Site icon Sanchika

మేము సైతం

[dropcap]ర[/dropcap]వళి మాటలు వింటుంటే తొలిసారి తనదైన ప్రపంచంలోకి వచ్చినట్టుంది సురేష్‌కి. ‘ఒక హిజ్రా ఆత్మకథ’ పుస్తకం అతనికిచ్చి చదవమని చెప్పింది రవళి.

సుధక్క, రవళి బయటికి వెళ్లారు. స్నానం చేసి చుడీదార్ వేసుకుని అమ్మాయిలా.. అలంకరించుకుని, అద్దంలో చూసుకునే సరికి, మనసంతా ఆనందడోలికల్లో తేలిపోయింది. ఆ సంతోషంలో ఆత్మకథ పుస్తకాన్ని ఏకబిగిన రెండు గంటల్లో చదివాడు. ఊహలకి, వాస్తవానికి ఉన్న వ్యత్యాసం.. హిజ్రా జీవితంలో ఉన్న కన్నీళ్లు, కష్టాలు కళ్ళక్కట్టినట్టు చూపించింది రచయిత్రి రేవతి.

నిజంగా తాను కోరుకున్నది అలాంటి జీవితమేనా? హిజ్రా అంటే అడుక్కోవడం, ఆట, పాట సెక్స్ వర్క్ చేయడమేనా? ఇదేనా తనకు రాబోయే జీవితం? వంటి ఎన్నో ప్రశ్నలు సురేష్ మనసులో మొదలయ్యాయి. మగ రూపం నుంచి స్త్రీగా మరాక అలా బతకడం తప్ప మరో మార్గం గౌరవంగా బ్రతికే వీలు లేదా? వీటన్నిటికి అతీతమైన… ఏదో భావన సురేష్ మనసులో మెదులుతోంది. అది ఏంటో అర్థం కావట్లేదు.

ఆ రోజంతా సురేష్‌తో లింగమార్పిడి ఆపరేషన్, లేజర్ ట్రీట్మెంట్ గురించి వివరంగా, అర్థమయ్యేలా చెప్పారు. వాళ్ల మాటలు వింటుంటే కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నట్టుగా అన్పిస్తోంది. క్రమంగా అతని మనసులో తనో మగపిల్లాడిననే భావన కనుమరుగవ్వసాగింది.

తల్లిదండ్రి గుర్తు రావటం లేదు. ఇంటా బయటా తన ఆడండి చేష్టలు చూడలేక… అవమానంతో తనని మానసికంగా, శారీరకంగా తల్లిదండ్రి పెట్టిన హింసలు తట్టుకోలేక, ఇంట్లో నుంచి డబ్బు, తల్లి నగలు తీసుకుని పారిపోయి రావడం అస్సలు తప్పనిపించడం లేదు. తన అదృష్టం బాగుండి అంతకుముందు పరిచయం ఉన్న హిజ్రా సుధక్క దగ్గరికి వచ్చాడు. లేకపోతే తన దగ్గర ఉన్న డబ్బు, నగలు గుంజుకుని సిగ్నల్స్ దగ్గర బిచ్చం ఎత్తించేవాళ్లు. ఆ ఊహే భయంకరంగా అనిపించింది. సుధక్క ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగం చేస్తున్న హిజ్రా మహిళ. ఎం.ఏ వరకు చదువుకుంది. ఆమె స్నేహితురాలు రవళి. తనూ హిజ్రానే. కాల్ సెంటర్లో పని చేస్తోంది. ఆమె గురించి తెలిసి, ఆమె అందానికి ఫిదా అయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రైల్వేలో పనిచేస్తున్న కేరళకు చెందిన వినీష్.

భోజనం తర్వాత సుధక్క హిజ్రాల జీవిత విధానం, గురువు ఎంచుకోవడం, చేలాగా చేరటం, నేర్చుకోవడం, గురుశుశ్రూష వారి పద్ధతులు, ఆచారవ్యవహారాలు, నియమాల గురించి వివరిస్తుంటే ఊహల్లోకి వెళ్లిపోయాడు సురేష్.

ఆ రోజు సాయంత్రం సుధక్క, సురేష్‌ని తీసుకుని హిజ్రాలు ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లి చూపించింది. అక్కడ హిజ్రాలు ఆట, పాటలతో డాన్స్‌లు చేస్తూ అడుక్కోవడం చూసి.. ‘నేను కోరుకునే జీవితం ఇది కాదక్కా!’ అని గొణిగాడు.

ఆ రోజు రాత్రి సుధాక్క, రవళి కలిసి సురేష్ ని షాపింగ్ తీసుకెళ్లి ఆమె కావలసిన డ్రెస్సులు, గాజులు, చెప్పులు కొని పెట్టారు.

మర్నాడు ఉదయం సురేష్‌కి పంజాబీ డ్రెస్ వేసి స్టేషన్ దగ్గరకి… తీసుకువచ్చి స్టేషన్‌లో, రైలులో అడుక్కుంటున్న హిజ్రాలను చూపించింది సుధక్క. ప్రయాణికుల్ని డబ్బు కోసం వేధిస్తూ,.. డబ్బు ఇవ్వని వాళ్ళని బూతులు తిడుతున్నారు కొందరు. మరి కొందరు తాము ధరించిన దుస్తులను పైకెత్తుతూ అసహ్యంగా, అసభ్యంగా సైగలు చేస్తున్నారు.

‘ఛీ.. ఛీ..’ అని మొహం తిప్పుకున్నాడు సురేష్.

“అలా అసహ్యించుకోకు. జీవించడానికి గతిలేక వాళ్ళు అలా చేస్తున్నారు. హిజ్రా అని తెలిస్తే చాలు ఎవరు తిండి పెట్టరు. ఉద్యోగాలు ఇవ్వరు. చదువుకోనివ్వరు. పైగా మనుషులన్న సంగతి మర్చిపోయి జంతువుల్ని తరిమినట్టు తరిమేస్తుంటారు. ఎగతాళి చేస్తారు. కన్న తల్లిదండ్రులే ఇళ్లలో నుంచి గెంటేస్తుంటే… బయట సమాజం ఎలా ఆదరిస్తుంది? ఆకలి తీర్చుకోవడానికి ఏం చేయాలో నువ్వే చెప్పు? నిన్నే తీసుకో… మీ నాన్న, అమ్మ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీ నాన్న నిన్ను మెడిసిన్ చదివించాలని కలలుగన్నారు. కానీ ‘నువ్విలా’ అని తెలియగానే, నీకు వైద్యం చేయించి, మామూలుగా ఉండేలా చేయడానికి ప్రయత్నించారు. నీలో మార్పు రాకపోయేసరికి ‘నువ్విలా’ అని అటు బంధువుల్లో… సమాజంలో ఎదురవుతున్న సమస్యలకి బదులు చెప్పలేక, నిన్ను గృహనిర్బంధం చేయబట్టే కదా! నువ్వు భరించలేక బయటకు వచ్చావు. పూలపాన్పులాంటి జీవితాన్ని కాదనుకుని ఈ ముళ్లబాటను ఎంచుకున్నావు” అంది సుధక్క.

“నిజమే.! కాదనను.. కానీ నేను హిజ్రాగా మారాలనుకుంటున్నది మాత్రం ఇలాంటి జీవితం కోసంకాదు..” అన్నాడు.

“నువ్వెలాంటి ప్రత్యేక జీవితం ఎంచుకున్నా ముందు ఇలాంటి ముళ్ళకంచెలు దాటాల్సిందే. హిజ్రాగా మారాక తల్లిదండ్రులు, తోబుట్టువులు, సమాజం, ఎవరూ అక్కున చేర్చుకుని ఆదరించరు. నూటికి తొంభై తొమ్మిది మంది ఛీత్కరించుకునే వాళ్ళే తప్ప చేరదీసే వాళ్ళుండరు.”

“కానీ……”

“కానీ లేదు అణా.. లేదు నువ్వు వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి”

“సరే అక్కా!” అన్నాడు అయిష్టంగా.

“అంతెందుకు నాకు నీకులా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఉండేది. ఎప్పుడైతే నేను మగ శరీరంలో ఉన్న ఆడపిల్లనని తెలుసుకున్నానో నా ఆశయాలని ఆవిరైపోయాయి. నడక మాట తీరు చూసి ఎగతాళి వేధింపులతో ఇంట్లో తిట్టడం కొట్టడం చివరికి ఇంటి నుంచి జంట ఎటు తో బతుకు బజార్ ఎక్కింది. అయినా హిజ్రాగా మారాలన్న బలమైన కోరిక అందుకోసం మొదట స్ట్రగుల్ ఫర్ ఎక్స్లెన్స్ పోరాటంలో ఎదురయ్యే అవమానాలు తట్టుకోలేక ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసి చివరికి ఇలా స్థిర పడాల్సి వచ్చింది ఎందుకు ఎవరికోసం అంటే ఎప్పుడు పెద్ద ప్రశ్నార్థకమే కనిపిస్తుంది”

“అక్కా! నువ్విలా? ఎలా?” అన్నాడు సురేష్.

‘హు…’ సుదీర్ఘ నిట్టూర్పు తర్వాత తన కథ చెప్పటం మొదలెట్టింది సుధక్క.

***

“మాది ఖమ్మం దగ్గర పల్లెటూరు. మధ్య తరగతి కుటుంబం. ఇద్దరు ఆడపిల్లల తర్వాత నేను. పుట్టానని.. మొదట్లో గారాబంగా చూసేవాళ్ళు అప్పుడు నా పేరు సుధాకర్. ‘మగ పిల్లాడి కోసం చూస్తుంటే… అటు, ఇటూ కాని ఆడంగి ఎదవ పుట్టాడు’ అని మా నాన్న నన్ను చూస్తేనే అసహ్యించుకునేవాడు. అక్కలు ఇద్దరు నాతో మాట్లాడే వాళ్లు కాదు. నన్ను ఆటల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకునేది. స్కూల్లో నా మాట, నడక చూసి గేలి చేసేవాళ్ళు.. ఏడిపించే వాళ్ళు. అక్కడ, ఇక్కడ పట్టుకుంటూ ఆట పట్టించేవాళ్ళు. ఎంత కంట్రోల్ చేసుకున్నా వయసు పెరుగుతున్న కొద్దీ నా నడకలో, మాటలో ఆడతనం కొట్టొచ్చినట్టు కనిపించేది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా సరిగా వచ్చేది కాదు. ఇంట్లో కుటుంబ సభ్యుల ముందుకు రావడానికి కూడా భయమేసేది. మా నాన్న కంట పడితే చాలు ఏదో ఒక కారణం చూపి కొట్టేవాడు. అమ్మ ఓదార్చడం చూసినా సహించేవాడు కాదు.

కొన్నాళ్ళకి ఇంట్లో ఆసరా కూడా కరువైంది. పెద్దక్కకి పెళ్లి సంబంధం కట్నం దగ్గర చెడిపోయింది. ఆ సంబంధం తీసుకొచ్చిన బంధువు ఒకాయన అందుకు నన్ను కారణంగా చూపి.. ‘ఇలాంటి ఆడంగి వెధవ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా అవుతాయి?’ అన్నాడు. ఆ తర్వాత ఇంటి పక్కల వాళ్ళు, బంధువులు పెళ్లికి, ఫంక్షన్లకి నన్ను తీసుకురావద్దని మొహం మీదే చెప్పే వాళ్ళు. పెద్దక్కకి మరో సంబంధం వచ్చి, అది కూడా క్యాన్సిల్ అయింది. అంతకు ముందు చెప్పిన బంధువు మా నాన్నకి మరోసారి హెచ్చరించాడు. అంతే! ఆ రాత్రి ఫుల్లుగా తాగి వచ్చాడు. కన్నకొడుకని చూడకుండా తన పశుబలంతో రెచ్చిపోయి నన్ను గొడ్డును బాదినట్టు బాది ‘నీవల్లే అక్కకి వచ్చిన సంబంధాలు చెడిపోతున్నాయి’ అని చెప్పి ‘నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లి, నీ చావు నువ్వు చావు’ అంటూ అర్ధరాత్రి తలుపు తీసి బయట గెంటేశాడు. అమ్మ ఆపాలని ప్రయత్నించగా..ఆమెనీ కొట్టాడు. ఆ చీకట్లో ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలో తెలియక చాలా సేపు గుమ్మంలో నిలబడి ఏడుస్తున్నాను. నేను చేసిన తప్పేంటో తెలీక దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూంటే… కాసేపటికి నాన్న వచ్చి నన్ను బజార్ కి ఇచ్చి లోపల తాళం వేసుకున్నాడు. కాళ్ళీడ్చుకుంటూ బస్టాండ్ కి వెళ్ళాను. బెంచీ మీద ఓ మూల కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని, ఏడుస్తూనే తెల్లవార్లు గడిపాను. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు. కానీ తెల్లారి లేచి చూసేసరికి ఎనిమిది దాటింది. ఒక్క క్షణం చుట్టూ పరిసరాలు కొత్తగా అనిపించాయి. నాకు ఎదురుగా కొంత చిల్లర పడుంది. అడుక్కునేవాడు అనుకొని ప్రయాణికులు ఎవరో చిల్లర విదలించిన డబ్బు అది.

‘తల్లిదండ్రులకి లేని జాలి, దయ ఎవరో తెలియని వాళ్ళు చూపినట్టున్నారు’ అనుకుని విరక్తిగా నవ్వుకున్నాను. ఆ రోజంతా వచ్చిపోయే జనాన్ని చూస్తూ గడిపాను. మధ్యాహ్నం లేచి ఇడ్లీ కొనుక్కొని తిని… మిగిలిన డబ్బులు జేబులో వేసుకుని హైదరాబాద్ బస్సు ఎక్కాను.

గమ్యం తెలియని ప్రయాణం మొదలైంది. జేబులో చిల్లిగవ్వ లేదు. ఏదో ఒక పని చేయ్యాలనుకుని… రోడ్డు మీద నడుస్తూ షాప్ దగ్గరికి వెళ్లి ‘ఏదైనా పని ఇవ్వండి..ఆకలేస్తోంది’ అన్నాను. అక్కడ పని ఇవ్వకపోగా.. నన్ను నా మాట చూసి, అవమానించి తిట్టాడు. ఆ తర్వాత ఇలాంటి అనుభవాల తోనే రెండు రోజులు ఆకలితో గడిచిపోయాయి. తిరిగి తిరిగి ఓ చిన్న హోటల్ లో కప్పులు కడిగే పని దొరికింది. మధ్యాహ్నం దాకా పని చేయించుకుని కాఫీ, టిఫిన్ ఇచ్చారు. అదే పంచభక్ష్య భోజనం అనిపించింది. అక్కడ నా మాట నడక చూసి కస్టమర్‌లు అలా చూస్తూ ఎగతాళి చేసేవారు. హోటల్లో పనిచేసే తోటి పనివాళ్ళు అదును దొరికినప్పుడల్లా నన్ను ఆడపిల్లలా భావించి నాతో సరసాలాడే వాళ్ళు. అది పగటితో సరి పెట్టక రాత్రిళ్లు నా మీద కాళ్లు, చేతులు వేయడం.. మర్మ భాగాలను స్పృశించడం వంటి వికృత చేష్టలు మొదలుపెట్టారు. ఎదురుతిరిగితే ఆ ఆసరా ఎక్కడ పోతుందోనని మౌనంగా ఉన్న కొద్దీ… వాళ్ల పైశాచిక చేష్టలు ఎక్కువ అయ్యాయి. ఓ రోజు ఓనరు గమనించి నన్ను బయటకి పంపేశాడు.

మళ్లీ బతుకు జట్కాబండి అయింది. ఆకలి కేకలు మొదలయ్యాయి. పని కోసం బిక్షాటన, అవమానాల తర్వాత ఓ సైకిల్ షాప్‌లో పని దొరికింది. రెండు నెలలపాటు ఏ అవాంతరాలు లేకుండా పని నేర్చుకున్నాను. ఓ రోజు నా మాట, నడక నిశితంగా గమనించిన ఓనరు యాదగిరి నన్ను ఒకలా… చూడటం.. కావాలనే నా ఛాతీ మీద, నడుము మీద చేతులు వేసి నొక్కడం.. దగ్గరికి తీసుకుని పెదాలపై ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. క్రమంగా అదతని దినచర్యగా మారింది.

ఓ రోజు షాప్ మూసేసాక వెళ్లబోతుంటే.. యాదగిరి నన్ను ఆపి.. డబ్బులు ఇచ్చి బిర్యానీ, మిక్చరు తెమ్మన్నాడు. షాపు కెళ్ళి వచ్చేసరికి యాదగిరితో పాట అతని స్నేహితుడు సంతోషు కూర్చొని మందు తాగుతున్నారు. యాదగిరి కొత్తగా కనిపించాడు. కళ్ళెర్రగా ఉన్నాయి. నన్ను తన ఒళ్ళోకి లాక్కుని కూర్చోబెట్టుకున్నాడు. పెనుగులాడినా వదలకుండా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. విస్కీ వాసనకి వాంతి వచ్చినట్లయింది. పెదాల మీద గట్టిగా కొరుకుతుంటే గాట్లు పడ్డాయి. వద్దని ఎంత వారించినా వినకుండా తాగిన మత్తులో.. నా బట్టలు ఊడదీసి, నన్నో ఆట బొమ్మలా.. ఒళ్లంతా పుళ్ళు పడేలా కొరకటం ప్రారంభించాడు. ఇద్దరూ కలిసి నన్ను రేప్ చేసినట్టుగా ఫీలవుతూ … మీదపడి ఏదేదో చేస్తుంటే…. బలవంతంగా వాళ్ల నుంచి తప్పించుకొని బయటపడ్డాను.

అక్కడి నుంచి తప్పించుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో సికింద్రాబాదు రైల్వేస్టేషన్ చేరుకుని ఓ బెంచీ మీద మూల కూర్చున్నాను. కళ్ళు మూస్తే ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో అని కూర్చున్నాను. తెల్లారింది. రైళ్ళ రాకపోకలు, ప్రయాణికులు హడావిడితో గందరగోళంగా ఉంది. దాహం వేస్తుంటే ప్లాట్ ఫాం చివరికి వెళ్లి నీళ్లు తాగుతున్నాను. అప్పుడే వచ్చిన రైలు దిగిన హిజ్రాలు కనిపించారు. అంతే వేగంగా వెళ్లి ‘అక్కా!’ అని పిలిచాను. వాళ్ళు ఆగారు. ఏడుస్తూనే ‘నేను మీ లాంటి వాడినే. నన్ను మీతో తీసుకెళ్లి, మీలో కలుపుకోండి’ అని కాళ్ళు పట్టుకున్నాను. ఏమనుకున్నారో ఏమో నన్ను వాళ్ళతో తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ మాటలు, తిట్లు, అడుక్కోవడం, చప్పట్లుకొట్టడం, మెడికలు విరవడం, దుస్తులు పైకిలేపడం, డ్యాన్స్ చెయ్యడం, సిగరెట్లు తాగడం,మద్యం తాగటం ఇవన్నీ అన్వయించుకోలేక పోయాను. అయినా నా వాళ్ళ మధ్య ఉన్నాననే భరోసా… క్రమంగా కొన్నింటికి అలవాటు పడ్డాను. ఆ తర్వాత కేరళకు చెందిన పద్మినితో పరిచయం అయింది. ఆమె చాలా నెమ్మదిగా ఉండేది. డిగ్రీ వరకు చదువుకుంది. ఆమె సహాయంతో ముంబై వెళ్లాను. అక్కడ గురువుని కలిశాను. ఆమెకి సేవలు చేశాను. ఆమె నన్ను చాలా బాగా నేర్చుకుని, నాకు ఆపరేషన్ చేయించింది. నా పేరును ‘సుధ’గా మార్చింది. అప్పట్నుంచి సుధక్కా అనేవాళ్ళు. ఆ తర్వాత పగలంతా భిక్షాటన, సెక్స్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇది కాదు జీవితం అనుకుని రాత్రి పూట చదువుకుని డిగ్రీ వరకు చదివాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. మనలా చదువుకున్న హిజ్రాల కోసం ఏర్పడ్డ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రాజెక్టులో ఉద్యోగంలో చేరాను.” అని చెప్పటం ముగించింది.

అంతా విన్న సురేష్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. సురేష్‌ని దగ్గర తీసుకొని ‘ నిన్ను పరిపూర్ణ స్త్రీగా మార్ర్చే ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు ఈ అవమానాలు, అగచాట్లు పడొద్దు. ఇంటర్ వరకూ చదువుకున్నావు. నువ్వు మళ్ళీ చదువుకో… మన వాళ్ళ కోసం ఇద్దరం కలిసి ఏదైనా చేద్దాం. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని కలుపుకొని ఏదైనా చేద్దాం” అంది సుధక్క.

“అలాగే అక్కా! కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. ముందు నన్ను ఈ మగచర నుండి తప్పించు” అన్నాడు.

“నువ్వు తెచ్చిన డబ్బు, బంగారం ఆపరేషన్లకే సరిపోతాయి. మరి తర్వాత ఏం చేస్తావు?”

“నువ్వు ఉన్నావుకదక్కా!” అన్నాడు ఆమె చేతులు పట్టుకొని.

అతడిలో ఆడ హార్మోన్లు అతడిని కుదురుగా ఉండనీయడం లేదని గ్రహించింది సుధక్క.

వారం తర్వాత సురేష్‌ని తీసుకుని ముంబై వచ్చింది సుధక్క. ఆమె గురువు ఉండే ఘట్కోపర్ వచ్చారిద్దరూ. అక్కడ పది రోజుల ఉండి, తనకు తెలిసిన వాళ్ళందరినీ పరిచయం చేసి, తెలిసిన ఆసుపత్రిలో సురేష్‌కి లింగమార్పిడి ఆపరేషన్, బ్రెస్ట్ ఆగ్మెంట్ సర్జరీ చేయించింది. ఇన్నేళ్లుగా శరీరంలో అలజడి సృష్టించిన పురుష సంకేతం పీడ శాశ్వతంగా తొలగిపోయింది. ఇప్పుడు తను స్త్రీ అనుకునే సరికి సురేష్ మనసులో నూతన ఉత్సాహం తొంగిచూసింది. హిజ్రా సాంప్రదాయాలు, నియమాలు, ఆచారాలు పూర్తి చేసుకున్నాక సుధక్కనే గురువుగా ఎంచుకుంది. సుధక్కే తన పేరును సుచిత్రగా మార్చింది. అక్కడి నుంచి చెన్నై వచ్చారు. అక్కడ తనకు పరిచయం ఉన్న హిజ్రాలందరిని పరిచయం చేసింది. విల్లుపురం జిల్లాలోని కూవగంలో ఉన్న కూత్తాండవర్ దేవాలయానికి తీసుకెళ్ళింది. అక్కడ హిజ్రాల పండుగలో పాల్గొన్నారు. తిరిగి వచ్చాక హిజ్రా సంఘ సెక్రటరీ కాంచనని పరిచయం చేసింది. సుచిత్రకి వచ్చిన ఇంటర్మీడియట్ మార్కులు చెప్పి, ఏదైనా పారామెడికల్ కోర్స్ చదువుకునే ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశారు. ఇంటర్లో సైన్స్ చదువుకుని మెడిసిన్ కోసం ప్రయత్నించిన సుచిత్రకి మంచి మార్కులు వచ్చాయి. అక్కడ ఒక ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రత్యేక కోటా కింద ఫార్మసీలో సీటు ఏర్పాటు చేసింది కాంచన. సుచిత్ర కాలేజీ హాస్టల్లో చేరాక సుధక్క ఖమ్మం వచ్చేసింది.

ఏ దుస్తుల్లో అయినా ఇట్టే ఒదిగిపోయి గల శరీర సౌష్టవం గల సుచిత్ర తనకు నచ్చిన దుస్తులు ధరిస్తూ అందంగా అలంకరించుకుని మనసుని నిర్మలంగా ఉంచుకోవటం అలవర్చుకుంది. తన అందంతో, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో కాలేజీ లేని సమయాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తన కాళ్ళమీద తాను నిలబడటం నేర్చుకుంది. అదే సమయంలో బయటకు వెళ్ళినప్పుడు భద్రత కోసం ఎల్లప్పుడూ హ్యాండ్ బ్యాగ్‌లో కారం పొడి, పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకునేది.

కాలేజీలో ఎన్నో కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు చవిచూసింది. హిజ్రా జీవితమంటే అడుక్కోవడం, చప్పట్లు కొట్టడం.. కాదని తామూ మనుషులమే అనీ… చిన్న చేయూత ఇస్తే చాలు అందరిలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భావనతోనే చదువు పూర్తిచేసింది. మగవారిగా పుట్టి హిజ్రాలుగా మారి చరిత్ర సృష్టించిన గజల్ ధలీవాల్ (స్క్రీన్ రైటర్), ప్రీతిక యషిని (ఎస్.ఐ), తొలి గౌరవ డాక్టరేట్ అందుకుని చరిత్ర సృష్టించిన నర్తకి నటరాజ్, నవలా రచయిత్రి ఏ రేవతి, సంఘసేవిక, నటి, రచయిత్రి, వ్యాపారవేత్త, కల్కి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళతో పరిచయం పెంచుకుంది. వాళ్ళను స్పూర్తిగా తీసుకుని జీవితాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకుంది. హిజ్రాలుగా మారాలనుకునే వాళ్లకి కష్టాలు ఎదురవకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుని చేతిలో ఉన్న ఫార్మసీ డిగ్రీ పుచ్చుకొని హైదరాబాద్ వచ్చింది సుచిత్ర.

కార్పోరేట్ ఆసుపత్రిలో ఆమె అర్హత, అందానికి, కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ఉద్యోగం దొరికింది. రెండేళ్లు ఉద్యోగం చేశాక ఆర్థికంగా నిలదొక్కుకుని, స్వచ్ఛంద సంస్థలతో పరిచయం పెంచుకుంది. తనలాంటి భావాలే ఉన్న సహా హిజ్రాలను కలుపుకొని విరాళాలు వసూలు చేసింది.

మార్చి 31న ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్‌జెండర్స్ ఆఫ్ డే ఆఫ్ విజిబిలిటీ’ రోజున ‘హిజ్రా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఫర్ జస్ట్ రిహాబిలిటేషన్ అసోసియేషన్’ (HIJRA) సంస్ధను చర్లపల్లి సమీపంలో మొదలు పెట్టింది. అందులో హిజ్రా హక్కులు, చదువు, స్కాలర్షిప్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.. వంటివి ఏర్పాటు చేస్తారు. కొత్తగా హిజ్రాలుగా మారేవారికి లింగమార్పిడి ఆపరేషన్ ఉచితంగా చేస్తారు. కౌన్సిలింగ్, ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా కొత్తగా వెబ్సైట్ ప్రారంభించి దాని ద్వారా హిజ్రాలకు సేల్స్ గాళ్స్‍గా, సర్వెంట్స్‌గా, ఆయాలుగా ఉద్యోగాలు ఏర్పటు, ఆసక్తి ఉన్న హిజ్రాలతో స్టార్టప్ కంపెనీలుగా ఫ్యాన్సీ షాపులు, బ్లడ్ కలెక్షన్ సెంటర్లు, ఫిజియోథెరపీ క్లినిక్లు…. ఇలా ఎన్నో నిర్వహిస్తారు. చీకటి నిండిన హిజ్రాల జీవితాల్లో కొత్త తరపు వెలుగులు నింపుతూ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో తర్ఫీదు ఇస్తూ, ఎందరికో ప్రేరణ కల్పిస్తోంది హిజ్రా సంస్థ.

సుచిత్ర అహర్నిశలు ఆ సంస్థ ఎదుగుదలకు పాటుపడుతూ క్షణం తీరిక లేకుండా జీవితాన్ని బిజీగా మార్చుకుంది.

“దేహానికి తప్ప, దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే.. ఎగిసి పడుతుంటే, ‘నువ్వు’ తలచుకుంటే.. నీ తలరాత ఇంతే అన్న వాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది” అన్న శ్రీశ్రీ కవిత హిజ్రా సంస్ధలో ప్రబోధాత్మక గీతంగా మార్చింది సుచిత్ర.

ప్రస్తుతం కరోనా కష్టకాలంలో సొంత ఊళ్లకు పరిగెడుతున్న వలస కూలీలకు, ఆర్తులకు ఆకలి, దాహం తీరుస్తూ ‘మేము సైతం’ అంటూ మానవత్వాన్ని, మనిషితనాన్ని చాటుకుంటోంది హిజ్రా సంస్థ.

Exit mobile version