Site icon Sanchika

మెదడు పీకి పందిరి

[బాలబాలికల కోసం ‘మెదడు పీకి పందిరి’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]“అ[/dropcap]మ్మా, అమ్మా,” అలవాటయిన నివిన్ అరుపులకి కంగారు పడకుండా తల తిప్పి చూసింది దీప్తి “ఏమిట్రా?” అంటూ.

“కిందపడ్డ వస్తువులని భూదేవి కోరుకుంటుందా? అంటే భూదేవి ఎవరేంకింద పడేస్తారా అని చూస్తూ కూర్చుంటుందా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“అవును నాన్నా” అంది చిన్నప్పుడు తమ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి.

“అదేంటమ్మా? ఆవిడకి ఇల్లూ, అమ్మా, నాన్నా ఎవరూ వుండరా?”

“అందరూ వున్నారు నాన్నా. అసలు మనందరికీ కూడా తల్లిలాంటిది ఆవిడ. ఆవిడకేం తక్కువ!? ఇంతకీ నీకెవరు చెప్పారురా కిందపడ్డవాటిని భూదేవి కోరుకుంటుందని?”

దీప్తికి తమ చిన్నతనం గుర్తొచ్చింది తమ చేతిలోంచి తినే వస్తువేదన్నా కింద పడితే అమ్మమ్మ వాటిని తీసుకు తిననిచ్చేది కాదు. భూదేవి కోరుకుంటోంది అని దొడ్లో చెట్లల్లోనో, గోడవతలో పడేయించేది.

కొంచెం పెద్దయ్యాక అమ్మ చెప్పిందానిబట్టి తను అర్థం చేసుకున్నది. అందరూ తిరిగే ప్రదేశంలో కింద పడ్డ ఆహారం తీసుకుని తినటంవల్ల బాక్టీరియా సులభంగా శరీరంలోకి చేరి జబ్బులొస్తాయని ఒక కారణమయితే, బయట వుండే క్రిమి కీటకాలకి ఆహారం వేసినట్లువుతుందని ఇంకో కారణం. ఈ కాలంలో ఆలోచనలు, నమ్మకాలు పెరిగి చీమలకి చక్కెర వెయ్యమని, పక్షులకి అన్నం తినే ముందు ఒక ముద్ద పెట్టమని చెబుతున్నారు ఉపదేశాలిచ్చేవారంతా. పూర్వం ఎక్కువమంది కుక్కల్ని ఇళ్లల్లో పెంచకపోయినా, పూట పూటా వీధి కుక్కలకి ఇంట్లో మిగిలిన అన్నం పెట్టేవారు. ఇంటి ముందుకొచ్చే బిచ్చగాళ్ళకి అన్నం, కూరలు పెట్టేవాళ్ళు. క్రిమి కీటకాలకీ కొంత ఆహారం పడేసేవాళ్ళు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచేవాళ్ళ కాదు. అప్పుడసలు ఫ్రిజ్ లు లేవు. కొబ్బరి చిప్ప తురిమేటప్పుడు కూడా అమ్మమ్మ పూర్తిగా తురమద్దు అనేది. అలా పడేసిన ఆహార పదార్ధాల మీద ఆధారపడి బతికే క్రిమి కీటకాలు తిట్టుకుంటాయట, ఇంత కక్కుర్తిగాళ్ళేమిటి మొత్తం గీకేశారని.

“చెప్పమ్మా” అంటూ నివిన్ కుదపటంతో తన జ్ఞాపకాలనుంచి బయటకి వచ్చింది దీప్తి.

“మరి భూదేవికి అమ్మ వుంటే అందరూ కింద పడేసిన వాటిని ఎందుకు కోరుకుంటుంది? వాళ్ళమ్మ అన్నం పెడుతుందిగా!?”

ఈ కాలం పిల్లల ఐక్యూ చాలా ఎక్కువగా వుంటోంది. తమ రోజుల్లోలాగా పెద్దవాళ్ళు చెప్పింది విని వూరుకోవటంలేదు. అన్ని వివరాలు తెలుసుకుని వాళ్ళకి నచ్చితేనే వూరుకుంటున్నారు. లేకపోతే చెప్పేవాళ్ళ మెదడు పీకి పందిరేస్తుంటారు. అందుకే నివిన్‌కి వివరంగా చెప్పటం ప్రారంభించింది.

“భూదేవి కోరుకుంటోంది అంటే ఆవిడ తీసుకుని తింటుందని కాదురా. అలా అనటానికి రెండు కారణాలు వున్నాయి. అందరూ తిరుగుతూ వుండే నేల మీద పడ్డ వస్తువు తినటంవల్ల జబ్బులు చెయ్యవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే భూమి మీద అనేక చిన్న చిన్న జంతువులు, క్రిమి కీటకాలు వుంటాయి. అవి వాటికన్నా చిన్న పురుగుల్నే కాకుండా ఇలా బయట పడేసిన ఆహార పదార్ధాలు కూడా తిని బతుకుతుంటాయి. మనం పడేసేవాటిని అలా ఏవో ఒకటి తింటాయి.”

“అమ్మా, బయట మట్టిలోనూ, చెత్తలోనూ పురుగులు వుంటాయి, వాటివల్ల ఇంకా ఎక్కువ జబ్బులు వస్తాయంటావు కదా. మరి వాటికి ఫుడ్ పెట్టటం ఎందుకు?? మనం పెట్టకపోతే అవి తిండిలేక చచ్చిపోతాయి కదా. అప్పుడు మనకి రోగాలు రావు కదా!”

ఆశ్చర్యపోయింది దీప్తి. మా చిన్నతనంలోనే కాదు. ఈ వయసులో కూడా ఇలాంటి ఆలోచనలు రావటం లేదు. ఇది పిల్లల తెలివితేటల్లో అభివృధ్ధా, తరాలు మారుతుంటే మనిషిలో వచ్చే స్వార్థ, సంకుచిత ఆలోచనల పరాకాష్ఠ అని నిశ్చేష్టురాలయి చూస్తూ వుండిపోయింది.

Exit mobile version