Site icon Sanchika

మాయమైన బడి

[dropcap]ఆ[/dropcap]గస్టు నెల 1997. అనుకోని పనిగా ఊరు ప్రయాణం. పైగా వర్షం. గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ, చేతులు బయటపెట్టి పిల్లలు చప్పట్లు కొట్టి ఆనందిస్తున్నారు. పెద్దవాళ్లు, “కిటికీ తలుపులు వేసేయండర్రా…చేతులు బయట పెట్టకండి” అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. అవును! పెద్దవాళ్ళకి లక్ష బాధ్యతలు, బరువులు. ఆనందించడం ఎప్పుడో మర్చిపోయారు.

ఆ పిల్లల కేరింతలు చూసేసరికి సంతోషం వేసింది. కాలంలో రెండున్నర దశాబ్దాల వెనక్కు వెళ్ళింది మనసు. మా పిల్లలు కూడా ఇలా వాన వస్తే గెంతుతూ, ఎగురుతూ, బుజ్జి బుజ్జి పాటలు కడుతూ, పాడుతూ, ఆనందించేవారు.ఓ రౌండ్ వేసొస్తామంటూ,ఇంటి ముందు మట్టి జాగాలో పరుగులు పెట్టేవారు. నాలుగైదు పదాల్లో ఆ లేత మనసులు పాడే పాటలకి నా జ్ఞాపకాలే సాక్ష్యం.

వాన భలే వచ్చిందీ, మొక్కలకి తలస్నానమూ…

మట్టి వాసన సెంటు సీసా, మూత తీసిన సమయమూ…”

మేం వెళ్ళబోతున్న ఊరు, మా జీవితాలకు మధురానుభూతుల్ని ఇచ్చింది. పిల్లలు ఓనమాలు దిద్దటం అక్కడే. తొలిసారిగా బడికి వెళ్లడం. పేచీలు. వెళ్ళమని మారాం చేయడం. చక్కగా తయారుచేస్తే ముఖమంతా ముడుచుకుని బాధగా ఉండడం…. భారంగా వెనక్కి తిరిగి చూస్తూ తప్పదన్నట్టు వెళ్ళడం. ఇవన్నీ గుర్తొచ్చాయి. నలుగురు పిల్లలలో ఆఖరు, మా అబ్బాయి కూడా అలాగే పేచీలు పెట్టేవాడు.”చదువుకోడానికి బడికి ఎందుకు వెళ్లడం? ఇంట్లోనే హాయిగా చదువుకోవచ్చుగా?” ప్రతిరోజు ఓసారి వాదించేవాడు. ఎన్నో కబుర్లు చెప్పి, ” దేశదేశాలు తిరిగే మంచి ఉద్యోగాలు దొరకాలి అంటే ఇంట్లో చదువుకుంటే చాలదురా! బడికి వెళ్లాలమ్మా” అని నచ్చచెప్పి పంపేవాళ్ళం. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా ఉంటూ మరింత ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఇప్పటి ఆ నవ యువకుడు అలా పేచీ పెట్టేవాడు అంటే నవ్వుకుని, ‘ఇంకా ఆ విశేషాలు చెప్పమ్మా’ అని అడిగి మరి చెప్పించుకుంటాడు, ఇప్పుడు.

బడి అంటే ఒక శిక్షాలయం, ఒక జైలు!…….అనిపించకుండా చేయగల వాళ్లే అక్కడి టీచర్లు. అది ‘విద్యానికేతన్’ పేరిట ఒక చక్కని పాఠశాల.మంచి ఆవరణ—తోట, మొక్కలు, చెట్లు భవనం, షెడ్లు అన్నీను. ఇవి గాక ఆటస్థలం. ఆ వాతావరణంలో పిల్లలు ఉంటే ఎంతో ఆరోగ్యకరం అనిపించేది. ఆడపిల్లలకు పెద్ద పెద్ద చదువులకు అవకాశాలు తక్కువ అప్పట్లో. ఇంటర్ దాటడం కష్టం. మహా అయితే డిగ్రీ కోర్సు. తర్వాత పెళ్లికి నిరీక్షణ. ఎదిగిన పిల్లలు, ఇంట్లో జైలు జీవితం గడపక్కర లేకుండా, దేవుడు మొరవిని వరాలు ఇచ్చినట్టు ప్రైవేటు స్కూళ్ళు వచ్చాయి. మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల్ని అనేక కారణాల వల్ల బయట ఉద్యోగాలకు పంపలేని తల్లిదండ్రులు, ఇలాంటి బడిలో ఉద్యోగానికి పంపేవారు. ఉన్న ఊళ్లో కాలక్షేపం. పొద్దున్న తొమ్మిది నుంచి మహా అయితే సాయంకాలం నాలుగు దాకా పని. పిల్లలతో గడపడం. గౌరవానికి లోటు ఉండదు. ఆడపిల్లలు నెలంతా పనిచేస్తే వచ్చే 150-200 రూపాయలను మారు భాగంగా భావించుకుని తమ అవసరాలకు అంటే ఓ చీర కొనుక్కోడానికో, సినిమా చూడ్డం, చిన్న చిన్న ఖర్చులకు నాన్ననేం అడుగుతాంలే అనుకుంటూ, తృప్తిపడి, సంబర పడి పోయావారు.

మొదట్లో, ప్రైవేటు బడులన్నీ ఇలా వెలిసినవే. మరి, విద్యానికేతన్‌లో కూడా పిల్లల్ని లాలించి, పేచీలు తీర్చి, ఇంట్లో పెద్దక్కయ్య లాగా వాళ్లని పద్ధతిలో పెట్టేవారు ఆ టీచర్లు. ఆ బుజ్జి పిల్లల వచ్చీ- రాని మాటలను వింటూ, వాళ్లను బుజ్జగిస్తూ, తోటలో పూల మధ్య తిరిగే సీతాకోకచిలుకలలా ఉండేవారు. రెండు మూడు నెలలకోసారి మా అబ్బాయి గురించి ‘ఎలా ఉన్నాడండీ?’ అని అడిగి వచ్చేదాన్ని. “మమ్మల్ని అండీ అనక్కర్లేదు. మీ వాడు బానే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చేవారు. నెమ్మదిగా గాడిలో పడ్డాడు. వాళ్ల సహనానికి వేల వేల కృతజ్ఞతలు.

***

మా వారు ఉద్యోగరీత్యా, ఆ ఊళ్లో ఒక ఐదు సంవత్సరాలు పనిచేశారు. పిల్లల బాల్యమంతా అక్కడే గడిచింది. ముఖ్యమైన వ్యవహారం ఒకటి ఉండి, ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా ఆ ఊరికి ప్రయాణమయ్యాం మేమిద్దరం. “అమ్మా! నేను చిన్నప్పుడు చదివిన బడి ఎలా ఉందో చూసి రా! ఫోటోలు తీసి నాకు కూడా పంపించు. హ్యాపీ జర్నీ.” అంటూ మా అబ్బాయి ఫోన్లో తన మనోభావాలను చెప్పాడు న్యూజెర్సీ నుంచి.

‘మరో అరగంటలో స్టేషన్ వచ్చేస్తుంది’ అన్న శ్రీవారి హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చాను. ఆ రోజులు ఎంత మంచివి? అందులోనూ, అనేక ఒడిదుడుకులు అనుభవించాక….

మళ్లీ ఆలోచనలు విద్యానికేతన్ చుట్టూ. మేము వెళ్లిన నాటికి, ఆ స్కూల్ పెట్టి రెండేళ్లు అయింది అన్నారు. సుమారు 100 మంది పిల్లల నుండి ‘ఇంతింతై, వటుడింతై’ అని స్కూలు దినదిన ప్రవర్ధమానం అయింది. మేము అక్కడున్న ఐదేళ్లలోనే గణనీయమైన మార్పులు వచ్చేశాయి. గణనీయం అంటే ఎలా లెక్క పెడతాం? ఎవరి లెక్కలు వాళ్ళవి. ‘మధ్య తరగతి మంచి నేస్తం’గా ఉన్న ఆ స్కూలు, నెమ్మదిగా గొప్పవారి పోషణ లోనికి వెళ్ళిపోయింది. తూతూ మంత్రం అడ్మిషన్ టెస్ట్‌లు. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే.. బిల్డింగ్ ఫండ్ పేరున.. వారి పిల్లలకు ఇట్టే ప్రవేశం. “మా లావుపాటి పెద్ద మేడం నల్లబేగు గంటకోసారి ఇంట్లో కెళ్ళి ఖాళీ చేసి వస్తోంది. ఆ ముఖంలో చిరునవ్వు ఈ మధ్య కనబడటమే లేదు. అందరిమీదా పెత్తనం. మాట్లాడితే, విసుక్కోవడం. టీచర్లను కసురుకోవడం. పిల్లలకు పనిష్మెంట్ లు. ఇలా ఉంది వ్యవహారం” అని పెద్ద క్లాసుల పిల్లలు ఇంటికి వెళ్తూ మాట్లాడుకోవడం. ఏడాదంతా చదువు చెప్పిన టీచర్లకు చాలీచాలని జీతాలు ఇస్తూ, ఏడాది పొడుగునా డొనేషన్లు దండుకుని.

వయసులో చిన్న పిల్లలైన టీచర్లు.. వాళ్ల ఆత్మాభిమానాన్ని తూలనాడి,అవమానించి పంపిస్తే, మరి మౌనంగా బాధపడరా? అప్పుడప్పుడూగా నేను ఆ టీచర్లతో కబుర్లు వేసుకున్నప్పుడు నిర్లక్ష్యం లోంచి వచ్చిన నిరాశ కనబడుతూనే ఉంది.

ఈ లోగా మాకు అక్కడి నుంచి బదిలీ అయిపోయింది. పిల్లల టిసిలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ లు వగైరా తీసుకోవడానికి ఆఫీసుకు వెళ్ళినప్పుడు మాత్రం, నాకు బడి మీద మమకారమే పెల్లుబికింది. చీటీ లోపలికి పంపించి, ఒకసారి హెచ్ఎం గారి గది లోకి వెళ్లాను. కుశల ప్రశ్నలు అయ్యాక, “స్కూలు వృద్ధి లోకి వచ్చిందంటే తెరవెనుక టీచర్ల చిత్తశుద్ధి ఎంతో ఉందన్నమాట. పాఠశాల నడపడానికి పెద్ద హృదయం అవసరం మొదట్లో అందరూ ఉన్నతాశయంతో ప్రారంభించినా, డబ్బు వచ్చి పడుతుంటే కొన్ని విలువలు అడుగంటి పోతాయి. మంచి టీచర్లు ఉన్నారు. వాళ్లను ప్రేమతో ఆదరించండి. మీ బడి ఎల్ల కాలాలకు మూడు పువ్వులు- ఆరుకాయలుగా విలసిల్లి, మధ్యతరగతి వారికి కల్పతరువుగా ఉండాలని నా ఆకాంక్ష.” అని చెప్పాను.

ఈ పాటి హితవచనాలు చెప్పే అవకాశం ధైర్యం మీకు ఎక్కడివి? అని ఆశ్చర్యపోకండి, మరి. పిల్లల చదువుల గురించి శ్రద్ధ వహించే తల్లిగా జీతం కట్టడానికి వెళ్ళినా, పేరెంట్ టీచర్ మీటింగులలో, యాజమాన్యంతో కాస్త పరిచయం పెంచుకుని, ఆ చర్చలలో పాల్గొనే దాన్ని.

***

కాలచక్రంలో ఏళ్లు దొర్లి పోయాయి. తరచూ బదిలీలు ఉండే ఉద్యోగం వల్ల, ఏ ఊర్లో నాలుగు సంవత్సరాల కన్నా నిలకడగా ఉండలేదు. రాష్ట్రమంతా కలియతిరిగిన ఘనత మాకు దక్కింది. ఒక్కో పిల్లకి 5, 6, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లతో ఫైలు పోగు అయింది! ఆ బడి గురించి తెలుసుకోవడానికి పెద్దగా అవకాశం లేకపోయింది. “నీ చాదస్తం గానీ, ఇంక ఆ బడి గురించి వదిలేయ్ అమ్మా!” అన్నారు పిల్లలు. ఎప్పుడైనా పిల్లల స్నేహితులు ఉత్తరాలు రాస్తే ‘మన విద్యానికేతన్ ఎలా ఉందో అడగండర్రా!” అనేదాన్ని. “దానికేం? బాగానే ఉందట. రోజులు మారాయిగా. అది ఒకటే బడి కాదు. ఇంకా బోలెడు స్కూలు వెలిసాయిట.” అని మా అమ్మాయి చెప్పింది.

రైలు గమ్యం చేరింది.రాత్రి 12:00. మసక చీకట్లో దీపాలు లేక ఏమీ కనబడనట్టు పాతికేళ్ల తర్వాత వచ్చిన ఊరులో కొన్ని పోల్చుకోగలం. కొన్ని అర్థం కావు. సెవెన్ రోడ్ జంక్షన్ అని అడిగి, అబ్బో! రిక్షా కాదు, ఆటో ఎక్కాం. బోలెడు హోటల్స్, లాడ్జీలు వెలిశాయి. ఒకచోట బస కుదుర్చుకొని పడుకున్నాం.

రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. న్యూ కాలనీ ఇల్లు ఎలా ఉందో? వీధిలో ఇరుగుపొరుగు అక్కడే ఉన్నారో? లేరో… మాలాగే బదిలీలపై వెళ్లిపోయారేమో! ఆ ప్రదేశం గుర్తుపట్టగలమా? విశాలాక్షి ఎలా ఉన్నదో? తొందరలో ఉత్తరమైనా రాయలేదు. ఇన్ని ఆలోచనలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి. తెల్లవారింది. త్వరగా తెమిలి, మునిసిపాలిటీలో పని పూర్తి చేసుకున్నాము.

ఒంటి గంట అయ్యింది. నా మనసులో కోరిక బయట పెట్టాను, మా వారితో. విద్యానికేతన్‌కి వెళ్దామని. “ముందు భోజనం చేసి,అప్పుడు వెళదాం.” అంటూ హోటల్‌కు దారి తీశారు. తర్వాత, ‘విద్యానికేతన్’ అంటే ఆటో వాడికి తెలియలేదు. టౌన్ హాల్‌కు దగ్గర అని చెప్పాక బేరం కట్టాడు. ఆ వీధికి దారి తీశాను. మనసు ఆనందంతో పొంగి పోయింది. నడకలో వడి పెరిగి పరుగుగా మారింది. ఆ భవనం.ఆ పెద్ద గేటు- పక్కన చిన్న గేటు. అదే… ఏమీ మారలేదు!

చిన్న గేటు దగ్గరికి పరిగెత్తాను. అడ్డ గడియ తీయడానికి ప్రయత్నిస్తుంటే ,”ఎవరు కావాలి?” అంటూ ఒక వాచ్మెన్ కర్ర ఆడించుకుంటూ వచ్చాడు.

“మేడం గారు ..”

‘ ఏం మేడం గారు?’

“అదే విద్యానికేతన్ మేడంగారండి.”

‘ఇక్కడ ఎవరూ లేరమ్మా!’

“అదేంటి రమణమ్మ గారు, లేరా?”

‘ఓ పాత వాళ్ళా? ఆరేళ్లయిందండి. తమ కూతురు దగ్గరకు వెళ్లి పోయారు.”

“అంటే?”

“కేరళ, ఎర్నాకులం దగ్గర.”

 మరి,అంత పెద్ద తోట, మొక్కలు, చెట్లు,ఇల్లు ఇవన్నీ వదిలేసి…’ నా మాట మధ్యలో ఆగిపోయింది.

“మీరు చెప్పిన తోట, మొక్కలు, చెట్లు ఎప్పుడో అంతరించిపోయాయి. జాగా అంతా రెండు భాగాలు చేసి అమ్మేయగా ఆ పక్క అంతా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నారు. ఈ ఇల్లు మా యజమాని కొనుక్కున్నారు.”

‘మరీ…’ నేను ఇంకా ఏదో మాట్లాడ బోతుంటే, వారు జోక్యం చేసుకున్నారు. నా భుజం మీద చేయి వేసి, “లక్ష్మీ! ఇంక పద. ఆపు.అసలిప్పటి దాక ఓపిగ్గా నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. పోదాం పద. ” అన్నారు.

ఆవేశానికి ఆనకట్ట పడగానే కర్తవ్యం గుర్తుకొచ్చింది. మనసు మనసులో లేదు. ఎటూ వెళ్లడానికి తోచలేదు. చేతిలో పట్టుకున్న బ్యాగు కూడా బరువు అయిపోయింది. ఫొటోలు తీయడానికి తెచ్చిన కెమెరా నన్ను వెక్కిరించింది. విశాలాక్షి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాం. ఊరంతా ఇరుకు అయిపోయింది. ఎక్కడ చూసినా కాలవలు, స్పీడ్ బ్రేకర్లు. కానీ వేగం ఎవరికి తగ్గింది! సర్రున దూసుకుపోయే మోటార్ సైకిళ్ళు. పామ్, పామ్ అంటూ మీదకు వచ్చేసే ఆటోలు. ప్రతి చోట బోలెడు ఇల్లు కట్టే కార్యక్రమాలు పెరిగిపోయి, ఉన్న రోడ్డు మీదే ఇసుక, కంకర పోగులుగా ఉన్నాయి. అదిగో సందు మొదట్లో పొగడ చెట్టు ఉండాలి. ఇటు పక్కకి తిరిగితే పబ్లిక్ కుళాయి ఉండాలి. అప్పుడే చిన్న పార్కు వచ్చేసింది. ఇక్కడి మైకు లోంచే ఉదయాన ఘంటసాల వారు, ‘ముక్కోటి దేవతలు’ అంటూ పాట పాడి అందరికీ ధైర్యాన్ని ఇచ్చేవారు. మెదడంతా పాత, కొత్త చిత్రాల కలగూరగంప అయింది. ఆ సందు మూలే కదా, బూరుగు దూది చెట్టు ఉండేది.

అదిగో పోస్ట్ ఆఫీస్! గోడలు నల్లబడి పోయి, పోస్ట్ బాక్స్ దుమ్ము పట్టి ఉంది. అవును! ఇప్పుడు ఉత్తరాలు వ్రాయడం తగ్గిపోయింది కదా.

విశాల వాళ్ళ ఇల్లు- అటు ఇటు ఉన్న ఫ్లాట్ల సముదాయానికి మధ్యలో, అక్కడి మంచినీళ్ళ మోటారు హోరుకు మూడడుగులు వెనకాల ఉన్నట్టు… చిన్నపాటి తోటతో మొక్కల వెనకాల దాక్కుంది. గేటు తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాను. కర్టెను తొలగించి ‘ఎవరూ?’ అంటూ క్షణాల్లో పోల్చుకుని, ‘అబ్బా లక్ష్మి!ఎన్నాళ్ళయింది నిన్ను చూసి’ అని పరుగున వచ్చింది విశాలాక్షి.

నేనూ ఉద్వేగానికి గురి అయ్యాను. లోపలకెళ్లి ఇద్దరం మా, మా కుటుంబాల కబుర్లు చెప్పుకుని, కాఫీ తాగాక, నేనే విద్యానికేతన్ ప్రస్తావన తెచ్చాను. నా ప్రశ్నలకు జవాబు దొరికేవరకు మనసు లాగుతూనే ఉంది. విశాల చెప్పుకొచ్చింది “మేడం గారికి డబ్బు వచ్చి చేరిన కొద్దీ ఆశ పెరిగి పీజీలు పెంచారు. బడి ప్రమాణాలలో నాణ్యత తగ్గింది. ఎంతసేపు బడిబయట బోర్డు మీద మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లల ఫోటోలు పెట్టాలన్న తాపత్రయమే. చదువు ఇదివరకట్లా పండగలా కాదు, స్కూలు వారికి డబ్బు సంపాదించడానికి— తల్లిదండ్రులకి ఇల్లు కన్నా స్కూలు పదిలం అని పిల్లలను పంపించడానికి ఒక పబ్బంలా మారిపోయింది. వచ్చిన డబ్బులు మేడం భర్త, కొడుకులు చిల్ల పెంకులలా ఖర్చు చేయడం.

కొన్నాళ్ళకి ఆయన ఆరోగ్యం చెడిపోగా కొడుకులు చేతికి అంది రాని పరిస్థితిలో, కూతురు అల్లుడు కేరళ నుంచి వచ్చి, పెద్దవాళ్లని ఇద్దరిని తమ ఊరు తీసుకుపోయారు. అలా విద్యానికేతన్….కాలగర్భంలో…….

సాయంకాలం రైలెక్కి తిరుగు ప్రయాణం లో పడ్డాము.

ఇవాళ ఆకాశంలో ఒక మబ్బూ లేదు.

నిన్నంతా మేఘాలశిల్పాలు.

వాటిలో ఎక్కడో ఆ ‘విద్యానికేతన్’…..

Exit mobile version