[సంచిక పాఠకుల కోసం ‘గ్యాలెక్సీ క్వెస్ట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[dropcap]గ్ర[/dropcap]హాంతరవాసుల గురించి ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘మెన్ ఇన్ బ్లాక్’ లాంటి హాస్య చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వ్యంగ్యాత్మక చిత్రాలు చాలా తక్కువ. అలాంటి చిత్రమే ‘గ్యాలెక్సీ క్వెస్ట్’ (1999). 80వ దశకంలో వచ్చిన ‘స్టార్ ట్రెక్’ అనే టీవీ సీరియల్‌లో అంతరిక్షంలో జరిగే ఘర్షణలను చూపించేవారు. అందులో మంచికి ప్రతినిధిగా నిలిచే నాయకుడు, అతని అనుచరులు ముఖ్యపాత్రలు. ఆ సీరియల్‌కి వీరాభిమానులు చాలామంది ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. ఆ సీరియల్ మీద, అభిమానుల మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ తీసిన చిత్రమిది. అయితే ఈ వ్యంగ్యం విలక్షణంగా ఉంటుంది. ‘స్టార్ ట్రెక్’ అభిమానులకి కూడా ఈ చిత్రం నచ్చుతుంది, నవ్వు తెప్పిస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హాస్యప్రియులు, సైన్స్ ఫిక్షన్ ప్రియులు తప్పక చూడవలసిన చిత్రమిది. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.
కథ ప్రకారం 80వ దశకంలో ‘గ్యాలెక్సీ క్వెస్ట్’ అనే టీవీ సీరియల్ వచ్చేది. అది ముగిసిన తర్వాత కూడా అందులో నటించిన నటీనటులకి ప్రజాదరణ ఉంటుంది. 90వ దశకంలో కూడా ఆ సీరియల్లో ఉన్నట్టు వేషధారణ వేసుకుని వారు ప్రదర్శనలు ఇస్తుంటారు. నిజానికి ఇది ఒక వ్యాపారం. ఆ సీరియల్‌కి సంబంధించిన దుస్తులు, వస్తువుల నకళ్ళు అమ్మి సొమ్ము చేసుకోవటానికి. నటీనటులకి కొంత డబ్బు వస్తుంది. వ్యాపార ప్రచారాలలో కూడా పాల్గొంటారు. సీరియల్లో వ్యోమనౌక కెప్టెన్‌గా నటించినవాడు జేసన్. అతనికి ఈ ప్రదర్శనలు, ప్రచారాలు చేయటంలో ఏ మాత్రం నామోషీ ఉండదు. ఇతరులకి మాత్రం ఇది చిన్నతనంగా ఉంటుంది. కొన్ని సీరియళ్ళలో నటించాక ఆ పాత్రల ముద్ర అలా ఉండిపోతుంది. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలతోనే పోలుస్తూ ఉంటారు. మన దేశంలో ‘రామాయణ్’లో నటించిన నటీనటులకి ఆ తర్వాత ఏ పాత్రలోనూ పేరు రాలేదు. వారిని ఇప్పటికీ ఆ పాత్రలలోనే ఊహించుకుంటూ ఉంటారు చాలామంది. అలాగే ఇక్కడ కూడా జరిగింది. వేరే పాత్రలు లేక వారు ఈ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. జేసన్ తప్ప మిగతావారందరూ తమ నటజీవితం ఇలా దిగజారిపోయినందుకు బాధపడుతూ ఉంటారు.
ఒక ప్రదర్శనలో అభిమానులు ఆటోగ్రాఫుల కోసం ఎగబడుతూ ఉంటారు. కొంతమంది ఆ సీరియల్లో ఉన్నట్టు వేషాలు వేసుకుని వస్తారు. ముఖ్యంగా లాజరస్ అనే పాత్ర పోషించిన ఆలెక్స్ వేషం వినూత్నంగా ఉంటుంది. లాజరస్ గ్రహాంతరవాసి కావటంలో అతని తల వింత ఆకారంలో ఉంటుంది. ఆలెక్స్ ఒకప్పుడు షేక్స్‌పియర్ నాటకాలు వేసేవాడు. ఇప్పుడు ఇలా డబ్బు కోసం చవకబారు ప్రదర్శనలు ఇవ్వటం అతనికి అవమానంగా ఉంటుంది. గ్వెన్ అనే నటి కెప్టన్‌కి సహాయకురాలిగా నటించేది. ఆమెని గ్లామర్ కోసమే ఆ పాత్రలో పెట్టారని ఆమెకి తెలుసు. సీరియల్లో కంప్యూటర్ ఆమె ఇచ్చిన ఆదేశాలు మాత్రమే అనుసరించేలా ప్రోగ్రామ్ చేయబడి ఉండేది. వేరెవరూ కంప్యూటర్‌ని తప్పుదారి పట్టించకుండా. ప్రదర్శన జరుగుతుండగా సీరియల్లో లాంటి దుస్తులు వేసుకున్న నలుగురు వ్యక్తులు జేసన్‌ని తమకి అంతరిక్షంలో ప్రమాదం ఉందని, తమకి సహాయం చేయమని అడుగుతారు. కొందరు అభిమానులు ఇలా ఒక కథని సృష్టించి పిలవటం, వారి ప్రదర్శనలకి వెళ్ళటం మామూలే. జేసన్ సరే అంటాడు. తర్వాత అతను బాత్రూమ్‌లో ఉండగా ప్రదర్శనకి వచ్చిన కొందరు వ్యక్తులు అతన్ని హేళన చేయటం వినపడుతుంది. “పెద్ద వెధవల్లా ఉన్నారు. అందరూ వీళ్ళని చూసి నవ్వుతున్నారని తెలియట్లేదు” అంటాడు. అతనికి మొదటిసారి తన స్థితి గురించి అవగాహన కలుగుతుంది. విసుగ్గా ప్రదర్శన నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో తప్పతాగి నేల మీద పడి నిద్రపోతాడు.
మర్నాడు లేచేసరికి క్రితం రోజు సాయం అడిగిన నలుగురూ గాజు కిటికీల అవతల కనపడతారు. అతను ప్రదర్శన వదులుకోవటం ఇష్టం లేక వారితో కారులో వెళతాడు. వారు తాము తెర్మియా అనే గ్రహం నుంచి వచ్చామని, తమ మీద శారిస్ అనే వేరే గ్రహం వాడు తన సైన్యంతో దాడి చేస్తున్నాడని చెబుతారు. వారి నాయకుడు మాతెజార్. జేసన్ మద్యం మత్తు దిగకపోవటంతో వారి మాటలు వింటూ నిద్రపోతాడు. అతను లేచేసరికి సీరియల్లో చూపించిన కమాండ్ సెంటర్ లాంటి దాంట్లో ఉంటాడు. మాతెజార్ అతన్ని శారిస్ నుంచి ఎలా తప్పించుకోవాలో సలహా అడుగుతాడు. జేసన్‌ని కెప్టెన్ స్థానంలో కూర్చోబెడతాడు. శారిస్ తెరపై కనపడతాడు. రక్తపాతం చేస్తానని బెదిరిస్తాడు. జేసన్ ఇదంతా నాటకమని అనుకుంటాడు. “అతని మీద నీలం కణాలు, ఎర్ర కణాలు ప్రయోగించండి” అని అక్కడ అధికారి స్థానంలో ఉన్న అతనికి చెప్పి నుంచి బయటకి వస్తాడు. ఇంటికి వెళ్ళాలని మాతెజార్‌తో అంటాడు. అతను “భూమికి వెళ్ళిపోతారా?” అంటాడు. ఉన్మాదులైన అభిమానులు ఇలా మాట్లాడటం జేసన్‌కి కొత్త కాదు. మాతెజార్ “శారిస్ మీద మీరు చెప్పినట్టు దాడి చేశాం. అతను బతికిపోతే ఏం చేయాలి?” అంటాడు. “నాకు కబురు చేయండి” అంటాడు జేసన్ ఎకసెక్కంగా. మాతెజార్ అది నిజమనుకుని అతనికి సెల్ ఫోన్ లాంటి పరికరం ఇచ్చి “ఇది గ్రహాంతర ఫోను” అంటాడు. అలాంటి ఫోనే సీరియల్లో వాడేవారు. మాతెజార్ జేసన్‌ని ఒక గదిలోకి తీసుకువెళ్ళి కృతఙతలు చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోపే ఒక ద్రవం జేసన్‌ని ఆవరిస్తుంది. వేరే ద్వారం తెరుచుకుంటుంది. అక్కడి నుంచి నక్షత్రాలు, గ్రహాలు కనపడతాయి. జేసన్ నోరు వెళ్ళబెడతాడు. ఉన్నట్టుండి మెరుపు వేగంతో ఎగిరి ఒక కృష్ణబిలం ద్వారా ప్రయాణించి ఇంటికి చేరుకుంటాడు. ప్రయాణం చేసినంత సేపు అరుస్తూనే ఉంటాడు.
తాను వెళ్లినది ప్రదర్శన కాదని అతనికి అర్థమవుతుంది. తెర్మియా అనే గ్రహం నిజంగా ఉంది. వారు జేసన్ దగ్గరకి ఎందుకు వచ్చారు? వారు ‘గ్యాలెక్సీ క్వెస్ట్’ సీరియల్ చూసి అది మానవులు చరిత్రలో భాగం అనుకున్నారు! సీరియల్ తరంగాల రూపంలో ప్రసారం అవుతుంది కాబట్టి ఆ తరంగాలని వారు ఒడిసిపట్టుకుని చూశారు. సీరియల్లో చూపించినట్టే వ్యోమనౌకని నిర్మించుకున్నారు. అందులో ఆయుధాలు నిజంగానే పని చేస్తాయి. వారు నిజానికి ఆక్టోపస్‌ల లాగా ఉంటారు. కానీ మనుషులలాగా రూపం మార్చుకునే సాంకేతికత ఉంటుంది. మనుషుల భాష అర్థం చేసుకుని మాట్లాడగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది. ఇదంతా సాధ్యమేనా అనిపిస్తుంది కానీ తెర్మియా వాళ్ళు సాంకేతికంగా భూమివాసుల కంటే అభివృద్ధి చెందారు కాబట్టి ఇదంతా సాధ్యమయింది అనే తర్కం ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో యాప్‌లు వాడి దాని ద్వారా తెలియని భాషలో సంభాషించటం మొదలయింది కదా. సరే, అంత అభివృద్ధి చెందిన వారికి టీవీ సీరియల్ అనే ప్రక్రియ ఉంటుందని తెలియదా? ఇదే ప్రశ్న తర్వాత జేసన్ అడుగుతాడు. వారికి అర్థం కాదు. “మీకు నటించటం అంటే తెలుసా?” అని అడిగితే “అంటే మోసమే కదా! దాని గురించి మాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. శారిస్ ఒకమాట చెప్పి ఇంకో పని చేస్తూ ఉంటాడు” అంటారు. వారికి నటన అనేదే తెలియదు. మనుషుల్లో కొందరు సినిమాలని, సీరియళ్ళని విపరీతంగా అభిమానించి వాటి కోసం ఎగబడటం మీద ఇది వ్యంగ్యం. వినోదం ఉండాలి, కానీ అది మరీ ఉన్మాదంలా మారకూడదు.
కథలో శాస్త్ర విజ్ఞానాన్ని ఎక్కడా తక్కువ చేయలేదు. జేసన్ అంతరిక్షంలో ప్రయాణించే ముంది ఒక చిక్కటి ద్రవం అతన్ని ఆవరిస్తుంది. అప్పుడే అంతరిక్షంలోకి తలుపు తెరుచుకుంటుంది. అంతరిక్షంలో ప్రాణవాయువు ఉండదు కదా. అందుకని ముందు ఏదో ఒక రకంగా ప్రాణవాయువు అందే ఏర్పాటు ఉండాలి. ఆ ద్రవంలో ప్రాణవాయువు ఉంటుందన్నమాట. జేసన్ కృష్ణబిలంలో ప్రయాణిస్తాడు. కృష్ణబిలాల గురించి మనకి పూర్తిగా తెలియదు కానీ వాటిలోకి వెళితే సమయం, స్థలం అనేవి పరివర్తన చెందుతాయి అని తెలుసు. తక్కువ సమయంలో కొత్త స్థలానికి ప్రయాణం చేయవచ్చని ఒక సిద్ధాంతం. మరి అక్కడున్న శక్తిని తట్టుకోవటం ఎవరికైనా సాధ్యమా? ప్రయాణానికి ఉపయోగించిన ద్రవానికి ఆ సామర్థ్యం ఉందని అనుకోవచ్చు. తెర్మియా వాసులు సాధించిన ప్రగతికి ఇది ఇంకో నిదర్శనం. మరి అలాంటి వారు శత్రువుల్ని జయించలేరా? ఇది మరో వ్యంగ్యబాణం. ఎంత అభివృద్ధి సాధించినా దుర్బుద్ధి కలవారితో ఎప్పుడూ ప్రమాదమే. ఈ కథలో హాస్యం గురించి చెప్పక్కరలేదు. ఒకసారి తెర్మియావాసులు మానవరూపం ధరించకుండా మనుషులకి కనపడతారు. అంతలోనే రూపం మార్చుకుని “క్షమించండి. రూపం మార్చుకోవటం మర్చిపోయాం” అంటారు. ఎంత అభివృద్ధి సాధించినా మతిమరుపు లాంటి అవలక్షణాలకి మాత్రం చికిత్స ఉండదు. జేసన్ తెర్మియావాసులతో మొదటిసారి బయల్దేరినపుడు లిమో కారు (పొడవాటి విలాసవంతమైన కారు) ఏర్పాటు చేయమంటాడు. వారు ఏర్పాటు చేస్తారు. అతను కారులో నిద్రపోతాడు. కారుతో సహా వారందరూ అంతరిక్షంలో ప్రయాణం చేస్తారు. తిరిగి వచ్చేటపుడు జేసన్ ‘నేను ఇంటికి వెళ్ళాలి’ అంటాడు. అంటే కారులో పంపమని. కానీ కారు కావాలని ప్రత్యేకంగా అడగలేదు కాబట్టి అతన్ని ఒక్కడినే పంపిస్తారు. మాటంటే మాటే మరి!
శారిస్ బతికి బయటపడ్డాడని, మళ్ళీ దాడికి సిద్ధపడుతున్నాడని తెర్మియా వాసులు మళ్ళీ జేసన్‌ని తమ గ్రహానికి రమ్మంటారు. జేసన్ ఒక ప్రదర్శనలో ఉన్న ఆలెక్స్‌ని, గ్వెన్‌ని, సీరియల్లో నటించిన ఇంకో ఇద్దరిని తనతో రమ్మంటాడు. వారు జేసన్ తాగిన మైకంలో పేలుతున్నాడని అనుకుంటారు. జేసన్ మాతెజార్ ఇచ్చిన సెల్ ఫోన్ (అప్పట్లో అంత అధునాతనమైన ఫోన్లు ఉండేవి కాదు) చూపిస్తాడు కానీ అంతకు ముందు ఒక అభిమానిని గుద్దటంతో అతని దగ్గర ఉన్న నకిలీ ఫోన్, జేసన్ ఫోన్ మారిపోతాయి. వారిని ఒప్పించలేక జేసన్ వెళ్ళిపోతాడు. ఒక తెర్మియా అధికారిణిని అక్కడ ఉంచి వెళతాడు. మిగతావారంతా జేసన్ చెప్పినది మరో ప్రదర్శన గురించి అని అనుమానం వచ్చి ఆ డబ్బు వదులుకోవటం ఇష్టం లేక తాము కూడా ప్రయాణమవుతారు. నిజంగానే వేరే గ్రహానికి వచ్చామని త్వరలోనే వారికి తెలుస్తుంది. భయపడతారు కానీ జేసన్ వారిని సముదాయిస్తాడు. జేసన్‌కి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మామూలుగానే అతను ఉత్సాహవంతుడు. కానీ తనని చూసి భూమి మీద జనం నవ్వుతున్నారని కుంగిపోయాడు. ఇప్పుడు తెర్మియా వాసులు అతనికి అధికారం, గౌరవం ఇవ్వటంతో అతనికి కొత్త ఉత్సాహం వచ్చింది. పైగా వారు అత్యాధునిక సాంకేతికత కలవారు. నిజం చెప్పాలంటే జేసన్‌లో మేధాశక్తి తక్కువ. అన్నీ తేలికగా తీసుకునే స్వభావం. ఇది ప్రమాదమే. అయితే కొన్నిసార్లు మొండిధైర్యం కూడా పనిచేస్తుంది. ఇలాంటి చిత్రాలలో చివరికి ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. అయినా ఎక్కడా ప్రేక్షకుల తెలివిని కించపరచకుండా కథ నడుస్తుంది. సీరియల్ అభిమానులు కూడా కథలో ముఖ్యపాత్ర పోషిస్తారు. అభిమానులని కూడా కించపరచలేదు.
పాత్రల చిత్రణ ద్వారా కూడా హాస్యం పుడుతుంది. ఆలెక్స్ ఎప్పుడూ కీడెంచి మేలెంచమన్నట్టు ఉంటాడు. జేసన్ ఉత్సాహం అతనికి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అయినా జేసన్‌దే ఎప్పుడూ పైచేయి అవుతూ ఉంటుంది. ఉత్సాహమే మనిషికి బలం కదా. గ్వెన్ ఎప్పుడూ కంప్యూటర్ చెప్పిన మాటలను మళ్ళీ చెబుతూ ఉంటుంది. అందరూ మొదటిసారి విన్నా సరే. టామీ అనే అతను ఆమె అలా మళ్ళీ చెబుతూ ఉంటే విసుక్కుంటాడు. ఆమె “నా పని ఇదే. నా పని నన్ను చేయనియ్” అని అరుస్తుంది. టామీ సీరియల్లో పైలట్‌గా నటించాడు. వ్యోమనౌకని నడపటం అతని పని. ఏ భావాలూ దాచుకోడు. మనసులో ఉన్న భావాలన్నీ ముఖంలో ప్రస్ఫుటంగా పలుకుతాయి. ముఖ్యంగా భయం. ఒక సందర్భంలో అతను ఆకాశంలో ఉన్న మందుపాతరలను తప్పించుకుంటూ నౌకని నడపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అవి నౌకకి తగులుతూ ఉంటాయి. టామీ ఏం చేయాలో తెలియక అరుస్తూ ఉంటాడు. అవి తగులుతూ పేలిపోతూ ఉంటాయి. ఆలెక్స్ “ఒక్కటైనా తగలకుండా నడుపుతావేమో అని చూస్తున్నా” అంటాడు అంత ప్రమాదంలోనూ వ్యంగ్యంగా. ఫ్రెడ్ అనే అతను సీరియల్లో ఇంజనీరు పాత్ర వేశాడు. అతను పరమశాంతంగా ఉంటాడు. మైకంలో ఉన్నవాడిలా. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా శాంతంగా ఉంటాడు. థెర్మియా అధికారిణి మీద మనసుపడతాడు. ఐదో వాడు గై. సీరియల్లో ప్రమాదంలో చిక్కుకుని మరణించే చిన్న పాత్ర వేశాడు. అతను వీరితో రావలసిన వాడు కాదు. కానీ అతను “నేనూ వస్తాను” అనటంతో అతన్నీ థెర్మియా అధికారిణి తీసుకొస్తుంది. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంటాడు. సీరియల్లో లాగే ప్రమాదం చిక్కుకుని ముందు తానే చనిపోతానని భయం. జేసన్ తప్ప మిగతావారు కూడా వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ శారిస్ మరో దాడి చేయటంతో వెళ్ళటం కుదరదు. ఎవరైనా బయటకి వెళితే ముందు వారే శారిస్‌కి బలైపోతారు. శారిస్ భయంకరంగా ఉంటాడు. అతన్ని మొదటిసారి ప్రత్యక్షంగా చూసినపుడు గై మూర్ఛపోతాడు. సీరియల్లో చూపించిన వింత వింత పరికరాలు అన్నీ తెర్మియా వాసులు తయారు చేసుకుంటారు. ఆ పరికరాలు కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. వాటిని చూసి ఒక్కోసారి గ్వెన్ తిట్టుకుంటూ ఉంటుంది. “ఈ ఎపిసోడ్ రాసిన రచయితని చంపెయ్యాలి” అంటుంది కసిగా.
ఈ చిత్రంలో కొన్ని విషయాలు భారతీయులకు ఆసక్తికరంగా ఉంటాయి. మన పురాణాల్లో కామరూపం అనే ప్రక్రియ ఉంటుంది. తన రూపాన్ని ఇచ్ఛానుసారం మార్చుకునే శక్తి ఇది. రామాయణంలో మారీచుడు కామరూపం ద్వారానే బంగారు లేడి రూపం ధరిస్తాడు. అయితే ఇందులో నిబంధన ఏమిటంటే కొన్ని సమయాల్లో కామరూపం ధరించి ఉండటం సాధ్యం కాదు. ఆహారం తినేటపుడు, సంభోగ సమయంలోను, మరణించినపుడు నిజరూపం బయటపడుతుంది. అందుకే మారీచుడు గడ్డి తింటున్నట్టు నటిస్తాడు కానీ తినడు. తింటే అతని నిజరూపం బయటపడుతుంది. ఈ విషయాన్ని లక్ష్మణుడు గమనిస్తాడు. అందుకే అది నిజమైన లేడి కాదని అంటాడు. ఈ చిత్రంలో శారిస్ మానవరూపంలో ఉన్న తెర్మియావాసులని చిత్రహింస చేస్తుంటే వారి నిజరూపాలు బయటపడతాయి. అలాగే తెర్మియా అధికారిణిని ఫ్రెడ్ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె నిజరూపం బయటపడుతుంది. మన పురాణాలతో ఈ సామ్యం ఆసక్తికరంగా అనిపించింది. ఒక సన్నివేశంలో జేసన్ బృందం వేరే గ్రహానికి వెళతారు. అక్కడి వారు పొట్టిగా ఉంటారు. ముఖాలు నల్లగా ఉన్నా కోమలంగా ఉంటాయి. “పిల్లల్లా ఉన్నారు” అనుకుంటారు జేసన్ బృందం. తర్వాత జేసన్ వారికి చిక్కుతాడు. వారు అతన్ని చూసి “పసివాడిలా ఉన్నాడు” అనుకుంటారు. జేసన్ ది ముదురు వయసు. ఆ గ్రహవాసుల పిల్లలు ముందు ముదురుగా ఉండి తర్వాత కోమలంగా తయారవుతారేమో. ఎవరి పరిస్థితులని బట్టి వారి దృష్టి ఉంటుంది. సృష్టి ఒకటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపిస్తుంది. మనకున్న అవగాహనే అందరికీ ఉండదు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దృష్టికోణం. అందుకే జగత్తు మిథ్య. యోగవాశిష్ఠంలో ఒక విషయం చెబుతారు. గడ్డి మనకి నిరుపయోగంగా కనిపిస్తుంది కానీ ఆవుకి అది రుచికరమైన ఆహారంగా కనిపిస్తుంది. అందరూ మనలాగే ఆలోచిస్తారనుకోవటం మూర్ఖత్వం.
ఒక సందర్భంలో శారిస్ దాడి వల్ల నౌక సామర్థ్యం క్షీణిస్తుంది. అందరూ నిరాశగా ఉంటారు. జేసనే నాయకత్వం వహించాడు కాబట్టి అతను మథనపడుతూ ఉంటాడు. ఆ సమయంలో మాతెజార్ వచ్చి “నన్ను క్షమించండి. అంతా నా తప్పే. మీరు ఇలాంటి పరిస్థితులని ఎన్నిటినో విజయవంతంగా ఎదుర్కోవటం నేను చూశాను. ఈ దాడిలో ఇలా జరగిందంటే నేనే ఏదో లోపం చేశాను” అంటాడు. జేసన్ మనసు కరిగిపోతుంది. వారికి సాయం చేయాలనే పట్టుదల పెరుగుతుంది. మాతెజార్ స్థానంలో వేరేవారు ఉంటే జేసన్‌ని తప్పుపట్టేవారేమో. ఇతరులను తప్పు పట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి. వారి గుణగణాలని గుర్తు చేసుకోవాలి. ఆవేశంలో తూలనాడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సుహృద్భావంతో ఎన్నో సమస్యలని పరిష్కరించుకోవచ్చు. మరో సందర్భంలో ఒక తెర్మియా అధికారి ఆలెక్స్‌తో “మీ సాహసాలు చూసి మిమ్మల్ని నా తండ్రితో సమానంగా భావించాను” అంటాడు. ఇక్కడ ఏకలవ్యుడు గుర్తు వస్తాడు. ఎవరి మీద అయినా గౌరవం ఉంటే దాన్ని ప్రకటించాలి. మనం గౌరవాన్ని ప్రకటించటానికి మొహమాటపడతాం. కోపం వస్తే మాత్రం వెళ్ళగక్కుతాం. ఈ ప్రవర్తన మార్చుకుంటే బంధాలు బావుంటాయి.
చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బావుంటాయి. అప్పట్లో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉండటం ఆశ్చర్యమే. ఈ చిత్రానికి డీన్ ప్యారిసాట్ దర్శకత్వం వహించాడు. జేసన్‌గా టిమ్ ఆలెన్ నటించాడు. ‘టాయ్ స్టోరీ’ యానిమేషన్ చిత్రాలలో బజ్ లైటియర్ అనే బొమ్మకి ఇతనే గాత్రదానం చేశాడు. ఆలెక్స్‌గా ఆలన్ రిక్మన్ నటించాడు. ఈయన ‘హారీ పాటర్’ చిత్రాలలో స్నేప్‌గా నటించి పేరు సంపాదించాడు. గ్వెన్ గా సిగర్నీ వీవర్ నటించింది. ఈమె ‘అవతార్’ చిత్రాలలో గ్రేస్ పాత్రలో నటించింది. అందరూ ఆరితేరిన నటులే. ముఖ్యంగా ఆలన్ రిక్మన్ వ్యంగ్యంగా మాట్లాడే మాటలు ఆకట్టుకుంటాయి. ‘స్టార్ ట్రెక్’ సీరియల్లో నటించిన నటులు కూడా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. సరదా నవ్వుకోవాలనుకునేవారికి ఈ చిత్రం విందుభోజనం లాంటిది.