Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 80: అప్ ఇన్ ది ఎయిర్

[సంచిక పాఠకుల కోసం ‘అప్ ఇన్ ది ఎయిర్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ఇ[/dropcap]టీవల ఒక కంపెనీ సీఈఓ ఒకే జూమ్ కాల్‌లో పలువురు ఉద్యోగులకు వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు చెప్పాడు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని రచయిత వాల్టర్ కిమ్ ఇరవై సంవత్సారాల క్రితమే ఊహించాడు. ఆయన రాసిన నవల ఆధారం రూపొందిన చిత్రం ‘అప్ ఇన్ ది ఎయిర్’ (2009). ‘అప్ ఇన్ ది ఎయిర్’ అనే పదబంధం అనిశ్చితికి సూచనగా వాడతారు. ఉదాహరణకి ప్రభుత్వం మనుగడ అనిశ్చితిలో ఉంది అనటానికి ‘The future of the government is up in the air’ అనవచ్చు. ఆ పదబంధానికి శబ్దార్థం చూస్తే ‘గాలిలో ఉండటం’ అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో నాయకుడు ఎక్కువగా విమానాల్లో ప్రయాణిస్తుంటాడు. అంటే గాలిలో ప్రయాణిస్తుంటాడు. అతని కంపెనీ చేసే పని ఏమిటంటే వేరే కంపెనీలకు వారి ఉద్యోగులను తొలగించటంలో సాయపడటం. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఉద్యోగుల భవిష్యత్తుని అనిశ్చితిలో పడేయటం. అలాంటి నాయకుడి జీవితంలోకి ఇద్దరు స్త్రీలు వస్తారు. అతని జీవితాన్ని మార్చేస్తారు. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

 

నాయకుడి పేరు రయన్. ఒంటరివాడు. అతనికి ప్రయాణం చేయటం, హోటళ్ళలో ఉండటం అంటే ఇష్టం. కొందరు ఒకచోట ఉండలేరు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటే అదో థ్రిల్. సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చుంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా తమ హృదయంలోకి తాము తొంగి చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి అవసరం రాకుండా పరుగులు పెడుతూ ఉంటారు. విమానయాన సంస్థలు తన వ్యాపారం కోసం వారికి ‘ఎయిర్‌లైన్ మైల్స్’ ఇస్తాయి. ప్రయాణం చేసిన ప్రతి సారి కొన్ని మైల్స్ జమ అవుతాయి. అలా జమ చేసుకున్న మైల్స్ వాడుకుని ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎన్ని ఎక్కువ మైళ్ళు ఉంటే అంత ఖరీదైన ప్రదేశానికి వెళ్ళవచ్చు. రయన్ అలా మైళ్ళు పోగేసుకుంటూ ఉంటాడు. అతనికి కోటి మైళ్ళు పోగేసుకోవాలని కోరిక. ఎందుకు అంటే కోటి అనే సంఖ్య చేరుకోవటానికి. అంతే! కొందరి లక్ష్యాలు ఇలాగే ఉంటాయి. వాటి వల్ల ప్రత్యేక ప్రయోజనం ఆశించరు. ఆ లక్ష్యం చేసుకోవటమే వారు కోరుకునే ప్రయోజనం. కొందరు నాణేలు సేకరిస్తూ ఉంటారు. రయన్ మైళ్ళు సేకరిస్తూ ఉంటాడు. ఇంతకు ముందు కేవలం ఆరుగురే ఆ సంఖ్యని చేరుకున్నారని అంటాడు.

రయన్‌కి ఒకరోజు ఎయిర్‌పోర్ట్ హోటల్లో ఆలెక్స్ అనే ఆమె తారసపడుతుంది. ఆమె కూడా తన ఉద్యోగరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటుంది. వారి మొదటి సంభాషణ అద్దె కార్ల గురించి. ఏ రెంటల్ కంపెనీ ఇచ్చే ప్రయోజనాలు బావుంటాయో అని వాదించుకుంటారు. రెంటల్ కంపెనీ వాళ్ళు కూడా ఎయిర్‌లైన్ మైల్స్ ఇస్తారు. ఎయిర్‌పోర్ట్ హోటల్లో భోజనానికి ఎక్కువ ఖర్చు పెడితే వారు కూడా ఎయిర్‌లైన్ మైల్స్ ఇస్తారు. అందుకని రయన్ అవసరం లేకపోయినా ఎక్కువ భోజనం తెప్పించుకుంటూ ఉంటాడు. అతనికి మైళ్ళు పోగేసుకోవటమంటే పిచ్చి. రయన్, ఆలెక్స్ మనస్తత్వాలు దాదాపు ఒకటే. ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడుతుంది. జవాబుదారీ ఏమీ లేకుండా లైంగిక వాంఛ తీర్చుకోవటమే వారి ఉద్దేశం. ఇద్దరూ తమ తమ షెడ్యూల్ ప్రకారం మళ్ళీ ఎక్కడ కలుసుకోవాలో ప్రణాళిక కూడా వేసుకుంటారు. అమెరికా లైంగిక స్వేచ్ఛ పేరుతో ఇలాంటి సంబంధాలు మామూలే.

రయన్ చెల్లెలు జూలీ ఒకతన్ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అమెరికాలో అన్నగారికి చెల్లెలి పెళ్ళి బాధ్యత ఉండదు. ఆ బాధ్యత తలిదండ్రులదే. వారికి తలిదండ్రులు లేరు. ఆస్తి పంపకాలు జరిగిపోయే ఉంటాయి. ఎవరి బతుకు వారిదే. జూలీ ఒక వింత ఆలోచన చేస్తుంది. తానూ, తన కాబోయే భర్తా కలిసి దిగిన ఫొటోని కాస్త పెద్ద కటౌట్ లాగా ప్రింట్ చేయించి తన స్నేహితులకి పంపిస్తుంది. వాళ్ళని అందమైన ప్రదేశాల్లో ఆ కటౌట్లు పెట్టి ఫోటో తీయమని చెబుతుంది. ఆ విధంగా ఆ జంట ఆ ప్రదేశాలలో ఉన్నట్టు భ్రమ కలిగిస్తారు. ఇదంతా ఎందుకు? ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఆ ప్రదేశాలన్నీ తిరగే స్తోమత లేదు కాబట్టి ఈ విధంగా ఆ కోరిక తీర్చుకుంటారు. రయన్, జూలీల అక్క జూలీకి ఈ విషయంలో సాయపడుతూ ఉంటుంది. రయన్ లాస్ వేగాస్‌కి వెళ్తున్నాడని అతని అసిస్టెంట్ ద్వారా తెలుసుకున్న అతని అక్క అతనికి కటౌట్ పంపించి లాస్ వేగాస్‌లో ఫొటో తీయమని ఫోన్లో చెబుతుంది. “నువ్వు మరీ ఒంటరి బతుకు బతుకుతున్నావు” అంటుంది. ఆ సమయంలో ఎయిర్‌పోర్టులో ఉన్న రయన్ “నా చుట్టూ జనమే” అంటాడు.

ఒకరోజు రయన్ కంపెనీ యజమాని న్యాటలీ అనే ఆమెని అందరికీ పరిచయం చేస్తాడు. ఆమె వయసు చిన్నదే. కానీ టెక్నాలజీ బాగా తెలుసు. వీడియో కాల్ ద్వారా ఉద్యోగులని తొలగించవచ్చు అని ఒక కొత్త ప్రతిపాదన చేస్తుంది. అలా చేస్తే రయన్‌కి ఇంక ప్రయాణాలు చేసే అవకాశం ఉండదు. పైకి మాత్రం మనిషిని కలవకుండా ఉద్యోగం నుంచి తొలగించటం అమానవీయం అంటాడు. న్యాటలీ అనుభవలేమి వల్ల అతనికి ఎదురుచెప్పలేకపోతుంది. కంపెనీ యజమాని న్యాటలీని రయన్‌తో పాటు కొన్నాళ్లు ప్రయాణాలు చేసి అనుభవం పెంచుకోమంటాడు. రయన్‌కి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. ఒక చోట ఒకతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే అతను ఇద్దరినీ తిట్టటం మొదలు పెడతాడు. “నా పిల్లలకి ఏం చెప్పాలి?” అంటాడు. న్యాటలీ “ఈ పరిణామం మీ పిల్లలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాధ్యత పెరిగి పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారని కొన్ని సర్వేలు తేల్చాయి” అంటుంది. ఆమెకి పుస్తకజ్ఞానమే కానీ జీవితం పట్ల అవగాహన లేదనటానికి ఇదో ఉదాహరణ. ఆ ఉద్యోగి “ఏడ్చినట్టుంది?” అంటాడు. రయన్ “మీ పత్రాలు చూస్తే మీరు ఫ్రెంచ్ ఆహారం తయారీ నేర్చుకున్నారని తెలిసింది. అదే మీకు నచ్చిన పని కదా? మరి ఈ ఉద్యోగం వదిలేసి మీకు నచ్చిన పని మీరు చేసుకుంటే మీ పిల్లలకి వారికి నచ్చిన పని వారు చేసుకోవచ్చని సందేశం ఇచ్చినట్టు ఉంటుంది కదా?” అంటాడు. అతను ఎంత తెలివైనవాడో దీన్ని బట్టి తెలుస్తుంది. ఉద్యోగం పోయినా ధైర్యం ఉండాలని చెప్పటం అతనికి కూడా తెలుసు. ఆ ధైర్యానికి సహేతుకమైన కారణం చూపటమే అతని నేర్పరితనం. మరో పక్క అతను ఆలెక్స్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరి స్వభావాలూ ఒక్కటే కావటంతో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. స్వభావాలు ఒక్కటైతే జీవితం సాఫీగా ఉంటుందా? ఉండదనే చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని రాజీ పడితేనే జీవితం బావుంటుంది.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఉద్యోగం పోతే నిరాశ పడటం సహజం. కానీ ధైర్యంగా ఉండాలి. ఒక ప్రణాళిక వేసుకుంటే పరిస్థితులని ఎదుర్కోవచ్చు. ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాల్లో ఎక్కువ రిస్కు కూడా ఉంటుంది. అది సహజం. ఇది అర్థం చేసుకోవాలి. పొదుపు అలవరచుకోవాలి. విలాసాలకి దూరంగా ఉండాలి. ఉద్యోగం ఉంది కదా అని ఈఎమ్ఐ పధ్ధతిలో ఇల్లూ, వాహనాలూ, వస్తువులూ కొనకుండా ఉంటే మంచిది. 80 శాతం మనం పెట్టుకోగలిగితే 20 శాతం అప్పు చేయవచ్చు. 20 శాతం మనం పెట్టుకుని 80 శాతం అప్పు చేయటం అవివేకమే అనిపించుకుంటుంది. నాకు తెలిసినవాళ్ళలోనే పరిస్థితులు తారుమారైన వారున్నారు. ధైర్యంగా నిలబడి మళ్ళీ నిలదొక్కుకున్నారు. ఈ రోజుల్లో బంధువుల్లో పరువు పోకూడదు అన్న ఒత్తిడి ఎక్కువ ఉంటోంది. నేరుగా ఏమీ అనకపోయినా వెనకాల అనే మాటలు ఎవరో ఒకరు మోస్తూనే ఉంటారు. అలాంటివి పట్టించుకోకూడదు. ముఖ్యంగా కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి.

రయన్ అప్పుడప్పుడూ ప్రసంగాలు కూడా ఇస్తూ ఉంటాడు. జీవితాన్ని వీపున మోసే సంచీతో పోలుస్తాడు. వస్తువులు పోగేసుకోకూడదని చెబుతాడు. మానవసంబంధాలు మన జీవితంలో ఉన్న అత్యంత భారమైన సామాన్లని అంటాడు. వాటిని ఎంత వదిలించుకుంటే సంచీ అంత తేలిగ్గా ఉంటుందని అంటాడు. న్యాటలీ “మీరు పెళ్ళి చేసుకోరా? పిల్లలు వద్దా?” అని అడిగితే “వాటి అవసరం లేదు. మనమందరమూ ఒంటరిగా పోయేవాళ్ళమే” అంటాడు. తర్వాత న్యాటలీ బాయ్ ఫ్రెండ్ ఆమెని వదిలేస్తున్నానని ఒక ఎస్ఎంఎస్ పంపితే ఆమె దుఃఖపడుతుంది. “ఇంటర్నెట్ ద్వారా మనుషుల్ని ఉద్యోగం నుంచి తొలగించినట్టే ఉంది ఇది” అంటాడు రయన్ హాస్యానికి. ఆలెక్స్ రయన్‌ని కలుసుకోవటానికి వస్తుంది. ఇద్దరూ కలిసి న్యాటలీని సముదాయిస్తారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం తన సొంత ఊరిలో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చానని న్యాటలీ బాధపడుతుంది. తన జీవితభాగస్వామి గురించి తానెన్నో కలలు కన్నానని అంటుంది. ఆలెక్స్‌ని “మీకెలాంటి భర్త కావాలి?” అని అడుగుతుంది. రయన్ ఎదుటే ఇలాంటి ప్రశ్న అడిగిందంటే అక్కడి సంస్కృతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు డేటింగ్ చేస్తున్నంత మాత్రాన పెళ్ళి చేసుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదు. ఆలెక్స్ “నాకు ముప్ఫై నాలుగేళ్ళు. ఈ వయసులో అతనిలో అందం, ఒడ్డూపొడుగూ అంత ముఖ్యం కాదు. నమ్మదగినవాడై ఉండాలి. నన్ను గౌరవంగా చూసుకోవాలి. నాకంటే ఎక్కువ సంపాదించాలి. ఇది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ అతని సంపాదన తక్కువైతే జీవితం నరకమే. అతనికి అందమైన చిరునవ్వు ఉండాలి” అంటుంది. న్యాటలీ “ఇది విన్నాక నాకు భయంగా ఉంది. కానీ నేను రాజీపడను” అంటుంది.

తర్వాత ఆలెక్స్, రయన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె “నీ గురించి గూగుల్ చేశాను. సంచీ ఖాళీ చేసుకోవాలని ప్రసంగాలు ఇస్తావు కదా!” అంటుంది. “ఈ మధ్య సంచీ ఖాళీ చేసి నాకేం కావాలో అది మాత్రమే సంచీలో పెట్టుకోవాలని అనిపిస్తూంది” అంటాడతను. మర్నాడు ఆమె వేరే ఊరికి వెళ్ళాలని పెందరాళే తయారవుతుంది. చప్పుడుకి అతను నిద్రలేస్తాడు. నిద్రలేపి చెప్పటం పద్ధతి. ఆమె ముందే చెప్పకపోవటంతో అతను చిన్నబుచ్చుకుంటాడు. ఆమె అతనికి నచ్చింది కాబట్టి ఆమె మీద ఆశలు పెట్టుకున్నాడు. మరి అతను ఇంతకుముందు ఎంతమందిని నిరాశపరిచాడో? తనదాకా వస్తే కానీ తెలియదు. మళ్ళీ కలుసుకుందామని చెప్పి ఆలెక్స్ వెళ్ళిపోతుంది. న్యాటలీ ఆలెక్స్ గురించి అడిగితే అతను తన మనసులోని విషయం చెప్పడు. ఆమెతో తన సంబంధం కేవలం సరదాకి మాత్రమే అంటాడు. న్యాటలీకి చిరాకు వస్తుంది. “ఆమెతో నిజమైన అనుబంధం ఏర్పడుతుందేమో, చూడొచ్చు కదా? ఆమె లాంటిది మీకు మళ్ళీ దొరకదు” అంటుంది. ఈ పరిణామాలతో అతని మనసు మెత్తబడటం మొదలవుతుంది.

జేసన్ రైట్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అసలు దర్శకుడు ఉన్నాడా అన్నట్టు చిత్రం సాగిపోతుంది. ఇది నిజంగా దర్శకుడి విజయం. రయన్‌గా జార్జ్ క్లూనీ, ఆలెక్స్‌గా వేరా ఫార్మిగా, న్యాటలీగా ఆనా కెండ్రిక్ నటించారు. ముగ్గురూ ఆస్కార్ నామినేషన్లు అందుకున్నారు. జూలీగా మెలనీ లిన్స్కీ చిన్న పాత్రలో నటించినా ఆ పాత్రే ఈ చిత్రానికి పట్టుగొమ్మలా ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఒకరోజు న్యాటలీ తానే ఒక ఉద్యోగినిని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. ఆ ఉద్యోగిని తాను బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది. న్యాటలీకి ముచ్చెమటలు పోస్తాయి. రయన్ ఆమెకి నచ్చచెబుతాడు. “మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. పట్టించుకోకు” అంటాడు. ఆమె శాంతిస్తుంది. కొన్నాళ్ళకి వీడియో పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారు. అది బాగా పనిచేయటంతో ఇక ప్రయాణాలు ఉండవని కంపెనీ ప్రకటిస్తుంది. రయన్‌కి ఇది నిరాశ కలిగిస్తుంది. ఒంటరిగా ఉండాలనే ఆలోచనే అతనికి దుర్భరంగా ఉంటుంది. అతను ఆలెక్స్‌ని కలుసుకోవటానికి వెళతాడు. ఇది అతని స్వార్థం. ఒంటరిగా ఉండలేక ఆమె తోడు కోరుకుంటాడు. ఆమెని తన చెల్లెలి పెళ్ళికి తీసుకువెళతాడు.

అమెరికాలో కూడా కన్యాదానం పద్ధతి ఉంది. వధువు తండ్రి వధువుని తీసుకొచ్చి వరుడికి ఇస్తాడు. రయన్ జూలీతో “నాన్న లేడు కదా! నీ కన్యాదానం సంగతి ఏమిటి?” అంటాడు. అతని అక్క కూడా అక్కడే ఉంటుంది. అతని అంతరార్థం తాను కన్యాదానం చేస్తానని. అన్నాళ్ళూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి కన్యాదానం చేస్తానంటే అది ఎంత బాధ్యత లేని తనం? అప్పటికే వరుడి మామయ్య కన్యాదానం చేయటానికి ఒప్పుకుంటాడు. మరి చివరి రోజు వరకు ఆగరు కదా? కానీ అడగటం రయన్ తప్పు. జూలీని ఇరుకునపెట్టటమే. ఆమె వరుడి మామయ్య కన్యాదానం చెస్తాడని చెబుతుంది. రయన్ సరేనని వెళ్ళిపోతాడు. జూలీ బాధపడుతుంది. ఆలోచించకుండా అడగటం రయన్ తప్పు. వాళ్ళ అక్క జూలీని సముదాయిస్తుంది. పెళ్ళిరోజు వరుడిని ఒకరకమైన భయం ఆవహిస్తుంది. దీన్ని cold feet అంటారు. ఇంత బాధ్యత నేను మోయగలనా అనే భావం. కురుక్షేత్రంలో అర్జునుడికి కలిగిన విషాదం కూడా ఇలాంటిదే. ఇందరిని చంపి నేనేం బాగుపడతాను అనుకుంటాడు. వరుడికి నచ్చజెప్పమని రయన్ అక్క రయన్‌ని అడుగుతుంది. ఆమె తన భర్తతో వేరుపడింది కాబట్టి తన మాటకి విలువ ఉండదు అంటుంది. రయన్ “ఒంటరిగా ఉండటం నీకిష్టమేనా” అని అడుగుతాడు వరుడిని. లేదంటాడు అతను. “తోడు ఉంటే జీవితం సులువుగా ఉంటుంది. పైలట్‌కి కోపైలట్ తోడున్నట్టే” అంటాడు రయన్. వరుడు స్థిమితపడతాడు. పెళ్ళి జరిగిపోతుంది. రయన్‌కి కూడా ఒక తోడు కావాలని అనిపిస్తుంది. ఆలెక్స్‌కి సూటిగా చెప్పడు. ఆమె కాదంటుందేమోనని భయం.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

న్యాటలీ వీడియో ద్వారా జరుగుతున్న ఉద్వాసనలను పర్వవేక్షిస్తుంటుంది. ఇదెంతో సులభమైన విధానమని ఆమె ఆనందంగా ఉంటుంది. వీడియో ద్వారా పని జరిగిపోతుండటంతో రయన్‌కి ప్రయాణాలు ఉండవు. త్వరలోనే అతన్ని నిస్పృహ ఆవహిస్తుంది. ఒకరోజు అతను ఒక ప్రసంగం ఇస్తూ మధ్యలో ఆగిపోతాడు. బంధాలు తగ్గించుకోవాలి అనే తన సూత్రం అతను నమ్మటం మానేశాడు మరి! అతను అప్పటికప్పుడు విమానం ఎక్కి సికాగో నగరంలోని ఆలెక్స్ ఇంటికి వెళతాడు. ఇంటి బెల్ నొక్కి ఉద్వేగంగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఆమె తలుపు తీస్తుంది. ఇంటిలో పిల్లల మాటలు వినపడతాయి. ఒక పురుషుడి గొంతు కూడా వినిపిస్తుంది. వారు ఆమె భర్త, పిల్లలు అని రయన్‌కి అర్థమవుతుంది. అతని ముఖం వివర్ణమవుతుంది. ఆమె తలుపు మూసేస్తుంది. రయన్ వెనుదిరుగుతాడు.

రయన్ ఎంతమందితో సరదాలు తీర్చుకున్నా అబద్ధం చెప్పలేదు. ఆలెక్స్ మాత్రం అబద్ధం చెప్పి అతనితో సంబంధం పెట్టుకుంది. న్యాటలీ అడిగినపుడు తనకి పెళ్ళి కాలేదని చెప్పింది. ఎందుకు? తర్వాత రయన్ అడిగితే “నా నిత్యజీవితం నుంచి కాసేపు ఆటవిడుపు నువ్వు. నువ్వు చేసిన తెలివితక్కువ పని వల్ల నా జీవితమే తలకిందులయ్యేది” అంటుంది. రయన్ ఏ దోషమూ లేనివాడేం కాదు. అతనికి అనుబంధం పెంచుకోవటం ఇష్టం లేదని తెలిసే ఆలెక్స్ అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. అతనికి సెక్స్ కావాలి, ఆమెకి ఆటవిడుపు కావాలి. ఆధునిక సమాజంలో ఇలాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ‘ఆనందం కోరుకోవటంలో తప్పేముంది’ అని అంటున్నారు. ఒక సందర్భంలో రయన్, ఆలెక్స్ తన దగ్గరున్న క్లబ్ మెంబర్ షిప్ కార్డులు పోల్చిచూసుకుంటారు. అవి వారికి దక్కే గౌరవానికి సూచికలు. తమ జీవితాల విలువని వాటితో కొలుచుకుంటారు. రయన్ అనుబంధాల నుంచి పారిపోయి చివరికి విసుగుచెందాడు. ఆలెక్స్ అనుబంధాలతోనే విసుగు చెందింది. మనిషి ఉన్నదాన్ని వదిలి కొత్త అనుభావాల కోసం అర్రులు చాస్తూ ఉంటాడు. అనుభవాలు ఎండమావుల వంటివి అని తెలుసుకుంటేనే పరుగు ఆపగలం. అది తెలుసుకుని రయన్ పరుగు ఆపుదామనుకున్నాడు. అతనికి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడో ఒకప్పుడు ఆలెక్స్‌కి కూడా ఎదురుదెబ్బ తగులుతుంది.

రయన్ తన ఊరికి వెళుతుంటే అతను కోటి మైళ్ళు చేరుకున్నాడని ఫ్లైట్ అటెండెంట్ ప్రకటిస్తుంది. రయన్ కోరుకున్నది ఇదే. అయితే అతను హతాశుడై ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేడు. విధివిలాసం ఏమిటంటే అప్పుడే పైలట్ వచ్చి అతన్ని అభినందిస్తాడు. రయన్‌కి తాను చేరుకున్న లక్ష్యం ఇప్పుడు నిరర్థకంగా కనిపిస్తుంది. అతను తను సేకరించిన మైళ్ళను జూలీకి, ఆమె భర్తకి బహూకరించాలని నిర్ణయించుకుంటాడు. వాళ్ళు డబ్బులు లేక ఎక్కడికీ వెళ్ళలేకపోయారు. ఇప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళగలరు. ఇతరులను ఆనందపరచటమే నిజమైన ఆనందం.

అఫీసులో రయన్‌కి అతని యజమాని ఒక విషాద వార్త చెబుతాడు. న్యాటలీతో ఆత్మహత్య చేసుకుంటానని అన్న ఉద్యోగిని నిజంగానే ఆత్యహత్య చేసుకుంది. యజమాని బాధంతా ఆమె కుటుంబం తమ కంపెనీ మీద కేసు వేస్తుందని. అందుకే రయన్‌తో “ఈ మధ్య కాలంలో ఎవరైనా కుంగిపోయినట్టు మాట్లాడారా? ఏమైనా అఘాయిత్యం చేసుకుంటారని మీకు అనిపించిందా? అలా అయితే మనం చట్టపరంగా బాధ్యత వహించాలి” అని అంటాడు. రయన్‌కి ఆ స్త్రీ గుర్తుంది. అయితే న్యాటలీ ఇరుకున పడుతుందని అతను గుర్తు లేదని అంటాడు. ఆత్మహత్య విషయం తెలిసి న్యాటలీ ఎలా స్పందించిందని అడుగుతాడు. ఆమె ఉద్యోగం వదిలి వెళ్ళిపోయిందని యజమాని అంటాడు. ఉద్యోగాలు తీసేసే ఉద్యోగం వంటివి లేకపోవటమే మంచిది. ఉద్యోగం తీసేయాలంటే యజమాని స్వయంగా చెప్పాలి. ఎవరినో పిలిపించి చెప్పించటం పిరికితనం. చివరికి న్యాటలీ తన సొంత ఊరికి వెళ్ళి ఉద్యోగం చూసుకుంటుంది. అక్కడి మేనేజర్ రెఫరెన్స్ అడిగితే రయన్ పేరు చెబుతుంది. రయన్ ఆమె చాలా నిజాయితీ గల అమ్మాయి అని ఆ మేనేజర్‌కి ఉత్తరం రాస్తాడు. నిజాయితీ కలది కాబట్టే తన నేరం లేకపోయినా ఆమె నైతిక బాధ్యత వహించి పాత ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొసమెరుపు ఏమిటంటే రయన్ యజమాని తిరిగి రయన్‌ని ఉద్యోగాలు తీసేయటానికి ప్రయాణాలు చేయమంటాడు. చివర్లో నిజంగానే ఉద్యోగాలు పోయిన కొంతమందిని చూపిస్తాడు దర్శకుడు. వాళ్ళు తమ కుటుంబం సాయంతో ధైర్యంగా ఉన్నామని అంటారు. రయన్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.

బలమైన కారణాలు లేకుండా అనుబంధాలను తెంచుకోకూడదు. రయన్‌కి అక్క, చెల్లెలు ఉన్నారు. వారిని అతను పట్టించుకోలేదు. ఇవి దేవుడిచ్చిన బంధాలు. వాటిని కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎవరి బతుకు వారిదే అయినా ఈ అనురాగాలు నిలబెట్టుకుంటారు. ఒకరికొకరు తోడుగా ఉంటారు. కనీసం మనసు విప్పి చెప్పుకోవటానికి వారున్నారనే భావన బలాన్నిస్తుంది. కొందరికి జీవితభాగస్వామే దగ్గరి నేస్తం. కొందరికి ప్రాణస్నేహితులు ఉంటారు. కొందరికి దేవుడితో బంధం ఉంటుంది. ఏ బంధమూ లేకపోతే జీవితం కొంతకాలానికి నిస్సారం అవుతుంది. రయన్ స్వార్థంతో బంధాలకి దూరంగా ఉన్నాడు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు.

Exit mobile version