మాయ ముసుగు

0
3

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘మాయ ముసుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సికింద్రాబాద్ నుండి రేపల్లె వెళ్లే ట్రైను తెనాలి స్టేషన్లో ఆగింది. రెండవ నంబరు ప్లాట్‌ఫామ్ మీద నిలబడి వున్నారు ప్రొఫెసర్ రావు దంపతులు. ట్రైను దిగే బంధువులు రైల్లోంచి తమ బ్యాగులు దింపుకుంటున్నారు. వాళ్ల చేతుల్లోంచి బ్యాగులు అందుకుని రావుగారు అక్కడున్న బెంచీ మీద వుంచారు. వాళ్ళకు దగ్గర్లో నిలబడి వున్న యువతి రావుగారిని గమనించి చున్నీతో ముఖాన్ని కప్పుకుంటూ గబగబా నడుచుకుంటూ జనంలో కలిసిపోయింది. ఆ దృశ్యం ఆయన కంటబడింది. కాని ఆ యువతి ఎవరో అర్థం కాలేదు. బంధువులతో కలిసి మెట్లు దిగుతూ, మాట్లాడుకుంటూ ఒకటవ నంబరు ఫ్లాట్‌ఫామ్ మీదకు చేరుకున్నారు. మెయిన్ గేటు దగ్గరకు వెళుతూ రావుగారు ఒక్కసారి వెనక్కు తిరిగి చూశారు. ఆ యువతి ప్లాట్‌ఫామ్ మీదే వున్నది. తనని గమనిస్తున్నారని భావించి గభాల్న ఒక స్తంభం చాటుకు తప్పుకున్నది. ఎవరై వుంటారో? ఆలోచనకు అందలేదు.

నాలుగు రోజులు గడిచినవి. బంధువుల్ని మరలా రైల్వేస్టేషన్లో వదిలి రావు దంపతులు తిరిగి వస్తున్నారు. రాత్రి పదిన్నర అయ్యింది. మెయిన్ రోడ్డు మీదున్న గౌతమ్ హోటల్ దగ్గరకు రాగానే లైట్ల వెలుతుర్లో ఇందిర కనుపించింది. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నది. ఈ టైంలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ? అన్న ఆలోచన రాగానే దగ్గరగా వెళ్లి “ఇందిరా!” అన్నారు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పుడు కూడా చున్నీతో ముఖాన్ని ఎక్కువ భాగం కప్పేసుకున్నది. ఆ రోజు స్టేషన్లో స్తంభం చాటున దాక్కున్నది ఇందిరే. సందేహం లేదు. ఎందుకో ఆ అమ్మాయి ఇట్లా దాక్కుంటున్నది? ఆ టైంలో ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేసి వెళ్లాలనిపించలేదు.

“ఇక్కడ పనేమైనా వుందా ఇందిరా?”

“లేదు సర్, ఇంటికి వెళ్లటానికే చూస్తున్నాను. తెలిసిన వారొచ్చి బండి మీద తీసికెళ్తానన్నారు”

బండితో ఎవరూ రాలేదు గాని ఒక ఆటో వచ్చి దగ్గరగా ఆగింది. ఆటో లోపల ఒకరిద్దరున్నారు.

“వస్తాను సర్. ఇంటికే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇబ్బందేం లేదు” అంటూ ఆటో ఎక్కి కూర్చున్నది. ఇందిర ‘వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్’ బస్సు డ్రైవరు వెంకటేశ్వర్రావు కూతురు. కాలేజ్ స్టాఫ్ కూడా కొంతమంది బస్సుల్లో వస్తూనే వుంటారు. బస్‍లో వచ్చే స్టాఫ్‌ తోనే కాకుండా మిగతా స్టాఫ్ కూడా వెంకటేశ్వర్రావు బాగా చనువుగానే వుంటాడు. వందా, రెండు వందలు తరుచూ అందర్నీ అడిగి తీసుకుంటూ వుంటాడు. డబ్బు ఎందుకు అవసరమయ్యిందో వివరంగా వర్ణిస్తాడు. తను చెప్పే అబద్దాలు నిజమని నమ్మించటానికి ప్రయత్నిస్తూ వుంటాడు. డబ్బు అడిగేది తాగుడు కోసమేనని అందరికి తెలుసు. పట్టినపట్టు వదలకుండా, చెప్పినమాట చెప్పకుండా డబ్బులు రాబట్టుకోవడంలో మహా నేర్పరి. అతని భార్య సామ్రాజ్యం కూడా రోజువారీ కార్మికురాలిగా కాలేజీలోనే పనిచేస్తూ వుంటుంది. వీళ్లకిద్దరు పిల్లలు, ఇందిర, వంశీలు. ఇందిర బి.యస్సీ, పూర్తి చేసి బి.యిడి. ఎంట్రన్స్ వ్రాసింది. క్వాలిఫై కాలేక పోయింది. యమ్.సి.ఎ., చదవాలని ఆ అమ్మాయికి బాగా కోర్కె. ఎంట్రన్స్ వ్రాసింది. పాతిక వేలల్లో రాంకొచ్చింది. లోకల్‌గా వున్న ప్రియదర్శినీ కాలేజ్‌లో యమ్.సి.ఎ.లో చేరింది. తల్లీదండ్రీ ఇద్దరూ పగలంతా బయటేవుండి పనిచేస్తూ వుండటంతో ఏదైనా అవసరం కలిగినపుడు ఇందిర తన తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ వుంటుంది. అలా వచ్చినపుడు వెంకటేశ్వర్రావు తన కూతుర్ని తీసుకొచ్చి స్టాఫ్‌కు పరిచయం చేస్తూ వుంటాడు. కూతురి ఫీజులకు డబ్బు తక్కువైంది అంటాడు. పుస్తకాలు కొనాలని చెప్తూవుంటాడు. సామ్రాజ్యం మాత్రం ఎప్పుడూ ఎవరి దగ్గరి కొచ్చి ఒక రూపాయి అప్పు కావాలంటూ అడగదు. ఏదైనా సహాయం చేయమనీ కోరదు. తన పనేదో తను చేసుకుపోతూ వుంటుంది. భర్తను తాగుడు మాన్పించటానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాని ఏవీ ఫలించలేదు. కూతుర్ని కూడా తాము పనిచేసే చోటుకు రావొద్దు అని చెప్తుంది.

“మీ నాన్నతో ఇంటిదగ్గరే మాట్లాడు” అంటుంది. “నాన్న కాలేజ్ కొస్తే డబ్బులు ఇప్పిస్తాను, రమ్మంటున్నాడు” అని ఇందిర అప్పుడప్పుడూ కాలేజ్ కొచ్చేది. చాలా చురుకైనది, మాటకారి. తన పని సాధించుకునే నేర్పరితనమున్న ఆడపిల్ల. మగపిల్లవాడైన వంశీ మాత్రం ఎప్పుడూ వికాస్ కాలేజ్ కొచ్చేవాడు కాదు. ఇంటి దగ్గరే తన పనులు పూర్తి చేసుకునేవాడు. అమ్మా, నాన్నల దగ్గర ఎప్పుడు డబ్బులుంటాయో పసిగట్టేవాడు. ఒడుపుగా డబ్బులు చేజిక్కించుకునేవాడు. యమ్.సి.సి. గ్రూప్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. టెన్త్ కాగానే పాలిటెక్నిక్‌లో చేరుదువుగాని అంటే విన్పించుకోలేదు. “పాలిటెక్నిక్ తర్వాతైనా నేను బి.టెక్, చెయ్యాల్సిందే” అన్నాడు. ఇందిర కూడా తమ్ముణ్ణి సమర్థించింది. “ఫీజులన్నీ గవర్నమెంట్ భరిస్తుంది. ఇబ్బందేం వుండదు. ఈ రోజుల్లో ఎంతోమంది బి.టెక్, చేస్తున్నారు” అంది.

‘రెక్కాడితే గాని, డొక్కాడని కుటుంబాలు. పిల్లలకు తెలివితేటలు ఒక్కటుంటే సరిపోతుందా? మా ఇంట్లోని పిల్లలకు పెద్ద పెద్ద చదువుల ఆలోచనలెందుకు? ఉన్న ఊల్లో కాలేజీలున్నాయి కాబట్టి ఇంట్లో తిని వెళ్లి చదువుకుంటున్నారు. ఈ చదువు లెప్పటికి అయిపోతాయో? ఏ రోజుకారోజు నేను భయపడుతూ బతుకుతున్నాను. తండ్రి, పిల్లలకు నా భయాలేం తెలియటం లేదు’ అని బాధపడుతూ వుంటుంది సామ్రాజ్యం.

రెండు రోజుల తర్వాత వెంకటేశ్వర్రావు కాలేజ్‌లో రావుగారి దగ్గరకొచ్చాడు.

“మీరు స్టేషన్ దగ్గర్లో కనుపించారని మా అమ్మాయి చెప్పిందండి.”

“రాత్రి పదిన్నర ప్రాంతంలో కనుపించింది. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది. ఇంటికి వెళ్లటానికి ఇబ్బందేం లేదని కూడా చెప్పింది”.

“ఆ రాత్రి ప్రొద్దుబోయి ఇందిర ఇంటికి వచ్చిందని వాళ్ల అమ్మ చెప్పింది. నేను ఇందిరను విషయం కనుక్కున్నాను. వాళ్ల కాలేజ్ ఫైనలియర్ వాళ్లకు కాంపస్ సెలక్షన్స్ జరిగాయట. సెలక్షన్స్ జరిపే హెచ్.ఆర్. ఆ రాత్రికి గౌతమ్ హోటల్‌లో వున్నాడట. మర్నాడు మళ్లీ రేపల్లె వెళ్లి యమ్.సి.ఎ. వాళ్లను కాంపస్‌కు సెలక్ట్ చేసుకోవాలట. మన కాలేజ్ సెలక్టయిన నాళ్లకు త్వరలో కాల్ వస్తుంది. సెలక్ట్ చేసిన హెచ్.ఆర్.ను కలిసి థాంక్స్ చెప్పి రమ్మని వాళ్ల హెచ్.వో.డీ పంపిచాడట. ఫైనలియర్ వాళ్లకు తోడుగా రమ్మంటే మా ఇందిర వచ్చానని చెప్పింది. మా అమ్మాయి చాలా తెలివిగా వుంటుందని కాలేజీలో అందరికీ చాలా ఇష్టం అంటండి. పైగా ఐ.సెట్ లో రాంక్ తెచ్చుకుంది గదా? మిగిలిన వాళ్లేమో కాస్తాకూస్తా డబ్బు గట్టి చేరినవాళ్లు మా అమ్మాయి నెప్పుడూ రాంక్ స్టూడెంట్ అని పిలుస్తారంట”

“మొన్నీ మధ్య పెట్టిన కాలేజీయే గదా అది? అప్పుడే కాంపస్ సెలక్షన్స్ అవీ పెద్దగా వుండకపోవచ్చు. వున్నా పెద్ద కంపెనీల వాళ్లెవరూ అయివుండరు. ఏదో, ఒక కంపెనీ హెచ్.ఆర్. వచ్చి సెలక్ట్ చేస్తే రాత్రిపూట ఆడపిల్లలు వెళ్లి థాంక్స్ చెప్పరు. చెప్తే కాలేజ్ తరుపున ఎవరైనా స్టాఫ్ కాని, మానేజ్‌మెంట్ వాళ్లుకాని వెళ్తారు. డిన్నర్ అరేంజ్ చేస్తారు. నీకు తెలుసుగా వెంకటేశ్వర్రావ్?”

“అవుననుకోండి, మా అమ్మాయి బాగా తెలివిగలది గదండి. ఇపుడే కాలేజీలో ఏదైనా కంప్యూటర్ వర్కుంటే మా అమ్మాయి చేత చేయించి డబ్బులు కూడా ఇస్తున్నారు. చదువుకుంటూనే కష్టపడుతున్నది. తన ఖర్చులకు పోను మాకే డబ్బు కొద్దిగా సర్దుబాటు చేస్తున్నది. వాళ్ల హెచ్.వో.డీ. హైదరాబాద్ కూడా పంపిస్తానన్నాడంట. ఒకవారం పాటు ఏదో వర్కున్నది. చేసి వస్తే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది, మనీ కూడా వస్తుంది వెళ్తానంటున్నది మా అమ్మాయి.”

“ఏదైనా ప్రాజెక్టు వర్కుంటే కాలేజ్ వాళ్లందరితో కల్సి వెళ్తారు. పని నేర్చుకుంటారు. ఇలా ప్రత్యేకించి ఏ ఒక్కరికో పనంటూ వుండదు. హెచ్.ఓ.డీ.లు ఎవరూ అలా పంపరు. తొందరపడి హైదరాబాద్ పంపకు, ఇంకా వివరాలు కనుక్కో” అన్నారు రావుగారు.

‘ఆ రోజు స్టేషన్‌లో తనను చూచి స్తంభం చాటున దాక్కున్నదంటే తను అక్కడున్నట్లు తెలియకూడదని, తర్వాత రాత్రిపూట కనిపించి చెప్పిన మాటలు కూడా నమ్మదగ్గవిగా లేవు. ఇందిర ఏదో చేస్తున్నది. అది దాచి ఇంట్లో వాళ్లకు అబద్ధాలు చెప్తున్నది. ఈ వెంకటేశ్వర్రావుకు కాస్త డబ్బు చేతిలో పెట్టే చాలు తాగేసి పడుకుంటాడు. కూతురు చదువుకుంటూనే, పార్ట్ టైమ్ చేసి సంపాదిస్తుందని నమ్ముతున్నాడు’ అని భావించారు రావుగారు.

***

వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు డ్రైవర్లందరూ బస్సుల్ని కాలేజీ ముందు భాగంలో నిలిపివుంచారు. కొంతమంది బస్సుల్లోనే వున్నారు. మరికొంతమంది కాలేజీ చెట్లనీడలో కూర్చుని కబుర్లాడు కుంటున్నారు. కాలేజీ మెయిన్ గేటు దగ్గరున్న సెక్యూరిటీ దగ్గర కెళ్లారు.

ఇద్దరు యువకులు. “ఎ.ఓ. వెంకటేశ్వరావు గారు రావాలి. ఆయన ఎటువైపు నుంటారు? ఎలా వెళ్లాలి?” అని కనుక్కుంటున్నారు.

“ఎ.ఓ. వెంకటేశ్వరావు గారెవరూ ఇక్కడ లేరు. ఎ.ఓ.లు ఇద్దరున్నారు. కిషోర్ కుమార్ గారు, సుధీర్ బాబుగారు” అని సెక్యూరిటీ చెప్తున్నాడు.

“వెంకటేశ్వర్రావు గారు కావాలి. ఎ.ఓ. అనే చెప్పారు మాకు”

“నాన్ టీచింగ్ స్టాఫ్‌లో ఆ పేరు గలవారు ఎవరూ లేరు” సెక్యూరిటీ ఖచ్చితంగా చెప్పాడు.

వచ్చినవాళ్లు ఎవరెవరికో ఫోన్ చేసుకున్నారు. మళ్లీ వస్తామని వెళ్లిపొయ్యారు.

***

ఇందిర డబ్బుని ఫ్రీగా ఖర్చుపెడుతున్నది. ఇంట్లోకి కావలసిన చిన్నాచితకా వస్తువులు సమకూరుస్తున్నది. ఆదివారం సెలవు రోజుల్లో కూడా ‘కాలేజీలో పనివున్నది, కంప్యూటర్ వర్క్ చేయాలి’ అని వెళ్లిపోతున్నది. సామ్రాజ్యం భర్తను పోరుకులాడుతున్నది “పిల్ల చదివే కాలేజ్ కెళ్లి ఒకసారి చూసి రా విషయం తెలుస్తుంది అని”. అతడి చెవికెక్కలేదు. ఊరుకోలేక వంశీని పంపించింది కాలేజ్‌కు. ఇందిర కాలేజ్లోనే వుంది. లేడీస్ హాస్టల్లో వుండి ఏదో పని చేస్తుందన్న సమాచారంతో ఇంటికొచ్చాడు.

సాయంకాలం ఇంటి కొచ్చింది ఇందిర. “తీరిందా అమ్మా నా మీద అనుమానం, కొడుకును నా మీద నిఘాకు పంపావు. మా కరస్పాండెంట్ సార్ ఆదివారాల్లో లేడీస్ హాస్టల్ కెళ్లి వాళ్లను కాస్త చెక్ చేయమన్నారు. అవసరముంటే నన్ను కూడా కాలేజ్ హాస్టల్లో ఫ్రీ గానే వుండమన్నారు. నేనేం ఊరికే తిరగటానికి వెళ్లలేదు. కాలేజీ పనిమీదే వెళ్లాను. చిన్నా చితకా కాలేజీ పనులు చేసి పెడుతున్నాననే గదా ఈ లాప్‌టాప్ కొనిచ్చారు. చదువుకుంటూనే కష్టపడుతూ పనులు గూడా చేస్తుందని ఆలోచించుకోవాలి” అన్నది నిష్ఠూరంగా చేతిలోని లాప్‌టాప్‌ను అక్కడున్న బల్లమీద పెడుతూ.

“హాస్టల్లో వార్డెన్లుంటారు. వాళ్లు చూసుకుంటారు. ఇంకా సూపర్‌వైజర్లుంటారు. స్టూడెంట్స్ రెందుకు చెప్తారు ఈ పనులన్నీ” అన్నది సామ్రాజ్యం.

“నేనైతే స్టూడెంట్‌గా కలిసిపోయి వాళ్ల విషయాలన్నీ తెలుసుకుంటాను. సూపర్‌వైజర్ల కెలా తెలుస్తాయి అన్ని విషయాలు? కొత్త కాలేజ్, బాగా పేరు రావాలి. హాస్టల్ కూడా బాగా డిసిప్లిన్‌గా వుండాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. నమ్మితే నమ్ము లేకపోతే లేదు”.

చేసేదేం లేక సామ్రాజ్యం మెదలకుండా ఊరకుండి పోయింది.

***

ప్రియదర్శిని కాలేజ్ హాస్టల్‌లో వుండే భవాని తన బాయ్ ఫ్రెండ్‌తో ఎక్కడికో వెళ్లిపోయింది. భవాని బాయ్ ఫ్రెండ్ శంకర్. ఇద్దరూ క్లాస్‌మేట్స్. ఇందిరకు భవాని చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇందిరే భవానికి చాలా సపోర్ట్ ఇచ్చిందంటున్నారు. వీళ్లు ముగ్గురూ కలిసి, సినిమాలకు, షికార్లకు బాగానే తిరిగేవారు. భవాని, శంకర్‌లకు చాలా ధైర్యం చెప్పి పంపింది ఇందిర. ‘ఏం ఫర్వాలేదు. నాల్గు రోజులు పోతే మీ పెద్దవాళ్ల కోపాలు అనేపోతాయి. చచ్చినట్లు మీ పెళ్లి చేస్తారు. పెళ్లయితే మాత్రమేం? చదువు పూర్తి చేసుకోవచ్చు గదా? ఆ తర్వాత వెంటనే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది’ అని చాలా సపోర్టింగ్‌గా మాట్లాడి వాళ్లిద్దర్నీ పంపించింది అని మిగతా వాళ్లు చెప్తున్నారు.

భవాని తల్లిదండ్రులు హాస్టల్ కొచ్చారు. పారిపోయిన వాళ్లు ఎక్కడి కెళ్లుంటారో వీళ్ళేమైనా చెప్పగలరేమో తెలుసుకుందామని. వాళ్లకు చాలా సిగ్గుగా, అవమానంగా అన్పిస్తున్నది. పోలీస్ రిపోర్టు ఇవ్వాలా వద్దా? అన్న ఆలోచనలో పడ్డారు. ఇంకా అల్లరైపోతామా? లేక పోలీసు రిపోర్టిస్తే వాళ్ల ఆచూకీ త్వరగా తెలుస్తుందా? ఏమీ తేల్చుకోలేకుండా వున్నారు. భవాని నోటి వెంట ఇందిర అన్న పేరు రెండుమూడు సార్లు వినివున్నారు. ఆ అమ్మాయికి తప్పకుండా తెలుస్తుంది అనుకున్నారు. హాస్టల్లోని మిగతా పిల్లలు కూడా అదే విషయాన్ని బలపర్చారు. ఇందిరకు కబురు వెళ్లింది. వస్తూనే ఓదార్పుగా భవాని వాళ్ల అమ్మ చెయ్యి పట్టుకుంది. “మీరేం బాధపడకండి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరైనా తెలిసిన వాళ్లుంటే కొంచెం రహస్యంగా ఎంక్వైరీ చేసి పెట్టమని అడగొచ్చు. మీరా పని చూడండి. నాకు తెలిసినంతవరకు శంకర్ తరుపు వాళ్ల దగ్గరకు వెళ్లరు. ఏ హైద్రాబాద్‌కో, చెన్నైకో పోయుంటారు. ఎన్నాళ్లుంటారు. నాల్గు రోజుల్లో తిరిగి వస్తారు. కాని ఈలోగా గందరగోళంగా చెప్పుకుంటారు. ఆంటీ, మీరివ్వన్నీ అసలు పట్టించుకోకండి. మీకసలే ఆరోగ్యం బావుండదని భవాని చెప్పేది. అసలీ రోజుల్లో ఇలాంటివన్నీ తేలిగ్గా చేసేస్తున్నారు. చదువులైపోయే దాకా ఆగాలి. పెద్దవాళ్ల సలహాతో ఏ పనైనా చెయ్యాలి” అన్నది ఆరిందాలాగా.

మిగతా పిల్లలందరూ ముఖముఖాలు చూసుకోవటం మొదలుపెట్టారు. ఇదేమిటి, ఈ ఇందిర ఊసరవెల్లి లాగా ఇన్నిరంగులు ఎందుకు మారుస్తుంది? అటు ఫ్రెండ్‌కు బాగా ఊతమిచ్చింది. ఇటు పెద్దవాళ్ల దగ్గర ఎంతో వినయంగా, వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతున్నది. అందరి దగ్గరా మంచి అనిపించుకోవటమే ప్రధానమా? ఒక ప్రక్క ఎన్నో అబద్ధాలు చెప్తున్నది మరొక ప్రక్క సమయానుకూలంగా మాట్లాడుతున్నది. బాగా డేంజరస్ అమ్మాయి, జాగ్రత్తగా వుండాలి అనుకున్నారు వారంతా.

“నీ మాత్రం తెలివితేటలు, ఆలోచనా మా భవానికి ఉంటే మాకీ తిప్పలెందుకు?” అన్నది వాళ్లమ్మ.

“నాకు తప్పకుండా ఫోన్ చేస్తుంది భవాని, వాళ్లెక్కడున్నదీ తెలిసిపోతుంది. నేను మీకు వెంటనే తెలియజేస్తాను. మీరింకేం వర్రీ అవ్వొద్దు. రెండుమూడు రోజుల్లో తిరిగి వస్తారు. చదువులైపోయినాక పెళ్లి చేస్తామని చెప్పండి” అంది ఇందిర.

హాస్టల్ సూపర్‌వైజరు వచ్చింది. “మామ్మూలుగానే షాపింగుకు వెళ్తానని పర్మిషన్ అడిగింది. అలా వెళ్లి మరలా హాస్టల్‌కు రాలేదు” అని చెప్పింది. వాళ్లను ఆమె ఆఫీస్ రూంలోకి తీసుకెళ్లింది.

“మిమ్మల్ని నమ్మి నా బిడ్డను చదువుకోసం ఇక్కడుంచి వెళితే మీరు చేసే నిర్వాకం ఇదా? అమ్మాయి వైఖరి పట్ల రాకపోకల పట్ల మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? ఏ మచ్చా లేకుండా నా బిడ్డ నిపుడు నా కప్పగించగలరా? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను” అని ఆయన ఆఫీసులోని వాళ్లపై ఆవేశపడ్డాడు.

“మిగతా ఆడపిల్లలందరూ హాస్టల్లో జాగ్రత్తగా వుండటంలేదా? మీరు అనవసరంగా మమ్మలంటున్నారు. మామూలుగా అమ్మాయిలంతా కలిసి షాపింగ్‌కు వెళ్తూవుంటారు. రికార్డులకనీ, ఫ్యాన్సీ వస్తువులకనీ వెళ్తూవుంటారు. అలానే ఫ్రెండ్స్‌తో కల్సి వెళ్లిందట. చుట్టాలిళ్లలో ఏమైనా వున్నదేమో కనుక్కోండి”.

ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇక్కడ లభించదన్న ఉద్దేశంతో ఆయన అక్కణ్ణించి లేచి వచేశారు. తనే ఏదైనా ప్రయత్నంచేసి భవానిని ఇంటికి తీసుకురావలనుకున్నారు.

కాలేజ్ ముందు ఇందిర ఎవరో మగవాళ్లతో గొడవ పడుతున్నది. వాళ్లకేదో నచ్చచెప్పాలని చూస్తున్నది. కాని వాళ్లు ఏ మాత్రం విన్పించుకునే ధోరణిలో లేరు.

“డబ్బులు తెరగా వున్నాయనుకున్నావా? మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వు, ఇవ్వలేదంటే ఎంత దూరమైనా పోతాం. కోర్టు కీడుస్తాం. మీ ఇంట్లో వాళ్లను కట్టేసి తన్నుకుంటూ తీసుకెళ్తాం” అంటూ పెద్దగా అరుస్తున్నారు.

“నేను సుధాకర్‌తో మాట్లాడతాను. మేం మేం చూసుకుంటాం. అసలు మీరు ఇక్కడికెందుకు వచ్చారు? వెళ్లిపోండి”

“సుధాకర్‌తో మాట్లాడేదేమీ లేదు. డబ్బులు తిరిగి ఎప్పుడిస్తావో అది మాత్రమే చెప్పు. నువ్వు సుధాకర్‌కు సరిగ్గా సమాధానం చేస్తే మేమెందుకు వస్తాం? మీ నాన్న కాలేజీలో ఎ.ఓ.గా పనిచేస్తున్నాడని అబద్ధాలు చెప్పావు. ఎన్ని నాటకాలేస్తావు? డబ్బు కడతావా? తన్ని ఈడ్చుకుంటూ పోలీసుస్టేషనుకు తీసుకువెళ్ళమంటావా?”

ఈ కేకలు విని కాలేజ్ ఫిజికల్ డైరెక్టరు వచ్చి విషయమేమిటో తెలుసుకున్నారు. “వాళ్ల నాన్నను పిలిపించి మాట్లాడదాం. కాలేజీ ముందు ఈ రభసేంటి? ఇక్కడ న్యూసెన్స్ చేయవద్దు. డబ్బు విషయాలు బయట మాట్లాడుకోవాలి” అంటూ వాళ్లను ప్రస్తుతానికి పంపించి వేశారు.

మర్నాడు వెంకటేశ్వర్రావు ఇందిరా వాళ్ల కాలేజ్ కొచ్చాడు. విషయమంతా చెప్పారు. ఫేస్‌బుక్‌లో సుధాకర్ అనే వ్యక్తితో ఇందిర పరిచయం చేసుకున్నది. పరిచయం స్నేహమయ్యింది. అతను హైద్రాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకునే నాటికి ఒక చిన్న ఇల్లు, ఇంట్లోకి కావల్సిన వస్తువులూ సమకూర్చుకోవాలని సైసా పైసా కూడబెట్టుకుంటూ వచ్చాడు. అతను ఇందిర మాటల గారడీలో పడిపొయ్యాడు. త్వరలో డబ్బు తిరిగి ఇచ్చేస్తాను, మా నాన్నగారు వడ్డీతో సహా నీకు జాగ్రత్తగా అప్పజెప్తారని నమ్మబలికింది. మా కిప్పుడు అవసరానికి అప్పిస్తే పెద్ద మనసుతో నువ్వు చేసే సాయం చాలా గొప్పదంటూ పొగిడింది. కాలేజీలో తన తెలివితేటల్ని అందరూ ఎలా పొగుడుతారో వర్ణించి వర్ణించి చెప్పింది. ఫ్రెండ్స్ అందరికీ తలలో నాలుకలా వుంటూ ఎంతో యాక్టివ్‍గా తిరుగుతూ ఎలా సహాయపడుతుందో కథలు కథలుగా చెప్పింది. తన తండ్రి పి.యఫ్. శాంక్షన్ కాగానే మీ డబ్బు పంపించి వేస్తానని చెప్పింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారుతున్నాయి. తన డబ్బు వెనక్కు రాకపోయేసరికి సుధాకర్ తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఇలా మనుషుల్ని కాలేజీకి పంపించాడు. డబ్బు తిరిగి ఇవ్వకుంటే మర్యాద దక్కదని హెచ్చరికలు చేయించాడు.

“ఇది మనీ మాటర్ కాబట్టి ఎక్కడైనా ఈ వ్యవహారాలు చూసుకోండి. కాలేజీ ఆవరణలో ఇలాంటి విషయాలొద్దు. చదువుకునే పిల్లకు ఈ అప్పులేంటి? ఈ పన్లేంటి? కూతుర్ని కాస్త అదుపులో పెట్టండి” అంటూ వెంకటేశ్వర్రావుకు బాగా చీవాట్లు పెట్టి పంపించారు.

‘కాలేజీలో చేసిన వర్క్‌కి డబ్బులిచ్చారు. హాస్టల్‌లో సూపర్‌విజన్ చేస్తున్నాను. బహుమతిగా లాప్‌టాప్ కొని ఇచ్చారని చెప్పింది. ఎప్పుడూ ఆ లాప్‌టాప్ ముందే కూర్చునేది. ఆదివారాలు హాస్టలు కెళ్లి చాటింగ్ చేస్తూ పనితో విరగబడ్తున్నానని ఇంట్లో చెప్పేది. అప్పులు చేసిన డబ్బుతో జల్సాలు చేసింది. తన పట్ల ఇష్టంతో సుధాకర్ డబ్బు తిరిగి తీసుకోడని ఆశపడి వుంటుంది. ఇలా అబద్ధాలు చెప్తూ ఇంకేమైనా పిచ్చి పనులు కూడా చేసిందేమో? ఎలా తెలుస్తుంది?’ రాత్రంతా నిద్రపోకుండా సామ్రాజ్యం కూతురు చేసిన పనులను గురించే ఆలోచిస్తూ వున్నది. ఇందిర చేసిన బాకీ నాలుగు లక్షలు. ఎలా తీర్చాలి? ఆలోచించటానికే భయం వేస్తున్నది.

వెంకటేశ్వర్రావు కూడ అలజడిగానే వున్నది. బాకీ వసూలు కోసం వాళ్లు మళ్లీ వస్తారు. గొడవ తప్పదు. తను కూడా వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పటానికి సిద్ధంగా వుండాలి. ఎవర్నడిగి ఇచ్చాడు? తనకేమైనా తెల్సా? డబ్బు ఇచ్చినట్లుగా అసలేం ఆధారం వున్నది? తను ఇలా అడ్డం తిరిగితే ఇందిర మీద కేసు పెడతాడేమో? ఎంత ఖర్చుపెట్టిందో కనుక్కోవాలి. ఇంట్లో సామ్రాజ్యం గొడవపెడుతూనే వుండేది. తమ కాలేజీలోని రావు సార్ కూడా హెచ్చరించారు. తనే గుడ్డివాడై పోయాడు.

తెల్లవారింది. ఇందిర దుప్పటి ముసుగు తీయలేదు. వెంకటేశ్వర్రావు టీ త్రాగి డ్యూటీ కెళ్లిపొయ్యాడు. సామ్రాజ్యం పనిలోకి వెళ్లాలా, వద్దా అని ఆలోచించింది. రోజు కూలీ దండగ తప్పితే ఇంట్లో వుండి చేసేదేం లేదు అనుకుంటూ వంట చేయటం పూర్తిచేసింది. తనకూ, భర్తకూ కారియర్లు సర్దింది. అందుబాటుగా ఇందిరకు డబ్బేం కనపడనీయకూడదు అనుకుంటూ లోపల దాచివుంచిన పదిహేను వందలు తీసుకుని జాగ్రత్తగా పర్సులో పెట్టుకున్నది. బయటికొచ్చి ఆటో ఎక్కి కాలేజ్ దగ్గర దిగింది. ఆ టైమ్‌కు బస్సులన్నీ తిరిగి వచ్చేసి కాలేజ్‌లో  నిలపబడివున్నాయి. భర్త కివ్వవలసిన భోజనం కారియర్ ఇచ్చేసి తను పని చేసే చోటుకు వెళ్లింది. మనసు పనిలో లగ్నం కావటం లేదు. ఒకదాని వెంట ఒకటి అబద్ధాలు చెప్తూ దగుల్బాజీ పనులు చేసే ఇందిరను ఏం చెయ్యాలి? తన క్లాసు పుస్తకాలు ఏమైనా చదువుతుందో లేదో తెలియదు. భర్తతోనే ఇబ్బందులు పడుతుంది తను. ఇప్పుడు కూతురు కూడా తమ చేయి దాటిపోతుంది. ఈ కుటుంబం ఏమవుతుంది అనుకుంటూ గార్డెన్‌లో వున్న ఒక చెట్టు క్రింద కూలబడింది. సామ్రాజ్యానికి భవిష్యత్తంతా అంధకారంగా కనుపించింది.

ఆమె ఇలా దీర్ఘాలోచనలో ఉండగానే, అక్కడ ఆఫీస్ రూమ్ వద్ద చిన్న హడావిడీ జరుగుతోంది. ప్రియదర్శిని కాలేజ్ పిడి సార్, భవాని తల్లిదండ్రులు – ఇందిర తల్లిదండ్రుల గురించి వాకబు చేస్తున్నారు. చివరికి ఎవరి ద్వారానో ఇందిర తల్లిదండ్రులెవరో తెలుసుకుని సామ్రాజ్యాన్ని, వెంకటేశ్వరరావుని ఆఫీసు రూమ్‍కి పిలిపించారు. భవాని తల్లిదండ్రులు అరుస్తున్నారు. ఆ కేకలకి ప్రొఫెసర్ రావు అక్కడికి వచ్చారు. పిడి సార్ ద్వారా జరిగినదంతా విని, వెంకటేశ్వరావుని ఇంటికి పంపి, ఇందిరని తీసుకురమ్మన్నారు. ఇందిర రాగానే, భవాని తల్లిదండ్రులు ఆమె మీద విరుచుకు పడ్డారు. “నువ్వే మా అమ్మాయిని పారిపొమ్మన్నావని తెలిసింది. ఆ రోజు ఎన్ని నంగనాచి మాటలు చెప్పావు.. మా అమ్మాయిని మాకు కాకుండా చేయడానికి ప్రయత్నించావు.. ఏదో మా అదృష్టం బాగుండి అమ్మాయి జాడ తెలిసింది. ఇంకోసారి ఇలా వేరే వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకుంటే బాగుండదు” అని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయారు. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాప్ అంతా అక్కడ గుమిగూడడంతో మొదటిసారిగా ఇందిరకి కాస్త సిగ్గుగా అనిపించింది. అయినా చాలా గట్టి పిండం. ఏ మాత్రం ఫీలవకుండా మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు.

ఆ రోజు ఇంటికెళ్ళాకా, వెంకటేశ్వరరావు, సామ్రాజ్యం ఇద్దరూ ఇందిరని నిలదీశారు. నీ తీరు మార్చుకో అని గట్టిగా చెప్పారు.

***

ఈ సంఘటన జరిగిన వారానికే సుధాకర్, తన మిత్రులతో వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్‌కి వచ్చాడు. ప్రియదర్శిని కాలేజ్ పిడి సార్ పంపారంటూ నేరుగా ప్రొఫెసర్ రావు గారిని కలిసాడు. ఇందిర తనని ఎలా మోసం చేసినదీ వివరించాడు. ఇందిరనీ, ఆమె తల్లిదండ్రులను పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు. కాసేపటికి వెంకటేశ్వరరావు, సామ్రాజ్యం, ఇందిర స్టాఫ్ రూమ్‍కి వచ్చారు. డబ్బు కోసం ఇందిర తనని ఎలా వాడుకున్నది అందరికీ చెప్పాడు సుధాకర్. ఆమె మాయమాటలలో పడడం తన తప్పేననీ, కానీ దిగువ మధ్యతరగతి వాడినైన తనకు నాలుగు లక్షలు చాలా పెద్ద మొత్తమని, డబ్బు ఇప్పించమని బ్రతిమిలాడాడు. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఎవరికి తోచిన సలహాలు వారు చెప్పారు. కొంతమంది ఇందిరను గట్టిగా కోప్పడ్డారు. ఆమె తల వంచుకుంది. ప్రొఫెసర్ రావు గారు సుధాకర్‍కి నచ్చజెప్పి, వీలైనంత త్వరలో డబ్బు తిరిగి ఇప్పించే పూచీ తనదని చెప్పి అతని వివరాలు తీసుకుని, అతన్ని పంపించారు. గిల్టీగా ఫీలయిన ఇందిర మౌనంగా ఉండిపోయింది. సామ్రాజ్యం, వెంకటేశ్వరరావు చేష్టలుడిగి నిల్చుండిపోయారు.

“చూడు ఇందిరా. జరిగిందేదో జరిగిపోయింది. ఎండమావుల వెంట పరుగులు తీద్దామనుకున్నావు. భ్రమలో పడిపోయావు. ఇకనైనా ఇవన్నీ మానేసి నీ చదువు పూర్తి చేసుకో. నీ దగ్గరున్న రెండు లక్షలూ వెంటనే సుధాకర్‌కి ఇచ్చెయ్. నీవు కొన్న లాప్‌టాప్, ఐఫోన్ లాంటివి అమ్మేసెయ్. కాలేజ్ నుంచి మీ నాన్న పి.ఎఫ్. లో నుంచి కొంత డబ్బు తీసుకుంటాడు. ఎంతో అత్యవసర ఖర్చులకు వాడుకోవాల్సిన డబ్బును ఇప్పుడే వాడాల్సి వస్తున్నది. ఆ డబ్బుకూడా అతనికి ఇప్పు. నేను బ్యాంక్ మానేజరుగారితో మాట్లాడతాను. నీవు స్టడీ లోనుకు అప్లయి చెయ్యి. ఒక లక్షరూపాయలు లోన్ తీసుకో, రిస్క్ తీసుకుని నేను ష్యూరిటీ సంతకం పెడతాను. నా మాట నిలబెట్టు. సకాలంలో చదువు పూర్తి చేసుకుని ఏదన్నా మంచి ఉద్యోగం చేసుకో. నెమ్మదిగా లోను తీర్చు. తప్పులు అందరూ చేస్తారు. తప్పు తెలుసుకుని మంచి బాట పట్టినవాళ్లే వివేకవంతులవుతారు. నీకామాత్రం వివేకం వుందనే నేననుకుంటున్నాను.” అన్నారు.

ఇందిర వంగి రావుగారి కాళ్లకు నమస్కరించింది. “థాంక్స్ ఎలాట్ సార్, మీ రుణం తీర్చుకోలేను. నేను ఇంకే పొరపాట్లు చెయ్యను” అన్నది ధృఢంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here