్స్ నదికి ఇంతకు ముందు కూడా వెళ్ళారు. అదే అతను తన డైరీలో బొమ్మగా వేసుకున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆ బొమ్మలో ఆమె జుట్టు నారింజ రంగులో ఉంటుంది, నీలం రంగులో కాదు. రైల్లో క్లెమెంటైన్ అతన్ని “నిన్ను ఎక్కడో చూసినట్టుంది” అంటుంది. ఆమె జ్ఞాపకాల పొరల్లో అతను ఎక్కడో ఇంకా ఉన్నాడు. జోయెల్ దగ్గరకి వచ్చిన యువకుడు ప్యాట్రిక్. క్లెమెంటైన్ ఇంటి దగ్గర జోయెల్‌ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. జోయెల్ అయోమయంలో ఉన్నాడేమో అని “నీకేం కావాలి? ఇక్కడేం చేస్తున్నావు?” అన్నాడు.

కథ ఇంత గజిబిజిగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? జోయెల్, క్లెమెంటైన్ పార్టీలో కలుసుకున్నారని, తర్వాత విడిపోయారని, జ్ఞాపకాలు తొలగించుకున్నారని, తర్వాత మళ్ళీ రైల్లో కలుసుకుని ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారని చూపిస్తే అంత థ్రిల్లింగ్‌గా ఉండదు. రైల్లో కలుసుకోక ముందే వారు ప్రేమించుకున్నారని తర్వాత తెలిస్తే ప్రేక్షకులకి సంభ్రమం కలుగుతుంది. జ్ఞాపకాలు తొలగించుకోవటం ఎంత అర్థం లేని పనో తేటతెల్లం అవుతుంది. ఇంకో రకంగా చూస్తే విధిలిఖితాన్ని ఎవరూ మార్చలేరు అని అనిపిస్తుంది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పనులు చేస్తే బెడిసికొడుతుంది. కారుకి పడిన సొట్ట, డైరీలో చిరిగిన కాయితాలు, క్లెమెంటైన్ జుట్టు రంగు వంటివి మనకి కథ అర్థమయేలా చేస్తాయి. కథ గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఆసక్తికరంగా ఉంటుంది. అదొక పజిల్ లాగా ఉంటుంది. పజిల్ పూర్తి చేయటానికి కావలసిన ఆధారాలు కూడా అక్కడక్కడా ఉంటాయి.

ఇంకో ఉపకథలో మేరీ అనే రెసెప్షనిస్ట్ లకూనా ఆఫీసులో పని చేస్తూ ఉంటుంది. ఆమెకీ, స్టాన్‌కీ సంబంధం ఉంది. జోయెల్ జ్ఞాపకాలు తొలగిస్తున్నప్పుడు స్టాన్‌ని కలుసుకోవటానికి ఆమె జోయెల్ ఇంటికి వస్తుంది. మాటల్లో డాక్టరు జ్ఞాపకాలు తొలగించటం ద్వారా మనుషులకి ఎంతో ఉపకారం చేస్తున్నాడని అంటుంది. ప్యాట్రిక్ క్లెమెంటైన్‌ని కలుసుకోవటానికి వెళ్ళాక స్టాన్, మేరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. మద్యం తాగి, శృంగారంలో పాల్గొంటారు. అదే సమయంలో జోయెల్ పాత జ్ఞాపకాల్లో ఉంటాడు. అవి మధురమైన జ్ఞాపకాలు. చార్ల్స్ నదికి మొదటిసారి వెళ్ళిన జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు వదులుకోవటం తనకి ఇష్టం లేదని అతనికి తెలిసివస్తుంది. జ్ఞాపకం చెరిగిపోక ముందే పారిపోదామని క్లెమెంటైన్ చేయి పట్టుకుని పరుగెడతాడు. ఇదంతా అతని మస్తిష్కంలో జరుగుతూ ఉంటుంది. క్లెమెంటైన్ ఎందుకు పరుగెడుతున్నావని అడుగుతుంది. “మన జ్ఞాపకాలు కరిగిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాలి” అంటాడతను. ఆమె “అయితే జ్ఞాపకాల పటంలో నేను లేని చోటికి నన్ను తీసుకెళ్ళు” అని ఐడియా ఇస్తుంది. అతను ఆమెని తన బాల్యం లోకి తీసుకెళ్తాడు. దీంతో జ్ఞాపకాల తొలగింపు ప్రక్రియ ఆగిపోతుంది. ఇది కంప్యూటర్లో కనపడుతుంది. స్టాన్ ఏం చేయాలో తెలియక డాక్టర్‌కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చి పటంలో తలెత్తిన అవాంతరాన్ని తొలగిస్తాడు. స్టాన్ ఒత్తిడి తగ్గించుకోవటానికి బయటకు వెళతాడు. మేరీ డాక్టరుతో మాట్లాడుతుంది. అతని మేధకి అబ్బురపడుతుంది. అతను వయసులో పెద్దవాడైనా అతన్ని మీద ఆమెకి వలపు ఉంది. అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే అనుమానంతో ఆ ఇంటికి వచ్చిన డాక్టరు భార్య కిటికీ లోనుంచి వారిద్దరూ ముద్దు పెట్టుకోవటం చూస్తుంది.

స్టాన్, మేరీ విచ్చలవిడిగా ఎందుకున్నారు? వారికి డాక్టరు మేధస్సు చూసి తాము ఎప్పుడూ అంత ఎత్తుకి ఎదగలేమని తెలిసింది. అలాంటి వారు న్యూనతకి లోనవుతారు. ప్యాట్రిక్ లాంటి వారు ఇతరుల మేధస్సు ద్వారా తాము లాభపడదామని ఆలోచిస్తారు. మేరీకి డాక్టరు మీద వలపు ఉంది. కానీ తాను అతని స్థాయికి తగనని ఆమె అభిప్రాయం. తన మీద ప్రేమ చూపించే స్టాన్‌తో సంబంధం పెట్టుకుంది. అందులో ప్రేమ లేదు. ఈ సంఘర్షణలో మద్యం, సెక్స్‌తో ఊరట పొందుతూ ఉంటుంది. డాక్టరు వివాహితుడు. అలాంటి వాడి మీద వలపు కలిగితే మేరీ లాంటి వారు దూరంగా వెళ్ళిపోవటం మంచిది. ఇది చెప్పినంత తేలిక కాదు. ఉద్యోగం ఎవరు వదులుకుంటారు? పైగా ప్రేమించినవారికి దగ్గరగా ఉండమని మనసు పోరుపెడుతూ ఉంటుంది. అయినా కఠినంగా ఉండకతప్పదు. ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. విషాదమేమిటంటే చిన్న వయసులో ఇంత పరిపక్వత ఉండదు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

డాక్టరు భార్య వెళ్ళిపోతుంటే డాక్టరు, మేరీ బయటికి పరుగెత్తుకుంటూ వస్తారు. బలహీన క్షణంలో సంయమనం కోల్పోయామని అంటారు. డాక్టరు భార్య డాక్టరుతో “రాక్షసుడిలా ప్రవర్తించకు. ఆమెకి అసలు విషయం చెప్పు” అని వెళ్లిపోతుంది. డాక్టరు గతంలో ఏం జరిగిందో చెబుతాడు. అతనికీ, మేరీకి గతంలో సంబంధం ఉండేది. మేరీ అతను తనకు సొంతం కాడని తెలిసి అతని జ్ఞాపకాల్ని తొలగించుకుంది. ఇప్పుడు మళ్ళీ అతని ప్రేమలో పడింది. నాకు ఇది కొంచెం వింతగా అనిపించింది. మేరీ డాక్టరు జ్ఞాపకాల్ని తొలగించుకున్నాక మళ్ళీ లకూనా ఆఫీసులో ఎందుకు పని చేస్తోంది? అతనితో సంబంధం ఉన్న ఏ విషయమూ ఆమెకి గుర్తు ఉండదుగా? అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే – జ్ఞాపకాలు తొలగించుకున్నవారు ఉద్యోగం మారటం, ఊరు మారటం సాధ్యం కాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవచ్చు. డాక్టరు మేరీకి మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడేమో. ప్రయోగాత్మకంగా ఉండే సినిమాల్లో కొన్ని విషయాలు అస్పష్టంగా ఉంటాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచించటం అనవసరం. ఇంకో విషయం – జ్ఞాపకాలు తొలగించే ప్రక్రియకి ఎంత రుసుము వసూలు చేస్తారో సినిమాలో చెప్పలేదు. కొందరు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాలు తొలగించుకుంటారని మేరీ మాటల ద్వారా తెలుస్తుంది. కాబట్టి రుసుము ఎక్కువ ఉండదనే అనుకోవాలి.

డాక్టరు జ్ఞాపకాలు తొలగించుకున్న తర్వాత మేరీ స్టాన్‌తో సంబంధం పెట్టుకుంది. అయితే స్టాన్‌కి డాక్టరు, మేరీల సంబంధం గురించి తెలియదు. అతను నిజంగానే ఆమెని ప్రేమించాడు. కానీ మేరీకి తన పరిస్థితి అర్థమై షాక్‌కి గురవుతుంది. ఆమె ఆఫీసుకి వెళ్ళి తన జ్ఞాపకాలు రికార్డ్ చేసిన క్యాసెట్ వింటుంది. ఆమెకి నిస్పృహ వస్తుంది. ఆఫీసులో ఉన్న అన్ని ఫైళ్ళు, క్యాసెట్లు తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత లకూనా వినియోగదారులందరికీ ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరంతో పాటు వారివారి క్యాసెట్లు కూడా పంపిస్తుంది. ఉత్తరంలో “మీరు మీ జ్ఞాపకాలను తొలగించుకున్నారు. కానీ ఈ ప్రక్రియ దారుణమైన ప్రక్రియ. ఆ కంపెనీలో నేను పనిచేసే దాన్ని. నిష్కృతి కోసం మీ ఫైలు, క్యాసెట్ మీకు పంపిస్తున్నాను” అని ఉంటుంది.

జోయెల్, క్లెమంటైన్ మళ్ళీ కలుసుకున్న చార్ల్స్ నదికి మళ్ళీ వెళ్ళి వస్తారు. ఆమెని ఇంటికి తీసుకువెళితే “మీ ఇంటికి వస్తాను” అంటుంది. టూత్ బ్రష్ తీసుకుని, తనకొచ్చిన ఉత్తరాలు కూడా తీసుకుని ఆమె అతనితో బయల్దేరుతుంది. కార్లో మేరీ రాసిన ఉత్తరం చదువుతుంది క్లెమెంటైన్. ఆమెకి ఏమీ అర్థం కాదు. అంతా మర్చిపోయింది కదా! కార్లోనే క్యాసెట్ వినటం మొదలు పెడుతుంది. జోయెల్ కూడా వింటాడు. అందులో “జోయెల్ పెద్ద బోరు మనిషి. ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని! ఇప్పుడు అతనితో ఉంటే చిరాకుగా ఉంటుంది. అతని మొహం చూస్తేనే అసహ్యంగా ఉంటుంది” అంటుంది. జోయెల్‌కి ఇదంతా వికృత చేష్టలా ఉంటుంది. ఆమెని కారు దిగమని వెళ్ళిపోతాడు. అమె ఇంటికి వెళుతుంది. అక్కడ ప్యాట్రిక్ ఆమె కోసం చూస్తూ ఉంటాడు. ఆమె అతనితో “నన్ను ప్రశాంతంగా బతకనీ” అని ఇంట్లోకి వెళుతుంది. అసహనంగా ఉంటుంది. జోయెల్ ని వదులుకోవటం ఇష్టం లేక అతని ఇంటికి వెళుతుంది. అతనికి కూడా మేరీ పంపిన క్యాసెట్ అందింది. ఆ క్యాసెట్టు వింటూ ఉంటాడు. అందులో “క్లెమెంటైన్ ఎవరితోనైనా స్నేహం చేయాలంటే సెక్స్‌ని ఎరగా వేస్తుంది. లేదా సెక్స్ ఆశ చూపిస్తుంది. కొన్నాళ్ళకి ఆమె అందరితో సెక్స్ చేసినా ఆశ్చర్యం లేదు” అంటాడు. ఇది అతని అక్కసు. ఆమె తను లేకుండా రాత్రి వేళల్లో బయటకి వెళుతుందని అతని బాధ. అంతమాత్రాన ఆమె విశృంఖలంగా ఉంటుందా? నిజానికి ఆమె అతని జ్ఞాపకాల్ని తొలగించిందని అతని ఉక్రోషం. పైగా తాను ఆమె జ్ఞాపకాల్ని తొలగించుకోవటానికి బలమైన కారణం చూపించాలి కాబట్టి డాక్టరు ముందు అలా మాట్లాడాడు. తప్పు అవతలి వారి మీదకి తోసేయటం మనుషుల నైజం. క్లెమెంటైన్ వచ్చాక జోయెల్ క్యాసెట్ ఆపేద్దామనుకుంటాడు కానీ ఆమె “నాకు అభ్యంతరం లేదు” అంటుంది. అన్ని మాటలు వింటుంది. ఆమె మనసు గాయపడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను ఆమెని వెంబడించి ఆపుతాడు. “కాసేపు ఉండొచ్చు కదా” అంటాడు. “నేను లోపాలున్న అమ్మాయిని. సంతోషం కోసం వెతుక్కుంటున్నాను” అంటుందామె. “నీలో ఏ లోపాలు కనిపించటం లేదు” అంటాడతను. “కొన్నాళ్ళకి నా లోపాలు కనిపిస్తాయి. కొన్నాళ్ళకి నువ్వంటే నాకు విసుగు వస్తుంది. నా స్వభావమే అంత” అంటుందామె. “పర్వాలేదు” అంటాడతను. ఇద్దరూ నవ్వుకుంటారు. కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు.

‘నా స్వభావమే అంత’ అని ఆమె అనటంతో ఆమెకి తన గురించి అవగాహన పెరిగింది. ఇదే మనుషులలో లేనిది – తమ గురించి తమకు అవగాహన. తమ లోపాలను తాము తెలుసుకుంటే ఇతరుల లోపాలను క్షమించే ఓర్పు వస్తుంది. వేరొకరి గురించి అన్న మాటలు వారి స్వభావం కంటే మన స్వభావాన్నే ఎక్కువ తెలియజేస్తాయి. ఈ మొత్తం ప్రహసనంతో వారికి వారి లోపాలు తెలిశాయి. ఆమెకి ఎప్పుడూ ఏదో థ్రిల్ కావాలి. అది ఆమె స్వభావం. ఆ స్వభావం వల్ల అసంతృప్తే మిగులుతుందని ఆమె అర్థమయింది. అతనికి కలివిడిగా ఉండటం తెలియదు. అందరూ పద్ధతిగా ఉండాలి అంటాడు. అవతలి వారి అలవాట్లు వేరుగా ఉంటే పెడర్థాలు తీస్తాడు. అది అతనికి అర్థమయింది. మనిషి తన గురించి తాను తెలుసుకోవటం కంటే గొప్ప జ్ఞానం ఏముంటుంది?

Exit mobile version