[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘Reality is not so Scary’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]చం[/dropcap]ద్రుడు కనిపిస్తూ ఉంటే మనకి ఎంత సంతోషమో కదా! పద్మకి సముద్రమన్నా, చంద్రుడన్నా బోలెడు ఇష్టం. విశాలమైన జలరాశి, దాని మీద వెన్నెల తునకలు! వాటినలా ఎంతసేపయినా చూస్తూండిపోతూ, పరవశానికి లోనవడం సహజమే! కొన్ని ఆనందాలంతే, తనివి తీరవు!
చిన్నప్పుడు బంగాళాఖాతం మీద వెన్నెల పరుచుకోడాన్ని చూసి ఆస్వాదించేది, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ లాంటి వెన్నెల పాటలను తలచుకునేది.
ఐతే మరీ చిన్నగా ఉన్నప్పుడు చందమామ అంటే పద్మకి భయంగా ఉండేది. ఎందుకంటే పున్నమి నాటి చంద్రుడు ఓ పెద్ద రాక్షసుడిలా (‘మామ’ కదా) అనిపించి తనని మింగేస్తాడేమోనని భయపడేది పద్మ. గట్టిగా ఏడ్చేసి, వెన్నెల్లో ఆరుబయట కూర్చున్న అమ్మానాన్నలను ఇంట్లోకి వచ్చేసేలా చేసేది. అయితే ఎందుకో తెలియదు కానీ సినిమాల్లోని వెన్నెల పాటలు మాత్రం పద్మకి బాగా ఇష్టం. ‘చందమామ రావే’, ‘పండు వెన్నెల’ వంటి సినిమా పాటలను అమ్మ శక్తిని అడిగి పాడించుకునేది.
అయితే పెద్దయ్యాకా చంద్రుడి మీద ఇష్టం కలిగింది, గంటల కొద్దీ అతన్ని చూస్తూ కూర్చునేది. వాళ్ళ కుటుంబం సముద్రం నుండి దూరంగా ఉండే ఇంటికి మారాకా, సముద్రం – వెన్నెల జోడీని పోగొట్టుకుంది. అయితే వీలున్నప్పుడల్లా చంద్రుడ్ని చూడడం మాత్రం మానలేదు. ఈసారి తమ ఇంటి మేడ మీద నుంచి! అప్పట్లో, ముఖ్యంగా వేసవిలో స్కూళ్ళకూ, కాలేజీలకు సెలవలు కావడం వల్ల – రాత్రి పూట కరెంటు కోతలు మామూలే. చంద్రుడిని చూస్తే గంటల కొద్దీ సమయం గడుపుతోందన్న అపరాధభావం ఏదైనా ఉంటే అది, కరెంట్ కోతల వల్ల పోయింది. దానికి తోడు విలియమ్ హెన్రీ డేవిస్ రాసిన ప్రఖ్యాత ఆంగ్ల కవిత ‘లెజర్’ – ఆమె చర్యలని సమర్థించుకునేలా చేసేది.
పద్మ బాగా చదువుకుంది. పరిశోధన చేసి పట్టా పొందింది. ఈ క్రమంలో చాలామందికి దూరమైనా, చంద్రుడికి మాత్రం దూరం కాలేదు. చంద్రుడిని చూస్తూ ఎంతో రిలాక్స్ అయ్యేది.
***
ఉద్యోగ బాధ్యతల కారణంగా ఎన్నో ఊర్లకు తిరిగింది. వృత్తిగత, వ్యక్తిగత బాధ్యతలు – చంద్రుడిని చూసే సమయాన్ని తగ్గించాయి.
పద్మ చెన్నైలో ఉండగా అమ్మానాన్నలు ఆమె ఇంటికి వచ్చారు. వాళ్ళ రాకకి పద్మ ఎంతో సంతోషించింది. ముగ్గురు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, ఎన్నో జ్ఞాపకాలను కలబోసుకున్నారు.
ఆ రోజు పౌర్ణమి. తనతో పాటు సముద్ర తీరానికి వచ్చి చంద్రోదయాన్ని చూడమని అమ్మానాన్నలని బతిమాలింది పద్మ. సముద్ర తీరంలోని రెండు పెద్ద బండరాళ్ళ మీద చిన్న వంతెన కట్టారని, దాని మీద కూర్చుని చంద్రోదయాన్ని చూడడం బావుంటుందని చెప్పింది. ఆ వంతెన తీరానికి దగ్గరగా లేకపోవడంతో, అక్కడికి వెళ్ళడానికి – పద్మ నాన్న సోమ అంత ఆసక్తి చూపించలేదు. అయితే తాను అంత దూరం నడవలేనని, అందుకని రానని అమ్మ శక్తి అంది. పద్మ ఆశలపై నీళ్ళు గుమ్మరించినట్లయింది. అయినా నాన్న నడవగలరు కాబట్టి, తనకి తోడుగా రమ్మని బ్రతిమాలి మొత్తానికి ఒప్పించింది.
సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించిక ముందే, చంద్రుడు మెల్లిగా ఉదయించసాగాడు. కాసేపటికి వెన్నెల కిరణాలు సముద్రపుటలలపై నాట్యం చేస్తున్నాయి. ఆ పొడవాటి వంతెనపై వాళ్ళిద్దరే ఉండి ఏవో గత స్మృతులలో లీనమయ్యారు. వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆశ్చర్యమేమిటంటే, ఎందుకో గానీ, ఆ పూట అక్కడ పెద్దగా జనాలు లేరు. అది తమ అదృష్టంగా భావించారు వాళ్ళు. పద్మ చంద్రుడిని, వెన్నలని ఎన్నో ఫొటోలు తీసింది. చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న చందమామ పాటలను హాయిగా పాడుకుంది. కూతురి సంతోషాన్ని చూసిన తండ్రి ఆనందించాడు. కూతురు చేసిన సూచనలను పాటిస్తూ ఆమె ఫొటోలను తీశాడు. తనని ఫొటో తీయించుకున్నాడు. ఎంతో ఉల్లాసంగా గడిచింది సమయం! భార్య శక్తిలా, ఇంటి పట్టునే ఉండకుండా, ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషించాడాయన.
సముద్రాన్నీ, చంద్రుడిని చూస్తూ ఆనందిస్తున్న పద్మ – ఉన్నట్టుండి సముద్రంలో అలజడి రేగడం గమనించింది. అయితే బాల్యంలో సముద్రానికి సమీపంగా గడపడం వల్ల, ఆ అలజడికి పెద్దగా భయపడలేదు. పైగా ఉత్సాహపడింది. అలలు అంతకంతకూ మరింత ఎత్తుకు లేస్తున్నాయి. అయితే వాళ్ళిద్దరూ వంతెన మీద ఉన్నారు కాబట్టి, అలలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
ఉన్నట్టుండి వంతెన సమీపంలో నీరు 60-70 అడుగుల ఎత్తుకి లేచింది. ఓ రాకాసి అల వంతెన వైపు వేగంగా దూసుకువస్తూ, ఉధృతమై వంతెనని కూల్చేసేలా వుంది. క్రికెట్‍లో బౌలర్ బౌన్సర్ వేస్తే, బ్యాటర్ ఎలా వంగి తప్పించుకుంటాడో అలా వంగింది పద్మ. “నాన్నా, వంగండి” అని అరిచింది. అయితే వంగినంత మాత్రాన రాకాసి అల ఎవరినైనా విడిచిపెడుతుందా?
***
ఎక్కడి నుంచో గాని కోకిల కూ, కూ వినిపించిది. రాకసి అలనుంచి కోకిల ఎలా తప్పించుకుందా అనుకుంది పద్మ. ఇప్పుడు మరో ప్రశ్న ఆమె మనసులో మెదిలింది – మరి నేనెలా తప్పించుకున్నాను అని! నాన్న ఏమయ్యారు? అంతలో ఉదయం ఆరు గంటలైందని సూచిస్తూ ఆమె మొబైల్ లోని అలారం మోగింది. చుట్టూ చూసింది పద్మ. తాను తన గదిలోనే ఉన్నట్టు, అంతా సాధారణంగానే ఉన్నట్టు గ్రహించింది. ఏం జరిగిందాని ఆలోచించింది. అమ్మానాన్నలు తన దగ్గరకి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడూ తనతోనే ఉంటున్నారుగా! పౌర్ణమి ఎప్పుడయింది? పదిహేను రోజుల క్రితం! సముద్రంలోకి వేశారా అన్నట్లుండే పొడవాటి వంతెన చెన్నైలో ఎక్కడుంది? అసలు అలాంటిదేదీ ఉన్నట్టు లేదు. సాయంత్రం వేళల్లో, చెన్నై సముద్ర తీరంలో జనాలు లేకుండా ఉన్నదెప్పుడు? ఎన్నడూ కాదు! అంటే, ఇదంతా జరిగినది ‘కల’లో అన్న మాట!
మంచం దిగుతుంటే, అమ్మ వచ్చి, ఆఫీసుకు వెళ్ళాలని, సెలవు రోజు కాదని పద్మకి గుర్తు చేసింది. అమ్మని చూసి నవ్వింది పద్మ. ఇంతలో నాన్న అక్కడికి వచ్చి “తవ సుప్రభాతం” అని అన్నాడు. సమాధానంగా పద్మ చిన్నగా నవ్వింది. “ఇదేం వేసవి కాలం కాదు. మరి నీకెందుకు ఇంత పొద్దున్నే అంతలా చెమటలు పట్టాయి? ఒంట్లో బాగాలేదా? డాక్టరు దగ్గరకి వెళ్దామా?” అంది అమ్మ.
“ఏం లేదమ్మా. నేను బాగానే ఉన్నాను. వాస్తవం, కలలా భయానకమైంది కాదు. మెలకువ ఓ భరోసా!” అని చెప్పి, లేచి తయారవడానికి వెళ్ళింది పద్మ.
కూతురు ఏమంటోందో అర్థంకాక అమ్మానాన్నలు కళ్ళు పెద్దవి చేసి, నోరెళ్ళబెట్టి ఉండిపోయారు.
ఆంగ్ల మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్