[సంచిక పాఠకుల కోసం ‘ఫ్యాన్ గర్ల్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
‘ఫ్యాన్ గర్ల్’ అంటే ఆడ అభిమాని. పేరు వింటే ఇదేదో సరదా చిత్రం అనిపించవచ్చు. కానే కాదు. కలల ప్రపంచంలో విహరించే అమ్మాయికి ప్రపంచం పోకడ ఎలా ఉంటుందో తెలిసి ఆమె ఏం చేసిందనేది కథ. ముందే హెచ్చరిస్తున్నాను, కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా, మనసును కలచివేసేలా ఉంటాయి. విషాదం నిండినా కథాకథనాలు బావున్న చిత్రాలు చూసినపుడు ఎందుకు చూశానా అని అనుకోం కదా. అలాగే ఈ చిత్రం ఇబ్బందికరంగా ఉన్నా ఎందుకు చూశానా అనిపించదు. కానీ కాస్త భిన్నంగా తీసి ఉంటే టీనేజ్ అమ్మాయిలు కూడా చూసి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉండేది. ఇలా తీయటంలోనే ఈ చిత్రం ఉద్దేశం ఉందేమో. ఇది పెద్దవారికి ఒక చెంపపెట్టు లాంటి సినిమా. ఈ ఫిలిపీన్స్ దేశపు చిత్రం 2020లో విడుదలయింది. టోక్యో చిత్రోత్సవంలో ప్రదర్శితమయింది. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. ఇప్పటికే అర్థమై ఉంటుంది కానీ మళ్ళీ చెబుతాను; ఈ చిత్రం పెద్దలకు మాత్రమే.
జేన్ పదహారేళ్ళ అమ్మాయి. ఫిలిపీన్స్‌లో ఉంటుంది. పౌలో అనే నటుడంటే ఆమెకి వెర్రి అభిమానం. అతని ప్రియురాలు బెయా అనే నటి. ఒక చిత్రం ప్రచారం కోసం ఇద్దరూ ఒక మాల్‌కి వస్తారు. జేన్ స్కూల్ ఎగ్గొట్టి అక్కడికి వెళుతుంది. అక్కడ అందరూ యువతీయువకులే. వెర్రికేకలు వేస్తూ ఉంటారు. పౌలో పాట పాడతాడు. మధ్యలో జేన్ వైపు చూసి కన్ను గీటుతాడు. ఆమెకి ఒళ్ళు తెలియని ఆనందం కలుగుతుంది. పౌలో అలా కన్ను గీటడం వెనక ఆంతర్యమేమీ లేదు. జేన్ స్థానంలో వేరే అమ్మాయి ఉన్నా అదే పని చేసేవాడు. జేన్ మాత్రం ఊహల్లో తేలిపోతుంది. బయటకి వచ్చాక పౌలోకి చెందిన టెంపో లాంటి చిన్న ట్రక్కు వెనకాల ఉన్న ప్లాస్టిక్ షీట్ కింద దాక్కుంటుంది. పౌలో ఒక్కడే ట్రక్కు నడుపుకుంటూ బయలుదేరుతాడు. ఇది కొంచెం అసంబద్ధంగా ఉన్నా కథ ముందుకు సాగాలంటే ఇలాంటిదేదో జరగాలి.
పౌలో పెద్ద అందగాడేమీ కాదు. కండలు తిరిగిన శరీరమూ కాదు. మరి జేన్‌కి ఎలా నచ్చాడు? ప్రేమ ఎవరి మీద పుడుతుందో చెప్పలేనట్టే అభిమానం కూడా ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. జేన్ ట్రక్కు వెనక కనపడకుండా పడుకుని సంబరపడిపోతూ ఉంటుంది. పౌలో దారిలో రోడ్డు పక్కన ట్రక్కు ఆపి మూత్రవిసర్జన చేస్తాడు. జేన్ పైకి లేచి చూస్తే అతని మర్మాంగం కనపడుతుంది. జేన్ తన ఫోన్లో ఫొటోలు తీసుకుంటుంది. ఈరోజుల్లో అభిమానం ఎలా వెర్రితలలు వేస్తోందో చెప్పటానికి ఇదో ఉదాహరణ. ట్రక్కు మళ్ళీ బయల్దేరుతుంది. చీకటి పడుతుంది. ట్రక్కు ఒకచోట ఆగుతుంది. జేన్ దిగి చూస్తే అక్కడొక భవనం ఉంటుంది. గేటు ఇనపగొలుసులు వేసి కట్టిఉంటుంది. ఆమె గేటు ఎక్కి అటువైపు దిగుతుంది. తలుపుకి లోపల తాళం వేసి ఉండదు. జేన్ లోపలికి వెళుతుంది. అక్కడ ఫర్నిచర్ ఎక్కువ ఉండదు. కొన్ని కిటికీ అద్దాలు పగిలి ఉంటాయి. కరెంటు కూడా ఉండదు. కింద ఎవరూ లేకపోవటంతో జేన్ పై అంతస్తుకి వెళుతుంది. అక్కడ పౌలో కోకెయిన్ పీలుస్తూ ఉంటాడు. జేన్ “పౌలో” అని పిలుస్తుంది. అతను ఆమెని తిట్టి బయటికి పొమ్మంటాడు. చివరికి ఆమె తన అభిమాని అని తెలిసి ఆ రాత్రికి అక్కడే ఉండమంటాడు. ఆమెకి అతని గురించి పత్రికలలో చదివిన విషయాలన్నీ గుర్తే. అతనితో సెల్ఫీలు తీసుకుంటుంది. అతను “ఇవి బయటపెడితే నేను ఊరుకోను” అంటాడు. ఆమె “ఇవి కేవలం నా కోసమే” అంటుంది.
పౌలో అలాంటి ఇంట్లో ఎందుకున్నాడు? ఆ ఇల్లు ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన ఇల్లు. అంటే పౌలో ఎవరికీ తెలియకూడదని అక్కడ ఉన్నాడన్నమాట. అంత అవసరం ఏం వచ్చింది? అతని ప్రియురాలిని వదిలి వస్తే ఆమె పట్టించుకోదా? జేన్ సంగతి ఏమిటి? ఆమె ఇంట్లో వాళ్ళు ఆమె కోసం చూడరా? ఇవన్నీ ప్రశ్నలే. పౌలో ఒక ప్రశ్న వేస్తాడు. “నాకన్నా అందమైన నటులు ఉన్నారుగా? వాళ్ళని అభిమనించవచ్చు కదా?” అంటాడు. “అందరికన్నా ముద్దుగా ఉండేది మీరే” అంటుంది జేన్. ఆమె వయసు పదహారని తెలిసి అతను “నువ్వింకా చిన్నపిల్లవే” అంటాడు. “నేను చిన్నపిల్లని కాదు” అంటుందామె. అతన్ని మీరు అనే సంబోధిస్తుంది. అతను బీరు తాగుతుంటే తనూ బీరు తాగుతుంది. పెద్దదానిలా ప్రవర్తించాలని ఆమె ఆరాటం. కాసేపటికి వాంతి చేసుకుంటుంది. అతను ఆమెని చూసి విసుక్కుంటాడు. ఆమెని పై అంతస్తుకి వెళ్ళి పడుకోమంటాడు. ఆమె పడుకుంటుంది. ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. అతను తన దగ్గరకు వస్తాడని ఆశ పడుతుంది.
తనకన్నా అందమైన నటులు ఉన్నారని పౌలో అంటాడు. ఇది వాస్తవాన్ని గ్రహించే తత్వమా లేక న్యూనతాభావమా? ఒక్కోసారి పరిస్థితులని బట్టి న్యూనతాభావం వస్తుంది. అతను తనది కాని ఇంట్లో దొంగతనంగా ఉంటున్నాడంటే అతని మనఃస్థితి ఎలాంటిదో ఊహించుకోవచ్చు. పైగా డ్రగ్స్ వాడుతుంటాడు. జేన్ ఇవేమీ గమనించే స్థితిలో లేదు. ఆమెకి అతని సాంగత్యమే చాలు. పరిసరాలు పట్టించుకోదు. అతనికి సంబంధించిన విషయాలే మాట్లాడుతుంది. అతను బీరు ఇచ్చినపుడు “మీరు ప్రచారం చేసే బీరు ఇది కాదుగా” అంటుంది. “ఆ బీరు అస్సలు బాగోదు” అంటాడతను. డబ్బు కోసం చెత్త ఉత్పత్తుల ప్రచారం చేయటం నటులకి అలవాటేగా.
పడుకున్న జేన్ కాసేపటికి ఏవో మాటలు వినపడితే కిందకి వెళుతుంది. చాటుగా ఉండి హాల్లోకి చూస్తుంది. అక్కడ పౌలో ఒక స్త్రీతో నేల మీదే శృంగారం నెరుపుతూ ఉంటాడు. జేన్ నిశ్శబ్దంగా పైకి వెళ్ళిపోతుంది. పౌలో తన పక్కలో ఉన్నట్టు ఊహించుకుంటూ నిద్రపోతుంది. మర్నాడు కాస్త ముభావంగా ఉంటుంది. పౌలోతో ఉన్న స్త్రీ ఎవరో తెలుసుకోవాలని కుతూహలం. కానీ ఏమీ అడగదు. బ్రెడ్ తిన్నాక ఆమెని బస్ స్టేషన్ దగ్గర దింపటానికి తన ట్రక్కులో తీసుకు వెళతాడు పౌలో. ఊరు దాటి వెళుతుంటారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంటుంది. దారిలో ఒకచోట ఒక స్త్రీ, పురుషుడు కనపడతారు. పురుషుడు ఒక బిడ్డని ఎత్తుకుని ఉంటాడు. వాళ్ళని చూసి పౌలో ముఖం పాలిపోతుంది. వాళ్ళని దాటుకుని వెళతాడు కానీ హఠాత్తుగా ఆక్రోశంతో అరవటం మొదలుపెడతాడు. జేన్‌కి విషయం అర్థమవుతుంది. “ఎవరామె? రాత్రి మీతో పడుకుంది ఆమే కదా? ఆమెకి భర్త, బిడ్డ కూడా ఉన్నారు” అంటుంది. అతను “నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పడుకుంటాను. అడగటానికి నువ్వెవరు?” అని ఆమెని బూతులు తిడతాడు. ఆమె ఏడుస్తుంది. ఆమెకి అతను తిట్టాడనే బాధ కన్నా అతను నీతి తప్పి ప్రవర్తించాడనే బాధే ఎక్కువగా ఉంటుంది. అతను రోడ్డు పక్కన ట్రక్కు ఆపుతాడు. ఆమెకి సిగరెట్టు ఇస్తాడు. ఆమె ఏడుస్తూనే తాగుతుంది. “నీ మీద అరిచినందుకు సారీ. ఆ కనిపించిన ఆమె బిడ్డ నా కొడుకే. ఆమె భర్తకి తెలియదు” అంటూ కన్నీరు కారుస్తాడు. అప్పటి దాకా ఎవరికో చెప్పుకోవాలని అనుకున్నదంతా చెప్పుకోవటానికి ఒక మనిషి దొరికినట్టు ఆమెకి ఎన్నో విషయాలు చెబుతాడు. నటుల జీవితాలు ఇలాగే ఉంటాయేమో. ఏవో రహస్యాలు ఉంటాయి. చెప్పుకోవటానికి ఎవరూ ఉండరు. చెబితే బయటపడతాయని భయం. అతనికి ఆమె మీద నమ్మకం కుదిరింది. “మా అబ్బాయిని తొలిసారి చూసినపుడు ఏడుపొచ్చింది” అంటాడు. ఇక్కడ జేన్‌గా నటించిన చార్లీ డిజోన్ నటన చాలా బావుంటుంది. సినిమాల్లో అతను ఇలాగే ఏడుస్తాడు కదా అంటుంది. అతని బాధ తెలిసి అతను కూడా మామూలు మనిషే కదా అనే స్ఫురణ కలుగుతుంది. నిర్వేదం కలుగుతుంది. ఆ నిర్వేదానికి కారణం ఆమె తర్వాతి మాటల్లో తెలుస్తుంది. “మా నాన్న నన్నూ, అమ్మనీ వదిలేసి వెళ్ళినపుడు నేనిలాగే ఏడ్చాను. నాన్నంటే నాకిష్టం. ఇప్పుడు నాన్నని చూడటమే కుదరట్లేదు. వేరే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు” అని విలపిస్తుంది. “తర్వాత అమ్మకి బెంజో పరిచయమయ్యాడు. మొదట్లో బాగానే ఉండేవాడు. ఒకరోజు తాగివచ్చి అమ్మని కొట్టాడు. అది అతనికొక అలవాటుగా మారిపోయింది” అని మనసు తీరా ఏడుస్తుంది. పౌలో తన బాధలో తానున్నాడు. ఎవరి బాధ వారు పైకి చెప్పుకోవటమే గానీ అవతలి వారి మాట అసలు వింటున్నారా అనిపిస్తుంది.
జేన్ పరిస్థితి మనకి పూర్తిగా అర్థమవుతుంది. తండ్రి లేడు. తల్లి తోడు కోసం బెంజోని భరిస్తుంది. ఇలాంటి వాతావరణం నుంచి తప్పించుకోవటానికి ఆమె ఒక కలల ప్రపంచాన్ని సృష్టించుకుంది. హార్మోన్ల ప్రభావం కూడా పని చేసింది. ఆ కలల ప్రపంచంలో తాను రాణి, పౌలో రాజు. తండ్రి ఇంకొకామెని పెళ్ళి చేసుకున్నాడు. బెంజో ఆమె తల్లిని కొడతాడు. పౌలో మాత్రం తన సినిమాల్లో తన ప్రియురాల్ని ప్రేమగా చూసుకుంటాడు. ప్రియురాలు దూరమైతే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తండ్రి, బెంజో చెడ్డవాళ్ళయినా పౌలో లాంటివారు ఉన్నారు కాబట్టి జేన్‌కి భవిష్యత్తు గురించి భయం లేదు. పౌలో పెళ్ళయిన స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆమె కలవరపడింది. పౌలో కూడా నీతి లేని వాడేనా అని బాధపడింది. అతను బిడ్డ కోసం పరితపిస్తున్నాడని తెలిసి ఆమెకి కొంచెం ఊరట కలిగింది. తన పరిస్థితి గుర్తు వచ్చింది. తన కోసం తపించేవారు లేరు కదా అని విలపించింది. భార్యలను వదిలేసే భర్తలు పిల్లల గురించి ఆలోచించాలి. జేన్ తండ్రి స్వార్థపరుడు. జేన్‌ని పూర్తిగా వదిలేశాడు. కొందరు భార్యని వదిలేసినా పిల్లలని ప్రేమిస్తారు. అదీ సరిపోదు. పిల్లలున్నవారు వారికి భద్రతాభావం కలిగించాలి. తల్లొక చోట, తండ్రొక చోట ఉంటే పిల్లలకి మనసుపై దుష్ప్రభావం పడుతుంది. పిల్లల కోసం పెద్దలు సర్దుకుపోవాలి. నా సంతోషమే ముఖ్యం అనుకుంటే దానికి అంతు ఉండదు. విసుగొస్తే భార్యలని మారుస్తూ పోతారా? దానికి అంతెక్కడ? ఈ కాలంలో ప్రియుడి కోసం భర్తని చంపేసే భార్యలు కూడా బయల్దేరారు. వీళ్ళందరూ కాస్త ఆగి పిల్లల గురించి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. అసలు ముందు బయటి పరిచయాలు పెరగనివ్వకూడదు. ఆ పరిచయాల్ని మొగ్గలోనే తుంచేస్తే అందరి జీవితాలూ బావుంటాయి. లేకపోతే వారి జీవితాలు ఎలాగూ పాడవుతాయి, అభం శుభం తెలియని పిల్లల జీవితాలు కూడా అస్తవ్యస్తం అవుతాయి.
పౌలోకి తన కొడుకు గురించిన బాధ మాత్రమే కాదు, ఇంకో బాధ కూడా ఉంది. అది కూడా జేన్‌తో పంచుకుంటాడు. ఒకరోజు అతను షూటింగ్‌లో ఉండగా అతని అక్క ఫోన్ చేస్తుంది. తల్లి ఆసుపత్రిలో ఉందని చెబుతుంది. అతను వెళ్ళాలనుకుంటాడు కానీ దర్శకుడు ఒక్క సన్నివేశం పూర్తి చేసి వెళ్ళమంటాడు. అది పూర్తి చేసి బయల్దేరతాడు. దారిలోనే తల్లి చనిపోయిందని ఫోన్ వస్తుంది. “నేనెందుకు షూటింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చాను? నేను పక్కన లేకుండానే అమ్మ చనిపోయింది” అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇది జీవితాంతం వెంటాడే బాధ. ఏం జరిగినా నేను వెళతాను అని అతను షూటింగ్ ఆపేసి వెళ్ళి ఉంటే ఈ బాధ ఉండకపోను. షూటింగ్ వదిలి వెళితే తన మీద దుష్ప్రచారం చేస్తారని, తన అవకాశాలు దెబ్బ తింటాయని భయపడి ఉండవచ్చు. ప్రతిభ ఉంటే అవకాశాలు అవే వస్తాయి. ప్రతిభ లేకపోతే అవకాశాలు ఈరోజు కాకపోతే రేపైనా ఇంకిపోతాయి. అతనిది రెండో బాపతు అని అనిపిస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనుకున్నాడు. తీవ్రమైన వేదన మిగిలింది. ఇప్పుడు ఒక నటితో ప్రేమాయణం సాగిస్తున్నాడనేది కూడా అబద్ధమే. అలా ప్రేమాయణం ఉందని చెబితే ఎక్కువ మంది సినిమా చూస్తారని దురాలోచన. ఆ ప్రేమాయణం అబద్ధం కాబట్టే అతను ఇలా ఒక్కడే ఈ ఊరికి వచ్చి ఉన్నా ఆ “ప్రేయసి” పట్టించుకోలేదు. ఆ పాడుబడ్డ ఇల్లు అతని మనసుకి ప్రతీక. అందులో స్థానం కోసం జేన్ తాపత్రయపడింది. అతనికి వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలిసి కూడా ఆమె “ఇంకాసేపు నీతో ఉండొచ్చా?” అని అడుగుతుంది. ఒంటరితనమంటే అందరికీ భయమే. అతను కూడా ఒప్పుకుంటాడు. తర్వాత జరిగే పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
జేన్‌గా చార్లీ డిజోన్ అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో నటించేటప్పటికి ఆమె వయసు 23 ఏళ్ళు. అయినా చిన్న వయసు అమ్మాయి లాగే ఉంటుంది. శృంగార సన్నివేశాలలో మైనర్లని పెట్టకూడదు కాబట్టి ఆమెని ఎంచుకున్నారు. పాత్రకి పూర్తి న్యాయం చేసింది. పౌలోగా పౌలో అవెలినో నటించాడు. చిత్రంలో కూడా అతని పూర్తి పేరు పౌలో అవెలినోయే. అతను సాహసం చేశాడనే చెప్పాడు. ఇంతకు ముందు చాలా మంది నటులు తెర మీద నటుల పాత్రలు వేశారు. నాకు తెలిసి ఎవరూ తమ పేరుతోనే నటించలేదు. అతని నటనలో ఎంతో పరిణతి కనిపిస్తుంది. ఈ చిత్రానికి అంట్వానెట్ జెడావోన్ స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించింది. ఊహించని విధంగా కథని నడిపించి సమాజంలోని అనాచారాలని సహజంగా చూపించింది. ఎత్తుగడ కొంచెం అసహజంగా అనిపించినా మిగతా కథ అందరినీ తమని తాము ప్రశ్నించుకునేలా చేస్తుంది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
జేన్, పౌలో పాడుబడిన ఇంటికి తిరిగి వస్తారు. జేన్ తల్లి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావని అడుగుతుంది కానీ పెద్దగా ప్రశ్నించదు. జేన్‌కి స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటం అలవాటే అనిపిస్తుంది. ఇలా పిల్లలకి ఇవ్వకూడని స్వేచ్ఛ ఇస్తే అనర్థాలే జరుగుతాయి. జేన్ తల్లి ఎందుకలా చేస్తుంది? ఆమె తర్వాత చెప్పే విషయంలోనే మనకి జవాబు దొరుకుతుంది. “బెంజో రాత్రి ఇంటికి రాలేదు. ఎవరితో కులుకుతున్నాడో” అంటుంది. ఆమెకి తన ప్రియుడిని దారికి తెచ్చుకోవటానికే సమయం సరిపోదు. ఇక కూతురినేం పట్టించుకుంటుంది? జేన్ “నువ్వు అతని పెళ్ళానివి కాదుగా” అంటుంది. దీంతో ఆమె తల్లికి చిర్రెత్తుకొస్తుంది. ఎక్కడున్నావని రెట్టిస్తుంది. ఇదో వికృత చేష్ట. తన తప్పులు బయటపడతాయని అవతలి వారి తప్పుల మీదకి దృష్టి మళ్ళించటం. సొంత కూతురి మీదే ఈ అస్త్రాలని ప్రయోగించటం ఎంత విషాదం. పౌలో ఫోన్ తీసుకుని తను జేన్ స్నేహితుడినని, ఆమెని ఇంటికి తీసుకు వస్తానని అంటాడు. అంతటితో జేన్ తల్లి శాంతిస్తుంది.
జేన్ కుంగిపోతుంది. బెంజో మంచివాడు కాదని తెలిసినా ఆమె తల్లి అతని కోసం ఆరాటపడుతోంది. ఇదేనా జీవితం? ఇంటి ఆవరణలో ఉన్న స్విమింగ్ పూల్ దగ్గర కూర్చుని ఉన్న జేన్‌కి పౌలో ఒక గంజాయి సిగరెట్టు ఇస్తాడు. ఆమె అడిగితేనే ఇస్తాడు. అతను తన బాధని మర్చిపోవటానికి డ్రగ్స్ వాడుతుంటాడు. ఆమె కూడా తన బాధ మరచిపోవాలనుకుంటుంది. అయితే ఆమె మీద గంజాయి ప్రభావం ఉండదు. నిరాశతో ఆమె పూల్‌లో దూకుతుంది. ఆ నీరు ఎప్పటినుంచో ఉన్న నీరు. మురికిగా ఉంటుంది. అతను ఆమెని బయటకి తీసి బట్టలు మార్చుకోమంటాడు. ఇంటిలోకి వెళతారు. ఆమె ఒళ్ళు తుడుచుకున్నాక ఆమె అందం అతనికి తొలిసారి కనపడుతుంది. అప్పటి దాకా చెమట కారుతూ ఉంది మరి. అతను ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. ఆమెకి కల నిజమైనట్టు ఉంటుంది. ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. ఆమెకి అదే తొలి అనుభవం. ఈ సన్నివేశం మనసుని కలచివేస్తుంది. ఇద్దరూ మనసుకి గాయాలైనవారే. కామవాంఛ తీర్చుకుని ఉపశమనం పొందుతారు. ఆ ఉపశమనం ఎంతసేపు? అతను దూరం దూరంగా ఉంటాడు. ఆమె అతనికి చేరువ కావాలని ప్రయత్నిస్తుంది. అతను “ఆకలేస్తోంది. తినటానికి ఏమైనా తీసుకురా. నీకిష్టమైనదేదైనా సరే” అని డబ్బులిస్తాడు. ఆమె “మీ ఇష్టాల కన్నా అమ్మాయి ఇష్టాలకి ప్రాధాన్యం ఇస్తే మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు” అని సంబరపడుతుంది. అతను విసుక్కుంటాడు. ఆమె నిరాశగా బయటికి వెళుతుంది. టీనేజ్ పిల్ల కాబట్టి పౌలో తన కొడుకు తల్లిని వదిలి తనని ప్రేమిస్తాడని అనుకుంది. అలా జరుగుతుందా? లోకంలో అన్నీ అంత సులువుగా ఉంటే అన్ని సమస్యలూ పరిష్కారమయిపోతాయి.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
బయటకి వచ్చిన జేన్‌కి దారిలో ఎదురుగా పౌలో బిడ్డ తల్లి బిడ్డని తీసుకుని మోటారు సైకిల్ మీద వస్తూ కనపడుతుంది. ఆమె పేరు సినిమాలో చెప్పలేదు కానీ మనం షీలా అనుకుందాం. ఆమె వెనకాలే జేన్ పరుగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వస్తుంది. పౌలో కొడుకు ఇంటి బయట ఉంటాడు. జేన్ లోపలికి వెళుతుంది. పౌలో, షీలా గొడవపడుతూ ఉంటారు. ఇంతకీ షీలా ఎవరు? ఆమె పెళ్ళి కాక ముందే అతన్ని ప్రేమించిందా? లేక పెళ్ళయ్యాక అతని మీద మోజు పడిందా? ఏదైతేనేం? ఆమెకి పెళ్ళి అయిన తర్వాత వారి కొడుకు పుట్టాడు. పౌలో “నువ్వు బాబుని తీసుకుని నాతో వచ్చెయ్” అంటాడు. ఆమె తనకిష్టం లేదంటుంది. “నీకు కావలసింది అదేగా” అంటాడతను. “నీకు బోరు కొట్టినపుడు ఇక్కడికి వస్తావు. నేను కేవలం ఒక బొమ్మని. మూడేళ్ళు నీ కోసం వేచి ఉన్నాను. ఇక నన్నొదిలెయ్” అంటుందామె. పిల్లాడికి ఆమె భర్త తండ్రిగా అలవాటయ్యాక ఇప్పుడు ఆమె ఎలా రాగలదు? భర్తకి ఏం చెబుతుంది? పౌలోకి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె మీద చెయ్యి చేసుకుంటాడు. జేన్ అడ్డుపడుతుంది. ఈ గొడవలో షీలా కింద పడుతుంది. పిల్లవాడు లోపలికి వస్తాడు. పౌలో పిల్లవాడిని తీసుకుని బయటకు వెళతాడు. జేన్‌ని తనతో రమ్మంటాడు. జేన్ ని ట్రక్కు ఎక్కమని, పిల్లవాడిని ఆమెకి ఇచ్చి ట్రక్కు నడుపుకుంటూ బయల్దేరుతాడు. షీలా బయటికి వచ్చేసరికి ట్రక్కు వెళ్ళిపోతుంది. జేన్ పౌలోని ట్రక్కు ఆపమంటుంది. పౌలో “నోర్మూసుకో. మీ ఆడవాళ్ళంతా ఒకే రకం” అంటాడు. జేన్ ప్ర్రాధేయపడుతుంది. పౌలో ఆగడు. జేన్ తలుపు తీసుకుని పిల్లవాడితో సహా దూకేస్తుంది. ఆమెకి చిన్న గాయాలవుతాయి. పిల్లవాడు క్షేమంగా ఉంటాడు. పౌలో ట్రక్కు ఆపుతాడు కానీ మళ్ళీ నడుపుకుంటూ వెళ్ళిపోతాడు.
పౌలో షీలాతో, పిల్లవాడితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటానని అనుకున్నాడు. నిజానికి అతనికి పిల్లవాడే ముఖ్యం. ఇంతకాలం అతను తన కెరియర్ కోసం వాళ్ళని దూరం పెట్టాడు. ఇప్పుడు కెరియర్ అంత గొప్పగా లేదు. అందుకని వాళ్ళు కావాలి. షీలా కుదరదని చెప్పింది. పౌలో పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. అలా చేస్తే షీలా వెనకాలే వస్తుంది కదా. ఆ విధంగా షీలాని శాసించాలనుకున్నాడు. మగవాళ్ళు ఆడవాళ్ళని వాడుకోవటం జేన్ చూసింది. పౌలో వారి కంటే భిన్నమనుకుంది. కానీ పౌలో కూడా ఆ మగవాళ్ళ లాంటివాడే అని తేలిపోయింది. ఆడదాని అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా మగవాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. బిడ్డని వదిలి వెళ్ళిపోయేవాడొకడు. బిడ్డని తల్లికి దూరం చేసేవాడొకడు. పురుషాహంకారం. ఆ అహంకారానికి ఆడది బలైపోవలసిందేనా? జేన్ పిల్లవాడి గురించి ఆలోచించింది. వాడికి తల్లి అవసరం. అందుకనే ట్రక్కులో నుంచి దూకేసింది. పౌలో కనీసం ట్రక్కు దిగకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు? జేన్‌కి, పిల్లవాడికి ఏమైనా అయితే అతని మెడకి చుట్టుకుంటుంది. అంత స్వార్థం! ఇక్కడ జేన్ చాలా పరిపక్వంగా ఆలోచించింది. పౌలో పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోతే తనకి నష్టమేమీ లేదు. పైగా అతను షీలాని వదిలి తనకి దగ్గర అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ తల్లి నుంచి పిల్లాడిని వేరు చెయ్యటం తప్పనే ఇంగితం ఆమెకుంది. ఆ ఇంగితం పౌలోకి లేదు. చెప్పాను కదా.. పురుషాహంకారం. ఆ పురుషాహంకారానికి వ్యతిరేకంగా ఆమె సాహసం చేసింది. విషాదమేమిటంటే ఒక టీనేజ్ అమ్మాయికి ఉన్న మానవత్వం కథలోని పురుషుల్లో లేకపోవటం. ఇంకా పెద్ద విషాదమేమిటంటే ఇక జేన్ ఏ పురుషుడినీ నమ్మదు. ప్రపంచం పోకడ చిన్నవయసులోనే ఆమెకి తెలిసిపోయింది.
షీలా తప్పు కూడా ఉంది. పెళ్ళయిన తర్వాత వేరే మగవాడితో సంబంధం ఏమిటి? ఇలాంటివి మానుకుంటే కానీ జీవితాలు సాఫీగా ఉండవు? ఈ కథలో స్త్రీలు కూడా బలహీనులే. జేన్ తల్లి బెంజో చెడ్డవాడని తెలిసీ అతన్ని పట్టుకుని వేలాడింది. షీలా వివాహేతర సంబంధం పెట్టుకుంది. జేన్‌కి ప్రపంచం మీద విరక్తి రావటానికి ఈ అనుభవాలు చాలు. ఆమె బస్సులో ఇంటికి వెళుతుంటే తల్లి ఫోన్ చేస్తుంది. “బెంజో ఇంకా రాలేదు. నా గతి ఏమిటి?” అంటుంది. “పోనీ. నేనూ, తమ్ముడూ ఉన్నాంగా” అంటుంది జేన్. అయితే జేన్‌కి ఇంకో షాక్ తగులుతుంది. ఆమె తన ఇంటికి వెళ్ళేసరికి ఆమె తల్లి, బెంజో కలిసి భోజనం చేస్తుంటారు! జేన్ తన కళ్ళని తానే నమ్మలేక నిరాశలో కూరుకుపోతుంది. అదో చిన్న ఇల్లు. ఆమె చిన్నారి తమ్ముడు పడుకుని ఉంటాడు. బెంజో “నీ కూతురు తిరుగుబోతు” అంటాడు జేన్ ఎదురుగానే ఆమె తల్లితో. జేన్ తల్లి అలా మాట్లాడొద్దని అంటుంది కానీ పెద్దగా ప్రతిఘటించదు. జేన్‌కి దుఃఖం వస్తుంది. బెంజో జేన్‌ని సిగరెట్ తెమ్మని ఆర్డర్ వేస్తాడు. ఆమె తల్లి తన పర్సులో నుంచి డబ్బులు తీసుకెళ్ళి సిగరెట్ తెమ్మంటుంది. అంటే బెంజో ఆమె డబ్బులు వాడుకుంటాడన్నమాట. జేన్ కోపంగా అతన్ని తిట్టి బయటికి వచ్చేస్తుంది. సిగరెట్టు కొంటుంది. లైటర్ కూడా కొంటుంది. పక్కకి వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేస్తుంది. ఫోన్లో ఏం మాట్లాడిందో దర్శకురాలు మనకి చూపించదు కానీ దాని అర్థం జేన్ బెంజో మీద పోలీసులకి ఫిర్యాదు చేసిందని. తర్వాత ఆమె తను కొన్న సిగరెట్ తాగుతుంది. నిర్వేదంగా శూన్యం లోకి చూస్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ సైరన్ వినపడుతుంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు వస్తుంది.
జేన్‌కి ఒక్కరోజులో జీవితకాలపు అనుభవాలు ఎదురయ్యాయి. అయినా ఆమె ధైర్యం సడలలేదు. మొదట్లో ఆమె ఒక అమాయకపు అమ్మాయి. పౌలో మీద అభిమానంతో రంగుల కలలు కనేది. ఇప్పుడా కలలు చెల్లాచెదురయ్యాయి. బెంజో వెళ్ళిపోతే తమ జీవితం బాగుపడుతుందనుకుంది. అక్కడా నిరాశే ఎదురయింది. ఆమె నైరాశ్యంలో నుంచి ఫీనిక్స్‌లా లేచింది. పూర్తి నైరాశ్యంలో నుంచే గుండెనిబ్బరం పుడుతుందేమో. అగాధంలో పడినపుడు పైకి వెళ్ళటం తప్ప వేరే దారి ఉండదు. అన్యాయాన్ని ఎదిరించాలని నిశ్చయించుకుంది. ఆమె ఆడే పాడే వయసులోనే ఒక్కసారిగా ఎదిగిపోవటం చూసి మనం ఆనందించాలా? నిట్టూర్పు విడవాలా?