Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 59: ఇన్ ద ఫేడ్

[సంచిక పాఠకుల కోసం ‘ఇన్ ద ఫేడ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]తీ[/dropcap]వ్రవాదుల దాడుల్లో మరణించినవారి కుటుంబాలలో వర్ణనాతీతమైన విషాదం ఉంటుంది. ఎవరి ద్వేషానికో అకారణంగా బలైపోవటమంటే ఎంత దారుణం! వస్తువులు పోయాయంటే తట్టుకోవచ్చు. డబ్బు పోయిందంటే తట్టుకోవచ్చు. మనుషులు పోతే తట్టుకోవటం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతాయి. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిన జర్మన్ చిత్రం ‘ఇన్ ద ఫేడ్’ (2017). నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. అయితే ఈ చిత్రం పూర్తిగా విషాదంగా ఉండదు. ఎన్నో కోణాలు ఉంటాయి. చనిపోయినవారి కుటుంబమే కాక తీవ్రవాదుల కుటుంబం ప్రతిస్పందనని కూడా స్పృశించారు. తీవ్రవాదుల తరఫు లాయర్లు అవినీతిపరులైతే ఎలా ఉంటుందో న్యాయస్థానం సన్నివేశాలలో చూపించారు. అయితే న్యాయస్థానం వెలుపలే చిత్రం ముగుస్తుంది. అదీ ఉత్కంఠభరితంగా. ‘ఇన్ ద ఫేడ్’ అంటే ‘క్రమ పతనం’ అనే అర్థం వస్తుంది. ఈ చిత్రానికి జర్మన్ నామం ‘ఔస్ దెమ్ నిష్త్’. దానికి ఆంగ్ల అనువాదం ‘ఔట్ ఆఫ్ నోవేర్’. దాని అర్థం ‘ఊహించని విధంగా’. కానీ చిత్రానికి ఆంగ్లనామం మాత్రం ‘ఇన్ ద ఫేడ్’ అని పెట్టారు. ‘ఔట్ ఆఫ్ నోవేర్’ అనే పేరు ఇంతకు ముందే ఒక చిత్రానికి ఉండటం ఒక కారణం కావచ్చు. ‘ఇన్ ద ఫేడ్’ చిత్రం మూబీలో లభ్యం.

చిత్రం ఆరంభంలో ఒక జైల్లో పెళ్ళి జరుగుతుంది. నూరీ అనే అతను డ్రగ్స్ అమ్మినందుకు జైల్లో ఉంటాడు. అతను తుర్కియే దేశస్థుడు. జర్మనీలో ఉంటాడు. అతను జైల్లో ఉండగా వ్యాపారానికి సంబంధించిన విద్య అభ్యసించాడు. అతనితో పరిచయమున్న కాత్యా అతన్ని జైల్లోనే పెళ్ళి  చేసుకుంటుంది. ఆమె జర్మన్ స్త్రీ. కథ కొన్నేళ్ళు ముందుకు వెళితే వారికో ఆరేళ్ళ కొడుకు ఉంటాడు. నూరీ జైలు నుంచి విడుదలై హాంబర్గ్ పట్టణంలో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఉంటాడు. ఒకరోజు కాత్యా కొడుకుని తీసుకుని అక్కడికి వస్తుంది. వాళ్ళు వస్తుంటే ఒక కారు వేగంగా వారి మీదకి దూసుకువస్తుంది. కాత్యా కొడుకుతో పాటు త్రుటిలో తప్పించుకుంటుంది. ఏదో పెద్ద ఘోరం జరగబోతోందని ఇది సూచన. దీన్నే స్క్రీన్ ప్లే భాషలో foreshadowing అంటారు. కొడుకుని భర్త దగ్గర వదిలి కాత్యా తన స్నేహితురాలిని కలవటానికి వెళుతుంది. ఆ స్నేహితురాలు గర్భవతి. ఒక్కతే ఉంటుంది. కాత్యా ఆమెకి ఆసరాగా ఉంటుంది. భర్త ఆఫీసు నుంచి కాత్యా వెళ్ళేటపుడు ఒక యువతి అక్కడ సైకిల్ వదిలి వెళుతుంటుంది. కాత్యా “తాళం వెయ్యకపోతే సైకిల్ ఎత్తుకుపోతారు” అంటుంది. ఆ యువతి “ఇప్పుడే వచ్చేస్తాను” అంటుంది. భర్త కారు తీసుకుని కాత్యా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఆ రాత్రి తిరిగి వచ్చేసరికి ఆఫీసు దగ్గర బాంబు పేలి ఉంటుంది. ఒక పురుషుడు, ఒక పిల్లవాడు చనిపోయారని, వారి శవాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని తెలిసి కాత్యా విషాదంలో కూరుకుపోతుంది. ఆ శవాలని గుర్తుపట్టాలంటే డీఎన్ఏ పరీక్ష చేయాలని పోలీసులు కాత్యాని ఇంటికి తీసుకువచ్చి తండ్రీకొడుకుల టూత్ బ్రష్‌లు తీసుకువెళతారు. రెడ్ క్రాస్ నుంచి వచ్చిన కార్యకర్త కాత్యాకి తోడుగా ఉంటుంది. కాత్యా తల్లి, తల్లి ప్రియుడు, నూరీ తలిదండ్రులు, కాత్యా స్నేహితురాలు వస్తారు. కాసేపటికి పోలీసులు వచ్చి చనిపోయినది కాత్యా భర్త, కొడుకు అని నిర్ధారించామని చెబుతారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలు అయిపోయాయని చెబుతారు. కాత్యాలో ఏదో మూల ఉన్న ఆశ కూడా అవిరైపోతుంది. ఆమె కంట కన్నీళ్ళు ధారగా కారుతుంటాయి. అయినా విచారణకి ఒప్పుకుంటుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆమె ప్రయత్నం. నూరీని చంపటానికే బాంబు పెట్టారని తమ ప్రాథమిక అంచనా అని ఇన్‌స్పెక్టర్ రీట్జ్ చెబుతాడు. కాత్యాకి ఇది నమ్మశక్యం కాదు. రీట్జ్ ఆమెని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నూరీ ఇస్లామ్ మతాన్ని ఆచరించేవాడు కాదని, ఎలాంటి మత సంస్థలతో సంబంధాలు లేవని కాత్యా చెబుతుంది. ఒక యువతి నూరీ ఆఫీసు ఎదుట సైకిల్ పెట్టిందని, ఆ సైకిల్ క్యారియర్ మీద ఒక డబ్బా ఉందని చెబుతుంది. ఆ యువతి ముఖకవళికలు చెబితే తమ చిత్రకారుడు బొమ్మ గీస్తాడని రీట్జ్ అంటాడు. ఆమె చెప్పిన వివరాలతో చిత్రకారుడు బొమ్మ గీస్తాడు. అందరూ పడుకున్నా కాత్యా స్నేహితురాలు కాత్యాతో ఉండిపోతుంది. కాత్యా “మా అబ్బాయి ఎంత భయపడి ఉంటాడో” అని దుఃఖిస్తుంది. “వాళ్ళు బాంబు పేలగానే ప్రాణాలు కోల్పోయారు. వారికి ఏ బాధా కలిగి ఉండదు” అంటుంది ఆమె స్నేహితురాలు. తల్లి మనసు ఎలా ఆలోచిస్తుందో చూడండి. పిల్లవాడు చనిపోయినా అతనికి ఎంత కష్టం కలిగిందో అనే ఆలోచిస్తుంది. దారుణమేమిటంటే అతనికి కష్టమేమీ కలగకుండానే ప్రాణం పోయిందని చెప్పాల్సి రావటం.

పేపర్లలో ‘జైలుకెళ్ళొచ్చిన డ్రగ్ డీలర్ చనిపోయాడు’ అని రాస్తారు. కాత్యాకి కోపంగా ఉంటుంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉంటాయి. ఆమె తల్లి “నూరీ ఎందులోనో ఇరుక్కుని ఉంటాడు, నీకు చెప్పకుండా” అంటుంది. కాత్యా “ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు” అంటుంది. అది తీవ్రవాద చర్య అని రూఢిగా తెలియకపోవటం వల్ల ఏవో కారణాలు ఊహిస్తూ ఉంటారు అందరూ. ‘ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు చంపుతారు?’ అన్నట్టు మాట్లాడతారు. ఏం జరిగినా కారణాలు ఉంటాయి కానీ తీవ్రవాద చర్యకి ద్వేషమే కారణం. ఎంత అమానుషం! మనిషిని మనిషి కేవలం వారి జాతిని బట్టి ద్వేషించటం. కాత్యా నూరీ లాయరు డానిలోని కలిసి మాట్లాడుతుంది. జైలు నుంచి వచ్చాక నూరీ ఎలాంటి చట్టవ్యతిరేకమైన పనులు చేయలేదని డానిలో చెబుతాడు. అలాంటి పనులు చేస్తే తన కుటుంబం ప్రమాదంలో పడుతుందని అతనికి తెలుసని అంటాడు. బాంబు పెట్టిన యువతి తూర్పు యూరప్‌కి చెందినదని అనుమానం అని అంటాడు. తూర్పు యూరప్‌కి పశ్చిమ యూరప్‌కి ఘర్షణలు ఉన్నాయి. అయితే కాత్యా ఆ యువతి మాట్లాడిన తీరుని బట్టి ఆమె జర్మన్ దేశస్థురాలే అని అంటుంది. ఇంతలో ఆమెకి ఒక ఆలోచన వస్తుంది. “నాజీలు చేసి ఉంటారు” అంటుంది. నాజీలంటే కరడు కట్టిన జర్మన్ జాతీయవాదులు. హిట్లర్‌ని ఆరాధిస్తారు. కొన్ని జాతులే ఉన్నతమైనవని నమ్ముతారు. ఇతర జాతుల్ని, మతాల్ని ద్వేషిస్తారు. కాత్యా దుఃఖం నుంచి ఉపశమనానికి డ్రగ్స్ కోరుకుంటుంది. లాయరుని డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. లాయరుకి డ్రగ్స్ ముఠాలతో ఉన్న పరిచయం వల్ల వారు అతనికి చిన్న మొత్తాలలో డ్రగ్స్ ఉచితంగా ఇస్తూ ఉంటారు. కాత్యాకి ఒక చిన్న కవరులో డ్రగ్స్ ఇస్తాడు. పైన చెప్పిన సన్నివేశాలు అన్నిటిలో కాత్యా కళ్ళలో కన్నీటి పొర మాత్రం అలాగే ఉంటుంది.

నూరీ తలిదండ్రులు తాము జర్మనీ విడిచి తుర్కియే వెళ్ళిపోతున్నామని, నూరీ మృతదేహాన్ని, పిల్లవాడి మృతదేహాన్ని తమతో తీసుకువెళ్ళి అక్కడ ఖననం చేస్తామని అంటారు. కాత్యా ఈ మాటతో ఖంగు తింటుంది. ఆందోళన తగ్గించుకోవటానికి లోపలికి వెళ్ళి హెరాయిన్ పీల్చి వస్తుంది. “ఇప్పటికే నావాళ్ళు నాకు దూరమయ్యారు. మళ్ళీ దూరం చేస్తామంటే నేను ఎన్నటికీ ఒప్పుకోను” అంటుంది. తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడ నూరీ తల్లి కాత్యాతో “నువ్వు పిల్లవాణ్ని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుని ఉంటే వాడు ఈరోజు బతికే ఉండేవాడు” అంటుంది. కాత్యాకి భూమి కుంగిపోయినట్టుంటుంది. తర్వాత కాత్యా దగ్గర ఉన్న డ్రగ్స్ గురించి తెలిశాక ఆమె తల్లి “నీ భర్త నిన్ను ఇలా తయారు చేశాడన్నమాట” అంటుంది. కాత్యా కోపంతో ఆమెని “బయటికి పో” అంటుంది. కష్టసమయంలో కుటుంబాలు ఎలా లోలోపలే ఘర్షణ పడతాయో వాస్తవికంగా చూపించారు. ఎవరో ఒకరిని అపరాధిని చేయాలని అందరూ ప్రయత్నిస్తారు. కాత్యా తల్లి కూతురికి అండగా ఉంటే ఆమెకి డ్రగ్స్ వాడే పరిస్థితి వచ్చేది కాదేమో. తల్లి ఎదురు తననీ, తన భర్తనీ దోషులుగా చూస్తుంటే కాత్యా తట్టుకోలేకపోయింది. నూరీ తల్లి కూడా విషమే వెళ్ళగక్కింది. అలా కాత్యా కుటుంబమంతా చెల్లాచెదురైపోతుంది. కుటుంబం అండదండలు లేకపోతే విషమ పరిస్థితుల్లో ఎవరైనా ఎలా నిలదొక్కుకుంటారు? తీవ్రవాదులు ఇలా ఎన్ని కుటుంబాలను నాశనం చేశారో! ఈ రోజుల్లో కష్టకాలంలో కుటుంబసభ్యులకన్నా స్నేహితులే ఎక్కువ ఆసరాగా ఉంటారు. గర్భంతో ఉన్నా ఆమె స్నేహితురాలు ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమెకు అండగా ఉంటుంది.

ఒకరోజు రీట్జ్ సెర్చ్ వారెంట్ తీసుకుని వస్తాడు. అన్ని కోణాల్లో విచారణ చేయాలి కాబట్టి ఇల్లు సోదా చేయిస్తాడు. కాత్యా వాడుతున్న డ్రగ్స్ దొరుకుతాయి. ఆ డ్రగ్స్ తనవే అంటుందామె. అదే నిజం కాబట్టి. ఆమెని స్టేషన్‌కి తీసుకువెళ్ళి విచారిస్తాడు రీట్జ్. అతనికి ఇంకా నూరీ డ్రగ్స్ అమ్ముతాడనే అనుమానం. ఆ లావాదేవీల్లో ఇరుక్కోవటం వల్లే అతన్ని హత్య చేశారని అనుకుంటాడు. ఖరీదైన ఇల్లు ఎలా కొనుక్కున్నారు, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడినవాళ్ళు కొందరు నూరీకి ఎందుకు ఫోన్ చేసేవారు అని అడుగుతాడు. నూరీ తండ్రి అప్పుగా డబ్బు ఇచ్చాడని, నూరీ జర్మన్ భాష రాని వారికి అనువాదకుడిగా పని చేసేవాడని చెబుతుంది. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడినవాళ్ళ కేసుల్లో అతను అనువాదకుడిగా పని చేశాడు. కాత్యా నాజీలే బాంబు పెట్టారని, నూరీ తుర్కియే దేశస్థుడు కావటమే కారణమని అంటుంది. రీట్జ్ మాత్రం మాఫియా వాళ్ళతో ఉన్న సంబంధాలు చెడి వారు ప్రతీకారంగా చంపారని అంటాడు. కాత్యా అసహనంతో విచారణ మధ్యలోనే లేచి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఆమె దగ్గర దొరికిన డ్రగ్స్ చిన్న మొత్తంలో ఉండటం వలన ఆమెని చట్టపరంగా అరెస్టు చేసే అవకాశం లేదు కాబట్టి రీట్జ్ ఆమెని ఆపడు. ఇంట్లో ఆమె మరింత శోకంలో కూరుకుపోతుంది. పోలీసులు తన భర్తనే అనుమానించటం ఆమెకి మింగుడుపడదు. గర్భవతి అయిన స్నేహితురాలి మీద కూడా అసహనం చూపిస్తుంది. స్నేహితురాలు గర్భవతి అనే అసూయ కూడా ఉంటుంది. మనిషి మనస్తత్వమే అంత. నాకింత కష్టమొస్తే అందరూ మామూలుగా ఎలా ఉన్నారు అనుకుంటాడు. సీత జాడ తెలుసుకోలేక రాముడు ప్రపంచాన్నే నాశనం చేసేస్తానన్నాడు. రాముడంటతటి వాడే అలా అంటే ఇక మామూలు మనుషుల సంగతి చెప్పాలా? ఆమె తనని ఒంటరిగా వదిలేయమని  స్నేహితురాలితో అంటుంది. స్నేహితురాలు అయిష్టంగానే తన ఇంటికి వెళ్ళిపోతుంది.

కాత్యా దుఃఖంతో మరింత కుంగిపోతుంది. కొన్నిసార్లు బిగ్గరగా రోదిస్తుంది. ఒకరోజు మణికట్లు కోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆమె ఇంటి నంబరుకి లాయరు డానిలో ఫోన్ చేస్తాడు. ఆమె ఎత్తకపోవటంతో శబ్ద సందేశం (వాయిస్ మెసేజ్) పెడతాడు. కొన్ని ఫోన్ పరికరాల్లో శబ్ద సందేశం ఆటోమాటిక్ గా పైకి వినిపిస్తుంది. అది కాత్యా వింటుంది. డానిలో సందేశమేమిటంటే “నీ అనుమానమే నిజమైంది. నాజీలే చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు” అని. కాత్యా ఆ సందేశం విని మణికట్లకి కట్లు కట్టుకుంటుంది రక్తస్రావం ఆపటానికి. హంతకులకి శిక్ష పడుతుందనే ఒక ఆశ ఆమె ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.

కాత్యాగా డయాన్ క్రూగర్ నటించింది. దుఃఖంలో కళ్ళు ఎర్రగా మారి, ముఖం ఉబ్బిపోవటం సహజంగా ఉంటుంది. దాని కోసం ఆమె గ్లిజరిన్ వాడి ఉండవచ్చు కానీ ఆమె నటనలోని గొప్పతనాన్ని విస్మరించలేం. తన దుఃఖంతో సతమతమవుతూనే చుట్టూ ఉన్నవారి స్వార్థపు ప్రవర్తనతో పెనుగులాడే పాత్రలో ఒదిగిపోయింది. అలాగని ఆమె పాత్రలో లోపాలు లేకుండా స్క్రీన్ ప్లే వ్రాయలేదు. స్నేహితురాల్ని చూసి అసూయపడుతుంది. స్నేహితురాలికి ప్రసవమై ఆమె బిడ్డని తీసుకువచ్చినపుడు ఆ అసూయ ప్రస్ఫుటంగా కనబడుతుంది. డయాన్‌కి కాన్ చిత్రోత్సవంలో ఉత్తమనటి అవార్డు వచ్చింది. ఫతిహ్ అకిన్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించాడు. అతను తుర్కియే దేశస్థుడు. జర్మనీలో తుర్కియే వాళ్ళుండే ప్రదేశంలో జరిగిన బాంబు పేలుడు ప్రేరణతో ఈ కథ రాసుకున్నాడు. ఈ చిత్రానికి ఉత్తమ విదేశీ చిత్రంగా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు వచ్చాయి. తీవ్రవాదం మిగిల్చే విషాదాన్ని ఎంతో ప్రభావవంతంగా చూపించిన చిత్రమిది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

కేసు న్యాయస్థానానికి చేరుతుంది. కోర్టులో బాంబు పెట్టిన యువతిని చూసి కాత్యా వెంటనే గుర్తుపడుతుంది. కాత్యాకి అమెని చూసి ఉద్విగ్నత కలుగుతుంది. ఆ యువతి పేరు ఎడ్డా. ఆమె తన భర్త ఆంద్రేతో కలిసి బాంబు తయారు చేసి నూరీని, పిల్లవాడిని చంపిందని అభియోగం. వాళ్ళ తరఫు లాయరు హాబెర్బెక్. ఐదుగురు జడ్జీలు ఉంటారు. హాబెర్బెక్ న్యాయవిచారణ సమయంలో కోర్టులో కాత్యా ఉండకూడదని, కేవలం సాక్ష్యం చెప్పటానికి మాత్రమే రావాలని జడ్జీలతో అంటాడు. ఆమె విచారణ లోని విషయాలు వింటే తన సాక్ష్యాన్ని మార్చుకునే అవకాశం ఉందని అంటాడు. జడ్జీలు ఒప్పుకోరు. కాత్యా ఈ కేసులో వాది కాబట్టి ఆమె పూర్తి సమయం అక్కడ ఉండొచ్చని అంటారు. చట్టాల్లో ఉన్న విషయాల్ని లాయర్లు ఎలా వక్రీకరిస్తారో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. పాసిక్యూటర్ అభియోగాలని చదువుతాడు. ఫెర్టిలైజర్, డీజిల్, పెద్ద మేకులు కలిపి బాంబు తయారు చేసి పేల్చారని అంటాడు. విచారణ మొదలవుతుంది. కాత్యా తరఫు లాయరుగా డానిలో ఉంటాడు.

మొదట డాక్టర్లు తమ నివేదిక ఇస్తారు. పిల్లవాడికి అయిన తీవ్ర గాయాల గురించి చెబుతారు. కాత్యా వినలేక మౌనంగా కన్నీరు కారుస్తుంది. తట్టుకోలేక బయటికి వెళతానంటుంది. వెళుతూ వెళుతూ ఎడ్డా మీద దాడి చేస్తుంది. కోర్టు రక్షణ సిబ్బంది ఆమెని పట్టుకుంటారు. ప్రధాన జడ్జీ ఆమెని హెచ్చరిస్తాడు. తర్వాత ఆంద్రే తండ్రి జూర్గెన్‌ని సాక్షిగా పిలుస్తారు. ఆంద్రే తన పక్కింట్లో ఉంటాడని, ఇద్దరం మాట్లాడుకోమని, అతను తన గ్యారేజ్ వాడుకుంటాడని, తనకి కారు లేకపోవటంతో తాను అక్కడికి వెళ్ళనని జూర్గెన్ చెబుతాడు. “మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోరు?” అని జడ్జీ అడుగుతాడు. “అతను హిట్లర్‌ని ఆరాధిస్తాడు కాబట్టి” అంటాడు జూర్గెన్. గ్యారేజ్ తాళం బయట ఒక రాయి కింద దాచి ఉంటుందని తనకి తెలుసని అంటాడు. ఒకరోజు తాను రంపం కోసం గ్యారేజ్ లోకి వెళ్ళానని, అక్కడ ఫెర్టిలైజర్, డీజిల్, మేకులు కనపడ్డాయని, ఆంద్రే బాంబు తయారు చేయబోతున్నాడని అనుమానం వచ్చి పోలీసులకి చెప్పానని అంటాడు. పోలీసులు విచారణ చేసి “మీ అబ్బాయి ఇప్పటికే చేసిన నేరం చేయకుండా ఆపాలని మీరు అనుకున్నారు” అన్నారని అంటాడు. మధ్యమధ్యలో ఆంద్రే వంక చూస్తాడు. ఆంద్రే చూపు దించుకుని కఠినంగా ఉంటాడు. హాబెర్బెక్ జూర్గెన్‌ని ప్రశ్నిస్తూ గ్యారేజ్ తాళం దాచిన స్థలం వేరేవారికి తెలిసి ఉండే అవకాశం ఉంది కదా అని అడుగుతాడు. ఉంది అంటాడు జూర్గెన్. హాబెర్బెక్ ఆ విధంగా వేరెవరో గ్యారేజ్‌లో బాంబు తయారు చేసి ఉండొచ్చని అనుమానం కలిగిస్తాడు. డానిలో తెలివిగా జూర్గెన్‌ని “మీరెప్పుడైనా వేరే వాళ్ళు గ్యారేజ్ లోకి వెళ్ళటం చూశారా?” అని అడుగుతాడు. లేదంటాడు జూర్గెన్. తర్వాత జూర్గెన్ జడ్జి అనుమతి తీసుకుని కాత్యాకి సంతాపం తెలియజేస్తాడు. తన కొడుకు చేసినది పిరికి చర్య అంటాడు. కోర్టు బయట కాత్యా జూర్గెన్ దగ్గరకి వెళ్ళి మాట్లాడుతుంది. “మీ అబ్బాయే నేరం చేశాడని తెలిస్తే మీరు పోలీసుల దగ్గరకి వెళ్ళేవారా?” అని అడుగుతుంది. “తెలిసే పోలీసులకి చెప్పాను” అంటాడతను! ఇలాంటి వారు ఉండబట్టే కాస్తైనా ధర్మం నిలబడుతోంది. మమకారంతో కొడుకుని కాపాడే కన్నా తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి శిక్ష పడాలని అనుకున్నాడు. ఎంత మంది ఇలా ఉంటారు?

బాంబు పేలిన రోజు ఆంద్రే, ఎడ్డా గ్రీస్‌లో విహారయాత్రలో ఉన్నారని అక్కడి హోటల్ యజమానితో సాక్ష్యం చెప్పిస్తాడు హాబెర్బెక్. హోటల్ యజమాని రెజిస్టర్ చూపిస్తాడు. అందులో ఆంద్రే ఇంటిపేరు నమోదు అయి ఉంటుంది కానీ చిన్న అక్షరాలతో ఇరికించినట్టు ఉంటుంది. డానిలో అది అబద్ధపు నమోదు అని అంటాడు. తర్వాత డానిలో సోషల్ మీడియాలో ఒక ఫోటో చూపిస్తాడు. అందులో హోటల్ యజమాని ఒక నాజీ పార్టీ జెండా పట్టుకుని ఉంటాడు. ఆ ఫోటోని ఆంద్రే, ఎడ్డా లైక్ చేశారని చూపిస్తాడు. అంటే హోటల్ యజమానితో వాళ్ళకి వేరే పరిచయం కూడా ఉంది. తర్వాత కాత్యాని సాక్ష్యం చెప్పటానికి పిలుస్తారు. ఆమె డ్రగ్స్ వాడుతుందని, ఆమె బాంబు పేలిన రోజు కూడా డ్రగ్స్ తీసుకుని ఉంటుందని, కాబట్టి ఆమె సాక్ష్యాన్ని నమ్మలేమని హాబెర్బెక్ వాదిస్తాడు. ఆమె కేవలం దుఃఖం నుంచి ఉపశమనానికి డ్రగ్స్ తీసుకుందని డానిలో అంటాడు. అన్ని సాక్ష్యాలు పరిశీలిస్తే ఆంద్రే, ఎడ్డాలే బాంబు దాడి చేశారని రుజువవుతోందని చెప్పి ముగిస్తాడు. కాత్యా జరుగుతన్నదంతా చూసి కోపం, బాధతో వణికిపోతూ ఉంటుంది. చివరికి జడ్జీలు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తారు! సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత వారు నేరం చేశారా లేదా అనేది సందిగ్ధంగా ఉందని అందుకే వారికి నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని అంటారు. కాత్యా నిశ్చేష్టురాలై ఉండిపోతుంది.

దుఃఖం నుంచి ఉపశమనం కోసం కాత్యా డ్రగ్స్ వాడితే ఆమె బాంబు పేలిన రోజు కూడా డ్రగ్స్ వాడిందని అనుమానం పుట్టిస్తాడు హాబెర్బెక్. గ్యారేజ్ లోకి వేరే వ్యక్తి ప్రవేశించి ఉండొచ్చు అని కూడా అంటాడు. పైగా నిందితులు బాంబు పేలిన రోజు దేశం లోనే లేరని సాక్ష్యం చెప్పిస్తాడు. ఇవన్నీ సందిగ్ధతని కలిగిస్తాయి. జడ్జీలు ఏ సందిగ్ధతా లేకపోతేనే నిందితుల్ని దోషులుగా నిర్ధారిస్తారు. వారి తప్పు లేదు. తప్పు అవినీతిపరులైన లాయర్లది. హాబెర్బెక్ కూడా నాజీ అయి ఉండే అవకాశం మెండుగా ఉంది. అంతా ఒక ముఠాలా మారి బయటపడ్డారు. అంద్రే తండ్రి ధర్మపరాయణత్వం కూడా వృథా అయిపోయింది. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తుంది. ప్రాసిక్యూషన్ వారు గ్రీస్‌కి వెళ్ళి విచారణ చేస్తే నిందితులు ఆ సమయంలో గ్రీస్‌లో లేరని కనిపెట్టేవారు. ఎందుకు చేయలేదు? చిత్రంలో ప్రస్తావించలేదు కానీ సాధారణంగా నిధులు లేవని సాకు చెబుతారు. ఇదే విషాదం. పోలీసులు నిధులు లేవంటారు. తీవ్రవాదులకి నిధులు ఇచ్చే ఉన్మాదులు మాత్రం కోకొల్లలు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఆంద్రే, ఎడ్డా కేసు నుంచి బయటపడ్డాక గ్రీస్‌లో విహారయాత్రకి వెళతారు. సాక్ష్యం చెప్పిన హోటల్ యజమానే వారికి ఆతిథ్యం ఇస్తాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా కాత్యాకి తెలుస్తుంది. ఆమె గ్రీస్‌కి వెళుతుంది. హోటల్ యజమాని బయటకి వెళ్ళిన తర్వాత ఆమె హోటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న హోటల్ రెసెప్షనిస్ట్‌తో జర్మనీ నుంచి వచ్చిన తన స్నేహితుల కోసం వచ్చానని అంటుంది. సోషల్ మీడియాలో ఆంద్రే, ఎడ్డా ఫోటోలు కూడా చూపిస్తుంది. రెసెప్షనిస్ట్ ముఖంలో రంగులు మారతాయి. అయినా వారు తనకు తెలియదని అంటుంది. కాత్యాకి తాను తప్పు చేశానని అర్థమవుతుంది. అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని బయటికి వస్తుంది. రెసెప్షనిస్ట్ యజమానికి ఫోన్ చేసి చెబుతుంది. అతను హడావిడిగా వస్తాడు. కాత్యా మీద దాడి చేయబోతాడు. ఆమె తన కారులో తప్పించుకుంటుంది. తర్వాత ఆమె హోటల్ యజమానిని వెంబడిస్తుంది. అతను ఒక బీచ్ దగ్గరకి వెళతాడు. కాత్యా పొదల చాటు నుంచి చూస్తుంది. అక్కడ ఆంద్రే, ఎడ్డా ఒక ఆర్వీ (అన్ని సదుపాయాలున్న చిన్న బస్సు) లో బస చేసి ఉంటారు. హోటల్ యజమాని వారిని కాత్యా గురించి హెచ్చరించి వెళ్ళిపోతాడు.

కాత్యా అక్కడి నుంచి వచ్చేసి బాంబు తయారు చేయటానికి కావాల్సిన పదార్థాలు కొని బాంబు తయారు చేస్తుంది. మర్నాడు ఉదయాన్నే బీచ్‌కి వెళుతుంది. ఆంద్రే, ఎడ్డా వ్యాయామం చేయటానికి బీచ్ మీద పరిగెడుతూ దూరం వెళ్ళగానే ఆమె బాంబుని ఆర్వీ కింద పెడుతుంది. బాంబు రిమోట్ ఆమె దగ్గర ఉంటుంది. పొదల చాటున ఉండి వారు తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చంపాలనుకోవటం వేరు, నిజంగా చంపటం వేరు. ఆమె ఆలోచనలో పడుతుంది. ఆమె ముఖం చూసి ఆమె ఏమనుకుంటోందో మనం ఊహించాల్సిందే. నాకైతే ఆమె వారిని చంపిన తర్వాత తన జీవితం ఏంటి అని ఆలోచించింది అనిపించింది. తన బాధ తీరుతుందా? తీరదు. మరి ఏం లాభం? ఆమె వెళ్ళి బాంబుని తిరిగి తెచ్చేస్తుంది.

ఆమె భర్త, కొడుకు చనిపోయినప్పటి నుంచి ఆమెకి రుతుస్రావం కాలేదని ఆమె కోర్టు కేసు నడుస్తున్న సమయంలో తన స్నేహితురాలికి చెబుతుంది. అంటే ఆమె దుఃఖం ఆమె శరీరాన్ని కూడా ప్రభావితం చేసింది. బాంబు పేల్చకూడదని నిశ్చయించుకున్న తర్వాత ఆమెకి రుతుస్రావం అవుతుంది. ఆమె శరీరం సాధారణ స్థితికి వచ్చింది. మరి మనసు సంగతేమిటి? డానిలో ఆమెకి ఫోన్ చేస్తాడు. ఆమె గ్రీస్ వచ్చిన తర్వాత అతను చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ ఆమె ఎత్తలేదు. ఇప్పుడు ఫోన్ ఎత్తుతుంది. డానిలోకి ఆమె గ్రీస్ వెళ్ళినట్టు తెలియదు. “పై కోర్టులో అప్పీలు చేయటానికి రేపే ఆఖరి రోజు. వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడటం ఖాయం” అంటాడు. “నాకు అప్పీలు చేయటం ఇష్టం లేదు” అంటుంది. అతను ఆమెని ఒప్పిస్తాడు. మర్నాడు తన ఆఫీసుకి రమ్మంటాడు. ఆమె సరేనంటుంది. మర్నాడు ఉదయం బీచ్ దగ్గరకి వెళ్ళి ఆంద్రే, ఎడ్డా వ్యాయామం చేసి తిరిగి వచ్చేవరకు ఉండి వారు ఆర్వీలోకి వెళ్ళగానే ఆమె బాంబు తగిలించుకుని ఆర్వీ లోకి వెళుతుంది. బాంబు పేల్చేస్తుంది. ముగ్గురూ మరణిస్తారు.

కాత్యాకి కోర్టు చుట్టూ తిరగటం ఇష్టం లేదు. మళ్ళీ నిరాశ ఎదురు కావచ్చు. దోషుల్ని చంపితే ఆమె దుఃఖం తీరదు. వారిని చంపకుండా వదలటం కూడా ఆమెకి ఇష్టం లేదు. అందుకే సూసైడ్ బాంబర్ లాగా వెళ్ళి వాళ్ళని చంపి తను కూడా ప్రాణాలు తీసుకుంది. న్యాయవ్యవస్థ సరిగా పనిచేయక ఎంతమంది క్షోభ పడుతున్నారో! తీవ్రవాదం ప్రస్తుత కాలంలో ఒక మహమ్మారిలా తయారయింది. ప్రపంచ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే తీవ్రవాద ముఠాలని అణచివేయవచ్చు. కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రవాదాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. నూరీ మీద నిఘా పెట్టి అతను డ్రగ్స్ అమ్ముతున్నవారితో అప్పుడప్పుడూ మాట్లాడుతుంటాడని (వారి కేసుల్లో సాయం చేయటానికి) తెలుసుకున్న పోలీసులు నాజీ ముఠాలపై నిఘా పెట్టలేరా? ఏమన్నా అంటే నిధులు లేవంటారు. అసలు విషయం చిత్తశుద్ధి లోపం. కాత్యా లాంటి సామాన్య పౌరుల జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోతున్నాయి. భారతదేశంలో తీవ్రవాదుల దాడులు తగ్గటం ముదావహం. ప్రభుత్వం తలచుకుంటే సాధ్యమే అనటానికి ఇది ఉదాహరణ. ఇదే ప్రపంచానికి ఆదర్శం కావాలి.

Exit mobile version