మరుగునపడ్డ మాణిక్యాలు – 96: ద రిమెయిన్స్ ఆఫ్ ద డే

0
2

[సంచిక పాఠకుల కోసం ‘ద రిమెయిన్స్ ఆఫ్ ద డే’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]య[/dropcap]జమాని సమాజానికి అన్యాయం చేస్తే అతని దగ్గర పని చేసే ఉద్యోగులకి యజమాని పాపంలో భాగముంటుందా? ఆ అన్యాయానికి సహకరిస్తే తప్పకుండా ఉంటుంది. అజ్ఞానంతో పరోక్షంగా సహకరిస్తే? ఉద్యోగికి స్వచ్ఛమైన మనసు ఉంటే పాపంలో భాగముండదు అని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ సమాజం అతనికి స్వచ్ఛమైన మనసు ఉందని ఎలా నమ్మాలి? సమాజమెప్పుడూ సంశయలాభం (benefit of doubt) ఇవ్వదు. ఎప్పుడూ తప్పు పట్టాలనే చూస్తుంది. అప్పుడు ఆ ఉద్యోగి తనలో తానే సంఘర్షణ పడాల్సి వస్తుంది. ఈ అంశం ముఖ్యంగా ప్రస్తావిస్తూ ఒక ఉద్యోగి జీవితాన్ని దర్శింపజేసిన చిత్రం ‘ద రిమెయిన్స్ ఆఫ్ ద డే’ (1993). వాచ్యార్థం ‘రోజులో మిగిలిన ఘడియలు’ అని చెప్పుకోవచ్చు. లక్ష్యార్థం ‘జీవితపు శేషం’ అని. చిత్రం పేరుకి మరో అర్థం కూడా ఉంది. అది చెప్తే కథ లోని కీలకాంశం చెప్పేసినట్టవుతుంది కాబట్టి చెప్పటం లేదు. ఈ చిత్రానికి కజువో ఇషిగురో రాసిన నవల ఆధారం. నవలకి 1989లో బుకర్ ప్రైజ్ వచ్చింది. జపాన్‌లో పుట్టినా బ్రిటన్‌లో పెరిగిన ఇషిగురో ఈ నవలని పూర్తిగా బ్రిటిష్ పాత్రలతో హిస్టారికల్ ఫిక్షన్‌గా రాశాడు. ఇషిగురోకి 2017లో నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చింది. ఆ పురస్కారం ఇచ్చినపుడు స్వీడిష్ అకాడమీ “ఇషిగురో ఈ ప్రపంచంతో మనకుండే భ్రమాత్మక బంధం మాటున ఉండే అగాధాన్ని దర్శింపజేస్తూ భావోద్వేగభరితమైన నవలలు రాశారు” అని పేర్కొంది. ‘ద రిమెయిన్స్ ఆఫ్ ద డే’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది.

చిత్రం 1958 ప్రాంతంలో ప్రారంభమై గతంలోకి వెళుతుంది కానీ మనం కథని క్రమంలోనే చెప్పుకుందాం. జేమ్స్ 1930వ దశకంలో ఇంగ్లండ్ లోని డార్లింగ్టన్ హాల్‌లో బట్లరు. వయసు నలభై పైనే ఉంటుంది. బట్లరు అంటే కొంచెం కింది స్థాయి పని అనే అపప్రధ ఉంది కానీ నిజానికి అది యజమానికి ప్రధాన సేవకుడి పాత్ర. గౌరవమైన స్థానం. అతని కింద చాలా మంది పనివాళ్ళు ఉంటారు. జేమ్స్ పూర్తి పేరు జేమ్స్ స్టీవెన్స్. అప్పటి పద్ధతి ప్రకారం అతన్ని యజమాని జేమ్స్ అని పిలవకుండా స్టీవెన్స్ అని పిలుస్తాడు. ఆ యజమాని లార్డ్ డార్లింగ్టన్. పలుకుబడి ఉన్న జమీందారు. స్టీవెన్స్‌కి స్వామిభక్తి ఎక్కువ. తన ఉద్యోగాన్ని చాలా నిబద్ధతతో నిర్వహిస్తాడు. అతనికి ఉద్యోగం తప్ప వేరే ఏమీ ముఖ్యం కాదు. బట్లర్ అనేవాడు చాలా హుందాగా ఉండాలి అని అతని నమ్మకం.

భవనంలో బట్లరు కాకుండా ఒక హౌస్ కీపర్ కూడా ఉంటుంది. యజమానికి, అతని అతిథులకి సేవ చేయటం బట్లరు పని అయితే ఇల్లు చక్కబెట్టటం హౌస్ కీపర్ పని. పనివాళ్ళ మీద ఇద్దరి అజమాయిషీ ఉంటుంది. హౌస్ కీపర్ ఉద్యోగంలో సారా కెంటన్ చేరుతుంది. ఆమెని స్టీవెన్స్ మర్యాదపూర్వకంగా మిస్ కెంటన్ అని పిలుస్తాడు. ఆమెకి హౌస్ కీపర్‌గా మంచి అనుభవం ఉంది. చేరే ముందు అతను ఆమెకి కొన్ని సూచనలు ఇస్తాడు. “మీ కోసం పురుషులెవరూ రాకూడదు. పాత హౌస్ కీపర్ నా కింద పని చేసే సహాయక బట్లరుతో కలిసి పారిపోయింది. సిబ్బందిలో ఇద్దరు పెళ్ళి చేసుకుంటే ఎవరూ అడ్డుపడలేరు కానీ కొందరు తోడు వెతుక్కోవటం కోసమే ఉద్యోగంలో చేరతారు. అది నాకు నచ్చదు. ముఖ్యంగా హౌస్ కీపర్లే ఈ వ్యవహారాల్లో పడతారు. మీరు తప్పుగా అనుకోకండి” అంటాడు. ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది కానీ బయటపడదు. “పర్వాలేదు. సిబ్బందిలోని వారు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే ఇంటి పరిస్థితి ఏమవుతుందో నేను చూశాను” అంటుంది. మొదటి నుంచే స్టీవెన్స్ ఎంత నిక్కచ్చిగా ఉంటాడో ఆమెకి అర్థమవుతుంది. ఆడవారిదే తప్పన్నట్టు స్టీవెన్స్ మాట్లాడటం ఇక్కడ గమనార్హం. తప్పు ఎవరిదైనా ఉండవచ్చు. స్టీవెన్స్ అది గుర్తించకపోవటం వెనక కారణం అతనికి నిగ్రహం ఎక్కువ. స్త్రీలు పురుషుల్ని పెడదారి పట్టిస్తారని అతని భావన. ప్రేమ వ్యవహారాల్లో పడితే తన ఉద్యోగానికి మచ్చ అని అతను అనుకుంటాడు. మరి అతనికి ఒక తోడు కావాలని కోరిక లేదా? అలాంటి కోరికలన్నీ అతను అణచివేశాడు. బట్లరుగా తన విధుల్ని సక్రమంగా చేయాలనే పట్టుదల ఒక కారణమైతే అతని తండ్రి అతనికి నేర్పించిన పద్ధతులు ఒక కారణం.

స్టీవెన్స్ తండ్రి విలియమ్ కూడా యాభై ఏళ్ళకు పైగా బట్లరుగా పని చేశాడు. హుందాతనం పేరుతో కొడుకుని కూడా దూరం దూరంగా ఉంచాడు. ఏమైనా మాట్లాడాలన్నా ఎటువంటి ఉద్వేగం లేకుండా మాట్లాడాలి. అలాంటి వాతావరణంలో పెరిగిన స్టీవెన్స్ భావోద్వేగాలని దాచుకోవటం అలవాటు చేసుకున్నాడు. సహాయక బట్లరు వెళ్ళిపోవటంతో స్టీవెన్స్ తన తండ్రిని ఆ ఉద్యోగంలో పెడతాడు. ఆయన వయసు డెబ్భై ఐదు. ఇదిలా ఉండగా స్టీవెన్స్ సారా చేసే కొన్ని పనులని ఆక్షేపిస్తూ ఉంటాడు. స్త్రీల మీద ఉన్న చులకన భావం అందులో కనిపిస్తూ ఉంటుంది. విలియమ్ వయోభారంతో పనిలో తప్పులు చేస్తుంటే సారా స్టీవెన్స్‌కి ఎత్తిచూపిస్తూ ఉంటుంది. స్టీవెన్స్ ఆమె మాటలని పట్టించుకోడు. అందరూ సక్రమంగా పని చేయాలని పట్టుబట్టే స్టీవెన్స్ తన తండ్రి విషయంలో మాత్రం చూసీ చూడనట్టు ఉండటం ఆమెకి నచ్చదు. ఆమె ఉద్దేశం ఏమిటంటే ఆయన్ని ఆ వయసులో పని చేయమనటం కన్నా విశ్రాంతి ఇస్తే మంచిదని, లేకపోతే ఎప్పుడో పెద్ద తప్పు చేస్తే పర్యవసానం తీవ్రంగా ఉండొచ్చని. డార్లింగ్టన్ హాల్లో ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పులు జరగకుండా చూసుకోవాలని సారా ఉద్దేశం. కానీ స్టీవెన్స్ ఆమె మాటల్ని పెడచెవిన పెడతాడు. తన తండ్రి తప్పుల్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ పురుషాహంకారం కనిపిస్తుంది. ఒకరోజు విలియమ్ ఇంటి ఆవరణలో కూర్చున్న అతిథుల కోసం టీ తీసుకువెళుతుంటే రాతి చప్టా అంచు కాలికి తగిలి తూలిపడతాడు. లార్డ్ డార్లింగ్టన్ అది చూసి పరుగెత్తుకు వస్తాడు. డాక్టరుకి చూపించమని స్టీవెన్స్‌కి చెబుతాడు. తర్వాత స్టీవెన్స్‌ని పిలిచి విలియమ్ చేయాల్సిన విధులని మార్చమని కోరతాడు. సారా చెప్పిప్పుడు వినని స్టీవెన్స్ లార్డ్ డార్లింగ్టన్ చెప్పగానే ఒప్పుకుంటాడు. యజమాని మీద అతనికి అంత గురి. విలియమ్‌ని తలుపులు, వస్తువులు తుడిచే పనికి నియోగిస్తాడు. విలియమ్‌కి ఇది అవమానంగా ఉంటుంది కానీ ఉక్రోషంగానే ఒప్పుకుంటాడు.

ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఒక ముఖ్య అంతర్జాతీయ సమావేశానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. జర్మనీని హిట్లర్ పాలిస్తూ ఉంటాడు. అతనొక నియంత. నాజీ పాలన నడుస్తూ ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీతో ఇతర దేశాల కూటమి ఒక ఒప్పందం (Treaty of Versailles) చేసుకుంది. ఆ ఒప్పందం వల్ల జర్మనీకి అన్యాయం జరిగిందని లార్డ్ డార్లింగ్టన్ అభిప్రాయం. దాని వల్ల ఆర్థికంగా వారు వెనకబడ్డారని అంటాడు. హిట్లర్ నియంతృత్వ పోకడలని ఉపేక్షిస్తాడు. జర్మనీతో మైత్రి పెంచుకోవటానికి అన్ని దేశాల ప్రతినిధులని ఒక సమావేశానికి ఆహ్వానిస్తాడు. ఫ్రాన్స్, అమెరికా మొదలైన దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. జర్మనీకి జరిగిన అన్యాయం గురించి లార్డ్ డార్లింగ్టన్ స్టీవెన్స్‌కి చెబుతాడు. స్టీవెన్స్‌కి సొంత అభిప్రాయాలు లేవు. యజమాని ఏది చెబితే అదే వేదం. అయితే పాత్రికేయుడైన రెజినల్డ్ కార్డినల్ మాత్రం జర్మనీ ప్రమాదకరమైన దేశమని అంటాడు. అతను లార్డ్ డార్లింగ్టన్ స్నేహితుడి కొడుకు. లార్డ్ డార్లింగ్టన్ అతన్ని కొడుకు లాగా చూసుకుంటాడు. అయినా అతని మాట వినడు. ఇవన్నీ అంతర్జాతీయ సమావేశాల ముందు జరిగే అనేక చిన్న సమావేశాలలో జరుగే పరిణామాలు.

అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభమవుతాయి. భవనమంతా కోలాహలంగా మారుతుంది. అమెరికా ప్రతినిధి జాక్ లూయిస్ ఒకరోజు ముందే వస్తాడు. ఇది అమెరికా మీద వ్యంగ్యం. తన ఆధిక్యం చూపించటానికి ముందే ప్రతినిధిని పంపించింది. సమయానికి రావటం మర్యాద. ముందు వచ్చినా, ఆలస్యంగా వచ్చినా ఆతిథ్యం ఇచ్చేవారికి ఇబ్బందే. లూయిస్‌కి జర్మనీని సమర్థించటం ఇష్టం ఉండదు. ఐరోపాలోని చాలా దేశాలు జర్మనీకి మద్దతుగా మాట్లాడతాయి. లూయిస్ కలవరపడతాడు. ఫ్రెంచ్ ప్రతినిధితో విడిగా మాట్లాడతాడు. జర్మనీని నిరోధించటానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అంటాడు. ఆ ఫ్రెంచ్ ప్రతినిధి మొదట జర్మనీకి వ్యతిరేకి. కానీ సమావేశంలో ఇతర దేశాల అభిప్రాయం విని మనసు మార్చుకుంటాడు. పైగా అతను కాలి మీద బొబ్బలతో బాధపడుతుంటాడు. కాబట్టి సమావేశం మీద దృష్టి పెట్టడు. సమావేశం మధ్యలో బయటకి వచ్చి కాళ్ళని ఉప్పు వేసిన వెచ్చని నీటిలో పెట్టుకుని ఉపశమనం పొందుతాడు. ఇలాంటి చిన్న సంఘటనలే ఒక్కోసారి చరిత్ర గతిని మార్చేస్తాయి.

లార్డ్ డార్లింగ్టన్ మనసులో దురుద్దేశం ఏమీ లేదు. కాకపోతే అతను జర్మనీ ఉద్దేశాలని సరిగా అంచనా వేయలేకపోయాడు. అతిగా ఔదార్యం చూపించటం కూడా మంచిది కాదు. భారతదేశ చరిత్రలో కూడా ఇది కనిపిస్తుంది. అతి ఔదార్యం వల్ల పాకిస్తాన్ ఇప్పుడు పక్కలో బల్లెంలా తయారయింది. స్టీవెన్స్‌కి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. కానీ సొంతంగా విషయాలు తెలుసుకోవటం మానేసి అతను యజమానిని గుడ్డిగా నమ్మాడు. బట్లరు కూడా దేశపౌరుడే. ఓటు హక్కు ఉంటుంది. పార్టీల  విధానాలేమిటో తెలుసుకుని ఓటు వేయాలి. నా యజమాని ఏం చెబితే అదే వేదం అనటం సబబు కాదు. ఒక బట్లరు అంతకంటే ఏం చేస్తాడు అనవచ్చు. బట్లరు సలహాలు కూడా ఇవ్వవచ్చు. పెద్ద విషయాలలో కాకపోయినా చిన్న విషయాలలో విభేదించవచ్చు. అలాంటి ఒక సందర్భం తర్వాత వస్తుంది. 2019లో వచ్చిన ‘జోజో ర్యాబిట్’ (ఈ చిత్రాన్ని కూడా ఈ శీర్షికలో విశ్లేషించటం జరిగింది) చిత్రంలో ఒక పదేళ్ళ జర్మన్ పిల్లవాడు గుడ్డిగా హిట్లర్‌ని ఆరాధిస్తాడు. జర్మనీ చేస్తున్న యుద్ధాన్ని సమర్థిస్తాడు. అతను పిల్లవాడు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. లార్డ్ డార్లింగ్టన్ లాంటి వారు వివేకాన్ని ఉపయోగించకుండా హిట్లర్‌ని సమర్ధించారు. స్టీవెన్స్ లాంటివారు గొర్రెల్లాగా వారి వెంట నడిచారు. పెద్దలు కూడా ఒక్కోసారి ఎంత అవివేకంతో ఉంటారో ఈ చిత్రం చూపిస్తుంది.

స్టీవెన్స్ వ్యక్తిగతంగా కూడా తప్పులు చేశాడు. ఇది చిత్రం మొదట్లోనే తెలుస్తుంది. సారా అతన్ని ప్రేమించింది. కానీ అతను దూరంగా ఉన్నాడు. ఇష్టం లేకపోతే వేరే విషయం. కానీ అతడు తన ఇష్టాన్ని అణచివేశాడు. ఇరవై ఏళ్ళ తర్వాత అతను సారాని కలుసుకోవటానికి వెళతాడు. ఆమెతో మిగిలిన జీవితం పంచుకోవాలని ఆశ. దారిలో అతనికి ఎందరో తారసపడతారు. వారికి తాను డార్లింగ్టన్ హాల్లో పని చేస్తానని చెబుతాడు. అప్పటికి డార్లింగ్టన్ మరణించాడు. డార్లింగ్టన్ హాల్‌ని లూయిస్ కొనుగోలు చేశాడు! స్టీవెన్స్ అతని దగ్గర పని చేస్తున్నాడు. డార్లింగ్టన్ హాల్ పేరు వినగానే కొందరు “లార్డ్ డార్లింగ్టన్ వల్లే కదా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది” అంటారు. స్టీవెన్స్ అపరాధభావంతో “ఆయన నాకు తెలియదండీ. నాకు లూయిస్ గారు మాత్రమే తెలుసు” అని అబద్ధం చెబుతాడు! అంకితభావంతో సేవ చేసిన యజమాని తెలియదని చెప్పాల్సి రావటం ఎంత దీనమైన పరిస్థితి! స్టీవెన్స్ మనసు ఎంత క్షోభ పడిందో! అయినా స్టీవెన్స్ ‘నాకు రాజకీయాలు తెలియవండీ. నేను ఆయనకి సేవ చేశాను అంతే’ అని చెప్పవచ్చు కదా? అది ఒకరకంగా నిజమే కదా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదనే విషయం చిత్రంలో తర్వాత తెలుస్తుంది. చిత్రంలో ఇంకో విషయం ఏమిటంటే సారా చాలా ఉదాత్తమైన పాత్ర అనిపిస్తుంది కానీ ఆమె కూడా స్వార్థం చూపిస్తుంది. నాయికానాయకులను మచ్చలేని వారుగా చూపించే చిత్రాల మధ్యలో ఇలా వారి లోపాలని చూపించటం వలన ఈ చిత్రంలో ఎంతో నిజాయితీ కనిపిస్తుంది.

చిత్రంలో అక్కడక్కడా హాస్యం కూడా ఆహ్లాదం కలిగిస్తుంది. ముఖ్యంగా సారా, స్టీవెన్స్ మధ్య వాగ్వాదం జరుగుతున్నపుడు హాస్యం తొంగిచూస్తుంది. ఒకసారి విలియమ్ మెట్లు ఊడుస్తూ ఆరోగ్యం బాగాలేక చీపురు, చేట అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళిపోతాడు. సారా అది చూసి కావాలనే స్టీవెన్స్ దగ్గరకి వెళ్ళి “మీ చేట మెట్ల మీద ఉంది” అంటుంది. “నేనక్కడ పెట్టలేదే” అంటాడతను. “అయితే నాదే తప్పు. ఎన్నో తప్పుల్లో ఇదొకటి” అంటుంది వ్యంగ్యంగా. స్టీవెన్స్ ఎప్పుడూ తన పనిలో తప్పులు వెతుకుతాడని ఆమె భావం. మరో సన్నివేశంలో లార్డ్ డార్లింగ్టన్ తన స్నేహితుడి కొడుకైన రెజినల్డ్ (పాత్రికేయుడు) పెళ్ళి చేసుకోబోతున్నాడని, అతనికి శృంగారం గురించి అవగాహన కల్పించమని స్టీవెన్స్‌ని కోరతాడు. స్టీవెన్స్ ప్రయత్నిస్తాడు కానీ రెజినల్డ్‌కి ఎలా చెప్పాలో తెలియక తికమక పడతాడు. ఇదంతా హాస్యస్ఫోరకంగా ఉంటుంది. నిజానికి స్టీవెన్స్ కన్నా రెజినల్డ్‌కే శృంగారం గురించి ఎక్కువ తెలిసి ఉండవచ్చు!

ఈ చిత్రాన్ని జాన్ క్యాలీ, మైక్ నికొల్స్, ఇస్మాయిల్ మర్చెంట్ నిర్మించగా జేమ్స్ ఐవరీ దర్శకత్వం వహించాడు. స్క్రీన్ ప్లే రూత్ ప్రవర్ జబ్వాలా అందించింది. వీరందరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. స్టీవెన్స్‌గా ఆంథనీ హాప్కిన్స్, సారాగా ఎమ్మా థాంప్సన్, లార్డ్ డార్లింగ్టన్‌గా జేమ్స్ ఫాక్స్ నటించారు. హాప్కిన్స్‌కి ఉత్తమ నటుడి విభాగంలో, థాంప్సన్ కి ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. ఈ చిత్రం 1993లో విడుదలయింది. 1991లో విడుదలైన ‘ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్’ చిత్రానికి హాప్కిన్స్‌కి ఉత్తమ నటుడి ఆస్కార్, 1992లో విడుదలైన ‘హవర్డ్స్ ఎండ్’ చిత్రానికి థాంప్సన్‌కి ఉత్తమ నటి ఆస్కార్ అప్పటికే వచ్చాయి. ఈ చిత్రానికి కళాదర్శకత్వానికి, దుస్తులకి, సంగీతానికి కూడా నామినేషన్లు వచ్చాయి. అయితే అవార్డులేమీ దక్కలేదు. లుసియానా అరీగీ, ఇయన్ విటేకర్ చేసిన కళాదర్శకత్వం అద్భుతంగా ఉంటుంది. లార్డ్ డార్లింగ్టన్ భవనంలో ఉండే వస్తువులు, కళాకృతులు అబ్బురపరుస్తాయి. గ్రంథాలయం, భోజనశాల నుండి అతిథులు వేచి ఉండే గది వరకు అన్నిటా ఐశ్వర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. పెద్ద తెర ఉన్న టీవీ ఉంటే ఆ కళాదర్శకత్వాన్ని పూర్తిగా అస్వాదించవచ్చు. దినపత్రికని ఇస్త్రీ చేసి జమీందారుకి ఇవ్వటం వంటివి చూసి అప్పట్లో జమీందారులు ఎంత విలాసంగా బతికేవారో అనిపిస్తుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

సారాని కలుసుకోవటం కోసం స్టీవెన్స్ 1958లో చేసే ప్రయాణంలో ఒక చోట బస చేస్తాడు. అది ఒక సైనికుడి గది. ఆ సైనికుడు యుద్ధంలో మరణించాడు. అతని తండ్రి స్టీవెన్స్‌కి గది చూపిస్తూ “ప్రజాస్వామ్యం కోసమే మనం హిట్లర్‌తో పోరాడాం. మా అబ్బాయి కూడా పోరాడి మరణించాడు” అంటాడు. స్టీవెన్స్‌కి యుద్ధం ఎంతటి విధ్వంసం సృష్టించిందో అప్పుడు కొద్దికొద్దిగా తెలియటం మొదలవుతుంది. అతని ప్రపంచం నుంచి విడివడి డార్లింగ్టన్ హాల్లో హాయిగా ఉన్నాడు. యుద్ధం ప్రపంచం రూపురేఖల్ని మార్చేసింది. అది అతనికి అర్థమై అందులో తన పాత్ర ఉందా అని ఆలోచించటం మొదలుపెడతాడు. అందరి జీవితాల్లో ఇలాంటి పశ్చాత్తాపాలు ఉంటాయి. ప్రాయశ్చిత్తం చేసుకుంటే నిష్కృతి ఉంటుంది.

యుద్ధానికి ముందు డార్లింగ్టన్ హాల్లో జరిగిన అంతర్జాతీయ సమావేశాల సమయంలో విలియమ్ మరణిస్తాడు. చనిపోయే ముందు కూడా అతను స్టీవెన్స్‌తో “వెళ్ళి నీ విధులు నువ్వు నిర్వర్తించు” అంటాడు. స్టీవెన్స్ అతిథులకి భోజనం వడ్డించే పనిలో ఉన్నప్పుడే సారా అతన్ని బయటకి పిలిపించి అతని తండ్రి చనిపోయిన వార్త చెబుతుంది. అయినా అతను వెంటనే వెళ్ళడు. భోజనాల తర్వాత వినోద కార్యక్రమం ఉంటుంది. అప్పుడు కూడా స్టీవెన్స్ మద్యం అందిస్తూ ఉండిపోతాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత తండ్రిని చూడటానికి వెళతాడు.

కొంతకాలానికి ఇద్దరు జర్మన్ యువతులు డార్లింగ్టన్ హాల్లో పని చేయటానికి వస్తారు. వారు యూదులు. హిట్లర్‌కి యూదులంటే ద్వేషం. హిట్లర్ యూదులతో పాటు కొన్ని జాతులకి చెందినవారిని బంధిస్తున్నాడు. అందుకే ఆ యూదు యువతులు పారిపోయి బ్రిటన్ వచ్చారు. లార్డ్ డార్లింగ్టన్‌తో పాటు కొందరు మేధావులు యూదుల అణచివేతని సమర్థిస్తారు. యూదులకి క్రీస్తు అంటే గిట్టదని, ఇదే వారిని ఐరోపా వాసుల నుంచి వేరు చేస్తుందని జరిగే ప్రచారాన్ని లార్డ్ డార్లింగ్టన్ నమ్ముతాడు. స్టీవెన్స్‌ని పిలిచి యూదు యువతుల్ని పనిలో నుంచి తొలగించమంటాడు. “నా అతిథుల భద్రత గురించి నేను ఆలోచించాలి కదా” అంటాడు. అంటే జర్మనీ సానుభూతిపరులకి యూదుల వల్ల అపకారం జరగవచ్చని అతని ఉద్దేశం. స్టీవెన్స్ “వారు బాగా పని చేస్తారు. మర్యాదగా ఉంటారు. శుభ్రంగా ఉంటారు” అంటాడు. “అది ముఖ్యం కాదు. వారు యూదులు” అంటాడు లార్డ్ డార్లింగ్టన్. స్టీవెన్స్ మారుమాటాడకుండా “చిత్తం” అని వచ్చేస్తాడు. అతనికి అది తప్పని తెలుసు. అయినా ప్రతిఘటించడు. ఇలాంటి వివక్షని చూసీ చూడనట్టు వదిలేయటం తప్పు. స్టీవెన్స్ యజమానిని ఒప్పించటానికి ప్రయత్నించి ఉండొచ్చు. బట్లర్లు సలహాదారులుగా కూడా మెలగవచ్చు. విన్నా వినకపోయినా చెప్పటం కర్తవ్యం. మతం ముఖ్యం కాదని, గుణాన్ని చూడాలని చెప్పవచ్చు. బలహీనులను కాపాడటం బలవంతుల కర్తవ్యం. స్టీవెన్స్ ‘నా యజమాని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అని సరిపెట్టుకున్నాడు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించపోవటం తప్పులో భాగం పంచుకోవటమే.

యూదు యువతుల్ని తొలగిస్తే తాను కూడా వెళ్ళిపోతానని సారా స్టీవెన్స్‌తో అంటుంది. “వారిని తొలగిస్తే వారిని తిరిగి జర్మనీ పంపేస్తారు. తెలిసి తెలిసీ ఈ పాపం చేయవద్దు” అంటుంది. స్టీవెన్స్ తన చేతుల్లో ఏమీ లేదని అంటాడు. చివరికి యూదు యువతుల్ని తొలగిస్తారు. అయినా సారా ఉద్యోగం విడిచి వెళ్ళదు. కొన్నాళ్ళ తర్వాత స్టీవెన్స్ ఒక పనిమనిషిని చేర్చుకునే విషయంలో సారాతో విభేదిస్తూ “నాకు ఆమె నచ్చలేదు. మీకు ఆమే కావాలంటున్నారు. ఆమె బాధ్యత మీరే తీసుకోవాలి. అవునూ, మీరు యూదు యువతుల్ని తొలగించినపుడు వెళ్ళిపోతానన్నారుగా?” అంటాడు. సారా “నాకు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేనొక పిరికిదాన్ని. బయటకి వెళితే ఒంటరినైపోతానని నా భయం. నా ఆదర్శాలు ఆ భయం ముందు తూగలేవు. నా మీద నాకే అసహ్యంగా ఉంది” అంటుంది. ఇక్కడ ఆంథనీ హాప్కిన్స్ నటన అద్భుతంగా ఉంటుంది. ఆమెకి తన తప్పుని ఒప్పుకునే సాహసం ఉంది. అతనికి అది కూడా లేదు. ఆమె తన మాటని కాదంటున్నదనే అక్కసుతో ఆమెని ‘వెళ్ళిపోతానన్నావుగా’ అని ఎద్దేవా చేశాడు. ఆమె సంకోచం లేకుండా తన తప్పు ఒప్పుకుంది. అది చూసి అతనికి సిగ్గు కలుగుతుంది. ఈ భావాలన్నీ హాప్కిన్స్ ముఖంలో పలుకుతాయి. అతను ఎంత గొప్ప నటుడో అర్థమవుతుంది. “మీరు ఈ ఇంటికి చాలా అవసరం” అని మాట మారుస్తాడు. స్టీవెన్స్ తన భావాలని పైకి చెప్పడు. సారా పైకి చెబుతుంది, కానీ చర్య తీసుకునే సమయానికి వెనకడుగు వేస్తుంది. అంతిమంగా ఇద్దరికీ పెద్ద తేడా లేదు.

ఒక సంవత్సరం గడిచేసరికి లార్డ్ డార్లింగ్టన్‌లో మార్పు వస్తుంది. జర్మనీలో యూదులపై జరిగే దమనకాండ తప్పనే అవగాహనకి వస్తాడు. ఒకరోజు స్టీవెన్స్‌తో “ఆ యూదు యువతుల్ని తీసేయటం తప్పు. వారు ఎక్కడున్నారో కనుక్కో. మళ్ళీ పని లోకి తీసుకుందాం” అంటాడు. స్టీవెన్స్ సారా దగ్గరకి వెళ్ళి “ఆ యువతుల్ని తీసేయటం తప్పని రాజావారు అన్నారు. మీరప్పుడు నాలాగే చాలా బాధపడ్దారని నాకు గుర్తుంది” అంటాడు. సారా వెంటనే “మీరు బాధపడ్డారా?” అని ఆశ్చర్యపోతుంది. అవునంటాడు స్టీవెన్స్. “మరెందుకు చెప్పలేదు? ఎప్పుడూ మీ భావాలని దాచుకుంటారెందుకు?” అంటుంది సారా. అతని స్వభావం ఆమెకి పూర్తిగా అర్థమవుతుంది. బయటకి కఠినంగా కనిపించినా అతను మనసు సున్నితమని అర్థమవుతుంది. ఒకరోజు అతను ఒక రొమాంటిక్ నవల చదువుతూ ఆమెకి దొరికిపోతాడు. అతను “భాష మెరుగుపరచుకోవటానికి చదువుతున్నాను” అని తప్పించుకుంటాడు. ఆమె అతన్ని ప్రేమించటం మొదలుపెడుతుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

స్టీవెన్స్ పనిలో చేర్చుకోవటానికి ఇష్టపడని అమ్మాయి బాగా పని చేస్తుండటంతో స్టీవెన్స్ సారాని మెచ్చుకుంటాడు. కానీ ఆ అమ్మాయి వేరే పనివాడి ప్రేమలో పడి అతనితో వెళ్ళిపోతుంది. అప్పుడు సారా స్టీవెన్స్ ఆమెని సరిగ్గా అంచనా వేశాడని అనుకుంటుంది. ఆమెలో ఒకరకమైన ఉక్రోషం కూడా కలుగుతుంది. ఇదిలా ఉండగా సారాకి ఇంతకు ముందు కలిసి పని చేసిన టామ్ అనే మరో బట్లర్ మళ్ళీ తారసపడతాడు. అతను ఒక సమావేశానికి తన యజమానితో డార్లింగ్టన్ హాల్‌కి వస్తాడు. స్టీవెన్స్‌కి తన ఉద్యోగమే ప్రపంచమని తెలిసి సారా టామ్‌కి దగ్గరవుతుంది. తన సెలవు రోజున బయటకి వెళ్ళి అతన్ని కలుసుకుంటూ ఉంటుంది. అయితే వారు హద్దులు దాటరు. కొన్నాళ్ళకి టామ్ ఆమె ముందు పెళ్ళి ప్రస్తావన తెస్తాడు. ఆమె ఆలోచనలో పడుతుంది. తాను టామ్‌ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని సారా స్టీవెన్స్ కి చెబుతుంది. అతను నిర్లిప్తంగా ఉండిపోతాడు. ఆమె హతాశురాలవుతుంది.

చివరికి సారా టామ్‌తో పెళ్ళికి సిద్ధమవుతుంది. ఒక రాత్రి టామ్‌ని కలిసి వచ్చి స్టీవెన్స్‌కి తన నిర్ణయం చెబుతుంది. అదే రాత్రి బ్రిటన్ ప్రధానమంత్రి, జర్మన్ రాయబారి మధ్య సమావేశం డార్లింగ్టన్ హాల్‌లో జరుగుతుంది. అనుకోకుండా రెజినల్డ్ (పాత్రికేయుడు) అదే సమయంలో వస్తాడు. అతను తన స్నేహితుడి కొడుకు కాబట్టి లార్డ్ డార్లింగ్టన్ అతనికి ఆతిథ్యం ఇస్తాడు కానీ అతనికి సమావేశం విషయాలు చెప్పడు. నిజానికి ఈ సమావేశం జరుతోందనే వదంతులు వినే రెజినల్డ్ వచ్చాడు. బ్రిటన్ ప్రధానమంత్రి జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకుంటాడు. షరతులు మాత్రం జర్మనీ వారే విధిస్తారు. జర్మన్లు లార్డ్ డార్లింగ్టన్‌ని పావుగా వాడుకుంటున్నారని రెజినల్డ్ స్టీవెన్స్‌తో అంటాడు. “మీరైనా ఆయనకి చెప్పొచ్చు కదా” అంటాడు. స్టీవెన్స్ సారా పెళ్ళి చేసుకోబోతోందని తెలిసి కలవరంలో ఉంటాడు. “నేను రాజావారిని పూర్తిగా నమ్ముతున్నాను” అంటాడు. కానీ అతనికి లార్డ్ డార్లింగ్టన్ చిక్కుల్లో పడుతున్నాడని అర్థమవుతుంది. అందుకని అతనికి తోడుగా ఉండటానికి సారాని వదులుకుంటాడు. ఆమె మళ్ళీ పలకరిస్తే “ఉబుసుపోని కబుర్లకి నాకు సమయం లేదు” అంటాడు. ఆమె తన గదిలోకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అతను ఆమె గదిలోకి వెళతాడు కానీ అతనికి అనునయ వాక్యాలు చెప్పటం తెలియదు. ఏదో పని గురించి చెప్పి వచ్చేస్తాడు. కొన్నాళ్ళకి సారా వెళ్ళిపోతుంది. టామ్‌ని పెళ్ళి చేసుకుంటుంది.

తర్వాత యుద్ధం వస్తుంది. ఒక దినపత్రిక లార్డ్ డార్లింగ్టన్ జర్మనీకి మద్దతుగా ఉన్నాడని దూషిస్తూ వ్యాసాలు రాస్తుంది. యుద్ధం ముగిశాక అతను ఆ దినపత్రిక మీద పరువు నష్టం దావా వేస్తాడు. కానీ ఓడిపోతాడు. అందరూ అతన్ని దేశద్రోహి అంటారు. రెజినల్డ్ యుద్ధంలో మరణించటంతో అతన్ని పలకరించేవారు కూడా ఉండరు. చివరికి మనోవ్యథతో అతను మరణిస్తాడు. స్టీవెన్స్ ఇదంతా చూస్తాడు. డార్లింగ్టన్ హాల్‌ని లూయిస్ కొనుగోలు చేస్తాడు. స్టీవెన్స్ అతని కింద పని చేస్తాడు. హౌస్ కీపర్ అవసరం రావటంతో ఇరవై ఏళ్ళ తర్వాత సారాకి ఉత్తరం రాస్తాడు. ఆమెని కలుసుకోవటానికి వెళతాడు. ఆమె భర్తకి దూరంగా ఉంటోంది. స్టీవెన్స్‌ని కలుసుకునే రోజునే ఆమెకి తన కూతురు గర్భవతి అని తెలుస్తుంది. విధివిలాసం ఇలాగే ఉంటుంది.

ఇద్దరూ కలుసుకుంటారు. “మా అమ్మాయి గర్భవతి. ఆమెకి దగ్గరగా ఉండాలి. నేను అంత దూరం రాలేను” అంటుందామె. స్టీవెన్స్ నిరాశపడినా ఆమె నిర్ణయాన్ని సమర్ధిస్తాడు. తర్వాత ఇద్దరూ వ్యాహ్యాళికి వెళతారు. సారా “మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే నేను ఉద్యోగం వదిలేశాను. నిజానికి పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి చేసుకుంటానని అనుకోలేదు. చాన్నాళ్ళు బాధపడుతూ గడిపాను. తర్వాత మా అమ్మాయి పుట్టింది” అంటుంది. అప్పుడే చీకటి పడుతుండటంతో వీధి దీపాలు వేస్తారు. అక్కడ ఉన్నవారంతా సంతోషంగా కేరింతలు కొడతారు. “సాయంత్రం రోజులోని ఉత్తమ సమయమని అలా కేరింతలు కొడతారు” అంటుంది సారా. ఎంత వింత! రోజులో మలిసంజ ఆనందంగా గడిపే సమయం. జీవితంలో మలిసంజ భారంగా గడిపే సమయం. స్టీవెన్స్ తన జీవితపు మలిసంజ గురించి ఆలోచనలో పడతాడు. చివరికి ఆమె బస్సెక్కి వెళ్ళిపోతుంది. కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అతను తిరిగి డార్లింగ్టన్ హాల్‌కి వస్తాడు. అక్కడే తన శేషజీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. అతనికి అంత కంటే ఏమీ తెలియదు.

డార్లింగ్టన్ హాల్లో ముఖ్యమైన ఘట్టాలు జరిగినపుడు స్టీవెన్స్ జీవితంలో కూడా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. అంతర్జాతీయ సమావేశాల సమయంలో అతని తండ్రి మరణిస్తాడు. అతను దుఃఖాన్ని అణచుకుంటాడు. భోజనాల సమయంలో లూయిస్ జర్మనీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. స్టీవెన్స్ అదంతా అవగాహన చేసుకునే స్థితిలో ఉండడు. అలాగే శాంతి ఒప్పందం సమావేశం జరుతున్నప్పుడు సారా తన పెళ్ళి విషయం చెబుతుంది. స్టీవెన్స్ ఆ ఆలోచనలో ఉండి రెజినల్డ్ ‘రాజావారిని పావులా వాడుకుంటున్నారు’ అని చెప్పినా పట్టించుకోడు. జీవితంలో ఇలాంటి క్లిష్ట సమయాలు అందరికీ వస్తాయి. బుద్ధిః కర్మానుసారిణీ కాబట్టి ఒక్కోసారి బుద్ధి తప్పు తోవనే ఎంచుకుంటుంది. స్టీవెన్స్ సారాని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ అపరిమితమైన సామిభక్తికి అతను తన జీవితాన్నే పణంగా పెట్టాడు. చివరికి ఒంటరిగా మిగిలాడు. తప్పుదారిలో పోతున్న యజమానిని తెలిసి కూడా వదలనందుకు అది అతని శిక్ష. భీష్ముడు స్వామిభక్తితో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ధృతరాష్ట్రుడి మౌనం కారణంగా తానూ మౌనంగా ఉండిపోయాడు. కనీసం సభని విడిచి వెళ్ళలేదు. భీష్ముడు అన్యాయాన్ని చూస్తూ ఊరుకున్నాడని చెప్పి కృష్ణుడు యుద్ధంలో శిఖండి చాటుగా అర్జునుడి చేత బాణాలు వేయించి చంపించాడు. అది భీష్ముడి శిక్ష. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచానికి వస్త్రాపహరణం లాంటిది. అందులో తమ పాత్రలకి లార్డ్ డార్లింగ్టన్, స్టీవెన్స్ ఇద్దరూ శిక్ష అనుభవించారు. ఇంతకీ ‘ద రిమెయిన్స్ ఆఫ్ ద డే’ కి మరో అర్థం.. ‘రిమెయిన్స్’ అంటే ‘శరీర అవశేషాలు’ అనే అర్థం ఉంది. లార్డ్ డార్లింగ్టన్ మరణించటం చిత్రంలో కీలక ఘట్టం. చిత్రం పేరు దానిని కూడా సూచిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here