Site icon Sanchika

మౌనభాష్యం

[‘నీతి నిజాయితీ’ సినిమాలోని ‘మాటల కందని భావాలు’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]సి[/dropcap]నిమా అనేది ఒక భ్రమాన్విత ప్రపంచం. నాయికా నాయకులు కొండల్లో, కోనల్లో పాటలు పాడుకుంటూ నాట్యం చేస్తూ ఉంటారు. వారి పాటకు అనుగుణంగా ఏ దేవదూతలో మృదంగం వాయిస్తూ, వీణ మీటుతూ, మేళం వాయిస్తూ ఉన్నారు అన్నట్లు ఆర్కెష్ట్రా వినిపిస్తూ ఉంటుంది. ఆ పాటల్లో మమేకమై ప్రేక్షకులు కూడా ఆనందంతో చూస్తూ ఉంటారు. నిజ జీవితంలో అలా కొండల్లో ఒంటరిగా ఎవరూ ఉండరు. డ్యాన్స్‌లు చేయరు. నటీనటులు కూడా షూటింగ్ అయిన తర్వాత ఆ ఆలోచనలు అక్కడే వదిలేసి, సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. రీల్ లైఫ్‌కీ, రియల్ లైఫ్‌కీ తేడా గీత గీసినట్లు చూపిస్తారు తమ ప్రవర్తనలో (ఈ రోజుల్లో ఆ గీత చెరిగిపోయింది అనుకోండి! అది వేరు విషయం). కానీ మూడుగంటలు వినోదంతో ఓలలాడించినా ఆ కథలు వాస్తవానికి దగ్గరగా ఉండేవి. అందువల్లే కొన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆనాటి చిత్రాలు చూస్తూనే ఉన్నారు.

‘నీతి నిజాయితీ’ అనే సినిమాలో నాయిక కాంచన, స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకి వెళ్ళింది. అక్కడ అందరూ ఏదైనా పాట పాడమని అడిగారు. వారి కోరిక మీద ఒక భావగీతాన్ని ఆలపించింది. ఈ గీతాన్ని డాక్టర్ సి. నారాయణ రెడ్డి రచించగా, యస్.రాజేశ్వర రావు సంగీత సారధ్యంలో పి. సుశీల కమనీయంగా గానం చేసారు. ఆ పాట, అందులోని భావం ఇప్పుడు చూద్దాం.

మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి
కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి

ప్రతి మనిషి మనసులోనూ రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. కోపం, అసూయ, ఆగ్రహం, ప్రేమ, అభిమానం, కృతజ్ఞత వంటి భావాలు ఎన్నో! వాటిని భాష ద్వారా వ్యక్తీకరిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలతో పైకి చెప్పలేని భావాలు మంచిమనసు ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకు కొంతకాలం క్రితం ఒక పత్రికలో ‘స్నేహహస్తం’ (రచన: గోనుగుంట మురళీకృష్ణ) అనే కథ వచ్చింది. అందులో సంయుక్త అనే ఆమెకి ఆరోజు శలవు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మేనేజర్‌ని అడగాలంటే ఏదో జంకుగా ఉంటుంది. ‘పని ఎగ్గొట్టటానికి ఇదొక వంకా!’ అన్నట్లు చూస్తాడు. సందేహిస్తూనే మేనేజర్ ఛాంబర్ లోకి వెళ్ళింది. ఆఫీస్‌లో మరో ఉద్యోగితో మాట్లాడుతున్న ఆయన మాటలు ఆపి ‘ఏం కావాలి?’ అన్నట్లు చూశాడు.

“రేపు నాకు సెలవు కావాలి సార్!” అన్నది చిన్నగా.

“చూడండి సంయుక్త గారూ! నెలకు రెండు లీవ్స్ మించి వాడుకోవటానికి రూల్స్ ఒప్పుకోవు. మీరు ఇప్పటికే పరిమితికి మించి వాడుకున్నారు. చాల వర్క్ పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అలాంటివేమీ కుదరదు. వెళ్లి పని చూసుకోండి” అన్నాడు.

“మా హస్బెండ్‌కి హెల్త్ బాగాలేదు సార్! హాస్పటల్‌లో ఉన్నారు. రేపు రూమ్‌లో నుంచీ ఐ.సి.యు. లోకి షిఫ్ట్ చేయాలని చెప్పారు” దీనంగా అన్నది.

సంయుక్త దీనంగా ఉన్న ముఖం, నీళ్ళు నిండిన కళ్ళు, అడగలేక అడుగుతున్నట్లున్న స్వరం ఇవన్నీ చూస్తున్న ఎదురుగా కూర్చున్న ఉద్యోగి మనసు ఆర్ద్రమయింది. “పోనీ రేపు ఒక్కరోజు ఇవ్వండి మేనేజర్ గారూ! అవసరం అంటున్నారు కదా! ఏదైనా వర్క్ ఉంటే నేను చేస్తాను లెండి!” అన్నాడు.

“సరే! ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇస్తున్నాను” అన్నాడు మేనేజర్. సంయుక్త ఎదురుగా కూర్చున్న అతని వంక కృతజ్ఞతగా చూసి, తన సీట్ లోకి వెళ్ళింది. అతని పేరు మధుమూర్తి. అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు సంయుక్త. ఆఫీస్ లో తన గురించి తోటి ఉద్యోగుల రకరకాల వ్యాఖ్యానాల వల్ల ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. మధుమూర్తి కూడా తనేదో, తన పనేదో అన్నట్లు ఉంటాడు గానీ అనవసరంగా ఎవరి విషయంలోనూ జోక్యం కలిగించుకోడు. ఇద్దరి మధ్యా స్నేహం లేదు, ముఖ పరిచయం తప్ప. కానీ కీలకమైన సమయంలో సహాయం చేశాడు. సయుక్త గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. అవకాశం వస్తే తను కూడా అతనికి సహాయం చేయాలి అనుకున్నది దృఢంగా. ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. కానీ మనసులోనే స్నేహం కుదిరింది. మాటలతో చెప్పలేని భావాలు వారి మంచి మనసులే చెప్పాయి.

కవితలతో చెప్పనవసరం లేని భావాలు కంటి కొసలతో చెప్పవచ్చు. ‘పాండవ వనవాసం’ చిత్రంలో భీముడు, ద్రౌపది హిమాలయాల్లో విహరిస్తూ పాట పాడుకుంటూ ఉంటారు. శివపార్వతుల శిల్పాలు చూసి “ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో!” అంటుంది ద్రౌపదిగా నటించిన సావిత్రి. భీముడు ఆమె చేయి పట్టుకుని మరోవైపు చూపిస్తూ “సుమశరుడు రతీదేవి కూడి కేళి సాగించే లేమా!” అని పాడతాడు. ఆమె సిగ్గుతో చెయ్యి విడిపించుకుంటుంది. చూస్తున్న ప్రేక్షకుడు ‘సిగ్గుపడుతుంది కాబోలు!’ అనుకుంటాడు.

కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే- వనవాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. శీతలోదక స్నానం (చన్నీటి స్నానం), ఏక భుక్తము (రోజుకు ఒక్కసారే భోజనం చేయటం), బ్రహ్మచర్యము మొదలైనవి వనవాస నియమాలు. ఆయన రతీమన్మథులను చూపించి కోరిక వ్యక్తపరిస్తే ఆమె ‘వద్దు. నియమభంగం అవుతుంది’ అన్నట్లు విడిపించుకుంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే సావిత్రి కంటి కొసలతోనే వారించటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భావ వ్యక్తీకరణ అంతా కనురెప్ప పాటులో జరిగిపోతుంది. కొన్నికొన్ని భావాలు చెప్పటానికి కవిత్వం అవసరం లేదు. కంటిచూపే చాలు.

ఇలాంటి భావాలను తెలియజేయటానికి మరికొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు కవి ఈ పాటలో –

వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు
భాష రాని పాపాయి బోసినవ్వు చాలదా!
ఏనాడూ పలకని దైవం ఈ లోకములేలదా!

పండువెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్నది అని వర్ణిస్తారు కథలలో. నీలాకాశంలో తెల్లమబ్బులు దూదిపింజలల్లా తేలిపోతుంటే ఆ మబ్బుల చాటునుంచీ చంద్రుడు దోబూచులాడుతూ ఉంటాడు. జగత్తు అంతా వెన్నెల చల్లదనాలని విరజిమ్ముతూ ఉన్నట్లు ఉంటుంది. పెద్దలే కాదు, పిల్లలు కూడా ఆ చల్లదనానికి ఆనందిస్తూ ఉంటారు. తల్లి బిడ్డను ఎత్తుకుని “చందమామ రావే, జాబిల్లి రావే..” అని పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంటే పసివాడు కేరింతలు కొడుతూ తింటాడు. ఆ పాటకు అర్థం తెలియక పోయినా వెన్నెల చూసి మైమరచి పోతాడు.

స్త్రీలు జడలో మల్లెపూలు తురుముకుంటారు. తనకోసం కాదు, ఆ పరిమళాలతో భర్తను పరవశింపజేసి, తన వాడిని చేసుకోవటానికి. మల్లెల సువాసనకు భర్త మనసులో అల్లిబిల్లి కోరికలు చెలరేగుతాయి. అందువల్లనే స్త్రీలు పడకటింటిలో మల్లెపూలు పెట్టుకుని వస్తారు. మల్లెలు మాట్లాడలేదు. మౌనంగానే భార్యాభర్తలని కలుపుతాయి. వివాహితలే మల్లెపూలు పెట్టుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు కనకాంబరంమాల ధరిస్తారు. అవి చూడటానికి అందంగా కనిపిస్తాయి. తన అందంతో మగవాడిని మురిపించటానికి. ఎందుకంటే పెళ్లికాని అబ్బాయిలని, అమ్మాయిలని కొంచెం ఎడంగానే ఉంచుతారు పెద్దలు. అందుకని దూరం నుంచే చూసి ఆనందిస్తాడు అబ్బాయి.

పసిపాప నవ్వులు చూసి పరవశించని వారు ఉండరు. కాళ్ళు, చేతులూ ఊపుతూ బోసినవ్వులు నవ్వుతూ ఉంటే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది ఎవరికైనా. ఇక తల్లి సంగతి చెప్పనక్కర లేదు. బిడ్డను కళ్ళతో చూడటం కన్నా మించిన ఆనందం ఉండదు ఆమెకి. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీకి అయినా, తల్లి అయిన తర్వాత భర్త రెండో స్థానానికి వచ్చేస్తాడు. తన బిడ్డే ఆమె మనసులో ప్రథమ స్టానం లోకి వచ్చేస్తుంది. మరి ఆ పాపాయికి మాటలు వచ్చా! అసలు భాషతో పని లేదు. నవ్వుతోనే ఎదుటివారి మనసు గెలుచుకుంటుంది.

కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుడిని పూజిస్తారు. ఆ దైవం ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ దేవుడిని నమ్ముకుంటే ఆపద వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడు అని భక్తుల నమ్మకం. మన ప్రయత్నం మనం చేసి, ఫలితం దేవుడి మీద వేసి ఊరుకుంటే ఎలాంటి టెన్షన్‌లు ఉండవు. అందుకే భాష లేని దేవుడి ప్రతిరూపమే ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నది అని కవి భావన.

పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటిరాగ మాలికలు
హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం
కనగలగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం

నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలలో కాసేపు కూర్చుంటే చాలు, గాలికి చెట్ల ఆకులు రాచుకున్న సవ్వడి, గాలి పరుగులు తీస్తున్న శబ్దాలు, గాలితో పాటు తెలివస్తున్న పూల సువాసనలు ఇవన్నీ కవులకు కవితా వస్తువులు. ప్రకృతి పాడుతున్న పాటలా ఉంటుంది. ఆ శబ్దాలు వింటూ కవిత్వం చెప్పాలనిపిస్తుంది. కొండల మీద నుంచీ జాలువారే నీలి జలపాతాలు చూస్తూ, ఆ సవ్వడులు వింటున్నా కవిత్వం చెప్పాలనే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పినవి ఏవీ మాట్లాడ లేదు, వినగలిగే హృదయం ఉంటే ప్రపంచంలో ప్రతి చెట్టు, పుట్ట, పువ్వు, ఆకు, గానం చేస్తున్నట్లుగా ఉంటుంది. చూడగలిగే మనసుంటే బ్రతుకంతా పూలనావలో తేలిపోతున్నట్లు ఉంటుంది. ప్రకృతికి మనమీద ఎంత అనురాగం! నిస్వార్థంగా ఆనందం పంచి ఇస్తుంది? అనుకుంటాము.

కనుక మాటలతో చెప్పలేని, మాటలు అవసరం లేని శతకోటి భావాలు, భాష్యాలు మనసే మౌనంగా విప్పిచెబుతుంది అని అంటున్నాడు కవి ఈ భావ గీతం ద్వారా. ఈ పాటను గానం చేసిన పి.సుశీల గాత్రం వింటుంటే ఆమె పాడటం కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. సత్యభామకు పాడినా, శబరికి పాడినా, ప్రహ్లాదుడికి పాడినా వారే స్వయంగా పాడుతున్నారేమో అనిపించేటట్లు ఉంటుంది ఆమె స్వరం. ఒక్క వసంతకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ పాడుతూ శ్రోతలను అలరించే పాటల కోయిల సుశీల తెలుగు ఆడబడుచు కావటం తెలుగు వారికి గర్వకారణం.

Exit mobile version