[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘మట్టి చేతుల అక్కున’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఒ[/dropcap]కనాటి
చందమామ రావే జాబిల్లి రావే
కథలిక కథలై పోయేనా
కవులు కవితల భావోద్వేగ కల్పనలేనా మరి
వీడని బంధమైన మేనమామగా
కలువలరేడు కలిసిన కరచాలనం
చందమామ నా సందిట ఒదిగిన వేళ
మెరిసే మట్టిని చేరే వెన్నెలకూనై
చంద్రయాన్ ముద్దాడిన రోజు
ఓ సుందర మధుర క్షణాన
జాతి భారతావని అందెలు మురిసే గరిమతో
హృదయం నాదే నినదించే
నా దేశ స్పందన జవజీవమై
చందమామ ఒడి రా! రమ్మంది!!
వెన్నెల తేరుపై గగన సీమలదాటి
ఉప్పొంగే నా మది సాగరమై
మట్టి చేతుల నాలో చందమామ చేరిన వేళ
అంతరిక్ష పరీక్షలెన్నో దాటి
చేరే నెలరాజు దక్షిణ ధృవం
తొల్దొలుత
చరిత్ర సృష్టించెను చంద్రయాన్ 3
ఈ మట్టీ ఈ గాలీ ఈ నీరు జయజయహో
నాదమై నినదించే దిక్కులు పిక్కటిల్లగా
వన్నెల జాబిల్లి వెన్నెల ఎద
ఈ భూమికి అందిన వేళ
మిషన్ చంద్రయాన్-3 దిగ్విజయమైన రోజు
ఎంత గొప్పదో
నా దేశం గుండెచప్పుడు విశ్వమై నినదించిన ఈ రోజు
మరెంత అద్భుతమో
మన అంతరిక్ష శాస్త్రవేత్తల శోధన!
జయహో!!
జయ జయహో! ‘ఇస్రో’ ఘన విజయ పరిశోధన కృషికివే
నా దేశం జెండా రెపరెపలే
భారతజాతి అందించిన ఘన అభినందనలు..