[dropcap]మ[/dropcap]నుషులెట్ల మసలురో
అంతస్సుకస్సలు తెలియదు
ఏమి తెలియక మిన్న కుంటి
ఏమీ చేయలేక మిన్ను నంటి
ప్రేమకే ఈర్ష్య కలగంగా
ప్రీతితో మేపిరి
చెంగు చెంగున నే గెంతంగా
వెనక వెనక నాతో ఆడిరి
గారాబంగా అక్కున చేర్చిరి
ఊపిరాడకుండా చుంబించిరి
నాపై నాకే ఒకింత గర్వం
ఇంత ప్రేమ ఎవరికి సొంతం
వాన తరువాత మబ్బుల చేసే ఆర్భాటంలా
కాలము ఒకటే దౌడు
రెండు పున్నములు, రెండు అమావాస్యల పోయాయి
నాతో పెరిగిన ఉసిరి మొక్క చెట్టైంది
నేను పిల్ల నుంచి పోతునయ్యా
మనుషులెట్ల మసలురో
అంతస్సుకస్సలు తెలియదు
నా మేడలో ఒక తాడు
నా స్వాతంత్రానికి ఉరితాడు
ఆ కళ్ళల్లో ఇక లేదు కమ్మదనం
నేనెటు పారిపోతానో అని మాత్రం ఆత్రం
పగలూ రాత్రి పండగ భోజనం
వాళ్లకిష్టమైనవి నాకు మేపడం
నా చిత్తంలో యెనలేని కృతం
ఏమి చేయలేని పశు జీవితం
ఒకనాడు అకస్మాత్తు పయనం
ఫలితం మరో ఇంటి ద్వారం
యజమాని రూకలు లెక్కెడుతూ దూరంగా వెడుతుంటే
నా కనుల వెంట నీటి ధార
నాక్కూడా బంధాలు, అనుబంధాలు తెలుసు
అడిగుంటే చెంగున యెగిరి చెప్పేదాన్ని
దేవుడు పక్షపాతి, మనుజునికి అన్నీ ఇచ్చి
కేవలం ఆ మాటలు మాకు ఇస్తే ఏం పోయేది
కొత్త ఇల్లు, కొత్త మనుషులు నేను మనగలనా
యజమాని కూతురు చిన్ని గుర్తొచ్చి కూలబడ్డా
అయినా యజమాని వదిలిన ఇల్లు
ఆ మాత్రం ప్రేమగా చూసుకోరా ఏం
కనుచూపు మేరలో యజమాని మాయం
రెప్పలార్పి వెనక్కి చూస్తే ఒకడు కత్తితో గరం గరం
బుర్ర మీసాలు, గంభీర అవలోకనం, భీకర నవ్వు
ఇటుగా వస్తున్నాడు బహుశా నా మెడలోని
తాడు తీయలేనేమో అని నా ఊహ
బిడియంతో అతని ఒడిలోకి ఎగరాలని
అతడు నన్ను ప్రేమగా నిమరాలని ఆశ
కానీ అతని ఆ నవ్వులో ఏదో తేడా
అతడి అంతిమ అడుగులో ఏదో తేడా
నా ఆలోచనలు ఎటు మరలాయో ఏమో
అతడి కత్తి వేటు సరిగ్గా నా మెడపై పడింది
అమ్మ అని గట్టిగా అరిచా
పాత యజమానిలా పరిగెత్తి పరిచర్యలు చేస్తాడనుకున్న
ఇరవై వేలు ఇచ్చి కొన్న పోతు ఇది
నువ్వు మసాలా సిద్ధం చెయ్ అన్న మాటలు వినపడగానే
గుండె ఇక ససేమిరా అన్నది
యజమాని కన్నా కసాయి నయం
ప్రేమతో వంచన చేయలేదు
ఒక్క వేటుతో లేని బంధం విడదీసాడు
నవ్వుతూ పోతే మనిషిలా పుడతారట
దేవుడు పక్షపాతి, కనీసం నవ్వైనా ఇయ్యలేదు మాకు
ఏమి తెలియక మిన్న కుంటి
ఏమీ చేయలేక మిన్ను నంటి
ఈ మనుషులు నాకు అర్థం కారు
మది కపటం
మేను కపటం
వైఖరి కపటం!