Site icon Sanchika

మౌనం ఒక నిశ్శబ్ద నిగూఢ పెను తరంగం

[dropcap]ఇ[/dropcap]న్సూరెన్సు డెవలప్‌మెంటు ఆఫీసరుగా ప్రమోషన్ పైన వచ్చిన రమణారావు అశోక్ నగరులో పోర్షను తీసుకుని ఇప్పటికి నెల్లాళ్ళవుతూంది. ఇంటి డాబాపైన ఉన్నఆ పోర్షను గది ముచ్చట గొల్పేంత పసందుగా లేకపోయినా అతనికి మాత్రం అది నచ్చింది. మనసుకి ఊరట కలిగినట్లనిపించింది. ఆ యింటిని, ఆ యింటి ఆవరణం చూసీ చూడటంతోనే ఏదో ఒక సూనృత పూర్వజన్మ వాసన అతణ్ణి వెంటాడి ఆవహించినట్లనిపించింది. అనిర్వచనీయమైన దగ్గరితనం పెనవేసుకుంది. రవివర్మ కాలం నాటివి కాబోలు – దళసరి ఫ్రేముతో కట్టిన త్రిమూర్తుల పటం. నాలిక చాచి వీరావేశంతో కత్తి దూసి నిల్చున్న మహాకాళి శక్తి స్వరూపం. కమలంపైన ఆసీనురాలై మందస్మిత వదనంతో కనక వర్షం కురిపిస్తోన్న మహాలక్ష్మి ప్రశాంత వదనం. కొండంత గదను చేతబూని బ్రహ్మచారులకు ఆపద్భాందవుడైన ఆంజనేయస్వామి గంభీర స్వరూపం. వాటిని చూసిన మొదటిరోజే ఒంటరితనపు రాపిడికి లోనవుతూన్నరమణరావుకు యెండపొడన తొలకరి కురిసినట్లనిపించింది.

ఇక ఇంటిగల వాళ్ల గురించి చెప్పుకోవాలంటే – అక్కడ ఇంటి యజమానీ అతని భార్యామణితో బాటు ఆయనగారి వితంతు అత్త గారు తప్ప మరెవ్వరి అలికిడీ వినిపించదు. విశ్రాంత ఉద్యోగి కావడాన దొరికిన తీరుబడిని నిత్యనైమిత్తిక దైవార్చనలో లీనమయి కాల చక్రాల ఇరుసులను సశబ్దతతో పొర్లిస్తుంటాడు. ఆయన సతీమణి కూడా ఆయనకు యేమాత్రమూ తీసిపోకుండా ప్రాతఃకాలమే లేచి పెరటి తోటలోని పూలను మాలకట్టి పూజాగృహాన్ని అలంకరించి చిత్రవీణను కళ్ళకద్దుకుని “శోభిల్లు సప్తస్వర” – కీర్తన పలికిస్తూ భర్తకు తన్మయత్వం కలిగిస్తుంటుంది. ఏది యేమైనా మానవీయ మనుగడ ముకుళించుకుపోకుండా ఉండాలంటే, వయసుకీ ఉపాధికీ అతీతమైన మనోల్లాస వ్యాపకం ఒకటి ఉండే తీరాలి కదా!

ఎటొచ్చీ రమణావుకి వచ్చిన తంటా అంతా ఇంటి యజమాని అత్తగారు వినాయకమ్మగారితోనే!

ఎల్లప్పుడూ చక్రాల్లా తిప్పే ఆవిడ పదునైన చూపులు అతణ్ణి ఇబ్బంది పెట్టేవి. కొందరంతే మరి; కారణం ఉన్నా లేకపోయినా ఎదుట పడ్డ వారినందరినీ శల్య పరీక్ష చేస్తూ ఉంటారు. అదొక విధమైన కాలక్షేపం వాళ్ళకు. ఆమె వైఖరికి రమణ క్రమేణా అలవాటు పడ్డాడు కాబట్టి ఆవిడ ఉనికి ప్రభావం అతణ్ణిప్పుడు రాపిడికి లోనుచేయడం లేదు. ఇంకా నయం! ఆ యింటి అమ్మాయిలిద్దరూ పొరుగూళ్ళలో చదువుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ అలికిడి వల్ల తన పరిస్థితి ఇంకెంత గడ్డుగా తయారవునో!

అయితే అవన్నీ ప్రక్కనపెట్టి చూస్తే ఆ యింటి వాతావరణం, ఆ వీధి సందడి అతడి మనసుకి బాగా దగ్గరయాయి. ఎంత దగ్గరగా అంటే – ఆ రోడ్డున నడుస్తున్నప్పుడు చిన్నప్పుడెప్పుడో పలకా బలపమూ చేతబట్టుకుని, చెల్లితో బాటు అక్కయ్యను వెంబడించి నడిచే బడి వీథి కళ్ళముందు సజీవంగా సాక్షాత్కరిస్తుంది. చెల్లితో చెంగనాలు వేస్తూ దాగుడుమూతలాడే మోదుగు చెట్లు, ఎండకూ వానకు చెదరకుండా ద్వారపాలకుల్లా నిలచే చింత చెట్ల వరసలూ- గతకాలాన్ని తోడుకొంటుంటాయి. మొత్తానికి అక్కడి పరిసరాలన్నీ అతనికి బాల్యం నాటి మృదు మనోరాగాల మల్లె పందిళ్లే!

ఇక విషయానికి వస్తే-రమణారావు ప్రాతఃకాల దినచర్య ఇలా ఆరంభమవుతుంది.

మొదట తన చిన్నారి బంగారు కూతురుతో గోముగా మాట్లాడతాడు ఫోనులో. ఆ తరవాత కొడుకుని పిలిచి వాడి చదువుల గురించి ఆటపాటల గురించీ వాకబు చేస్తాడు. చివరన తల్లితో కష్టసుఖాలు చెప్పుకుని భార్యను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు; స్వంతూరికి బదలీ దొరకే అవకాశం మరీ దూరాన లేదని – అప్పుడో ఇప్పుడో వచ్చేతీరుతుందని. అదంతా నమ్మబలికే ప్రయత్నమే! అటుపిమ్మట మెస్ బాయ్ తెచ్చిన టిఫిన్ బాక్సు ఖాళీ చేసి ఫ్లాస్కునుండి కాఫీ పోసుకుని తాగి తాపీగా బాల్కానీ మెట్లు దిగుతాడు; తప్పీ జారీ ఆ వినాయకమ్మగారి చూపులో పడి మూడ్ పాడు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ. వీధిలోకి వచ్చి, యెప్పటిలాగే ఈసారి కూడా కొద్దిదూరం నడచి కనుచూపు మేర తలెత్తి చూసాడు. అదిగో-మళ్ళీ అదే బుజ్జిగాడు! వచ్చీపోయే వాహనలేవీ తనను తాకవన్న దివ్య ధీమాతో తోపుడు బండిలోని ఆట బొమ్మల్ని అదేపనిగా చూస్తూ నిల్చున్నా డు. అప్పుడు వాడు ఉన్నపళాన తల్లికి జ్ఞాపకం వచ్చినట్టున్నాడు, “ఒరేయ్ చిట్టీ! ఎంత సేపని అలా నడిరోడ్డున నిల్చుంటావు? రేపు మీ నాన్న డబ్బులు పంపిస్తాడులే! అప్పుడు నేను ఆటబొమ్మా బెలూనూ రెండూ కొనిస్తాలే!” బుజ్జిగాడు తల్లి బుజ్జగింపుకి ఎలా స్పందిస్తాడో రమణారావు ఊహించగలడు. “నాను రానంటే రాను! ఎప్పుడూ ఇంతే! రేపు రేపంటావు. ఎప్పుడు కొనిత్తావేంటి?”. అంతే! వాడి నిరసన స్వరంతో వాళ్ళమ్మ స్వరస్థాయి ఉన్నపాటున తగ్గిపోతుంది. ఆమె నుండి మరొక హెచ్చరిక రావడానికి కొంత సేపు పడ్తుంది; సైనిక శిబిరంలో విరామం తీసుకున్నట్టు. ఆ తల్లీ కొడుకుల మధ్య సాగుతూన్న తంతు నాలుగైదు రోజుల్నించి గమనిస్తూ వస్తూన్న రమణారావుకి ఆ రోజు తిక్కరేగింది. ఎంత చిన్నపిల్లవాడియితే మట్టుకు, అబధ్ధాల పైన అబధ్ధాలు చెప్పి మభ్యపెట్టడానికి ఒక హద్దూ పద్దూ ఉండక్కర్లే! ఆశపడ్తూ అంగలారుస్తూన్న చంటాడికి ఓ చిన్నపాటి బొమ్మ కొనివ్వడానికి యింత పెద్ద పొదుపా! భారత ఆర్థిక మంత్రికి కూడా అంత లావు పొదుపుండదేమో! ఈసారి అతడికెంత అసహనం కలిగిందంటే-ఉన్నపళాన పరుగెత్తుకెళ్ళి పది బొమ్మలు వాడి చేతికిచ్చి ఆ మాహాతల్లిని కొరకొరా చూసి ఇక తిరిగి చూడకుండా చకచకా తర లిపోవాలనిపించింది. కాని ఆవేశం ఆపుకున్నాడు. నిదానంగా ముందుకు కదిలాడు. తను అనుకున్నది ఒక్కటీ జరగబోయేది మరొక్కటీ అయి కూర్చుంటే! అసలే నిర్భయ కేసులు చెలరేగి పోతూన్న కాలమిది సుమా! అయ్యవారిని చేస్తున్నాననుకుని కోతి బొమ్మను తయారు చేసినట్లువుతుంది.

శుక్రవారం. తలంటుపోసుకొచ్చిన భవాని, జుత్తుని ఆరబోసుకుంటూ వదులు చేసుకుంటూ ముంగిట వరకూ వచ్చి-అక్క డ ఎదురైన దృశ్యం చూసి నివ్వెరపోయింది. బుజ్జిగాడి చేయి పట్టుకుని తననే చూస్తూ నిల్చున్నాడు రమణారావు! అంతకు ముందతణ్ణి రోడ్డమ్మట వెళ్తూ రావడం చాలాసార్లే చూసిందామె. చాలా మర్యాదస్థుడు-దించిన తల యెత్తకుండా సాగిపోతుంటాడన్న సదభిప్రాయం కలిగిందావిడకు. ఆమె కలవరపాటుని గమనించిన రమణారావు భరోసా ఇస్తూ అన్నాడు – “మీరు మరీ టెన్షన్ అవబోకండి! మీ అబ్బాయికి యేమీ కాలేదు. ఎవడో తుంటరి బడుగ్గాయి తోపుడు బండిలోనుంచి రెండు ఆట వస్తువుల్ని పట్టుకు పోయినట్టున్నాడు. ఆ పని మీ అబ్బాయే చేసాడనుకుని బండివాడు ఝాడిస్తుంటే కలుగజేసుకుని విడిపించుకుని వచ్చాను”. అతడా మాటలంటూ తనను కళ్ళప్పగించి చూడటం గమనించిన భవాని కనురెప్పలు రెండూ బరువుగా వాలిపోయాయి. ఒక బిడ్డకు తల్లయిన తరవాత కూడా ఆమెది చెక్కుచెదరని సౌందర్యం. నిండు రూపం. బజారు దారిన నడచి వెళ్తుంటే యెంతమంది కళ్ళు తనపైన వాలుతుంటాయో తడుముతుంటాయో ఆమెకు తెలియంది కాదు. ఎటొచ్చీ మంచీ మన్ననా తెలిసిన వాడుగా కనిపిస్తున్న రమణారావు కూడా వారిలాగే తనను కన్నార్పకుండా చూడటం ఆమెను ముడుచుకునే సిగ్గాకును చేసింది. ఎట్టకేలకు పెదవిప్పిందామె- “సారీ సార్! మా వాడు ప్రొద్దుటే మీకు ఇబ్బంది తెచ్చిపెట్టినట్టున్నాడు. మీకు ఆఫీసు – “

“దట్సాల్ రైట్ మేడమ్! మా ఆఫీసు మరీ దూరంలో లేదులే. ఒకటడుగుతాను – ఇఫ్ యు డోంట్ మైండ్?”

“దానికేముంది? అడగండి సార్!”

“ఒకే ఒక రోజు మీ అబ్బాయికి రెండు ఆటబొమ్మలు కొనిపిస్తే మీవారి బ్యాంకు బ్యాలెన్సు తరగిపోతుందా?” అతనా మాటలను మరీ సూటిగా చూస్తూ అన్నాడేమో భవాని ఖంగుతిన్నట్లయింది. మాటలు వెతకడానికి క్షణాలు పట్టాయి.

“విషయం అది కాదండీ! మావారు ముంబాయిలో పనిచేస్తున్నారండి. అదీను టెంపరరీ కాంట్రాక్టు ఉద్యోగమే! సొమ్ము ఇక్కడకు పంపించడానికి అటూ ఇటూ అవుతుంటుందండి. బొమ్మల్ని కొనివ్వకుండా దాటవేయడానికి మరొక కారణం కూడా ఉందండి. అన్నీ కాకపోయినా, కొన్ని క్రూడ్‌గా తయారయిన టాయ్స్ పిల్లలకు ప్రాణాంతకంగా తయారవుతుంటాయండి. మొన్ననేమో మా యెదురుంటి చంటబ్బాయి బొమ్మతో ఆడుకుంటున్నప్పుడు అందులోనుంచి రేకు వంటి పదునైన వస్తువు వాడి బొటన వ్రేలిని కోసేసిందండి. అందుకని–”

“ఓకే ఓకే! అర్థమైందండి. సైకలాజికల్ ఫియర్ అన్నమాట! ఎనీహౌ సారీ మేడమ్!”

క్షమాపణ యెందుకన్నట్టు చూసిందామె.

“ఎందుకంటే మిమ్మల్ని వ్యక్తిగతమైన ప్రశ్నవేసినందుకు. అయినా ఈ విషయం ఇక్కడితో సమసిపోనివ్వకూడదు. మీ వాడి నిక్కరు జేబులో ఒక నూరు రూపాయల నోటు ఉంచాను. కుర్రాణ్ణి నడిరోడ్డుకు వెళ్ళనివ్వకుండా రెండు నిరపాయకరమైన బొమ్మల్ని కొనిపెట్టండి. మీకు ముంబాయి నుండి సొమ్ము వచ్చింతర్వాతనే తిరిగిద్దురు గాని. చొరవ తీసుకున్నందుకు ఏమీ అనుకోకండి!” అంటూ రమణారావు రోడ్డుపైకి వెళ్లిపోయాడు. ఇప్పుడతని మనసు హాయిగా ఉంది! ఎంతైనా బిడ్డల తండ్రి కదూ!

నూరు రూపాయలు అరువిచ్చిన వారం రోజులు తిరక్కుండానే రమణారావు మళ్ళీ భవానీ ఇంటిముందు ప్రత్యక్షమయాడు. భవాని గాభరా పడింది. ఎక్కడైనా బావ గాని, వంగతోట దగ్గరు మాత్రం బావ కాదంటారు-ఇందుకేనేమో! భవాని నొచ్చుకుంటున్నట్టు ముఖం పెట్టి అంది- “సారీ సార్! మా వారు పంపిన అమౌంటు నా అకౌంటులోకి ఇంకా చేరలేదండి”.  ఆమె కంగారు చూసి రమణారావు నవ్వుకున్నాడు. “మీ వారి కంపెనీ మేనేజరు జీతం ఇంకా బట్వాడా చేయలేదేమో! అయినా నేనిప్పుడు నా నూరు రూపాయల కోసం రాలేదండి” అన్నాడు. మరెందుకొచ్చినట్లు -అని ప్రశ్నిస్తున్నట్లు ముఖం పెట్టి చూసిందామె. లోలోన ఆమె మనసు కుత కుతలాడిపోతూంది. అసలీ పెద్దమనిషిని నూరురూపాయలివ్వమని ఎవరు అడిగారని! తన కొడుకు బాగోగులు తను చూసుకోలేదా-ఇక్కడకు యేదో ఒక కారణాన రావాలన్న సాకుగాని! కాని కథ మరొక విధంగా అడ్డం తిరిగింది. “నిన్న కొత్త సంవత్సరం కదా! నాకిక్కడ మొదటి సంవత్సరం కూడాను. అందుకని నాతో పనిచేసే సహోద్యోగులు నాకు పళ్లూ స్వీట్లూ ఇచ్చి వెళ్లారు. ఇవన్నీ నేనొక్కణ్ణీ తినలేను కదండీ! ఫ్యామిలీ ఏమో ఊళ్ళో ఉన్నారు. అందుకని-” అంటూ తన బ్రీఫ్ కేసు తెరిచి తెచ్చినవన్నీ అక్కడున్న చాపపైన పెట్టి వెడలిపోతూ అన్నాడు- “ఇంతకూ బుజ్జిగాడి పేరు చెప్పనే లేదు!”

“రామభద్రుడు”

అలాగా అన్నట్టు తలూపి మళ్లీ అన్నాడు- “ఈ యేడాది కుర్రాణ్ణి బడిలో చేర్పించబోతున్నారు కదూ! వాళ్ళ నాన్నగారు గాని సమయానికి రాలేకపోతే నాకొక మాట చెప్తారు కదూ! నేనూ వస్తాను వాణ్ణి స్కూలులో చేర్పించడానికి” ఆమెకేమి చెప్పాలో తెలియక అలాగే అన్నట్టు తలూపింది. అతడల్లంత దూరం వెళ్ళిపోయింతర్వాత మనసు చివుక్కుమంది. తను కాఫీ ఇవ్వడం మాట అటుంచి కనీసం లోపలకు వచ్చి కూర్చోమని కూడా పిలవలేదు. గతకాలపు చేదు అనుభవాలను, ఇప్పటి రోజు ల అవాంఛనీయ పరిస్థితుల్నీ దృష్టిలో ఉంచుకుని తను మరీ అనుమానపు పురుగులా తయారవుతుందేమో!

అన్నమాట ప్రకారం రమణారావు దగ్గరుండి యెంత వద్దని వారిస్తున్నా వినకుండా రామభద్రుడికి అక్షరాభ్యాసం జరిపించి సంవత్సరానికి కట్టవలసిన మొత్తం స్కూలు ఫీజునీ ఒక్కసారిగా కట్టి చేర్పించాడు. అప్పుడు కూడా అదే మాట అన్నాడు-“మీ వారు ముంబాయి నుండి ఎమ్‌టీ చేసిన తరవాతనే నాకు మొత్తమూ తిరిగి ఇచ్చేద్దురు గాని భవానీ గారూ!”

ఈసారి ఆమె మనసు రమణారావు పట్ల మృదు భావనతో నిండిపోయింది. తన నుండి అతడేదో ఎదురు చూస్తున్నాడన్న అనుమానం ఇంకా పీడిస్తున్నా, ఆమెకెందుకో అతని పట్ల మునుపుటి విముఖత కలగలేదు. కాని యేది కావాలో యెలా అడగి దగ్గరకు చేరాలో తెలియక తర్జన భర్జన పడుతున్నట్టున్నాడు నరుడు. ఏది యేమైనా ఈ మధ్య రమణారావు భవానికి తరచుగా జ్ఞాపకం వస్తున్నాడు. ఆశగా చూస్తే అతడి పెద్దపాటి కళ్లు తన కళ్ళల్లో కదులుతున్నట్లనిపించసాగింది. మృదు మనస్కురాలైన భవానికి ఇటువంటి సుకుమార సున్నిత భావ ప్రభంజనం సోకడం సహజమేనేమో!

ప్రతి రోజూ వీథికి ఇరువైపులా తలలూపే పచ్చటి చెట్లను పూలమొక్కలను చూపుల సోపానాలతో స్పృశిస్తూ సాగిపోయే రమణారావు కనిపించలేదు. అదీను ఒకటీ రెండు రోజులు కాదు. మొత్తం నాలుగు రోజుల పాటు గోచరించలేదు. మొదట బాధ్యత గల ఉద్యోగం కదా – ఎటో టూరు పైన వెళ్ళుంటాడనుకుంది భవాని. కాని మరో రెండు రోజులు కూడా రమణారావు కనిపించక పోయేసరికి ఆమె చలించింది. మనసు అట్టడుగున కీడు శంకించింది. సాధారణంగా స్త్రీలకు ఆకాశమంత ఓర్పు ఉంటుందంటారు. కొండంత నిదానం చూపించగల నేర్పు ఉంటుందంటారు. కాని ఒక్క విషయంలో మాత్రం తమకు తాముగా తేలిపోతుంటారు. అదే–ఉవ్వెత్తున లేచిపడే భావోద్వేగ తరంగం ముందు!

అనుకున్నదే తడవుగా ఆమె రామభద్రుణ్ణి స్కూలులో దిగిబెట్టి రమణారావు ఇంటి పోర్షను ముందు అదాటున వాలింది. ఎత్తరి సౌందర్యరాశి అయిన భవాని ఉనికి గమనించి, సగం తెరిచిన తలుపు సందులోనుంచి తొంగి చూస్తూ వినాయకమ్మ అడిగింది-“ఎవరమ్మా మీరు?ఎవరు కావాలి?“

“ఇంటి డాబాపైన మా బంధువు ఒకాయన ఉంటున్నారు. ఆయన ఉన్నారండీ?”

“దానికే వస్తున్నాను. అదెవరని? ఆయన మీకేమవుతారని?”భవానీ చిరాగ్గా చూసి “ఇంకెవరట? ఇన్సూరెన్స్ సీనయర్ డెవెలప్‌మెంట్ ఆఫీసరు!” అంటూ మేడమెట్లెక్కింది. ఎగిసి పడుతూన్న గుండెల్ని అదుముకుంటూ, లోపలకు వెళ్ళేముందు ఒక పారి తట్టాలన్నధ్యాస కూడా మరచి తలుపుని నెట్తూ లోపలకు వెళ్ళిందామె. అక్కడ ఒంటరిగా నిశ్శబ్దమే తానై కుర్చీలో కూర్చుని ఉన్నాడు రమణారావు. అతడి పెదవుల మధ్య థర్మోమీటరుంది. కొన్నిరోజులుగా గీసుకోలేదేమో గడ్డం గుబురుగా పెరిగి ఉంది. నీరసించి కళావిహీనంగా ఉన్న అతడినాస్థితిలో చూసిన భవాని హృదయం తల్లడిల్లింది. ఇక తొలగి ఉండలేక పోయింది. ఒక్క ఉదుటున అతడి చెంతకు చేరి,రెండు చేతుల్నీ భుజాలపైనుంచి “ఈ స్థితిలో ఈ ఏకాంత వాసం దేనికండీ? కబురంపితే రానా!” అని కంపిత స్వరంతో అడిగింది. అతడు నిదానంగా పెదవుల మధ్యనుంచి థర్మోమీటరు తీసి ఉష్ణపు రేంజిని గుర్తుపెట్టుకుని తేరిపార చూస్తూ తన భుజాలపైనుండి ఆమె చేతుల్ని తొలగిస్తూ అన్నాడు- “మామూలు జ్వరమే. మందు డోసులు అధికంగా ఇచ్చేసినట్టున్నారు వైద్య మహాశయులు. ఒంట్లో వేడితో బాటు కడుపులో వికారం కూడా పెరిగినట్లుంది. జ్ఞాపకం లేక కాదు. ఈపాటి దానికి కంగారు పెట్టడం దేనికని ఊరకుండి పోయాను” అలా అంటున్నప్పుడు అతడి చూపు మేజారు జారిన ఆమె శరీరంపైన పడింది. దానిని అందుకుని భవానికి అందిచ్చాడతను. ఆమె దానిని అలవోకగా అందుకుంటూ అతడి చెంపల్ని ప్రేమగా నిమిరింది. “రండి వెడదాం” అతడు విస్మయంగా చూసాడు- ఎక్కడికన్నట్టు. ఆమె మనోహరంగా నవ్వింది “ఇంకెక్కడికి??మనింటికి”

“ఆలోచించే మాట్లాడుతున్నావా! నీ మగాడు లేని సమయంలో పరాయివాడు వస్తే చూసే వారేమనుకుంటారో ఆలోచించావా?“

ఆమె దానికి బదులివ్వకుండా అతడి కళ్లల్లోకి చూస్తూ అడిగింది- “నన్ను చూసి నిజం చెప్పండి. నేను బాగాలేనా?”

“నిన్ను అందంగా లేనన్నవాడిని కళ్ళున్న కబోదంటారు. కాని నేనడిగిన ప్రశ్నకు నువ్వింకా జవాబివ్వలేదు“

“ చెప్తాను. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా మీకు నిజం చెప్పే తీరాలిగా! మీకు చెప్పకపోతే మరింకెవరికి చెప్తాను? నేనిప్పుడు జీవిస్తున్నది నిజమైన జీవితం కాదు.ఇదొక విధమైన అజ్ఞాతవాసం!”.

అతడు అర్థం కానట్టు చూసాడు.

“మరీ ఆశ్చర్య పోకండి! మెడన పుస్తెల తాడు వేసుకుని కాలాన్ని వెనక్కి లాగుతూ కాలం గడుపుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు పెళ్లి కాలేదు. ఈజిట్ షాకింగ్?“

అతడు అభావంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. చివరకు స్వగతంలా అన్నాడు- “మరి రామభద్రుడి సంగతి?”

“నేను కన్నకొడుకే! కాని వాడికి తండ్రిలేడు. అంటే – ఇక్కడ లేడతను”

‘మరెక్కడున్నాడు?’ అన్నట్టు సూటిగా చూసాడు రమణా రావు.

కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి బదులిచ్చిందామె- “ఈ ఊళ్ళోనే లేడు. అసలు మన దేశంలోనే లేడు. డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో చిక్కుకుని మలేషియా జైలులో ఉన్నాడు. ఇక అతడిక్కడికి వస్తాడో లేడో తెలీదు. వచ్చినా-ఇట్ డజెంట్ మేక్ ఎనీ డిఫెరెన్స్. ఎందుకంటే అతనితో కలసి నేను జీవితం గడపలేను గనుక. ఇక నా జరుగుబాటు గురించి తెలుసుకోవాలనుందా? అదీ చెప్తాను. ఊళ్ళో నా పేర కొంత వరిమడి ఉంది. చిన్నప్పుడే అమ్మానాన్నా పోయారు. అదంతా మామయ్య చూసుకుంటున్నాడు. అడపా దడపా డబ్బులు పంపిస్తుంటాడు. లెక్కల ఊసు ఎత్తకుండా వచ్చిన కాడక సర్దుకుపోతుంటాను. కాని ఆయనకు కూడా తెలీదు నేను పెళ్లి కాకుండానే బిడ్డ తల్లి నయానని. బుజ్జిగాడు పెద్దవాడయాడు కాబట్టి నేనిక ఉద్యోగం వెతుక్కుంటాను. ఇక మీ అనుమానం తీరిందా?”.

రమణారావు బరువుగా నిట్టూరుస్తూ దూరంగా జరిగి కిటికీ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.

“అటువంటి క్రిమినల్సుని నమ్మి నీ సర్వస్వాన్నీ యెలా అర్పించుకున్నావు? చదువుకున్నదానివి. ఆపాటి ఇంగితం ఉండొద్దా? ఫోర్సుచేసి లొంగదీసుకున్నాడా!” రమణారావు గొంతున ఆవేశం క్రస్టులు తెరిచిన వరదలా పొంగుకొస్తూంది.

“లేదు. నేనిష్టడే అతనితో చేరువగా మెసలాను. కాని అప్పుడతని నేపథ్యం గురించి నాకు తెలీదు. మనసు మన స్వాధీనం తప్పిపోతే శరీరం మన మాట వినదు కదా! యవ్వనం విజృంభిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలన్న ధ్యాసే ఉండనే ఉండదు మరి”

“సరే-నీ నిర్వచనం అర్థమైంది. దీనికి బదులియ్యి. అతడు నిన్ను నిజంగా ప్రేమించాడనుకుంటున్నావా?”

“ఏమో! అవసరార్థం ప్రేమించినట్టు నటించాడేమో! నిజం చెప్పకపోవడమూ ఒక విధంగా మోసమే కదా! అందుకే దగా పడ్డానని తెలుసుకున్నతరవాత ఒక అంతర్జాతీయ క్రిమినల్ బిడ్డకు తల్లినయానని తెలుసుకున్న తరవాత శిథిలమైన హృదయంతో బ్లూవేల్ చిల్లింగ్ గేమ్ ప్రకారం ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. ధైర్యం చాలక, కడుపు తీపి చంపుకోలేక జీవఛ్చవంలా మిగిలిపోయాను” అంటూ అతడి వద్దకు వెళ్ళి అతడి ముఖంలోకి చూసి తీవ్ర చాంచల్యానికి లోనయింది.

అతడి రెండు కళ్ళూ తడిసి ఉన్నాయి. “ఎంతటి జాలి గుండే మీది!” అంటూ తన చీర చెంగుతో కళ్లు తుడిచింది. అప్పుడు రమణారావు నిర్వేదంతో చూస్తూ అన్నాడు-“కన్నీరు కార్చడం జాలి గుండె వల్ల మాత్రమే కాదు. జ్ఞాపకాలు నిప్పురవ్వలై యెగజిమ్ముతున్నప్పుడు హృదయం కరిగి ద్రవిస్తుప్పుడు కూడా కన్నీరు కారుతుంది. ఇప్పుడు నాకున్న బాధల్లా ఒక్కటే! ఉదాత్తమైన స్త్రీత్వం గల నువ్వు సహితం నా హృదయ ధారను స్పర్శించలేక పోయావు. ఎందుకంటే అందరిలాగే నువ్వు కూడా నన్ను బాహ్యదృష్టితోనే చూడటానికి ప్రయత్నించావు కనుక. అంతరాత్మ అంచుల వరకూ వెళ్ళి నాలోకి, నాలోపలకు చూడటానికి లేశమాత్రమూ ప్రయత్నించ లేదు!”

భవాని కళ్లు పేద్దవి చేసుకుని చూసింది -అంటే యేమిటన్నట్టు.

“ఓపారి నీ అంతర్దృష్టితో దేహస్థితికి అతీతంగా జరిగి నాకళ్లలోకి లోతుగా చూడు. అప్పుడు నా ముఖం మాటున మరొక ముఖం కనిపిస్తుంది” భవాని అప్రయత్నంగా రెండడుగులు వెనక్కి వేసి అతడి వేపు విస్ఫారిత నేత్రాలతో చూడసాగింది.

“నీవు మొదట్నించీ నాలో యేమి చూస్తున్నావో నాకు తెలియదు. కాని నేను మాత్రం నీలో ఆదినుండీ ఒకే ఒక రూపాన్ని చూస్తున్నాను. నువ్వు ఆత్మాహత్యా ప్రయత్నం చేసి ప్రాణంతో మిగిలి పోయావు. కాని మనసిచ్చి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపుల వల్ల అత్తగారి ఆరళ్ళ వల్ల కలిగిన క్షోభను భరించలేక కన్న కొడుకుని మా అమ్మానాన్నలకప్పగించి ప్రాణత్యాగం చేసుకుంది నీలాంటి ఒక స్త్రీ. ఆ స్త్రీ మరెవ్వరో కాదు,నా తోబుట్టువు! ఆ చెల్లే ఆదినుండీ నీలో నాకు కనిపించ సాగింది. రామభద్రుడు స్వయాన నా మేనల్లుడిలాగే గోచరించనారంభించాడు. కాని ఎటొచ్చీ నేనలా నీకు కనిపించకపోవడం నిజంగా నా దురదృష్టం-” అంటూ వెనక్కి తిరిగి చూసాడు రమణారావు.

కాని అక్కడ భవాని లేదు. బల్లపైనున్న ఒక స్క్రిబ్లింగ్ నోటు రెపరెపలాడుతూ అతడి వేపు దూసుకువచ్చింది. తీసి చూసాడు- “నలుచెరగులా పెరిగిన ఇప్పటి గంజాయి మొక్కల తావున వెలసిన పవిత్ర తులసి మొక్క మీరు. నా తొందరపాటుకి క్షమించండి!”

Exit mobile version