[మాయా ఏంజిలో రచించిన రెండు కవితలను అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. ఈ రెండు చిన్న కవితల్లో, అనుకోని అతిథి వంటి గతకాలపు ప్రేమ జ్ఞాపకాలు కలిగించే వేదన, నిద్ర పట్టని రాత్రిళ్ళ బాధ, ‘మాయా’ని ఒక భిన్నమైన కోణంలో చూపిస్తాయి.]
~
(1) నువ్వొచ్చినపుడు (When You Come)
అనాహ్వానిత అతిథిలాగా
నువు నా దగ్గరికొస్తావు
గడచిన పురా జ్ఞాపకాల్లోకి
నను తిరిగి రమ్మని పిలుస్తూ
అతి కొద్దికాలపు కలయికను
ఓ చిన్న పిల్లకు జ్ఞప్తికి తెచ్చినట్టుగా..
దొంగిలించిన ముద్దుల ముద్రలు
అరువు తెచ్చి ఇచ్చుకున్న
చిట్టి చిట్టి ప్రేమ కానుకలు
పెట్టెల కొద్దీ రహస్య ప్రేమ పదాలు
అయ్యో.. నన్నేడిపిస్తున్నాయిప్పుడు!!
***
(2) నిదురలేమి (Insomniac)
కొన్ని రాత్రుళ్ళు నిద్ర నాతో ఆటలాడుతుంది
నిర్దాక్షిణ్యంగా నిద్ర నాకు
దూరంగా జరుగుతుంది
రాని నిదురని గెలిచేందుకు
నేను పన్నే వ్యుహాలన్ని తిప్పికొట్టి
నా అహాన్ని గాయపరుస్తుంది
అదే మరింతగా బాధిస్తుంది.
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవితలు వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.