Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 77: రెవల్యూషనరీ రోడ్

[సంచిక పాఠకుల కోసం ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]చే[/dropcap]సే ఉద్యోగం ఇష్టం లేక బాధపడేవారు చాలామంది ఉంటారు. ఏవో ఆశలు ఉన్నా అవి సాకారం కాక ఏదో ఒక ఉద్యోగం చేసేవారు కూడా ఉంటారు. మార్పు కోరుకుంటే తప్పేమిటి? నలుగురూ చూసి నవ్వుతారనే భయం చాలామందికి ఉంటుంది. అందరిలా బాగా సంపాదిస్తూ ఉంటేనే గౌరవం అనుకుంటారు. అలా కాదని మూస జీవితం నుండి బయటపడాలని కోరుకున్న ఒక గృహిణి కథ ‘రెవల్యూషనరీ రోడ్’ (2008). పేరు చూస్తే విప్లవాత్మకమైన సినిమా అనిపిస్తుంది. నాయికానాయకులు ఉండే వీధి పేరు అది. ఒక గృహిణి ఇంట్లో చేసే ఒక రకమైన విప్లవమే కథాంశం. ‘టైటానిక్’ (1997) తర్వాత లియొనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ కలిసి నటించిన చిత్రం ఇదే. చాలా కమర్షియల్ సినిమాలు నాయకుడు, నాయిక చివరికి పెళ్ళి చేసుకోవటంతో ముగుస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని చూపించే చిత్రాలు ఒకప్పుడు ఎక్కువ వచ్చేవి కాదు. పెళ్ళయిన తర్వాత ఎదురయ్యే సవాళ్ళలో ఒకదాన్ని ముఖ్య అంశంగా చూపించిన చిత్రం ఇది. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే.

1955లో అమెరికాలో జరిగినట్టు ఈ కథని ఆవిష్కరించారు. ఫ్రాంక్, ఏప్రిల్ యువదంపతులు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు (అమెరికాలో ప్రేమ పెళ్ళిళ్ళే రివాజు). ఫ్రాంక్ “నాకు అనుభూతులు ముఖ్యం” అనేవాడు. అతను అందరి లాంటివాడు కాదని ఏప్రిల్ అనుకుంటుంది. జీవితాన్ని ఆస్వాదించాలి కానీ మూసలో పడి జీవించకూడదని ఆమె భావన. ఫ్రాంక్ “ప్యారిస్‌లో అయితే జీవితం జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడిలా నిస్సారంగా ఉండదు. నేనైతే అవకాశం దొరికితే ప్యారిస్ వెళ్ళిపోతాను” అంటాడొకసారి. కానీ పెళ్ళయ్యాక ఒక కంప్యూటర్ తయారీ కంపెనీలో సేల్స్ విభాగంలో చేరతాడు. అతని తండ్రి కూడా అక్కడే పనిచేశాడు. ఫ్రాంక్‌కి మంచి జీతం. విశాలమైన ఇల్లు కూడా కొనుక్కుంటారు. ఏడేళ్ళు గడిచిపోతాయి. ఇద్దరు పిల్లలు కూడా కలుగుతారు. ఏప్రిల్‌కి అసంతృప్తి మొదలవుతుంది. సంపాదన, పిల్లల పోషణ – ఇదేనా జీవితం అనిపిస్తుంది. ఆమె స్టేజీ నాటకాలు వేసి తన అసంతృప్తిని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆమె నాటకాల్లో రాణించదు. నటన రాదనే ముద్ర పడుతుంది. దీంతో ఆమె తన అక్కసు అంతా ఫ్రాంక్ మీద వెళ్ళగక్కుతుంది. “నన్ను ఈ పంజరంలో బంధించేశావు. నువ్వు ఆడించినట్టల్లా ఆడాలని అనుకుంటున్నావు. నువ్వసలు మగాడివేనా?” అంటుంది. ఫ్రాంక్‌కి కోపం వస్తుంది కానీ తమాయించుకుంటాడు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అన్నీ ఉన్నా ఏప్రిల్‌కి అసంతృప్తి ఎందుకు అనిపిస్తుంది. కానీ ఫ్రాంక్ పెళ్ళికి ముందు గాలిమేడలు కట్టాడు. చిన్నతనంలో అందరూ అలాగే ఉంటారు కదా? ఏప్రిల్ సర్దుకుపోలేకపోయింది. అందరూ ఒకేలా ఉండలేరు కదా. అయితే ఆమె మంచి నటి కాకపోతే అది ఫ్రాంక్ తప్పా? ఆమెకి అది ఒక సాకు మాత్రమే. Last straw అన్నమాట. ఆమె సహనం చచ్చిపోవటానికి అది చివరి కారణం అయింది.

ఫ్రాంక్ గొర్రెల మందలో గొర్రెలా రోజూ ఆఫీసుకి వెళ్ళి వస్తుంటాడు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అన్నట్టు ఉంటాడు. వెలితిని పూడ్చటానికా అన్నటు ఆఫీసులో ఒక సెక్రటరీని ముగ్గులోకి దింపి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. భార్య మగాడివేనా అని ప్రశ్నిస్తే అతను స్పందించే తీరు ఇదీ. కొందరు మగాళ్ళకి ఆడదాన్ని వశపరుచుకోవటమే మగతనం. మరో పక్క ఇంట్లో పాత ఫోటోలు చూస్తున్న ఏప్రిల్‌కి ఫ్రాంక్ ప్యారిస్ గురించి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆమెకి ఒక ఆలోచన తళుక్కున మెరుస్తుంది. ఆ రోజు అతను ఆఫీసు నుంచి రాగానే తన ప్రవర్తనకి సారీ చెప్పి లోపలికి తీసుకువెళుతుంది. ఆ రోజు అతని పుట్టినరోజు. ఏప్రిల్, పిల్లలు అతనికి శుభాకాంక్షలు చెబుతారు. ఫ్రాంక్‌కి తాను సెక్రటరీతో పడుకోవటం గుర్తొచ్చి అపరాధభావం కలుగుతుంది. పుట్టినరోజు వేడుక అయ్యాక ఏప్రిల్ “మనమందరం ప్యారిస్ వెళదాం. నువ్వు ఉద్యోగం చేయక్కరలేదు. మనం దాచుకున్న డబ్బు, ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు ఉంటుంది కదా. నేను సెక్రెటరీగా ఉద్యోగం చేస్తాను. మంచి జీతం వస్తుంది. నువ్వు ఏం చెయ్యాలో నిదానంగా నిర్ణయించుకోవచ్చు” అంటుంది. ఫ్రాంక్ “నేను కళాకారుడినో, రచయితనో అయితే అది వేరు. ఏమీ లేకుండా ఎలా?” అంటాడు. “నువ్వు చాలా అద్భుతమైన మనిషివి. నువ్వు మగాడివి” అంటుందామె. అంటే స్వతంత్రంగా ఉంటేనే మగవాడు అని ఆమె భావన. పెళ్ళికి ముందు అతని ఆశయాలు వేరుగా ఉండేవని, ఉద్యోగంలో పడి అతను కూడా ఇరుక్కుపోయాడని ఆమె ఉద్దేశం. కుటుంబాన్ని పోషించటం మగవాడి లక్షణం అనేది సమాజంలో భావన. ఆమెకి అందరిలా ఉండటం ఇష్టం లేదు. ఇక్కడ ప్యారిస్ అనేది ఒక సంకేతం మాత్రమే అనిపిస్తుంది. మూస జీవితం కాకుండా ఉత్తేజం కలిగించే జీవితం కావాలి.

అమెరికాలో సబర్బన్ జీవితం అంటే నగరానికి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఏప్రిల్‌కి అలాంటి ఇంటిలో ఉండటం, పిల్లల్ని చూసుకోవటం విసుగుని తెప్పిస్తాయి. ముందు వారు నగరంలోనే ఉండేవారు. ఏప్రిల్ గర్భవతి కావటంతో నగరానికి దూరంగా వచ్చారు. రెండో బిడ్డ కూడా పుట్టాక ఏప్రిల్‌లో స్థబ్దత ప్రవేశించింది. నటనలో రాణించలేదు. ఆమె ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ తన భర్త కుటుంబం కోసం ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి ఆమె అతనికి ఆ భారం లేకుండా చేయాలనుకుంది. ఇందులో ఆమె స్వార్థం కూడా ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టొచ్చని అనుకుంది. అమెరికాలో అయితే ఆమె ఉద్యోగం చేసినా ఆమె జీతం సరిపోదు. ప్యారిస్‌లో సెక్రెటరీలకి మంచి జీతాలు వస్తాయి. ఎంతో మంది ఉద్యోగాలు మానేసి చదువుకుంటారు. కానీ అదంతా మరింత డబ్బు సంపాదించటానికే. కొంతమంది ఇష్టమైన పని చేయటానికి ఉద్యోగం మానేస్తారు. మామూలుగా కుటుంబం వారు ఒప్పుకోరు. ‘అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటుంటే నీకు ఏమైంది?’ అంటారు. అందరి స్వభావాలూ ఒకటి కాదుగా. ఇక్కడ ఏప్రిల్ తానే ఫ్రాంక్‌కి ఒక దారి చూపించింది.

ఫ్రాంక్ ఒప్పుకుంటాడు. ఆఫీసులో తన సహోద్యోగుల దగ్గర గొప్పలు చెప్పుకుంటాడు. “ఈ ఉద్యోగం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. నేను ప్యారిస్‌లో కొత్తగా ఏమైనా చేస్తాను” అంటాడు. పక్కింటివాళ్ళకి విషయం చెబుతారు. వాళ్ళ పేర్లు షెప్, మిల్లీ. షెప్ “మీ ఆవిడ సంపాదన మీద బతుకుతావా?” అంటాడు. “మొదట్లో మాత్రమే తన సంపాదన. నేను నాకు ఇష్టమైన డిగ్రీ చేస్తాను” అంటాడు ఫ్రాంక్. షెప్, మిల్లీ తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు. షెప్ “వాళ్ళది పిచ్చి ఆలోచన. ఎక్కడైనా మగవాడు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాడా?” అంటాడు. మిల్లీ “నువ్వలా అంటే నాకు భారం దిగినట్టు ఉంది” అంటుంది. ఇది అసూయా? లేక తమ జీవితాల్లో వెలితి లేదని తనను తాను సముదాయించుకోవటమా? ఏప్రిల్ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. సెప్టెంబరులో ప్రయాణం. స్టీమర్ టికెట్లు, ట్రావెలర్ల్స్ చెక్స్ అన్నీ సిధ్ధం చేస్తుంది. పిల్లలకి కూడా ప్రయాణం సంగతి చెబుతారు.

ఫ్రాంక్ దంపతులకి ఇల్లు అమ్మిన ఏజెంటు (బ్రోకర్) ఒక నడివయసు స్త్రీ. ఆమెకి వీళ్ళంటే ముచ్చట. కుటుంబమంటే ఇలా ఉండాలి అనుకుంటుంది. ఆమె కొడుకు జాన్ గణితంలో పీహెచ్.డీ చేశాడు. అతను కూడా ఫ్రాంక్ లాగా స్థిరపడాలని ఆమె కోరిక. అయితే అతనికి సమాజపు పోకడలు నచ్చవు. తల్లి మీద దాడి చేయాలని ప్రయత్నించానని అతనే చెప్పుకుంటాడు. అది సమాజానికి, అతనికి జరుగుతున్న ఘర్షణని ప్రతిబింబిస్తుంది. అతన్ని మానసిక వైద్యశాలలో పెట్టారు. అతని తల్లి వైద్యశాల అనుమతి తీసుకుని అతన్ని ఒకసారి ఫ్రాంక్ ఇంటికి తీసుకువస్తుంది. ఆమె భర్త కూడా వస్తాడు. ఉద్యోగం చేసుకుంటూ, సౌకర్యంగా జీవిస్తున్న ఇలాంటి యువ జంటని చూస్తే అతను తన దృక్పథాన్ని మార్చుకుంటాడని ఆమె ఆశ. ఇతర పాత్రలన్నీ సమాజంలోని పామరులకి ప్రతీకలుగా ఉంటే జాన్ మాత్రం మేధావి వర్గానికి ప్రతీకగా ఉంటాడు. మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చారు కాబట్టి మరీ లోతుగా కాకుండా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రాంక్ “నా ఉద్యోగం ఏమంత ఆసక్తికరం కాదు” అంటాడు నవ్వుతూ. జాన్ “మరి ఎందుకు ఆ ఉద్యోగం చేస్తున్నావు? అవున్లే! ఇల్లు, కుటుంబం కావాలంటే ఉద్యోగం ఉండాలి. మాంఛి ఇల్లు, కుటుంబం కావాలంటే ఇష్టం లేని ఉద్యోగం చేయాలి. ఇదంతా ఎందుకు అని ఎవడైనా అడిగితే వాడు నాలాగా పిచ్చివాడై ఉండాలి” అంటాడు. ఇందులో వ్యంగ్యం ఉన్నా నిజం లేకపోలేదు. ఆ నిజం గుండెల్లో గుచ్చుకుంటుంది. ఫ్రాంక్ దంపతులు ఎలాగూ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు నవ్వుకుంటారు. అందుకే ఉద్యోగం మానేసి ప్యారిస్ వెళ్ళిపోతున్నాం అంటారు. జాన్ తల్లితో “విన్నావా? ఈ ముచ్చటైన జంట అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారట. నువ్వేమంటావు?” అని నవ్వుతాడు. అతని తల్లికి ఇది నిరాశాకరమైన విషయమే. ఫ్రాంక్ దంపతులు చాకచక్యంగా జాన్‌ని వ్యాహ్యాళికి తీసుకువెళతారు. అలా అయితే పెద్ద గొడవ జరగకుండా ఉంటుందని. జాన్ తనకి షాక్ ట్రీట్‌మంట్ ఇచ్చారని చెబుతాడు. దానితో అతని మేధపై ప్రభావం పడిందని తెలిసిపోతూనే ఉంటుంది. “మీరెందుకు పారిపోతున్నారు?” అని అడుగుతాడు. “ప్యారిస్‌లో జీవితం వేరుగా ఉంటుంది. మేం ఈ అంతులేని శూన్యభావం నుంచి దూరంగా పోతున్నాం” అంటాడు ఫ్రాంక్. జాన్ ఆశ్చర్యంగా “శూన్యభావం అందరికీ అనుభవమే. అది అంతులేనిదని తెలుసుకోవటం మీ విజయం” అంటాడు. తర్వాత ఫ్రాంక్, ఏప్రిల్ మాట్లాడుకుంటారు. “జాన్ ఒక్కడికే మన ఉద్దేశం అర్థమయింది” అంటుంది ఏప్రిల్. “మనదీ అతని లాంటి ఉన్మాదమేనేమో” అంటాడు ఫ్రాంక్. సమాజపు పోకడలను అనుసరించకపోతే పిచ్చివాళ్ళుగా లెక్కకట్టటం ఎప్పుడూ ఉండేదే. ‘ఎక్కడో లోపం ఉంది’ అనే వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. ఎంత చిత్రం!

అంతా అనుకున్నట్టే జరగదు కదా! ఫ్రాంక్ వదిలివెళ్ళిపోతున్నాడని తెలిసి కంపెనీ ఉన్నతాధికారి అతనికి ప్రమోషన్ ఇస్తానంటాడు. నిజానికి ఉద్యోగం వదలాలని నిర్ణయించుకున్నాక ఫ్రాంక్ ఎలాంటి భయాలు లేకుండా తన అభిప్రాయాలను చెప్పటం ఆ ఉన్నతాధికారికి నచ్చింది. విధి చిత్రంగా ఉంటుంది. “జీవితంలో అవకాశాలు అరుదుగా వస్తాయి. వదిలేస్తే సగటు మనిషిలా ఉండిపోయానే అని పశ్చాత్తాపపడాల్సొస్తుంది” అంటాడు ఆ ఉన్నతాధికారి. ఫ్రాంక్ ఆలోచనలో పడతాడు. ఆఫీసులో అతని ప్రమోషన్ సంగతి తెలుస్తుంది. ఫ్రాంక్ మనసులో ఘర్షణ మొదలవుతుంది. ప్రమోషన్ వద్దని చెప్పేస్తానని భార్యకి చెబుతాడు కానీ చెయ్యడు. ఈ తర్జనభర్జనలో అతను గతంలో సంబంధం పెట్టుకున్న సెక్రెటరీకి మళ్ళీ సన్నిహితుడవుతాడు. మరో పక్క ఏప్రిల్ మళ్ళీ గర్భవతి అవుతుంది. ఇది అనుకోని పరిణామం. ఆమెని నిరాశ ఆవహిస్తుంది. పూర్తిగా రూఢి అయ్యేదాకా భర్తకి చెప్పదు. అప్పటికి రెండు నెలలు దాటిపోతాయి. ఫ్రాంక్ కి చెప్పి “అబార్షన్ చేయించుకుంటాను. ఇంకో రెండు వారాల లోపు చేయించుకుంటే ప్రమాదమేమీ ఉండదు. మన ప్రయాణం మాత్రం ఆపవద్దు” అంటుంది. అప్పట్లో అబార్షన్ అంటే గుట్టుగా చేయించుకోవాలి. పైగా మతపరంగా అబార్షన్ తప్పు అనే భావం కూడా ఉండేది. ఫ్రాంక్‌కి ప్రయాణం వాయిదా వేయటానికి ఒక కారణం దొరికినట్టయింది. “ఆలోచించి నిర్ణయం తీసుకుందాం” అంటాడు. తర్వాత ఒక విహరయాత్రలో ఫ్రాంక్ ఏప్రిల్ అక్కడ ఉండగానే షెప్‌తో మాట్లాడుతూ “అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది. డబ్బు అంత ఎక్కువ ఇవ్వకపోతే వద్దని చెప్పేసేవాణ్ణి” అంటాడు. ఏప్రిల్‌కి అసహనం వస్తుంది. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఫ్రాంక్ ఆమె దగ్గరకి వెళతాడు. “ఆ డబ్బుతో ఇక్కడే ఆనందంగా ఉండవచ్చు” అంటాడు. “ఎంత డబ్బిచ్చినా ఇష్టం లేని ఉద్యోగం చేయటం ఎందుకు?” అంటుంది. “ఆ తిప్పలేవో నేను పడతాను కదా” అంటాడు ఫ్రాంక్ చిరాగ్గా. దంపతుల్లో ఇద్దరికీ డబ్బు యావ ఉంటే సమస్య లేదు. ఇద్దరికీ లేకపోయినా సమస్య లేదు. ఒకరికి డబ్బు యావ ఉండి, ఒకరికి లేకపోతే అది పెద్ద సమస్య అవుతుంది. ఫ్రాంక్ డబ్బులోనే ఆనందం ఉంది అనుకోవటం మొదలుపెట్టాడు. ఏప్రిల్ కి డబ్బు కాదు, ఉత్తేజభరితమైన జీవితం కావాలి.

ఇంటికి వెళ్ళాక ఏప్రిల్ “కొత్తగా ఏమీ చెయ్యకపోతే అందులో రాణించనేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు. అందుకే నువ్వు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నావు” అంటుంది. ఫ్రాంక్ విసుగ్గా ఉంటాడు. అతనికి బాత్రూమ్‌లో అబార్షన్ చేసుకునే పరికరం కనిపిస్తుంది. ఏప్రిల్‌ని నిలదీస్తాడు. ఆమె నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంది. అతని మనసు మార్చటానికి ప్రయత్నిస్తుంది. “ప్యారిస్‌కి వెళ్ళి బిడ్డని కంటాను. ఇక్కడ మాత్రం ఉండలేను” అంటుంది. ఉద్యోగం వదిలేసి ఎక్కడికో వెళ్ళి బిడ్డని కంటే డబ్బు సరిపోక ఇబ్బంది పడతామని ఫ్రాంక్ భయం. అదీ నిజమే. కానీ ఏప్రిల్‌కి ఈ జీవితం మీద విరక్తి. “నువ్వు నీ పిల్లలని ప్రేమించటం లేదు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు” అని ఆమెని అపరాధభావానికి లోను చేస్తాడు ఫ్రాంక్. ఏప్రిల్‌కి తన మీద తనకే అనుమానం వస్తుంది. పిల్లల మీద ప్రేమ లేక తాను ఈ జీవితం నుంచి పారిపోతున్నానా అని ఆలోచిస్తుంది. అదే అదనుగా ఫ్రాంక్ “ఇది అసహజమైన ప్రవర్తన. సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళితే నీ మనసు కుదుటపడవచ్చు” అంటాడు. ఏప్రిల్ అయోమయంలో పడుతుంది. “అయితే అందరూ అన్నట్టు ప్యారిస్ ఒక పిచ్చి ఆలోచనే కదా” అంటుంది. “అవునేమో” అంటాడు ఫ్రాంక్.

రిచర్డ్ యేట్స్ రాసిన నవల ఆధారంగా జస్టిన్ హేత్ స్కీన్ ప్లే అందించగా శామ్ మెండెస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. థామస్ న్యూమన్ సంగీతం నాయికానాయకుల జీవితం లోని విషాదాన్ని ప్రతిబింబిస్తుంది. ఏదో ఘోరం జరగబోతోందనే భావం (impending doom) కలిగిస్తుంది. ఏప్రిల్ పాత్రలో నటించిన కేట్ విన్స్లెట్‌కి ఆ సంవత్సరం ‘ద రీడర్’ చిత్రానికి ఉత్తమ నటి ఆస్కార్ వచ్చింది. నటనకి సంబంధించిన ఒకే విభాగం రెండు నామినేషన్లు ఇవ్వరు. లేకపోతే ఈ చిత్రానికి కూడా నామినేషన్ వచ్చేది. విచిత్రంగా ఆమెకి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు, ‘ద రీడర్’ చిత్రానికి ఉత్తమ సహాయనటి అవార్డు వచ్చాయి. ఇది చాలా అరుదు. జాన్ పాత్రలో నటించిన మైకెల్ షానన్‌కి ఉత్తమ సహాయనటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఈ చిత్రంలో కొంత అసమంజసంగా ఉండే విషయం ఏమిటంటే పిల్లలున్నా వారు ఎప్పుడూ ఇంట్లో ఉండరు. ఒక సందర్భంలో పిల్లలు బర్త్ డే పార్టీకి వెళ్ళారు అంటారు. వేరే సమయాల్లో ఆడుకోవటానికి వెళ్ళారని సరిపెట్టుకోవాలని దర్శకుడి ఉద్దేశమేమో.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఫ్రాంక్ దంపతులు ప్యారిస్ వెళ్ళటం లేదని తెలిసి అందరూ వారికి సర్దిచెబుతూనే సంతోషం వ్యక్తం చేస్తారు. ఒక రాత్రి ఫ్రాంక్ దంపతులు, షెప్ దంపతులు బార్కి వెళతారు. ఏప్రిల్ ముభావంగా ఉంటుంది. మిల్లీకి నలతగా ఉండటంతో తిరిగి వెళ్ళిపోదామనుకుంటారు కానీ షెప్ కారుకి అడ్డంగా వేరే కారు ఉండటంతో ఫ్రాంక్ మిల్లీని తన కారులో తీసుకువెళతాడు. ఏప్రిల్, షెప్ బార్‌లో వేచి ఉంటారు. మాటల్లో ఏప్రిల్ “ప్యారిసే కాదు వేరే ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఆనందంగా ఉండేది. నాకు మళ్ళీ జీవించాలని ఆశ. పెళ్ళికి ముందు ఈ లోకంలో మా సొంత ముద్ర వేస్తామని అనుకునేవాళ్ళం. మేమంత ప్రత్యేకమేం కాదని తెలిసింది. ఇప్పుడు వెళ్ళలేను, ఉండలేను.” అంటుంది. షెప్‌కి ఏప్రిల్ అంటే ఆకర్షణ ఉంది. ఏప్రిల్‌కి మనసు మనసులో లేదు. ఆమె బలహీనపడి అతని సాన్నిహిత్యం కోరుకుంటుంది. ఇద్దరూ అతని కారులో ఒక ఏకాంతప్రదేశానికి వెళ్ళి శారీరకంగా కలుస్తారు.

ఏప్రిల్ ఫ్రాంక్‌కి దూరం దూరంగా ఉంటుంది. గర్భధారణలో పన్నెండు వారాలు గడిచిపోతాయి. అంటే సొంతంగా అబార్షన్ చేసుకోవటం ప్రమాదకరం. ఫ్రాంక్ ఆమెని అనునయించటానికి ప్రయత్నిస్తాడు. తనకు ఉన్న అక్రమసంబంధం గురించి చెప్పి ఆ సంబంధం ముగిసిపోయిందని అంటాడు. నిజాయితీగా ఉండాలని అతని ప్రయత్నం కావచ్చు. కానీ ఆ సమయంలో ఆ విషయం ప్రస్తావించటం సరికాదని అతనికి అనిపించదు. ఏప్రిల్ “ఎందుకు చెబుతున్నావు? నేను అసూయపడాలనా? లేక మళ్ళీ నేను నీకు దగ్గరవ్వాలనా? నేను ఏమనాలి?” అంటుంది. అతనికి అసహనం వస్తుంది. “నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అంతే” అంటాడు. “నేనేం అనుకోవట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ మీద నాకు ప్రేమ పోయింది. అది ఇప్పుడే తెలిసింది” అంటుంది. ఆమె కూడా తప్పు చేసింది. అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ ఆమెకి విచారం లేదు. ఆమె మనసు మొద్దుబారిపోయింది.

జీవితమంటే ఎక్కడో ఒక చోట రాజీ పడాలి. కానీ ఏప్రిల్ కొత్త జీవితం కోరుకుంది. ఒక ప్రణాళిక వేసింది. ఫ్రాంక్ కూడా ఒప్పుకున్నాడు. అనుకోకుండా ఆమె గర్భవతి అయింది. ఇంకొకరైతే అన్నీ పక్కన పెట్టేసేవారేమో. కానీ ఏప్రిల్ అలా ఆలోచించలేకపోయింది. అది ఆమె తప్పా? ఎవరు చెప్పగలరు? అన్నీ సమాజం పద్ధతుల ప్రకారమే చేయాలా అని ఆమె ప్రశ్న. ప్యారిస్‌లో మాత్రం జీవితం కొన్నాళ్ళకి విసుగు రాదా? ఇది ఏప్రిల్ ఆలోచించలేదు. ఆమెకి మార్పు కావాలి అంతే. కొందరు ఇలాగే ఉంటారు. రిస్క్ తీసుకోవాలి అంటారు. ఆమె తీవ్రమైన కోరికని గమనించి ఫ్రాంక్ రిస్క్ తీసుకుని ఉంటే జీవితం బాగానే ఉండేదేమో. అతనూ అలా ఆలోచించలేదు. అతనికి ప్రమోషన్ రాకుండా ఉండి ఉంటే అబార్షన్‌కి ఒప్పుకునేవాడేమో. ఇంత డబ్బు వదులుకోవటం ఎందుకు అని అతడు అనుకున్నాడు. దోషమంతా ఏప్రిల్ మీద వేశాడు. చివరికి వారి మధ్య అగాధం ఏర్పడింది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఫ్రాంక్, ఏప్రిల్ గొడవపడుతున్నప్పుడే జాన్‌ని తీసుకుని అతని తలిదండ్రులు వస్తారు. మర్యాద కోసం వారిని ఇంటిలోకి ఆహ్వానిస్తారు. ఏప్రిల్ గర్భవతి అని తెలిసి జాన్ తల్లి అభినందిస్తుంది. డబ్బు అవసరం కాబట్టి ప్యారిస్ వెళ్ళట్లేదని చెబుతాడు ఫ్రాంక్. జాన్ “డబ్బు మాత్రమే ఎప్పుడూ కారణం కాదు. ఆమె వద్దని చెప్పిందా? ఆమెని చూస్తే అలా అనిపించట్లేదు. అంటే నువ్వే వెనకడుగు వేశావన్న మాట. ఈ అంతులేని శూన్యభావంలోనే సౌకర్యంగా ఉందని అనిపించినట్టుంది” అంటాడు. అతని తలిదండ్రులు వారిస్తున్నా ఆగడు. “అతను కావాలనే ఆమెని గర్భవతిని చేశాడనిపిస్తోంది. ఆ సాకుతో ఏ సాహసం అనేది చేయకుండా ఉండిపోవాలనుకుంటున్నాడు” అంటాడు. ఫ్రాంక్ అతన్ని పిచ్చివాడని దూషిస్తాడు. జాన్ తలిదండ్రులు అతన్ని తీసుకుని వెళ్ళిపోవటానికి ఉద్యుక్తులవుతారు. జాన్ ఏప్రిల్‌తో “నిన్ను చూస్తే జాలి వేస్తోంది. అయినా మీరిద్దరూ దొందూ దొందేలా ఉన్నారు. అతన్ని నువ్వు పనికిమాలినవాడిగా చూశావు కాబట్టే అతను పిల్లల్ని కనటమే మగతనమనుకుంటున్నాడు” అంటాడు. ఫ్రాంక్ అతని మీద దాడి చేయటానికి వస్తాడు. జాన్ తల్లి జాన్ మానసిక స్థితి బాగాలేదని అతన్ని ఆపుతుంది. ఏప్రిల్‌కి సారీ చెబుతుంది. జాన్ ఇదంతా చూసి వ్యంగ్యంగా సారీ చెబుతాడు. ఏప్రిల్ వంక తిరిగి “కనీసం ఆ బిడ్డ స్థానంలో నేను లేనుగా” అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన బిడ్డను తల్లి ప్రేమించదని అతని భావం. జాన్ తలిదండ్రులతో వెళ్ళిపోతాడు. ఇదంతా జరుగుతుంటే ఏప్రిల్ మౌనంగా ఉంటుంది. ఆమె ముఖంలో కోపం, బాధ, నిస్పృహ కనపడతాయి.

జాన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత గొడవ మళ్లీ పెరుగుతుంది. “వాడు పిచ్చివాడు. పిచ్చి అంటే ఏమిటో తెలుసా. సాటి మనిషి బాధని అర్థం చేసుకోలేకపోవటం. ప్రేమించలేకపోవటం” అంటాడు ఫ్రాంక్. ఏప్రిల్ విరగబడి నవ్వుతుంది. “నాకు నీ మీద ప్రేమ లేదన్నానని నన్ను పిచ్చిదాన్ని అంటున్నావు. నువ్వంటే నాకు ద్వేషం” అంటుంది. “అంత ద్వేషముంటే నా ఇంట్లో ఎందుకున్నావు? సమయం ఉన్నప్పుడే అబార్షన్ ఎందుకు చేసుకోలేదు? అలా చేసినా బావుండేది” అంటాడతను. ఒకరినొకరు మానసికంగా గాయపరచాలని మాటల బాణాలు వదులుతారు. ఇద్దరూ ఆవేదనలో ఉంటారు. అయితే మర్నాడు ఏప్రిల్ శాంతంగా ఉంటుంది. అతనికి అల్పాహారం తయారు చేస్తుంది. అతను చేసే ఉద్యోగం వివరాలు అడుగుతుంది. అతను కంప్యూటర్ల గురించి వివరిస్తాడు. తర్వాత ఆఫీసుకి బయల్దేరతాడు. అతను వెళ్ళిన తర్వాత ఏప్రిల్ అబార్షన్ చేసుకుంటుంది. అయితే అది వికటించి రక్తస్రావం అవుతుంది. ఆమెని హాస్పిటల్లో పెడతారు. పరిస్థితి విషమించి ఆమె మరణిస్తుంది. ఫ్రాంక్ ఇల్లు అమ్మేసి, ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సమాజం ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తుంది. ఒకరోజు మిల్లీ తన స్నేహితులతో ఫ్రాంక్ దంపతుల గురించి చెబుతుంటే షెప్ అక్కడ ఉండలేక బయటకి వెళతాడు. మిల్లీ అతని దగ్గరకి వెళితే “ఇంకెప్పుడూ వారి గురించి మాట్లాడొద్దు” అంటాడు. జాన్ తల్లి తన భర్తతో “ఫ్రాంక్, ఏప్రిల్ ఏదో ఊహాప్రపంచంలో ఉన్నట్టు ఉండేవారు. ఇల్లు కూడా సరిగ్గా చూసుకోలేదు. దాంతో ఇంటి విలువ పడిపోయింది” అంటుంది. జరిగిన విషాదాన్ని మర్చిపోవాలని ప్రయత్నించేవారు కొందరు. తేలిక చేసి మాట్లాడేవారు కొందరు.

ఉద్యోగం ఇష్టం లేనివారు, జీవితం మీద విసుగు చెందినవారు చాలామంది ఉంటారు. భార్యాభర్తలు చర్చించుకుని పరిష్కారం చూసుకోవాలి. ఒత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకప్పుడు అవకాశాలు లేవేమో. ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. కొంచెం జీతం తక్కువైనా ఇష్టమైన పని చేసుకోవచ్చు. విలాసవంతమైన ఇల్లు, వాహనాలు, ఖరీదైన జీవనశైలి ఉండాలని పరుగులు పెట్టడం అవివేకం. అప్పులు చేసి అన్నీ సమకూర్చుకోవటం, అప్పులు తీర్చటానికి జీతం సరిపోక ఇబ్బందిపడటం చూస్తున్నాం. సమాజంలో హోదా కోసమే ఇదంతా. ఎవరేమనుకున్నా ఉన్నంతలో తృప్తిగా ఉంటే బాధ ఉండదు. ఇష్టమైన రంగంలో నైపుణ్యాలు పెంచుకోవచ్చు. మానవసంబంధాలని కాపాడుకోవాలి. మనోభావాలని అర్థం చేసుకోవాలి. ఒకరి అభిపాయాలని ఒకరి మీద రుద్దితే ఫలితం విషాదమే అవుతుంది.

Exit mobile version