మాతృప్రేమ

0
1

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]వృ[/dropcap]ద్ధుడొకడు చేతి కర్ర సాయంతో మెల్లగా నడుస్తూ వ్రేపల్లెలోని నందుని ఇంటికి చేరాడు. నందుని ఇల్లు ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించబడివుంది. ఇంటి లోపల బయట గోపికలు హడావిడిగా తిరుగుతున్నారు. ఈ వృద్ధుణ్ణి చూసిన ఓ గోపిక “ఎవరు కావాలి తాతా?” అని అడిగింది.

“కన్నయ్యను చూసి వెళ్దామని వచ్చానమ్మా” అన్నాడు వృద్ధుడు.

“ఈ రోజు కృష్ణుని జన్మదినం. ఇప్పుడే తలంటు పోసుకున్నాడు. అదవ్వగానే చూద్దుగానిలే” అంటూ ఆ గోపిక యశోదకు ఈ విషయం చెప్పటానికి లోపలికి వెళ్లింది.

యశోద తన కన్నయ్యకు అలంకారం చేస్తోంది. చంగల్వ పూలతో అల్లిన దండ వేసింది. బంగారు మొలత్రాడు కట్టింది. పసుపు రంగు పట్టు వస్త్రాన్ని కట్టింది. పైన ఎర్రటి పట్టుగుడ్డను దట్టిగా బిగించింది. చక్కగా తల దువ్వి జుట్టు ముడి ఒక ప్రక్కగా వచ్చేటట్లు వేసి బంగారు ఆభరణాలతో బిగించి నెమలి కన్ను వుంచింది. కస్తూరితో తిలకం దిద్దింది. భుజాల మీదుగా చిన్న పట్టు బట్టను పై వస్త్రంగా వేసింది. బుగ్గన దిష్టి చుక్కను పెట్టింది. అప్పుడే లోపలికి వచ్చన గోపిక కన్నయ్యను చూసి ముఖం మీదకు చేతులు పోనిచ్చి గుండ్రంగా త్రిప్పి తన తలకి అటు ఇటూ చేతులు తెచ్చుకుని మెటికలు విరుచుకుంది.

“యశోదమ్మా ఎవరో ఒక ముసలి తాత కన్నయ్యను చూడటానికి వచ్చాడు” చెప్పింది గోపిక.

“అలాగా పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిది. పద తాత దగ్గరకు వెళ్దాం” అంటూ కన్నయ్యను వెంట తీసుకుని బయటకు వచ్చింది యశోదామాత.

అక్కడి నుండే చూశాడు ముసలి వాడు కన్నయ్యను. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. జగన్నాటక సూత్రధారి. హిరణ్యగర్భుడు. మూడు వసంతాలు పూర్తి చేసుకుని 4వ వర్షంలోకి అడుగు పెడుతూ బుడి బుడి నడకలు నడుస్తున్న శ్రీకృష్ణుని చూశాడు.

“నా జన్మ ధన్యమైంది కృష్ణా విశ్వరూపా, వషట్కారా, యుక్తిదాతా, యోగీశ్వరా నమో నమః” నమస్కరించాడు వృద్ధుడు.

అది గమనించింది యశోద. తత్తరపాటుతో “అయ్యో! అదేమిటి తాతగారు, మీరు పెద్దలు ఆశీర్వదించాలే కాని నమస్కరించరాదు” అంటూ దగ్గరకు వచ్చి “అయ్యా మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగింది యశోద.

వృద్ధుడు నవ్వుకుని “అది తెలుసుకోవటానికి వచ్చానమ్మా” అన్నాడు.

యశోద విచిత్రంగా చూసింది వృద్ధుని వంక.

ఆ వృద్ధుడు కన్నయ్యను దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా నిమిరే నెపంతో పాదలు పట్టుకుని కళ్ళకద్దుకుని “పుట్టుకే లేని వాడికి జన్మదినం ఏమిటి తల్లి? అన్నాడు.

యశోద ఆ వృద్ధుని వంక నిశితంగా చూస్తూ “తాతగారు మీ ఆరోగ్యం సరిగా లేనట్లుంది. అర్థం కాని విధంగా మాట్లాడుతున్నారు. కొద్ది సేపు ఈ ఆసనం మీద విశ్రాంతి తీసుకోండి. నేను లోపలికి వెళ్ళి కొద్దిగా పాలు తెస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.

యశోదతో పాటు గోపికలు కూడా లోపలికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఆ వృద్ధుని చేతుల్లోనే ఉన్నాడు.

ఆ వృద్ధుడు తనివితీరా కన్నయ్య రూపాన్ని చూసి “స్వామి నువు జనన మరణ బంధాలతో ఇరుక్కోని వాడివి కదా. మరి ఈ మాతృమూర్తి చేతికి ఇలా బంధీగా చిక్కిపోయావేమిటి?” అని అన్నాడు.

అందుకు ఆ చిన్న కృష్ణుడు నవ్వి “తాతా నేను చావు పుట్టుకలు, తల్లిదండ్రులు లేనివాడనే. నాకు తల్లి ప్రేమ తేలియదు, కాని కన్నయ్యగా అవతారం ఎత్తిన మీదట నాకు మాతృ హృదయం అర్థం అయింది. నాకు వాత్సల్యం  తెలిసింది. ఎన్ని జన్మలైనా ఇటువంటి తల్లిదండ్రులకే పుత్రుడిగా పుట్టాలనిపిస్తుంది. అందుకే ఈ మాతృమూర్తికి బంధీని అయ్యాను” అన్నాడు.

“అహ నిన్ను పుత్రునిగా పొందటానికి యశోద మాత ఎంతగా తపస్సు చేసిందో కదా! ఆమెను ధన్యురాలను చేశావు” అన్నాడు వృద్ధుడు.

కృష్ణుడు చిన్నగా నవ్వి వూరుకున్నాడు. ఇంతలోకి యశోద పాల పాత్రను తీసుకుని ఇంటిలో నుండి వస్తోంది. దూరం నుండే ఆ వృద్ధుడు యశోద మాతకు నమస్కరించాడు.

యశోద పాల పాత్రను ఆ వృద్ధునికి ఇవ్వబోగా వృద్ధుడు వద్దని వారించి “అమ్మా నేను వెళ్లి రానా?” అన్నాడు నమస్కరిస్తూ.

“తాతా ఇందాక నువ్వెవరివో తెలుసుకోటానికి వచ్చానన్నావు కదా” అన్నాడు చిన్నకన్నయ్య.

“తెలిసింది స్వామీ నేనెవ్వడో, నీ భక్తుడనే” అన్నాడు వృద్ధుడు కృష్ణునకు నమస్కరిస్తూ.

యశోద గాబరాగా “అయ్యో తాతగారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అలా నమస్కారాలు చేస్తున్నారు. ఏమిటిదంతా?” అంది.

“అమ్మా నువు మాతృ స్థానం నుండి కొద్దిగా ప్రక్కకు వస్తే వాస్తవం నీకు బోధపడుతుంది. అప్పుడు ఈ కన్నయ్య ఎవరో నీకు అర్థం అవుతుంది. అనక నా కంటే నీవే పరమ భక్తురాలిగా మారిపోతావు” అన్నాడు వృద్ధుడు. “తాతా అమ్మ అమ్మలాగే ఉండటం నా కిష్టం” అన్నాడు కన్నయ్య.

“అదా స్వామి నీ లీల! అద్భుతం! అమ్మ అమ్మలాగా ఉంటేనే కదా నీకు మాతృప్రేమ దక్కేది” అన్నాడు వృద్ధుడు.

యశోద భయంగా ఉంది. “అయ్యో భగవంతుడా నా బిడ్డను చల్లగా చూడు” అంటూ చిన్న కృష్ణుడుని హృదయానికి హత్తుకుంది.

కన్నయ్య నవ్వుతూ ఉండిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here