[దివ్య తాను వివేక్‍తో మాట్లాడానన్న విషయతం తన తాతయ్యకి చెబుతుంది. తను రాజమండ్రి వస్తానంటే, వివేక్ వద్దన్నాడని చెబుతుంది. వివేక్ తన మనసులోని మాటని చెప్పాడని అంటుంది. సంతోషించిన తాతయ్య, దివ్య తల్లిదండ్రులను గుర్తు చేసుకుని వాళ్ళు యాక్సిడెంట్‍లో చనిపోయారని చెప్పి, వాళ్ళకి నివాళిగా దివ్యని డాక్టర్ చదివించానని అంటారు. డిశ్చార్జ్ అయిన నారాయణరావు ఇంటికి వస్తాడు. ఊరుఊరంతా ఆయనని చూడడానికి వస్తారు. ఎంతోమందికి దేవుడిలాంటి తన తండ్రికి మనోధైర్యం కల్పించాలని అనుకుంటుంది అమృత. కానీ వివేక్‍తో పెళ్ళి తనకి ఇష్టం లేదని చెప్పలేకపోతుంది. తాను నీల్ అనే ఫేస్‍బుక్ ఫ్రెండ్‍ని ప్రేమించిన సంగతి తలచి, ఆ విషయం అతడితో చెప్పలేకపోయినందుకు బాధపడుతుంది. అమృత దిగులుతో ఏమీ తినడం లేదని, తాగడం లేదని, నీరసించిపోయిందని సుమిత్ర వివేక్‍తో అంటుంది. అన్నయ్య ఇప్పటికే డీలా పడిపోయాడు, ఇలాంటి విషయాలు గట్టిగా అనద్దని అంటుంది శారద. ఆ మాటలు విన్న అమృత మరింత క్రుంగిపోతుంది. నాన్నే ముఖ్యమని అనుకుంటుంది. వివేక్ కూడా అమెరికా గురించిన ఆలోచనల్లో పడతాడు. ఏం చేస్తే తండ్రికి తమ విషయం అర్థమవుతుందోని వివేక్ దగ్గర వాపోతుంది అమృత. ఇంతలో అమృత, వివేక్‍ల గురించి అడుగుతాడు నారాయణరావు. వాళ్ళిద్దరూ బయట మాట్లాడుకుంటున్నారని అంటుంది సుమిత్ర. – ఇక చదవండి.]
[dropcap]అ[/dropcap]ర్థం అయిన వాడిలా నవ్వి “సుమిత్రా!.. నేను చాలా అదృష్టవంతుడిని.. నా కళ్లతో వాళ్ళని ఒక్కటిగా చూడాలనుకున్నాను.. చూస్తున్నాను.. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి.. ఏం లేదు.. కొంచెం ఈ రోజు తేలికగా ఉంది. ఇంటి బరువు బాధ్యతలు.. ఆస్తులు వివరాలు అన్నీ నెమ్మదిగా.. వివేక్ బాబుకి చెప్పాలని” అని నారాయణరావు అన్నంతలో ఏడుపు గొంతుతో..
“మీకేం కాదు.. కొద్ది రోజుల్లో మీరు మామూలవుతారు..” అంది సుమిత్ర.
అప్పుడే వీల్ చైర్‌తో వచ్చిన రమణ.. “బావా! ఇంకెప్పుడూ ఇలాంటి మాటలనవద్దు.. నీకేం కాదు బావా!.. మనిషి మనిషే!.. దేవుడు దేవుడే!.. దేవుడు లాంటి నీకు.. ఏం జరుగదు బావా!” అని రమణ అనగానే కళ్లతో దగ్గరకు రమ్మన్నాడు అభిమానంగా నారాయణరావు.
“బావా!..” అని వీల్ చైర్ తోసుకుంటూ దగ్గరకు వెళ్లాడు..
“బావా!.. వివేక్ చిన్నోడు.. ఈ ఇల్లు సంతోషంగా, ఎప్పటిలా ఉండాలంటే ఈ ఇంటి బాధ్యత నువ్వు కూడ తీసుకోవాలి” అన్నాడు నారాయణరావు..
“బావా!..” అన్నాడు కంగారుగా రమణ.
“ఇంకెప్పుడు ఇలాంటి మాటలనకు.. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా.. వెలుగివ్వలేవు.. ఒక్క చందమామకే సాధ్యం.. నీ తరువాతే మేమందరం..”
అప్పటికే గుమ్మం వరకు వచ్చిన అమృత, వివేక్ వాళ్ల మాటలు విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
ఏం మాట్లాడాలో తెలియని వాడిలా మౌనం వహించాడు వివేక్!..
“నాకు ఒకటి మాత్రం పూర్తిగా అర్థం అయింది మామూ” అంది.
“పూర్తిగా అర్థం అయిందా? ఏ విషయం?”
“మన విషయం” అంది.
కంగారుగా అన్నాడు.
“మన విషయం.. అంటే”
“అదే.. దేనికైనా.. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కాని.. మన సమస్యకి పరిష్కారం మాత్రం లేదు.. కాదు.. ఉండదు..”
“అమ్మూ!.. అలా ఎలా అనుకుంటావు?.. పాజిటివ్‌గా ఆలోచిద్దాం!.. లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం.. మామయ్య గాని మన విషయం గ్రహించాడంటే ఖచ్చితంగా upset అవుతాడు.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు.. క్యాన్సర్ అన్న విషయం ప్రక్కన పెట్టాడు..” అన్నాడు వివేక్
“ఊబిలో కూరుకుపోతున్నవాడు కూడా బ్రతకాలని ఊబిలో నుండి బయటకు రావడానికి తన ప్రయత్నం చివరి దాక చేస్తాడు..”
“మావయ్య ఆరోగ్యం కుదుటపడి, మన పరిస్థితి అర్థం చేసుకుంటాడు ఏమో? అలా ఎందుకు ఆలోచించవు?” అన్నాడు.
చిన్నగా నవ్వింది.. “లేదు మామూ! నీకు అర్థం కావడం లేదు.. నాన్నమ్మ అనేది.. పాకం ముదిరింది అని.. మన సమస్య.. ప్రాబ్లమ్ ఇంకా.. ఇంకా జటిలం అవుతుంది కాని Solve అవ్వదు.”
“O.K.. నాన్న అనుకున్నట్టే జరగనీ.. నాకు కావలసింది నాన్న ఆరోగ్యం కుదుటపడాలి. మన కళ్లెదుట ఉండాలి!.. నాన్న కోసం నేనెమైనా చేస్తాను” అని రయ్ మని అక్కడ నుండి వెళ్లిపోయింది.
‘నువ్వు కాదు అమ్మూ!.. మావయ్య కోసం నేనేమైనా చేస్తాను.. నా జీవితం ఏవైంపోతునా పరవాలేదు.. మావయ్య బాగుండాలి’ అనుకున్నాడు మనసులో వివేక్.
***
మంచం మీద పడుకున్నాడు కాని నిద్రపట్టలేదు. ఏం చేయలో తెలియక మంచం మీద అటు ఇటు దొర్లసాగాడు.. గభాలున సెల్ తీసి టైమ్ చూసాడు. అర్ధరాత్రి రెండు గంటలు.. ఏదో గుర్తు వచ్చిన వాడిలా.. మళ్ళీ సెల్ తీసి చూసాడు… దివ్య online లో ఉంది.. ఒకసారి మాటాడితే మనసులో భారం తగ్గుతుంది ఏమో?..
అదేలా?.. తన మనసులో భారం తగ్గించుకోవాడానికి.. దివ్య మనసులో భారం పెంచాలా?
తను దివ్యని లైక్ చేసాడు.. ఇష్టపడ్డాడు.. తన నుండి దూరం అయ్యి.. ఇండియాకి వచ్చినాక గాని దివ్య తనకి దూరం అయినందుకు తను బాధపడుతున్నాడని, తనని మిస్సవుతున్నాడని తెలియలేదు. దివ్య తనని ఎంతో లైక్ చేస్తుందని తెలిసాక చాలా happy feel అయ్యాడు.. ఇదంతా ప్రేమే అని తెలిసింది..
కాని తను దివ్యని ప్రేమించిన దానికి పది రెట్లు ఎక్కు దివ్య తనని ప్రేమిస్తుంది.
‘అలాంటి దివ్యతో – తనకు జరిగిన నిశ్చితార్థం గురించి ఎలా చెప్పగలడు? చెబితే దివ్య భరించగలదా?’ ఆలోచనలతో సతమతమవ్వసాగాడు వివేక్.
సెల్ రింగ్ కావడంతో గభాలున తీసి షాకయ్యాడు.
“ఏంటి దివ్యా!.. మిడ్ నైట్ ఫోన్ చేసావు?” అన్నాడు.
“వివేక్!.. మరిచిపోయావా? నీకు మిడ్ నైట్.. నాకు day” అంది.
“అవును కదూ? ఒకే.. ఒకే.. ఎలా ఉన్నావు?” అన్నాడు.
మాటాడకపోవడం చూసి “దివ్యా!..” అన్నాడు కంగారుగా.
“దివ్యా!.. ఎనీ ప్రోబ్లమ్” అన్నాడు.
“ఊ..! ప్రోబ్లమ్ అంటే పెద్ద ప్రోబ్లమే!”
“చెప్పు దివ్వా!..” కంగారుగా అన్నాడు.
“ఏం చెప్పను వివేక్!.. ప్రేమంటే.. మాటల్లో చెప్పలేని ఫీలింగ్.. మధురానుభూతి.. ఇలా ఎవేవో విన్నాను.. చదివు కాని personal గా ఫేస్ చేస్తున్నాను..”
“నేను విన్నది, చదివినది నిజం వివేక్!..”
“నువ్వు నాకు దూరం అయిన దగ్గర నుండి నేను నేనులా లేను. నేను నిన్ను చాలా మిస్సవుతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు కన్నా ఎక్కువ గుర్తు వస్తున్నావు. ఏం చేయను చెప్పు? మరి ఇది పెద్ద ప్రోబ్లమే కదా” అంది నవ్వుతూ..
కంగారుగా “ఆ.. ఆ..” అన్నాడు.
“వివేక్ మాటాడు.. నీకు ప్రాబ్లమ్ లేదా?”
“వివేక్!.. I miss you!..” అంది దివ్య..
“దివ్య!..” అని వివేక్ అన్నంతలో “నా గురించి నువ్వే మనుకుంటున్నావో చెప్పానా వివేక్?”
“దివ్యకి అసలు సిగ్గు లేదు.. దర్జాగా మనసులో మాట చెప్పేస్తుంది అని అనుకుంటున్నావు కదూ? చెప్పకపోతే ఎలాగు చెప్పు? నా మనసంతా నువ్వే నిండిపోయి ఉన్నావని నీకు తెలియాలి కదా?.. నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడ ముందుకి వేయలేను. ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది.. వీడియో కాల్ చేస్తావా?.. వివేక్!.. సారీ!.. నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? ఏం చేయను?.. ప్రేమ నన్ను పిచ్చిదాన్ని చేసింది..” చివరి మాటలంటున్నప్పుడు గొంత జీరబోయింది.
“దివ్యా!..” కంగారుగా అని.. “నేను త్వరలో రావడానికి ప్రయత్నిస్తున్నాను.. నీతో చాలా చాలా మాట్లాడాలి.. అన్నట్లు పిచ్చివాడిలా ఉన్నాను.. తరువాత వీడియో కాల్ చేస్తాను.. ప్లీజ్” అన్నాడు..
నవ్వుతూ అంది దివ్య..
“నువ్వు పిచ్చివాడిలా ఉన్నా నా కళ్లకి మహారాజులాగే కనబడతావు.. సారీ! సారీ!..”
“కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లంది నా పరిస్థితి.. మరి నేను ఉంటాను” అని ఫోను పెట్టేసింది దివ్య..
తన గుండెలో భారం దివ్యతో చెప్పి దించుకోవాలనుకున్నాడు.. కాని దివ్య తన మీద ఏర్పరుచుకున్న ప్రేమని చూసాక.. తన గుండె ఇంకా బరువెక్కువయిపోయింది.
నిశ్చితార్థం అయింది. తరువాత పరిస్థితుల బట్టి పెళ్లి కూడ.. ఆలోచన రావడం ఇష్టం లేని వాడిలా గభాలున మంచం మీద నుండి లేచి హాలులోకి నడిచి మౌనంగా సోఫాలో కూర్చున్నాడు..
గభాలున వచ్చి సోఫాలో కూర్చున్న వివేక్ వైపు చూసింది అప్పటికే అక్కడ ఉన్న అమృత..
వివేక్ ఏం ఆలోచిస్తున్నాడో టపీమని చెప్పయగలదు.. పాపం వీ.వి.. నాన్న చేసిన నిశ్చితార్థంకి పెదవి విప్పలేక చాలా suffer అవుతున్నాడు అనుకుంది. ఏదో ఆలోచన వచ్చిన దానిలా “మామూ! నీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదూ?.. ఆహాలో భీమ్లా నాయక్ వస్తుంది. నిద్ర వచ్చే వరకు చూడు” అని గభాలున టి.వి ఆన్ చేసింది.
“ఆ.. ఆ.. చూస్తాను” అన్నాడు కంగారుగా.. తను పెళ్లి విషయంలో ఫీల్ అవుతున్నానన్నది తెలియడం ఇష్టం లేనట్లు “అమ్మూ! .. నువ్వు కూడ చూడు” అన్నాడు.
“ఇప్పటికి రెండు సార్లు చూసాను..” అంది.
ఇద్దరు కూర్చొని చూస్తున్నారే కాని.. వాళ్ళిద్దరి దృష్టి సినిమా మీద లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్లు జారుకున్నారు.
***
“ఇప్పుడెందుకు వివేక్ బాబూ? నన్ను వీల్ చైర్‌లో గార్డెన్ లోకి తీసుకువెళ్ళాడం అవసరం అంటావా? ఇప్పుడు నేను నిశ్చింతగా ఉన్నాను.. వద్దులే వివేక్ బాబూ!” అని అన్నాడు నారాయణరావు.
“లేదు మామయ్యా!.. అలా మంచం మీద ఉండకూడదు.. మీరు normal life కి రావాలి” అన్నాడు.
చిన్నగా నవ్వాడు.. “normal life.. వివేక్ బాబూ నా గురించి అందరూ ఆలోచించడం మానేయండి.. నేను నా గురించి ఆలోచించడం మానేసాను.. అన్నట్టు సడన్‍గా నాకు అలా జరిగిందని వచ్చేసావు.. కొద్ది రోజులు ఉండడానికి కుదురుతుందా? అమృతకి, నీకు పెళ్లి చేసి నీతో పంపించేస్తాను.. ఏమంటావు” అన్నాడు.
కంగారుగా అన్నాడు..
“మావయ్యా!.. ఇప్పడా పెళ్లి? నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండవలసి వస్తుందని అనుకోలేదు.. one week అని చెప్పాను.. మా డీన్‌కి వచ్చేస్తున్నాని నిన్ననే మెయిల్ పెట్టాను. ఇన్నేళ్ల నుండి జరుగుతున్న రీసెర్చ్‌కి ముగింపు దగ్గరలో ఉంది మావయ్యా.. అంటే.. థీసెస్ సబ్మిట్ చేయాలి.. క్షమించు మావయ్యా.. నీ మాట కాదంటున్నందుకు” అన్నాడు.
వివేక్ మాటలు విని షాక్ అయింది అమృత.. ‘..తనతో ఒక్క మాట… USA వెళుతున్నాను అని చెప్పలేదు.. వీ.వి బాగా disturb అయ్యాడు’ అని మనసులో అనుకుంది అమృత..
“వీవేక్ బాబూ!.. నిన్ను నేను అపార్థం చేసుకుంటానా? నువ్వు వెళ్లి వీలయినంత త్వరగా work ముగించుకొని ఇండియా వచ్చేయ్!.. ఎప్పుడు వస్తావో చెబితే చాలు.. పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసి.. పెళ్లి పనులు మొదలు పెట్టి వచ్చు” అన్నాడు నారాయణరావు.
కంగారుగా అమృత వైపు చూసాడు.
అమృత కళ్లల్లో కంగారు చూసి, వివేక్ కళ్లతోనే వారించి అన్నాడు.
“మావయ్యా! నేను చేస్తుంది రిసెర్చ్ కదా? నేను సబ్మిట్ చేసే థీసెస్ వాళ్లకు నచ్చాలి.. చాలా.. చాలా.. steps ఉంటాయి.. వాళ్లు approve చేయాలి. నేను అక్కడికి వెళ్లాక.. చెబుతాను మావయ్యా! ..” అన్నాడు.
“నాన్నా!.. ప్లీజ్ నాన్నా.. పాపం వీ.వి.ని చాలా ఇబ్బంది పెడుతున్నావు.. మామూని చూస్తుంటే జాలి వేస్తుంది. పెళ్లికి తొందర ఏముంది??” అంది అమృత.
అంతా వింటున్న సుమిత్ర, శారద ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు..
“ఏమండీ.. మీరు.. మరిచిపోతున్నట్లున్నారు.. ఇప్పుడు వివేక్ బాబు అమృతకి కాబోయే భర్త.. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే అమృత ఊరుకోదు..” అంది సుమిత్ర.
వివేక్, అమృత.. సుమిత్ర మాటలకి షాక్ అయ్యారు..
ఎవరికి వారే పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో ఉన్నారు.
వీళ్లందరికి పెళ్లి ఇద్దరికి ఇష్టం లేదు అని, అసలు ఆ ఆలోచన మా ఇద్దరికి లేదు అని ఎలా చెప్పగలరు? అని అమృత మనసులో అనుకుంటూ ఉండగానే ధనంజయరావు రావడం.. దూరం నుండే చూసి.. “రా! ధనూ!.. రా” అని సంతోషంగా అన్నాడు నారాయణరావు.
“ఎలా ఉన్నావురా?..” అని గబగబా అడుగులు వేసి నారాయణరావు దగ్గరకు వచ్చి అప్యాయంగా చెయ్యి పట్టుకొని అభిమానంగా చెయ్యి మీద ముద్దు పెట్టుకున్నాడు ధనంజయరావు.
“ఛ! ఛ!.. తప్పడిగానురా! నీకేం బ్రహ్మండంగా ఉన్నావు, ఉంటావు.. నీ అల్లుడు లాంటి వాడు పక్కన ఉంటే ఎవరైనా బాగుంటారు.. ఒరేయ్!.. నీకు దిష్టి తగిందిరా! అందుకే ఏదో సుస్తి చేసింది.. మనుషులు పొరపాటులు చేస్తూనే ఉంటారు.. భగవంతుడు కూడ అప్పడప్పుడు పొరపాటు చేస్తుంటాడని నీ విషయంలో తెలిసింది..” అని ధనుంజయరావు అంటుండగానే.. నవ్వుతూ అన్నాడు నారాయణరావు.
“సరే లేరా!.. నా మీద అభిమానంతో ఏమైనా అంటావు” అని.
అందరూ గార్డెన్‌లోకూర్చోడానికి వెళ్లారు..
“ఏంటిరా సంగతులు?..” అన్నాడు నారాయణరావు.
“జీవితంలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు అని, అన్నీ ఉన్న మనిషి అనుకోవడం చాలా పొరపాటు అని తెలిసిందిరా”
“ఒకొక్కసారి అంచనాలు తారుమారు అవుతుంటాయి. ఆస్తి అంతస్తు కాదు ముఖ్యం. స్వంయకృషితో పైకి వచ్చాడు నా అల్లుడు. నేను ఇచ్చే ఆస్తి చాలు, వాళ్లిద్దరూ happy గా ఉండడానికి అనుకున్నాను. కాని ఆ దౌర్భాగ్యుడు కళ్లు నా ఆస్తి మీద పడ్డాయని, వాడికి లేని అలవాటంటూ లేదని ఆలస్యంగా తెలిసింది” అన్నాడు ధనుంజరావు.
“ఏంటిరా నువ్వు అంటున్నది? ఏరి కోరి మరీ ప్రకాష్‍ని అల్లుడిగా చేసుకున్నావు కదరా? కష్టపడి పైకి వచ్చాడని, అలాంటి వాళ్లకి జీవితం విలువ తెలుస్తుందన్నావు?.. అన్నట్లు మీ అక్క.. వరలక్ష్మి తన కొడుకుని అల్లుడిగా చేసుకోమని నిన్ను చాలా ఇబ్బంది పెట్టిందన్నావు.. నీ మేనల్లుడు ప్రసాద్ చాలా బుద్ధిమంతుడు.. నువ్వు పొరపాటు చేసావు ఏమో అనిపిస్తుందిరా..” అన్నాడు నారాయణరావు.
“మనకి దూరపు కొండలు నునుపుగా అనిపిస్తాయి.. మనకి తెలియకుండానే పొరపాట్లు చేస్తుంటాం.. ఆ పొరపాటుని మనం విధి వ్రాత అనుకోవాలి..”
“జరగిన దాని గురించి బాధపడుతూ విచారిస్తూ కూర్చుంటే భవిష్యత్తు సంగతి ఏమిటి? ధనూ!.. తొందరపడకు.. నాకు కొంచెం ఆరోగ్యం.. బాగుపడనీ.. అదే కనీసం కాసేపు కూర్చోని మాట్లాడే శక్తిని రానీయ్.. నీ అల్లుడితో మాట్లాడుతాను.. నేను మాట్లాడేసానని నీ అల్లుడు మంచోడయిపోతానని కాదు..
మనిషి ఎప్పుడూ ఒకే రకంగా ఉండడు.. ఎంతో బుద్ధిమంతుడు, భార్యా పిల్లలతోనే జీవితం అనుకొని బ్రతుకుతున్న వ్యక్తి సడన్‍గా.. పెళ్లాం పిల్లలను, బంధాలను వదులుకొని, ఎందుకు పనికిరాని విలువలేని ఓ ఆడదాని వ్యామోహంలో పడొచ్చు.. కాబట్టి నీ అల్లుడు ఎప్పుడూ దుర్మార్గుడిలానే ఉంటాడనుకోకు.. మన ప్రయత్నం మనం చేద్దాం ధనూ!.. నువ్వేం వర్రీ కాకు..” అన్నాడు నారాయణరావు.
గభాలున నారాయణరావు దగ్గరకు వెళ్లి వంగి ఆప్యాయంగా నారాయణరావుని హగ్ చేసుకొని.. “నువ్వు.. నువ్వు చాలా గొప్ప వ్యక్తివిరా.. నీ మనసు చాలా గొప్పది.. నీ దగ్గరకు వస్తే మనసు తేలికపడుతుంది, సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియకపోయినా.. మనసు మాత్రం తేలికపడుతుంది, నువ్వు మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు.. నీ మేనల్లుడే అల్లుడు కావడం, నాకు చాలా సంతోషంగా ఉంది.” అన్నాడు.
“ఏ తండ్రైనా.. తన పిల్లలలో.. ఆడపిల్ల గురించే ఎక్కవ వర్రీ అవుతాడు.. కారణం.. ఆడపిల్లని ముక్కు ముఖం తెలియని వాడికిచ్చి పెళ్లి చేయాలి!.. చేసినాక తన కూతురిని గుండెల్లో పెట్టి చూసుకుంటాడో లేదా గుండె పగిలేలా బాధలు పెడతాడా అన్న భయంతో ఉంటాడా ఆడపిల్ల తండ్రి.. నీకా భయం అక్కరలేదురా” అన్నాడు ధవుంజయరావు..
కంగారుని, భయాన్ని బాధను మనసులో దాచుకొని, చిన్నగా కళ్ళెత్తి వివేక్ వైపు చూసింది అమృత.
ఏం సమాధానం చెప్పాలో తెలియని వాడిలా ఇబ్బందిగా చూసాడు వివేక్.
(సశేషం)