[అమృత, వివేక్ అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతారు. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఫ్లయిట్ టైమ్ అయిపోతుందని సుమిత్ర హెచ్చరిస్తుంది. నాన్నతో రోజూ మాట్లాడకుండా తాము ఉండలేమని అమృత అంటుంది. మాటల మధ్యలో ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా మావయ్య కోసం వివేక్ చేసుకుంటున్నాడని అంటుంది. నారాయణరావు కంగారు పడతాడు. అప్పుడు కంగారు పడవద్దని, అమృత పూర్తిగా చెప్పలేదని అంటూ – అసలు తాను డాక్టరేట్ వచ్చాకా పెళ్ళి చేసుకోవాలనుకున్నానని ఇప్పుడు కాదని అంటాడు. అందరూ అమ్మయ్య అనుకుంటారు. ఫ్లయిట్ ఎక్కాక, అక్కడ వివేక్‍ని ఇంకో పెళ్ళి చేసుకోమంటుంది అమృత. ఆమె తండ్రి, తన మావయ్య పట్ల తనకీ బాధ్యత ఉందని అంటాడు వివేక్. అక్కడ అమెరికాలో సునీల్ డల్‍గా ఉండడం చూసి పార్టీ ఇస్తానంటుంది దివ్య. నీల్ ప్రేమ విజయవంతమవుతుందని అందరూ చెప్తారు. అయితే తను ఇష్టపడిన అమ్మాయి ఫేస్ బుక్ ప్రొఫైల్ డిలీట్ చేసిందని, ఇక తిరిగి ఫేస్‍బుక్‍లోకి రాదని అంటాడు నీల్. అప్పుడు తన ప్రేమ గురించి చెప్పి, సునీల్‍కి ధైర్యం చెబుతుంది దివ్య. అందరూ ట్రీట్‍కి వెళ్తారు. ఇంటికి వచ్చిన దివ్య వివేక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి తనతో మాట్లాడితే బాగుండు అనుకుంటుంది. ఫోన్ చేస్తుంది. ఇప్పుడే ఇంటికి వచ్చామని చెప్తాడు వివేక్. చెప్పకుండా అమెరికాకి వచ్చేసినందుకు ఆశ్చర్యపోతుంది దివ్య. తమ మావయ్య పరిస్థితి, తనతో పాటు అమృతని తీసుకువచ్చిన సంగతి, తమకు ఎదురైన పరిస్థితుల గురించి చెప్తాడామెకు వివేక్. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది దివ్య. – ఇక చదవండి.]
[dropcap]‘ఏం[/dropcap]టి వివేక్ చెప్పినది విన్నాక కూడ తను ఇంకా బ్రతికే ఉందా?.. ప్చ్!..’
కళ్ళల్లో కన్నీళ్ళు కూడ ఆగిపోయాయి.. కాని గుండెలో భరించలేని బాధ.. ‘ఆగిపోదు కదా? ఆగిపోని!.. వివేక్ లేకుండా తను బ్రతుకలేదు..’ అని గట్టిగా కళ్ళు మూసుకుంది.. గభాలున లేచి కప్‌బోర్డులోంచి బట్టలు సర్దుకొని సెల్‍లో ఫైయిట్ ఎన్ని గంటలకుందో చూసుకొని.. లెటరు వ్రాసి డా. రంగారావు గదిలో టీపాయి మీద పెట్టి ఉబర్‍లో ఎయిర్‍పోర్టుకి బయలుదేరింది దివ్య..
కళ్ళ నుండి ఏకధాటిగా కన్నీళ్ళు కారసాగాయి..
‘ప్చ్!.. తను ఎంత ఏడ్చినా.. కన్నీళ్ళు కాలువలా ప్రవహించినా, చివరికి గుండె ఆగిపోయినా వివేక్ తన వాడు కాడు.’
‘వివేక్!.. నువ్వు కావాలని అమృతని పెళ్ళి చేసుకోవడంలేదని తెలుసు.. కాని పరిస్థితులు నిన్ను.. అమృతని పెళ్లి చేసుకొనేలా చేస్తున్నాయని తెలుసు.. అమృతని సొంత చెల్లెలుకన్నా.. ఎక్కువగా చూసుకున్నావని తెలుసు.. నీ చేతులతో పెంచి పెద్ద చేసావని తెలుసు కాని.. ఇన్ని తెలిసినా.. నువ్వు నా వాడివి కాదన్న ఒక్క నిజం తెలిసినాక.. నాకు బ్రతకాలనిపించడం లేదు. ఎదురుగుండా నిన్ను చూస్తూ నేను వర్క్ చేయలేను.. నిజం చెప్పాలంటే.. నేను నిన్ను.. చూస్తూ ఏమవుతానో.. అన్న భయంతో దూరంగా వెళ్ళిపోతున్నాను. I am sorry వివేక్!..’ అని మనసులో అనుకొని ఫైయిట్ ఎక్కింది దివ్య..
***
ఎంతకీ దివ్య గదిలో నుండి రాకపోవడంతో “దివ్యా!.. ఏం చేస్తున్నావు మై డియర్” అంటూ దివ్య గదిలోకి డా. రంగారావు వెళ్ళి, అక్కడ ఆమె లేకపోవడంతో, ‘కాఫీ తాగుతూ గార్డెన్‍లో తిరుగుతుంది.. రానీ!..’ అని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. దివ్య గురించి ఆలోచించసాగాడు.
దివ్య ఇంత వరకు.. తనని ఏ కోరిక కోరలేదు.. తల్లిదండ్రులను కోల్పోయినాక కూడ ఏ విషయంలోను తనని అల్లరి పెట్టలేదు.. చాలా డీసెంట్‍గా ఉంటుంది. అప్పుడప్పుడు తనకే బాధ అనిపించి, పరిస్థితులను అర్థం చేసుకొని.. అలా బిహేవ్ చేస్తుందా? అందరి పిల్లలా దేనికి పేచీ పెట్టదు ఎందుకు? అని ‘నీకేం కావాలో చెప్పు తల్లి? ఏది అడగపోతే ఎలాగు’ అనేవాడు..
వెంటనే గభాలున దగ్గరకు వచ్చి తనని హగ్ చేసుకొని ‘నాకు నువ్వు కావాలి తాతయ్య, ఇంకేం అక్కరలేదు’ అనేది..
ఆ మాటలు వినే కాబోలు.. తనకి రెట్టింపు శక్తి వచ్చి ఆరోగ్యంగా ఉండేవాడు..
సంతోషం సగం బలం అంటారు కదా?
క్రమేపి కొడుకు కోడలిని మరిచిపోయి, అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా? దివ్య తోటిదే లోకంలా తయారయ్యాడు..
దివ్యకి సంబంధాలు చూస్తూ అబ్బాయిల ఫోటోలు దివ్యకి ఇవ్వబోయాడు..
అప్పుడు ఎంతో సంశయిస్తూ తన మనసులో మాట చెప్పింది.
“వివేక్.. నాతో పి.హెచ్.డి చేస్తున్నాడు.. నీ తరువాత నేను comfort గా ఫీల్ అయ్యేది, లైక్ చేసేది.. లవ్ చేసేది అతననే!.. I love him so much. నాకు.. అతనితో.. మ్యారేజ్‍కి ఒకే అంటావు కదూ?” అంది.
ఒక్క నిమిషం కంగారు పడ్డాడు..
“దివ్యా!.. నువ్వు అతన్ని ఇష్టపడ్డావు సరే!.. ఇన్నాళ్ళ బట్టి వివేక్ మన ఇంటికి రావడం కాని, నువ్వు అతను కలిసి తిరగడం కాని, చాటింగ్ చేయడం కాని ఇప్పటి వరకు చూడలేదు.. నువ్వు ఇష్టపడుతున్నావు సరే!.. అతను.. వివేక్ కూడా నిన్ను లైక్ చేయాలి!.. అప్పుడే కదా.. ఇద్దరు కలిసి తిరగడాలు, మాట్లాడుకోడాలు ఉంటాయి.. వివేక్ అభిప్రాయం తెలుసుకున్నావా? లేకపోతే నువ్వు చాలా బాధపడుతావు మైడియర్.. మొదటి సారిగా ఒకే ఒక్క కోరిక కోరావు.. నేను ఎలా కాదంటాను అనుకున్నావు.. నా భయం నీకు అర్థం అయిందా?..” అన్నాడు కంగారుగా.
చిన్నగా నవ్వింది దివ్య.
“నీ భయం నాకు అర్థమైంది తాతయ్య!.. కలిసి తిరిగితేనే.. లవ్ చేసుకుంటున్నారు అని అనుకోవడం నా దృష్టిలో పొరపాటు తాతయ్య..
ప్రేమించడానికి.. లాంగ్ డ్రైవ్‌లు, చాటింగ్‍లు, డేటింగ్‌లు అక్కర లేదు..
వివేక్ మనసులో నేను ఉన్నానని తెలుసు.. వివేక్ నన్ను లైక్ చేస్తున్నాడని తెలుసు.. కాని మొదటి సారిగా, వివేక్ నన్ను ఎంత లైక్ చేస్తున్నాడో.. తను నన్ను తన లైఫ్ పార్టనర్ కావాలనుకుంటున్నాడని.. మొన్న తను ఇండియా వెళుతున్నప్పుడు తన మనసులో ఫీలింగ్స్ అన్నీ నాతో షేర్ చేసుకున్నాడు.. Don’t worry తాతయ్యా..” అని “అన్నట్లు నీకు ఓ.కె.. నా” అంది.
గభాలున రెండు చేతులు చాచాడు డా. రంగారావు. సంతోషంగా గుండె మీద వాలిపోయింది.
అభిమానంగా తల మీద చెయ్యి వేసి నిమురుతూ.. “నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలసింది.. నీ మనసుకి నచ్చిన వాడు.. వివేక్‍తో పెళ్ళి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తల్లీ” అన్నాడు సంతోషంగా డా. రంగారావు.
ఫోన్ రింగ్ కావడంతో గభాలున ఆలోచనల నుండి తేరుకొని, ఫోను లిఫ్ట్ చేసాడు..
“తాతయ్య!.. సారీ!.. నీకు చెప్పకుండా వెళ్ళినందుకు.. నేను వ్రాసిన లెటరు చదివి చాలా బాధపడుతుండి ఉండావు.. ప్లీజ్ తాతయ్యా నాకు మిగిలింది, ఉన్నది నువ్వు ఒక్కడివే!.. నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే.. ఇంక నేనెవరి కోసం బ్రతకాలి చెప్పు?.. నా గురించి వర్రీ కాకు.. దెబ్బ అయినా, బాధ అయినా.. ప్చ్.. cure కావడానికి టైమ్ పడుతుంది కదా? నాకు కొంచెం టైమ్ కావాలి తాతయ్యా!.. take care” అని ఫోను పెట్టేసింది దివ్య. వణుకుతున్న చేతులతో గది చుట్టూ పిచ్చి వాడిలా చూసాడు. టీపాయ్ మీద వైట్ పేపరు మీద వెయిట్ పెట్టి ఉంది. కంగారుగా టీపాయ్ దగ్గరకు వెళ్ళి పేపరు తీసుకొని చదవసాగాడు.
“తాతయ్యా! I am very sorry.. ఈ ఒక్క మాట చెబితే సరిపోదు అని తెలుసు. నిన్ను చాలా, చాలా బాధ పెడుతున్నానని తెల్సు.. కాని నిన్ను బాధపెట్టే సంఘటన, నిన్నే కాదు నన్ను.. నన్ను.. బాద పెట్టే.. నా ప్రాణాలు.. అనంత వాయువుల్లో కలిసిపోయే ఘోరం జరిగిపోయింది. అంతా విపులంగా వ్రాసే ఓపిక, శక్తి నాకు లేదు.. కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను..
తప్పని పరిస్థితుల్లో .. వివేక్ పెళ్ళి నిశ్చయం అయిపోయింది. ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం.. చివరి కోరిక తీర్చడం కోసం వివేక్ పెళ్ళి చేసుకోబోతున్నాడు.. వివేక్ చాలా మంచోడు.. నిర్దోషి.. ఇంతకన్నా నేను వ్రాయలేను..
తాతయ్యా!.. నేను ప్రాణాలు తీసుకోను. కంగారు పడకు. నీ కోసం.. నేను బ్రతుకుతాను.. కాని నా మనసు కుదట పడడానికి సమయం పడుతుంది.. అప్పటి వరకు నేను మీ ముందుకు వచ్చి.. మిమ్ములను బాధ పెట్టలేను తాతయ్యా!.. మీకు తెలుసు కదా? నా ప్రాణం మీరు.. మీ తరువాత వివేక్ నా ప్రాణం అనుకున్నాను. కాని ఇప్పుడు.. నాకు మిగిలిన option మీరు ఒక్కరే!
ప్లీజ్! తాతయ్య!.. మీ health జాగ్రత్త.. మీరుంటేనే.. నేను ఉండేది. ఆ విషయం గుర్తు పెట్టుకోండి.. ఉంటాను.”
My dear Divya!.. అంటారు కదా?.. మీ.. డియర్ దివ్య కోసం.. మీరు బాగుండాలి..” ఇక ముందుకు చదవలేక కుర్చీలో కూలబడ్డాడు డా. రంగారావు.
***
పరిస్థితులు ఎంతటి మంచి మనిషికైనా తల వంచే స్థితికి తీసుకువస్తాయి. దివ్య చెప్పింది నిజం!.. వివేక్ చాలా మంచి అబ్బాయి.. కావాలని వివేక్ ఆ పెళ్ళి చేసుకోడు. అసలు ఆ టాపిక్ గురించి ఆలోచించడం అవివేకం అవుతుంది.
సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఎంతైనా ఆలోచించవచ్చు!.. పరిష్కరించలేని సమస్య అని తెలిసినప్పుడు ఆలోచించడం మానేస్తే కనీసం మనసుకి కొంతైనా బాధ తగ్గించినవాడు అవుతాడు..
అవును!.. చిట్టి తల్లి!.. తన గుండె మీద పెరిగి పెద్దదై, ఈ రోజు.. తన మనసులో బాధ తను చూడడం ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయింది దివ్య. ఇప్పుడు.. తను.. ఏం చేయాలి?.. ఫోను చేసి ధైర్యం చెప్పాలా? లేక.. దివ్య కోరుకుంటున్నట్లు కొద్ది రోజులు ఒంటరిగా వదిలేసి తను మౌనం వహించాలా?.. రెండోదే బెటర్ అనిపిస్తుంది.. చదువుతున్నప్పుడు గాని.. పెరిగి పెద్దదవుతున్నప్పుడు.. ఇప్పటిదాకా.. తనకి ఏదైనా ప్రోబ్లమ్ వస్తే తను బుజ్జగించబోతే “ప్లీజ్!.. తాతా!.. నాకు తెలుసు.. నువ్వేం చెప్పొద్దు” అని గభాలున గదిలోకి వెళ్ళి.. తనకి ఎంతో ఇష్టమైన డ్రాయింగ్ గీసుకొనేది.. డ్రాయింగ్ పూర్తి అయ్యేటప్పటికి, ఎప్పటిలా “తాతా!..” అని అనేది.. అవును.. దివ్య మనసు తనకి తెలుసు.. తను ఒంటరిగా ఉండడమే బెటరు.
డా. రంగారావు గారి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
“త్వరగా దివ్య నా దగ్గరకు రావాలి” అని భగవంతుని తలచుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు డా.రంగారావు.
***
అమృతకి అంతా కొత్తగా ఉంది. అమెరికా, వివేక్ ఉన్న ఇల్లు, ఆ వాతావరణం, ఆ ఫుడ్, పరిసరాలు క్రొత్తగా ఉండడమే కాదు, వివేక్ కూడ ఎవరో క్రొత్త మనిషిలా అనిపించసాగాడు..
కారణం!.. కష్టం వచ్చినా, సంతోషం కలిగినా ఇంట్లో అందరికన్నా ముందు “మామూ!..” అంటూ వివేక్ దగ్గరకు వెళ్ళేది.. ప్రోబ్లమ్ సాల్వ్ అయ్యేది.. కాని.. ఇప్పుడు.. నిన్నటిదాకా.. “మామూ!..” అని తన దగ్గరకు వెళ్ళే తను.. ఇప్పుడు.. వివేక్ దగ్గర ఫ్రీగా ఉండలేకపోతుంది. తనకు తెలియకుండానే వివేక్‍కి తనకి మధ్య దూరం పెరిగిందనిపిస్తుంది.
అవును!.. తను ఇంకా చిన్నపిల్ల కాదు! మామూ!.. అని వివేక్‍ని ప్రతీ దానికి ఇబ్బంది పెట్ట కూడదు.. తన సమస్య గురించి తను ఆలోచించాలి.. బాధపడాలి! ఏడవాలి!.. అంతే!..
“అమ్మూ!.. ఒంటరిగా బెడ్ రూమ్‍లో ఏం చేస్తున్నావు.. బ్రేక్ ఫాస్ట్ రెడీ అయింది.. రా.. “ అని గభాలున దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు వివేక్.
ఇబ్బందిగా చూసి.. “వస్తాను మామూ!.. ప్లీజ్ నువ్వు చేసేయ్!.. నేను తరువాత టిఫిన్ చేస్తాను, ఆకలిగా లేదు” అంది అమృత..
“తరువాత.. ప్చ్!.. తరువాత కూడ ఆకలి వేయదు.. ఎందుకంటే మన ముందు ఉన్నది చిన్న సమస్య కాదు.. ఆకాశమంత సమస్యలా కనబడుతుంది, ఇక ఆకలి ఏం వేస్తుంది?.. ఆకలి వేయకపోయినా.. తినాలి.. నువ్వు ఇలా చేస్తే.. సమస్య అలానే ఉంటుంది.. మన ఆరోగ్యాలు పాడవుతాయి. మనిద్దరం ఇలా ఉన్నామని తెలిస్తే మన వాళ్లు తట్టుకోగలరా?.. నా దగ్గర.. నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటావన్న ఉద్దేశంతో ఇక్కడకు పంపారు” అని వివేక్ అంటుండగానే గభాలున వచ్చి వివేక్ గుండెమీద వాలిపోయి..
“మామూ!.. ఎందుకు ఇలా జరిగింది? ఆరోగ్యంగా ఉండే నాన్నకి సడన్‍గా ఆరోగ్యం అలా కావడమేమిటి?.. ఎప్పుడూ !.. నన్ను, నిన్ను ఆ దృష్టితో చూడని నాన్న.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి?.. “అంది.
నిర్లిప్తంగా నవ్వి అన్నాడు వివేక్ !..
“అమ్మూ!.. ఒక్కటి గుర్తు పెట్టుకో!.. చిన్న విషయమే కావచ్చు.. పెద్ద విషయమే కావచ్చు.. నిర్ణయం తీసుకోవడమన్నది.. పెద్ద విషయం.. బాగా ఆలోచించి, ఆలోచించి.. నిర్ణయం తీసుకోవడం, పరిస్థితులు చేజారిపోయి.. తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం! మామయ్య.. మీ నాన్న.. ఆరోగ్యం.. ఎవరు ఊహించనది, ఎవరు నమ్మలేని విషయం.. ఎప్పుడు గంభీరంగా, పులిలా ఉంటే మామయ్య.. క్యాన్సర్‍తో బోనులో పడ్డ పులిలా మంచం పట్టాడు.. పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో, తన కుటుంబం.. తను ఉన్నా లేకపోయినా.. తను ఉన్నప్పుడు లాగే ఉండాలని.. మావయ్య ఆశపడ్డాడు.. ఆశ నెరవేరాలంటే.. తన ముందు ఒక ఒక్క option కనబడింది.. అదే మనిద్దరికి పెళ్ళి చేయాలని.. ఆ ఆలోచన మావయ్యని సంతృప్తపరిచింది.. సంతోషపెట్టింది.. అందుకే ఇప్పటికి కూడా మావయ్య నిర్ణయం నేను ఎప్పుడు తప్పుపట్టను.. అమ్మూ!.. నువ్వు కూడా.. నాలాగే ఆలోచించు.. అప్పుడు ఇందాక అన్నావు చూడు.. ఇలాంటి నిర్ణయం నాన్న ఎందుకు తీసుకున్నాడు అని నన్ను అడగవు.. నువ్వు బాధపడవు..”
వివేక్ ఆలోచించిన తీరుకి.. అలా చూస్తూ ఉండిపోయింది అమృత..
“వి.వీ!.. నాకు ఆకలి వేస్తుంది” అంది చిన్నగా.
సంతోషంగా, గభాలున దగ్గరకు వచ్చి అమృత చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబిల్ దగ్గరకు అడుగులు వేసాడు వివేక్!..
***
“ఏంటి? దివ్య!.. ఎక్కడికి వెళ్ళింది?.. ఎప్పుడూ!.. ఇలా ఎవరికి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళలేదు.. అసలు ఫోను Switch off లో పెట్టడం ఏమిటి?”
“ఎప్పుడు నీకు చెప్పాలని ఏం ఉంది?.. ఏదో Personal విషయం కావచ్చు.. అందుకే చెప్పలేదు ఏమో?..” అన్నాడు డేవిడ్.
“Personal విషయమా?.. నీకు తెలియదులే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి.. పర్సనల్ విషయం అనుకో ముందు నాకే చెబుతుంది.. నాకు చెబితే చెప్పావు ఇంకెవరికి చెప్పకు అంటుంటాను.. చాల్లే!.. ఇప్పటి వరకు నువ్వు తప్ప నేను వేరెవరితో చెప్పలేదు. చెప్పను కూడ.. ఎందుకంటే నీ దగ్గర ఉన్న comfort వేరేవరి దగ్గర ఉండదు అంటుంది.”
“బాగా గుర్తు చేసావు.. వివేక్ దగ్గర నీకన్నా ఎక్కువ comfort ఉంటుంది.. ఎందుకంటే దివ్య లవర్ వివేక్.. వాడిని అడిగితే దివ్య ఎక్కడికి వెళ్ళిందో తెలిసిపోతుంది. ఏమంటావు?” అన్నాడు సునీల్
“బావుంది.. వివేక్ ఇండియాలో ఉన్నాడన్న విషయం మరిచిపోయావా?..” అంది రాధిక..
“నేనేం మరిచిపోలేదు.. ఫోనులో మాట్లాడడం ఎంత సేపు..” అని సునీల్ అంటుండగానే.. చకచకా నడుచుకుంటూ.. రావడం చూసి ఆశ్చర్యంగా, కంగారుగా అందరూ వివేక్ వైపు చూడసాగారు.
(సశేషం)