Site icon Sanchika

మేలుకోవయ్యా!

[dropcap]మా[/dropcap]నస సరోవరంలో ధ్యానముద్రలో మునిగిపోయాడు ఆంజనేయుడు. రామధ్యానంలో యుగాలు గడిపేస్తున్న రామదూతకు లోకమంతా రామమయంగా కనిపిస్తోంది. మదినిండా సీతారాములు కొలువై ఉన్నారు. ఆంజనేయుడి నోటనుండి వచ్చే ‘శ్రీరామ’ శబ్దం లక్షనామాలుగా ప్రకృతిని పులకింపజేస్తుంది. అక్కడికి సమీపంలోని వృక్షాలన్నీ ‘రామ’ నామాన్నీ వింటూ పరవశించిపోతున్నాయి.

ఆ సమీపంలోని వృక్షాలపై ఉండే రకరకాల పక్షులు, ఆ పరిసరాలలో తిరిగే రకరకాల జంతువులు సైతం ‘రామ’ నామాన్ని వింటూ, రామధ్యానంలో ఉన్న ఆంజనేయుణ్ణి దర్శించుకుంటు తమ జన్మ తరించిపోయిందనుకుంటున్నాయి. ఆ రోజు పౌర్ణమి పండువెన్నెల. సరోవరంలోని కలువలు చంద్రకాంతి సోకి విచ్చుకుని సరోవరాన్ని మరింత ఆహ్లాదంగా మార్చాయి. అక్కడికి దగ్గరలో చెట్టుమీద ఎప్పటినుండో నివాసముంటున్న జంటపక్షులు ఆ పరిసరాల శోభను ఆస్వాదిస్తూ అక్కడే నివాసముంటున్నాయి.

అవన్నీ రామధ్యానంలో ఉన్న ఆంజనేయుణ్ణి దర్శించుకుంటు తమ జన్మ తరించిపోయిందనుకుంటున్నాయి. అవి అప్పుడప్పుడు జనారణ్యంలోకి వెళ్ళి, తమ బంధువులను కలిసి వస్తుంటాయి. ఆ కబుర్లన్నీ అవి ఇక్కడి తమ నేస్తాలతో పంచుకుంటాయి. అలా ఓ రోజు కొన్ని కొంగలు పట్టణాల్లో, పల్లెల్లో కొంతకాలం గడిపి తిరిగి సరోవరాన్ని చేరుకున్నాయి. అక్కడి విశేషాలు అవన్నీ చర్చించుకుంటు ఉండగా, మిగిలిన పక్షులన్నీ వాటి చుట్టూ చేరాయి.

“చాలారోజులు వెళ్ళి వచ్చారు ఏమిటి విశేషాలు?” అని కొంగలను ప్రశ్నించాయి.

“మనుషుల జీవితంలో చెప్పలేనంత విషాదం కమ్ముకుంది. వాళ్ళంతా ఆదుకునే వారులేక విలవిల్లాడుతున్నారు” అని చెప్పాయి కొంగలు.

“ఎందుకా పరిస్థితి వచ్చింది?” అడిగింది అక్కడే చెట్టుమీద ఉన్న రామచిలుక. ఈ సంభాషణ అర్థమై మిగిలిన పక్షులన్నీ చుట్టూ చేరాయి.

“అసలేం జరిగింది? మానవులంతా ఎలా ఉన్నారు?” అడిగాయి కొంగలను.

“మానవులకు ఏదో కొత్తరకం వ్యాధి వస్తొందట. దానికి మందులేదట. చాలామంది చనిపోతున్నారట. దాన్ని గురించే మానవులంతా దిగులుపడుతున్నారు” అని చెప్పాయి కొంగలు.

చెట్టుమీద కుహూ కుహూ అని కూస్తున్న కోయిల ఇదంతా విని గబ గబ అక్కడికి వచ్చింది.

“దానికి ఒక ప్రాంతం, బీద, గొప్ప తేడాలు లేవట. గుంపుగా ఉంటే దానికి కన్నుకుట్టి, ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తోందిట. అక్కడ ఉన్న మన బంధువులు కూడ భయపడుతున్నారట. మన స్నేహితులు చెప్పుకుంటుంటే విన్నాను. మానవజాతి మనుగడలో మనమూ భాగస్వాములమే కదా?” అన్నది కోయిల.

“ఇంక మానవజాతికి భగవంతుడు ఆదుకోవలసిందే. దుష్ట శిక్షణ కోసం రకరకాల అవతారాలెత్తే పరమాత్మ, ఇప్పుడు ఓ కొత్త అవతారమెత్తి ఈ మహమ్మారి నుండి కాపాడాలి” అన్నది రామచిలుక.

ఆ పరిసరాల అందాలకు మైమరచి, నాట్యం చేస్తున్న నెమలి వెంటనే తన నాట్యాన్ని ఆపి ఆతృతతో అక్కడకు వచ్చింది. “పరమాత్మ లేడు పనసకాయ లేదు. ఆయన దిగిరావడం ఆదుకోవడం కల్ల. మనం ఎన్నిబాధలు పడ్డాం? ఏనాడన్నా దేవుడు ఆదుకున్నాడా? అడవులు పలుచబడి నివాసము, నీళ్ళు కరువై చాలా పక్షి జాతులు అంతరించిపోయాయి. ఇన్నాళ్ళకు ఇక్కడ సుఖంగా ఉంటున్నాం. ఎవరి బాధలు వాళ్ళు పడాల్సిందే” అంటూ తీర్మానం చేసింది.

“ఆకలో రామచంద్ర అన్నా ఏ రాముడు ఆదుకోడు” అంటూ పక్షులన్నీ దానితో వంత పలికాయి, మేం మేం తీసిపోమన్నట్లు. ధ్యానంలో ఉన్నా ఆంజనేయునికి ఈ పక్షుల పలుకులన్నీ చెవినపడి, ఒక్కసారిగా కలవరపడ్డాడు. వాటి మాటల్లోని అపశృతికి ఆయన మనసులో బాధ మొదలయింది. వెంటనే కళ్ళు తెరిచాడు. ‘ఆపదలో ఉండి ఆదుకోవయ్యా’ అని అర్థించే వాళ్ళను కష్టాలనుండి కడతేర్చే కరుణామయుడు రాముడు. మరి ఈ మాటలేంటి? పక్షుల మాటల్లో ఎందుకీ అపశ్రుతి? తనే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే అక్కడ నుండి బయలుదేరి వాయువేగంతో ఓ ఊరు చేరుకున్నాడు. ఊళ్ళో అక్కడక్కడ ఒకరిద్దరు మినహా, అంతా నిర్మానుష్యంగా ఉంది. ‘పట్టపగలు మనుషులంతా వాళ్ళ పనులతో హడావుడిగా జనసంద్రంలా ఉండవలసిన చోట ఏమిటీ నిర్మానుష్యం?’ చాలా ఆశ్చర్యం వేసింది ఆంజనేయునికి. ఎదురుగా ఓ రామాలయం కనిపించింది.

కన్నులారా ఓసారి స్వామిని చూస్తే సందేహాలన్నీ నివృత్తి అవుతాయి అనుకుంటూ గుళ్ళోకి అడుగుపెట్టాడు. గుళ్ళో భక్తులెవరూ లేరు. గుళ్ళో పూజారి సోమయాజులు, రైతు శరభయ్య కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

వాళ్ళ మాటలు చెవిన పడి తానూ అక్కడే కూర్చున్నాడు ఆంజనేయుడు. “ఏమిటీ పరిస్థితి పూజారిగారూ! కొత్తగా వచ్చిన ఈ వ్యాధి వల్ల ఊరు ఊరంతా ఉక్కిరిబిక్కిరవుతుంది. ముసలి, ముతక దీనికి తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పనికోసం బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంటోంది. పంటలు సరిగా పండక, అతివృష్టి, అనావృష్టికి ఎదుర్కోలేక ఉద్యోగాల కోసం పట్నాలకు చేరారందరు. అక్కడా పనులులేక, తిరిగి మన ఊరు చేరుకుంటున్నారు. పూట గడవడం కష్టమైపోతుంది. బ్రతుకు ఎలా తెల్లవారుతుందో అర్థం కావడం లేదు స్వామి. భగవంతుడు దిగిరావాలి స్వామి, వచ్చి ఆదుకోవాలి. ఈ మహమ్మారి నుండి కాపాడాలి. కానీ ఆ శ్రీరామచంద్రుడు ఈ మనుష్యలోకం వైపే కన్నెత్తి చూడటం లేదు. ఏ ఒక్క విపత్తు నుండి ఆదుకోవడం లేదు. ఈ మహమ్మారి నుండి కాపాడమంటూ దేశమంతా యజ్ఞాలు, యాగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పరమాత్మ కళ్ళు తెరవడం లేదు. అసలు దేవుడనేవాడూ ఉన్నాడా? అనే అనుమానం కలుగుతోంది స్వామీ” అని వాపోయాడు శరభయ్య.

పక్షుల దగ్గర విన్నదే ఇక్కడా వినిపిస్తోంది. ఒక్కసారి వాలంతో సమాధానం చెబితేనేగాని ఈ మనుషులకు బుద్ధి రాదు అనుకుంటూ, పూజారి ఏం చెప్తాడో అని ఆసక్తిగా వింటున్నాడు హనుమంతుడు.

“మనుషులు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు శరభయ్యా. సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యకిరణాలు సోకందే మనకు రోజు తెల్లవారదు, ఆహారం సమకూరదు. గాలి, నిప్పు, నీరు, ఇవన్నీ దైవీయ సంపద. ఒకప్పుడు మనిషి జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగాడో నీకు చెప్పనవసరం లేదు. మానవుడు తన తెలివితేటలతో గొప్ప, గొప్ప ఘనకార్యాలు చేస్తుండడం ఎంత వాస్తవమో, వింత వింత పోకడలు వినాశనానికి దారితీయడం కూడా అంతే నిజం. ప్రకృతి సంపదనంతా దురాశతో దోచుకున్నాడు. అందుకే ఎన్నో రకాలుగా మానవునికి ఉపయోగపడవలసిన మొక్కలు అంతరించిపోతున్నాయి. అడవులు పలుచబడి పోవడం వల్ల గాలి కాలుష్యం, నీటి కాలుష్యం లాంటి రకరకాల సమస్యలు మనిషి చేజేతులా తెచ్చుకున్నవే. సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తడం, దేవుణ్ణి నిందించడం కాదు చెయ్యవలసింది. తగినంత ఆత్మస్థైర్యం కూడగట్టుకోవాలి. మనం చిన్నతనంలో ఎన్ని విపత్తులు చూడలేదు. ఊళ్ళో ఒకసారి కలరా వచ్చి సగం మంది చనిపోయారు. ఓ ఏడు చెరువుకి గండిపడీ చెరువంతా కొట్టుకుపోతే, అందరు జోలెకట్టి ఊరూరు తిరిగి ధాన్యాన్ని పోగేసుకున్నాం. మామూలు పరిస్థితి రావడానికి ఆరునెలలు పట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోషకాహార లోపం వల్ల చాలామంది చనిపోయేవాళ్ళు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భోజనం చేయడం యజ్ఞంతో సమానం. పూర్వకాలంలో మునులు ఆకులు, అలములు తిని నిండు నూరేళ్ళు బ్రతికేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఎక్కడ ఉంది? ప్రతి వస్తువులోనూ కల్తీ. సూర్యకాంతి, చంద్రకాంతి తప్పితే మిగిలినదంతా కల్తీయే. అందుకే ఇలాంటివన్నీ మానవునికి సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మానవుని మేధస్సు అర్థరహితమైపోతుందని ఒకటి కాదు, వేల ఘటనలు రుజువు చేశాయి. వసంతంతో బాటే భగవంతుడు శిశిరాన్ని సృష్టించాడు. ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందుకు సాగడమే మన కర్తవ్యం. జయాపజయాలతో సంబంధం లేకుండానే కొన్నిసార్లు యుద్ధం ఆగిపోతుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే కొంతకాలం నిశ్శబ్దంగా, మంచిమనసుతో నిశ్చలంగా ఉండాలి. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ ఒక గంటలోనో, ఒక రోజులోనో ముగిసినవి కావు. మన సమస్యకు దేవుడు తప్పక పరిష్కారం చూపిస్తాడు. ‘ధర్మసంస్థాపన కోసం తాను తప్పక అవతరిస్తాన’ని ‘గీతోపదేశం’ ద్వారా పరమాత్మ మనకు వివరించాడు కదా! సూర్యకాంతి పలుచబడుతుంది. మేఘం అడ్డురావడం వల్ల ఇవన్నీ తాత్కాలికం. సమాజంలో ఉత్తమ పౌరునిగా నీ బాధ్యతను నువ్వు విస్మరించకూడదు. ఏదో ఒక రూపంలో భగవంతుడు తప్పక దారి చూపిస్తాడు. పాప ఫలితాన్ని అనుభవించడం అనివార్యం శరభయ్య. అధైర్యపడకు. వయసుతో బాటు ఎంతో అనుభవం ఉన్నవాడివి. నువ్వే అధైర్యపడితే ఎలా?” అన్నాడు పూజారి.

శరభయ్య ‘అవును’ అన్నట్లుగా తలూపుతూ “నేను మీలా ఆలోచించలేకపోయాను పూజారి గారు. మానవుని జీవనపయనంలో ఇలాంటి మిట్టపల్లాలు తప్పవని తెలుసుకున్నాను. సమయస్ఫూర్తితో ముందుకు పోవాలే గానీ, నిరుత్సాహపడకూడదు. ఈ విషయం అందరికీ అర్థం అవడానికి నావంతు కృషి నేను చేస్తాను. వస్తాను పూజారిగారు” అని చెప్పి బయలుదేరాడు. ఓసారి గుళ్ళోదేవుని దర్శనం చేసుకుని ఇంటిదారి పట్టాడు.

ఈ సంభాషణ విన్న ఆంజనేయునికి ఆర్ద్రతతో కళ్ళు చెమ్మగిల్లాయి. పూజారిలోనూ శ్రీరామ భక్తుణ్ణి దర్శించుకుని తిరిగి అక్కడ నుండి మనోవేగంతో ప్రయాణమయ్యాడు. మానస సరోవరానికి చేరుకుని ధ్యానంలో మునిగిపోయాడు. ధ్యానానికి ఆటంకం కలిగి ఆంజనేయుడు వెళ్ళిపోయాడని పక్షులు కలవరపడుతున్నాయి. ఆయన తిరిగి రావడంతో, సంతోషంగా పక్షులన్నీ ‘శ్రీరామ’ నామాన్ని తామూ జపించడం మొదలుపెట్టాయి.

Exit mobile version