[dropcap]స[/dropcap]మయమాసన్నమవుతోంది
సమయమా’సన్న’మవుతోంది.
వెలుగురేక తట్టిన శబ్దానికి
తనువెల్లా మెలకువచైతన్యం నింపుకొని
తన ఇంటిని పరిశుభ్రీకరించి తాను శుభ్రపడి
తన మాంగల్యానికి సర్వమూ సమకూర్చి
నిద్రలేవని నందివర్ధనాలను
తనివార తడుముకుని, మనసారా ముద్దాడి
అనువణువునూ తాను నమ్ముకున్న
వృత్తికి అంకితంచేస్తూ సిద్ధమవుతున్న
ఆమెనుదుట ఉదయ సూర్యుని అరుణిమ
ధైర్యలక్ష్మి నుదుట కుంకుమై ప్రకాశిస్తోంది.
సర్కారువారిచ్చిన బాధ్యతా చిహ్నం
ఆమె దేహాన్ని చుట్టుకుని గర్వంతో
మెరుపుల తళుకుల నవ్వులు విసురుతోంది.
సమయానికి ముందే డ్యూటీకి చేరాలనుకునే ఆరాటం
జీవనపోరాటంలో బ్రతుకీడుస్తున్న జీవుల
సంచారమార్గాలను శుభ్రపరచాలనుకునే ఉబలాటం
ఆరడుగుల కర్రకు అధికతరకోణంలో
విచ్చుకున్న కొబ్బరీనుల పదును అంచులన్నీ
విసర్జింపబడిన చెత్తా చెదారాన్ని తమలాగే
ఒడుపుగా సంఘటితంగా ఒక్కచోట చేర్చే పనికి
సంసిద్ధులైన సైనికులై చురచుర చూపులతో చూస్తూ
ఆమె హస్తలాఘవవేగం అందుకునేందుకు ఎదురుచూపు
అందరి ఆరోగ్యం బాగుంటేనే సమాజ ఆరోగ్యం
అని బడిపంతులు నేర్పిన తొలిపాఠం
ప్రకృతి బిడ్డలనే కాదు అవసరాన్ని బట్టి
మలినించిన ప్రతీబిడ్డకు ఆమె పెంపుడు తల్లి.
చీపురు పట్టిన క్షణం నుంచి పాపిష్టి కరోనాను
భూమి చివరి అంచునుండి ఈడ్చి ఈడ్చి
తరిమి తరిమి తుడిచెయ్యాలన్న కసి
ఆకలిమంటతో అల్లాడుతున్న అభాగ్యులను
శానిటైజర్ తో శుభ్రపరచి దాతల దాతృత్వాన్ని
వారి నోటికి అందించాలన్నదే ఆమె మనో తపన
గుండె చప్పుడుకనుగుణంగా బాధ్యత నిర్వహిస్తున్న
పోలీసన్నల దాహార్తిని చెల్లిరూపాన తీర్చే మట్టిపుష్పం
ఫలితమాశించని సేవలందిస్తున్న మట్టిపుష్పాల
సేవాతాత్పరతకు కరోనా కరిగి కరిగి నీరయ్యి
ఇంకిపోయే సమయమాసన్నమవుతున్నది
సర్వేజనా సుఖినోభవంతు!!!