[dropcap]భౌ[/dropcap]తికవాదం ఎలా పెరిగిపోతోందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరితో ఒకరు పోటీపడి వస్తువులను కూడబెట్టుకోవటం, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాలు, ఆర్భాటపు వివాహాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సంపాదనే ముఖ్యం అని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు తలిదండ్రులు. ఇదంతా కాదని పిల్లలని ప్రకృతి ఒడిలో పెంచాలని అనుకున్న ఒక తండ్రి కథ ‘కెప్టెన్ ఫెంటాస్టిక్’ (2016). అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని మనవాళ్ళు ఊరికే అనలేదు. పిల్లలని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న వస్తుంది. అలా చేయటం వారిని నిర్బంధించటం కాదా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచింపజేస్తుంది ఈ చిత్రం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.
ఒక తండ్రి, ఆరుగురు పిల్లలు. పెద్దవాడు 18 ఏళ్ళ వాడు. అందరి కంటే చిన్నది అరేడేళ్ళ పాప. తండ్రి పేరు బెన్. అడవిలో ఉంటారు. ఒక చిన్న ఇల్లు కట్టుకుని, అతి సాధారణంగా బతుకుతుంటారు. విద్యుత్తు వాడరు. రాళ్ళతో నిప్పు పుట్టిస్తారు. కాళ్ళతో నడిపించే కుట్టు మెషిన్ లాంటి పాతకాలం వస్తువులు ఉంటాయి. అడవిలో జంతువులని బాణాలతో, కత్తులతో వేటాడి తింటారు. కసరత్తులు చేస్తారు. కొండలెక్కుతారు. రాత్రి వేళ పడుకోబోయే ముందు లాంతరు దీపాల వెలుగులో పుస్తకాలు చదువుతారు. ఉత్తమ సాహిత్యంతో పాటు సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలు ఇవి. వాళ్ళ నినాదం – ‘Power to the people. Stick it to the man.’ అంటే ‘ప్రజలదే రాజ్యం, దోచుకునే రాజు మీద పోరాడదాం.’ వినోదం కావాలంటే సంగీతవాయిద్యాలు వాయించి నృత్యం చేస్తారు.
తల్లి ఎక్కడుంది? ఆమెకి ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఆమెని ఆమె తలిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్చంతా తామే పెట్టుకుంటామని, అయితే ఆమెని తమ ఊళ్ళో ఉన్న ఆసుపత్రిలో చేర్పిస్తామని షరతు పెడతారు. ఆ ఊరు దూరమైనా ఖర్చు తాను పెట్టుకోలేక బెన్ ఒప్పుకుంటాడు. పిల్లలకు తల్లి త్వరలోనే తిరిగి వస్తుంది అని చెబుతాడు. పెద్దబ్బాయితో కలిసి అప్పుడప్పుడూ దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి తాము తయారు చేసిన వస్తువులు అమ్ముతాడు. ప్రయాణం కోసం వారికి ఒక సొంత బస్సు ఉంటుంది. ఊరిలో ఒక పోస్ట్ బాక్స్ బెన్ పేరు మీద ఉంటుంది ఉత్తరప్రత్యుత్తరాల కోసం. ఒకసారి ఊరిలోకి వెళ్ళినపుడు పెద్దబ్బాయి బాక్సులోని ఉత్తరాలు తీస్తాడు. అందులో అతను అప్లికేషన్లు పంపిన పెద్ద యూనివర్సిటీలన్నీ అతన్ని చేర్చుకోవటానికి సిద్ధమని పంపిన ఉత్తరాలు ఉంటాయి. తండ్రికి తెలియకుండా వాటిని దాచుకుంటాడు.
ఇంతకీ తల్లికి ఉన్న వ్యాధి ఏమిటి? బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి. కొన్నాళ్ళు అమితమైన ఆనందం, కొన్నాళ్ళు దారుణమైన కుంగుబాటు కలగటం ఈ వ్యాధి లక్షణం. ఆ వ్యాధి ఆమెకి ఎలా వచ్చిందని బెన్ ఆలోచించడు. తన విధానాలు సరైనవే అని అతనికి ప్రగాఢ విశ్వాసం. ఇంతలో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఫోనులో మామగారితో మాట్లాడతాడు బెన్. “ఆమె బౌద్ధమతం తీసుకుంది కాబట్టి దహనం చేయాలి, ఖననం చేయటం ఆమెకి ఇష్టం లేదు” అంటాడు బెన్. “నీ వల్లే నా ఒక్కగానొక్క బిడ్డ చనిపోయింది. నువ్వు అంత్యక్రియలకి రావటానికి వీలు లేదు. వస్తే అరెస్టు చేయిస్తాను” అని అంటాడు మామగారు.
పిల్లలకు తల్లి చనిపోయిన సంగతి అదేదో మామూలు విషయమైనట్టు చెబుతాడు బెన్. “చివరికి తాననుకున్న పని చేసింది” అంటాడు. అంటే ఆమెకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు అతనికి తెలుసు. అదొక వ్యాధి అనుకున్నాడే కానీ దానికి కారణమేమిటని ఆలోచించలేదు. తల్లి మరణవార్త విని పిల్లలు రోదిస్తారు. నాలుగో బిడ్డ అయిన అబ్బాయి ఆక్రోశంతో తండ్రి మీద అరుస్తాడు. ఈ అబ్బాయిలో చిన్నపాటి తిరుగుబాటు కనిపిస్తుంది. పిల్లలు తల్లిని చూడాలంటారు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత పిల్లల విషణ్ణవదనాలు చూడలేక సరే అంటాడు బెన్. అందరూ తమ బస్సులో బయలుదేరుతారు.
బయటి వ్యక్తులని చూసిన పిల్లలు ఆశ్చర్యపోతారు. అందరూ స్థూలకాయులే ఉంటారు. వీళ్ళేమో కసరత్తులు చేసిన వజ్రకాయులు. “అందరికీ ఏదైనా జబ్బు చేసిందా” అని అడుగుతుంది ఐదో బిడ్డ అయిన అమ్మాయి. జబ్బు చేస్తేనే అలా స్థూలకాయం వస్తుందని ఆ పాప అభిప్రాయం. అన్ని పనులకి యంత్రాల మీద ఆధారపడి అదే సుఖం అనుకునేవారు స్థూలకాయంతోనే ఉంటారు మరి. పాతకాలంలో ఎవరి పనులు వారు చేసుకునేవారు. మగవాళ్ళు కట్టెలు కొట్టటం, నీళ్ళు మోయటం వంటి పనులు చేసేవారు. ఆడవాళ్ళు బట్టలుతకటం, కారం దంచటం, పిండి విసరటం వంటి పనులు చేసేవారు. ఇప్పుడు అన్నిటికీ యంత్రాలే. యంత్రాల మీద ఆధారపడటం తగ్గిస్తే ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉండదు.
బస్సులో మూడో బిడ్డ అయిన అమ్మాయి ‘లోలిటా’ అనే నవల చదువుతూ ఉంటుంది. ఇందులో ఒక నడివయసు మగవాడు ఒక పన్నెండేళ్ళ అమ్మాయిని ప్రేమిస్తాడు. లైంగిక సంబంధం కూడా పెట్టుకుంటాడు. ఆ పుస్తకం గురించి ఆమె అభిప్రాయం చెప్పమంటాడు బస్సు నడుపుతున్న బెన్. ‘ఇంటెరెస్టింగ్’ (ఆసక్తికరం) అంటుంది ఆ అమ్మాయి. వారి కుటుంబంలో ఆ పదం వాడితే ఒప్పుకోరు. మాట దాటవేయటం కోసం ఆ పదం వాడతారని బెన్ అందరికీ నేర్పిస్తాడు. ఈ అమ్మాయి ఇబ్బందికరమైన విషయం మాట్లాడటం ఇష్టం లేక ఆ పదం వాడుతుంది. బెన్ రెట్టిస్తాడు. “అతను చిన్నపిల్ల మీద లైంగిక దాడి చేశాడనేది నిజం. అయితే అతని ప్రేమ కూడా స్వచ్ఛమైనదే. కానీ రేప్ చేసినందుకు అతన్ని ద్వేషిస్తున్నాను” అంటుంది ఆ అమ్మాయి. ఆ మాటలు విన్న చివరి అమ్మాయి ‘రేప్’ అంటే ఏమిటి అని అడుగుతుంది. దాచకుండా చెబుతాడు బెన్. ఆ పిల్లకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏదీ దాచకుండా చెప్పటం బెన్ పద్ధతి. కానీ ఆరేడేళ్ళ పిల్లకి చెప్పవచ్చా అని ఆలోచించాలి కదా? లేకపోతే మానసికంగా గాయం ఏర్పడవచ్చు.
దారిలో ఆకలేస్తే ఒక మైదానంలో ఉన్న గొర్రెల్లో ఒకదాన్ని చంపుదామని వెళుతుంది ఒక అమ్మాయి. అయితే చంపకుండా వెనక్కి వస్తుంది. “అవి పారిపోకుండా నిల్చుని ఉన్నాయి” అంటుంది. అంటే పారిపోయే జంతువుల్నే చంపటం ఆమెకి అలవాటు. అదో క్రీడ. కదలకుండా ఉన్న జంతువుల్ని చంపటంలో మజా ఉండదు. నాగరికత పేరుతో మనం జంతువుల్ని బంధించి చంపేస్తున్నాం. మనుషులకి మచ్చిక అయిన జంతువులు మనుషుల్ని చూసి పారిపోవు. అవి అమాయకంగా చూస్తూ ఉంటే చంపటానికి ఆమెకి మనసొప్పలేదు. ఏదో ఒకటి తినాలి కాబట్టి ఒక ఫాస్ట్ ఫూడ్ రెస్టారెంట్‌కి వెళతారు. మెనూ చూసి మిల్క్ షేక్ అంటే ఏమిటి అని అడుగుతుంది ఒక చిన్నారి. ఇంకో చిన్నారి కోలా (కూల్ డ్రింక్) అంటే ఏమిటని అడుగుతుంది. విషపు నీరు అంటాడు బెన్. బర్గర్, ఫ్రైస్ తింటానని ఒక అమ్మాయి అంటుంది. ఆ చెత్త తిండి వారికి పెట్టటం ఇష్టం లేక వారిని తీసుకుని బయటకి వచ్చేస్తాడు బెన్. ప్రతి సంవత్సరం జరుపుకునే ‘నోమ్ చోమ్స్కీ డే’ కాస్త తొందరగా జరుపుకుందామని అంటాడు. నోమ్ చోమ్స్కీ అమెరికా మేధావి వర్గంలో ముఖ్యమైనవారు. ఆయనకి కృతజ్ఞతగా ఏడాదిలో ఒకరోజు ఆయన్ని గుర్తుచేస్తుకుంటారు. ఆ రోజు మాత్రం కేకు తింటారు. కేకుని ఒక సూపర్ మార్కెట్ నుంచి దొంగిలిస్తారు. దీన్నికి ‘ఆపరేషన్ ఫ్రీ ద ఫూడ్’ (తిండికి విడుదల) అని పేరు పెడతారు. ప్రతి సంవత్సరం దొంగిలిస్తారా? అయి ఉండవచ్చు. ఇలాంటి దొంగతనాలకి వారికి తర్ఫీదు ఇచ్చాడు బెన్. ఇది తప్పు కాదా అంటే పెద్ద కంపెనీలు ప్రజల్ని దోచుకోవట్లేదా అంటాడేమో! తిరుగుబాటు చేసే అబ్బాయి “అందరిలాగా క్రిస్మస్ జరుపుకోవచ్చు కదా” అంటాడు. అవన్నీ కట్టు కథలు అంటాడు బెన్. వ్యవస్థీకృత మతాలు (Organised religion) అంటే అతనికి ఏవగింపు.
దారిలో బెన్ చెల్లెలు ఇంటి దగ్గర ఆగుతారు. ఆమెకి భర్త, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. బెన్ భార్య ఎలా చనిపోయిందని అడుగుతాడు ఒక అబ్బాయి. అతని తండ్రి ఆమె జబ్బుపడిందని, జబ్బు ముదరటంతో చనిపోయిందని అంటాడు. బెన్ మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని నిజం చెబుతాడు. అతని చెల్లెలికి కోపం వస్తుంది. తన పిల్లలని తన ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటే ఇతరలు పిల్లలని వారు కూడా అలాగే పెంచుకుంటారు కదా. చెల్లెలికి క్షమాపణ చెబుతాడు బెన్. ప్రపంచమంటే ఏమిటో తెలియకుండా నీ పిల్లల్ని పెంచుతున్నావు అంటుంది ఆమె. నా పిల్లలకి నీ పిల్లలకన్నా ఎక్కువ జ్ఞానమే ఉంది అంటాడు. కానీ అది పుస్తక జ్ఞానమే కదా! అది తర్వాత తెలుస్తుంది. పెద్దబ్బాయికి ఒక అమ్మాయి పరిచయమౌతుంది. వయసు ప్రభావంతో ఆకర్షితుడౌతాడు. ఇతను అమాయకంగా ఉండటంతో ఆ అమ్మాయి ముద్దు పెడుతుంది. దాంతో ఇతనిలో అలజడి మొదలవుతుంది. ఇంతలో ఆ అమ్మాయి అమ్మ వస్తుంది. ఏం జరుగుతోందని అడుగుతుంది. “మీ అమ్మాయి నా అంతరాంతరాళాలలోకి చొచ్చుకుపోయింది. నేను కూడా ఆమెలోకి చొచ్చుకుపోయాను. అపార్థం చేసుకోకండి. ఈమెతో నా జీవితం పంచుకుంటాను. పెళ్ళి చేసుకుంటాను” అంటాడు. తల్లీకూతుళ్ళు నవ్వేసి వెళ్ళిపోతారు. అతను చిన్నబుచ్చుకుంటాడు. తనలోని అలజడి ప్రేమ అని అతను అనుకున్నాడు. పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటే ఇలాగే ఉంటుంది.
బెన్ తన భార్య అంతిమ కోరిక తీర్చాడా? అతన్ని చూసి అతని మామగారు ఏం చేశాడు? ప్రపంచం పుస్తకాల్లో ఉన్నట్టు లేదని తెలిసిన పెద్దబ్బాయి ఏం చేస్తాడు? యూనివర్సిటీకి వెళతాడా? తిరుగుబాటు చేసే చిన్నబ్బాయి ఏం చేస్తాడు? ఇదే మిగతా కథ. కొంతమంది బెన్‌ని సమర్థించవచ్చు. కానీ అతి ఎప్పుడూ పనికిరాదు. పిల్లలపై చెడు ప్రభావాలు పడకుండా పెంచటం కష్టమైందనే మాట నిజం. కానీ వారు బ్రతకాల్సింది ఈ ప్రపంచంలోనే కదా. ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఉదాహరణకి సినిమాలు చూడకుండా పిల్లలని పెంచితే వేరే పిల్లలు వారిని వెక్కిరించే పరిస్థితి. తోటివారితో సమానంగా ఉండాలనే ఒత్తిడి (peer pressure) ఎక్కువగా ఉంటోంది. మనం చేయగలిగేదల్లా సమతూకం పాటించటమే. పిల్లలు తమ అభిప్ర్రాయాలని, అభద్రతలని తలిదండ్రులకు చెప్పుకునే వాతావరణ కల్పించటమే. టీవీలు, ఫోన్లు కాకుండా పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి. పౌష్టికాహారం అలవాటు చేయాలి. చెత్త తిండి తగ్గించాలి. ఆ తిండి రుచిగా ఉన్నా ప్రమాదకరమని వారికి అర్థమయ్యలా చెప్పాలి. భౌతికవాదాన్ని పక్కన పెట్టాలి. సంపాదన, వస్తువులు సమకూర్చుకోవటం కన్నా తృప్తిగా ఉండటం మంచిదని నేర్పించాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉండకూడదు. అందరూ ఏకీభవించకపోవచ్చు కానీ కాస్త ఆధ్యాత్మికత కూడా అవసరం. మన ప్రయత్నం మనం ధర్మంగా చేయటమే ముఖ్యం.
ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు మ్యాట్ రాస్. తమ పిల్లల పెంపకంలో ఎదురైన సవాళ్ళని దృష్టిలో ఉంచుకుని అతను ఈ కథ అల్లాడు. క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక విభాగంలో అతనికి ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డు వచ్చింది. బెన్‌గా విగో మార్టెన్సన్ నటించాడు. ఒక నియంత లాగా కరుకుగా ఉన్నా ప్రేమ, మంచితనం, సౌమ్యత కూడా ఉంటాయి. పిల్లల కోసం తనని తాను నిగ్రహించుకునే సందర్భం, ఒక దశలో ఒంటరితనంతో భావోద్వేగానికి గురయ్యే సందర్భంలో అతని నటన అద్భుతంగా ఉంటుంది. అతనికి ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. పిల్లలందరూ చక్కగా నటించారు. పదేళ్ళ లోపు ఇద్దరు చిన్నారుల నుంచి రాబట్టిన నటన ఆకట్టుకుంటుంది.
ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. కథ ఇంకొంచెం కూడా తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
బెన్ భార్య అంత్యక్రియలు చేసే ముందు క్రిస్టియన్ పద్ధతి ప్రకారం చర్చిలో సంస్మరణ సభ ఏర్పాటు చేస్తారు. సభ మొదలయ్యాక బెన్, పిల్లలు చర్చిలోకి వస్తారు. ఆమె వీలునామాలో “నన్ను దహనం చేయండి. అందరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ నన్ను సాగనంపండి. నా అస్థికలని ఒక టాయిలెట్‌లో ఫ్లష్ చేసేయండి” అని ఉంటుంది. అది చదివి వినిపిస్తాడు బెన్. బెన్ మామగారు అతన్ని చర్చిలో నుంచి గెంటేయిస్తాడు. పిల్లలని ప్రేమగానే పలకరిస్తాడు. పిల్లల అమ్మమ్మ వారితో కాసేపు గడపాలని అనుకుంటుంది కానీ అంత్యక్రియలకి సమయం దాటిపోతుండటంతో భర్తతో కలిసి వెళుతుంది. వారు, వారి బంధువులు బెన్ భార్యని ఖననం చేయటానికి బయలుదేరుతారు. బెన్, పిల్లలు బస్సులో వెంబడిస్తారు. బెన్ ఆవేశంతో శ్మశానంలోకి వెళతానని అంటే పిల్లలు వారిస్తారు. “నువ్వు కూడా మాకు దూరం అయితే మా పరిస్థితి ఏమిటి?” అని పెద్దకొడుకు గట్టిగా అడగటంతో బెన్ ఆవేశం తగ్గుతుంది. ఆ నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక అతను అక్కడ నుంచి బాధగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక పక్క భార్య ఆఖరి కోరిక, ఇంకో పక్క పిల్లలు. చనిపోయిన భార్య కోసం వెళితే అరెస్టయి పిల్లలు కూడా దూరమవవచ్చు. ఏం చేస్తాడు మరి!
తర్వాత చిన్నబ్బాయి పెద్దబ్బాయితో “నాన్న వల్లే అమ్మ పిచ్చిదయింది. నాన్న ప్రమాదకారి. అతనెంతో గొప్పవాడని నువ్వనుకుంటున్నావు. మన జీవితాలు ఉత్తమంగా ఉన్నాయని భ్రమపడుతున్నావు” అంటాడు. పెద్దబ్బాయి ఇంతకు ముందు తనకు ఒకమ్మాయితో జరిగిన అనుభవం గుర్తొస్తుంది. తన జీవితం గొప్పగా లేదనే మాట తన తమ్ముడు అనటంతో అతనిలో ఉన్న అనుమానాలకు ఊతం దొరుకుతుంది. తనకు యూనివర్సిటీల నుంచి వచ్చిన ఉత్తరాలు తండ్రికి చూపిస్తాడు. “నాకు తెలియకుండా ఇంత తతంగం నడిచిందా?” అంటాడు బెన్. “అమ్మ సాయంతోనే నేను యూనివర్సిటీలకి అప్లికేషన్లు పంపించాను. నువ్వు మమ్మల్ని దద్దమ్మలని చేశావు. లోకజ్ఞానం లేకుండా చేశావు” అంటాడు పెద్దబ్బాయి. బెన్ అవాక్కవుతాడు. ఇంతలో చిన్నబ్బాయి తాతయ్య ఇంటికి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. షాక్ మీద షాక్ తగిలిన బెన్ పిల్లల్ని తీసుకుని మామగారి ఇంటికి వెళతాడు. ఒక్కడే లోపలికి వెళతాడు.
చిన్నబ్బాయి “నువ్వు అమ్మని చంపేశావు. మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. అమ్మకి అడవిలో ఉండటం ఇష్టం లేదు” అంటాడు. “కొన్ని నిర్ణయాలు మేమిద్దరం కలిసే తీసుకున్నాం” అంటాడు బెన్. ఇక్కడ కాస్త తడబాటు కనిపిస్తుంది. బెన్ భార్య మాట వినలేదని మనకు అర్థమవుతుంది. బెన్ మామగారు “పిల్లల సంరక్షణ బాధ్యత నాకు అప్పగించమని కోర్టుకు వెళుతున్నాను” అంటాడు. బెన్ ఒప్పుకోనంటాడు. మామగారు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇంటి ఆవరణలో ఎవరో తచ్చాడుతున్నారు, వచ్చి చూడమని అంటాడు. విధి లేక బెన్ బయటికి వచ్చేస్తాడు. అయితే పోలీసులు వచ్చి వెళ్ళేదాకా ఆగి తన రెండో కూతుర్ని ఇంటి పై అంతస్తులో ఉన్న కిటికీలో నుంచి వెళ్ళి చిన్నబ్బాయిని తీసుకురమ్మని పంపిస్తాడు. కొండలు ఎక్కిన ఆ పిల్లలకి ఓ ఇంటి పైకి ఎక్కడం కష్టమేమీ కాదు. అయితే ఇంటిపైన ఉన్న ఒక పెంకు విరిగి ఆ అమ్మాయి జారి కింద పడుతుంది. ఆమెకి మెడలో, కాలిలో ఎముకలు స్వల్పంగా విరుగుతాయి. డాక్టరు ఆమె చాలా బలిష్టంగా ఉందని, అయితే మెడకు తగిలిన దెబ్బ కొంచెం కింద తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంటాడు. బెన్ ఈ పరిణామంతో పూర్తిగా కుంగిపోతాడు. ఆధునిక సమాజంలో అంతా చెడే లేదు. మంచి కూడా ఉంది. వైద్యసదుపాయాలు ఉన్నాయి. నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. మంచిని స్వీకరించాలి కానీ చెడు ఉందని మంచిని కూడా వదులుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. బెన్‌కి ఇది అనుభవం ద్వారా తెలుస్తుంది.
తర్వాత ఏం జరుగుతుందో ఊహించటం కష్టమేమీ కాదు. కాకపోతే సినిమా కాబట్టి కొంత నాటకీయత ఉంటుంది. ఏది ఏమైనా దర్శకుడు ఇచ్చే సందేశం మనసుకి హత్తుకుంటుంది. పిల్లల భవిష్యత్తు పూర్తిగా మన చేతిలో ఉండటమనేది అసాధ్యం. పిల్లలని కనగలం కానీ వారి తలరాతలని కనలేం. తెలుగులో ‘కనటం’ అనే పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి జన్మనివ్వటం, ఒకటి చూడటం. ఎంత ప్రయత్నించినా పిల్లల తలరాతల్ని చూడలేం. ఒక దశ వచ్చాక వారిని నియత్రించటం ఆపేయాలి. వారి అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి. మన కలలని వారి మీద రుద్దకూడదు. మనం చేయగలిగినదల్లా వారిని దుష్ప్రభావాల నుండి కాపాడటమే. “నేను చెప్పాను కాబట్టి చెయ్యి” అనటం కన్నా “నీకు మంచిది కాబట్టి చెయ్యి” అనటమే ఉత్తమం. మొదటిది అహంకారం, రెండోది మమకారం. అహంకారం ముందు వదిలేయాలి. పిల్లలు ఎదిగాక మమకారం కూడా తగ్గించుకోవాలి.