[box type=’note’ fontsize=’16’] “మౌనమన్నది గొప్ప విషయము. మౌనము సాధన చెయ్యటమన్నది ఒక తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి అవసరమయినంత మాట్లడటమన్నది ఒక విజ్ఞత” అంటున్నారు సంధ్య యల్లాప్రగడ ఈ వ్యాసంలో. [/box]
[dropcap]‘మౌ[/dropcap]నముగా ఎదగమని మొక్క మనకు చెబుతుంది’ అన్నది సినీ గీతము.
మౌనము అంటే మాట్లాడకుండా ఉండటమన్నది లోకములో సౌమాన్యమైన అర్థం.
మాట్లడటమన్నది, స్పష్టముగా అనుకున్నది చెప్పటమన్నది ఒక వరమే. కానీ, మాట్లాడకుండా చెప్పటము ఉత్తమోత్తమమైన ప్రక్రియ.
యోగులు, పూజ్యులు ఆ ప్రక్రియ ద్వారా మానవాళికి ఎంతో విజ్ఞానము, జ్ఞానము అందించారు.
మౌనముగా సాధించగలిగేవి ఎన్నో వున్నాయి. అన్నింటికి మాటల అవసరము వుండదు.
మౌనముగా పోరాటము సలిపి తనకు కలిగిన నష్టానికి సమాధానము పొందిన కథలు మనకు చరిత్రలో వున్నాయి.
“కృషితో నాస్తి దుర్భిక్షం,
జపతో నాస్తి పాతకమ్,
మౌనేన కలహో నాస్తి,
నాస్తి జాగరతో భయమ్” అన్నారు పెద్దలు.
మౌనముగా వున్నవారికి గొడవలు రావన్నది జగమెరిగిన సత్యం.
మౌనము అనగా మాటలను తమ స్వాధీనములో వుంచటము, నియంత్రించడం; లేదా మాటలాడడం తగ్గించడం అన్న అర్ధాలు చెప్పవచ్చు.
మౌనమన్నది గొప్ప విషయము. మౌనము సాధన చెయ్యటమన్నది ఒక తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి అవసరమయినంత మాట్లడటమన్నది ఒక విజ్ఞత, పరిపూర్ణ జ్ఞానము. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి. ఈ పంచ శాంతులు: ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం మరియు శాంతి.
మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మాట వెండి అయితే, మౌనం బంగారం అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.
అతిగా మాట్లాడేవారికి విలువ తగ్గిపోతూ ఉంటుంది అన్నది కూడా లోకములో చూడవచ్చు.
మౌని ఆచరించే వ్రతము మౌనము – యజ్ఞపు శక్తి మౌనము.
“ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం
యువానం వర్శిష్ఠాంతే వస దృషి గణైరావృతం బ్రహ్మనిష్ఠైః।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే॥”-
అంటూ పరమశివుడు దక్షణామూర్తిగా అవతరించి అందించిన సారమంతా మౌనమే. దక్షిణామూర్తిగా, యువకునిగా స్వామి చిన్ముద్రలో వట వృక్షం క్రింద కూర్చొని వుంటారు. వృద్ధులైన మునులు చుట్టూ చేరి వుంటారు. దక్షిణామూర్తి భోద అంతా మౌనమే. కాని మునులకు అందినది మాత్రము అనంతము.
ఇది పుక్కింటి పురాణమని అనుకొని, నమ్మకపోతే, ప్రతీది సందేహ దృష్టితో చూసే నేటి జనులకు మౌనము ద్వారా భోద చేసిన రమణ మహర్షి గురించి వినే వుంటారు. అరుణాచలమున మౌనముగా ఆయన చాలా సంవత్సరాలు వుండి పోయారు.
మౌనమును పెద్దలు మూడు రకాలుగా చెబుతారు. అవి వాజ్మౌనం, అక్షమౌనము, కాష్ఠమౌనము.
వాజ్మౌనం అంటే వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలుకుట, అబద్ధములాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి. దీనిని వారములో ఒక రోజు సాధన చెయ్యటమన్నది సాంప్రదాయమైన కుటుంబాలలో వుంది.
అక్షమౌనం అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును. కాష్ఠమౌనం అంటే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడింది. ఇవి మూడూ కలిపి త్రిమౌనాలు. మౌని అయిన వారు త్రిమౌనాలు పాటించి మనసు ప్రశాంతమొనర్చుకొని, పరమాత్మ వైపుకు చిత్తాన్ని నిలిపుతారు.
మొదట వాచక మౌనము సాధన చేస్తే, అది అలవాటుగా మారి, మానసిక మౌనమునకు సహయపడుతుంది.
మౌనము గురించి కృష్ణ భగవానుడు గీతలో ‘శ్రద్ధాత్రయ విభాగ’ యోగములో చెబుతాడు. నిశ్చలమనస్సు, మృదుత్వం, మౌనము, మనఃశుద్ధి కల్గిఉండడం మనసుతో చేయు తపస్సు. ఫలాపేక్ష రహితం, నిశ్చల మనస్సు, శ్రద్దతో చేయు తపస్సు సాత్వికం, అని భగవానుడు చెప్పాడు.
యోగికి వుండవలసిన మౌనము గురించి పతంజలి యోగసూత్రాలలో కూడా చెప్పియున్నాడు.
ఆధ్యాత్మిక వున్నతికి మౌనము అవసరము. సాధకులు మౌనము పాటించి త్రిగుణాలను నియంత్రించి చేయు సాధన ఫలవంతమగుటకు అవకాశము అధికము. మౌనము వలన ఆరోగ్యము పెరుగుతుంది. దివ్యమైన వర్చస్తు లభిస్తుంది. మౌనము వలన వారు పలికే వాక్కుకు అనంతమైన శక్తి లభిస్తుంది. మౌనము వలన మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. సాధకులు చేయు సాధన ఫలించటానికి మౌనము తప్పక సహయపడుతుందని నిరూపించబడింది.
కాబట్టి మౌనము శరణం గచ్ఛామి!!