మసకేసిన మనసు

0
2

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘మసకేసిన మనసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“నా[/dropcap]కిప్పుడే పెళ్లి సంబంధమూ వద్దు. ఎందుకంటున్నానంటే నేను పని చేసే ‘మెటా’ సంస్థలో నా ఉద్యోగం పోయింది. మీరు బాధపడతారని మీకు చెప్పలేదు. ఉద్యోగంలో నుంచి తీసేసేటప్పుడు ఓ నాలుగు నెలల జీతం ఇచ్చి బయటకు పంపారు. ఆ డబ్బుతో ఇన్నాళ్లూ గడిపాను. ఇప్పుడు పెట్రోలు బంకులో చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. అమెరికాలో ఖర్చులు ఎక్కువ. మరలా నాకు సరైన ఉద్యోగం వచ్చివరకూ, పెళ్లి గిళ్లీ ఏం వద్దు. మరలా ఇక్కడ లాక్‌డౌన్ పెట్టే సూచనలున్నాయి. ఎలా గడపాలా అని హైరానా పడుతున్నాను. ఎందుకంటే. మరి కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు చేసేవాళ్లను తీసేస్తున్నారు. ఇండియాలోని వారి బ్రాంచుల్లో పనిచేసేవాళ్లకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. చూద్దాం. నా గురించి అమ్మా మీరూ ఏం ఆదుర్దా పడవద్దు, వుంటాను.”

“ఒక్క నిముషం నన్ను మాట్లాడనీ సురేష్! నీ మాటలు వినగానే నాకు, చాలా నిరుత్సాహం వచ్చింది. ఈ పరిస్థితిలో అమెరికాలో చాలా ఇబ్బంది పడతావురా. ఏం చెప్పాలో తోచటం లేదు.”

“ఏం చెప్తాం నాన్నా? అందులో ఈ మధ్య నాకు వైరల్ ఫీవర్ లాగా వచ్చింది. తగ్గటం లేదు. కరోనా తగులుకుందేమోనని భయంగా వున్నది. మెటా సంస్థ వాళ్లు వైద్యం కోసం ఇచ్చిన భీమా సౌకర్యం గడువు కూడా దాటి పోయింది. ఇప్పటి వరకూ సంపాదించినది కాస్తా నా ఖర్చులకు లోన్లు కట్టటానికే సరిపోయింది. నాకూ అగమ్యగోచరం గానే వున్నది.”

“ఎన్ని ఇబ్బందులు పడతావోరా? నీకు దగ్గరలో మన ఊరి వాళ్లే వుంటున్నారు. ముఖ్యంగా మా అన్నయ్య కూతురుంటున్నది. వాళ్ల పని ఇప్పుడు బాగానే వున్నది. అవసరమైతే వాళ్ల దగ్గరకు వెళతావా? ఆరోగ్యం జాగ్రత, హాస్పిటల్ కెళ్లి చూపిoచుకో.”

“నీరసంగా వుండి ఎక్కువగా మాట్లాడాలని లేదు. కాని రెండు మాటలు. మన ఊరి వాళ్లు ఎవరైనా పనిమీద హైద్రాబాద్ వచ్చి బజార్లో కనపడినప్పుడు మీరెవరితోనైనా ఆప్యాయంగా మాట్లాడారా? ఇంటికొకసారి రమ్మని పిలిచేవారా? ఇక పెదనాన్న గారమ్మాయి శిరీష అక్క సంగతి కొస్తే తను చాలా మంచిది. పెదనాన్నా, పెద్దమ్మ, నాయనమ్మా అంతా మనమంటే చాలా ప్రేమగా వుంటారు. మీరు మాత్రం ఏ ప్రేమ, ఏ బాధ్యతా లేనట్లుగానే వుంటారు. అక్కా వాళ్ళు పెళ్లైన కొత్తల్లో హైద్రాబాద్ లోనే వుండేవాళ్లు. అప్పుడు బావగారు కొద్ది జీతంతో ఏదో ప్రైవేట్ కంపెనీలోనూ, అక్క కూడా చిన్న స్కూల్లో పనిచేసేవారని గుర్తు. వాళ్ల పరిస్థితి బాగా తక్కువగా వుందని అమ్మా మీరనుకోవటం నాకు బాగా గుర్తుంది. ఆ పరిస్థితిలో కూడా మీరు వాళ్లను ఏ మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఏ పండగ పూటైనా ఇంటికి కూడా పిలిచే వాళ్లు కాదు. ఆ తర్వాత బావగారు బాగా కష్టపడ్డారు. అమెరికా వచ్చారు. ‘జనరల్ మోటార్స్’లో ఉద్యోగం సంపాదించారు. బి.కామ్. చదివింది కాబట్టి అక్క కూడా ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నది. వాళ్ల పని చాలా బాగుంది. ఇంతకు ముందంతా వాళ్లందర్నీ అంత దూరం పెట్టి ఇప్పుడు నా అవసరానికి వాళ్ల దగ్గరకు పోవటం, సహాయం అడగటం బాగుంటుందా నాన్నా?”

“మీ అమ్మా నేనూ ఎప్పుడూ ఏ బాధ్యతనూ తీసుకోవటానికి ఇష్టపడే వాళ్లం కాదు. తప్పించుకు తిరగటమే మంచిది అనుకునే వాళ్లం. మొదట నుండీ కూడా మనుషుల పట్ల మీ పెదనాన్న కున్నంత ప్రేమ అభిమానం నాకుండవురా. మా కుటుంబాన్ని చూసుకోవటం, నా చదువూ అంతా మీ పెదనాన్నే చూశాడు. ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి అన్నయ్యే అంతా చేయాలి అనుకునేవాణ్ణి. ఆ తర్వాతైనా అన్నయ్య ఋణం కొంతైనా తీర్చుకోవాలని కూడా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. బంధువులు, పరిచయస్థుల విషయంలోనూ అంతే. ఎవరినైనా ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తే చనువు తీసుకుని ఏదైనా సహాయం చేయమని అడుగుతారేమోనని మీ అమ్మా, నేనూ భయపడేవాళ్లం, పైగా మీ అమ్మ వచ్చిన వాళ్లకు చాకిరి చేయలేదనీ ఆలోచించే వాళ్లం. శిరీషా వాళ్లు హైదరాబాద్‌లో వున్నప్పుడు కూడా వాళ్ళు మన ఇంటికి ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్లారు. అన్న కూతురు నా కూతురు లాంటిదేనన్న మమకారం కానీ అభిమానం కానీ నాకేమీ వుండేది గాదు. వాళ్ల తిప్పలు వాళ్లే పడతారు, వాళ్లకు జీతాలు తక్కువైతే మాకేంటి? వున్న దాంట్లోనే సర్దుకుంటారు, లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళు పంపుతారని అనుకునేవాళ్లం. ఏంటో రా! మా ఆలోచనలు అలా వుండేవి.”

“సరే నాన్నా! నీ అభిప్రాయాలు నీవి. కాని అవి నాకు నచ్చేవి కాదు. మీ ఉద్దేశాలు సరైనవి కావని ఎలా చెప్పాలో నాకర్థమయ్యేది గాదు. మనుషుల మధ్య అనుబంధాలూ, ప్రేమలూ ముఖ్యం నాన్నా. కుటుంబ బాధ్యతలూ పంచుకోవటం చాలా అవసరం నాన్నా, ఇక వుంటాను” అంటూ సురేష్ ఆయాసపడుతూ ఫోన్ పెట్టేశాడు.

సురేష్ బాగా ఇబ్బంది పడుతున్నట్లున్నాడు. మాటల్లోనే వాడి అనారోగ్యం అర్థమవుతున్నది. పైగా కొడుకు మాటలు తండ్రి ప్రసాదును ఆలోచనల్లో పడవేసినయ్యి,

***

“అన్నయ్యా! మన సురేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తటం లేదు. అసలే ఆరోగ్యం కూడా బాగా లేదన్నాడు. ఏమైందోనని మాకిద్దరకూ కంగారుగా వున్నది. శిరీష ఫోన్ నంబరు నాకివ్వన్నయ్యా. ఒకసారి తనతో మాట్లాడి విషయం చెప్తాను. దగ్గర్లోనే వుంటారు కాబట్టి ఒకసారి వాడి విషయం కనుక్కోమని అడుగుతాను.” అన్నాడు ప్రసాద్ కంగారు నణుచుకుంటూ.

་”నువ్వేం కంగారు పడకు ప్రసాదూ. శిరీష ఫోన్ నంబరు నీకు మెసేజ్ పెడతాను. శిరీషకు నేను గూడా చెప్తాను.”

“మర్చిపోకుండా చెప్పన్నయ్యా.”

***

“శిరీషా! నేనమ్మా ప్రసాద్ బాబాయిని, సురేష్ ఏమైనా నీ దగ్గరకు వచ్చాడా? ఆరోగ్యం బాగాలేదన్నాడు.”

“అవును బాబాయ్! వాడి ఫ్రెండ్సు నాకు ఫోన్ చేశారు. వాడికి కరోనా ఎటాక్ అయిుంది. హాస్పిటల్లో చేర్చాం. మీ అల్లుడు హాస్పిటల్ కెళ్లి కనుక్కుని వస్తూనే వున్నారు. పిన్నీ నువ్వు గాభరా పడకండి. మేం చూసుకుంటాం లే. నాన్నకి కూడా ఇదే విషయం చెప్పాను.”

“దేశం కాని దేశంలో ఇపుడు మీరే వాడికి అండగా వుండాలమ్మా. వాడి ఆరోగ్యం, వాడి జీవితం మీ చేతుల్లో వున్నవి. హాస్పిటల్ కయ్యే ఖర్చు ఇక్కడ మీ నాన్నకి ఇవ్వమన్నా నేను ఇచ్చేస్తాను. ఖర్చుకు వెనుకాడకండమ్మా” అన్నాడు ప్రాధేయపూర్వకంగా ప్రసాద్.

అతడి భార్య కూడా శిరీషతో మాట్లాడబోయింది కాని ఏడుపుతో మాట్లాడలేక “శిరీషా! శిరీషా!” అని మాత్రమే అనగలిగింది.

ప్రసాద్, అతని భార్యా ఒకరినొకరు పట్టుకుని భయంతో ఏడవసాగారు. మెదడులో నరాలు తెగిపోతాయా, గుండె ఆగిపోతుందా అన్నంతగా ఆదుర్దా పడసాగారు.

“అయ్యో సురేష్! మళ్లీ నిన్ను చూస్తామా? నీకు తగ్గిపోతుంది కదూ! మేమేం చెయ్యగలము రా” అన్న మాటలనే పదే పదే అనుకుంటూ కంటికీ మంటికీ ఏడవసాగారు. ఈ ఏడుపుల మధ్య స్వగ్రామం పరుగెత్తుకొచ్చారు.

“మీ దగ్గర వుంటే కాస్త ధైర్యంగా వుంటుందని ఇలా వచ్చామమ్మా” అంటూ ప్రసాద్ తన తల్లి ఒడిలో తల పెట్టుకుంటే, అతడి భార్య అత్తగారిని పట్టుకుని బావురుమన్నది. తల్లీ అన్నా వదినల ఊరడింపులో వాళ్లు చెప్చిన ఓదార్పు మాటలతో ప్రసాదూ అతని భార్యా కాస్త కుదుటపడ్డారు.

రోజూ రెండు సార్లు ఫోన్ చేసి సురేష్ సంగతి తెలుసుకుంటున్నారు. వారం రోజులు గడిచాయి. సురేష్ ఆరోగ్యం నిలకడగానే వున్నదన్న విషయం తప్పితే మరే కబురూ లేదు.

‘తమ వాళ్ల ఊరడింపు కోసమూ, వాళ్ల అండ కోసమూ పరుగెత్తుకొచ్చాం. ఈ వయసులో అమ్మను అభిమానంగా చూసుకోవటం, అన్నయ్య బాధ్యతల్లో పాలుపంచుకోవటంలో తనకూ భాగముంద’ని ప్రసాద్‍కి అర్థమవసాగింది. కష్టపడి చదువు చెప్పించి తననింతవాడిని చేసిన అన్నయ్య పట్ల తను వుండాల్సినంత కృతజ్ఞతగా లేడని గ్రహింపు కొచ్చింది. శిరీష పట్ల అంత నిర్లిప్తంగా వుండి ఈ రోజు తన అవసరానికి ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. తన కోసం అన్న ఎంతో చేసినా ఏనాడూ గోరంత సాయం కూడా తనను అడగలేదు. తను చేసేది పెద్ద ఉద్యోగం. తాము వుండేది పెద్ద ఇల్లు. తమ మనసులు మాత్రం చాలా చిన్నవి. ఇంత స్వార్థంగా తనుండటం పాపం కాదా? ఆ పాపం మూలానే తన కొడుక్కీ పరిస్థితి వచ్చిందా? ‘అయ్యో! భగవంతుడా! మేం చేసిన పిచ్చిపనులకు మా కొడుకును శిక్షించకు!’ అంటూ మూగగా రోదించసాగాడు ప్రసాద్.

ఇప్పుడు ఊరిలో ఎవరు కనపడ్డా ఆప్యాయిత తన్నుకొస్తుంది. ఆదరంగా మాట్లాడసాగాడు ప్రసాదు.

“అన్నయ్యా! మనందరం హైదరాబాద్ వెళ్దాం. మీరు కొన్నాళ్లు వుండి వద్దురుగాని. ఇక అమ్మ నా దగ్గరే వుంటుంది. ఇకనుంచీ శిరీష నాకు కూడా కూతురే. ఇండియా వచ్చినప్పుడు నా దగ్గరా కొన్నాళ్ళు ఉంటుంది. సురేష్ సంగతి శిరీష నీకేమైనా చెప్పిందా! నాకూ చెప్పన్నయ్యా. రోజులు గడుస్తున్నా ఏం తెలియటం లేదు.” అన్నాడు ప్రసాద్.

“నువ్వు నిబ్బరంగా వుండు ప్రసాదూ. అంతా మంచే జరుగుతుంది.”

***

డెట్రాయిట్‌లో సురేష్ శిరీషా ఇద్దరూ టీ తాగుతూ కూర్చున్నారు.

“అక్కా! నాకు ఉద్యోగం పోయిందని, రాని కరోనా వచ్చిందని అబద్ధం చెప్పేటప్పటికి అమ్మానాన్నా విపరీతంగా భయపడ్డారు. ఈ భయంతో వాళ్ల మనస్సులు మారిపోయాయి. వాళ్లిద్దరిలో వున్న స్వార్థమూ, బాధ్యతా రాహిత్యమూ కరగటం ప్రారంభించినయ్యి.”

“అవును. తమ్ముడూ. నీవనుకున్నది సాధించి వాళ్ల మనసులు మార్చావు.” అంది శిరీష.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here