[మాయా ఏంజిలో రచించిన ‘Passing Time’, ‘Grey Day’ అనే రెండు కవితలని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
~
1. గడిచే కాలం
తెలవారు ఝాము తెలుపు
నీ చర్మపు రంగు
నాదేమో సంజె చీకటి రంగు
ఒకటేమో ఖచ్చితంగా మొదలయ్యే అంతానికి రంగులద్దుతుంది
మరొకటి నమ్మకంగా మొదలవబోయే ప్రారంభానికి..
2. బరువైన రోజు
రోజు భారంగా వేలాడుతుంది
బోలుగా.. ఉదాసీనంగా..
నువ్వు దూరంగా ఉన్నప్పుడు
ఓ ముళ్ళకిరీటం..
ఓ ఊలు చొక్కా..
నేను ధరించేది ఇవే
మనం వేర్వేరుగా ఉన్నప్పటి
నా ఒంటరి హృదయం
ఎవరికీ తెలియదు..!!
(ప్రియమైన వారికి దూరంగా ఉన్న ఒక అంతర్ముఖీన స్థితిని ప్రతిఫలిస్తుంది ఈ కవిత.)
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
మాయా మాటలు:
- నా గతం పట్ల నాకు గొప్ప గౌరవభావం ఉంది.
- జీవితంలో నా లక్ష్యం బ్రతకటం ఒక్కటే కాదు, ఎదగాలి, ఏ పని చేసినా ఇష్టపూర్తిగా చెయ్యడం, నిబద్ధతతో చెయ్యడం నాకు నచ్చుతుంది. హాస్యస్ఫూర్తి ఉండి నాదైన శైలిలో పని చెయ్యడం నాకిష్టం.
- మీకు ఇష్టం లేనిదేదైనా ఉంటే దాన్ని మార్చేందుకు ప్రయత్నించండి. మార్చలేనట్టయితే దాని పట్ల మీ వైఖరిని మార్చుకోండి.
- సత్యం ఏమిటంటే – మనలో ప్రతి ఒకరూ స్వేచ్ఛాజీవులు కానట్లయితే, మనమింకా స్వేచ్ఛ పొందనట్లే.
- ఎవరైనా వారేంటో చూపించినట్టయితే, మొదటిసారికి మాత్రమే వారిని విశ్వసించు.
- ఎవరికీ చెప్పుకోలేని బాధని మనసులో దాచుకొని తిరగడం కన్నా గొప్ప వేదన మరొకటి లేదు.