సామ్రాజ్యవాదపు విషకోరల్లో…

0
2

[dropcap]గ[/dropcap]త నాలుగు దశాబ్దాలుగా ప్రవాసంలో వున్న ప్రపంచ ప్రసిద్ధ కెన్యన్ సాహిత్యకారుడు గుగి వా థియోంగో రాసిన ‘డెవిల్ ఆన్ ది క్రాస్’కు వరవరరావు తెలుగు అనువాదం ‘మట్టికాళ్ల మహారాక్షసి’. రెండో ముద్రణ ఇది.

వలస పాలనను సాంసృతిక రంగంలో చాపకింద నీటిలా ప్రవేశపెట్టే ప్రమాదకరమైన సాధనం ఇంగ్లీష భాష అని గ్రహించిన గుగి తన ఉద్యమంలో భాగంగా ఇంగ్లీషులో నవలలు రాయడం మానేసాడు. ఆయన గికుయు, స్వాహిలి వంటి ఆఫ్రికన్ భాషల్లోనే రాస్తాడు. తన జాతికి చెందిన గికుయు భాషలో రైతాంగ, కార్మిక సమ్మేళనంతో ప్రజారంగస్థలాన్ని నిర్మించే ప్రయత్నం చేసిన నేరానికి గుగి 1977లో జైలు నిర్బంధం పాలయ్యారు. ఆ జైలు నిర్భంధ సమయంలో, అప్పటి వరకు అధునిక నవలా ప్రక్రియలో ఒక్క రచన కూడా లేని గికుయు భాషలో తొలి నవల రచించాలని చేసిన ప్రయత్నం ఇది. జైలులో ఆయనకు రాసుకునే కాగితాలు ఇవ్వడానికి కూడా నిరాకరరించినప్పుడు టాయిలెట్ పేపర్ మీద, బైబిల్ లోనూ, ఇతర పుస్తకాలలోనూ అచ్చు పంక్తుల మధ్య ఖాళీల్లో ఆయన ఈ నవలను రచించాడు. అలా నలభై ఏళ్ళ కింద ఒక కెన్యా జైలులో దుర్భర నిర్భంధ పరిస్థితుల్లో రూపుదిద్దుకుని, ముప్పై ఎనిమిదేళ్ళ కింద మూల భాషలో ముప్పై ఆరేళ్ళ కింద ఇంగ్లీషలో వెలువడిన ఈ నవలను 1986-89 మధ్య ముషీరాబాద్ జైల్లో ఒంటరి సెల్‌లో ఖైదీగా వుండిన వరవరరావు తెలుగు చేశారు.

కెన్యాలోను ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ రాజకీయంగా వలస పాలన అంతరించినప్పటికీ ఇప్పుడక్కడ దళారీ పాలన కొనసాగుతున్నదనీ, వాళ్ళు సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో వుండి ఇటు ప్రజలను అటు దేశాన్ని ఎలా దోపిడీ చేస్తున్నారో ఈ నవలలో వివరించారు. “గెరిల్లాలు గెలిచి దేశ అధికారం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నప్పడు నేను ఈ భూములను, పరిశ్రమలను తిరిగి ఎన్నటికీ పొందలేను. ఈ తేయాకు, ఈ బియ్యం, ఈ పత్తి, ఈ కాఫీ, ఈ రాత్రుళ్ళు, హోటళ్ళు షాపులు, ఫాక్టరీలు వాళ్ళ విలువైన చెమట ఫలాలు… ఇంకా ఎన్నో నాకు దక్కకుండాపోతాయి. కాని ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు. నేను ముందు వైపు ద్వారం నుంచి నా దేశానికి పోవాల్సి వచ్చినప్పుడు వెనక ద్వారం నుండి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. నన్నప్పుడు మంచిగా ఆహ్వానిస్తారు. నేనప్పుడు నాటే విత్తనాలు నేను ముందు నాటిన విత్తనాల కన్నా బలంగా వేళ్ళూనుతాయి” అని సామ్రాజవాదులు నమ్మతారు. వాళ్ళ దృష్టిలో స్వాతత్ర్యం ఇవ్వడమంటే “చాలా దూర దేశం ప్రయాణం చేయబోతున్న మనిషి తన స్వంత సేవకులను పిలిచి వాళ్ళకు తన వస్తువులు అందించడం లాంటిది స్వాత్రంత్య్ర జెండా” అని చెబుతారు.

“ప్రపంచ బ్యాంకులు, ప్రపంచ వాణిజ్య బ్యాంకులు, ప్రపంచ దోపిడీ బ్యాంకులు, డబ్బు మింగే బీమా పథకాలు, పారిశ్రామిక ముడి సరుకు స్వాహాగాళ్ళు, విదేశీ ఎగుమతుల చౌక ఉత్పత్తిదార్లు, మానవ చర్మవ్యాపారులు, లాభం కోసం అప్పులు, ఇనుప కోరలతో సహాయం, హత్య కోరకు ఆయుధాలు, ఆంతరంగిక విలాస వినోదానికి, విదేశాల్లో పెద్ద లాభాలకు మోటారు వాహనాలు, నిర్మణ సంస్థలు, మూర్ఖులను పరాధీన బానిస శృంఖలాలలో వుంచడానికి అందమైన చక్కని సకల ఉత్పత్తులు.. ఇలా రకరకాల ఆకర్శణీయ రూపాలతో సామ్రాజ్యవాదం ఏ దేశంలోనయినా దూరిపోవడానికి సిద్ధంగా వుంటుంది.

యూరోపియన్ల పాలకులు కెన్యన్లను, వారి సంస్కృతిని హీనంగా చూడడంతో వారిలో ఆత్మన్యూనతా భావన నరనరాల్లో జీర్ణించుకుపోతుంది. అందుకే ప్రముఖ కెన్యన్ ఎవరూ పెద్ద క్షేత్రాన్ని సంపాదించిన తర్వాత దాని మేనేజర్‌గా కెన్యన్‌ను నియోగించడు. వాళ్ళు విదేశ యూరోపియన్లనే నియోగిస్తారు. పెద్ద వ్యాపారాల్లో విజయం సాధించే కెన్యన్ ఎవరూ తన మేనేజర్‌గా గానీ అకౌంటెంట్‌గా గానీ కెన్యన్‌ని నియోగించరు. విదేశీయుడైన యూరోపియన్నో లేదా భారతీయుడినో మాత్రమే నియమిస్తారు. కెన్యన్‌లు మాట్లాడుకునేడప్పుడు వాళ్ళ జాతీయ భాషలెప్పుడూ ఉపయోగించరు. వాళ్ళు విదేశీ భాషల్లో మాత్రమే మాట్లాడుకుంటారు.

కార్మిక వర్గంలో అందరికన్నా ఎక్కువగా అణచివేతకు, పీడనకు గురియైన వాళ్ళు స్త్రీలు గనుక నేను ఒక దృఢమైన ఆత్మవిశ్వాసం కల స్త్రీ పాత్రను చిత్రించాలని గుగి తలపోస్తాడు. తన ప్రస్తుత ఉనికికి కారణమైన పరిస్థితులకు వ్యాతిరేకంగా పోరాడి ప్రతిఘటించే సంకల్పంగల స్త్రీగా వరింగాను సృష్టించగా ఆమె ప్రధాన పాత్రధారిగా ఈ నవల కొనసాగుతుంది. ఇందులో తెలివైన ఆదర్శ విద్యార్ధినిగా పేరు తెచ్చుకున్న వరింగాను ఒక వృద్ధ ధనవంతుడు విలాసాలను ఎరగా వేసి ఆమెను లోబరుచుకుంటాడు. తీరా ఆమె నెల తప్పేసరికి వాడు విదిలించుకుని వెళ్ళిపోవడం, తన చేతులారా నాశనం చేసుకున్న చదువు జ్ఞాపకం వచ్చి, భవిష్యత్తు మీద నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతుంది. అది విఫలమై తల్లిదండ్రులు ధైర్యం చెప్పగా పిల్లాడ్ని కని వాళ్ళకు అప్పగించి, స్టెనోగ్రఫీ నేర్చుకుంటుంది. పడపటింటికి వస్తే తప్ప ఉద్యోగం దొరకని పరిస్థితులు. తీరా ఒక కంపెనీలో స్టెనోగా కుదిరాకా ముసలి బాసు ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి, అవన్నీ విఫలం కాగా ఆమెను ఉద్యోగంలోంచి తీసివేస్తాడు. ఆమె ఇంటికి వెళ్ళడానకి ఎక్కిన ఆటోలో వంగారి అనే అమ్మాయి, గటూరియా అనే యూనివర్ విద్యార్థి, ముటూరి అనే కార్మిక నాయకుడు, వారా అనే ధనదాహం కలిగిన డ్రైవర్ ఉంటారు. దొంగల బందిపోట్ల గుహలో జరిగే పిశాచి విందుకు రమ్మని వారికి ఆహ్వానాలు అందడంతో అంతా ఆ గుహకు వెళతారు. అక్కడ ఒక విదేశీ సామ్రాజ్యవాద ఏజంట్ అక్కడ హాజరయిన వాళ్ళను తాము ప్రజలను, దేశాన్ని పీడించి ఎలా ధనవంతులవుతున్నారో వివరించడంతో, ఒక్కొక్కరూ తమ దోపిడీ విధానాలను వివరించడం ఎంత అమానుషంగా వుంటుందో వివరించలేను. ఇంతలో వంగారి ఉద్యోగం కోసం వెతుకుతూ నైరోబీకి వెళితే ఎవరూ పని ఇవ్వరు సరికదా అనుమానితురాలిగా భావించి పోలీసులకు అప్పగిస్తారు. కోర్టుహాల్లో తన దేశభక్తిని ప్రకటించగా జడ్జి ఆ వూళ్ళో వున్న అసాంఘిక శక్తులను పట్తివ్వమని చెప్పి వదిలేస్తాడు. వంగారి ఆ గుహలో సమావేశమైన వారి దుర్మార్గాలను విని పోలీసులను తీసుకువస్తుంది. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ధనవంతుల తొత్తులుగా తమ విధేయతను చూపించి, సంఘవిద్రోహ శక్తిగా వంగారిని అరెస్టు చేసి తీసుకుపోతారు. ఇక గటూరియా అక్రమార్జనతో కోటీశ్వరుడైన వ్యక్తి కుమారుడిగా ఉన్నత చదువులు చదవననీ, తనకు నచ్చిన స్థానిక సంగీత రీతుల్లో పరిశోధన చేస్తానని, తండ్రితో విభేదించి బయటకు వస్తాడు. రైతాంగం, కార్మికుల శక్తివంతమైన సమీకరణలో మేధావులు, విద్యార్థులు కూడా చేతులు కలిపితే సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టవచ్చని నమ్మిన ముటూరి కార్మికులతో వచ్చి ధన పిశాచాల మీద దాడి చేస్తాడు. అంతలో సైన్యం వచ్చి వాళ్ళ మీద కాల్పులు జరిపి ఆ ధనవంతులను రక్షిస్తుంది. వరింగా తను ఇంజనీర్ కావాలన్న లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుని, కష్టపడి మెకానికల్ ఇంజనీర్ అవుతుంది. ఆమెను ప్రేమించిన గటూరియా ఆమె గతాన్ని గురించి తెలుసుకుని కూడా తన ప్రేమను వ్యక్తీకరించి, పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదిస్తాడు. దానికి ఒప్పుకున్న వరింగా తన కొడుకును తీసుకుని గటూరియాతో కలిసి వాళ్ళింటికి వెళుతుంది. అక్కడ ఆమె గటూరియా తండ్రిని చూడగానే దిగ్భ్రాంతి చెందుతుంది. తన కన్యత్వాన్ని హరించిన ఆ వృద్ధ ధనికుడి కుమారుడే గటూరియా. ఆ వృద్ధుడు కూడా వరింగాను, ఆమె కుమారుడిని చూసి మ్రాన్పడిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.

సామ్రాజ్యవాద వికృత రూపాన్ని, అది ఎన్ని రకాలుగా బడుగు దేశాలను పీల్చి పిప్పిచేస్తుందో తెలియజేయడంతో పాటు వారి ఏజంట్లుగా మారి స్వదేశీ పాలకులు తమ ప్రజలను పీడించడం, దేశాన్ని దోచుకోవడంలో వారు కూడా వెనుకబడి లేరని ఈ నవల తెలియజేస్తుంది. ఈ దోపిడీ పద్ధతి మూడో ప్రపంచ దేశాలలో ముఖ్యంగా కెన్యాలాంటి ఆఫ్రికా దేశాలలో ఎలా నిరాటంకంగా కొనసాగుతోందో, ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఈ నవల వివరిస్తుంది. విలువైన ముందుమాటలు ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అనువాదం చాలా బాగుంది. అనువాదం సాఫీగా వుండి ఆద్యంతం ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.

***

మట్టికాళ్ల మహారాక్షసి (నవల)
మూలం: గుగి వా థియోంగో
తెలుగు: వరవరరావు
పేజీలు: 324 వెల: ₹200
ముద్రణ, ప్రతులకు: స్వేచ్ఛాసాహితి, హైదరాబాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here