Site icon Sanchika

మరుగునపడ్డ మాణిక్యాలు – 83: బ్లాక్ స్వాన్

[సంచిక పాఠకుల కోసం ‘బ్లాక్ స్వాన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]మా[/dropcap]నసిక రుగ్మతల గురించి మన సమాజంలో అవగాహన తక్కువే. ఆ అవగాహన కోసం కళాకారులు తమ వంతు కృషి చేస్తున్నారు. నవలలు, సినిమాలు వస్తున్నాయి. తెలుగులో ఈ తరహా సినిమాలు తక్కువే. ఈ విషయం మీద హాలీవుడ్‌లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బ్లాక్ స్వాన్’ (2010). ఇందులో సైకోసిస్ అనే మానసిక వ్యాధి బారిన పడిన ఒక బ్యాలే కళాకారిణి కథ చూపించారు. వాస్తవానికి, అవాస్తవానికి తేడా తెలుసుకోలేకపోవటం సైకోసిస్ లక్షణం. భ్రమలు కలుగుతూ ఉంటాయి. వాస్తవంగా లేనివి ఉన్నట్టు అనిపిస్తుంది. ‘లగే రహో మున్నాభాయ్’ (తెలుగులో ‘శంకర్ దాదా జిందాబాద్’) లో నాయకుడికి మహాత్మా గాంధీ కనపడతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలా కారణాలు ఉండొచ్చు. ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా సైకోసిస్ రావచ్చు. అయితే ‘బ్లాక్ స్వాన్’ చిత్రం ఒక థ్రిల్లర్ కాబట్టి సైకోసిస్ ప్రభావాన్ని మాత్రమే చూపించారు. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్‌లో లభ్యం. పెద్దలకు మాత్రమే.

నీనా ఒక బ్యాలే కళాకారిణి. ఆమె ఒక థియేటర్ కంపెనీలో పని చేస్తుంటుంది. బ్యాలే ఒక నృత్య కళ. బ్యాలే రూపకాలలో ముఖ్య పాత్రలతో పాటు అనేక మంది కళాకారులు నృత్యం చేస్తారు. నీనా ఆ బృందంలో ఒకతె. ‘స్వాన్ లేక్’ అనే రూపకం చాలా ప్రసిద్ధి పొందినది. పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ప్రదర్శింపబడుతూ ఉంది. కథలో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఈ చిత్రంలో చూపించిన కథ ప్రకారం ఒక రాకుమారి ఒక మాంత్రికుడి మంత్రప్రయోగం వల్ల పగలు హంస లాగ, రాత్రి నిజరూపంలో కనిపిస్తుంది. ఆమెతో పాటు ఆమె చెలికత్తెలు కూడా ఆ మాయ ప్రభావంలో ఉంటారు. అంతవరకు ఎవరినీ ప్రేమించనివారు ఎవరైనా ఆమెని హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆమె ఆ మాయ నుంచి బయటపడగలదు. ఆమెకి ఒక రాకుమారుడు పరిచయమవుతాడు. రాకుమారికి ఒక కవల సోదరి ఉంటుంది. ఆమె దుష్ట స్వభావం కలది. ఆమె రాకుమారుడిని ఆకర్షించటానికి ప్రయత్నిస్తుంది. మాంత్రికుడి సహాయంతో నల్ల హంస (బ్లాక్ స్వాన్) గా మారుతుంది. రాకుమారుడు ఆమె రాకుమారియే అనుకుని ఆమె ఆకర్షణలో పడతాడు. ఆమెనే పెళ్ళి చేసుకుందామనుకుంటాడు. తర్వాత నిజం తెలుసుకుని రాకుమారి దగ్గరకు వెళతాడు. కానీ వేరొకరిని ప్రేమించాడు కాబట్టి రాకుమారిని మాంత్రికుడి మాయ నుంచి బయటపడేసే అవకాశం లేకుండా పోతుంది. రాకుమారి నిరాశతో ఒక కొండ పైనుంచి దూకి మరణిస్తుంది. నీనాకి రాకుమారి పాత్ర పోషించాలని ఆశ. ఆమె తల్లి ఎరికా కూడా ఆమె పేరు సంపాదించాలని కోరుకుంటుంది. ఎరికా కూడా ఒకప్పటి కళాకారిణే. తాను పేరు సంపాదించలేకపోయానని ఆమెకి బాధ కూడా ఉంటుంది.

తోమా నృత్య రూపకాలకి దర్శకుడు. బెత్ అనే ప్రముఖ బ్యాలే కళాకారిణి వయసు మీరిపోవటంతో ఆమెని కంపెనీ నుంచి తొలగిస్తాడు. ఆమె కోపంగా వెళ్ళిపోతుంది. ‘స్వాన్ లేక్’ కొత్త ప్రదర్శన కోసం నటీనటులని ఎంపిక చేయటం మొదలుపెడతాడు తోమా. లిలీ అనే కొత్త కళాకారిణి కంపెనీలో చేరుతుంది. ఆమె ఒడ్డూపొడుగూ నీనా లాగే ఉంటుంది. నీనాకి ఆమెని మొదటిసారి చూసినప్పటి నుంచీ మనసులో అలజడి మొదలవుతుంది. నటీనటుల ఎంపికలో భాగంగా వారి నృత్యాన్ని పరిశీలిస్తాడు తోమా. నీనా తెల్ల హంస పాత్రకి సంబంధించిన నృత్యం అద్భుతంగా చేస్తుంది. అయితే రాకుమారికి కవల సోదరి ఉంటుంది కాబట్టి రెండు పాత్రలూ ఒకే నటి చేయాలని తోమా పట్టుదల. రెండు పాత్రలని కలిపి స్వాన్ క్వీన్ (హంస రాణి) అంటారు. నల్ల హంస పాత్రకి సంబంధించిన కోడా (నృత్య సన్నివేశంలో ముగింపు భాగం) చేసి చూపించమంటాడు. నీనా చేస్తూ ఉంటుంది. నల్ల హంస రాకుమారుడిని ఆకర్షించటానికి హొయలెన్నో ఒలకబోయాలి. ఆమె నృత్యంలో ఆ హొయలు ఇంకా ఎక్కువగా ఉండాలని తోమా అంటాడు. నీనా ప్రయత్నిస్తుండగా లిలీ తలుపు తీసుకుని లోపలికి వస్తుంది. నీనా తడబడి ఆగిపోతుంది. మళ్ళీ చేస్తాను అంటే తోమా “ఇక చాలు” అంటాడు. నీనా హతాశురాలవుతుంది. ఇంటికి తిరిగి వస్తుంటే ఒక చోట ఇరుకు సందులో ఆమెకి ఒక యువతి ఎదురుగా రావటం కనపడుతుంది. దగ్గరకి వచ్చేసరికి ఆ యువతి అచ్చు తన లాగే కనపడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆమె ముఖం వేరుగా ఉంటుంది. అది నీనా భ్రమ.

ఇంటికి వచ్చి నీనా నల్ల హంస కోడా ప్రాక్టీస్ చేస్తుంది. మునివేళ్ళపై గిర్రున తిరుగుతూ నృత్యం చేస్తూ ఉంటుంది. మధ్యలో ఆమె కాలి బొటన వేలి గోరు విరిగిపోతుంది. ఎరికా ఆమెకి కట్టు కడుతుంది. మర్నాడు నీనా తోమా దగ్గరకి వెళ్ళి ఇంట్లో నల్ల హంస కోడా పూర్తి చేశానని అబద్ధం చెబుతుంది. తనకి హంస రాణి పాత్ర కావాలని అడుగుతుంది. అతను “నీ వల్ల కాదు” అంటాడు. నీనా వెళ్ళిపోతుంటే హఠాత్తుగా ఆమెని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఆమె ఖంగు తింటుంది. అనుకోకుండా అతని పెదవి కొరుకుతుంది. అక్కడి నుంచి బయటపడుతుంది. తర్వాత హంస రాణి పాత్ర నీనాకే దక్కుతుంది. కొందరు దర్శకులు ఇలా నటులని దిగ్భ్రాంతికి లోను చేసి వారి ప్రతిక్రియని పరిశీలిస్తారు. ఇది సబబేనా? నన్నడిగితే సబబు కాదు. నటన అంటే నటన మాత్రమే. వారి నుంచి నటనని రాబట్టుకోవాలి కానీ వారి మీద ‘దాడి’ లాంటిది చేయకూడదు. ఉదాహరణకి చెంప దెబ్బ కొట్టే సీనులో నిజంగానే కొడితే వారి ప్రతిక్రియ సహజంగా ఉంటుందని కొడితే అది తప్పు. కానీ కొందరు నటులు ఇలాంటివి భరిస్తారు. తోమా ఏం చూసి నీనాకి పాత్ర ఇచ్చాడు? ఆమె మీద మోజు పడ్డాడా అంటే అదీ కాదు. ఆమెలోని పట్టుదలని చూసి ఇచ్చాడని అనుకోవాలి.

నీనా ఎరికాకి ఫోన్ చేసి హంస రాణి పాత్ర దక్కిందని చెబుతుంది. ఎరికా సంతోషిస్తుంది. నీనా ఇంటికెళ్ళి స్నానం చేశాక అద్దంలో చూసుకుంటే ఆమె వీపు మీద గాయాలు కనపడతాయి. ఆమె గీరుకోవటం వల్ల గాయాలయ్యాయి. ఎరికా నీనా కోసం కేకు చేశానంటుంది. నీనా వద్దంటే ఆమెకి కోపం వస్తుంది. కేకుని పడేస్తానంటుంది. నీనా ఆమెకి నచ్చచెప్పి కేకు కొంచెం తింటుంది. ఎరికా స్వభావం ఇక్కడ బయటపడుతుంది. ఆమె మాటే చెల్లాలి. నీనాకి ఇదో ఒత్తిడి. కళాకారులు సాధారణంగా కొవ్వు పదార్థాలు తినరు. లావు అయిపోతామని భయం. ఎరికాకి ఈ సంగతి తెలియదా? మరి ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది? ఆమెకి నీనా మీద అసూయ పుట్టిందనిపిస్తుంది. తర్వాత ఒక సందర్భంలో ఆమె “నీ కోసం నా కళాజీవితాన్ని వదులుకున్నాను” అంటుంది. ఆమె గర్భవతి అవటం వల్ల నృత్యం మానేసింది. నీనా తండ్రి ఎరికాని వదిలించుకున్నాడు.

నీనాకి అసలు ఒత్తిడి ఇప్పుడే మొదలవుతుంది. రిహార్సల్స్‌లో నల్ల హంస నృత్యాన్ని ఇంకా బాగా చేయాలని తోమా అంటూ ఉంటాడు. ఒకరోజు లిలీ బృంద నృత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీనా చూస్తూ ఉంటుంది. తోమా నీనా దగ్గరకి వచ్చి “ఆమెలో పరిపూర్ణత లేదు, కానీ ఎంత సులువుగా చేస్తుందో చూడు” అంటాడు. అతనికి అన్ని భంగిమలు ఖచ్చితంగా ఉండటం ముఖ్యం కాదు. కష్టపడినట్టు కాకుండా సులువుగా చేయాలని అతని ఉద్దేశం. కళాకారుల్లో కొందరికి పుట్టుకతోనే ప్రతిభ ఉంటుంది. దానికి సాన పెడితే చాలు. అందరూ అలా ఉండలేరు. నీనా లాంటి వాళ్ళు ఆ ప్రతిభని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక ఉన్మాదం కాకూడదు. మరోపక్క కంపెనీ నుంచి తొలగించబడిన బెత్ నీనా మీద కోపంగా ఉంటుంది. తోమాతో లైంగిక సంబంధం వల్ల నీనాకి హంస రాణి పాత్ర దక్కిందని నీనాని ఆడిపోసుకుంటుంది. తోమా బెత్ ని వారిస్తాడు. ఆమెని అతను ‘లిటిల్ ప్రిన్సెస్’ (చిన్నారి రాకుమారి) అని పిలుస్తాడు. అతనికి, ఆమెకి లైంగిక సంబంధం ఉందని పుకారు. ఆమె అసూయకి అదొక కారణం అనిపిస్తుంది.

తర్వాత తోమా నీనాని తన ఇంటికి తీసుకువెళతాడు. నీనాకి శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యం లేదని అతని అభిప్రాయం. ఇలాంటి వారిని ఆంగ్లంలో ఫ్రిజిడ్ అంటారు. శృంగారాన్ని ఆస్వాదించకపోతే నల్ల హంస పాత్ర చేయటం కష్టమని అంటాడు. అయితే అతను ఆమెని లొంగదీసుకోవాలని ప్రయత్నించడు. వ్యక్తిగత జీవితంలోని అనుభవాలే నటులకి ఉపయోగపడతాయని అతని నమ్మకం. స్వీయ అనుభవాల ఆధారంగా నటిస్తే దాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. కానీ పాత్ర కోసం అనుభవం పెంచుకోమనటం విపరీతం. అయితే తోమా ఒక దర్శకుడిగానే ఆలోచిస్తుంటాడు, ఒక పురుషుడిలా ఆమెని లొంగదీసుకోవాలని కాదు. మర్నాడు రెహార్సల్స్ జరుగుతుండగా ఒక వార్త తెలుస్తుంది. బెత్‌ని ఒక కారు ఢీకొట్టటం వల్ల ఆమె రెండు కాళ్ళు విరిగిపోయాయని. ఆమె కావాలనే కారుకి ఎదురువెళ్ళి ఉంటుందని తోమా నీనాతో అంటాడు. తన వల్లే బెత్ ఆత్మహత్యకి ప్రయత్నించిందని నీనా బాధపడుతుంది. ఇవన్నీ కలిసి నీనా మానసిక స్థితి మీద ప్రభావం చూపుతాయి. ఆమె వీపు మీద గాయాలు పెరుగుతూ ఉంటాయి. సైకోసిస్ బారిన పడినవారు తమను తాము గాయపరుచుకోవటం మామూలే. దీనికి కూడా భ్రమలే కారణం. నీనా విషయంలో ఆ భ్రమ ఏమిటో తర్వాత తెలుస్తుంది. రచయితలు కథని ఎంత పకడ్బందీగా రాసున్నారో తెలిసి అబ్బురం కలుగుతుంది. ఎరికా నీనా గాయాలను చూసి ఆందోళన పడుతుంది. నీనా గోళ్ళు కత్తిరిస్తుంది.

ఒకరోజు రిహార్సల్స్‌లో ఒత్తిడి తట్టుకోలేక నీనా ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటుంది. లిలీ అక్కడికి వచ్చి ఆమెని ఓదారుస్తుంది. తర్వాత లిలీ తోమా దగ్గరకి వెళ్ళి నీనాని ఒత్తిడి పెట్టొద్దని అంటుంది. తోమా నీనాతో “లిలీ దగ్గర ఏడ్చావట కదా. ఆమె నిన్ను ఒత్తిడి పెట్టొద్దని చెప్పింది” అంటాడు. నీనా “నేనామెని అలా చేయమని అడగలేదు” అంటుంది. తర్వాత లిలీ దగ్గరకెళ్ళి “నువ్వలా చేయకుండా ఉండాల్సింది” అంటుంది. లిలీ చిన్నబుచ్చుకుని “సరేలే” అంటుంది. నీనా పరిస్థితి చూసి ఎరికా “తోమా నిన్నేమైనా చేశాడా?” అని అడుగుతుంది. నీనాకి చిరాకు వస్తుంది. తల్లితో గొడవపడుతుంది. అప్పుడే లిలీ నీనా ఇంటికి వచ్చి క్షమాపణ చెబుతుంది. ఇద్దరూ డ్రింక్స్ తాగుదామని వెళతారు. ఎరికా నీనాని ఆపటానికి ప్రయత్నిస్తుంది కానీ నీనా వినదు. లిలీ ప్రోద్బలంతో నీనా డ్రగ్స్ కూడా తీసుకుంటుంది. బార్లో వారికి ఇద్దరు యువకులు పరిచయమవుతారు. నీనా టామ్ తో, లిలీ జెరీతో సరసాలాడతారు, డ్యాన్స్ చేస్తారు. తర్వాత నీనా, లిలీ డ్రగ్స్ మత్తులో కలిసి నీనా ఇంటికి వస్తారు. ఎరికా నీనాని చీవాట్లేస్తుంది. నీనా ‘నా ఇష్టం’ అన్నట్టు మాట్లాడుతుంది. లిలీని తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపు బయట నుంచి తెరుచుకోకుండా ఒక దుడ్డుకర్ర అడ్డుపెడుతుంది. లిలీతో శృంగారంలో పాల్గొంటుంది. నీనా పొద్దున్న లేచేసరికి లిలీ ఉండదు. రిహార్సల్స్‌కి ఆలస్యం అవటంతో నీనా హడావిడిగా వెళుతుంది. అక్కడ లిలీ ఆమె స్థానంలో నృత్యం చేస్తూ ఉంటుంది. తర్వాత నీనా లిలీతో “నువ్వు కావాలనే నాకు మత్తుమందు ఇచ్చి పొద్దున్నే వెళ్ళిపోయావు” అంటుంది. లిలీ “నేను రాత్రి జెరీతో అతని ఇంటికి వెళ్ళాను” అంటుంది. నీనా “మరి మనమిద్దరం..” అని ఆగిపోతుంది. లిలీ “ఓరి దేవుడో. నువ్వు నాతో శృంగారం చేసినట్టు కలగన్నావా?” అంటుంది. నీనా హడావిడిగా అక్కడి నుంచి వచ్చేస్తుంది.

నీనా లిలీతో శృంగారం నెరిపినట్టు ఊహించుకుంది. ఎందుకు? నిజానికి నీనాకి లిలీ మొదటి చూపులోనే నచ్చింది. అదే ఆమెలోని అలజడికి కారణం. పైగా ఆమె తన మీద సానుభూతి చూపించింది. ఆమె ఒక్కతే తనను అర్థం చేసుకుందని అనుకుంది. స్వజాతి ఆకర్షణ కలవారు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆ ఆకర్షణని దాచుకోవటం మామూలే. ఇది కూడా నీనా మానసిక ఆందోళనకి కారణమయింది. శృంగార అనుభవం ఉండాలని తోమా అనటంతో ఆమె ఊహల్లోనే శృంగారం నెరిపింది. డ్రగ్స్ ప్రభావం కూడా ఉంటుంది. ఆ ఊహలు ఆమెకి నిజమని అనిపిస్తాయి. వాస్తవానికి, అవాస్తవానికి తేడా తెలియకపోవటం సైకోసిస్ లక్షణం. లిలీ తన పాత్ర కాజేయటం కోసం తనని మోసం చేసిందని అనుకుంటుంది. భ్రమలు కలుగుతున్నప్పుడు ఎవరికైనా చెబితే కాస్త ఉపశమనంగా ఉంటుంది. నీనా తల్లితో తన బాధ చెప్పుకుంటే బావుండేది. కానీ ఆమెకి తల్లి మీద కోపం. ఆ కోపానికి కారణం లేకపోలేదు. ‘నీ వల్లే నా జీవితం ఇలా అయింది’ అని తల్లి అంటే బిడ్డ తట్టుకోగలదా? ఇక్కడ విషాదం అదే. కానీ అందరికీ ఇలాంటి పరిస్థితులు ఉండవు. మానసిక వ్యాధి లక్షణాలు ఉన్నవారు తమ దగ్గరవారితో మాట్లాడాలి. వైద్య సహాయం తీసుకోవాలి. ఆరోగ్యం (అది శారీరకమైనా, మానసికమైనా) కన్నా ఏదీ ముఖ్యం కాదు. చదువు, ఉద్యోగంలో వెనకబడినా ప్రమాదం లేదు. ‘అందరూ నన్ను పిచ్చివాడని అనుకుంటారు’ లాంటి ఆలోచనలు దరిచేరనీయకూడదు. కుటుంబసభ్యులు కూడా వారిలో మార్పు వస్తే జాగ్రత్త వహించాలి. చూసీ చూడనట్టు వదిలేస్తే ప్రమాదమే. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి వృత్తిపరమైన లక్ష్యాల కోసం తపనపడితే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు.

ఆంద్రెస్ హైన్జ్ కథ రాయగా మార్క్ హేమన్, ఆంద్రెస్ హైన్జ్, జాన్ మెక్ లాలిన్ స్క్రీన్ ప్లే అందించారు. డ్యారెన్ ఆరనాఫ్స్కీ దర్శకత్వం వహించాడు. న్యాటలీ పోర్ట్ మన్ నీనా పాత్ర పోషించింది. ఆమె నటన అత్యద్భుతంగా ఉంటుంది. ఆమెకి ఉత్తమ నటి ఆస్కార్ దక్కటం ఖాయమని ఆ ఏడాది సీనీ పండితులందరూ అనుకున్నట్టే జరిగింది. ఆమె, లిలీ పాత్ర ధరించిన మీలా కూనిస్ బ్యాలే నేర్చుకుని తమ పాత్రల్లో నటించారు. ఎరికాగా బార్బరా హెర్షీ, తోమాగా విన్సెంట్ క్యాసెల్ నటించారు. ఇద్దరూ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఈ చిత్రం అభిమానులు కొందరు ఎరికా కూడా నీనా భ్రమల్లోనే ఉందని, నిజానికి ఆమె ముందే మరణించిందని అంటారు. కానీ ఇది కథలో పూర్తిగా అతకదు. దర్శకుడు అలాంటి సూచనలు కొన్ని చేసినా స్పష్టంగా చెప్పడు. మీరే చిత్రం చూసి నిర్ణయించుకోండి అన్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రానికి ఇంకా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. నేలపై, ట్రాలీపై క్యామెరా పెట్టి కాకుండా చేత్తో క్యామెరా పట్టుకుని సినిమాలు తీయటం 90వ దశకంలోనే ప్రారంభమయింది. అయితే యాక్షన్ చిత్రాలలో ఇలాంటి దృశ్యాలు ఒక్కోసారి కళ్ళు తిరిగిన అనుభూతి కలిగిస్తాయి. ఈ చిత్రంలో ఈ ప్రక్రియని నాయిక మానసిక స్థితిని చూపించటానికి చక్కగా వాడుకున్నారు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

లిలీ తన పాత్రని కాజేయాలనుకుంటోందని నీనా గట్టిగా నమ్ముతుంది. రేపు మొదటి ప్రదర్శన అనగా తోమా నీనాకి ప్రత్యామ్నాయ కళాకారిణిగా లిలీని ఎంచుకుంటాడు. నృత్య ప్రదర్శనలలో, నాటక ప్రదర్శనలలో ఇది మామూలే. ఒకవేళ ఒక కళాకారిణి ఏ కారణంగానైనా నృత్యం చేయలేక పోతే ఆమె స్థానంలో వేరే వారు నృత్యం చేసే లాగా ఈ ఏర్పాటు. ఆ విషయం తెలిసి నీనా తోమా దగ్గరకి వెళ్ళి “లిలీ మాత్రం వద్దు” అని ఏడుస్తుంది. తోమా ఆమెని సముదాయిస్తాడు. “రేపు నువ్వు బాగా చేస్తే నిన్నెవరూ ఆపలేరు” అంటాడు. ఆమెని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. తోమా బెత్ ని పిలిచినట్టే తనని కూడా ‘లిటిల్ ప్రిన్సెస్’ అని పిలుస్తాడని నీనా ఆశపడుతుంది. అతను అలా పిలవడు. నీనా ఒక రకంగా తోమాని తండ్రిగా భావించింది. తండ్రి లేని పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, తండ్రి ప్రేమ కోసం చూస్తారు. అది దక్కక నీనా ఇంకా కుంగిపోతుంది. హాస్పిటల్లో ఉన్న బెత్‌ని చూడటానికి వెళుతుంది. “మీ బాధ నాకిప్పుడు అర్థమయింది. ఆమె నా స్థానం ఆక్రమించాలని చూస్తోంది. మీలాగా పరిపూర్ణమైన నర్తకి కావాలని నా ఆశ” అంటుంది బెత్‌తో. బెత్ నిర్వేదంగా “నేను పరిపూర్ణమా? నేను ఎందుకూ కొరగాని దాన్ని” అని అక్కడున్న చాకుతో ముఖంలో పదే పదే పొడుచుకుంటుంది. ఇది కూడా నీనా భ్రమే. ఆమెకి బెత్ ముఖంలో తన ముఖం కనపడుతుంది. తాను పరిపూర్ణం కాదు కాబట్టి తోమా లిలీ వైపు మొగ్గుచూపుతున్నాడని ఆమె భావన.

నీనా భయంగా హాస్పిటల్ నుంచి పారిపోయి ఇంటికి వస్తుంది. ఆమె భయాన్ని చూసి ఎరికా ఆందోళన పడుతుంది. నీనా ఆమెని తప్పించుకుని తన గదిలోకి వెళుతుంది. వీపు మీద నొప్పి కలగటంతో ఆమె అద్దంలో వీపు చూసుకుంటుంది. ఆమె వీపు నుంచి నల్లని చిన్న ఈకలు మొలుస్తున్నట్టు కనపడుతుంది. ఆమె కళ్ళు కూడా ఎర్రగా మారతాయి. అంటే ఆమె నల్ల హంసగా మారుతున్నట్టు ఊహించుకుంటోంది! హంసల కనుగుడ్లు ఎర్రగా ఉంటాయి. నల్ల హంస పాత్ర కోసం శ్రమించి శ్రమించి ఆమె నల్ల హంసలా తనకు రెక్కలు వస్తున్నట్టు భ్రమపడుతుంది. ఎరికా నీనా గది తలుపు తోసుకుని వస్తుంది. “నీ మనఃస్థితి బాగాలేదు” అంటుంది. నీనా ఆమెని బయటకి తోసేసి తలుపు వేసేస్తుంది. ఆమెకి హఠాత్తుగా తన కాళ్ళు హంస కాళ్ళలా వంగినట్టు అనిపిస్తుంది. తూలి పడి తల మంచం అంచుకి తగలటంతో స్పృహ తప్పి పడిపోతుంది. మర్నాడు లేచేసరికి తల్లి పక్కన ఉంటుంది. “నీకు ఒంట్లో బాగాలేదని థియేటర్‌కి ఫోన్ చేసి చెప్పాను” అంటుంది. నీనా ఆమెని దూషించి థియేటర్‌కి బయలుదేరుతుంది. ఆమెని చూసి లిలీ తోమాతో “ఒంట్లో బాగాలేదని అన్నారుగా? ఎందుకు వచ్చింది?” అంటుంది. ఆమె స్వార్థం ఆమెది. నీనా లేకపోతే ఆమే హంస రాణి. నీనా తోమాతో “బెత్ మీవల్లే ఆత్మహత్య ప్రయత్నం చేసిందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నా బదులు లిలీ నృత్యం చేస్తే మీకే పరువు నష్టం” అంటుంది. అంటే తాను అతన్ని యాగీ చేస్తానని బెదిరించటం. అది చూసి తోమాకి కోపం రాదు. ఆమెలో కసి ఉందని సంతోషపడతాడు. నీనా తయారవుతుంది. ఆమెకి తన కాలి వేళ్ళు అతుక్కుపోతున్నట్టు అనిపిస్తుంది. హంసల కాలి వేళ్ళు అతుక్కుని ఉన్నట్టే. మొత్తానికి నీనా వేదిక మీద తెల్ల హంస నృత్యం చేస్తుంది. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆ నృత్యంలో రాకుమారుడు ఆమెని పైకి ఎత్తే భాగంలో ఆమెకి చుట్టూ ఉన్న నాట్యకత్తెల్లో ఒకామె తనలా కనపడతుంది. ఆమె కాస్త తడబడటంతో కిందపడుతుంది. వేదిక దిగిన తర్వాత నీనా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తోమా కూడా కోపంగా ఉంటాడు. ఇక నల్ల హంస నృత్యం చేయవలసిన సమయం వస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

నీనా తన మేకప్ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ లిలీ ఉంటుంది. “నీ వల్ల కాదు. కనీసం నల్ల హంస నృత్యమైనా నన్ను చేయనీ” అంటుంది. నీనా ఆమె మీద దాడి చేస్తుంది. నీనాకి ఆమె కూడా తనలా కనపడుతుంది. పెనుగులాటలో అద్దం పగులుతుంది. నీనా ఒక అద్దం ముక్కతో ఆమెని కడుపులో పొడుస్తుంది. లిలీ మరణిస్తుంది. నీనా భయభ్రాంతురాలవుతుంది. లిలీ శవాన్ని అక్కడే ఉన్న చిన్న బాత్రూమ్ లోకి ఈడ్చివేసి తలుపు వేసేస్తుంది. ఆమెలో ఒక రకమైన ఉన్మాదం బయల్దేరుతుంది. నల్ల హంసలో ఉండే దుష్ట స్వభావం తనకి కూడా అబ్బినట్టు అనిపిస్తుంది. అదే ఉన్మాదంలో వేదిక మీదకి వెళ్ళి అద్భుతంగా నృత్యం చేస్తుంది. తాను పూర్తిగా నల్ల హంసలా మారిపోయినట్టు ఊహించుకుంటుంది. ఇక్కడ న్యాటలీ నటన, నల్ల హంసలా ఆమె మారిపోయే విజువల్ ఎఫెక్ట్స్ విస్తుగొలిపేలా ఉంటాయి. ప్రేక్షకులు జయజయధ్వానాలు చేస్తారు. నీనా వేదిక దిగి తోమాని పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంది.

చివర్లో తెల్ల హంస నృత్యం కోసం దుస్తులు మార్చుకోవటానికి నీనా మేకప్ గదిలోకి వెళుతుంది. అక్కడ బాత్రూమ్ నుంచి రక్తం బయటకు కారుతూ ఉంటుంది. నీనా బాత్రూమ్ తలుపు కింద ఒక టవల్ అడ్డు పెడుతుంది. దుస్తులు మార్చుకుంటుంది. ఇంతలో ఎవరో తలుపు కొడతారు. తలుపు తీస్తే లిలీ! “నువ్వు అద్భుతంగా చేశావు. మన మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట నిజమే. కానీ నీ నృత్యం చూసి నాకు మతిపోయింది. గుడ్ లక్!” అని వెళ్ళిపోతుంది. నీనా నోట మాట రాక ఉండిపోతుంది. బాత్రూమ్ తెరిచి చూస్తే అక్కడ శవం ఉండదు. తన కడుపు మీద తడిగా అనిపిస్తుంది. అక్కడ చూస్తే రక్తం. ఆమె చిత్తభ్రాంతితో అద్దంలో చూసుకుని తనని తానే పొడుచుకుంది. నీనా అలాగే వేదిక మీదకి వెళ్ళి నృత్యం చేస్తుంది. ఆమెకి ప్రేక్షకులలో తన తల్లి కనపడుతుంది. ఆమె ఆనందభాష్పాలు కారుస్తూ ఉంటుంది. ఆఖరున నీనాకొండ మీద నుంచి దూకుతుంది. తోమా, లిలీ, తోటి నాట్యకత్తెలు ఆమె కింద పడి ఉండగానే ఆమెని అభినందించటానికి వస్తారు. తోమా “అందరూ నిన్ను పొగిడేవాళ్ళే” అంటాడు. ఇంతలో ఆమె కడుపు మీద ఉన్న గాయం కనపడుతుంది. ఆమె కోసం ఆంబులెన్స్ ని రమ్మని చెప్పమంటాడు తోమా. ఇంతలో నీనా “నాకు అనుభూతి కలిగింది. పరిపూర్ణతని అనుభవించాను” అంటుంది. ఆ అనుభూతిలోనే ప్రాణాలు విడుస్తుంది. ఆమె పొందినది ఆత్మానంద అనుభూతి. కానీ ఆ అనుభూతి కోసం శరీరాన్ని, మనసుని విపరీతంగా కష్టపెట్టటం చాలా తప్పు. ఎరికా నీనాని కాపాడదామని ప్రయత్నించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అలా పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవటం కుటుంబసభ్యుల బాధ్యత.

Exit mobile version