మరుగునపడ్డ మాణిక్యాలు – 6: ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పజామాస్

2
2

[dropcap]చి[/dropcap]న్నపిల్లల దృక్కోణం చూపించే చిత్రాలు ఈ ప్రపంచంలోని అకృత్యాలు ఎంత హేయమైనవో తెలిసేలా చేస్తాయి. ఉదాహరణకి దీపా మెహతా తీసిన ‘ఎర్త్’. ‘ఐస్ క్యాండీ మ్యాన్’ అనే నవల ఆధారంగా తీసిన చిత్రమది. ఇందులో దేశవిభజన సమయంలోని పరిణామాలని ఒక చిన్న పార్శీ అమ్మాయి దృక్కోణంలో చూపించారు. ఆమె తలిదండ్రులు బ్రిటిష్ పద్ధతులు పాటిస్తుంటారు. ఆమె ఆయా హిందువు. ఆమెకి ఐస్ క్యాండీ (పుల్ల ఐసు) తెచ్చిపెట్టే అతను ముస్లిం. అంతవరకు కలిసిమెలిసి ఉన్న హిందువులు, ముస్లిములు, సిక్కులు ఎందుకు ఒకరంటే ఒకరు ద్వేషం చూపిస్తున్నారో ఆ అమ్మాయికి అర్థం కాదు. ఒకర్నొకరు చంపుకునే దాకా వెళతారు. ఇందులో స్వార్థాలు కూడా ఉంటాయి. పసి హృదయాలకు ఇవన్నీ అర్థం కావు.

అలాంటి చిత్రమే ‘ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పజామాస్’ (2008). నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యూదులను ఊచకోతకు గురి చేశాడు. అలాంటి పరిస్థితులలో పిల్లల అనుభవాలు ఎలా ఉన్నాయో ఈ చిత్రం చూపిస్తుంది. ఇలాంటి కథలతోనే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ (1998 – ఇటాలియన్), ‘జో జో ర్యాబిట్’ (2019 – ఆంగ్లం) చిత్రాలు వచ్చాయి. అయితే ఆ చిత్రాలకు వచ్చినంత పేరు ‘ద బాయ్…’ కి రాలేదు. దానికి ఎన్నో కారణాలు. సరైన ప్రచారం లేకపోతే మంచి చిత్రాలు మరుగున పడిపోతాయి. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

కథలోకి వెళితే రెండో ప్రపంచయుద్ధ సమయంలో రాల్ఫ్ హిట్లర్ సైన్యంలో పనిచేస్తుంటాడు. అతని భార్య ఎల్సా, కూతురు గ్రెటెల్, కొడుకు బ్రూనో. బ్రూనో ఎనిమిదేళ్ళ వాడు. తోటి పిల్లలతో విమానాల ఆట, తుపాకీల ఆట ఆడుకుంటూ ఉంటాడు. యుద్ధమంటే వారికి ఒక ఆట. రాల్ఫ్‌కి పదోన్నతి వస్తుంది. అతను యూదులను బంధించి ఉంచిన ఒక జైలుకి అధికారిగా వెళతాడు. ఆ జైలు జర్మనీ ఆక్రమించుకున్న పోలండ్‌లో ఉంటుంది. అతని కుటుంబం అతనితో వెళుతుంది. జైలుకి కాస్త దూరంలో పెద్దగా జనాభా లేని ప్రదేశంలో ఒక ఇంట్లో ఉంటారు. మొదటి రోజు బ్ర్రూనో పై అంతస్తులోని కిటికీ లోంచి చూస్తే దూరంగా ఖైదీలు జైలు అవరణలో పనులు చేసుకుంటూ కనపడతారు. అదొక ఫార్మ్ (వ్యవసాయ క్షేత్రం) అని అనుకుంటాడు. అక్కడున్న పిల్లలతో ఆడుకుంటానంటాడు. ఎల్సా అతనికి సర్దిచెబుతుంది. ఇంటి ఆవరణలోనే ఆడుకోమని, వెనక వైపుకి వెళ్ళొద్దని అంటుంది. రాల్ఫ్ ఆమెకి జైలు చాలా దూరమని చెప్పి ఆ ఇంటికి తీసుకువచ్చాడు. అయితే ఒక ఖైదీ వారి ఇంట్లో పనివాడుగా ఉంటాడు. ఆమెకి అది నచ్చదు. అయినా సర్దుకుపోతుంది. రాల్ఫ్ తల్లికి కూడా అతను హిట్లర్ సైన్యంలో పనిచేయటం ఇష్టముండదు. తండ్రి మాత్రం అతను జాతి నిర్మాణకార్యం చేస్తున్నాడని ప్రోత్సహిస్తాడు.

ఫార్మ్‌లో ఉన్న వారు, తమ ఇంట్లో పనివాడు ఒకే రకం పజామాలు వేసుకోవటం బ్రూనో గమనిస్తాడు. వాటి మీద వెడల్పాటి చారలు (స్ట్రైప్స్) ఉంటాయి. పజామాలంటే రాత్రి పడుకునేటపుడు వేసుకునే వదులు దుస్తులు. బ్రూనోకి తెలియనిదేమిటంటే అవి ఖైదీ దుస్తులు. వాటి మీద ఖైదీ సంఖ్యలు కూడా ఉంటాయి. తమ ఇంట్లో పనిచేసే ఖైదీ డాక్టరని తెలుస్తుంది బ్రూనోకి. “అబద్ధం. నువ్వు దుంపలు మీద తొక్కలు తీస్తావు కదా” అంటాడు బ్రూనో. డాక్టరైన యూదు వ్యక్తిని బందీని చేసింది సైన్యం. ఏ వృత్తిలో ఉన్నా యూదులంటే దేశద్రోహులనే అపోహను ప్రచారం చేస్తుంటారు. బ్రూనోకి, అతని అక్క గ్రెటెల్‌కి ఒక అధ్యాపకుడు ఇంటికి వచ్చి సమకాలీన చరిత్ర అంటూ ఈ అపోహలనే బోధిస్తుంటాడు. మంచి యూదులు కూడా ఉంటారు కదా అని బ్రూనో అంటే ఆ అధ్యాపకుడు మంచి యూదు అనేవాడు అంజనం వేసి వెతికినా కనపడడని అంటాడు. పన్నెండేళ్ళ గ్రెటెల్‌కి యూదుల మీద ద్వేషం పెరుగుతుంది. తర్వాత తమ్ముడికి ఆ ద్వేషమంతా నూరిపోస్తుంది.

ఆడుకోవటానికి ఎవరూ లేక ఉబుసుపోక సతమతమౌతుంటాడు బ్రూనో. ఒకరోజు ఇంటి వెనక ఉన్న షెడ్ కిటికీ లోంచి బయటకి వెళ్ళి ఆడుకుంటూ జైలు ఆవరణ సరిహద్దు వరకు వెళతాడు. అక్కడ ఇనప తీగలతో వేసిన కంచె ఉంటుంది. అది ఒక ఫార్మ్ అనే బ్రూనో భావన. అవతలి వైపు ఒక ఎనిమిదేళ్ళ అబ్బాయి కూర్చుని ఉంటాడు. ఖైదీ దుస్తులు వేసుకుని ఉంటాడు. చిన్నపిల్లలని కూడా బంధించిన హిట్లర్ ఎంతటి కర్కోటకుడో అనిపిస్తుంది. మొత్తం యూదు జాతినే నామరూపాలు లేకుండా చేయాలని అతని పథకం. ఆ పిల్లవాడి పేరు ష్మూల్. “అదేం పేరు? నేనెప్పుడూ వినలేదు” అంటాడు బ్రూనో. “బ్రూనో అనే పేరు కూడా నేనెప్పుడూ వినలేదు” అంటాడు ష్మూల్. పసితనపు ఆకతాయితనం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. తామొక గుడిసె కడుతున్నామని, ఇతర బాలలు తనని ఏడిపిస్తుంటే అక్కడ కూర్చున్నానని చెబుతాడు ష్మూల్. “నువ్వు ఇతర బాలలతో ఆడుకుంటుంటే నేను ఇక్కడ ఉబుసుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను” అంటాడు బ్రూనో. “ఆటలా పాడా?” అంటాడు ష్మూల్. “మరి మీ చొక్కాల మీద ఆ సంఖ్యలేమిటి? ఏదో ఆటే కదా!” అంటాడు బ్రూనో. తన చొక్కా మీద సంఖ్యలెందుకు ఉన్నాయో కూడా తెలియని వయసు ష్మూల్‌ది. తన తండ్రి కూడా అక్కడే ఉన్నాడని, అతను గడియారాలు తయారు చేసేవాడని, ఇప్పుడు బూట్లు కుడుతున్నాడని అంటాడు. “ఈ పెద్దవాళ్ళకి ఏ పని చేయాలో నిర్ణయించుకునే బుద్ధి లేదు. మా ఇంట్లో పనివాడు డాక్టరట. ఇప్పుడు దుంపల మీద తొక్కలు తీస్తున్నాడు” అంటాడు బ్రూనో. పసిపిల్లల అమాయకపు మాటల్లో అమానుషమైన అకృత్యాలు ఎలా వ్యక్తమౌతాయో తలచుకుని నవ్వు, నిట్టూర్పు ఒకేసారి వస్తాయి. బ్రూనో, ష్మూల్ రోజూ మాట్లాడుకుంటూ ఉంటారు. ష్మూల్‌కి తినుబండారాలు ఇస్తాడు బ్రూనో. మా ఇంటికి రావచ్చు కదా అని బ్రూనో అంటే మేము బయటకి వెళ్ళకూడదు అంటాడు ష్మూల్. అదేమిటి అంటే “నేను యూదుని కదా” అంటాడు. బ్రూనోకి కొంచెం అర్థమైనట్టు ఉంటుంది.

ఇంతలో ఎల్సాకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అది జైలు మాత్రమే కాదు, ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ అని. అప్పుడే మనకు అర్థమవుతుంది అది ఎంతో అపఖ్యాతి మూటగట్టుకున్న ఆష్విట్జ్ క్యాంప్ అని. అక్కడ విషవాయువులతో ఖైదీలని చంపేసి మూకుమ్మడిగా దహనం చేస్తూ ఉంటారు. ఎల్సా రాల్ఫ్‌ని నిలదీస్తుంది. ఈ రహస్యం ఎవరికీ చెప్పనని తాను ప్రమాణం చేశానంటాడు రాల్ఫ్. అతను చేసేది ఘోరమని రోదిస్తుంది ఎల్సా. జాతి క్షేమం కోసం అది తప్పదని అంటాడు రాల్ఫ్. బ్ర్రూనోకి ఇవేవీ తెలియకపోయినా యూదులని ద్వేషించాలని అందరూ అనటం, తనకున్న ఒక్క స్నేహితుడూ యూదు కావటంతో ఏమీ అర్థం కాక అయోమయంలో ఉంటాడు. తల్లి ఏడుస్తూ ఉండటం గమనిస్తాడు. ఏ పసివాడికీ ఎదురుకాకూడనని పరిస్థితులివి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే రాల్ఫ్ అంత క్రూరంగా ఉండటం అసమంజసంగా అనిపిస్తుంది. అతను మనస్ఫూర్తిగానే తన ఉద్యోగం చేస్తున్నాడా? ప్రభుత్వానికి భయపడి చేస్తున్నాడా? కాదంటే మరణమే. దేశం విడిచిపోదామంటే అది ఎంతో ప్రమాదకరం. నేను కాకపోతే నా ఉద్యోగం ఎవరో ఒకరు చేస్తారు, కాబట్టి నేనే ఎందుకు చేయకూడదు అనుకుని ఉండవచ్చు. పాలకులు రాక్షసులైతే కొందరు మంచివాళ్ళు కూడా చెడుగా మారిపోతారు. పైగా రాల్ఫ్ తండ్రి హిట్లర్‌ని సమర్ధిస్తాడు. “నేను యూదుని కదా. బయటకు వెళ్ళకూడదు” అన్న ష్మూల్‌కి అసలేం జరుగుతోందో తెలియదు. యూదు అయితే స్వతంత్రం ఉండదా అని అడిగే వయసు కాదు అతడిది.

ఒక ఉపకథలో కోట్లర్ అనే సైనికుడు రాల్ఫ్‌కి సహాయకుడిగా ఉంటాడు. అతను నోరుజారటం వల్లే ఎల్సాకి నిజం తెలుస్తుంది. రాల్ఫ్ తండ్రి చుట్టపు చూపుగా వస్తాడు. పిల్లలకి నానమ్మ ఆరోగ్యం బాగాలేక రాలేదని చెబుతాడు. నిజానికి ఆమెకి తన కొడుకు చేసే ఉద్యోగం అసలు నచ్చదు. దేశం పేరు చెప్పి అమాయకుల్ని హత్య చేస్తున్నారని ఆమె ఆవేదన. అందుకే ఆమె రాలేదు. భోజనాల దగ్గర ఎల్సా ముభావంగా ఉంటుంది. భోజనానికి కోట్లర్‌ని కూడా ఆహ్వానిస్తాడు రాల్ఫ్. పిల్లలు కూడా ఉంటారు. మాటల్లో కోట్లర్ తండ్రి స్విట్జర్లాండ్‌లో ఉంటున్నాడని తెలుస్తుంది. అతను హిట్లర్ విధానాలు నచ్చక వెళ్ళిపోయాడా అని అడుగుతాడు రాల్ఫ్. అలాగైతే ప్రభుత్వానికి తెలియజేయాలనే నిబంధన ఉంది కదా అంటాడు. తర్వాత కోట్లర్ తన తండ్రి విషయం ప్రభుత్వానికి చెప్పలేదనే కారణంతో అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు రాల్ఫ్. కానీ ఎల్సాకి రహస్యం అతని వల్లే తెలిసిందనే ఉక్రోషంతో అతన్ని తొలగించాడు. మనసులో అపరాధభావం ఉన్నపుడు ఎవరో ఒకరిని బలిపశువుని చేసే మనస్తత్వం చాలామందిలో ఉంటుంది. అదే ఇక్కడ పనిచేసింది.

“మీ అమ్మకి కూడా హిట్లర్ విధానాలు నచ్చవు కదా. ఆమె గురించి ప్రభుత్వానికి చెప్పక్కరలేదా?” అని రాల్ఫ్‌ని అడుగుతుంది ఎల్సా. ఆడవారికి ఆ నిబంధన వర్తించదా అని ప్రశ్నిస్తుంది. రాల్ఫ్ దగ్గర సమాధానం ఉండదు. ఇంకా హేయమైన విషయమేమిటంటే బయటి ప్రపంచానికి క్యాంపులో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని చూపిస్తూ ఒక డాక్యుమెంటరీ చిత్రం రూపొందిస్తాడు. ఆత్మవంచన చేసుకుంటూ ఉద్యోగం చేస్తుంటాడు. సామాన్య ప్రజల్ని చంపే హక్కు హిట్లర్‌కి ఎవరిచ్చారు? అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. తనని వ్యతిరేకించినవారిని నిర్బంధించాడు. గతిలేక అతన్ని అనుసరించిన ఒక తరం జర్మనీ పౌరులెందెరో అపరాధభావంతో కుమిలిపోయేలా చేశాడు. ప్రపంచచరిత్ర మీదే నల్లమచ్చగా నిలిచిపోయాడు.

ఎందరో యూదులు చనిపోయినపుడు రాల్ఫ్, ఎల్సాల మీద సానుభూతి చూపించటమేమిటి అని కొందరు అడగవచ్చు. యూదులకి జరిగింది ఘోర అన్యాయమే. అది కాదనలేని నిజం. వారి గురించి చాలా చిత్రాలు వచ్చాయి. అయితే హిట్లర్ సైన్యంలో ఉన్నవారు ఏ పరిస్థితుల్లో ఆ దుర్మార్గాలు చేయవలసి వచ్చిందో చూపించే చిత్రం ఇది. హిట్లర్ సైన్యంలో కొందరు రాక్షసులు ఉన్నమాట నిజం. కానీ అందరూ అలాంటివారు కాదు. వారికి కూడా అన్యాయాలు జరిగాయి.

బ్రూనోగా ఏసా బటర్ఫీల్డ్ నటించాడు. చిన్నవయసులోనే అతను కనబరిచిన నటన అత్యద్భుతం. ఒక సందర్భంలో తాను చేసిన తప్పుకి ఏడుస్తాడు. అలా ఏడుస్తూ నటించటం చిన్నపిల్లలకి చాలా కష్టం. ఏసాని, దర్శకుడు మార్క్ హెర్మన్‌ని అభినందించకుండా ఉండలేం. జాన్ బోయెన్ వ్రాసిన నవల ఆధారంగా మార్క్ స్వయంగా స్క్రీన్ ప్లే వ్రాశాడు. ఎల్సాగా వేరా ఫార్మిగా నటించింది. తాను నమ్మిన సిద్ధాంతాలకు, తన భర్త చేసే పనులకు పొంతన కుదరక తన పిల్లలకు నిజం చెప్పుకోలేక తల్లడిల్లే పాత్రలో చక్కగా నటించింది. ఈ చిత్రానికి సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణ. ‘టైటానిక్’ చిత్రానికి ఆస్కార్ గెలుచుకున్న జేమ్స్ హోర్నర్ అందించిన సంగీతం చిన్నపిల్లల సరదాలను, పెద్దవారి సంఘర్షణలను ప్రభావవంతంగా పలికిస్తుంది. అయితే చిత్రంలో ఒక అంశం నాకు కొంచెం అసంబద్ధంగా అనిపించింది. క్యాంపు సరిహద్దులలో ఉన్న ఇనప తీగల కంచెలో విద్యుత్తు ప్రసారం జరుగుతుందని మొదట్లో చూపిస్తారు. కానీ తర్వాత ఒక పాత్ర కంచె దాటే సమయంలో విద్యుత్తు లేదా అనే అనుమానం వస్తుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఒకరోజు బ్రూనోకి తన ఇంట్లో గ్లాసులు తుడుస్తూ ష్మూల్ కనపడతాడు. సన్నని గ్లాసులు తుడవటానికి చిన్న చేతులు కావాలని అతన్ని ఆ పనిలో పెడతాడు కోట్లర్. ఇది కోట్లర్‌ని ఉద్యోగం నుంచి తీయకముందు జరిగిన సంఘటన. ష్మూల్‌ని చూసిన బ్రూనో ఇంట్లో జరిగిన పరిణామాలతో “నువ్వు నేను స్నేహితులుగా ఉండకూడదట. మనం శత్రువులమట” అంటాడు. ష్మూల్ ఏం మాట్లాడడు. అక్కడే కొన్ని బిస్కెట్లు, చిన్న కేకులు ఉంటాయి. ఏమన్నా తింటావా అంటే ఆత్రంగా తలూపుతాడు ష్మూల్. అతనికో కేకు ఇస్తాడు బ్రూనో. అతను తింటుంటే “మీ నాన్న మంచివాడేనా?” అని అడుగుతాడు బ్రూనో. అవునంటాడు ష్మూల్. “నీకెప్పుడూ మీ నాన్న మంచివాడు కాదేమో అని అనిపించలేదా?” అంటాడు బ్రూనో. ఆ పసి హృదయంలో ఎంత సంఘర్షణ ఉందో అర్థమై మన మనసు ఆర్ద్రమవుతుంది. ఇంతలో కోట్లర్ వస్తాడు. “ఇంట్లో వారితో మాట్లాడటానికి నీకెంత ధైర్యం?” అని ష్మూల్‌ని గద్దిస్తాడు. ష్మూల్ ఎదో తింటున్నాడని గమనించి “తిండి దొంగిలించావా?” అని అతని మీద అరుస్తాడు. ష్మూల్ భయంతో వణికిపోతాడు. బ్రూనో కొయ్యబారిపోతాడు. “బ్రూనో నా మిత్రుడు. అతనే ఇచ్చాడు” అంటాడు ష్మూల్. బ్రూనోని అడిగితే “నేనొచ్చేసరికే తింటున్నాడు. నేనితన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు” అంటాడు బ్రూనో. తానేదో తప్పు చేశానని అనుకుని అబద్ధమాడుతాడు బ్రూనో. ఇలాంటి సంఘటనలు పిల్లలపై ఎంత ప్రభావం చూపుతాయో వేరే చెప్పక్కరలేదు. నిష్కల్మషమైన వారి మనసులలో అందరి మీదా ప్రేమ ఉంటుంది. పెద్దల ప్రభావంతో వారిని అనుసరించటానికి ప్రయత్నిస్తారు. పెద్దలు మంచివారైతే పరవాలేదు. కానీ వారు జాత్యహంకారం కలవారైతే పిల్లలు ఆ పోకడలను అలవాటు చేసుకుంటారు. కానీ బ్రూనో సున్నితమనస్కుడు. తాను చేసిన పనికి కుమిలిపోతాడు. ఇక్కడ ఏసా నటన పతాకస్థాయికి చేరుకుంటుంది. తర్వాత కొన్ని రోజులు ష్మూల్ కంచె దగ్గర కనపడడు. చివరికి ఒకరోజు కనపడతాడు. “నేనెందుకు అలా చెప్పానో నాకు తెలియదు. మా అక్క యూదుల గురించి ఏవేవో చెబుతూ ఉంటుంది. ఆరోజు ఆ సైనికుడిని చూస్తే నాకు చాలా భయం వేసింది” అంటాడు బ్రూనో. ష్మూల్ ఏమీ మాట్లాడడు. “ఇన్నాళ్ళూ నువ్వు కనపడకపోయేసరికి మన స్నేహం ముగిసిపోయిందనుకున్నాను. మనం ఇంకా స్నేహితులమే కదా?” అంటాడు బ్రూనో. అవునని తలూపుతాడు ష్మూల్. అతని మనసులో ఎన్ని గాయాలున్నాయో తలచుకుని మనకు కన్నీరు వస్తుంది.

ఈ చిత్రం ముగింపు ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తుంది. ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. కొందరు దీన్ని డిప్రెసింగ్ మూవీ అంటారు. మంచి సినిమాలు చివరికి భావోద్వేగాలు కలిగించినంత మాత్రాన డిప్రెసింగ్ కావు. కథ, కథనం సరిగా లేని సినిమాలే డిప్రెసింగ్ సినిమాలు. అయితే ‘ద బాయ్…’ కాలక్షేపం సినిమా కాదు. కాలక్షేపం కావాలంటే వేరే సినిమా చూడటం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here