మరుగునపడ్డ మాణిక్యాలు – 75: ద లాస్ట్ డాటర్

4
1

[సంచిక పాఠకుల కోసం ‘ద లాస్ట్ డాటర్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]అం[/dropcap]దరు తల్లులూ పిల్లలని బాగా చూసుకుంటారని సమాజంలో ఒక భావన. చూసుకోవాలని ఒక  రకమైన ఆంక్ష. కొందరు బాగా చూసుకోలేకపోవచ్చు. వారిని దోషులుగా చూడటం సబబేనా? ఇలా దోషులుగా చూడటం వల్లే కొందరు తల్లులు అపరాధభావంతో బాధపడతారు. మరి తండ్రులకి బాధ్యత లేదా? తండ్రులు తమ బాధ్యత సరిగా చేయకపోతే సమాజం పెద్దగా పట్టించుకోదేం? తల్లి మీద ప్రేమ ఉండాలి, తండ్రి అంటే భయం ఉండాలి అంటారు. అంటే పిల్లలకి ప్రేమ పంచటం పూర్తిగా తల్లి బాధ్యతేనా? అలా చేయలేని స్త్రీల సంగతేమిటి? ఇలాంటి ప్రశ్నలు గుప్పిస్తుంది ‘ద లాస్ట్ డాటర్’ (2021). ‘తప్పిపోయిన కూతురు’ అనే అర్థమే కాక ‘దారి తప్పిన కూతురు’ అనే అర్థం కూడా వస్తుంది. ఈ చిత్రం విషాదంగా కాక మానసిక విశ్లేషణ లాగా నడుస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.

లేడా ఒక అనువాదకురాలు. ఇటాలియన్ భాష మీద మంచి పట్టుంది. ఇటాలియన్ సాహిత్యం అధ్యయనం చేసింది. ఆమె కూతుళ్ళు చిన్నపిల్లలుగా (7 ఏళ్ళు, 5 ఏళ్ళు) ఉన్నప్పుడు ఓ పక్క అధ్యయనం, మరో పక్క పిల్లలని  చూసుకోవటం కుదరక సతమతమయ్యేది. కుంగుబాటుకి గురయ్యింది. ఆమె భర్త ఉద్యోగం మీద తరచు వేరే ఊళ్ళకి వెళుతూ ఉండేవాడు. అతను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవటానికి వంతులు వేసుకునేవారు. కానీ ఆమె భర్త ఒక్కోసారి తన పని ముఖ్యమని తప్పించుకునేవాడు. ఆమె ఈ ఒత్తిడిలో శృంగారాన్ని కూడా ఆస్వాదించలేకపోయేది. ఈ విషయాలన్నీ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో అక్కడక్కడా లేడా జ్ఞాపకాలలా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం లేడా ఒక ప్రొఫెసర్. వయసు 48 ఏళ్ళు. భర్త ప్రస్తావన రాదు కానీ ఆమె భర్త నుంచి విడిపోయిందని అనుకోవచ్చు. వేసవిలో ఒంటరిగా సెలవు మీద అమెరికా నుంచి గ్రీస్‌కి వెళుతుంది. సెలవులో తన అధ్యాపనానికి సంబంధించిన పని కూడా చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటుంది. సముద్రతీరంలో ఇల్లు. బీచ్ మాత్రం దూరంగా ఉంటుంది. అద్దె కారు తీసుకుని బీచ్‌కి వెళుతుంటుంది. బీచ్‌లో సేద దీరడమే కాకుండా తన పని కూడా చేసుకుంటుంది. బీచ్‌లో ఒక కుటుంబం ఆమెకి కనపడుతుంది. పెద్ద కుటుంబం. వారి పూర్వీకులు ఆ ఊరి వారే. ఆ కుటుంబంలో ఒక యువతి, ఆమె మూడేళ్ళ కూతురు ఉంటారు. యువతి పేరు నీనా. నీనా ఓపిగ్గా ఉంటుంది. కూతురు ఏం అల్లరి చేసినా భరిస్తూ ఉంటుంది. ఆమె భర్త మాత్రం అక్కడ ఉండడు. ఆ తల్లీకూతుళ్ళని చూసి లేడాకి భావోద్వేగం కలుగుతుంది. తాను తల్లిగా తన బాధ్యత సరిగా చేయలేదని ఆమె భావన. పాత జ్ఞాపకాలతో ఆమె మళ్ళీ కుంగుబాటుకి లోనవుతుంది.

కొన్నిరోజుల తర్వాత నీనా కుటుంబంలో ఇంకా కొంతమంది వస్తారు. ఆమె భర్త కూడా వస్తాడు. కొంచెం మొరటుగా ఉంటాడు. వాళ్ళందరూ బీచ్‌కి వస్తారు. లేడాకి వారు రావటం అంతగా నచ్చదు. నీనాకి ఆడపడుచు క్యాలీ. గర్భవతి. ఆమె పుట్టినరోజు బీచ్ మీద జరుపుకుంటూ ఉంటారు. లేడా అక్కడే కూర్చుని తన పుస్తకంలో ఏదో రాసుకుంటూ ఉంటుంది. క్యాలీ వచ్చి “మీరు పక్కకెళ్ళి కూర్చుంటారుగా?” అంటుంది. అలా అడగటంలోనే ఆమె దర్పమంతా కనపడుతుంది. ‘మీకు అభ్యంతరం లేకపోతే కాస్త పక్కకి వెళ్ళి కూర్చుంటారా?’ అంటే పద్ధతిగా ఉంటుంది. లేడాకి ఆమె పద్ధతి నచ్చక “లేదు. నేనిక్కడే కూర్చుంటాను” అంటుంది. క్యాలీ వెనకాలే వచ్చిన యువకుడు అసభ్య పదంతో లేడాని దూషిస్తాడు. క్యాలీ భర్త, నీనా భర్త వచ్చి క్యాలీకి నచ్చచెప్పి తీసుకుపోతారు. తర్వాత క్యాలీ కేకు పట్టుకుని వస్తుంది. సారీ చెప్పి కేకు ఇస్తుంది. లేడా గురించి వివరాలు అడుగుతుంది. తనకి 42 ఏళ్ళని, మొదటి గర్భమని, ప్రసవానికి రెండు నెలల సమయం ఉందని చెబుతుంది. లేడా తనకి ఇద్దరు కూతుళ్ళున్నారని చెబుతుంది. పెద్ద కూతురికి 25 ఏళ్ళు. చిన్న కూతురికి 23 ఏళ్ళు. “వాళ్ళెక్కడున్నారు?” అని అడుగుతుంది క్యాలీ. లేడా నవ్వి ఊరుకుంటుంది. తాను కూడా సారీ చెబుతుంది. “ఏదో గుబులుతో అలా మాట్లాడాను” అంటుంది. “మీ అమ్మాయిలకి దూరంగా ఉండటం వల్ల మనసు బాగాలేదేమో” అంటుంది క్యాలీ. “మీరే చూస్తారు లెండి. పిల్లలంటే ఒళ్ళు హూనమయ్యే బాధ్యత” అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లేడా. క్యాలీ వింతగా చూస్తూ ఉండిపోతుంది. మొదటి సారి గర్భవతి అయిన స్త్రీతో అలాంటి మాట అనవచ్చా? లేడా మానసిక స్థితి బాగాలేదని తెలిసిపోతూనే ఉంటుంది. ఆమె పిల్లలు లేకుండా సెలవు మీద రావటం క్యాలీకి వింతగా ఉంటుంది. తల్లి పిల్లల నుంచి దూరంగా ఉంటే మనసు వికలం అవుతుంది అనటంతో లేడాకి అసహనం వస్తుంది. పిల్లల చుట్టూనే తల్లి జీవితం తిరుగుతూ ఉండాలా? అలా ఉండకపోతే స్వార్థమా? అందుకే ఆమె “పిల్లలంటే ఒళ్ళు హూనమయ్యే బాధ్యత” అంటుంది. క్యాలీ కుటుంబంలోని మగవారు కూడా లేడాని వింతగా చూస్తుంటారు. స్త్రీ ఒక్కతే ఉంటే అందరికీ అనుమానమే. ఇదంతా పితృస్వామ్య ప్రభావం. మన దేశంలో ‘న స్త్రీ స్వతంత్రమర్హసి’ అనే స్మృతివాక్యానికి వక్రభాష్యం చెప్పి స్త్రీలని కట్టడి చేస్తారు. ఆ వాక్యానికి అర్థం స్త్రీకి రక్షణ లేకుండా ఉండకూడదు అని. నిజమే, స్త్రీకి రక్షణ ఉండాలి. కానీ ఆమెకి అవసరమైన స్వేచ్ఛ కూడా ఇవ్వాలి.

మర్నాడు నీనా కూతురు తప్పిపోతుంది. అందరూ వెతుకుతుంటారు. ఆ పాపకి చెందిన అమ్మాయి బొమ్మ బీచ్‌లో పడి ఉంటుంది. లేడా కూడా పాప కోసం వెతుకుతుంది. పాప ఆమెకి దొరుకుతుంది. నీనా ఆమెకి కృతజ్ఞతలు చెబుతుంది. అంతకు ముందు నీనా లేడాని చూసినా అదే వారిద్దరూ తొలిసారి మాట్లాడుకోవటం. నీనా లేడాని అబ్బురంగా చూస్తుంది. లేడా లాగా స్వతంత్రంగా ఉండాలని ఆమె కోరిక కావచ్చు. పాప బొమ్మ కనపడకుండా పోతుంది. పాప ఏడుస్తూ ఉంటుంది. అందరూ బొమ్మ కోసం చూస్తూ ఉంటారు. లేడా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆమె కారులో కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూస్తే అందులో పాప బొమ్మ ఉంటుంది! ఆమె బొమ్మ ఎందుకు తీసింది? కుంగుబాటులో ఉన్నవారు కొన్ని పనులు ఎందుకు చేస్తారో వారికే తెలియదు. నీనా మీద అసూయతో చేసి ఉండొచ్చు. లేడాకి అప్పుడప్పుడూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో నిద్రలో నడిచినట్టు వెళ్ళి బొమ్మని తెచ్చిందా? తెచ్చినా వెంటనే తిరిగి ఇచ్చెయ్యొచ్చుగా? తన మీద తనకున్న ఏహ్యభావంతో ఆమె ఇతరులకి కూడా తన నిజస్వరూపం తెలియాలని అంతరాంతరాల్లో అనుకుని ఉండవచ్చు. అంత ఏహ్యభావం కలగటానికి కారణం ఏమిటి? ఇది తర్వాత తెలుస్తుంది.

బీచ్‌లో సహాయకుడిగా విల్ అనే యువకుడు ఉంటాడు. అతను ఐర్లండ్‌కి చెందినవాడు. విద్యార్థి. సెలవుల్లో ఇక్కడికి పని చేయటానికి వచ్చాడు. లేడా అతనితో స్నేహం చేస్తుంది. బొమ్మని తీసుకున్నరోజు సాయంత్రం ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కి వెళతారు. లేడా తన కూతుళ్ళ గురించి విల్‌కి చెబుతుంది. తనకి స్తనాలు చిన్నగా ఉండేవని, పిల్లలు పుట్టాక పెద్దవయ్యాయని చెబుతుంది. ఇలాంటి మాటలు కొత్తగా పరిచయమైన వ్యక్తి, అందునా ఒక యువకుడికి చెప్పటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అతను మామూలుగా వింటాడు. ఆమె తనలో ఉన్న అపరాధభావాన్ని ఇలా మాటల్లో పోగొట్టుకోవాలని చూస్తోంది. ఒక్కోసారి పెద్దగా పరిచయం లేనివారితో మనం ఎన్నో విషయాలు పంచుకుంటాం. ఎబ్బెట్టుగా ఉండే విషయాలు వారికి చెబితే వారు పెద్దగా పట్టించుకోరు. పరిచయం ఉన్నవారైతే మనల్ని తప్పుపట్టొచ్చు. విల్ “నిన్న మీరు ఆ కుటుంబానికి ఎదురుగా ధైర్యంగా నిలబడ్డారు. కానీ ఇక నుంచి అలా చేయకండి. వాళ్ళు మంచివాళ్ళు కాదు” అంటాడు. తర్వాత లేడా తన బసకి వెళ్ళి బొమ్మని దాచేస్తుంది. వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలిశాక కూడా ఆమె బొమ్మని తిరిగి ఇవ్వకపోవటం ఆమె మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఆమెకి అదో ఆట లాగా ఉంటుంది.

మర్నాడు లేడా బొమ్మల దుకాణానికి వెళుతుంది. బొమ్మకి తొడగటానికి బట్టలు కొంటుంది. అప్పుడే నీనా, నీనా కూతురు, క్యాలీ, క్యాలీ భర్త కొత్త బొమ్మ కొనాలని వస్తారు. నీనా భర్త వెళ్ళిపోయాడు. అతను వారాంతాలలోనే వస్తుంటాడు. లేడా బొమ్మల దుకాణంలో ఉండటం క్యాలీకి వింతగా ఉంటుంది. “మీకు మనవలున్నారా?” అని అడుగుతుంది. లేరంటుంది లేడా. నీనా కూతురికి జ్వరం వచ్చిందని క్యాలీ అంటుంది. ఆ పాప బొమ్మ కోసం బొంగ పెట్టుకుందని తెలిసిపోతూనే ఉంటుంది. తల్లి చంక దిగనంటుంది. నీనా విసిగిపోయి ఉంటుంది. “నాకు పిచ్చెక్కిస్తోంది” అంటుంది లేడాతో. క్యాలీ పాపకి తీసుకుంటుంది. “పిల్లలు సహనాన్ని పరీక్షిస్తారు కదా? మీ పిల్లలు ఈ వయసులో ఇలాగా ఉండేవారా?” అంటుంది క్యాలీ లేడాతో. “నాకు గుర్తు లేదు” అని అబద్ధమాడుతుంది లేడా. క్యాలీకి పిల్లలు లేకపోయినా ఆమె అన్నీ తెలిసినట్టు మాట్లాడటం ఆమెకి నచ్చదు. క్యాలీ తక్కువ తినలేదు. “తల్లికి పిల్లల సంగతులన్నీ గుర్తుంటాయి కదా?” అంటుంది. “ఇది మీ అనుభవంతో చెబుతున్నారా?” అంటుంది లేడా. క్యాలీ భర్త వింతగా చూస్తాడు. లేడాకి వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలుసు. అయినా ఆమె నిప్పుతో చెలగాటమాడుతూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమెకి మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. తమాయించుకుని నీనాతో “ఎన్ని బొమ్మలు కొన్నా ఒక్కటే. మీ బొమ్మ మీకు దొరుకుతుంది లెండి” అని వెళ్ళిపోతుంది. అయినా వాళ్ళు కొత్త బొమ్మ కొంటారు. తర్వాత నీనా కుటుంబం పాత బొమ్మ కోసం కరపత్రాలు పంచుతూ ఉంటారు. అంటే నీనా కూతురికి కొత్త బొమ్మ నచ్చలేదన్నమాట.

సమాంతరంగా ఇంకో కథ నడుస్తూ ఉంటుంది. లేడా బస చేసిన ఇల్లు యజమాని లైల్. 70 ఏళ్ళ పైనే ఉంటాయి. నీనా కుటుంబం చేసే వ్యాపారంలో అతను సహాయకుడు. అతనికి నీనా కుటుంబం గురించి తెలుసు. నీనా కూతురు తప్పిపోతే లేడా వెతికి పట్టుకుందని తెలుసు. బొమ్మ పోయిందని కూడా తెలిసే ఉంటుంది. అతను ఒకరోజు లేడా భోజనం చేస్తుంటే ఆమె దగ్గరకి వస్తాడు. ఆమె అతన్ని దూరంగా ఉండమన్నట్టు మాట్లాడుతుంది. నీనా కుటుంబం బొమ్మ కోసం కరపత్రాలు పంచుతున్నారని తెలిశాక లేడా ఆ బొమ్మని బయటికి తీస్తుంది. బొమ్మ లోపలికి నీళ్ళు వెళ్ళాయని తెలిసి ఆ నీరు తీయటానికి ప్రయత్నిస్తుంటే లైల్ వస్తాడు. ఆక్టోపస్ తీసుకుని వస్తాడు. లేడా వద్దంటున్నా వండిపెడతాడు. మాటల్లో అతను భార్యని, పిల్లల్ని వదిలేశాడని తెలుస్తుంది. “అప్పుడప్పుడూ నేను వాళ్ళకి ఇక్కడ దొరికే సీ ఫుడ్ పంపిస్తూ ఉంటాను” అని చెబుతాడు. ఆమె “మీకు కుటుంబమంటే ప్రేమ చాలానే ఉందే” అంటుంది. కుటుంబాన్ని వదిలేసి సీ ఫుడ్ పంపించటం గొప్ప విషయమా అని ఆమె వ్యంగ్యం. అతను చిన్నబుచ్చుకుంటాడు. మగవాడు కుటుంబాన్ని వదిలేయవచ్చు, కానీ ఆడది మాత్రం కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఇదేం న్యాయం? అయితే లేడా అతనికి సారీ చెబుతుంది. అతను “ఏం పర్లేదు. నేనూ పెద్ద తప్పులే చేశాను” అంటాడు. నీనా కూతరి బొమ్మ అక్కడుండటం చూస్తాడు. అయినా ఏమీ తెలియనట్టు ఉండిపోతాడు. ఇక్కడ లేడాగా నటించిన ఒలివియా కోల్మన్ నటన అద్భుతంగా ఉంటుంది. ‘నువ్వు బొమ్మని దొంగిలించి తప్పు చేయలేదా’ అని అతను అడుగుతాడేమో అని అనుమానం ఒక పక్కన ఉంటుంది. అయినా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటుంది.

ఎలెనా ఫెర్రాంతే రాసిన నవల ఆధారంగా మ్యాగీ జిలెన్హాల్ స్కీన్ ప్లే రాసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్ అందుకుంది. నడివయసు లేడాగా ఒలివియా కోల్మన్, యువ లేడాగా జెసీ బక్లీ నటించారు. ఇద్దరూ ఆస్కార్ నామినేషన్లు అందుకున్నారు. నీనాగా డకోటా జాన్సన్ నటించింది. మొదట్లో ఆమె ఉత్తమురాలిగా కనిపిస్తుంది. కానీ తర్వాత ఆమెలో ఉన్న బలహీనతలు బయటపడతాయి. లేడా లాంటి వాళ్ళు అందరూ తమకంటే ఉత్తములే అనుకుంటారు. ఎన్నిసార్లు అది తప్పని రుజువైనా! అందరిలో బలహీనతలు ఉంటాయి. వాటిని లోపాలుగా చూడటం సమాజానికి సరదా. లేడా మానసిక స్థితి చూపించే సన్నివేశాలు చిత్రంలో చాలా ఉంటాయి. మచ్చుకి ఒకటి. ఒకరోజు లేడా బీచ్ నుంచి తన కారు దగ్గరకి వస్తే అక్కడ నీనా భర్త కారుకి జేరబడి నిల్చుని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె అక్కడికి వెళ్ళి “ఇది నా కారు” అంటుంది. అతను వెటకారంగా చిరునవ్వు నవ్వుతాడు. కానీ మర్యాద గానే మట్లాడతాడు. “పాప కోసం వెతికినందుకు థ్యాంక్స్. నీనాని సముదాయించినందుకు కూడా” అంటాడు. లేడా కారు తలుపు తెరవబోతే అది తన కారు కాదని తెలుస్తుంది. ఆమె “ఓ! ఇది నా కారు కాదు” అని తన కారు దగ్గరకి వెళ్ళిపోతుంది. “కాదు” అంటాడతను. ఎవరి మీదైనా కోపం కానీ, భయం కానీ ఉంటే వారు మనకి హాని చేస్తారేమోననే అనుమానం ఉంటుంది. అది బుద్ధి మీద ప్రభావం చూపుతుంది. అదే ఇక్కడ చక్కగా చూపించారు. ఇలాంటి సైకలాజికల్ అంశాలు చాలా ఉంటాయి చిత్రంలో. పురుషాధిక్య సమాజం మీద వ్యాఖ్యానం కూడా ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

లేడా బొమ్మని నీనాకి తిరిగి ఇచ్చేయాలని ఆమె కుటుంబం బస చేసిన ఇంటి దగ్గరకి వెళ్ళి నీనాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ మోగటం లేడాకి వినిపిస్తుంది. నీనా మాటలు కూడా వినపడతాయి. లేడా ఆ పక్కకి వెళ్ళి చూస్తే ఓ గోడ చాటున నీనా, విల్ ముద్దులు పెట్టుకుంటూ కనపడతారు. నీనా కుటుంబం మంచివాళ్ళు కాదని చెప్పినది విల్లే. అయినా అతను నీనాతో సరసాలాడుతున్నాడు. నీనాయే అతన్ని ముగ్గులోకి దింపి ఉండవచ్చు. నీనా ఫోన్ ఎత్తుతుంది కానీ లేడా అక్కడి నుంచి గబగబా వచ్చేస్తుంది. లేడాకి తన గతం గుర్తు వస్తుంది. ఆమె తన పిల్లలు చిన్నవారుగా ఉన్నపుడు ఒక కాన్ఫరెన్స్‌కి వెళుతుంది. అక్కడ ఒక ప్రొఫెసర్ ఆమె రాసిన పరిశోధనాపత్రం గురించి తన ప్రసంగంలో మాట్లాడతాడు. ఆమె అక్కడే ఉందని అతనికి తెలియదు. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు ఆకర్షితులవుతారు. అతను “నీ మీద నాకు కోరిక ఉంది. నీకు పెళ్ళయిందని తెలుసు. మనిద్దరి మధ్య ఏమన్నా జరగాలంటే నువ్వే మొదటి అడుగు వేయాలి” అంటాడు. ఆమే శృంగారం మొదలుపెడుతుంది. ఈ విధంగా తన జీవితంపై తాను నియంత్రణ కోల్పోలేదనే భావన పొందుతుంది. తన జీవితాన్ని తాను తప్ప ఎవరూ శాసించలేరని తనని తానే సముదాయించుకుంటుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనమే. మళ్ళీ జీవితాన్ని సరైన దృక్కోణంతో చూస్తే నిజం నగ్నంగా ఎదుట నిలబడుతుంది.

మళ్ళీ ప్రస్తుతకాలంలోకి వస్తే బజార్లో నీనా లేడాని కలుస్తుంది. ఆమె కూతురు ఆమెతోనే ఉంటుంది. “బొమ్మ పోయినప్పటి నుంచి తాను నిద్రపోదు, నన్ను నిద్ర పోనివ్వదు” అంటుంది నీనా. ఆమె పెట్టుకున్న వెడల్పాటి టోపీ ఎగిరిపోతుంటే అది ఎగిరిపోకుండా పెట్టుకోవటానికి లేడా ఆమెకి ఒక హ్యాట్ పిన్ కొనిస్తుంది. నీనా “మీరు ఫోన్ చేశారుగా. మీరు నన్ను విల్‌తో కలిసి ఉండగా చూశారని నాకు అర్థమయింది. నా గురించి చెడుగా అనుకోవద్దు” అంటుంది. ఆమెకి లేడా అంటే ఒక రకమైన ఆరాధన. క్యాలీ ఆమెని లేడాతో మాట్లాడొద్దని చెప్పటంతో ఆమె దొంగచాటుగా లేడాతో మాట్లాడుతుంది. లేడా “నేనెవరి గురించీ చెడుగా అనుకోను” అంటుంది. ఇలా అనేవారు అందరినీ ప్రేమించేవారైనా అయి ఉండాలి లేక తమని తాము ద్వేషించుకునేవారైనా అయి ఉండాలి. లేడా రెండో కోవకి చెందినది. “నేను విల్‌తో హద్దులు దాటలేదు. నా భర్తకి నా మీద చాలా ప్రేమ. పాప మీద కూడా. నేను ఆనందంగా ఉన్నాను” అంటుంది. లేడాకి అది అబద్ధమని తెలుసు. అందుకే నీనా అడగగానే ఆమె తాను అత్యంత రహస్యంగా దాచుకున్న విషయాన్ని చెప్పేస్తుంది. నీనా “ఆరోజు బొమ్మల దుకాణంలో మీకేమయింది?” అని అడుగుతుంది. లేడా “నేను నా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను. నా భర్త, నా తల్లి వాళ్ళని చూసుకున్నారు. మూడేళ్ళ తర్వాత మళ్ళీ నా పిల్లల దగ్గరకి వెళ్ళాను” అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. “పిల్లలకి దూరంగా ఉంటే ఎలా అనిపించింది?” అంటుంది నీనా. “అద్భుతంగా అనిపించింది” అని విలపిస్తుంది లేడా. ఆమె నిజంగానే బాధపడుతుంది. కానీ ఆమె ఈ విషయం నీనాకి చెప్పటం వెనక కారణమేంటి? నీనాకి తన మీద ఉన్న ఆరాధన తప్పని చెప్పటమా? లేక నీనాకి ‘నిన్ను నువ్వు మోసం చేసుకోకు’ అని చెప్పటమా? మనిషి మనసు ఎంత విచిత్రమైనది! ‘లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు’ అన్నారు ఆత్రేయ. ఉన్నది వదిలితే కానీ దాని విలువ తెలియదు. ఇదే విషాదం. ప్రొఫెసర్ కోసం లేడా పిల్లలని వదలలేదు. తనకిష్టమైన రంగంలో కృషి చేయటానికి వదిలి వెళ్ళింది. పిల్లలు, వ్యాపకం.. రెండిటి మధ్య సమతౌల్యం సాధ్యం కాదా? దానికి జీవిత భాగస్వాముల సాయం కావాలి. ఆడవారి విషయంలో ఈ సాయం అంత తేలిగ్గా దొరకదన్నది కాదనలేని నిజం.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

బజార్లో నీనా, లేడా మాట్లాడుకుంటుంటే నీనా భర్త దూరాన కనపడతాడు. “అతను రేపు కదా రావలసింది” అనుకుంటూ నీనా ఆదరాబాదరాగా వెళ్ళిపోతుంది. ఆరోజు రాత్రి విల్ లేడా బస చేసిన ఇంటి దగ్గరకి వస్తాడు. లేడా బయట నుంచి వస్తుంది. ముభావంగా ఉంటుంది. “మీరున్న ఇల్లు మేం కొన్ని గంటలు వాడుకోవచ్చా అని నీనా అడగమంది” అంటాడు విల్. అంటే నీనా హద్దు దాటటానికి నిశ్చయించుకుందన్నమాట. లేడా పిల్లలని వదిలేసి వెళ్ళిన సంగతి విన్న నీనా ఆమె ప్రియుడి కోసం వెళ్ళిపోయిందని అనుకుని ఉండవచ్చు. ఆమె అంత పని చేసినపుడు తాను అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి అనుకుని ఉండవచ్చు. అందుకే ఆమె అర్థం చేసుకుంటుందని ఆమె ఇల్లు కావాలని అడగమని విల్‌ని పంపింది. పైగా లేడా ‘నేనెవరి గురించీ చెడుగా అనుకోను’ అంది కదా. “నీనాని వచ్చి నాతో మాట్లాడమను” అంటుంది లేడా.

నీనా లేడా బస చేసిన ఇంటికి వస్తుంది. లేడా ఇంటి తాళాలు తెచ్చి ఆమె ఎదురుగా కాఫీ టేబుల్ మీద పెడుతుంది. “నేను తప్పు చేస్తున్నానా?” అంటుంది నీనా. “అది నువ్వే తేల్చుకోవాలి” అంటుంది లేడా. “ఈ కుంగుబాటు పోతుందంటారా?” అంటుంది నీనా కన్నీళ్ళు పెట్టుకుంటూ. లేడా మాట మార్చాలని ప్రయత్నిస్తుంది. “మీకు పిల్లలు లేని జీవితం అద్భుతంగా అనిపిస్తే మళ్ళీ పిల్లల దగ్గరకి ఎందుకు వెళ్ళారు?” అంటుంది నీనా. “వాళ్ళ మీద బెంగతో వెళ్ళాను. నేను స్వార్థపరురాలిని” అంటుంది లేడా. నీనా సందిగ్ధంలో పడుతుంది. లేడా బొమ్మని తీసుకొచ్చి ఇస్తుంది. నీనాకి పెద్ద భారం దిగినట్టు ఉంటుంది. ఆ బొమ్మతో తన కూతురు శాంతిస్తుందని ఆమె అనుకుంటుంది. ఎక్కడ దొరికిందని అడిగితే లేడా తాను  దొంగిలించానని అంటుంది. నీనాకి సంభ్రమం కలుగుతుంది. లేడా “అదొక ఆటలా అనుకున్నాను. నేనొక విచిత్రమైన తల్లిని. సారీ” అంటుంది. బొమ్మ పోకుండా ఉండి ఉంటే తన కూతురు మామూలుగా ఉండేదని నీనా భావన. కాబట్టి తన కుంగుబాటుకి లేడాయే కారణమని అనుకుంటుంది. బొమ్మను తీసుకుని వెళ్ళిపోతుంటే లేడా “నువ్వు ఇంకా చిన్నదానివి. ఈ కుంగుబాటు పోదు” అంటుంది. నీనా హ్యాట్ పిన్‌తో లేడా కడుపులో గుచ్చి “నీ పని అయిపోయింది చూసుకో” అని అసభ్యపదాలతో దూషించి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి లేడా ఇల్లు ఖాళీ చేసి కారులో బయలుదేరుతుంది. కడుపు గాయం కారణంగా కళ్ళు తిరిగి కారు అదుపు తప్పుతుంది. లేడా కారు దిగి సముద్రతీరం వైపు వెళ్ళి కుప్పకూలిపోతుంది. మర్నాడు ఉదయం ఆమె కూతుళ్ళు ఫోన్ చేస్తారు. చిన్నప్పుడు తన కూతుళ్ళతో ఆమె ఒక ఆట ఆడేది. బత్తాయి పండు తొక్క విరిగిపోకుండా మొత్తం తొక్కని ఒక పాములాగా తీసి ఆడుకునేవారు. లేడాకి ఇప్పుడు ఒక బత్తాయి పండు తన ఒళ్ళో కనపడుతుంది. ఆమె తొక్క తీస్తూ తన కూతుళ్ళతో ఫోన్లో మాట్లాడుతుండగా చిత్రం ముగుస్తుంది. ప్రేక్షకులు దీన్ని తమకి ఇష్టం వచ్చిన రీతిలో అర్థం చేసుకోవచ్చు. నాకైతే లేడా చనిపోయిందని, చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ తన పిల్లలతో ఆడుకునే ఆనందకరమైన క్షణాలని తలచుకుందని అనిపించింది. ఉదయం అవ్వటమంటే ఆమె శరీరాన్ని విడిచిపెట్టిందనటానికి సంకేతం.

నీనాని, ఆమె కూతుర్ని చూసి లేడాకి తన గతం గుర్తొచ్చింది. తాను పిల్లల్ని వదిలిపోవటం తప్పనే భావన ఒక్కసారిగా కమ్మేసింది. దాంతో పాటు వారి బంధం అంత గొప్పదా అనే ప్రశ్న కూడా ఉదయించింది. అదే సమయంలో ఒక్కత్తే ధైర్యంగా ఉన్న లేడాని చూసి నీనాకి ‘నేను ఆమెలా ఉండాలి’ అనే భావన కలిగింది. దూరపు కొండలు నునుపు కదా! లేడా తాను గతంలో చేసిన తప్పులు తలచుకుంటే.. నీనా తన భవిష్యత్తు ఇంకా బావుండాలి అనుకుంది. ఉన్నదానితో సంతృప్తి పడటం మనిషికి ఎప్పుడూ కష్టమే. లేడా తన తల్లిని సాయం అడిగి ఉంటే ఆమెకి ఒత్తిడి తగ్గేది. కానీ ఆమెకి తన తల్లి అంటే ఇష్టం లేదు. చివరికి ఆమె కూడా చెడ్డ తల్లే అనిపించుకుంది. దారితప్పిన కూతురు (lost daughter) అయింది. ఎందుకంటే లేడా వదిలేసిన పిల్లల్ని ఆమె తల్లి సాకింది. సమాజంలో ఉన్న కొన్ని అలిఖిత నియమాల వల్ల లేడా మీద చెడ్డ తల్లి అనే ముద్రపడింది. ఆ ముద్ర కాలక్రమేణా చెరిగిపోయినా ఆమె మనసు మీద మాత్రం ఉండిపోయింది. కొందరు స్త్రీలు పిల్లలను సరిగా చూసుకోలేకపోవచ్చు. అప్పుడు వారిని తప్పుపట్టడం కాకుండా వేరే దారి చూడాలి. ఆ తల్లులని కాకుల్లా పొడుస్తూ ఉంటే ఏం లాభం? చివరికి లేడాని ఆరాధించిన నీనా వల్లే లేడాకి అపాయం కలిగింది. నీనా భర్త విల్ మీద దాడి చేయటమో, లేడా మీద దాడి చేయటమో జరగలేదు. నీనాయే లేడా మీద దాడి చేసింది. దానికి మూలకారణం లేడాకి తన మీద తనకి ఉన్న ద్వేషం కాదా? దానికి కారణం సమాజం కాదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here