నెమలీకంత అందమైన “మయూరాక్షి”

0
3

[box type=’note’ fontsize=’16’] “చాలా సున్నితమైన అంశాలను స్పృశిస్తూ కథను అల్లడమే కాదు, దాన్ని నమ్మించేలా నటనలు రాబట్టాడు దర్శకుడు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘మయూరాక్షి’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]2[/dropcap]017 లో వచ్చిన ఈ బంగ్లా చిత్రం “మయూరాక్షి” నేను కేవలం సౌమిత్ర చటర్జీ వున్నాడని చూశాను. కాని ఆశ్చర్యంగా సినెమా కూడా అంతే నచ్చింది. అక్కడ తెలిసిన పేరే అయినా నాకు దర్శకుడు “అతను ఘొష్” కొత్తే. కాని గుర్తుపెట్టుకోతగ్గ పేరు. రెండోది “ప్రొసెంజిత్ చటర్జి” పేరు. అతని నటన కూడా బాగుంది.

క్లుప్తంగా కథ చూద్దాం. 83 యేళ్ళ సుశోవన్ (సౌమిత్ర చటర్జీ) వయసు కారణంగా మతిమరుపు, ఆకలి లేమి, గతాన్ని తవ్వుకుంటూ బతకడం, లాంటి లక్షణాలతో బాధపడుతూ వుంటాడు. గతంలో అతను పేరున్న ప్రొఫెసరు. చరిత్ర, సాహిత్యం, సంగీతం, క్రికెట్ లాంటి చాలా విషయాలలో మంచి రుచి కలిగిన వాడు. కొడుక్కి వయసులో క్రికెట్లో ప్రోత్సహించినవాడు. ఇప్పుడు భార్య తోడు లేదు, 1997 లేక 1999 లో పోయింది; అతనికి కచ్చితంగా గుర్తు లేదు. చూసుకోవడానికి వొక మగ, వొక ఆడ అసిస్టెంట్లు వున్నారు. కొడుకు ఆర్యనిల్ (ప్రొసెంజిత్ చటర్జి) షికాగోలో వుంటాడు. రెండు విఫలమైన పెళ్ళిళ్ళు. మొదటి భార్యకు మనోవర్తి, కోల్కాతాలో తండ్రికి డబ్బు, హాస్టల్లో వుండి చదువుకుంటున్న కొడుకుకి డబ్బు, తన ఖర్చులకు డబ్బు. ఇన్ని నెత్తి మీద వుంటే తన కూడా తండ్రినీ, ఆ ఇద్దరు సహాయకులతో తీసుకెళ్ళి పెట్టుకోవడం కుదిరే పని కాదు. తండ్రికి బాగా లేదని తెలిసి చూడడానికి వెళ్తాడు. వెళ్ళాక తెలుస్తుంది అప్పుడప్పుడు “మయూరాక్షి” ని చూడాలని వుందని తండ్రి చెబుతూ వుంటాడని. అది తన చివరి కోరిక అనీనూ. ఇక ఆ మయూరాక్షి ని వెతుక్కుంటూ చివరికి వొక ఇంట్లోకెళ్తాడు. అక్కడ చక్రాల బండి మీద వున్న వో యువతి కనిపిస్తుంది. తను తాగుడుకి బానిసై వో సారి రెండో అంతస్తునుంచి పడిపోయి వికలాంగురాలైనప్పుడు ఈ నిర్దయప్రపంచంలో వొక్క మయూరాక్షి మాత్రం తన బాధ్యత నెత్తిన వేసుకొని, ప్రేమను పంచి మామూలు మనిషిని చేసింది. తను స్వతంత్రురాలయ్యాక తనను చూసుకోవడానికి మయూరాక్షి తన వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకపోవడం, చెప్పిన వినకపోవడం వల్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఆ అమ్మాయి. మయూరాక్షి వస్తువులన్నీ బయటకు గిరాటేసి, ఆమెను కూడా వెళ్ళి పొమ్మంటుంది. అలా ఆనాడు చేయబట్టి ఇప్పుడు మయూరాక్షి వో పెళ్ళి చేసుకుని ప్రేమించే భర్త, ముద్దుల కూతురుతో సంతోషంగా వుందని చెబుతుంది. సుశోవన్ శిష్యురాలైన మయూరాక్షి కి ఆర్యానిల్ మీద ప్రేమ; వాళ్ళ పెళ్ళి జరగాలని సుశోవన్ కోరిక కూడా. కాని అలా జరగ లేదు. గతంలో జ్ఞాపకాలలో బ్రతుకుతున్న సుశోవన్ ఇప్పటికీ కొడుకును ఆ అమ్మాయిని చేసుకోమంటాడు, అంత మంచి మనసున్న మనుషులు అరుదు అని చెబుతూ. కాని తండ్రికి యెలా చెప్పేది నిజం? అందుకే ఆమె చనిపోయిందని చెప్పి, మర్నాడు తను కూడా చెప్పకుండా షికాగోకి ప్రయాణం కడతాడు.

ఇంకొన్ని ఉపకథలు వున్నాయి ఇందులో. శహానా (ఇంద్రాణి హాల్దార్) ఆర్యానిల్ కి చిన్ననాటి స్నేహితురాలు. పరిస్థితులు అనుకూలించి వుంటే వాళ్ళ పెళ్ళి జరిగి వుండేది. ప్రస్తుతం ఆమె వివాహమై ప్రేమించే భర్త, కూతురులతో వుంటుంది. సుశోవన్ గురించి తెలిశాక తన భయాన్ని ప్రకటిస్తుంది : రేపు పొద్దున నాకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తే నా కూతురు నా ముఖం కూడా చూడదు, దానికంటే ముందే భర్త ముఖం చాటేస్తాడు, వ్యాపారి కదా unviable proposal అని చెబుతాడు. శహానా సమక్షంలో ఆర్యానిల్ కి కొంత మనశ్శాంతి.

తను ఇష్టపడ్డ శహానా నీ చేసుకోక, తనను ఇష్టపడ్డ మయూరాక్షినీ చేసుకోక, చేసుకున్న రెండు పెళ్ళిళ్ళూ విఫలమై వొక విషాదంలో వుంటాడు ఆర్యానిల్. ఇది యెవరూ చెప్పకుండానే సుశోవన్ కి తెలుసు, ఆ మాట చెబుతాడు కూడా. తండ్రి-కొడుకుల అనుబంధం మాత్రం చాలా సన్నిహితంగా వుంటుంది. అది అతని చేతల్లోనే కాదు, వాళ్ళ సంభాషణల్లో కూడా తెలుస్తుంది. తండ్రి చెప్పే ప్రతి విషయమూ కొడుక్కి తెలుసు, కొడుకు జీవితంలో ప్రతి చిన్న విషయమూ తండ్రికి స్పష్టంగా గుర్తు. ఆర్యానిల్ అత్మీయంగా మాట్లాడటం తండ్రితో, శహానాతో మాత్రమే. మిగతా వాళ్ళతో వ్యావహారిక సంభాషణ.

అపరాధ భావన, నిస్సహాయతలతో కంట తడిపెట్టుకుని కొడుకు షికాగో కెళ్ళిపోయిన విషయం తండ్రిని విముక్తుణ్ణి చేస్తుంది. మళ్ళీ వదిలేసిన రంగులూ, బ్రష్షులూ చేతబట్టి బొమ్మ గీస్తాడు. ఇదిగో నా కొడుకు కోసం ఇక్కడ కిటికీ గీస్తున్నాను, ఇక్కడి నుంచి వాడు నన్ను చూడగలుగుతాడు అంటాడు.

చాలా సున్నితమైన అంశాలను స్పృశిస్తూ కథను అల్లడమే కాదు, దాన్ని నమ్మించేలా నటనలు రాబట్టాడు దర్శకుడు. నటనలో ముఖ్యంగా శౌమిత్ర చాలా బాగా చేశాడు. మొత్తం శరీరంతో. ఆ కేఫ్‌లో తను ఊహల్లో బాణీ కట్టిన నేపథ్య సంగీతాన్ని నోటితో చప్పుళ్ళు చేసి వినిపించి, చివరికి ఆ లేని వాయులీనాన్ని చాలా జాగ్రత్తగా కింద పెడతాడు, కుర్చీకి ఆనించి. ఇక మాట్లాడే అతని కళ్ళగురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రొసెంజిత్, ఇంద్రాణిలు కూడా బాగా నటించారు. సౌమిక్ హాల్దార్ చాయాగ్రహణమూ, దేబొజ్యోతి మిశ్రా సంగీతమూ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రొబింద్ర సంగీత్. అలాగే నజ్రుల్ తదితరుల పాటలు కూడా. అర్థవంతంగా, సందర్భానికి అతికినట్టుగా, సమాంతరంగా కథను చెబుతూ.

యెక్కువ సీన్లు ఆర్యానిల్ నడుస్తూ వుండడం చూస్తాం. దేన్నో వెతుక్కుంటూనో, మరో లానో. అలాగే చివరికి తన పరిస్థితికి యెలాంటి పరిష్కారం దొరక్క షికాగోకి వెళ్ళి పోవడమూ చూస్తాము. వొక్క తండ్రి మాత్రం వున్న చోటే వుండి, బొమ్మలతో తన ప్రపంచాన్ని విశాలం చేసుకుంటాడు.

ఈ చిత్రం చూడమని నేను గట్టిగా సిఫార్సు చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here