Site icon Sanchika

మొపాసా రచనలు – జీవితం-2

[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘మొపాసా రచనలు – జీవితం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ భాగము. మొదటి భాగము లింక్]

[dropcap]అ[/dropcap]తను సృష్టించిన సాహిత్యం గురించే గాక, దానికి అనుసంధానంగా అతని జీవిత గాథనూ మననం చేసుకోవాలి.

ఫ్రాన్స్ దేశపు నార్మండి [Normandy] ప్రాంతంలో ఉండే డైయఫ్ [Dieppe] అనే చేపల రేవు పట్నం దగ్గిర 5 ఆగస్టు 1850 న పుట్టాడు మొపాసా. అతని తల్లిదండ్రుల పేర్లు లావ్ లే పోయిట్టెవిన్ {Laure Le Poittevin], గుస్తావ్ ద మొపాసా [Gustave de Maupassant].

అతనిని కనే ముందు ప్రత్యేకంగా ఒక మంచి చోట ఒక భవనాన్ని అద్దెకు తీసుకుంది తల్లి అని కొందరంటారు; కాదని కొందరంటారు. తెల్లవారు జామున పుట్టాడు. అతని అమ్మమ్మ ఆ సమయాన పుట్టాడు గనుక భవిష్యత్తులో మధ్యందిన మార్తాన్డుడిలా వెలుగుతాడు అని జోస్యం చెప్పింది.

తన గుండ్రటి తల గురించి ఒక హాస్య కథను సృష్టించి ఒకసారి తన సేవకుడికి చెప్పాడు మొపాసా. తల గుండ్రంగా ఉంటే అందంగానే కాక, తెలివితేటలతో నిండి ఉంటుందని భావించాడు పురుడు పోసిన వైద్యుడు. మొపాసా పుట్టగానే, వైద్యుడు తన రెండు మోకాళ్ళ మధ్య శిశువు తలను ఉంచి బలంగా మర్దన చేశాడట. కుమ్మరి తన బొటన వ్రేలుతో చక్రం మీది మట్టి పాత్రకు రూపును అలానే తెస్తాడు. మొపాసా తల్లితో ఆ వైద్యుడు ఈ విధంగా అన్నాడట:

 “నీ కుర్రాడికి గుండ్రటి ఆపిల్ లాంటి తలనిచ్చాను. గుండ్రటి తలైతే అది తెలివితేటలతో నిండుటుందని.”

మొపాసా తండ్రి స్త్రీలోలుడు; భార్యాభర్త ఎప్పుడూ కలహించుకునే వాళ్ళు. అతని తండ్రి తల్లిని ఆటవికుడిలా కొట్టడం మొపాసా కంట పడింది. ఆ హింసాత్మక సంఘటన అతని మనసులో గాఢంగా ముద్రితమయి మొపాసా ఇలా అన్నాడు:

 “ఆ రోజు నుంచి జీవితంలో ప్రతిదీ మరో విధంగా, చెడుగా కనబడటం ఆరంభించింది; మంచిని చూడలేక పోయాను.”

రచయితకు 11 ఏళ్ళు, అతని తమ్ముడికి 5 ఏళ్ళు ఉన్నపుడు అతని తల్లి తండ్రికి విడాకులివ్వగా పిల్లలిద్దరూ తల్లి సంరక్షణలో అందమైన సముద్ర తీర పట్నం ఎట్రటా లో [Etretat] పెరిగారు.

తల్లిదండ్రుల విడాకులకు దారి తీసిన ముఖ్య సంఘటన బయటపడలేదు. ఒకసారి మొపాసా తండ్రి తన ప్రియురాలిని భార్య నివసిస్తున్న చోటుకే తెచ్చాడు. మొపాసా అంత చిన్న వయసులో తన తల్లికి వ్రాసిన లేఖ ఉంది. దాంట్లో ఇలా అన్నాడు అతను:

“కాంపోజిషన్లో నాకు ప్రథమస్థానం వచ్చింది.   అభినందిస్తూ మదాం ..x నన్ను నాన్నతో బాటు సర్కసుకు తీసుకెళ్లింది. నాన్నకు కూడా ఆమె బహుమతులు ఇస్తుందనుకుంటాను. అవేమిటో మాత్రం నాకు తెలియదు.”

తన తల్లిని మాత్రం మొపాసా సెయింట్‌గా భావించేవాడు.

వాళ్ళింటికి ఒక వంకర వేళ్ళ ముసలిది బట్టలు కుట్టడానికి అప్పుడప్పుడూ వస్తుండేది. ఆమె అతనికి ఎన్నో కథలు చెబుతుండేది.

ఒకసారి ఒక పిల్లి తీగ-ఉచ్చులో తగులుకుని బైట పడలేక విలవిలా కొట్టుకుంటుంటే దాన్ని తప్పించగలిగినా ఆ పని చెయ్యకుండా చూస్తుండిపోయాడు ఆసక్తితో. అది చచ్చిపోయింది.

ఒక గుడారంలో మొపాసా పడుకుని ఉండగా పెద్ద తెరకప్ప ప్రవేశించి అతని మొహానికి తగిలింది చల్లగా, తేమగా. అతను దాన్ని చేజిక్కుంచుకుని ప్రతీకారం తీర్చుకోదలచాడు. ఒక సిగరెట్ అంటించి రెండో చివరను దాని నోట్లోకి జొనిపాడు. అది దాన్ని ఒదిలించుకోలేక, తప్పనిసరిగా పొగను పీల్చవలసి వచ్చి, ఉక్కిరిబిక్కిరయి చనిపోయింది.

ఈ హింసాత్మక ప్రవ్రుత్తి నేపథ్యంలో ‘ప్రేమ’ [Love] అన్న కథను మననం చేసుకుందాం. వేటగాడి దుర్మార్గపు తూటాకు ఒక పక్షి రాలిపోయింది. మృత విహంగం చుట్టూ దాని భాగస్వామి తిరుగుతూ విలపించిన సంఘటన కథానాయకుడిని వేధిస్తుంది. ఆ పాత్ర ద్వారా అంతలా కారుణ్యాన్ని ఒలకబోసిన మొపాసా, అలాంటి జీవహింసకు చిన్నతనంలో పాల్పడి ఉండటం పరస్పర విరుద్ధమైన లక్షణమే.

 తల్లి గ్రంథపఠనం చేయడమే కాక కొడుకు చేతా ఆ పని చేయించేది. బడిలో అతనికి వ్యాకరణం, లెక్కలు, లాటిన్ భాషా బోధించే వాళ్ళు. అతని తల్లి, మరొకరు మిగతా పాఠాలు నేర్పేవారు. ఆమె ఆంగ్లంలో చదివిన షేక్‌స్పియర్ [Shakespeare] నాటకాలను ఫ్రెంచి భాషలో తనయుడికి చదివి వినిపించేది. మాక్బెత్ [Macbeth], మిడ్ సమ్మర్ నైట్’స్ డ్రీం [Midsummer Night’s Dream] అతనికి ఇష్టమైన నాటకాలు.

ఆమె కొడుకును ఐవిటో [Yvetot] లోని మత సంబంధమైన చిన్న బడిలో [seminary] అతని 13వ ఏట వేసింది. ఇంటిని గుర్తు చేసుకుంటూ దిగులుపడేవాడు. ఉపవాస దినాలలో మొపాసా మాంసం తినటానికి చర్చి ఒప్పుకోలేదు. పైగా ఆ సేమినరి ఎత్తు గోడలు బైటి ప్రపంచపు శబ్దాలను అడ్డాయి. మృత్యు నిశ్శబ్దానికి బాల మొపాసా తట్టుకోలేక పోయాడు. తల్లి హృదయం అతన్ని బడి మానిపించింది. మిగిలిన విద్యా సంవత్సరం, తరువాతి సంవత్సరమూ మొపాసా ఇంటిదగ్గిరే ఉండిపోయాడు. ఎట్రేట లో హాయిగా తిరుగుతూ జీవించడం మొదలుపెట్టాడు. అక్టోబర్ 1867 లో తల్లి అతన్ని సేమినరికె తిరిగి పంపింది. పాత అనుభవాన్ని మళ్ళీ ఎదుర్కోవలసి వచ్చింది అతనికి. ఆ సంవత్సరం, మరొక సంవత్సరం చదువు మిగిలి ఉండగా ఒక సంఘటన జరిగింది. నరకంలో అనుభవించాల్సిన హింసల మీద ‘ఫాదర్’ ఇచ్చిన ఉపన్యాసాన్ని అనుకరిస్తూ తన తోటి విద్యార్థుల దగ్గిర మాట్లాడి వాళ్ళను వినోదింప చేశాడు. మత సంబంధమైన ఆలోచనలు అసభ్యంగా ఉంటాయని ఒక పెళ్లిసందర్భంలో అని, వాళ్ళను వినోదింప చేశాడు. మిగతా కుర్రాళ్లతో కలిసి వైన్ సీసాలను దొంగిలించాడు. శిక్షను నెత్తి మీదికి కావాలని తెచ్చుకున్నాడు. బడి నుంచీ 1868లో అతను కోరుకున్న విధంగా వెళ్లగొట్టారు. ఆ చర్చి కాపలాదారు [janitor] కుర్రవాడిని తనతో మొపాసా ఇంటికి తెచ్చిఅతని తల్లికి అప్పగించాడు. ఆమె ముందు కొడుకును మందలించి, తరువాత వాటేసుకుంది. ఎట్రేట లో ఆనందంగా ఉంటున్నాడు. రేవు పట్నం లే హావ్ [Le Havre] లోని మరో బడిలో విద్యను కొనసాగించాడు.1869లో డిగ్రీ చదువు పూర్తయింది. 1871లో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. ఫ్రాన్స్ ప్రష్యన్ యుద్ధం [Franco-Prussian war] అడ్డుపడింది. యుద్ధంలో పనిచేశాడు. గుమస్తాగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి 1874 -1880 మధ్యలో పనిచేశాడు, ఆ పనంటే ద్వేషిస్తూనే. ఆ చాలీ చాలని జీతపు గుమస్తా జీవితం అతన్ని బాధించింది. నౌక-బానిస [galley-slave] జీవితాన్ని గడపవలసి వచ్చింది అనుకునేవాడు. ఆ జీవితాన్ని తన రచననలలో ప్రతిబింబించాడు.

ఆంగ్ల కవి ఆల్గెర్నాన్ చార్ల్స్ స్విన్బరన్ [Algernon Charles Swinburne] పడవను నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఇద్దరు నావికులు అతన్ని రక్షించడంలో 14 ఏళ్ళ మొపాసా కూడా ఒక చేయి వేశాడు. మరుసటి రోజు ఆ కవి మొపాసాను ఇంటికి ఆహ్వానించాడు. ఆ ఆంగ్లేయుడితో పాటు అతని స్నేహితుడు మరొక ఆంగ్లేయుడూ వచ్చాడు. వాళ్ళు కళ, సాహిత్యం, మానవత్వాల గురించీ మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు భయానకంగా, కలతపెట్టాలా అనిపించాయి మొపాసాకు. అక్కడి బల్లలపై ఎముకలున్నాయి. అందులో నరికి తోలు వలిచిన హస్తం ఒకటుంది. తల్లిదండ్రులదో దగ్గిర బంధువులదో నరికిన హస్తం అది. ఎండిన రక్తం, మాంసం తెల్లటి ఎముకలను కప్పి ఉన్నాయి. ఒక పెంపుడు కోతి వాళ్ళను వెక్కిరిస్తూ అక్కడ కలియ తిరుగుతోంది. ఆ కోతిని దాన్ని ద్వేషిస్తూ వచ్చిన భద్రతా మనిషి తరువాత ఉరి తీసినట్టు మొపాసాకు తెలిసింది. ముఖ ద్వారం ముందు దాన్ని సమాధి చేసారు. తరువాత మరొక రోజు ఆ ఆంగ్లేయులు మొపాసాను తిరిగి భోజనానికి ఆహ్వానించి మరో కోతి మాంసం పెట్టారు. దాన్ని తినలేక పోయాడతను. ఎండబెట్టి నిలువ ఉంచిన [mummified] చేయి చిన్న వయసులో భయంగొలిపే, దాని మనోచిత్రం గీసి, అతన్ని ప్రభావావితం చేసి 1875లో ‘తెగిన చేయి’ [La Main Ecorchee] అనే ఒక కథను రాయించింది.

బడిలో చదువుతున్నపుడు కవిత్వం వ్రాయడం మొదలు పెట్టాడు. గత సెమినరీ జీవిత నేపథ్యంలో మత వ్యతిరేక, సామాజిక, స్త్రీ సంబంధమైన విషయాల లోకి తల దూర్చాడు.

మొపాసా ఎరుపు రంగు ఛాయలో ఉండేవాడు. బొద్దు మీసాలు. ఉంగరాలతో నిండిన, గోధుమరంగు జుట్టు. దృఢమైన కంఠం. కావాలనుకుంటే అవతలి వ్యక్తి మైమరిచేలా మాట్లాడగల ఊసరివిల్లితనం కలవాడు. ఆంబోతులా ఉండేవాడు; దానంత బలమైన మనిషి కూడా. అతను పడవను తెడ్లు వేస్తూ 50 మైళ్ళు నడపగలిగేవాడని ఎమిల్ జోలా ఒకసారి చెప్పాడు. నాలుగు గంటల పాటు ‘సేయిన్’ [Seine] నదిలో తెడ్లు వేస్తూ పడవను నడపాల్సి వచ్చిందని సేవకుడితో మొపాసా చెప్పాడు. ఎవరితోనైనా కొట్లాటకు సిద్ధంగా ఉండేవాడు. పెంకెఘటం. ఒకసారి మాత్రం అతను ఒక గలాటాలో లొంగిపోక తప్పలేదు. పొలంపని చేసే ఒక వ్యక్తి మొపాసా చేత తన్నులు తింటుంటే, మరో పనివాడు అతనికి సాయం వచ్చి మొపాసాను కొట్టటం మొదలుపెట్టాడు. ఎట్రేట ఊరులోని మిగతా గ్రామస్థులు వచ్చి మొపాసాను రక్షించారు. ఇక్కడ ఒక కొస మెరుపుంది. తన్నులు తిన్నవాడికి మొపాసా ముందుగా డబ్బిచ్చాడు ఆ వ్యక్తి బలాన్ని తన్నుల మాధ్యమంతో పరీక్షించడానికి.

1867లో మొపాసా తల్లి అతన్ని తన మృత సోదరుడు ఆల్బర్ట్ స్నేహితుడైన ఫ్లాబే [Flaubert] వద్దకు సాహిత్య శిష్యరికం చెయ్యడానికి పంపింది. ‘మదాం బోవరి’ [Madame Bovary] లాంటి ప్రపంచ ప్రసిద్ధ నవల వ్రాసిన అక్షర శిల్పి ఆ గురువు. బహుశా టోల్‌స్టాయ్ వ్రాసిన ‘అన్నాకరెనినా’కు [Anna Karenina] ఆ నవలే స్ఫూర్తి. పదేళ్ళపాటు తన గురువు ఫ్లాబే తర్ఫీదు తోనే సరిపోయింది.

గురువును సంతృప్తిపరచడం కష్టతరం. ఏడేళ్లపాటు మొపాసా అన్న పేరుగల ఆ వజ్రానికి ఆయన సానపెట్టాడు. రచనలను తూర్పారపట్టాడు. కొన్ని మొపాసా అభిప్రాయాలను ఖండించేవాడు గురువు. ఆడవాళ్లు మార్పులేని విధంగా, రొడ్డకొట్టుడుగా [మోనోటోనస్] ఉంటారని మొపాసా అభిప్రాయం. దానికి తేలికైన ఔషధం వాళ్ళతో ఏ విధంగా వ్యవహరించకపోవడమే అని గురువు అన్నాడు. జరిగే సంఘటనలలో వైవిధ్యంలేదు అన్న మొపాసా అభిప్రాయానికి ఇలా అన్నాడు గురువు: “అది వాస్తవవాది ఫిర్యాదు. అంతే కాక ఆ విషయంలో నీ పరిజ్ఞానం ఎంత? వాటిని మరింత క్షుణ్ణంగా నీవు పరిశీలించాలి. ఎపుడైనా విషయాల ఉనికి గురించీ నీవు నమ్మావా? నిజానికి వాటి ఉనికి బ్రాన్తి [illusion] కదా! విషయాలను పరిశీలించే విధంలో మార్పుంటుంది కానీ వాటి ఉనికి విషయంలో కాదు,” అని గురువు అన్నాడు. చెడు అలవాట్లు అల్పమైనవి అని మొపాసా అన్నాడు. “ప్రతిదీ అల్పమైనదే కదా; పదాల వాడుకలో అనేక పద్ధతులుంటాయి. అన్వేషించు, అవి దొరుకుతాయి,” అన్నాడు గురువు.

వాళ్ళ సంబంధం గురు శిష్యులది కాదు; తండ్రీ కొడుకులది. “అతను నా శిష్యుడు, అతన్ని నా కొడుకులా ప్రేమిస్తాను” అన్నాడు ఆ గురువు. అతను పెంపుడు తండ్రయ్యాడు. ఫ్లాబే మొపాసా వ్రాతప్రతులను దిద్దేవాడు హెడ్మాస్టరులా; తన అభిప్రాయాలను వాటి మీద వ్రాసేవాడు. కొన్ని పదాల సముదాయాలను, అనవసర వ్యాఖ్యలను నిర్దాక్షిణ్యంగా కొట్టేసేవాడు. వాక్యం లయకు [cadence] మరో శబ్ద రూపాన్నిచ్చేవాడు. రెండు వరుస వాక్యాలు ఒకే విధంగా నిర్మితమయ్యుంటే, ఒకేలా ధ్వనిస్తే మొపాసాను మందలించేవాడు. గురువు చెప్పిన విధంగా తిరిగి వ్రాసి ప్రతి రవివారం అతనికి చూపించేవాడు. మొపాసాకు తుర్గనేవ్, ఎమిల్ జోల, హేన్రి జేమ్స్ లాంటి రచయితలను ఫ్లాబే పరిచయం చేశాడు.

ఉద్యోగం చేస్తున్నపుడు దొరికే ఖాళీ సమయాలలో పందెపు పడవలో [yacht] తిరగడం, స్త్రీల వేటలో గడిపడం చేసేవాడు. మొపాసా స్త్రీలోలత్వానికి ఫ్లాబే మందలించాడు. గురువుకూ స్త్రీలతో లైంగిక సంబంధాలుండేవి.

అసలు సిసలైన కథను శిష్యుడు వ్రాయగానే గురువు ఆనందంతో నాట్యం చేసినంత పనిచేశాడు. మొపాసాకు చక్కని మెచ్చుకోలు ఉత్తరం రాశాడు. మొపాసా ‘కొవ్వు బంతి’ [A Ball of Fat] పేరుతో ఆ కథ 1880లో వ్రాసిన రెండు నెలలకు ఫ్లాబే చనిపోయాడు ఉన్నట్టుండి. గురువు శరీరాన్ని కడిగి సమాధికి సిద్ధంచేశాడు శిష్యుడు.

“సతతం ఫ్లాభే గురించే ఆలోచిస్తుంటాను; అందరూ ఎలా అతన్ని గౌరవిస్తారో అలా నన్నుగౌరవించడం జరిగిన మరుక్షణం నేనూ మరణించడానికి సిద్ధం,” అన్నాడు మొపాసా.

మారు పేరుతో వార్తా పత్రికలకు వ్యాసాలూ వ్రాశాడు.

1880లో రచయితగా జీవితం ఆరంభమయింది. అదే సంవత్సరంలో ఫ్రాన్స్- ప్రష్యన్ యుద్ధం మీద మరో నలుగురితో కలిసి కథా సంకలనం ఒచ్చింది. అతను వ్రాసిన బౌల్ ద సుయిఫ్ [Boule de Suif] [కొవ్వు బంతి – A Ball of Fat] తో ప్రసిద్ధుడయ్యాడు. 300 కథలు, ఆరు నవలలు, మూడు యాత్రా పుస్తకాలు ఒక కవితల సంపుటి ప్రచురించబడ్డాయి.

‘స్వేచ్ఛ ఒచ్చిన ఆంబోతులా’ అనేక వ్యక్తులతో లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు, చనిపోయేంత వరకూ. ఆడవాళ్లు అధిక సంఖ్యలో అతని చుట్టూ తిరిగేవాళ్లు. “వీళ్ళు నన్ను ఊపిరి కూడా పీల్చుకోనివ్వడం లేదు,” అని తన సేవకుడితో అన్నాడు ఒకసారి. అతని తల్లి అనిన దాని ప్రకారం అతని 16వ ఏట నుంచే అతని శృంగార జీవితం ఆరంభమయింది. ఆ స్త్రీ పేరు తల్లికి తెలుసు. అది తప్పుగా ఆమె భావించలేదు. అంత వరకూ అతను పరిశుద్ధంగా వున్నందుకు, అందమైన పిల్లతో కొడుకు లైంగికానందాన్ని పొందినందుకు ఆమె సంతోషించింది. అతనికి కులీన స్త్రీలతో కలిగిన లైంగికానుభవాలు స్త్రీల పట్ల చులకన భావం కలిగించి వాళ్ళగురించీ చెడ్డగా మాట్లాడేలా చేశాయి. “మరి నేను ఎలాంటి దాన్నీ?” అని ఒక సారి తల్లి కొడుకును అడిగింది. “నీవు మిగతా వాళ్లలా కాదు,” అన్నాడు.

మొపాసా స్త్రీలోలత్వం అతని ఈ మాటలలో కూడా వెల్లడయింది:

“నాకు ఒక్క స్త్రీని మాత్రమే ప్రేమించి ఊరుకోవడం అసాధ్యమైన పని: మిగతా స్త్రీలనూ అంతగానూ ప్రేమిస్తాను కనుక. నాకు వేయి స్త్రీ బాహువులు కావాలి, వేయి పెదవులు కావలి, వేయి స్త్రీ మనస్తత్వాలు కావాలి – అన్నిటినీ ఒకేసారి కౌగలించుకోడానికి.”

ఇరవయ్యో ఏట అతనికి సవాయి జబ్బు [సిఫిలిస్] వచ్చింది. దానికి తొలుత చికిత్స చేయించుకో నిరాకరించాడు. అది అతనికి, అతని తమ్ముడికీ పుట్టుకలో వచ్చిందన్న అభిప్రాయం కొందరు విమర్శకులలో ఉంది. అది క్రమేపీ కళ్ళకు వ్యాపించింది; మానసిక వ్యాధిగా రూపు దిద్దుకుంది. తన మానసిక వ్యాధి దిగజారడం మొపాసా గ్రహించాడు. ఆ స్థితి ప్రభావంతో కథలు వ్రాసాడు. భయానక కథలు 39 దాకా వున్నాయి. ఒక సైన్స్ ఫిక్షన్ కథ ‘అంగారక మానవులు’ [Martian Mankind] 1887 లో ప్రచురించబడింది.

1887వ సంవత్సరంలో 1000 అడుగులపై ఎత్తు ఐఫిల్ టవర్ [Eiffel Tower] నిర్మాణాన్ని చేపట్టినప్పుడు అతనితో కలిపి 47 మంది కవులు, రచయితలు, కళాకారులూ దాన్ని నిరసించారు. దేశంలోనే ఎత్తైన కట్టడాన్నినిర్మించడమే దాని వెనుక ఉద్దేశం. అది 1930 వరకే మిగతా కట్టడాలకన్నా ఎత్తైనదిగా ఉంది. అది కనిపించకుండా ఉండాలని దాని క్రింద ఉండే హోటల్లో భోంచేసి వాడు మొపాసా.

1887లో అతినికంటె ఐదారేళ్ళ చిన్నవాడైన అతని సోదరుడు హెవే [Herve] సవాయి రోగం కారణంగా వచ్చిన ఉన్మాదంతో మరణించడంతో మొపాసా రచనలు చేయడం మానేశాడు.

“వాడు చనిపోవడం చూశాను. వైద్యులన్న దాన్నిబట్టి వాడు నిన్ననే చనిపోవలసింది కానీ, నన్ను చూడటం గురించీ ఎదురు చూస్తూ బ్రతికాడు ఈ రోజు వరకు,” అన్నాడు మొపాసా దుఃఖభరితంగా.

1891లో దిగజారిన తన మానసిక స్థితిలో తన దయ్యాన్నితానే చూసినట్టు ఊహించుకున్నాడు. ఊహాజనితమైన శత్రువును చూసి తనవైపుకు తానే ఎక్కుపెట్టిన తుపాకీని పేల్చాడు. కంటి చూపు బాగా తగ్గిపోయింది. విపరీతమైన తలనొప్పులు, నిద్రలేమిదనం బాధించేవి. వాటికి మాదక ద్రవ్యాలను ఉపయోగించాడు. జనవరి 2,1893న తన పీక కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఏదో శబ్దమైతే నౌకరు ఆ గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళాడు. యజమాని గొంతు నుంచీ రక్తస్రావం అవుతోంది, “చూడు, ఫ్రాంక్వా, ఏమి చేశానో. నా గొంతు కోసుకున్నాను. ఇది తిరుగులేని పిచ్చిపని,” అని తన వాలేతో [valet] అన్నాడు. ఆ సేవకుడే ఆసుపత్రిలో చేర్పించాడు. 6 జూలై న 1893లో మొపాసా భౌతికంగా వెళ్ళిపోయాడు.

మొపాసా వ్రాయని జీవితాంశం లేదు: ఒంటరితనం, ముసలితనం, చావు, వేదన, పగ, దుర్మార్గం, నోస్టాల్జియా, ప్రేమ, వంచన, యుద్ధం, భయానకం, మానవాతీతం.. నలభై మూడేళ్లు పూర్తవకుండా నిష్క్రమించిన మొపాసా మరింత కాలం జీవించి ఉంటె ప్రపంచానికి మరింత సాహిత్య సంపద లభించి ఉండేది.

మొపాసా మరణానంతరం అతని తల్లి దృష్టికి ముగ్గురు వ్యక్తులను తెచ్చి వాళ్ళు అవివాహితుడైన మొపాసా సంతానమేనా అని ఎవరో అడిగారు. ఆమె ఇలా చెప్పింది:

“నాకు తెలిసినంత వరకూ వాళ్ళు మాత్రమే వాడి సంతానం.”

మొపాసాను పారిస్ లోని మఫర్నస్ [Montparnasse] సెమెటిరీ లో పూడ్చిపెట్టారు. 1900 సంవత్సరంలో జ్ఞాపక చిహ్నం నిర్మించారు. దాని దగ్గిర నిలబడి ఎమిల్ జోలా ఇలా అన్నాడు:

“మొపాసా ఈ ప్రపంచం చూసిన వ్యక్తులలో అత్యంత సంతోషపరుడే కాదు, అత్యంత విచారగ్రస్తుడూనూ.. అతని కథల పై చర్చ జరక్కుండానే సెలబ్రిటీ అయ్యాడు,.. వేరెవరన్నాఅతనిలా వ్రాసుంటే దిగ్భ్రాoతికి గురిచేసే రచనలు కూడా, అతను వ్రాయబట్టి పాఠకుల చేత చిరునవ్వు నవ్వించాయి..”

తన చరమశ్లోకం [epitaph] తానే ఇలా వ్రాసుకున్నాడు:

“ప్రతిదానిని అపేక్షించాను; ఏదీ ఆనందం ఇవ్వలేదు.”

(సమాప్తం)

Exit mobile version