మరుగునపడ్డ మాణిక్యాలు – 92: ది అపార్ట్మెంట్

4
2

[సంచిక పాఠకుల కోసం ‘ది అపార్ట్మెంట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]1[/dropcap]960లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ది అపార్ట్మెంట్’ కథ అప్పటి భారతీయ సమాజానికి అతకలేదు కానీ ఇప్పటి భారతీయ సమాజానికి అతుకుతుంది. కార్యాలయాల్లో యువతులని వలలో వేసుకునే మ్యానేజర్లు, అమాయకంగా మనసు పారేసుకునే ఉద్యోగులు; ఆ యువతి, ఈ యువతి ఒకరే అయితే జరిగే పరిణామాలని హాస్యస్ఫోరకంగా చూపించిన చిత్రమిది. తీయగా మాట్లాడిన వారిని నమ్మవద్దని సందేశం కూడా ఉంటుంది. కానీ హాస్యమే ఈ చిత్రానికి ఆయువుపట్టు. తెలుగులో కొత్తగా వచ్చిన ‘మిస్సమ్మ’ (2003) లో కూడా గంభీరమైన విషయాన్ని హాస్యం జోడించి చెప్పారు. ఆ కోవలోనిదే ఈ చిత్రం. ఈ చిత్ర కథని ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’ (2007) అనే హిందీ చిత్రంలో ఒక ఉపకథగా వాడుకున్నారు. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. హాస్యప్రియులు తప్పక చూడవలసిన చిత్రమిది. నాకు అత్యంత ఇష్టమైన చిత్రాలలో ఇదొకటి.

బాక్స్టర్ న్యూయార్క్ నగరంలో ఒక బీమా కంపెనీలో గుమాస్తాగా పని చేస్తుంటాడు. అతనిదో చిన్న అపార్ట్మెంట్. ఒకసారి ఒక మ్యానేజర్ ఏదో పార్టీ వెళ్ళటానికి సూటు వేసుకోవటానికి అతని అపార్ట్మెంట్ వాడుకుంటాడు. క్రమంగా ఇతర విభాగాల మ్యానేజర్లు కూడా అతని అపార్ట్మెంట్ వాడుకోవటం మొదలుపెడతారు. ఆఫీసులోనూ, బయటా అమ్మాయిలని వలలో వేసుకోవటం, వారితో శృంగారం కోసం బాక్స్టర్ అపార్ట్మెంట్‌ని వాడుకోవటం వారు చేసే పని. మద్యం కూడా అక్కడ ఏరులై పారుతూ ఉంటుంది. కొందరు యువతులు తెలిసి తెలిసీ ఈ సంబంధాలు కొనసాగిస్తారు. కొందరేమో ఆ మ్యానేజర్లు తమ భార్యలని వదిలి తమని పెళ్ళి చేసుకుంటారని ఆశపడతారు. ఏమైనా బాక్స్టర్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక్కోసారి ఇద్దరు మ్యానేజర్లు ఒకరి తర్వాత ఒకరు అతని అపార్ట్మెంట్ వాడుకుంటే అతను రాత్రంతా పార్కులో ఉండాల్సి వస్తుంది. నిద్రకి ఒక వేళాపాళా లేక అతను నిద్రమాత్రలు వేసుకుంటూ ఉంటాడు. బాక్స్టర్ ఎందుకు ఒప్పుకున్నాడు? మొహమాటం ఒక పక్క. ప్రమోషన్ మీద ఆశ మరో పక్క. ఆ మ్యానేజర్లు అతనికి ప్రమోషన్ ఇప్పిస్తామని చెబుతారు.

బాక్స్టర్ పక్క అపార్ట్మెంట్లో ఒక డాక్టర్, అతని భార్య ఉంటారు. వారికి అతని అపార్ట్మెంట్లో జరిగే రహస్య వ్యవహారాలు తెలియదు. అతని అపార్ట్మెంట్ నుంచి దాదాపు ప్రతి రాత్రి అమ్మాయిల కేరింతలు వినపడుతూ ఉంటే అతన్ని ఒక శృంగారపురుషుడని అనుకుంటారు. నిజానికి బాక్స్టర్ ఒక అర్భకుడిలా ఉంటాడు. ఖాళీ మద్యం సీసాలు బయట పారేస్తుంటే చూసిన డాక్టర్ అతను బాగా తాగుతాడని అనుకుంటాడు. ఒకసారి డాక్టరు “నీ తీరు చూస్తే నువ్వు వీలునామా రాయటం మంచిదనిపిస్తోంది. ఆ వీలునామాలో నీ దేహాన్ని యునివర్సిటీకి పరిశోధనకి ఇస్తున్నట్టు రాస్తావా?” అంటాడు. అంటే అతనికి అంత సత్తువ ఎలా వస్తుందనేది తెలుసుకోవాలని డాక్టర్ ఉద్దేశం. “నా దేహం మీద పరిశోధన చేస్తే నిరాశే మిగులుతుంది” అంటాడు బాక్స్టర్. అతనికి తన మీద తాను జోకులు వేసుకోవటం అలవాటు.

ఆఫీసులో లిఫ్టుల్లో ఆపరేటర్లుగా యువతులు ఉంటారు. అంటే లిఫ్టు నడిపేవారన్నమాట. అలాంటి ఒక యువతి ఫ్రాన్. ఆమె అక్క, బావల దగ్గర ఉంటూ ఈ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. బాక్స్టర్ కి ఆమె అంటే ఇష్టం. అయితే అప్పటి ఆఫీసు పద్ధతుల ప్రకారం అతను ఆమెని ఆమె ఇంటి పేరుతో ‘మిస్ క్యూబెలిక్’ అని మర్యాదపూర్వకంగా పిలుస్తాడు. ఆమె అతన్ని ‘మిస్టర్ బాక్స్టర్’ అంటుంది. అతనితో సరదాగా మాట్లాడుతుంది. ఆమెకి తన ప్రేమ గురించి చెప్పటానికి బాక్స్టర్‌కి ధైర్యం చాలదు. ఒకరోజు బాక్స్టర్‌కి మానవ వనరుల మ్యానేజర్ జెఫ్ నుంచి పిలుపు వస్తుంది. తనకి ప్రమోషన్ వచ్చేసిందని సంబరపడుతూ బాక్స్టర్ ఆయన ఆఫీసుకి వెళతాడు. జెఫ్ “నీకు ప్రమోషన్ ఇవ్వమని అందరు మ్యానేజర్లు సిఫార్సు చేశారు. ఈ ఆఫీసులో ఏ మూల ఏం జరుగుతోందో నాకు తెలుసు. నీ అపార్ట్మెంట్లో ఏం జరుగుతోందో కూడా తెలుసు” అంటాడు. బాక్స్టర్ భయపడిపోతాడు. ఇక నుంచి ఎవరికీ తన అపార్ట్మెంట్ తాళం ఇవ్వనని అంటాడు. జెఫ్ నర్మగర్భంగా తనకి కూడా తాళం ఇస్తే అతని రహస్యం బయటపడనివ్వనని అంటాడు. అంటే అతనికి కూడా అక్రమ సంబంధం ఉందన్నమాట. బాక్స్టర్ కిక్కురుమనకుండా తాళం అతనికి ఇస్తాడు. అయితే జెఫ్‌కి సంబంధం ఉన్నది ఫ్రాన్‌తో! ఆమె అతనితో సంబంధం తెంచుకోవాలనుకుంటుంది కానీ అతను కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆమెని మళ్ళీ ఒప్పిస్తాడు. ఆమె అతన్ని ప్రేమించింది. అతను తన భార్యని వదిలేస్తాడని నమ్ముతుంది.

బాక్స్టర్‌కి ప్రమోషన్ వస్తుంది కానీ ఫ్రాన్‌కి జెఫ్‌తో ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి తన అపార్ట్మెంట్లోనే మరొకరితో సరసాలాడుతోందని తెలిసి అతను కుంగిపోతాడు. అదే సమయంలో జెఫ్‌కి అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవటం అలవాటేననే విషయం ఫ్రాన్‌కి తెలుస్తుంది. ఆమె బాక్స్టర్ అపార్ట్మెంట్లో జెఫ్ ని కలిసినపుడు తనకి అతను చేసిన అన్యాయానికి విలపిస్తుంది. చివరికి నిర్వేదంలో పడుతుంది. మర్నాడే క్రిస్మస్ కావటంతో ఆమె అతని కోసం ఒక పాటల రికార్డు కానుకగా కొన్నది. నిర్వేదంతోనే అతనికి ఇస్తుంది. అతను “నేనేమీ కొనలేకపోయాను. ఈ వంద డాలర్లు తీసుకుని ఏమైనా కొనుక్కో” అని వంద డాలర్లు ఇస్తాడు. ఆత్మాభిమానం గల అమ్మాయిలు డబ్బు తీసుకోరు. శృంగారానికి బదులు డబ్బు తీసుకుంటే దాన్ని ఏమంటారో వారికి తెలుసు. అతను ఆమె పర్సులో డబ్బు పెట్టేస్తాడు. మర్నాడు క్రిస్మస్ కావటంతో హడావిడిగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆమె కుంగుబాటులో బాక్స్టర్ వాడే నిద్రమాత్రలు మింగేస్తుంది. మరో పక్క మనసు విరిగిన బాక్స్టర్ ఒక బార్లో తాగుతూ ఉంటాడు. అతనికి ఒక స్త్రీ పరిచయమవుతుంది. ఇద్దరూ కలిసి అతని ఇంటికి వస్తారు. బాక్స్టర్ కి మంచం మీద ఫ్రాన్ స్పృహ లేని స్థితిలో కనపడుతుంది. అక్కడి నుంచి ఏం జరిగిందనేది మిగతా కథ.

నవ్విస్తూనే ఒక సందేశం కూడా ఇచ్చారు. ఇప్పటి భారతీయ సమాజానికి ఇది వర్తిస్తుంది. ఆఫీసుల్లో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పురుషులు సరదా కోసం అమ్మాయిల వెంటపడతారు. ఇప్పుడు స్త్రీలు కూడా అభివృద్ధి చెందారు. పురుషుల వెంట పడుతున్నారు. ఇలాంటి అక్రమసంబంధాలు ఎప్పటికైనా బెడిసికొడతాయి. సాన్నిహిత్యం పెరగకుండా మొదట్లోనే ఇలాంటి పరిచయాలని నియంత్రించాలి. దీనికి కొంత నిగ్రహం అవసరం. తప్పదు. మనశ్శాంతి కావాలంటే నిగ్రహం ఉండాలి. ఒకప్పుడు ఆఫీసులో లైంగిక వేధింపులను యాజమాన్యం పెద్దగా పట్టించుకునేది కాదు. స్త్రీలు మౌనంగా భరించేవారు. ఇప్పుడు చట్టాలు వచ్చాయి. వేధింపులు ఎక్కువైతే స్త్రీలైనా, పురుషులైనా ఫిర్యాదు చేయవచ్చు.

బిల్లీ వైల్డర్, ఐ.ఏ.ఎల్. డైమండ్ రాసిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. బాక్స్టర్, ఫ్రాన్ పాత్ర స్వభావాల్ని ఒక్క సంభాషణలో చెప్పేస్తారు. ఆమె నడిపే లిఫ్ట్‌లో అతను ఎక్కుతాడు. రాత్రంతా పార్కులో పడుకోవటంతో అతనికి జలుబు చేసింది. అతను తన జలుబు ఆమెకి అంటుతుందేమో అంటే ఆమె తనకి ఎప్పుడూ జలుబు రాదని అంటుంది. అతను న్యూయార్క్ నగరంలో సగటున ఒక వ్యక్తికి ఏడాదికి 2.5 సార్లు జలుబు వస్తుందని అంటాడు. ఇలా మాట్లాడటం భయస్థులైన పురుషులలో ఉండే స్వాభావం. తాము ప్రేమించిన అమ్మాయిల ముందు ఏం మాట్లాడాలో తెలియక ఇలా అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వెంటనే ఫ్రాన్ “అయ్యో! అదే నిజమైతే నాకెప్పుడూ జలుబు రాదు కాబట్టి ఆ సగటు సంఖ్య అలా ఉండాలంటే మరో వ్యక్తికి ఏడాదికి ఐదు సార్లు జలుబు వస్తుందన్నమాట. పాపం!” అంటుంది. ఆమె సహృదయం ఇక్కడ కనిపిస్తుంది. బాక్స్టర్ వెంటనే “ఆ వ్యక్తిని నేనే” అంటాడు. ఇలా హాస్యం ఎక్కడా తగ్గకుండా చిత్రం నడుస్తుంది. ఫ్రాన్ ఆత్మహత్య ప్రయత్నం చేసినపుడు కూడా హాస్యం తగ్గకుండా కథ నడిపించారు. ఇదే ఈ చిత్రం సాధించిన విజయం. ఫ్రాన్ మనసులో జెఫ్ గురించి ఎలాంటి భావాలు ఉన్నాయో కూడా నర్మగర్భంగా చెప్పారు రచయితలు. ఆమె జుట్టు చిన్నగా కత్తిరించుకుని ఉంటుంది. బాక్స్టర్ ఆ విషయమే అడిగితే “నా జుట్టు నాకు ఆందోళన కలిగించటం మొదలుపెట్టింది. అందుకే కత్తిరించుకున్నాను” అంటుంది. తర్వాత జెఫ్‌ని కలిసినపుడు అతను “నీ జుట్టు పొడుగ్గా ఉంటేనే నాకిష్టం” అంటాడు. ఆమె “తెలుసు” అంటుంది. అప్పుడు ప్రేక్షకులకి ఆమె జుట్టు ఆమెకి ఎందుకు ఆందోళన కలిగించిందో, ఆమె ఎందుకు జుట్టు కత్తిరించుకుందో అర్థమవుతుంది. ఇలాంటి చమక్కులు ఈ చిత్రంలో చాలా ఉంటాయి.

స్క్రీన్ ప్లే లో ఇంకో విశేషమేమిటంటే పాత్రలకి ఒకరి జీవితాల్లో ఏం జరుగుతోందో మరొకరికి తెలిసే ముందు ప్రేక్షకులకి తెలిసిపోతుంది. దానితో వారికి రహస్యాలు తెలిస్తే ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ ఉంటుంది. మొదట్లో ఫ్రాన్‌కి జెఫ్‌తో సంబంధం ఉందని బాక్స్టర్‌కి తెలియదు. ఫ్రాన్‌కి బాక్స్టర్ తనతో డేటింగ్ చేయటానికి ఉత్సాహంగా ఉన్నాడని తెలుసు గానీ తాను జెఫ్‌ని కలుసుకునేది బాక్స్టర్ అపార్ట్మెంట్లో అని తెలియదు. జెఫ్‌కి బాక్స్టర్ ఫ్రాన్‌ని ఇష్టపడుతున్నాడని తెలియదు. ప్రేక్షకులకి అన్నీ తెలుసు. ప్రేక్షకులకి ఈ విషయాలన్నీ చెప్పటానికి వాడుకున్న పద్ధతిలోనే స్క్రీన్ ప్లే గొప్పతనం తెలుస్తుంది. జెఫ్ తన భార్యకి తాను వేరే ఊరి నుంచి వచ్చిన మ్యానేజర్‌ని ఒక నాటకం చూడటానికి తీసుకువెళుతున్నానని చెబుతాడు. ఎక్కువ అనుమానం రాకుండా టికెట్లు కూడా కొంటాడు. నిజానికి అతను తన ప్రేయసిని కలుసుకోవటానికి వెళుతున్నాడు. అప్పటికి ఆ ప్రేయసి ఎవరో ప్రేక్షకులకి తెలియదు. ఆ రోజే జెఫ్ బాక్స్టర్‌ని బెదిరించి అతని తాళం తీసుకుంటాడు. మరి నాటకం టికెట్లు వృథా అవుతాయిగా? ఆ టికెట్లు బాక్స్టర్‌కి ఇస్తాడు. వేరే ఏ మ్యానేజర్‌కో ఇవ్వకుండా బాక్స్టర్‌కి ఇవ్వటం అతని జిత్తులమారితనం. ఆ నాటకం ప్రసిద్ధమైనది. బాక్స్టర్ ఫ్రాన్‌ని ఆ నాటకానికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఆమెని అడుగుతాడు. ఆమె తాను తన ప్రియుడిని కలుసుకుంటున్నానని, అయితే అతనితో తెగతెంపులు చేసుకోవటానికే వెళుతున్నానని అంటుంది. బాక్స్టర్ కాస్త నిరాశ పడినట్టు ఉంటే తాను పని పూర్తి చేసుకుని తిన్నగా థియేటర్ దగ్గరకి వస్తానని అంటుంది. ఫ్రాన్ ఒప్పుకోవటంతో అతను తన జలుబుని కూడా మర్చిపోతాడు. ఇది చెప్పటానికి ఫ్రాన్ చేత “మీ జలుబు ఎలా ఉంది?” అని అడిగిస్తాడు రచయిత. “జలుబేంటి?” అంటాడు బాక్స్టర్. అతని ఆనందం చూసి ప్రేక్షకులకి ‘హమ్మయ్య! మంచివాడికి మంచిరోజులు వచ్చాయి’ అనిపిస్తుంది. ఫ్రాన్ వెళ్ళగానే అతను మళ్ళీ జలుబుకి ముక్కులో మందు వేసుకుంటాడు. ప్రియురాలి సమక్షంలో ఉన్నపుడు గాలిలో తేలినట్టుంటుంది. ఆమె వెళ్ళిపోగానే భూమి మీదకి రాకతప్పదు.

ఫ్రాన్ జెఫ్‌ని ఒక రెస్టారెంట్లో కలుసుకుంటుంది. అప్పుడు ప్రేక్షకులకి ఏం జరుగుతోందో అర్థమవుతుంది. పాపం బాక్స్టర్ అనిపిస్తుంది. జెఫ్ తీయని మాటలు చెప్పి ఫ్రాన్‌ని బాక్స్టర్ అపార్ట్మెంట్‌కి తీసుకువెళతాడు. బాక్స్టర్ ధియేటర్ బయట ఆమె కోసం చూసి చూసి వచ్చేస్తాడు. ఏదీ మనసులో పెట్టుకోడు. ఆమె తన ప్రియుడితో రాజీ పడిందని సరిపెట్టుకుంటాడు. అతని మీద సానుభూతి ఇంకా పెరుగుతుంది. తర్వాత ఫ్రాన్‌కి చెందిన చిన్న అద్దం బాక్స్టర్‌కి అపార్ట్మెంట్లో దొరుకుతుంది. విరిగిపోయి ఉంటుంది. ఆమె అద్దాన్ని జెఫ్ మీదకి విసరటంతో అది విరిగింది. బాక్స్టర్ దాన్ని జెఫ్‌కి అప్పగిస్తాడు. క్రిస్మస్ ముందు రోజు బాక్స్టర్ ఒక టోపీ కొనుక్కుని ఫ్రాన్‌కి చూపిస్తాడు. టోపీ తలపై పెట్టుకుని ఎలా ఉందని అడుగుతాడు. ఆమె అద్దంలో చూసుకోమని తన అద్దం అతనికి ఇస్తుంది. అద్దం పగులు చూసి అతనికి ఆమే జెఫ్ ప్రేయసి అని అర్థమవుతుంది. అంతకు ముందే ఆమెకి జెఫ్ సెక్రెటరీ జెఫ్‌కి తనతో పాటు వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉండేవని చెబుతుంది. ఆ సెక్రటరీ జెఫ్ ఫోన్లో మాట్లాడినవన్నీ రహస్యంగా వింటుంది కాబట్టి ఆమెని అన్నీ తెలుసు. ఫ్రాన్ హతాశురాలవుతుంది. అద్దం పగిలిందని బాక్స్టర్ అంటే ఫ్రాన్ “నాకలాగే ఇష్టం. నా మనసు ఎలా ఉందో నాకు చూపిస్తుంది” అంటుంది.

ఆనాటి సామాజిక పరిస్థితులని కూడా చిత్రంలో వ్యంగ్యంగా చూపించారు. ఒక రాత్రి బాక్స్టర్ టీవీలో సినిమా చూడటానికి కూర్చుంటాడు. అప్పట్లో టీవీ కార్యక్రమాలని ప్రకటించటానికి వ్యాఖ్యాతలు ఉండేవారు. సినిమా పేరు, తారల పేర్లు చెప్తుంటే బాక్స్టర్ ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది. అంతలోనే “ముందు ఈ చిత్రాన్ని మీకందిస్తున్న వారి సందేశం వినండి” అంటాడు వ్యాఖ్యాత. బాక్స్టర్ ఉత్సాహం చల్లారిపోతుంది. అప్పటికీ ఇప్పటికీ ప్రకటనలు (సందేశం అంటే అదే!) అలానే ఉన్నాయి. ఒక మ్యానేజర్ బాక్స్టర్‌కి ఫోన్ చేసి అపార్ట్మెంట్ ఇవ్వమని అడుగుతూ “నాతో ఉన్న అమ్మాయి మ్యారిలిన్ మన్రోలా ఉంది. కాదనకు” అంటాడు. ఆ ఆమ్మయి కూడా మ్యారిలిన్ మన్రోలా హస్కీ గొంతుతో మాట్లాడుతుంది. తారలని అనుకరించటంపై ఇదో వ్యంగ్యాస్త్రం. టీవీకి కనెక్ట్ చేసుకుని వాడే పెద్ద రిమోట్ లాంటివి చూసి అప్పట్లో ఎలాంటి పరికరాలు ఉండేవో తెలుస్తుంది. బ్యాక్స్టర్ పని చేసే ఆఫీసు వాతావరణం కూడా వ్యంగ్యాత్మకంగా ఉంటుంది. ఆఫీసులో గుమాస్తాలు ఒక పెద్ద గదిలో వరుసగా కూర్చుని ఉంటారు. వారిని చూస్తే యుద్ధంలో మోహరించిన సైనికుల్లా ఉంటారు. వారు చేసేది జీవనపోరాటం! బ్యాక్స్టర్‌కి ప్రమోషన్ వచ్చినపుడు అతను ఇతర గుమాస్తాలని దాటుకుంటూ దర్పంగా తన ఆఫీసు గదికి వెళతాడు. యుద్ధంలో విజయం సాధించినట్టు. అప్పుడు సైనిక వందనం లాంటి సంగీతం నేపథ్యంలో వినిపిస్తుంది. యుద్ధంలో సైనికులందరూ కలిసి శత్రు సైనికులతో పోరాడతారు. జీవనపోరాటంలో సైనికులు ఒకరితో ఒకరు పోరాటం చేస్తూ ఉంటారు. క్రిస్మస్ ముందు రోజు ఆఫీసులో పార్టీ జరుగుతుంది. కాస్త అతిగా చూపించినా అక్కడి సంస్కృతి కనపడుతుంది. ఓ పక్క జంటలు ముద్దులు పెట్టుకుంటూ ఉంటాయి. మరో పక్క అమ్మాయిలు బల్లల పైకి ఎక్కి నృత్యం చేస్తుంటారు. డబ్బు బాగా సంపాదించటం, ఖాళీ సమయాల్లో, సెలవుల్లో జల్సా చేయటం – ఇదే జీవితం అన్నట్టు జీవిస్తారు.

చిత్రంలో నాకు అమితంగా నచ్చినవి డైలాగులు. మచ్చుకి కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను.

ఒక రాత్రి బాక్స్టర్ నిద్రకి ఉపక్రమిస్తూ ఉంటే ఒక మ్యానేజర్ అపార్ట్మెంట్ కావాలని ఫోన్ చేస్తాడు. రాత్రంతా పార్కులో పడుకున్న బాక్స్టర్ జలుబుతో ఆఫీసుకి వస్తాడు. ఫ్రాన్ అతని వాలకం చూసి “మీరు ఈరోజు మంచం దిగకుండా ఉండాల్సింది” అంటుంది. బాక్స్టర్ “నిన్న రాత్రే నేను మంచం దిగకుండా ఉండాల్సింది” అంటాడు.

బార్లో పరిచయమైన స్త్రీకి బాక్స్టర్ తనకి ఎవరూ లేరని చెప్పటంతో ఆమె “క్రిస్మస్ ముందురోజు ఎవరూ లేని అపార్ట్మెంట్‌కి వెళ్ళటమంటే ఎంత కష్టం” అంటుంది. “నాకు ఎవరూ లేరన్నాను కానీ నా అపార్ట్మెంట్లో ఎవరూ లేరని నేననలేదే” అంటాడతను. చివరికి ఆమె “మీ ఇంటికి వెళదామా, మా ఇంటికి వెళదామా?” అంటే “మా ఇంటికే వెళదాం. అందరూ అక్కడికే వెళతారుగా” అంటాడు.

జెఫ్ మోసం తెలిసి ఫ్రాన్ ఏడుస్తూ ఉంటే ఆమె కాటుక కారిపోతూ ఉంటుంది. “నేనెంత తెలివితక్కువ దాన్ని! పెళ్ళైనవాణ్ణి ప్రేమిస్తే కాటుక పెట్టుకోకూడదని కూడా తెలియలేదు” అంటుంది. అతను వంద డాలర్లు ఇచ్చాక ఆమె అతను శృంగారం ఆశిస్తున్నాడనుకుని నిర్వేదంతో తన చలికోటు విప్పుతుంది. అతను ఇల్లు చేరుకోవాలని కంగారులో ఉంటాడు. ఆమె “డబ్బులిచ్చారు కదా! అందుకే..” అంటుంది. “చౌకబారుగా మాట్లాడకు” అంటాడతను. “వంద డాలర్లు చవకేం కాదు” అంటుందామె. ఆమె మనసుపై ఎంత ప్రభావం పడిందో ఈ మాటల ద్వారా తెలుస్తుంది. ఆమె ప్రవర్తన మీద అక్కడి సంస్కృతి ప్రభావం కూడా ఉంది.

బిల్లీ వైల్డర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ కళాదర్శకత్వం, ఉత్తమ ఎడిటింగ్ ఆస్కార్లు వచ్చాయి. బాక్స్టర్‌గా జాక్ లెమన్, ఫ్రాన్‌గా షిర్లీ మెక్లెయిన్ నటించారు. ఇద్దరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. జాక్ లెమన్ కామెడీ టైమింగ్ అద్భుతం. డాక్టర్‌గా నటించిన జాక్ క్రుషెన్ కి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ నామినేషన్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఫ్రాన్ స్పృహ కోల్పోయి ఉండటంతో బాక్స్టర్ పక్కింటి డాక్టర్‌ని పిలుస్తాడు. డాక్టర్ వస్తాడు. బాక్స్టర్ తనతో వచ్చిన స్త్రీని హడావిడిగా పంపించేస్తాడు. డాక్టర్ ఫ్రాన్ పొట్టలో ఉన్న నిద్రమాత్రలని కక్కిస్తాడు. ఆమెకో ఇంజెక్షన్ ఇస్తాడు. ఏమైందని బాక్స్టర్‌ని అడుగుతాడు. “మా ఇద్దరికీ గొడవైంది” అంటాడు బాక్స్టర్. “అందుకని నువ్వు బయటకి వెళ్ళి ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నావు! ఎంత రసికుడివయ్యా!” అంటాడు డాక్టర్. ఫ్రాన్ తేరుకుంటుంది. బాక్స్టర్ “హాయ్ మిస్ క్యూబెలిక్” అంటాడు. ఆమె “మిస్టర్ బాక్స్టర్! మీరిక్కడేం చేస్తున్నారు?” అంటుంది. డాక్టర్ “మిస్టర్! మిస్! ఎంత మర్యాదో” అంటాడు. తర్వాత ఆమెకి కాఫీ తాగించి కాసేపు నడిపిస్తారు. వెంటనే పడుకుంటే ప్రమాదం. కాసేపటికి ఆమె పడుకున్నాక డాక్టర్ బాక్స్టర్‌ని చీవాట్లేస్తాడు. “మనిషిలా ప్రవర్తించు” అంటాడు. ఈరోజుల్లో అలా చెప్పేవారే లేరు. ఇంట్లో పెద్దవారుంటే బుద్ధి చెబుతారు. పెద్దవారితో మనసు విప్పి మాట్లాడుతూ ఉండాలి. లేకపోతే మంచి స్నేహితులైనా ఉండాలి. ఇక్కడ బాక్స్టర్ తప్పు లేదు. ఫ్రాన్ లాంటి వాళ్ళ కోసం ఈ సూచన. నా జీవితం నా ఇష్టం అంటే పెద్దవాళ్ళకి పుట్టెడు దుఃఖమో, గర్భశోకమో మిగులుతుంది.

ఫ్రాన్ నిద్రమాత్రలు మింగే ముందు జెఫ్ పేరు మీద ఒక ఉత్తరం రాసి కవర్లో పెడుతుంది. జెఫ్ పేరు బయటకి రాకూడదని బాక్స్టర్ దాన్ని దాచేస్తాడు. పూర్వకాలం ప్రేమికుడైతే ఇలా చేసినందుకు, అదీ తను ప్రేమించిన అమ్మాయిని ఇలా చేసినందుకు జెఫ్ లాంటి వాడిని కొట్టడానికి వెళ్ళేవాడేమో. బాక్స్టర్ ఈ కాలం ప్రేమికుడు. ఇది వారి వ్యవహారం, నాకు సంబంధం లేదు అన్నట్టుంటాడు. అతనికి తన ఉద్యోగం ముఖ్యం. అతని నైతికత ప్రశ్నార్థకమే. ఎవరూ పవిత్రులు కాదు. మర్నాడు బాక్స్టర్ జెఫ్‌కి ఫోన్ చేస్తాడు. క్రిస్మస్ కావటంతో జెఫ్ రాలేనంటాడు. “నువ్వే చూసుకో” అంటాడు. ఫ్రాన్ నిద్రలేచిన తర్వాత బాక్స్టర్ “జెఫ్ చాలా కంగారుపడ్డాడు” అని అబద్ధం చెబుతాడు. ఆమెని తన అక్కకి కూడా ఫోన్ చేయొద్దని చెబుతాడు. ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడే పరిస్థితిలో ఆమె లేదు. ఆమె ఏదో మాట్లాడితే నిజం బయటపడిపోతుంది. అది జెఫ్‌కి ప్రమాదం. ఆమె అతనికి తన రహస్యం తెలిసిపోయినందుకు సిగ్గు పడుతుంది కానీ అతను జెఫ్‌ని కాపాడటం ఆమెకి నచ్చదు. బాక్స్టర్‌తో జెఫ్ ఒకసారి “సరదాగా కాసేపు గడిపితే ఈ అమ్మాయిలు పెళ్ళి దాకా వెళ్ళిపోతారు. న్యాయమా?” అని కూడా అన్నాడు. అయినా బాక్స్టర్ జెఫ్‌కి దురుద్దేశం లేదనే ఫ్రాన్‌తో అంటాడు. ఎందుకంటే ఆమె ఇంకా జెఫ్‌ని ప్రేమిస్తూ ఉంది. నిజం చెబితే మళ్ళీ అఘాయిత్యం తలపెట్టవచ్చు. ఇంతకీ ఫ్రాన్ జెఫ్‌కి రాసిన ఉత్తరంలో ఏముంది? ఆమె ఏమీ రాయలేదు. వంద డాలర్ల నోటుని కవర్లో పెట్టింది అంతే!

తర్వాత ఆమెని ఉత్సాహపరచటానికి బాక్స్టర్ ఆమెతో పేక ఆడతాడు. ఆమె తనని దురదృష్టం ఎలా వెంటాడుతోందో చెబుతుంది. జెఫ్‌కి ముందు ఆమె డేట్ చేసినతని గురించి చెబుతూ “అతను ఒక ఫైనాన్స్ కంపెనీలో మ్యానేజరు. ఖాతాల విషయంలో ఏదో కక్కుర్తి పడ్డాడు. కానీ నన్ను తన కోసం వేచి ఉండమన్నాడు. 1965లో జైలు నుంచి బైటికొస్తాడు” అంటుంది. మనకి కిసుక్కున నవ్వొస్తుంది. బాక్స్టర్ ఆమె మాటలన్నీ వింటాడు. కానీ ఓదార్చడు, సలహాలు ఇవ్వడు. ఒక్కోసారి ఇదే మంచిది. పక్కన కూర్చుని నేనున్నాను అంటే చాలు. దీన్ని ఎంపతీ (సహానుభూతి) అంటారు. మనలో చాలామంది ఓదార్పులో, సలహాలో ఇస్తూ ఉంటాం. అది అన్నివేళలా పని చేయదు. బాక్స్టర్‌కి క్రిస్మస్ రోజు ఒక మనిషి సాంగత్యం దొరకటంతో అతనికి కూడా అంతా మన మంచికే అనిపిస్తుంది. అతని మంచితనం చూసి ఆమె “మీ లాంటి వారితో ప్రేమలో ఎందుకు పడను నేను?” అంటుంది. బలవంతంగా ప్రేమ పుట్టదు. అది మనసులో అనుకోకుండా పుడుతుంది. దురదృష్టం ఏమిటంటే మనసు ఒక్కోసారి అందని ద్రాక్షని కోరుతుంది. అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. బాక్స్టర్ కూడా తాను గతంలో ఇష్టపడిన అమ్మాయి గురించి చెబుతాడు. “ఆమె కోసం ప్రాణాలు తీసుకుందామనుకున్నాను. తత్తరపాటులో తూటా మోకాలికి తగిలింది. మోకాలు నయం కావటానికి మూడు నెలలు పట్టింది. కానీ ఆ అమ్మాయిని మూడు వారాల్లో మర్చిపోయాను. ఆమె ప్రతి క్రిస్మస్‌కీ నాకు ఫ్రూట్ కేక్ పంపిస్తుంది” అంటాడు. ఇది చాలా ముఖ్యమైన జీవితపాఠం. ఎవరో దక్కలేదని బాధపడాల్సిన అవసరం లేదు. కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది. కాస్త ఓరిమి కావాలి. అంతే.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

బాక్స్టర్ ఆఫీసులోని ఒక మ్యానేజరు ముందురోజు చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రిస్మస్ రోజు ఒక అమ్మాయిని తీసుకుని బాక్స్టర్ అపార్ట్మెంటుకి వస్తాడు. బాక్స్టర్ అతన్ని వెళ్ళగొడతాడు కానీ వెళ్ళేముందు ఆ మ్యానేజర్ పడుకుని ఉన్న ఫ్రాన్‌ని చూసేస్తాడు. బాక్స్టర్‌కి, ఫ్రాన్‌కి సంబంధం ఉందని అనుకుంటాడు. మర్నాడు ఫ్రాన్ బావ ఆమెని వెతుక్కుంటూ అఫీసుకి వెళతాడు. బాక్స్టర్ జెఫ్ అనుమతితో ఫ్రాన్‌ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతాడు. బాక్స్టర్ మీద అక్కసుతో మ్యానేజరు ఫ్రాన్ బావకి ఆమె ఎక్కడుందో చెప్పేస్తాడు. ఫ్రాన్ బావ బాక్స్టర్ ఇంటికి వెళతాడు. ఫ్రాన్ తో “నువ్వు మేజర్‌వి. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ఇప్పుడైతే ఇంటికి రా” అంటాడు. బాక్స్టర్‌ని పట్టించుకోడు. కర్మ కొద్దీ అప్పుడే డాక్టర్ వచ్చి ఫ్రాన్ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాడు. ఫ్రాన్ బావకి అనుమానం వస్తుంది. డాక్టర్‌ని బెదిరిస్తే ఫ్రాన్ నిద్రమాత్రలు మింగిందని చెబుతాడు. ఎందుకు అని అడిగితే బాక్స్టర్ “నా వల్లే” అంటాడు. ఫ్రాన్ బావ అతని ముఖం మీద రెండు గుద్దులు గుద్దుతాడు. బాక్స్టర్ కింద పడిపోతాడు. అతను జెఫ్‌ని కాపాడుతున్నాడు కాబట్టి ఫ్రాన్‌కి అతని మీద జాలి పడుతుంది. “నువ్వొక పెద్ద ఫూల్‌వి” అని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆమె ముద్దుని అతను వేరుగా అర్థం చేసుకుంటాడు. తనని ప్రేమిస్తోందని అనుకుంటాడు. దెబ్బలు తగిలినా గాల్లో తేలిపోతూ ఉంటాడు. డాక్టర్ అతని దెబ్బలు చూసి “ఇలాంటిదేదో జరుగుతుందని నీకూ తెలుసు” అంటాడు. డాక్టర్ అనుకున్నట్టు బాక్స్టర్ విచ్చలవిడితనానికి ఆ శాస్తి జరగలేదు. అతను ప్రమోషన్ కోసం తప్పుడు పనులకి పరోక్షంగా సాయపడటం వల్లే జరిగింది. తప్పు చేసినా, తప్పుకి సాయపడినా శిక్ష తప్పదు.

మరో పక్క జెఫ్ తన సెక్రెటరీని ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. ఆమే తన రహస్యాలు ఫ్రాన్‌కి చెప్పిందని అతనికి ఫ్రాన్ చెప్పేసింది. ఆ సెక్రటరీ అక్కసుతో జెఫ్ భార్యని కలిసి ఆమెకి అతని బాగోతమంతా చెబుతుంది. జెఫ్ భార్య జెఫ్‌ని ఇంటి నుంచి పొమ్మంటుంది. బాక్స్టర్ మర్నాడు ఆఫీసుకి వచ్చి తిన్నగా జెఫ్ దగ్గరకి వెళతాడు. అతనితో ఏం మాట్లాడాలో రిహార్సల్ వేసుకుంటాడు. “మీకో శుభవార్త. మీ కష్టాలు తీరిపోయినట్టే. మిస్ క్యూబెలిక్ గురించి మీరు ఆందోళన పడనక్కరలేదు. ఆమెని నేను చూసుకుంటాను” అని చెబుదామనుకుంటాడు. ఫ్రాన్ తనని ప్రేమిస్తోందని అతని భావన. కానీ జెఫ్ బాక్స్టర్‌ని చూడగానే “నీకో శుభవార్త. నీ కష్టాలు తీరిపోయినట్టే. మిస్ క్యూబెలిక్ గురించి నువ్వు ఆందోళన పడనక్కరలేదు. ఆమెని నేను చూసుకుంటాను” అంటాడు. భార్య వదిలేయటంతో అతను ఫ్రాన్‌తో జీవితం గడపాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఎన్నాళ్ళు? మరో అమ్మాయి కంటికి నదురుగా కనపడే దాకా. బాక్స్టర్ అనుకున్న మాటలే జెఫ్ పలకటం స్క్రీన్ ప్లే లో మరో చమక్కు. బాక్స్టర్ బాధపడతాడు కానీ పైకి నవ్వుతూనే ఉంటాడు. అతనికి జెఫ్ మరో ప్రమోషన్ ఇస్తాడు. ఫ్రాన్ బాక్స్టర్‌తో “మీరన్నదే నిజం. జెఫ్ తన భార్యని వదిలేశాడు” అంటుంది. అతను “నేను చెప్పానుగా” అంటాడు.

ఒకరోజు జెఫ్ బాక్స్టర్‌ని అపార్ట్మెంట్ తాళం అడుగుతాడు. బాక్స్టర్ ఇవ్వనంటాడు. ఫ్రాన్ కోసమైతే అస్సలు ఇవ్వనంటాడు. జెఫ్ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తాడు. అతను తానే ఉద్యోగం వదిలి వచ్చేస్తాడు. జెఫ్ ఫ్రాన్‌ని కలిసినపుడు ఇదంతా చెబుతాడు. “ఫ్రాన్ కోసమైతే తాళం అస్సలు ఇవ్వనన్నాడు. నీ మీద అతనికి ఏం కోపం?” అంటాడు. ఫ్రాన్ “నీకర్థం కాదులే” అంటుంది. తన గౌరవాన్ని బాక్స్టర్ కాపాడుతున్నాడని ఆనందపడుతుంది. కానీ కాస్త ఆలోచించేసరికి ఆమెకి అసలు విషయం అర్థమవుతుంది. బాక్స్టర్ తనని ప్రేమిస్తున్నాడని అవగతం అవుతుంది. అలాంటివాడు మళ్ళీ దొరకడని అర్థమవుతుంది. జెఫ్‌ని వదిలి ఆమె బాక్స్టర్ దగ్గరకి వెళుతుంది. కథ సుఖాంతం.

చివరి సన్నివేశం కూడా హృద్యంగా ఉంటుంది. ఆమె అతని ప్రేమలో పడ్డానని చెప్పదు. పేక ఆడదామంటుంది. అతను “జెఫ్ సంగతి ఏమిటి?” అంటాడు. ఆమె “అతనికి ప్రతి క్రిస్మస్‌కి ఫ్రూట్ కేక్ పంపిస్తాను” అంటుంది. మనకి బాక్స్టర్ పాత ప్రేమకథ గుర్తొస్తుంది. రచయితల ప్రతిభకి జోహార్ అనిపిస్తుంది. ఆమె పేక ముక్కలు పంచమని అతనికిస్తుంది. అతను “మిస్ క్యూబెలిక్. మీరంటే నాకెంత ప్రేమో చెప్పలేను” అంటాడు. ఆమె “షటప్ అండ్ డీల్” (నోరు మూసుకుని ముక్కలు వేయండి) అంటుంది. ఈ మాట హాలీవుడ్ సినిమాల్లో గొప్ప ముగింపు వాక్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here