[సంచిక పాఠకుల కోసం ‘ఔట్‌సైడ్ ఇన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
[dropcap]మ[/dropcap]నిషి జీవితంలో అడుగడుగునా సవాళ్ళు. సాధారణ జీవితమే ఇలా ఉంటే ఇక అసాధారణ పరిస్థితుల్లో ఉన్నవారి సంగతి ఏమిటి? జైల్లో ఇరవై ఏళ్ళు ఉండొచ్చిన వ్యక్తికి తిరిగి సంఘంలో ఇమడటం ఎంత కష్టం? అతను ఒక జైలు నుంచి మరో జైలుకి వచ్చినట్టే. సంఘంలో ఎవరి వ్యక్తిగత ఖైదుల్లో వారుంటారు. అది ఖైదు అనుకుంటే ఖైదు. బాధ్యత అనుకుంటే బాధ్యత. బాధ్యతకి ఇష్టానికి మధ్య ఘర్షణే జీవితం. ఈ ఘర్షణలో ఎవరినీ నొప్పించకుండా ఉండటం సాధ్యమేనా? ఆధునిక సమాజంలో ఇష్టమే పై చేయి సాధిస్తోంది. ‘ఔట్‌సైడ్ ఇన్’ (2017) చిత్రంలో ఈ ఘర్షణే ఇతివృత్తం. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. కథానుసారం ‘ఔట్‌సైడ్ ఇన్’ అంటే ‘బయట ఉన్నా లోపలే’ అని అర్థం. తెలుగులో అలా చెప్పుకోవటం కన్నా ‘స్వేచ్ఛలో బందీలు’ అని చెప్పుకుంటే బావుంటుంది.
క్రిస్ ఇరవై ఏళ్ళు జైల్లో ఉండి పెరోల్ మీద విడుదలవుతాడు. 18 ఏళ్ళ వయసులో ఒకతన్ని చంపాడనే నేరం మీద జైలుకెళ్ళాడు. ఇప్పుడు 38 ఏళ్ళు. అతని తమ్ముడు టెడ్ అతన్ని తన ఇంటికి తీసుకువస్తాడు. టెడ్‌కి పెళ్ళి కాలేదు. వారి తల్లి వేరే ఊళ్ళో ఉంటుంది. క్రిస్ పెరోల్ మీద ఉన్నాడు కాబట్టి ఊరు విడిచి వెళ్ళకూడదు. అతని తల్లి విమానంలో రావటానికి భయమని చెప్పి రాదు. కాస్త డబ్బు మాత్రం పంపిస్తుంది. పెరోల్ మీద ఉన్నప్పుడు చిన్న తప్పు చేసినా మళ్ళీ జైల్లో పెడతారు. క్రిస్‌కి క్యారల్ అనే ఆమె సాయం చేయటం వల్ల పెరోల్ వచ్చింది. క్యారల్ ఒక టీచరు, సామాజిక కార్యకర్త. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అపరాధులకి కనీస శిక్ష ఉంటుంది. దాన్ని mandatory minimum అంటారు. ఒక్కోసారి అది సుదీర్ఘ కాలం ఉంటుంది. సత్ప్రవర్తన ఉన్నా అపరాధులు దీర్ఘ కాలం జైల్లో ఉంటారు. ఆ కనీస శిక్షని రద్దు చేయాలనే ఉద్యమంలో క్యారల్ పని చేస్తుంటుంది. ఒకప్పుడు ఆమె క్రిస్‌కి టీచరే. యాభై ఏళ్ళ పైనే ఉంటాయి. విడుదలైన క్రిస్‌ని కలుసుకోవటానికి బంధువులు, స్నేహితులు వస్తారు. క్రిస్‌కి క్యారల్‌తో తప్ప ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం ఉండదు. ఆమెని తర్వాత కలుసుకుని తాను గీసిన ఆమె బొమ్మని ఆమెకి కానుకగా ఇస్తాడు. అతను తన మీద ప్రేమ పెంచుకున్నాడని క్యారల్‌కి అర్థమవుతుంది.
క్యారల్‌కి భర్త, కూతురు ఉంటారు. కూతురు హిల్డీ పదహారు, పదిహేడేళ్ల అమ్మాయి. క్యారల్ భర్తకి ఆమె చేసే సామజిక సేవ పెద్దగా రుచించదు. ఇంట్లో అతను వేరే గదిలో పడుకుంటాడు. అతనికి లైంగిక సామర్థ్యం తగ్గింది. దానికి వయసు ఒక కారణమైతే మానసికంగా ఆమెకి దూరం కావటం కూడా మరో కారణం. ఆమె అసంతృప్తిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో క్రిస్ చూపించే ప్రేమ ఆమెకి కొత్తగా ఉంటుంది. ఒకరాత్రి టెడ్ ఇంట్లో పార్టీ జరుగుతుంటే క్రిస్ వారితో కలవటం ఇష్టం లేక క్యారల్‌కి ఫోన్ చేస్తాడు. “నువ్వు స్త్రీలతో కలిసి మాట్లాడితే అదే అలవాటవుతుంది. ఎవరో ఒకరు నచ్చుతారు” అంటుందామె. సరే అంటాడతను. పార్టీలో టెడ్ షేన్ అనే అతన్ని క్రిస్ దగ్గరకు తీసుకువస్తాడు. “క్షమించమని అడగటానికి వచ్చాను” అంటాడు షేన్. క్రిస్ అతన్ని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఇరవై ఏళ్ళ క్రితం క్రిస్, టెడ్, షేన్ కలిసి ఉండగా ఏదో గొడవలో షేన్ తుపాకీ కాల్చటంతో ఒకతను మరణించాడు. టెడ్, షేన్ పారిపోతే క్రిస్ గాయపడిన వాడి కోసం అక్కడే ఉండిపోవటంతో పట్టుబడ్డాడు. తమ్ముడి కోసం నేరం తన నెత్తిపై వేసుకున్నాడు. టెడ్ తనని కలుసుకోవటానికి జైలుకి రాలేదు కానీ షేన్‌ని ఇప్పుడు తన దగ్గరకి తీసుకురావటంతో క్రిస్‌కి కోపం వస్తుంది. ఇంట్లో ఉండలేక క్యారల్ ఇంటికి వస్తాడు. ఆమె బయటకి వచ్చి అతన్ని కలుస్తుంది. “నీతో తప్ప ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. నాకు ఎవరూ వద్దు. నీ తోడే కావాలి. నువ్వు కూడా నాతో మాట్లాడినట్టు ఎవరితోనూ మాట్లాడలేనని అన్నావు కదా” అంటాడతను. “అది నిజమే. కానీ నా కుటుంబం నుంచి పారిపోలేను కదా. నా భర్తతో కలిసి ఉండేలా నేను ప్రయత్నం చేయాలి. మనం స్నేహితుల్లా ఉందాం” అంటుందామె. అతన్ని ఒకరోజు అల్పాహారానికి రమ్మంటుంది. తన కుటుంబాన్ని పరిచయం చేస్తానంటుంది.
దీర్ఘకాలం తర్వాత జైలు నుంచి విడుదల అయినవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టమే. ప్రపంచం వారిని వెనకాల వదిలేసి సాగిపోతుంది. అమెరికా లాంటి దేశాల్లో ఎవరినీ కించపరచకుండా ఎప్పటికప్పుడు పద్ధతులు మార్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒకప్పుడు తింగర (retarded) అని తేలికగా అనేవారిని ఇప్పుడు మానసిక రోగులు (mentally challenged) అనాలి. ఇలాంటి మార్పులు జైల్లో ఉన్నవారికి తెలియవు. పాత మాటని ఏ సందర్భంలో వాడినా వింతగా చూస్తారు. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతాయి. కొత్త నైపుణ్యాలు అవసరమౌతాయి. జైలుకి వెళ్ళి వచ్చినవాడికి ఉద్యోగం ఇవ్వటానికి అందరూ జంకుతారు. స్నేహితులందరూ తమ తమ జీవితాల్లో తలమునకలై ఉంటారు. పైగా క్రిస్ చేయని తప్పుకి శిక్ష అనుభవించాడు. టెడ్ ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్ కుంగుబాటుకి లోను కావటం సహజం. అతనితో సానుభూతిగా మాట్లాడేది క్యారల్ మాత్రమే. అందుకే ఆమె తోడునే అతడు కోరుకుంటాడు. క్రిస్ జైల్లో ఉన్నప్పుడు క్యారల్ వారానికి రెండు రోజులు అతనితో ఫోన్లో మాట్లాడేది. అప్పటికే ఆమె క్రిస్ కేసుతో తలమునకలై ఉండటంతో ఆమెకీ, భర్తకీ మధ్య దూరం పెరిగింది. ఇంట్లో ప్రేమ దక్కకపోవటంతో ఆమె క్రిస్‌తో చనువుగా మాట్లాడేది. క్రిస్ “అప్పుడే బావుండేది. వారానికి రెండు సార్లు మాట్లాడేదానివి. ఇప్పుడు అదీ లేదు” అంటాడు. క్యారల్ మంచి మనసుతోనే అతనితో మాట్లాడేది. అయితే “నీతో మాట్లాడినట్టు ఎవరితోనూ మాట్లాడలేను” అనటం ఎంతవరకు సబబు? ప్రేమ కోసం తహతహలాడేవారు ఇలాంటి తప్పులు చేయటం వల్లే సమస్యలు తలెత్తుతాయి. క్యారల్ భర్త ఆమె ఆశయాలను అర్థం చేసుకోలేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే పరిస్థితి దిగజారేది కాదు. కౌన్సెలింగ్‌కి కూడా వెళ్ళొచ్చు. ఉన్నతమైన ఆశయాలు ఉన్నవారి కోసం కుటుంబసభ్యులు త్యాగాలు చెయ్యాలి అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి అంటారు. మనసు విప్పి మాట్లాడుకుంటే బంధాలు బావుంటాయి. ఇది లోపించటం వల్లే సమస్యలన్నీ. ఇప్పుడు ఆమెకి క్రిస్ ఇంకో సమస్య. క్రిస్‌కి మాత్రం ఇది జీవన్మరణ సమస్యలా ఉంటుంది.
క్రిస్ అల్పాహారానికి క్యారల్ ఇంటికి వెళతాడు. ఆమె కూతురు హిల్డీ మొదట ముభావంగా ఉంటుంది కానీ క్రిస్ సరదాగా మాట్లాడటంతో ఆమె కూడా నవ్వుతూ మాట్లాడుతుంది. క్యారల్ భర్త కాస్త వ్యంగ్యంగా మాట్లాడతాడు. క్రిస్‌కి మనస్సు చివుక్కుమంటుంది. క్యారల్ కూడా చిన్నబుచ్చుకుంటుంది కానీ ఏం మాట్లాడదు. క్రిస్‌ని సాగనంపటానికి క్యారల్ బయటకి వచ్చి నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. క్రిస్ తనకి జరిగిన అవమానం కన్నా క్యారల్ పరిస్థితి గురించే ఎక్కువ బాధపడతాడు. క్యారల్ క్రిస్‌ని వదిలించుకుంటే మంచిదన్నట్టు మాట్లాడుతుంది. “నాకు వేరే కేసు పని ఉంది. నీ కేసు చూసేటపుడు నా ఖాళీ సమయంలో నీతో మాట్లాడేదానిని. నీకు ఇప్పుడు ఖాళీ సమయం ఎక్కువ ఉండటం వల్ల తోచకుండా ఉంది. కొన్నాళ్ళకి అదే సర్దుకుంటుంది” అంటుంది. క్రిస్ ఖిన్నుడై వెళ్ళిపోతాడు. టెడ్ మీద కోపంతో అతను ఇంటి బయట ఉన్న షెడ్డులో ఒక చిన్న మంచం వేసుకుని అక్కడే ఉంటాడు. కోపంలో అతనేమన్నా చేస్తే అతని స్వేచ్ఛకే ప్రమాదం. అతన్ని మళ్ళీ జైల్లో పెడతారు. ప్రేమ అందక, పని దొరక్క, మాట్లాడేవారు లేక అతను నిరాశలో ఉంటాడు. పెరోల్‌లో ఉన్నవారి చేత రహదారుల పక్క చెత్త తొలగించటం లాంటి పనులు (కమ్యూనిటీ సర్వీస్) చేయిస్తారు. ఆ పని వల్ల ఉపశమనం కన్నా అవమానమే ఎక్కువగా ఉంటుంది. వారం వారం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మూత్ర పరీక్షకి నమూనా ఇవ్వాలి. డ్రగ్స్ కానీ, మద్యం కానీ తాగటం లేదని నిర్ధారణ కోసం. అతను ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ మీదే వెళుతుంటాడు. కారు కొనుక్కునేంత స్థోమత లేదు మరి.
ఉద్యోగం కోసం ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ హిల్డీ పని చేస్తుంటుంది. అమెరికాలో చిన్న వయసు నుంచే పని చేయటాన్ని ప్రోత్సహిస్తారు. ఓ పక్క చదువుకుంటూ కొంత సమయం పని చేస్తారు. క్రిస్ నేరం చేయలేదని హిల్డీకి క్యారల్ చెప్పింది. హిల్డీకి క్రిస్ మీద జాలిగా ఉంటుంది. పైగా అతను తమ ఇంటికి వచ్చినపుడు సరదాగా మాట్లాడాడు. ఆమె అతని ఫోన్ నంబరు తీసుకుంటుంది. ఇద్దరూ తర్వాత కలుసుకుంటారు. ఎవరితోనూ సరిగా మాట్లాడలేని పరిస్థితిలో క్రిస్‌కి ఇది పెద్ద ఊరట. క్యారల్ కూడా అతన్ని దూరం పెట్టింది మరి. హిల్డీ అతని జైలు జీవితం గురించి అడుగుతుంది. “మీ అమ్మ వల్లే నేను ఆ జీవితం భరించగలిగాను. ఆమె నాకు పుస్తకాలు చదవమని చెప్పింది. ఏదో వ్యాపకం ఉండేలా చేసింది. నా గురించి తపన పడింది” అంటాడతను. “మా అమ్మ గురించేనా నువ్వు మాట్లాడేది?” అని నవ్వుతుంది హిల్డీ. క్యారల్ తనని సరిగా చూసుకోలేదని హిల్డీ భావన. క్యారల్ క్రిస్‌కి సహాయం చేయటానికి తన కూతుర్ని కూడా నిర్లక్ష్యం చేసింది. ఆ వయసులో కూతుర్ని నిర్లక్ష్యం చేయటం తప్పే. హిల్డీకి బాధ ఉండటం సహజం. ఎంత వింత పరిస్థితి! క్రిస్ క్యారల్ వల్ల కొత్త జీవితం పొందాడు. దాని కోసం హిల్డీ తన బాల్యాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. క్యారల్ భర్త క్యారల్‌కి మద్దతుగా ఉండి హిల్డీని మరింత బాగా చూసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఇప్పుడు హిల్డీకి తల్లి మీద కోపం. క్యారల్ హిల్డీతో మళ్ళీ అనుబంధం పెంచుకోవటానికి ప్రయత్నిస్తుంది కానీ హిల్డీ దూరం దూరంగా ఉంటుంది. ఇంటికి వచ్చాక తల్లి అడిగితే హిల్డీ తాను క్రిస్‌ని కలుసుకోవాటానికి వెళ్ళానని చెబుతుంది. అది విన్న క్యారల్ భర్త క్యారల్‌ని అక్షేపిస్తాడు. “జైలుకి వెళ్ళొచ్చిన వాడితో మనమ్మాయికి స్నేహమా? అంతా నీ దయే! ఇకపై నీ సంఘసేవ ఇంట్లోకి తీసుకురాకు” అంటాడు. క్యారల్ మనసు గాయపడుతుంది. వెంటనే క్రిస్‌కి ఫోన్ చేస్తుంది. ఇదే మనిషి బలహీనత! బాధ కలిగితే ఎక్కడో ఒక చోట వెంటనే సాంత్వన పొందాలని చూస్తాడు. క్రిస్ పరిస్థితి తెలిసి కూడా క్యారల్ అతని దగ్గర ప్రేమని కోరుకుంటుంది.
క్యారల్‌గా ఈడీ ఫాల్కో, క్రిస్‌గా జే డుప్లాస్, హిల్డీగా కేట్లిన్ డెవర్ నటించారు. ఈడీ ఫ్లాల్కో నటన అత్యద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా అల్పాహారం తర్వాత క్రిస్‌తో మాట్లాడే సన్నివేశంలో ఆమె అతని మనసు గాయపరుస్తున్నాని తెలిసి కూడా అతన్ని దూరంగా ఉండమన్నట్టు మాట్లాడేటపుడు బాధ, ఆ బాధని దాచుకునే ప్రయత్నం, మధ్యలో ఇబ్బందిగా నవ్వటం, అతను మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటే ఏం చెప్పలేక మాటలు తడబడటం – ఇవన్నీ అద్భుతంగా అభినయించింది. ఆ సన్నివేశం ఎంతో వాస్తవికంగా ఉంటుంది. జే డుప్లాస్ క్రిస్ పాత్రలో గూడు కట్టుకున్న విషాదాన్ని కళ్ళలో పలికించాడు. నవ్వుతూ ఉన్నా కళ్ళు విషాదంగా ఉంటాయి. ఈ చిత్రం స్క్రీన్ ప్లేకి అతను సహరచయితగా పనిచేశాడు. కేట్లిన్ డెవెర్ ఇప్పటికే నటిగా మంచి పేరు సంపాదించింది. భవిష్యత్తులో ఆమెకి మరింత ఖ్యాతి రావటం ఖాయం. లిన్ షెల్టన్ స్క్రీన్ ప్లే రచనలో పాలుపంచుకుని చిత్రానికి దర్శకత్వం వహించింది. దురదృష్టవశాత్తూ ఆమె 2020 లో క్యాన్సర్‌తో మరణించింది. చిత్రంలో నేథన్ మిల్లర్ ఫొటోగ్రఫీ చాలా బావుంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక చిన్న ఊళ్ళో చిత్రీకరణ చేశారు. వర్షాలు ఎక్కువ పడే రాష్ట్రమది. ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. పచ్చని చెట్ల మధ్యలో రోడ్డు, ఇంటి పైకప్పు పై పెరిగిన పచ్చిక, ఊరికి దూరంగా ఉన్న కొండ లాంటి దృశ్యాలు అహ్లాదంగా ఉంటాయి. చాలా దృశ్యాలు వర్షం పడుతుండగానో, పడ్డ తర్వాతనో ఉంటాయి. ఆ దృశ్యాలకు తగినట్టే సంగీతం కూడా ఆర్ద్రంగా ఉంటుంది. యాండ్రూ బర్డ్ సంగీతం అందించాడు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
క్యారల్ ఫోన్ చేయటంతో క్రిస్ ఆమె ఇంటికి వెళతాడు. ఆమె ఇంటి బయటకి వచ్చి అతన్ని కౌగిలించుకుంటుంది. అతని పరిష్వంగంలో సాంత్వన పొందుతుంది. అతను కూడా ఊరట పొందుతాడు. అయితే వారు హద్దులు దాటరు. ఒకరోజు హిల్డీ క్రిస్‌కి మళ్ళీ తారసపడుతుంది. ఆమె అతన్ని ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరకి తీసుకువెళుతుంది. ఇద్దరూ బయట కూర్చుని మాట్లాడుకుంటారు. “మా అమ్మ గత కొన్నేళ్ళు ఇల్లు పట్టకుండా పని చేసింది. ఇప్పుడు మళ్ళీ నాతో సఖ్యంగా ఉండాలని చూస్తోంది. నాకిష్టం లేదు” అంటుందామె. “నా వల్లే కదా అలా జరిగింది” అంటాడతను. ఎవరిదీ తప్పు లేదు. జైల్లో ఉన్న అమాయకుణ్ణి విడిపించాలని క్యారల్ శ్రమించింది. జైల్లో నుంచి బయటపడాలని క్రిస్ ఆరాటపడ్డాడు. తల్లి ప్రేమ కోసం హిల్డీ పరితపించింది. క్రిస్ తన వల్లే హిల్డీకి తల్లి దూరమైందని అనేసరికి హిల్డీ “నీ తప్పేం లేదు” అంటుంది. ఆ పాడుబడిన ఇంటికి హిల్డీ రావటానికి ఒక కారణం ఉంది. ఆమె ఆ ఇంట్లో రిబ్బన్లను క్రమపద్ధతిలో కట్టి కళాకృతులను తయారు చేసింది. ఇంట్లో ఉన్న పాత కుర్చీలను కూడా ఆ ఆకృతుల్లో ఉపయోగించింది. కళకు అనేక రూపాలు. తన కళాకృతుల్ని ఆమె అంతవరకూ ఎవరికీ చూపించలేదు. అతనికి చూపిస్తుంది. అతను “కనీసం ఫోటోలు తీయించినా ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి” అంటాడు.
టెడ్ పుట్టినరోజు పార్టీకి క్రిస్, హిల్డీ వెళతారు. ఆమె తన ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక అతనితో వెళుతుంది. క్రిస్ బీరు తప్ప ఏం తాగడు. మద్యం తాగితే అతని పెరోల్‌కే ప్రమాదం. హిల్డీ బీరు తాగుతుంది. ఆ వయసులో తాగకూడదు. కానీ ఆమె నా ఇష్టం అన్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరినీ చూసి టెడ్ హేళన చేస్తాడు. క్రిస్‌కి అసలే అతని మీద కోపం ఉంది. అందరి ముందూ “నా తమ్ముడు జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి కూడా వచ్చేవాడు కాదు” అని బయటకి వెళ్ళిపోతాడు. టెడ్ వెనకాలే వెళతాడు. “నిన్ను కాపాడటానికి నేను జైలుకి వెళ్ళాను. నీకు కృతజ్ఞతే లేదు” అంటాడు క్రిస్. హిల్డీ ఆ మాట వింటుంది. క్రిస్, హిల్డీ కలిసి సైకిళ్ళ మీద అక్కడి నుంచి బయల్దేరతారు. బీరు తాగటంతో హిల్డీ సైకిల్ మీద నుంచి తూలి పడుతుంది. క్రిస్ ఆమెని తన సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళతాడు. క్యారల్ చప్పుడు విని బయటకి వస్తుంది. హిల్డీ తాగి ఉందని గ్రహిస్తుంది. క్రిస్‌ని నిలదీస్తే అతను “నీ కూతురికి ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు. అది చూసుకో” అని వెళ్ళిపోతాడు. క్యారల్ నిశ్చేష్టురాలై ఉండిపోతుంది.
మర్నాడు అతను క్యారల్‌ని కలిసి క్షమాపణ చెబుతాడు. “హిల్డీని నేనే పార్టీకి తీసుకువెళ్ళాను. ఆమెని తాగకుండా చూడాల్సిన బాధ్యత నాదే. నన్ను క్షమించు” అంటాడు. ఆమె అతన్ని క్షమిస్తుంది. అతను “నేను నీకు కష్టం కలిగించానని నాకు తెలుసు. కానీ నేను ఈ కొత్త జీవితంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. ఒక్కరోజు నాతో గడుపు. నేను నిన్ను ముట్టుకోను. నీతో ఉండటమే నాకు కావాలి. ఆ తర్వాత నేను కుదుటపడతానని నాకనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం పార్క్ దగ్గర నీ కోసం వేచి ఉంటాను” అని వెళ్ళిపోతాడు. క్యారల్ ఆలోచనలో పడుతుంది. అదే రోజు హిల్డీ క్రిస్ ఇంటికి వెళుతుంది. అతను షెడ్డులో పడుకుని ఉంటాడు. ఆమె అతని వెనక మీద పడుకుని అతని మీద చేయి వేస్తుంది. క్రిస్ ఉలిక్కిపడి లేస్తాడు. ఆమెని చూసి ఖంగు తింటాడు. ఆమె సారీ చెప్పి ఆదరాబాదరాగా వెళ్ళిపోతుంది. ఆమెకి క్రిస్ మీద ప్రేమ పుట్టింది. మానవ సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయో కదా అనిపిస్తుంది. కథలో ఈ క్లిష్టత సహజంగా వస్తుంది. అందరూ ప్రేమ కోసం తపించేవారే. వేరొకరికి ప్రేమ పంచాలని చూసేవారే. కానీ ఎవరి మీద ప్రేమ పెంచుకుంటారో వారు వేరొకరి కోసం తపిస్తూ ఉంటారు. వీటిలో తల్లి ప్రేమా ఉంది, తోడు కోరుకునే ప్రేమా ఉంది.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
క్యారల్ తన భర్తతో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది. క్రిస్‌తో వెళ్ళటానికి ఆమె అంతరాత్మ ఒప్పుకోదు. తన భర్తని మోసం చేస్తున్నాననే భావన ఉంటుంది. భర్తతో మాట్లాడి తన వైవాహిక జీవితాన్ని బాగు చేసుకుంటే క్రిస్‌ని మనసులో నుంచి శాశ్వతంగా తీసేయవచ్చునని ఆమె ఆలోచన. ఆమె భర్త సానుకూలంగా స్పందించకపోతే తప్పు అతనిదే కాబట్టి క్రిస్‌తో వెళ్ళటానికి తనకి సాకు దొరికినట్టే అని ఆమె లోలోపల అనుకునే ఉంటుంది. ఆమె భర్తతో “మనం కౌన్సెలింగ్‌కి వెళదాం” అంటుంది. అతను “ఇప్పుడేం మునిగిపోయింది? కొన్నాళ్ళకి ఇద్దరం రిటైరవుతాం. అప్పుడు కలిసి సమయం గడపొచ్చు” అంటాడు. ఆమె “నాకు రిటైరవ్వాలని లేదు. నేను ఇంకా పని చేస్తాను. క్రిస్ లాంటి వాళ్ళకి సాయం చేయాలి” అంటుంది. “నీ సమాజ సేవ వల్లే మన జీవితం ఇలా అయింది” అని అతను కోపంగా వెళ్ళిపోతాడు. ఆమె నిస్పృహ చెందుతుంది. క్రిస్‌తో వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది.
క్యారల్ క్రిస్‌తో కలిసి పక్క ఊరికి వెళుతుంది. తాను కాన్ఫరెన్స్‌కి వెళుతున్నానని ఇంట్లో చెబుతుంది. ఇద్దరూ ఆ రాత్రి సంతోషంగా బౌలింగ్ చేస్తారు. కావల్సింది తింటారు. తర్వాత మోటెల్లో గది తీసుకుంటారు. వాంఛని అదుపు చేసుకోలేక ఇద్దరూ కలిసి పడుకుంటారు. తర్వాత ఆమె “మనమిద్దరం కలిసి ఉండటం ఎలా సాధ్యం?” అంటుంది. క్రిస్ “నాకు మామూలు జీవితం కావాలి. ఒక చిన్న ఉద్యోగం, తోడుగా ఒకరు. సాయంత్రం ఇంటికి వచ్చి టీవీ చూడటం. వారాంతాల్లో అలా విహారయాత్రకి వెళ్ళటం. ఇంతే. ఇవన్నీ నీతోనే చెయ్యాలని నా ఆశ. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను” అంటాడు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోతుంది. మర్నాడు ఉదయం బయటకి వచ్చేసరికి క్యారల్ భర్త, హిల్డీ మోటెల్ నడిపే ఆమెని వాకబు చేస్తూ కనపడతారు. క్యారల్ క్రెడిట్ కార్డ్ వాడకం అనుమానాస్పదంగా ఉండటంతో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే హిల్డీ వాళ్ళతో మాట్లాడింది. ఆ విధంగా క్యారల్ ఎక్కడుందో తెలిసింది. హిల్డీ తండ్రిని తీసుకుని అక్కడికి వచ్చింది. క్యారల్ భర్త క్రిస్‌ని కొట్టటానికి వస్తాడు. అయితే క్రిస్ అతన్ని కాలి మీద తన్నటంతో పడిపోతాడు. క్యారల్ క్రిస్‌ని వెళ్ళిపొమ్మంటుంది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి టెడ్‌కి ఫోన్ చేస్తాడు. టెడ్ అతన్ని ఇంటికి తీసుకువెళతాడు.
ఇంటికి చేరుకున్నాక టెడ్ క్రిస్‌కి క్షమాపణ చెబుతాడు. “నేను జైలుకి వచ్చి నిన్ను కలుసుకుంటే మాటల్లో నేను కూడా హత్య జరిగిన చోట ఉన్నానని తెలిస్తే ప్రమాదంలో పడతానని రాలేదు. చాలా స్వార్థంతో ప్రవర్తించాను. సారీ. నా కారు తీసుకో. ప్లీజ్. ఇంతకన్నా నేను ఏమీ ఇవ్వలేను” అంటాడు. తర్వాత హిల్డీ కనపడటం లేదని క్యారల్ క్రిస్‌కి ఫోన్ చేస్తుంది. హిల్డీ పాడుపడిన ఇంట్లో ఉంటుందని క్రిస్ చెబుతాడు. క్యారల్ అక్కడికి వెళుతుంది. హిల్డీ కళాకృతుల్ని చూసి ఆశ్చర్యపోతుంది. హిల్డీ “మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా?” అని అడుగుతుంది. “లేదు. అతను జైల్లో ఉన్నప్పుడు ఏదో బంధం ఏర్పడింది. అతను విడుదలయాక తన దారి తాను చూసుకుంటాడనుకున్నాను. అనుకోకుండా ఇలా జరిగింది” అంటుంది క్యారల్. “మరి నాన్న, నువ్వు ఇప్పుడు ఏం చేస్తారు?” అంటుంది హిల్డీ. “తెలియదు. కానీ నాకు అన్నిటి కన్నా ముఖ్యం నువ్వు. ఇన్నాళ్ళూ నీ పక్కన ఉండకపోవటం తప్పే. నాకు ఇంకో అవకాశం ఇవ్వు” అంటుంది క్యారల్. హిల్డీ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. క్షమాపణ అడగటం చాలా శక్తిమంతమైన సాధనం. మనసు లోతుల్లో నుంచి క్షమాపణ అడిగితే క్షమించని వారు ఉండరు. టెడ్ క్రిస్‌ని, క్యారల్ హిల్డీని క్షమాపణ అడిగి తమ మనసుల్నే కాక వారి మనసుల్ని కూడా తేలిక చేశారు. క్షమాపణ అడిగేవారు నిజంగా సంస్కారవంతులు. క్షమించటం అవతలి వారికన్నా మనకే ఎక్కువ మేలు చేస్తుంది. ఒకరోజు క్రిస్, టెడ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కుర్చీలు కలిపి రిబ్బన్లు కట్టి ఉంటాయి. ఇది హిల్డీ చేసిన పని అని క్రిస్‌కి తెలుసు. అంటే ఆమె క్రిస్‌ని క్షమించింది. క్రిస్ ఇది అర్థమై తనలో తానే నవ్వుకుంటాడు.
క్యారల్ భర్త వేరుగా వెళ్ళిపోతాడు. క్రిస్ ఒక చిన్న ఉద్యోగం సంపాదిస్తాడు. క్యారల్ క్రిస్‌ని కలవటానికి వెళుతుంది. “నీకు మామూలు జీవితం కావాలి. నేను చాలా ఏళ్ళు మామూలు జీవితమే గడిపాను. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ పని నాకు చాలా ముఖ్యం. హిల్డీ కాలేజీకి వెళ్లాక నేను సియాటిల్ నగరంలో ఉండాలనుకుంటున్నాను. ఉద్యమానికి సంబంధించిన ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయి” అంటుంది. క్రిస్ నిరాశ పడతాడు కానీ “నీ నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను” అంటాడు. ఆమె “ఓసారి లంచ్ కి వెళదాం. మన జీవితాల గురించి మాట్లాడుకుందాం” అంటుంది. అతనిలో ఒక ఆశ చిగురిస్తుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
క్యారల్ భర్తకి మామూలు జీవితమే కావాలి. తన ఆశయాలను అతను పట్టించుకోవట్లేదని క్యారల్ నిరాశపడింది. క్రిస్ చూపించిన ప్రేమకి కరిగిపోయింది. కానీ క్రిస్‌కి కూడా మామూలు జీవితమే కావాలి. భర్త వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి ఆమె క్రిస్‌తో కలిసి ఉండొచ్చు. కానీ రేపు క్రిస్ కూడా అసంతృప్తికి లోను కావచ్చు. అది అతనికి అన్యాయం చేయటమే అవుతుంది. ఇప్పుడు క్రిస్ బాధపడొచ్చు కానీ కొన్నాళ్ళకి అతను నిలదొక్కుకుంటాడు. క్యారల్ ఒక స్నేహితురాలిగా తోడుగా ఉంటే అతనికి ఆలంబనగా ఉంటుంది. బలహీనతకి లొంగిపోకుండా బాధ్యతగా ఉంటే క్యారల్ దోషిగా నిలబడే అవసరం వచ్చేది కాదు. క్యారల్ భర్త కాస్త సహృదయంతో ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. వివాహబంధంలో త్యాగం ముఖ్యం. ‘నేనే ఎందుకు త్యాగం చేయాలి’ అనేది వితండ వాదన అవుతుంది. యుగాలుగా పురుషుల కోసం స్త్రీలు త్యాగం చేశారు. పురుషులు కూడా త్యాగాలు చేయాటానికి సిద్ధపడాలి. క్యారల్‌ది ఉన్నతాశయం కాబట్టి. ఇప్పుడు క్రిస్ ఆమె ఆశయాన్ని అర్థం చేసుకుని ఆమె సాంగత్యం కోరుకుంటే ఇద్దరూ కలిసి ఉండొచ్చు. విషాదమేమిటంటే అతని పెరోల్ ముగియటానికి సమయం పడుతుంది. అప్పటి దాకా అతను ఊరు వదిలి వెళ్ళకూడదు. క్యారల్ అతని కోసం ఆ ఊళ్ళో ఉండిపోతుందా? మనిషి జీవితంలో అడుగడుగునా సవాళ్ళే.