Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 66: మ్యూనిక్

[సంచిక పాఠకుల కోసం ‘మ్యూనిక్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ఇ[/dropcap]జ్రాయెల్-పాలెస్తీనా వివాదాన్ని వివరించటానికి తేలిక వివరణలు ఉండవు. ఎవరైనా తేలిక వివరణ ఇస్తే వారిని నమ్మక్కరలేదు. ప్రస్తుత యుద్ధం ఉగ్రవాద సంస్థ హమాస్ దాడి వల్ల మొదలయింది. హమాస్ అంటే పాలెస్తీనా కాదు, అది ఒక ఉగ్రవాద సంస్థ (భారతదేశం దాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు, కానీ అక్టోబర్ ఏడున జరిగినది ఉగ్రవాద దాడి అని అభివర్ణించింది). కానీ ఆ సంస్థనే పాలెస్తీనా ప్రజలు ఎన్నికల్లో ఎన్నుకున్నారు. మరి హమాస్ పాలెస్తీనాకి ప్రతినిధేగా? కానీ ఎన్నికలంటే స్వేచ్ఛగా జరిగాయని చెప్పగలమా? ఇలా చర్చించుకుంటూ వెళితే కుందేలు కలుగులోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఒక పట్టాన బయటకి రాలేం. చెప్పానుగా, తేలిక వివరణలు ఉండవని. ఈ వివాదం డెబ్భై అయిదేళ్ళుగా రగులుతూనే ఉంది. 1972లో మ్యూనిక్ ఒలింపిక్స్ జరిగినపుడు బ్లాక్ సెప్టెంబర్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌కి చెందిన 11 మంది క్రీడాకారుల్ని హతమార్చింది. ఆ మారణకాండకి ఇజ్రాయెల్‌ ఎలా ప్రతిస్పందించింది అనేది ‘మ్యూనిక్’ (2005) కథాంశం. పైకి ప్రతీకారమే కనిపించినా తరచి చూస్తే ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది ఈ చిత్రం. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే. తెలుగు సబ్ టైటిల్స్‌తో చూసే సౌలభ్యం కూడా ఉంది.

యూదులకి, ముస్లిములకి పవిత్రస్థలాలు జెరూసలేంలో ఉన్నాయి. యేసు క్రీస్తు కూడా అక్కడికి దగ్గరలోనే ఒక యూదు కుటుంబంలో పుట్టాడు. ఆ నేల మాదంటే మాదని యూదులు, ముస్లిములు పట్టుబట్టటంతో వివాదం మొదలయింది. యుద్ధాలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి. మూడు మతాలకి జన్మస్థానమైన ప్రాంతం ఇప్పుడు రక్తసిక్తమౌతోంది. ఇదేనా మతం బోధించేది? ‘మ్యూనిక్’ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. అతను అమెరికాలో ఒక యూదు కుటుంబంలో పుట్టాడు. అందుకని  యూదులకు మద్దతుగా ఈ చిత్రం ఉందని కొందరు అనుకుంటారు. కానీ లోతుగా చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది. చిత్రంలో హత్యలకు వేసే ప్రణాళికలు, హత్యలు చేసే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి, కానీ ఆ సన్నివేశాల మధ్యలో వచ్చే సంభాషణల మీద దృష్టి పెడితే ఈ వివాదం ఎంత జటిలంగా తయారయిందో అర్థమవుతుంది. స్పీల్బర్గ్ ప్రతిభ ఇక్కడే తెలుస్తుంది. కేవలం థ్రిల్ కోసం చూసేవారికీ ఈ చిత్రం నచ్చుతుంది, లోతుగా విశ్లేషించాలనుకునేవారికీ ఈ చిత్రం నచ్చుతుంది.

మొదటి సంభాషణ ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మెయిర్ తన సలహాదారులతో, సైన్యాధికారులతో జరిపే సమావేశంలో వస్తుంది. మ్యూనిక్ హత్యాకాండ తర్వాత ఏం చేయాలని వారు చర్చిస్తారు. అప్పటికే ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. గోల్డా తన సలహాదారుతో “ఈ కిరాతకులకి ‘మీకు మాతో కలిసి మనుగడ సాగించటం ఇష్టం లేదు, కాబట్టి మాకు కూడా మీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు’ అని గట్టిగా చెప్పాలి. ఇందులో న్యాయముంది కదా?” అంటుంది. అతను ఆలోచనలో పడతాడు. హింసకి హింసే సమాధానమా? ఒక జనరల్ “డెబ్భై జెట్ విమానాలతో  వారి స్థావరాలపై దాడి చేశాం. అరవై మంది అరబ్బులు హతమయ్యారు. ఎంతమంది గాయపడ్డారో! ఈ ప్రతిక్రియ చాలదా?” అంటాడు. “సరిహద్దు స్థావరాలపై దాడులు ప్రపంచం పట్టించుకోదు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏమైనా చేయాలి” అంటాడు ఇంకో జనరల్. మరో జనరల్ ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ “కేవలం వార్తల్లోకి ఎక్కటం మాత్రమే కాదు. వీడు అలీ హసన్ సలామే. బ్లాక్ సెప్టెంబర్ సంస్థని స్థాపించాడు. అతనే మ్యూనిక్ హత్యాకాండకి పథకరచన చేశాడు. అది మర్చిపోవద్దు” అంటాడు. గోల్డా “శాంతిని పక్కన పెట్టండి. మన బలాన్ని చూపించాలి. నాగరిక సమాజంలో చట్టాలు ఉంటాయి. కొందరు అసలు నాగరికంగా ఉండటం మనుషులకు వీలు కాదు అంటారు. నేను వారితో ఏకీభవించను. కానీ ఈ ఉన్మాదులని ఏమనాలి? వారిని ఏ చట్టాలు నిర్దోషులుగా తీర్మానిస్తాయి? నేనొక నిర్ణయానికి వచ్చాను. దానికి పూర్తి బాధ్యత నాదే” అంటుంది. ఉగ్రవాదులతో బేరసారాలు జరిపి క్రీడాకారులను కాపాడలేదని గోల్డాపై ప్రజలు కోపంగా ఉంటారు. అయినా ఆమె పెద్దగా పట్టించుకోదు. దాడి చేసినపుడు ప్రతీకారం చేయకపోవటం చేతకానితనం అంటుంది. అయితే బాహాటంగా ప్రతీకారం చేస్తే ఇప్పుడు జరుగుతున్నట్టు అమాయకులు కూడా బలవుతారు. ప్రపంచం నిరసిస్తుంది. అందుకని గోల్డా రహస్యంగా ప్రతీకారం చేయాలని నిర్ణయిస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే మేం చేయలేదు అని చెప్పుకోవచ్చు. ఆమెకి ప్రచారం కన్నా ప్రతీకారం ముఖ్యం. ఉగ్రవాదులు చంపింది అమాయకులనే. కానీ ప్రభుత్వం ఆ పని చేస్తే తప్పు. ఇదీ నిజమే. మరి చూస్తూ ఊరుకోవాలా? అందుకే రహస్య మిషన్. నేటి ప్రభుత్వం ఓపిక నశించి బాహాటంగా దాడులు చేస్తోంది. అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. పోనీ ఆ దాడుల వల్ల వివాదం ముగుస్తుందా? లేదు. ఈసారి సాధారణ పౌరులను రెచ్చగొడతారు. మళ్ళీ ప్రతీకారం జరుగుతుంది. ఇదో విషవలయం.

ఆవ్నర్ కాఫ్మన్ గోల్డాకి అంగరక్షకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం మొసాద్ అనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థలో పని చేస్తున్నాడు. అతని తండ్రి సైన్యంలో పనిచేశాడు. అతన్ని ఉగ్రవాదులని చంపటానికి నియోగిస్తుంది గోల్డా. మొత్తం పదకొండు మంది ఉగ్రవాదులు. ఆవ్నర్‌తో పాటు నలుగురు సహచరులు ఉంటారు. ఆవ్నర్ వారికి నాయకుడు. ఇదంతా అనధికారికంగా జరుగుతుంది. ఆవ్నర్ చేత మొసాద్‌కి రాజీనామా చేయిస్తారు. అంటే అతనికి, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని పైకి అనిపిస్తుంది. అతని బృందంలో ఎవరైనా పట్టుబడినా ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుందన్నమాట. ఆవ్నర్‌నే ఎందుకు ఎంచుకున్నారు? అతనికి ఇలాంటి పనుల్లో అనుభవం కూడా లేదు. సరిగ్గా అందుకే! అనుభవం లేని వారైతే ఎవరికీ అనుమానం రాదు. పైగా అతని మిషన్ యూరప్‌లో. అతని పూర్వీకులు జర్మనీ వాళ్ళు. కాబట్టి అతనికి యూరప్ పరిచయమే. ఉగ్రవాదులు యూరప్‌లో మారువేషాల్లో ఉన్నారని అతని అధికారి చెబుతాడు. మిషన్ ప్రారంభమయ్యాక ఆవ్నర్‌కి ఆ అధికారితో ఎలాంటి మాటలూ ఉండకూడదు. ఆ అధికారి కేవలం నిధులు సమకూర్చి పెడతాడు. మిగతా పనంతా ఆవ్నర్, అతని బృందం చేసుకోవాలి. వారి దగ్గరున్నది ఉగ్రవాదులు పేర్లు మాత్రమే. ఆవ్నర్ భార్య గర్భవతి. ఆమెకి నెలకి వెయ్యి డాలర్లు అందేలా ఏర్పాటు జరుగుతుంది. ఆమె అయిష్టంగానే అతను మిషన్‌పై వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. మిషన్ ఏమిటో మాత్రం ఆమెకి తెలియదు. ఆవ్నర్ “నేను వెళ్ళకపోతే ప్రశాంతంగా ఉండలేను” అంటాడు.

ఆవ్నర్ బృందంలో ఉన్నవారు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన యూదులు. ఒకతను స్టీవ్. ఉడుకురక్తం కలవాడు. ఒకతను రాబర్ట్. పేలుడు పదార్థాల నిపుణుడు. ఒకతను కార్ల్. మాజీ సైనికుడు. ఇతని పని హత్యలు జరిగిన చోట ఆధారాలను మాయం చేయటం. ఒకతను హన్స్. దొంగపత్రాలు సృష్టిస్తాడు. అందరికీ దొంగ పాస్‌పోర్ట్‌లు ఇతనే తయారు చేస్తాడు. చివరి వారిద్దరూ నడివయసు వారు. అందరికీ ఎవరి పని వారికి ఉన్నా హత్యలు చేయటానికి అందరూ కలిసి వెళతారు. మొదట జర్మనీ వెళతారు. ఆవ్నర్ తన పరిచయాల ద్వారా త్వరలోనే సమాచారం అందించే ఒక వర్గాన్ని చేరుకుంటాడు. అయితే తానెవరో చెప్పడు. మారుపేరు వాడతాడు. అందరూ అతన్ని జర్మన్ అనే అనుకుంటారు. అమెరికన్ల కోసం సమాచారం సేకరిస్తున్నానని అంటాడు. ఆ వర్గం వారు డబ్బు తీసుకుని సమాచారం ఇస్తారు. వారిని నమ్మవచ్చా? వారు సీఐఏ (అమెరికా గూఢచారులు) గానీ, కేజీబీ (రష్యా గూఢచారులు) గానీ అయి ఉండవచ్చు. కానీ నమ్మకతప్పని పరిస్థితి. సమాచారం ఇస్తున్నారు గనక. ఇటలీలో ఒక ఉగ్రవాది దొరుకుతాడు. నడివయసు వాడు. అతను రచయితగా మారి ‘అరేబియన్ నైట్స్’ ని ఇటాలియన్ లోకి అనువదించాడు. ఆవ్నర్, రాబర్ట్ అతన్ని వెంబడించి అతని బిల్డింగ్‌లో లిఫ్ట్ దగ్గర అతన్ని పలకరిస్తారు. అతని పేరు ఖరారు చేసుకుంటారు. తుపాకీలు ఎక్కుపెడతారు. అతన్ని “మేమెందుకొచ్చామో తెలుసా?” అని అడుగుతాడు ఆవ్నర్. అతను తుపాకీకి చెయ్యి అడ్డుపెడతాడు, వద్దు అన్నట్టు. ఆవ్నర్‌కి ఏ మూలో అతను నిజంగా ఉగ్రవాదేనా అనే అనుమానం ఉంటుంది. నిజంగా ఉగ్రవాది కాకపోతే భయంతో కేకలు వేసేవాడు కదా. అతన్ని తుపాకీతో కాల్చి చంపేసి పారిపోతారు ఆవ్నర్, రాబర్ట్.

మ్యూనిక్‌లో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదులను వారి సహచరులు జర్మనీలో ఒక విమానాన్ని హైజాక్ చేసి విడిపిస్తారు. ఆ ముగ్గురూ లిబియాకి వెళతారు. అక్కడ టీవీ వారికి ఇంటర్వ్యూ ఇస్తారు. “మ్యూనిక్ ఆపరేషన్‌లో మీరేం సాధించారు?” అని అడిగితే “ఇంతవరకు మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ప్రపంచానికి మా గొంతు వినిపించాం” అంటారు. తమ మాట వినిపించాలంటే హింసే మార్గమా? వేరే మార్గం లేదా? వారి మాటలు విని ఆవ్నర్ బృందానికి కసి మరింత పెరుగుతుంది. స్టీవ్ “ట్రిపొలీకి వెళ్ళి వాళ్ళని చంపేద్దాం” అంటాడు. ఆవ్నర్ “మన మిషన్ యూరప్‌లో. మనకిచ్చిన పేర్లు పట్టుకోవటమే మన పని” అంటాడు. తర్వాత సమాచారం అందించే వర్గం నాయకుడైన లూయీ అనే వ్యక్తిని కలుస్తాడు ఆవ్నర్. లూయీ తండ్రి వారికి అసలైన నాయకుడు. లూయీ ద్వారా ప్యారిస్‌లో ఒక ఉగ్రవాది దొరుకుతాడు. అతను తన భార్య, కూతురితో అక్కడ నివాసముంటాడు. అతను ఫ్రాన్స్‌లో పాలెస్తీనా విమోచన ఉద్యమాన్ని నడుపుతూ ఉంటాడు. అతను “ఇజ్రాయెల్ మావాళ్ళనెందరినో నిలువనీడ లేకుండా చేసింది. ఎందరినో చంపింది. 1948 నుంచి ఇది జరుగుతూనే ఉంది” అంటాడు. అతని భార్య కూడా అతనికి వత్తాసుగా మాట్లాడుతుంది. అతని మీద దాడి చేసే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. స్పీల్బర్గ్ ఇలాంటి సన్నివేశాలను తెరకెక్కించటంలో దిట్ట.

ఆ ఉగ్రవాది తీవ్రంగా గాయపడి కొన్నాళ్ళకి మరణిస్తాడు. రాబర్ట్ ఎక్కువ శక్తిమంతం కాని బాంబు పెట్టాడని స్టీవ్ అతన్ని అక్షేపిస్తాడు. మొత్తం బిల్డింగ్‌ని నేలమట్టం చేయటం ఇష్టం లేక ఆ పని చేశానని రాబర్ట్ అంటాడు. అతనికి తమ లక్ష్యాన్ని ఛేదించటమే కాక వేరే నష్టం జరగకుండా చూడటం కూడా ముఖ్యం. మరణంలో కూడా మానవత్వం చూపిస్తాడు. స్టీవ్ మాత్రం లక్ష్యాన్ని ఛేదించటానికి ఏమైనా చేయాలి అంటాడు. హింస చేస్తున్నప్పుడు అందరూ ఒకలా ఆలోచించరు అనటానికి ఇదో నిదర్శనం. మొదట్లో ఒక జనరల్ కూడా స్థావరాలను దెబ్బ తీశాం కదా, చాలదా అంటాడు. ఆ స్థావరాలలో శరణార్థులు ఉన్నారని ఫ్రాన్స్‌లో ఉద్యమం చేస్తున్నతను అంటాడు. మరి అది ఇజ్రాయెల్‌కి తెలియదా? ఇలా అమాయకుల్ని చంపితేనే కొత్త ఉగ్రవాదులు పుట్టుకొస్తారు. మరి ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు పుట్టలేదే? అక్కడా అమాయకుల్ని చంపారుగా? దానికైనా, దీనికైనా కారణం నాయకత్వం.

తమవారు ఇద్దరు మరణించటంతో ఉగ్రవాదులు వివిధ దేశాలలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాలకు ఉత్తరాలలో బాంబులు పంపిస్తారు. లండన్ లోని దౌత్య కార్యాలయంలో బాంబు పేలుతుంది. దౌత్యవేత్త మరణిస్తాడు. ఇది ప్రతీకార చర్య అని ఆవ్నర్‌కి అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ఆవ్నర్ ఎవరికీ చెప్పకుండా తన భార్య ప్రసవ సమయానికి ఇజ్రాయెల్ వెళతాడు. ఆవ్నర్ తల్లి ఎందుకొచ్చావు అన్నట్టు మాట్లాడుతుంది. “నీ పని నువ్వు చేస్తేనే నాకు గర్వంగా ఉంటుంది” అంటుంది. ఆవ్నర్‌కి కూతురు పుడుతుంది. భార్యని, బిడ్డని అమెరికా పంపించే ఏర్పాట్లు చేస్తాడు. ఇజ్రాయెల్‌లో వారికి ప్రమాదముందని అతని భయం. అతనికి మెల్లగా తమ మిషన్ ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతుంది. మారుపేరు పెట్టుకున్నా మనిషిని గుర్తించటం కష్టమేమీ కాదు. అప్పట్లోనే అలా ఉంటే ఇప్పుడు మరీ తేలిక. ఆవ్నర్ తిరిగి వచ్చాక లూయీ ద్వారా మరో ఉగ్రవాది జాడ కనుక్కుని అతన్ని చంపటానికి పథకం వేస్తారు. అతను కేజీబీ వాళ్ళ రక్షణలో ఒక హోటల్లో ఉంటాడు. అతను పడుకునే పరుపు కింద ఒక పేలుడు పరికరం పెట్టాలని పథకం. ఆ పేలుడు పరికరం కూడా లూయీయే సరఫరా చేస్తాడు. కార్ల్ “నాకు తెలిసిన ఒక గూఢచారి ఎప్పుడూ మంచం మీద పడుకునేవాడు కాదు. క్లోజెట్ (బట్టలు వేలాడదీసే నిలువెత్తు అల్మరా లాంటి గది) లో పడుకునేవాడు. ఇప్పటికీ అంతే” అంటాడు. గూఢచారుల జీవితాలు వారి మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో దీనివల్ల తెలుస్తుంది. ఈ ఉగ్రవాదిని చంపే సన్నివేశం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా పథకం వేసినా ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని మరోసారి రుజువవుతుంది. ఆవ్నర్‌కి త్రుటిలో ప్రాణాపాయం తప్పుతుంది. ఆవ్నర్ బృందానికి లూయీ మీద అనుమానం వస్తుంది. అతను తమ శత్రువులతో చేతులు కలిపి తమను అంతమొందించటానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటారు. ఎవరినీ నమ్మలేని పరిస్థితి. కార్ల్ ఒక సందర్భంలో “లూయీ సీఐఏ వాడేమో? లేదా లూయీ మొసాద్ ఏజెంటేమో. మొసాద్ వాళ్ళే మనకి లూయీ ద్వారా సమాచారం అందిస్తున్నారేమో. నేరుగా అందిస్తే ప్రభుత్వం ఇరుకునపడుతుంది కాబట్టి. లేదా మొసాద్ సీఐఏకి సమాచారం ఇస్తే వాళ్ళు లూయీకి ఇస్తున్నారేమో?” అంటాడు. ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి!

ఒక దశలో ఆవ్నర్ ఒక పాలెస్తీనా మనిషితో మాట్లాడతాడు. అతని పేరు ఆలీ. అతనికి ఆవ్నర్ ఇజ్రాయెల్ వాడని తెలియదు. అతను “అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా సంఘటితం అయే రోజు త్వరలోనే వస్తుంది. వారికి పాలెస్తీనా వాళ్ళంటే ఇష్టమేం లేదు, కానీ యూదులంటే ద్వేషం. మిగతా ప్రపంచం కూడా ఇజ్రాయెల్ అకృత్యాలను తెలుసుకుంటుంది. అప్పుడు ఈజిప్ట్, సిరియా యుద్ధానికి వచ్చినా ఇజ్రాయెల్‌కి ఎవరూ సాయం చేయరు. ఇజ్రాయెల్ తుడిచిపెట్టుకుపోతుంది” అంటాడు. “అది మీ అపోహ. మీరందరూ శరణార్థుల శిబిరాల్లో మగ్గి మరణిస్తారు” అంటాడు ఆవ్నర్. “అప్పుడు మా సంతానం పోరాడతారు. కావాలంటే యూదులకి ఎక్కడా నిలువనీడ లేకుండా చేస్తాం” అంటాడు ఆలీ. “మీరు యూదుల్ని చంపితే మిమ్మల్ని అందరూ పశువులుగా పరిగణిస్తారు” అంటాడు ఆవ్నర్. “మమ్మల్ని పశువులుగా మార్చింది వాళ్ళే అని కూడా ప్రపంచానికి తెలుస్తుంది” అంటాడు ఆలీ. ఆవ్నర్ చివరి మాటగా “ఆ నిస్సారమైన మట్టి, రాళ్ళతో కట్టిన గుడిసెలు కావాలా మీకు?” అంటాడు. అంటే వారు కోరుకునే పాలెస్తీనా అంత గొప్పదేమీ కాదని అతని అభిప్రాయం. అంత గొప్పది కాకపోతే ఇజ్రాయెల్ ఎందుకు దానికోసం పట్టుపడుతోంది? ఇది ఆవ్నర్ ఆలోచించడు. “మాకదే కావాలి. అది మా గడ్డ. అందరికీ మనది అని చెప్పుకోవటానికి ఒక గడ్డ కావాలి. వందేళ్ళయినా పోరాడుతాం” అంటాడు ఆలీ. ఎవరి వాదన వారిది. ఈ గొడవ ఎక్కడ మొదలయిందో ఎవరికన్నా పూర్తిగా తెలుసా అనిపిస్తుంది. ‘మనకి అన్యాయం జరిగింది’ అని ఎవరి నాయకులు వారికి చెబుతారు. ఎవరూ వెనక్కి తగ్గరు.

ఒకసారి కార్ల్, స్టీవ్ గొడవపడతారు. “మనం ఎన్నో చట్టాలను ఉల్లంఘిస్తున్నాం” అంటాడు కార్ల్. “వారి లాగ నిర్దాక్షిణ్యంగా ఉంటే కానీ మనం వారిని ఓడించలేం” అంటాడు స్టీవ్. “మనం కూడా నిర్దాక్షిణ్యంగా ఉన్న సందర్భాలు లేవా? పాలెస్తీనా వాళ్ళే రక్తపాతం మొదలెట్టారా? మనకి ఆ భూమి ఎలా దక్కింది? గడ్డాలు పట్టుకోవటం వల్లా?” దీనితో స్టీవ్‌కి అసహనం వస్తుంది. అతను యూదులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా సహించడు. “ఇతని ప్యాంటు కిందకి లాగి చూడండి. సున్తీ చేసినట్టుంది. ఇతను శత్రువుల మనిషే అని నా అనుమానం” అంటాడు కార్ల్‌ని ఉద్దేశించి. కార్ల్‌కి కోపం కట్టెలు తెంచుకుంటుంది. “ఎంత ధైర్యం నీకు? నా కొడుకు ఇజ్రాయెల్ కోసం యుద్ధం చేసి మరణించాడు. నేను ఇజ్రాయెల్ కోసం ఎంతో చేశాను” అంటాడు. కార్ల్ లాంటి అనుభవం ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టు స్టీవ్ లాంటి ఉడుకు రక్తం వాళ్ళు అర్థం చేసుకోరు. ఇజ్రాయెల్ తన వంతు హింస చేసింది. మరి పాలెస్తీనా వారిదే తప్పని ఎలా అంటారు? ఇలా ఆలోచించేవారు పాలెస్తీనా లోనే కాదు ఇజ్రాయెల్ లోనూ ఉన్నారు.

ఈ చిత్రంలో యానుజ్ కమింస్కీ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కారు కిటికీ అద్దాలలోనూ, సైడ్ మిర్రర్లలోనూ, రియర్ వ్యూ మిర్రర్లలోనూ పాత్రల ప్రతిబింబాలు చూపించి, అదే సమయంలో వేరే పాత్రలను కూడా చూపించి అద్భుతాలే సృష్టించాడు. దూరం నుంచి చూసినా కారులో ఎవరున్నారో కనపడేలా లైటింగ్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అతనికి ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘సేవింగ్ ప్రైవేట్ రయన్’ చిత్రాలకి ఆస్కార్లు వచ్చాయి, కానీ ఈ చిత్రానికి కనీసం నామినేషన్ రాకపోవటం అన్యాయమని నా అభిప్రాయం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే (జార్జ్ జోనస్ రాసిన ‘వెంజెన్స్’ పుస్తకం ఆధారం), ఉత్తమ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార నామినేషన్లు వచ్చాయి, కానీ అవార్డులేమీ దక్కలేదు. ఆవ్నర్‌గా ఎరిక్ బానా, స్టీవ్‌గా డానియెల్ క్రెగ్ నటించారు. డానియెల్ క్రెగ్ దరిమిలా జేమ్స్ బాండ్‌గా నాలుగు చిత్రాల్లో నటించాడు. ఆవ్నర్ అధికారిగా జెఫ్రీ రష్ నటించాడు. ఉగ్రవాదులు మ్యూనిక్‌లో ఇజ్రాయెల్ క్రీడాకారులను ఎలా చంపారనేది అంతా ఒకసారి చూపించకుండా చిత్రం పొడుగునా కొంచెం కొంచెం చూపించటం కొంచెం విచిత్రంగా ఉంటుంది. దీని భావమేమిటో నాకు అర్థం కాలేదు. చివర్లో వచ్చే ఒక సన్నివేశానికి, హత్యాకాండకి ముడిపెట్టటమే ముఖ్య ఉద్దేశమనిపిస్తుంది. చిత్రంలో జరిగిన అన్ని సంఘటనలు నిజంగా జరగలేదు. కాబట్టి ఈ చిత్రాన్ని చరిత్రగా భావించకూడదు. చివర్న వచ్చే ఒక సన్నివేశంలో న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు కనిపిస్తాయి. ఈ చిత్రం షూటింగ్ జరిగే సమయానికే ఆ భవనాలు ఉగ్రవాద దాడిలో కూలిపోయాయి. గ్రాఫిక్స్ ఉపయోగించి ఆ భవనాలు చూపించారు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

సలామే అనే ఉగ్రవాద నాయకుడిని చంపటానికి ఆవ్నర్ బృందం లండన్ వెళుతుంది. అయితే సలామే సీఐఏతో పని చేస్తున్నాడని తెలుస్తుంది. అంటే అమెరికాకి మ్యూనిక్ హత్యాకాండ గురించి ముందే తెలుసా? తెలియదని లూయీ అంటాడు. ఆవ్నర్‌కి ఇంతకు ముందు ప్రాణాపాయం కలిగే పరిస్థితి రావటం తన తప్పు కాదని, రాబర్ట్ తప్పని లూయీ అంటాడు. అది నిజమని తర్వాత తెలుస్తుంది. రాబర్ట్‌కి బాంబులని నిర్వీర్యం చేసే పని తెలుసు కానీ బాంబులు తయారు చేయటంలో అనుభవం లేదు. అతను డబ్బు కోసం అబద్ధం చెప్పి ఈ పని ఒప్పుకున్నాడు. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. పని తెలియని వాడిని అంత తేలికగా చేర్చుకుంటారా? సలామేని బాంబులతో కాకుండా తుపాకీలతో చంపాలని నిర్ణయించుకుంటారు. అయితే సమయానికి అమెరికన్లు కొందరు తాగినట్టు నటించి ఆవ్నర్‌కి అడ్డు పడతారు. అంటే సీఐఏ వాళ్ళు సలామేని కాపాడారన్నమాట. ఎందుకు? సలామే అమెరికన్ దౌత్వవేత్తలని చంపకుండా ఉంటామని సీఐఏ తో ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా ఇజ్రాయెల్‌కి మద్దతుగా ఉంటుంది కానీ తమ పౌరుల క్షేమం ముందు వారికి ఏదీ ముఖ్యం కాదు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఆవ్నర్ బృందం మిషన్ గురించి అన్ని గూఢచార సంస్థలకూ తెలిసిపోయింది. బృందంలో ఎవరున్నారో కూడా తెలిసిపోయింది.

ఆవ్నర్ హోటల్లోని బార్లో ఉండగా ఒక స్త్రీ అతని వైపు ఓరచూపులు చూస్తూ ఉంటుంది. అతను ఆమె దగ్గరకు వెళతాడు. ఆమె అతన్ని ముగ్గులోకి దింపటానికి ప్రయత్నిస్తుంది. అతను సున్నితంగా నిరాకరించి వెళ్ళిపోతాడు. అప్పుడే కార్ల్ అక్కడి వస్తుంటాడు. ఆవ్నర్ “హనీ ట్రాప్ ఉంది చూసుకో!” అంటాడు. తర్వాత ఆవ్నర్ హోటల్ గదికి వస్తుంటే కార్ల్ గది దగ్గర ఆ స్త్రీ పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది. ఆవ్నర్ ముందు నవ్వుకుంటాడు. తర్వాత అనుమానం వచ్చి కార్ల్ గదిలోకి వెళతాడు. తలుపు తాళం తీసి ఉంటుంది. కార్ల్ నగ్నంగా చచ్చిపడి ఉంటాడు. ఆవ్నర్‌కి ఆ స్త్రీ మీద ముందే అనుమానం వచ్చిందని అనిపించినా నిజంగా ఆమె శత్రువుల మనిషని అతను అనుకోలేదు. సరదాగా ‘హనీ ట్రాప్’ అన్నాడంతే. నిజంగా నమ్మి ఉంటే కార్ల్ గది బయట ముందు నవ్వుకునేవాడు కాదు. పోనీ కార్ల్‌కి అనుమానం రాలేదా? ఏమో, అతను తెలిసే ఆమె వలలో పడ్డాడేమో! అతనికి అపరాధభావం ఉంది. ఈ విధంగా అతను ‘ఆత్మహత్య’ చేసుకున్నాడేమో! గూఢచారుల జీవితాలు అల్లకల్లోలంగా ఉంటాయి. ఒక్కోసారి నిస్పృహ ఆవహిస్తుంది. తాము చేస్తున్న పని ధర్మమేనా అనిపిస్తుంది. దేశం కోసం వారు ప్రాణాలనే పణంగా పెడతారు. కానీ ఎవరినీ నమ్మలేరు. తమని తాము కూడా!

కార్ల్‌ని చంపిన స్త్రీని చంపాలని ఆవ్నర్ బృందం నిశ్చయించుకుంటుంది. లూయీ ద్వారా ఆమె సమాచారం తెలుసుకుంటాడు ఆవ్నర్. ఆమె కేవలం డబ్బు కోసమే ఈ పని చేస్తుందని తెలుస్తుంది. అంటే ఆమెకి పాలెస్తీనా మీద కానీ, ఇజ్రాయెల్ మీద కానీ సానుభూతి లేదు. ఎవరు డబ్బిస్తే వారికి పని చేస్తుంది. ఆమెని చంపటానికి వెళుతుంటే రాబర్ట్ సంశయిస్తాడు. “మనం యూదులం. మన శత్రువులు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు. మనం ధర్మంగా ఉండాలి. నాకు మా తలిదండ్రులు అదే నేర్పించారు. ఇప్పుడు ధర్మం వదిలితే నా అంతరాత్మ ఒప్పుకోదు” అంటాడు. అంటే స్త్రీలను చంపకూడదనే నియమం ఉందని నాకనిపించింది. ధర్మమనేది యుగాన్ని బట్టి మారుతుంది. స్త్రీలు కూడా హత్యలకు దిగితే వారిని చంపకూడదనే నియమం అర్థరహితమే. ఆవ్నర్ రాబర్ట్‌ని విశ్రాంతి తీసుకోమంటాడు. అయితే రాబర్ట్ తర్వాత తన వర్క్‌షాప్ లోనే బాంబు ప్రమాదంలో మరణిస్తాడు. కార్ల్‌ని చంపిన స్త్రీని చంపాక హాన్స్ అంతరాత్మ కూడా అతని మీద తిరగబడుతుంది. తర్వాత అతని శవం ఒక పార్క్ బెంచ్ మీద దొరుకుతుంది. ఒంటి మీద కత్తిపోటు గాయాలుంటాయి. ఎవరు చంపారనేది తెలియదు.

ఆవ్నర్‌కి ప్రాణభయం పెరుగుతుంది. పరుపు కింద బాంబు ఉందేమో అని చూసుకుంటాడు. పరుపు లోపల ఉందేమో అని పరుపు చింపి చూస్తాడు. ఫోనులో ఉందేమో అని చూస్తాడు. టీవీలో ఉందేమో అని చూస్తాడు. చివరికి క్లోజెట్లో పడుకుంటాడు! సలామేని చంపటానికి ఆవ్నర్, స్టీవ్ మరో విఫలయత్నం చేస్తారు. ఇక మిషన్ ఆపేయమని ఆదేశాలు వస్తాయి. స్టీవ్ తన దేశమైన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాడు. ఆవ్నర్ ఇజ్రాయెల్‌కి వెళతాడు. అతన్ని తీసుకువెళ్ళటానికి వచ్చిన డ్రైవర్లు అతన్ని ఒక హీరోలా చూస్తారు. కానీ అతను నిర్వేదంలో ఉంటాడు. అతని అధికారి అతన్ని ప్రశంసిస్తాడు. ప్రధాని నుంచి అభినందన సందేశం వస్తుంది. అంతకన్నా ఏమిస్తారు? ఇది బహిరంగ యుద్ధం కాదు కదా పతకాలు ఇవ్వటానికి. ఆవ్నర్ అధికారి అతన్ని లూయీ గురించి చెప్పమంటాడు. ఆవ్నర్ నిరాకరిస్తాడు. అధికారి న్యాయవిచారణ చేస్తానని బెదిరిస్తాడు. “మీకు, నాకు సంబంధం లేదు కదా. ఎలా చేస్తారు?” అంటాడు ఆవ్నర్. అంతా రహస్యమే కాబట్టి అధికారికంగా ఏమీ చేయలేరు. సైనికులకి ఇచ్చినట్టు పతకాలు ఉండవు, అలాగే విచారణలూ ఉండవు.

ఆవ్నర్ తన తల్లిని కలుస్తాడు. ఆమె కుటుంబం మొత్తం నాజీల సాగించిన యూదుల ఊచకోతలో మరణించింది. ఆమె ఇజ్రాయెల్ వచ్చి ప్రాణాలు కాపాడుకుంది. ఆమెకి ప్రపంచం మీద కోపం. అందుకే కొడుకుని యూదుల రక్షకుడిగా చూడాలని ఆమె తపన. “ప్రాణాలు అర్పించినవారందరూ ఈ భూమి కోసం అర్పించారు. యూదులకి తమదైన భూమి ఉండాలని అర్పించారు. నువ్వేం చేశావో నాకు చెప్పొద్దు. భూగోళంపై మనకంటూ ఒక చోటు ఉంది, అది చాలు” అంటుంది. ఆవ్నర్ అమెరికాలో ఉన్న తన భార్యాబిడ్డల దగ్గరకి వెళతాడు. అతనికి పీడకలలు వస్తూ ఉంటాయి. వీధిలో ఏ కారులోనైనా తనను చంపటానికి హంతకులు వచ్చారేమో అని భయపడుతూ ఉంటాడు. ఒకరోజు ఆవ్నర్ లూయీ తండ్రికి ఫోన్ చేస్తాడు. “నన్ను చంపటానికి ఎవరన్నా ప్రయత్నిస్తున్నారా?” అని అడుగుతాడు. “ఆవ్నర్, నా నుంచి నీకు ఏ హానీ ఉండదు” అంటాడతను. అతనికి ఆవ్నర్ పేరు తెలుసు. అతన్ని నమ్మవచ్చా?

చివర్లో ఆవ్నర్ తన భార్యతో సంభోగం చేస్తుండగా మ్యూనిక్‌లో ఉగ్రవాదులు ఇజ్రాయెల్ క్రీడాకారులను కాల్చి చంపిన సంఘటన మధ్య మధ్యలో వస్తుంది. అవ్నర్ చేసేది సృష్టికార్యం, ఉగ్రవాదులు చేసినది మారణకాండ అని చెప్పటం ఉద్దేశం. ఇది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆవ్నర్ కూడా మారణకాండ చేశాడు. ఉగ్రవాదుల్లో కూడా అతనిలా క్షోభపడే వాళ్ళు ఉంటారు. ఆవ్నర్‌కి, వాళ్ళకీ సాపత్యాలు ఉన్నాయి. కొన్నాళ్ళకి ఆవ్నర్ అధికారి అతన్ని కలుసుకోవటానికి అమెరికా వస్తాడు. అతన్ని ఇజ్రాయెల్‌కి తిరిగి రమ్మంటాడు. అతని ఉద్దేశం ఆవ్నర్ తిరిగి గూఢచారిగా పనిచేయాలని. ఆవ్నర్ “నాకు ఒకటి తెలియాలి. నేను చంపిన వాళ్ళందరూ మ్యూనిక్ ఆపరేషన్‌లో పని చేశారా? ఆధారాలున్నాయా?” అని అడుగుతాడు. “ఎన్నో దాడుల్లో వాళ్ళ హస్తం ఉంది” అంటాడు అధికారి. “అలాగయితే వారిని అరెస్టు చేసి విచారించాల్సింది” అంటాడు ఆవ్నర్. “వాళ్ళు బతికుంటే మరింతమంది ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలు తీసేవారు. ఇది నీకు తెలుసు” అంటాడు అధికారి. “మనం చంపినవారి స్థానంలో ఇప్పుడు అంతకంటే క్రూరులైనవారు వచ్చి చేరారు” అంటాడు ఆవ్నర్. “గోళ్ళు మళ్ళీ పెరుగుతాయని గోళ్ళు తీసుకోవటం మానేస్తామా? నువ్వు చేసినది దేశం కోసం, శాంతి కోసం” అంటాడు అధికారి. “ఈ మార్గంలో వెళితే శాంతి సాధ్యం కాదు. ఇది నీకూ తెలుసు” అంటాడు ఆవ్నర్. ఎవరూ తమ వాదన విడిచిపెట్టరు. ఆ అధికారి దేశం కోసం అంతా చేస్తున్నానని అనుకుంటాడు కానీ అతను చేసేది కేవలం ప్రతీకారమే. దేశం కోసమైతే దీర్ఘకాల పరిష్కారం వెతకాలి. అదీ చేస్తాం, ఇదీ చేస్తాం అంటే ఒక స్థిరమైన విధానం లేనట్టే. ఆవ్నర్ కి అది అవగతమైంది. చివరికి ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వారి సిద్ధాంతాల లాగే ఎడమొహం, పెడమొహంగా!

Exit mobile version