Site icon Sanchika

మాయాబజార్‌లో పౌరాణిక, సాంఘిక అంశాలు

[dropcap]మా[/dropcap]యాబజార్ చలన చిత్రం విడుదల అయి ఇప్పటికి 65 సంవత్సరాలు అయింది. ఈలోపు ఎందరో రచయితలు ఎన్నో రకాలుగా విశ్లేషించారు. అయినా చెప్పుకోవటానికి ఇంకా మిగిలే ఉంటుంది. నీళ్ళలో ఈత కొట్టేవాడికి లోతుకి వెళ్ళిన కొద్దీ ఆనందంగా ఉంటుంది. అలాగే యన్.టి.ఆర్., సావిత్రి, యస్.వి.ఆర్., వంటి వారి నటనను, పింగళి నాగేంద్రరావు వంటి కవుల కథలను లోతుకు వెళ్లి పరిశీలించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు అర్థం అవుతూ ఆనందంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను నటీనటుల అభినయాన్ని గురించి చెప్పటం లేదు. కథలో గల విశేషాలని చెప్పాలనుకుంటున్నాను.

మాయాబజార్ పౌరాణికి కథే కదా, ఇంకా పౌరాణిక అంశాలు ఏమిటి అనే సందేహం కలుగవచ్చు. ఇవి పరిశీలనగా చూసిన వారికే అర్థం అవుతాయి. మాయా శశిరేఖ గద భుజంమీద పెట్టుకుని వెళుతూ ఉంటే వంటగదిలో నుంచీ ఘుమఘుమ వాసనలు ముక్కుపుటాలకి తగులుతాయి. లోపలికి వచ్చి చూస్తే పెళ్ళివారి కోసం వండి సిద్ధంగా ఉంచిన అనేక భోజన పదార్ధాలు కనిపిస్తాయి. “వివాహ భోజనంబు వింతైన వంటకంబు..” అని పాడుకుంటూ అవన్నీ ఆరగిస్తాడు ఘటోత్కచుడు. ఇక్కడ పరిశీలిస్తే వంటగది బయట మాయా శశిరేఖగా కనబడతాడు. లోపలికి వచ్చిన తర్వాత ఘటోత్కచుడిగా యధారూపంలో కనిపిస్తాడు. ఎందుకంటే —

ఎవరైనా రూపం మార్చుకున్నప్పుడు నాలుగు సందర్భాలలో అసలు రూపం బయట పడిపోతుంది. ఇది రాక్షసులలో మరీ ఎక్కువగా కనబడుతుంది. అవేమిటంటే 1. భోజనం చేసేటప్పుడు 2. నీళ్ళు తాగేటప్పుడు 3. దాంపత్య ధర్మం నిర్వర్తించేటప్పుడు 4. మరణించేటప్పుడు. ఈ విషయం రామాయణ, మహాభారత, భాగవత కథల్లో అనేక దుష్టాంతాలలో కనబడుతుంది.

సీత మాయలేడిని చూసి తీసుకురమ్మని భర్తతో చెప్పినప్పుడు లక్ష్మణుడు ఒక మాట అంటాడు. “ఇది నిజమైన లేడి కాదు. రాక్షసుడు మాయా రూపంతో వచ్చి ఉంటాడు. మన క్షత్రియులకు వేట వినోదమని, మనల్ని దూరంగా పంపించటానికే ఈ ఎత్తు వేసారు. ఆ లేడి చూడండి. గడ్డి పరకలు తింటున్నట్లు నటిస్తున్నది గానీ నిజంగా తినటం లేదు. సందేహం లేదు. ఇది రాక్షసమాయే!” అని చెబుతాడు. అయినా సీతమ్మ వినదు అనుకోండి. రాముడు కూడా మాయైతే ఛేదించగలను అనుకుని వెళతాడు. అదంతా తర్వాత కథ!

కిందముడు అనే ముని భార్యతో కలసి లేళ్ళ రూపం ధరించి క్రీడిస్తూ ఉంటాడు. వేటకోసం వచ్చిన పాండురాజు లేళ్ళను చూసి బాణం వేస్తాడు. ముని దంపతులు మరణించబోతూ యధారూపంలోకి వచ్చి “మృగరూపంలో ఆనందిస్తున్న మమ్మల్ని బాణం వేసి చంపుతున్నావు. నువ్వు కూడా కామవాంఛతో భార్యని చేరినప్పుడు మరణిస్తావు” అని శపించి ప్రాణం వదులుతారు.

శ్రీకృష్ణుడిని వధించటానికి శకటాసురుడు అనే రాక్షసుడు బండి రూపంలో వస్తాడు. పిల్లాడు బండితో ఆడుకుంటున్నాడు అనుకుంటారు తల్లిదండ్రులు. శకటాసురుడు కృష్ణుడి చేతిలో మరణించిన తర్వాత “హటాత్తుగా ఈ రాక్షసుడు ఎక్కడ నుంచీ వచ్చాడు?” అని ఆశ్చర్యపోతారు యశోదానందులు. పూతన విషయంలో కూడా అదే విధంగా జరుగుతుంది. మరణించిన తర్వాత అసలు రూపు బయట పడుతుంది.

ఈ పాయింట్‌ని సినిమాలో చక్కగా ఉపయోగించుకున్నారు పింగళి. మాయాశశిరేఖ నుంచీ ఘటోత్కచుడుగా మారిన తర్వాతే భోజనం చేసి, దాహం తీర్చుకుంటాడు. గదిలో నుంచీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాయా శశిరేఖగా మారిపోతాడు. యథాలాపంగా చూస్తే ఈ విషయం మనం పట్టించుకోము. కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది.

మహాభారతంలో శకుని పాండవులని మాయాద్యూతంలో ఓడించి రాజ్యం కాజేస్తాడు. కానీ ధృతరాష్ట్రుడు వారి రాజ్యం వారికిచ్చి వేస్తాడు. అప్పుడు ద్రౌపది తనతో పాచికలు ఆడమని శకునిని అడుగుతుంది. సరేనంటాడు. శకుని పందెం వేయగానే శ్రీకృష్ణుడిని తలచుకుంటుంది ద్రౌపది. శకుని పాచికలు తప్పుగా పడతాయి (కృష్ణమాయ వలన అలా భ్రమ కల్పిస్తాడు. అయితే ఈ సంఘటన కవిత్రయ భారతంలో కనబడదు. వ్యాస భారతంలో వస్తుంది.). ఆ సన్నివేశాన్ని మాయాబజార్‌లో ఉపయోగించుకున్నారు పింగళి. మాయా శశిరేఖతో ఆడేటప్పుడు శకుని పాచికలు తప్పుపడతాయి. “శశిరేఖ కనికట్టు నేర్చిందా లేక నా కన్నేమైనా చెదిరిందా?” అని మీమాంసలో పడతాడు శకుని.

అభిమన్యుడు శశిరేఖతో కలిసి ఆడుకుంటూ సరోవరంలో కనిపిస్తున్న చెట్టుమీద పండుని చూపిస్తూ “ఈ నీడను చూస్తూ ఆ పండుని కొట్టేస్తా!” అని బాణం వదులుతాడు. పండు తెగి కిందపడుతుంది. అర్జునుడు మత్స్యయంత్రం కొట్టింది కూడా ఇలాగే! తండ్రి పోలిక కొడుకుకి వస్తుంది అంటారు ఇదే!

శశిరేఖను దుర్యోధనుడి కొడుక్కి ఇస్తారని తెలిసినప్పుడు రుక్మిణి రేవతితో “అక్కా! సుభద్ర సంగతి మనకెందుకు? మన అమ్మాయి సంగతి విచారించండి. మొదటి నుంచీ మనం పెట్టిన ఆశలేగా! శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకుని ఉంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి?” అంటుంది. రేవతి వెంటనే “కూతురి సుఖం కన్నతల్లి కంటే నీకు ఎక్కువ తెలుసా! ఒక్క కూతురిని కంటే తెలిసేది ఈ నీతులేమయ్యేవో!” అంటుంది.

శ్రీకృష్ణుడికి రుక్మిణి వలన ప్రద్యుమ్నుడు, సత్యభామ వలన భానుమంతుడు, జాంబవతి వలన సాంబుడు, కాళింది వలన సుబాహుడు ఇలా చాలామంది కుమారులు ఉంటారు గానీ ఒక్క కుమార్తె కూడా కలగదు. శ్రీకృష్ణుడికి పుత్రికా సంతానం లేదన్న విషయాన్ని ఇక్కడ చక్కగా వినియోగించు కున్నాడు కవి.

రాక్షసగురువు చిన్నమయుడు శిష్యులకు విద్య నేర్పుతూ ఉంటాడు. ఘటోత్కచుడు చూసి “చిన్నమయా! ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు. శత్రు మిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి. శత్రువులను భక్షించాలి” అని చెబుతాడు. సాధారణంగా “మిత్రులను రక్షించాలి. శత్రువులను శిక్షించాలి” అని అంటూ ఉంటారు. కానీ ఘటోత్కచుడు రాక్షసుడు కదా, అందుకనే “శత్రువులను భక్షించాలి” అంటాడు.

చివరలో తన మాయానాటకం బయటపడిన తర్వాత ఘటోత్కచుడు “లంబూ! జంబూ! ఇక మీరు విజ్రంభించండి” అని ఆజ్ఞాపిస్తాడు. అంతే! రాక్షసమాయ స్వైరవిహారం చేస్తుంది. పెళ్లివారంతా అల్లకల్లోలం అయి హాహాకారాలు చేస్తూ పరుగెత్తుతారు. “ఆర్తనాదములు శ్రవణానందముగానున్నవి” అని ఆనందిస్తాడు ఘటోత్కచుడు. ఇక్కడ కూడా అతడి రాక్షస స్వభావం బయట పడుతుంది.

ఇక సాంఘిక అంశాల ప్రస్తావనకు వస్తే మాయాబజార్ కథ ద్వాపరయుగంలో జరిగింది. కానీ ఆ కథలో పాత్రల స్వభావాలు నేటి మానవుల స్వభావాలను ప్రతిబింబించేటట్లు తీర్చిదిద్దారు కవి పింగళి.

శశిరేఖ, అభిమన్యుడు ఉద్యానవనంలో ప్రణయ గీతాలు పాడుకుంటుంటే చూసిన రేవతికి ఒళ్ళు మండిపోతుంది. కూతురిని పిలుచుకురమ్మని దాసీని పంపిస్తుంది. శశిరేఖ హుషారుగా లోపలికి వస్తూ తల్లి వాలకం చూసి గతుక్కు మని “ఏమిటమ్మా! తలనొప్పిగా ఉందా?” అని అడుగుతుంది.

“ఆ. నువ్వు చేసే తెలివి తక్కువ పనులకి ‘తలనొప్పి’ గానే ఉన్నది” అని ద్వంద్వార్ధంతో అంటూ “ఆ తోటలో పడి మీ ఇద్దరూ గంతులేమిటి చెప్పు!” అని గద్దిస్తుంది. “ఏమ్మా! బావతో ఆడుకుంటే?” అంటుంది శశి.

“ఏం బావా నువ్వూ ఇంకా చిన్నపిల్లల నుకుంటున్నారా! ఈడొచ్చిన పిల్లవి. పెళ్లి కాకముందు ఇలా తిరుగుతూ ఉంటే నలుగురూ నవ్వరూ! ఎంత అప్రతిష్ఠ!” అని అంటుంది రేవతి.

“అయితే నన్నేం చేయమంటావేమిటి?”

“ఏం చేయమంటానా? ఆ బావతో నీ విహారాలు మానేయమంటాను. అతనితో అసలు మాట్లాడవద్దంటాను. బుద్దిగా ఉండి నా కూతురనిపించు కోమంటాను” అంటుంది.

మన సమాజంలో ఒకప్పుడు ఆడపిల్లని ఇలాంటి కట్టుబాట్లతోనే పెంచేవారు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన ఆడపిల్ల, పక్కింటికి అయినా సరే, దీపాలు పెట్టకముందే ఇంటికి తిరిగి రావాలని చెబుతారు. మగవాళ్ళకి దూరంగా ఉండాలంటారు. చెప్పినమాట వినకపోతే చివాట్లు పెడతారు. శశిరేఖ కూడా తల్లి మాటలకు ఎదురు చెప్పలేక సగటు ఆడపిల్లలాగానే మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది.

పాండవులు జూదంలో ఓడిపోయి అడవుల పాలవగా సుభద్ర అన్నగారి దగ్గరకు వచ్చేస్తుంది. కృష్ణుడు, రుక్మిణి ఎదురెళ్ళి ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ రేవతి రాదు. “పెద్ద వదిన కనిపించటం లేదే!” చుట్టూ చూస్తూ అడుగుతుంది సుభద్ర.

“అవిడొక సత్తెకాలపు మనిషి. రాజ్యం పోయింది మీకు కాదు, తనకన్నట్లు విచారిస్తుంది” అని చెబుతుంది రుక్మిణి. ఒకప్పుడు స్త్రీ స్థానం భర్త దగ్గరే అని, జీవితాంతం అతని దగ్గరే ఉండాలని పెద్దలు నూరిపోసేవారు. భర్తతో కలసి వస్తేనే పుట్టింటి వారు ఆమెను గౌరవించేవారు. భర్తకు దూరమైన ఆడపిల్ల, ఇంటికి వస్తే చిన్నచూపు చూసేవారు. రేవతిది కూడా అలాంటి మనస్తత్వంగానే చిత్రీకరించారు రచయిత. రాజ్యం పోయిందన్న విచారంతో పలకరించటానికి కూడా రాలేదట. ఎంత చక్కని సమర్థింపు? చిన్నచూపు చూసేవారితో పాటు సర్దుకుపోయే వారు కూడా ఉంటారు ఉమ్మడి కుటుంబాలలో, మరి!

“ఊ.. అంతా ఇక ఇక్కడ ఉండవలసినవాళ్ళమేగా ఈ పన్నెండేళ్ళూనూ..” అంటూ దెప్పిపొడుస్తుంది రేవతి.

రాక్షస గురువు ఘటోత్కచుడి అనుచరులకు పాఠాలు నేర్పుతూ ఉంటాడు. “పాండవులు అస్మదీయులు. వారికి విరోధులు కౌరవులని ఏమంటారు?” అని అడుగితే “తస్మదీయులు” అని సమాధానం చెబుతాడు శిష్యుడు.

“అస్మదీయులకి విరుగుడు తస్మదీయులు అని వీడు పుట్టించాడు ప్రభూ!” అని అంటాడు ఉపాధ్యాయుడు.

“ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి? వెయ్యి వీడికి వీరతాళ్ళు రెండు” అంటాడు ఘటోత్కచుడు.

పండితులు కాకపోయినా పండితులుగా చెలామణి అయ్యేవాళ్ళకు వీరతాళ్ళు వెయ్యాలని వ్యంగ్యంగా చెప్పారు కవి. ఈ రోజుల్లో పండితులుగా చెలామణి అయ్యేవాళ్ళు చాలామంది ఇలా స్వంతంగా వీరతాళ్ళు వేయించుకున్నవారే! నిజమైన పండితులు ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటారు. వారికి ప్రచార ఆర్భాటాలు నచ్చవు.

ఘటోత్కచుడి అనుచరులు తమని పండితులు కాదంటే ససేమిరా అంగీకరించరు. “నీ శాస్త్రం సొంత తెలివి లేనివాళ్ళకి. మాకు కాదు” అంటూ డబాయిస్తారు.

వియ్యాలవారి కోసం తయారు చేసి ఉంచిన భోజన పదార్ధాలు చూసి “పండితులు ఇంతకీ అసలు వంటకమేదయ్యా!” అని అడుగుతారు. “ఏమిటది?” అంటారు ఆడపెళ్ళి వారు.

“ఏమిటా! గోంగూర. శాకంబరీ దేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేనిదే ప్రభువుల వారు ముద్దైనా ముట్టరు” అని చెబుతారు.

ధనానికి ధనదేవత, వనానికి వనదేవత ఉన్నట్లుగానే శాకాహారానికి శాకంబారీ దేవి అనే దేవత ఉన్నదట. ఆవిడ ప్రసాదమే గోంగూర. ఇది పింగళి వారి కల్పనా చాతుర్యం. ఎదురుగా పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నా మొదటగా గోంగూర కలుపుకునేది ఎవరంటే – తెలుగు వాడు. దుర్యోధనుడికి అచ్చమైన తెలుగుతనం ఆపాదించారు కవి.

వివాహ సమయంలో పెళ్ళికూతురు కోతిగా, పులిగా, రాక్షసుడుగా కనబడతుంది లక్ష్మణ కుమారుడికి. “ఈ పెళ్లి నా కక్కరలేదు” అని వెళ్ళిపోబోతాడు. ఇదంతా చూస్తూ శశిరేఖ “అమ్మా! ఏమిటే నాకీ అల్లరి?” అంటుంది. “ఏమో తల్లీ! నేనేం పాపం చేసానో?” అంటుంది రేవతి. తల్లిదండ్రులు చేసిన పాపాలు వారి సంతానం అనుభవించవలసి వస్తుందని పెద్దలు అంటారు. కడుపు తీపితో నైనా వారు తప్పులు చేయకుండా ఉంటారని పెద్దల ఆలోచన. ఈ నానుడి సందర్భానుసారంగా వినియోగించుకున్నారు కవి.

ఇలా చెప్పుకుంటూ పోతే మాయాబజార్‌లో విశేషాలు అనంతం. పౌరాణిక పాత్రలను మానవ మనస్తత్వాలతో అన్వయించి చిక్కగా కథ అల్లారు పింగళి నాగేంద్ర రావు. ఇది తెలుగు వారి స్వంతం. తెలుగు వారి ఆస్తి. అరవై అయిదేళ్ళు కాదు. మరో అరవై అయిదేళ్ళు అయినా మాయ బజార్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Exit mobile version