మరుగునపడ్డ మాణిక్యాలు – 76: డోన్ట్ లుక్ అప్

0
1

[సంచిక పాఠకుల కోసం ‘డోన్ట్ లుక్ అప్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]వ్యం[/dropcap]గ్యాత్మక చిత్రాలు సమాజం లోని వింత పోకడలని ఎత్తి చూపిస్తాయి. మామూలుగా ఏ ఒక్క అంశాన్నో తీసుకుని వ్యంగ్యం జోడించి చూపిస్తాయి. ఉదాహరణకి ‘కన్యాశుల్కం’ ఒక వ్యంగ్యాత్మక చిత్రం. కన్యాశుల్కం అనే ఆచారం ఎలా వెర్రితలలు వేసిందో చూపించిన చిత్రం. సమాజం లోని చాలా పోకడలని ఒకేసారి వ్యంగ్యంగా చూపించాలంటే ఆ కథ పరిధి విస్తృతంగా ఉండాలి. అలాంటి చిత్రమే ‘డోన్ట్ లుక్ అప్’ (2021). ఆ కథ ప్రపంచం యొక్క వినాశనం. ప్రపంచం నాశమవుతుంటే శాస్త్రవేత్తలు ఎలా స్పందిస్తారు, రాజకీయనాయకులు ఎలా స్పందిస్తారు, మీడియా ఎలా స్పందిస్తుంది, వ్యాపారవేత్తలు ఎలా స్పందిస్తారు అనే విషయాలని చూపించిన తీరు అబ్బురపరుస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. చిత్రం మొదట్లో ఒక హాస్య రచయిత అన్న మాటలు తెరపై వస్తాయి. “నాకు మా తాతయ్య లాగా నిద్రలో ప్రశాంతంగా చనిపోవాలని ఉంది, ఆయన నడిపే కారులోని ప్రయాణీకుల్లా భయంతో అరుస్తూ కాకుండా.” కారు నడిపేవాడు నిద్రపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మన ప్రపంచాన్ని నడిపే శక్తుల చేతిలో మన పరిస్థితి కూడా అంతే! ‘డోన్ట్ లుక్ అప్’ అంటే ఆకాశంలోకి చూడవద్దు అని శబ్దార్థం. భావార్థం ‘తల వంచుకుని ఉండండి’ అని. ప్రపంచాన్ని నడిపే శక్తులు ప్రజల్ని తల వంచుకుని ఉండమనే చెబుతూ ఉంటాయి. చిత్రానికి ట్యాగ్ లైన్ ‘బేస్డ్ అన్ ట్రూలీ పాసిబుల్ ఈవెంట్స్’. అంటే ‘నిజంగా జరిగే అవకాశం ఉన్న సంఘటనల ఆధారంగా’ అని. మామూలుగా ‘యథార్థ సంఘటనల ఆధారంగా’ అని ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా వ్యంగ్యమే కనిపిస్తుంది.

అమెరికాలో కేట్ అనే పీఎహ్.డీ విద్యార్థి ఒక తోకచుక్కని కనిపెడుతుంది. ఆమె ప్రొఫెసర్ ర్యాండల్ లెక్కలేసి ఆ తోకచుక్క ఆరున్నర నెలల్లో భూమిని ఢీకొంటుందని, భూమి నాశనమౌతుందని తేలుస్తాడు. “ఇది నిజంగా జరుగుతోందా లేక కలా” అని జుట్టు పీక్కుంటాడు. కేట్ స్థిమితంగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఆమె లోలోపల భయపడుతూ ఉంటుంది. తోకచుక్క విషయాన్ని నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) వారికి తెలియజేస్తారు. అక్కడి నుంచి వచ్చిన టెడ్డీ అనే శాస్త్రవేత్త వీళ్ళిద్దరినీ తీసుకుని శ్వేతసౌధానికి వెళతాడు అధ్యక్షురాలికి విషయం చెప్పటానికి. అమెరికాకి ఇంతవరకు మహిళా అధ్యక్షురాలు ఎన్నుకోబడలేదు. ఈ చిత్రంలో మహిళా అధ్యక్షురాలు ఉన్నట్టు చూపించారు. ఈ పాత్రని ప్రఖ్యాత నటి మెరిల్ స్ట్రీప్ పోషించింది. ఆమె ఎంత గొప్ప నటో మరోసారి నిరూపించింది. అధ్యక్ష పదవిలో ఉన్నది మహిళ కాబట్టి నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పురుషుడైనా, స్త్రీ అయినా రాజకీయనాయకులందరూ ఒకేలాగ ఉంటారు, అదేం చిత్రమో. సుప్రీమ్ కోర్టుకి కొత్త జడ్జీని నియమించే పనిలో తలమునకలై ఉంటుంది. ర్యాండల్ బృందం వేచి చూస్తూ ఉంటుంది. “మేమెందుకు వస్తున్నామో ముందే చెప్పాం కదా, అయినా పట్టించుకోరేం?” అంటుంది కేట్. మొత్తానికి మర్నాడు అధ్యక్షురాలిని కలుస్తారు. ఆమె పేరు జేనీ. ఆమె కొడుకే ఆమె క్యాబినెట్‌కి ముఖ్యుడు. ఇక్కడ కూడా బంధుప్రీతే.

“ఈ తోకచుక్క భూమి ఢీకొనే అవకాశం ఎంత ఉంది?” అని అడుగుతుంది జేనీ. “వంద శాతం” అంటాడు ర్యాండల్. జేనీ పరిహాసంగా నవ్వుతుంది. “ఏదీ వంద శాతం జరుగుతుందని చెప్పలేం” అంటుంది. రాజకీయాల్లో ఏదీ వంద శాతం జరుగుతుందని చెప్పలేరు కదా, అలాగే ఇది కూడా అనుకుంటుంది. ర్యాండల్ “99.78 శాతం” అంటాడు. గణితంలో అది వందశాతం కిందే లెక్క. “70 శాతం అనుకుని ముందుకెళదాం. ప్రస్తుతానికి ఏమీ చేయక్కరలేదు. పరిస్థితిని గమనిస్తూ ఉందాం. మీరు పని చేసే యూనివర్సిటీ చిన్నది కాబట్టి పెద్ద యూనివర్సిటీల వాళ్ళని కూడా అడుగుదాం” అంటుంది. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ విషయం బయటపడితే ప్రమాదమని అంటుంది. రాజకీయ నాయకులకి తమ పబ్బం గడుపుకోవటమే ముఖ్యం. దాని తర్వాతే ఏదైనా.

టెడ్డీ ర్యాండల్‌నీ, కేట్‌నీ మీడియా వారి దగ్గరకి వెళ్ళమని చెబుతాడు. వారు ఒక పత్రికకి విషయం చెబుతారు. తర్వాత ఒక టీవీ చానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తారు. పొద్దుటి పూట సరదాగా కబుర్లు చెప్పే కార్యక్రమమది. ఒక పురుష యాంకర్, ఒక మహిళా యాంకర్ ఉంటారు. కార్యక్రమం మొదలయ్యే ముందు కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ ఒక గదిలో కూర్చుని ఉంటారు. అందరూ సరదాగా ఉంటారు. కేట్‌కి వింతగా ఉంటుంది. “మేం ఏం చెప్పబోతున్నామో తెలుసా?” అని కేట్ అడుతుంది అక్కడి నిర్వాహకుడిని. “సైన్స్ అంటే మా యాంకర్లకి చాలా ఇష్టం. సరదాగా సైన్స్ విషయాలు వివరిస్తే సంబరపడతారు” అంటాడతను. కేట్‌ని నిస్పృహ ఆవహిస్తుంది. అదే కార్యక్రమానికి ఒక పాప్ గాయని ఇంటర్వ్యూ ఇవ్వటానికి వస్తుంది. ఆమెకి ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది. ఆ పాప్ గాయని ఎవరో ర్యాండల్‌కి తెలియదు కానీ కేట్‌కి తెలుసు. ర్యాండల్ మర్యాదగా “మీ బ్రేకప్ గురించి విన్నాను. చాలా బాధేసింది” అంటాడు. “నీ పని నువ్వు చూసుకో ముసలోడా” అంటుందామె. నలభై ఏళ్ళు దాటితే అందరూ ముసలోళ్ళే ఈనాటి యువతరానికి. తాము కూడా ఒకనాటికి ముసలివాళ్ళమవుతామనే ఎరుక ఉండదు కదా!

కార్యక్రమంలో తోకచుక్క గురించి చెబుతారు ర్యాండల్, కేట్. “ఈ తోకచుక్క ఎవరి ఇల్లైనా నేలమట్టం చేయగలదా” అంటాడు యాంకరుడు. “మొత్తం భూమికే హాని చేయగలదు” అంటాడు ర్యాండల్. “తోకచుక్క నా మాజీ భార్య ఇంటిపై పడేలా మీరు చేయగలరా?” అని హాస్యమాడతాడు యాంకరుడు. కేట్‌కి చిర్రెత్తుకొస్తుంది. “మీకర్థం కావట్లేదా? భూమి నాశనం కాబోతోంది” అంటుంది. “మేం దుర్వార్తలని కూడా తేలికగా చెబుతాం” అంటుంది యాంకరి. “ప్రపంచం నాశనమయ్యే వార్తని తేలిగ్గా తీసుకోకూడదని మీకనిపించట్లేదా? మనమందరం చావబోతున్నాం” అని అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది కేట్. యాంకరి “ఆమె స్వభావమే అంతా? నేనేమన్నాను?” అంటుంది నవ్వుతూ ర్యాండల్‌తో. టీవీలో వార్తలు కూడా వినోదమైపోయిన రోజులివి. ఎక్కువమంది తమ చానల్ చూడాలని చాలామంది వింత వింత గిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో అసలు వార్తల గంభీరతని కూడా మరచిపోతుంటారు. కేట్ ‘మనమందరం చావబోతున్నాం’ అన్నప్పుడు భయంతో ఉన్న ఆమె ముఖాన్ని మీమ్స్‌గా మార్చి నెటిజెన్లు ఎగతాళి చేస్తారు. సోషల్ మీడియా లైకుల కోసం వైరల్ చేయటమే ముఖ్యమనుకుంటున్నారు కానీ అసలు విషయమేమిటని ఎంతమంది ఆగి ఆలోచిస్తున్నారు? మొత్తానికి ర్యాండల్, కేట్ చేసిన ఈ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. మరో పక్క పాప్ గాయని కార్యక్రమంలో ఉండగానే వీడియో కాల్లో తను వదిలేసిన ప్రియుడితో మాట్లాడేలా ఏర్పాటు చేస్తారు యాంకర్లు. ఆ ప్రియుడు కూడా పాప్ గాయకుడే. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. దానితో సోషల్ మీడియాలో సంచలనం రేగుతుంది. ర్యాండల్ భార్య, కొడుకులు కార్యక్రమం చూస్తూ ఉంటారు. ర్యాండల్ కొడుకు ఒకడికి ఫోన్లో సోషల్ మీడియాలో ఈ పాప్ జంటకి సంబంధించిన నోటిఫికేషన్లు వెల్లువలా వస్తూ ఉంటాయి. “నా ఫోన్ ఆ గాయకుడు పాడిన పాట ఒకదానిని కొనేసింది. నేను అడక్కుండానే” అంటాడు. ఇప్పుడు మన అభిరుచులని తగ్గట్టు మన ఫోన్ అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని సూచిస్తోంది. కొన్నాళ్ళకి మన ప్రమేయం లేకుండా ఫోనే కొనుగోళ్ళు చేసేసినా ఆశ్చర్యం లేదు.

ఇంతలో అధ్యక్షురాలు జేనీ గురించి ఒక నీలివార్త బయటికొస్తుంది. దాంతో ఆమె ప్రజల దృష్టి మరల్చటానికి తోకచుక్క విషయం మీద దృష్టి పెడుతుంది. ర్యాండల్‌ని, కేట్‌ని పిలిపించి మాట్లాడుతుంది. “నిధులు కేటాయిస్తున్నాను. ఆ తోకచుక్కని నాశనం చేసే మిషన్ ప్రారంభిద్దాం” అంటుంది. కేట్‌కి దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం తెలుసు. “మీ గురించి నీలివార్త వచ్చింది కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో మీరు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ మిషన్ ప్రారంభిస్తున్నారు కదా?” అంటుంది. జేనీని వ్యంగ్యంగా చూపిస్తారు కాబట్టి ఆమె కొంచెం తింగరగా ఉంటుంది. కేట్ అన్నమాటకి మరొకరైతే కోపం తెచ్చుకునేవారు. జేనీ అక్కసుగా కేట్ అభియోగాన్ని ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకోలులో ‘ఇందులో వింతేముంది?’ అనే భావం కూడా ఉంటుంది. ఆమెకి తెలిసింది రాజకీయం మాత్రమే. ఇన్నాళ్ళూ తోకచుక్కని ఎందుకు ఉపేక్షించారు అని అడుగుతారు కాబట్టి నాసా చైర్మన్‌ని బాధ్యత వహించి రాజీనామా చేసేలా చేస్తుంది. మరో పక్క జేనీ కొడుకు కేట్ మీద కసిగా ఉంటాడు. ఆమెని సూటీపోటి మాటలంటూ ఉంటాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదంటే ఇదే. అసలు వాళ్ళకన్నా కొసరు వాళ్ళకే అవమానభారం ఎక్కువగా ఉంటుంది.

మనుషుల ప్రవృత్తుల మీద కూడా వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి ఈ చిత్రంలో. మొదటిసారి జేనీని కలవటానికి వేచి ఉన్నప్పుడు వీరితో పాటు ఒక ఆర్మీ జనరల్ కూడా ఉంటాడు. మధ్యలో వెళ్ళి చిప్స్ పాకెట్లు, మంచినీళ్ళ బాటిళ్ళు తెస్తాడు. అందరికీ పంచి “అందరూ తలో పది డాలర్లు ఇవ్వండి” అంటాడు. అందరూ ఇస్తారు. తర్వాత కేట్ తానే వెళ్ళి మరో మంచినీళ్ళ బాటిల్ తీసుకుని అక్కడున్న ఆమెని “డబ్బులు ఎక్కడ కట్టాలి?” అని అడుగుతుంది. ఆమె “ఇది శ్వేతసౌధం. ఇక్కడ అన్నీ ఉచితమే” అంటుంది. కేట్ ఖంగు తింటుంది. చిత్రం పొడుగునా ఆమె ఆ జనరల్ డబ్బులు ఎందుకు తీసుకున్నాడా అని అందరికీ చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. కొందరు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంత సంపాదించినా కక్కుర్తి మాత్రం వదలరు. అది వారి నైజం. మరో పక్క బ్యాష్ అనే సెల్ ఫోన్ కంపెనీ యజమాని పీటర్ ఒక కొత్త ఫోన్‌ని విడుదల చేస్తాడు. అది మన రక్తపోటుని, గుండె చప్పుడుని బట్టి మన మనఃస్థితి ఎలా ఉందో కనిపెట్టి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కుంగుబాటులో ఉంటే మనోవైజ్ఞానికుడి అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేస్తుంది. పీటర్ జేనీ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలిచ్చాడు. అతను కూడా తోకచుక్క వ్యవహారంలో కలగజేసుకుంటాడు. వ్యాపారవేత్తల స్వార్థం ఎలా ఉంటుందో, వారు రాజకీయ నాయకులతో ఎలా కుమ్మక్కవుతారో చూసి మనం నోరు వెళ్ళబెట్టాల్సిందే. సుప్రీం కోర్టు జడ్జీ అభ్యర్థికి లా డిగ్రీ లేదని, నాసా చైర్మన్‌కి అంతరిక్షశాస్త్రం తెలియదని వ్యంగ్యాస్త్రాలు కూడా ఉంటాయి చిత్రంలో.

మధ్యమధ్యలో భూమి మీద జీవజాలం కార్యకలాపాలు చూపిస్తాడు దర్శకుడు. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూసి మనం ఇదంతా శాశ్వతమనే భ్రమలో ఉంటాం. కానీ ఆలోచించి చూస్తే ఈ అనంత విశ్వంలో భూమి ఒక ఇసుక రేణువు లాంటిది. ఇక్కడ జీవజాలం ఉన్నట్టే దూరంగా ఎక్కడో వేరే గ్రహం మీద జీవజాలం ఉండొచ్చు. ఇదంతా లీల. కానీ మనం మన రాగద్వేషాలతో అన్నిటినీ సంక్లిష్టం చేసుకుంటాం. యుగాంతం వస్తుందని అన్ని మతాలూ నమ్ముతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచం నాశనమవుతుంది. అప్పటిదాకా ఇలా కొట్టుకుంటూ, స్వార్థంతో సంపద పోగేసుకుంటూ ఉండాలా? ఈ ప్రపంచంలో ఎంతో సౌందర్యం కూడా ఉంది. అది మిగిలిపోతుందా? అది కూడా నాశనమయిపోతుంది. మరి ఎందుకు ఈ ఆరాటం? ఇదే దర్శకుడు వేసే ప్రశ్న.

ఈ చిత్రానికి యాడమ్ మెకే దర్శకత్వం వహించాడు. ఈయనే 2008 ఆర్థిక సంక్షోభాన్ని ‘ద బిగ్ షార్ట్’ చిత్రంలో వ్యంగ్యంగా చూపించాడు. బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న డిక్ చేనీ ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడో ‘వైస్’ చిత్రంలో వ్యంగ్యంగా చూపించాడు. ఈ చిత్రంలో భూతాపాన్ని కొందరు ప్రపంచనేతలు ఎలా ఉపేక్షిస్తున్నారో చూపించటానికి తోకచుక్క అనే సంకేతాన్ని చూపించాడు. ఇటీవలే జరిగిన కాప్ అనే పర్యావరణ సదస్సులో కూడా అమెరికా లాంటి దేశాలు సరైన నిష్పత్తిలో నిధులు ఇవ్వటానికి ముందుకు రాలేదు. కాలుష్యాన్ని పెంచి అభివృద్ధి సాధించుకున్న దేశాలు ఇప్పుడు అభివృధ్ధి చెందుతున్న దేశాలని కర్బన ఉద్గారాలు తగ్గించుకోమంటున్నాయి. అందుకు వారు నిధుల సాయం చేయకపోతే ఎలా? రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల స్వార్థాలు ఇలాగే ఉంటాయి. ఈ విషయాన్నే వ్యంగ్యంగా ఈ చిత్రంలో ఎత్తి చూపించాడు. లియొనార్డో డికాప్రియో, మెరిల్ స్ట్రీప్, జెన్నిఫర్ లారెన్స్, కేట్ బ్లాంచెట్, మార్క్ రైలన్స్ లాంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటించారు. వీరందరూ ఆస్కార్ అవార్డులు అందుకున్నవారే. ఒక చిన్న పాత్రలో యువ సంచలనం టిమతీ షాలమే (‘డ్యూన్’ చిత్ర కథానాయకుడు) నటించాడు. యాంకరిగా నటించిన కేట్ బ్లాంచెట్ తన పాత్రని అద్భుతంగా పోషించింది. టీవీ యాంకర్లను ఎందరినో పరిశీలించి ఆమె ఈ పాత్ర వేసినట్టు అనిపిస్తుంది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో కూడా నామినేషన్లు వచ్చాయి.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. చిత్రం చూసేవారు చివర్లో పేర్లు వచ్చేటపుడు చూడటం ఆపకండి. పేర్ల మధ్యలో కొన్ని సన్నివేశాలు వస్తాయి.

తోకచుక్కని నాశనం చేసే మిషన్లో భాగంగా పలు మిసైళ్ళు ప్రయోగిస్తారు. అందరూ ఆనందంగా ఉంటారు. అప్పటికే ర్యాండల్ పేరు మారుమోగిపోతూ ఉంటుంది. యాంకరి ర్యాండల్‌తో ప్రేమాయణం మొదలు పెడుతుంది. ర్యాండల్ ఆమె వలలో పడిపోతాడు. మిసైళ్ళు ప్రయోగించిన కాసేపటికి పీటర్ జేనీ దగ్గరకి వస్తాడు. వాళ్ళిద్దరూ రహస్యంగా ఏదో మాట్లాడుకుంటారు. జేనీ మిసైళ్ళని వెనక్కి రప్పించేస్తుంది. ఇంతకీ విషయమేమిటంటే ఆ తోకచుక్క మీద ఖనిజ సంపదలున్నాయని పీటర్ కంపెనీలో పని చేసే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అవి ఎంతో విలువైనవని, ఆ ఖనిజాలు లభిస్తే సంపద పెరిగి పేదరికం నిర్మూలించవచ్చని జెనీ, పీటర్ ఒక సమావేశంలో అంటారు. ఆ సమావశంలో ర్యాండల్ ఉంటాడు. టెడ్డీని, కేట్‌నీ ఆ సమావేశానికి దూరంగా ఉంచుతారు. ర్యాండల్ అభ్యంతరం చెబుతాడు కానీ అతనికి ఏవేవో చెప్పి అతని నోరు మూస్తారు. తోకచుక్క మీద ఖనిజాలు తవ్వాలంటే పెద్ద పని అని, దాని వల్ల ఎంతో మందికి ఉద్యోగాలొస్తాయని చెబుతారు. ప్రజలు కూడా ఆ మాటలు నమ్ముతారు. దీని వెనక అసలు పథకం ఏమిటంటే పీటర్ తన కంపెనీ తయారు చేసే ఫోన్లలో ఆ ఖనిజాలని వాడుకుని తన అమ్మకాలు పెంచుకుంటాడు. కేట్‌కి ఇది అర్థమౌతుంది. ఆమె నిరాశతో తన ఊరికి వెళ్ళిపోతుంది. ఒక చిన్న దుకాణంలో పని చేసుకుంటూ ఉంటుంది. పీటర్ ప్రణాళిక ఏమిటంటే తోకచుక్కని పెద్ద పెద్ద డ్రోన్లతో శకలాలుగా విడదీసి, ఆ డ్రోన్లతోనే ఆ శకలాలని పెసిఫిక్ మహాసముద్రంలోకి చేరవేయాలి. అక్కడి నుంచి ఖనిజాలని తవ్వుకోవచ్చు. పీటర్ బృందంలో పెద్ద శాస్త్రవేత్తలు ఉంటారు. వారు ఆ ప్రణాళికని సమర్ధిస్తారు. దాంతో ర్యాండల్ మాట్లాడకుండా ఉండిపోతాడు. అతనికి ముఖ్య విజ్ఞాన సలహాదారు పదవి కూడా ఇస్తారు. ఇంకేముంది? అతను అమ్ముడుపోయినట్టే మిగతా శాస్త్రవేత్తలు అమ్ముడుపోయారని అతనికి తట్టదు.

పీటర్ కంపెనీ బ్యాష్ ఒక హెల్ప్ లైన్‌ని ఏర్పాటు చేస్తుంది. తోకచుక్క గురించి ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి అడగవచ్చు. కొసమెరుపు ఏమిటంటే ఈ సదుపాయం బ్యాష్ కస్టమర్లకి మాత్రమే. అంటే అందరూ బ్యాష్ కస్టమర్లు అయిపోవాలన్నమాట. ఈ హెల్ప్ లైన్‌కి ర్యాండల్ ప్రచారకర్త. ర్యాండల్ ప్రేమాయణం సంగతి అతని భార్యకి తెలిసిపోతుంది. ఆమె అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. పీటర్ డ్రోన్లని తయారు చేస్తాడు. జేనీకి, ర్యాండల్‌కి ఆ డ్రోన్లని చూపిస్తాడు. ర్యాండల్ “వీటి సామర్థ్యం గురించి స్వతంత్ర శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపిస్తే మంచిది. మీరు కేవలం వ్యాపారవేత్తలా ఆలోచిస్తున్నారు” అంటాడు. పీటర్‌కి కోపం వస్తుంది. అతను ర్యాండల్‌తో “మీ జీవితం గురించి మీ కన్నా నాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడు చనిపోతారో కూడా నాకు తెలుసు. నా దగ్గరున్న మీ సమాచారంతో అన్నీ అంచనా వేశాను. నన్ను కేవలం ఒక వ్యాపారవేత్త అంటారా?” అని దూషిస్తాడు. జేనీ కూడా ర్యాండల్‌ని చీవాట్లు వేస్తుంది. చివరికి ర్యాండల్‌కి కనువిప్పు కలుగుతుంది. మళ్ళీ టీవీ కార్యక్రమానికి వెళ్ళినపుడు “ఈ ప్రెసిడెంట్ మనల్ని మోసం చేస్తోంది. ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తోంది” అని అరుస్తాడు. సహజంగానే అతని ఉద్యోగం ఊడుతుంది. యాంకరి కూడా అతన్ని వదిలేస్తుంది.

కేట్ నిర్వేదంతో ఉంటుంది. ఆమెకి ఒక యువకుడు పరిచయమవుతాడు. అతను ఆమెని ఇష్టపడతాడు. ఆమె ‘ఎలాగూ ప్రపంచం అంతమవబోతోంది’ అన్న భావంతో అతనికి సన్నిహితమవుతుంది. ఆమె ఉన్న మానసిక స్థితిలో ఎవరినైనా నిజంగా ప్రేమించటం సాధ్యం కాదు. ఒక రాత్రి వారిద్దరూ కలిసి మేడపై ఉండగా కేట్‌కి ఆకాశంలో తోకచుక్క కనపడుతుంది. టెలిస్కోప్ లేకుండా తోకచుక్క కంటికి కనపడటం అదే తొలిసారి. అదే సమయంలో ర్యాండల్ తన ఊరికి కారులో వెళుతూ తోకచుక్కని చూస్తాడు. వెంటనే కేట్‌కి ఫోన్ చేస్తాడు. ఇద్దరికీ అదో ఉద్విగ్నభరిత క్షణం. వారు ‘జస్ట్ లుక్ అప్’ అని ఒక ఉద్యమం మొదలు పెడతారు. నేతలు మనల్ని మోసం చేస్తున్నారు, కావాలంటే ఆకాశంలోకి చూడండి అంటారు. జేనీ దీనికి వ్యతిరేకంగా ‘డోన్ట్ లుక్ అప్’ అనే ఉద్యమం మొదలు పెడుతుంది. అంతా బాగానే ఉంది అని చెబుతుంది. చివరికి ఏమౌతుందో చూస్తేనే బావుంటుంది.

భూతాపం పెరుగుతోందని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశాడు. శాస్త్రవిజ్ఞానాన్ని పట్టించుకోని రాజకీయ నాయకులు చాలానే ఉన్నారు. మతాధికారులు కూడా శాస్త్రవిజ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు. ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలలో ప్రకృతి విపత్తుల గురించి శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా మతాధికారులు తమ ప్రయోజనాల కోసం వాటిని పట్టించుకోలేదు. వరదల్లో ఎంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగింది. వ్యాపార ప్రయోజనాల కోసం, మతపరమైన ప్రయోజనాల కోసం శాస్త్రవిజ్ఞానాన్ని విస్మరించకూడదు. అతిగా పారిశ్రామీకరణ చేయటంతో ఇప్పుడు భూమి సంక్షోభంలో ఉంది. ఇది కాదనలేని విషయం. రాజకీయ నాయకులు ఏమీ చేయటం లేదు. ప్రజలే చైతన్యవంతులు కావాలి. అందరూ ఉద్యోగాల కోసం ఎగబడకుండా ఉంటే పారిశ్రామీకరణ కొంచెమైనా తగ్గుతుంది. వ్యవసాయానికి ప్రాధాన్యత మళ్ళీ పెరగాలి. పట్టణాల వైపు పరుగులు ఆపాలి. ఉన్నదానితో తృప్తి పడాలి. అందరూ పల్లకీ ఎక్కేవాళ్ళయితే మోసే వాళ్ళు ఎవరు? ఈ విషయాలనే వ్యంగ్యంగా ఈ చిత్రంలో చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here