Site icon Sanchika

మేనల్లుడు-2

[అమెరికాలో Harvard University లో Hereditary Diseases (ఆనువంశిక వ్యాధుల) మీద పరిశోధన జరుగుతుంటుంది. టీమ్ లీడర్ వివేక్‌తో పాటు దివ్య, రాధిక, సునీల్, డేవిడ్ ఇంకా కొంత మంది పరిశోధిస్తుంటారు. ఆ రోజు ఎలాగైనా తన మనసులో మాట వివేక్‌తో చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేస్తుంది దివ్య. ఆ మాటే రాధికతో చెప్పింది. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక చెప్పేయ్ అంటుంది రాధిక. తనది ప్రేమేనని, కాని వివేక్‍కి తన పట్ల ప్రేమ ఉందో లేదోనని అంటుంది దివ్య. ఇంతలో వివేక్ వస్తాడు. దివ్య చేసిన సాంబార్ ఇడ్లీ తినబోతుండగా అతని ఫోన్ మోగుతుంది. ఇండియా నుండి అతని మరదలు అమృత ఫోన్ చేస్తుంది. ‘మావయ్యకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండమ’ని చెప్తాడు. తాను ఇండియాకి బయల్దేరుతున్నట్లు మిత్రులకి చెప్తాడు. దివ్య వివేక్‍తో పాటు వెళ్ళి టికెట్లు బుక్ చేసి, అతని బట్టలు సర్దిపెట్టి ఎయిర్‍పోర్టుకి అతనితో పాటు వెళ్తుంది. తను చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినమని బ్రతిమాలుతుంది. మావయ్య ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్న వివేక్ తిననంటాడు. దివ్య ధైర్యం చెబుతుంది. ఎయిర్‍పోర్ట్‌కి వచ్చి కారు దిగి వెళ్ళేముందు, దివ్య తెచ్చిన టిఫిన్ తింటాడు. ఇంతలో అమృత మళ్ళీ ఫోన్ చేస్తుంది. కంగారులో ఏమేమో మాట్లాడుతుంది. విమానంలో కూర్చున్నాక వివేక్‌కి గతం గుర్తువస్తుంది. – ఇక చదవండి.]

[dropcap]ఇం[/dropcap]టి చుట్టూ జనం.. ఇంట్లో పని వాళ్లు చేతులు కట్టుకొని నిలబడ్డారు.. అమ్మ ఒళ్లో ఉన్న వివేక్ వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి వైపు చూసి.. “అమ్మా!.. ఏడవకు.. నాన్న ఎక్కడ?.. ఏడవకమ్మా?..” అని తల్లిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేయసాగాడు..

“అమ్మా, అయ్యగారు ఎక్కడికెళ్లారో తెలియదు. ఊరంతా ఇల్లు వేలం ఈ రోజు అని చెప్పకుంటున్నారు.. అమ్మా! అన్నయ్యగారికి ఫోను చేయండమ్మా.. రెక్కలు కట్టుకొని వాలతారు” అంది ఇంట్లో పని చేసే మంగమ్మ.

“అవునమ్మా! ఎప్పుడు ఏ ఆపద వచ్చినా చప్పున అన్నయ్యగారు వస్తారు. ఆయనకి మీరంటే పంచప్రాణాలు. ఇంత జరిగినా, మీరు చెప్పలేదని బాధపడతారన్నయ్య గారు” అంది సీతమ్మ.

“ఏ ముఖం పెట్టుకొని అన్నయ్యకు చెప్పమంటావు. నేనంటే పంచప్రాణాలన్ని, అన్నయ్య ప్రాణం విడిచేదాక విసిగించమంటావా? ఇప్పటికే ఎన్నో గండాల నుండి నన్ను, నా కొడుకుని కాపాడాడు.. ఇక నేను అడగలేను సీతమ్మా” అని శారద అనగానే

“అలా అనకండమ్మా.. అన్నయ్యగారికి మేనల్లుడంటే ఎంత ప్రేమ ఉండకపోతే ప్రతి పుట్టిన రోజు పెళ్లిలా జరిపిస్తారు?.. నా మాట వినండమ్మా.. అటు చూడండి.. వేలం పాటకి అందరూ వచ్చేస్తున్నారు.. అమ్మా! బాబు భయపడుతున్నాడు.. అన్నయ్యగారికి చెప్పడం తప్ప మరో దారి లేదు.” అంది మంగమ్మ.

గభాలున సోఫాలోంచి లేచి, వివేక్‌ని ఎత్తుకుని “దారి ఉంది మంగమ్మా.. నాలాంటి వాళ్లని ఎందరినైనా తన గర్భంలో దాచుకుంటుంది గోదావరి” అని శారద అంటుండగానే దూరం నుండి లోపలికి వస్తూ విన్న నారాయణరావు.. గబ గబా దగ్గరకు వచ్చి శారద దగ్గర నుండి వివేక్‌ని తీసుకొని, “శారదా!.. ఏంటమ్మా ఆ మాటలు.. నువ్వలాంటి పని చేస్తే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉంటాడనుకుంటున్నావా?” అని అభిమానంగా భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని “పదమ్మా!..” అని తన కూడ వచ్చిన సూరిబాబుని ఉద్దేశించి అన్నాడు నారాయణరావు.

“చూడు సూరీబాబూ!.. చెల్లెమ్మని తీసుకొని నేను వెళుతున్నాను.. వేలంలో ఇల్లు మనకే రావాలి.. bank వాళ్లతో మాటాడడానికి వెంకట్రావుని పంపాను.. వాళ్ల అప్పు.. అదే ఇంటి మీద loan వడ్డీతో సహా కట్టేస్తాం.. వేలం ఆపమని.. నేను అనుకోవడం వేలం ఆగిపోతుంది.. వెంకట్రావు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు.. పద తల్లీ” అని శారదను తీసుకొని, మేనల్లుడిని తీసుకొని కారెక్కాడు నారాయణరావు. పరిగెత్తుకొని మంగమ్మ, సీతమ్మ కారు దగ్గరకు వచ్చి “అయ్యగారు! అమ్మగారిని నమ్ముకొని బ్రతుకుతున్నాం. వయసులో అమ్మ మా కన్నా చిన్న అయినా, మా మంచి చెడ్డలు తల్లిలా చూస్తారు. మేమూ మీ నీడలో బ్రతుకుతాం” అని ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, “మీలాంటి మంచి మనుషులను మేము వదులుకోం” అని “సూరిబాబు వాళ్లని తీసుకురా” అన్నాడు.

రాజమండ్రి నుండి కడియం బయలుదేరింది కారు.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా ఉండుండి తన ఒళ్లో ఉన్న మేనల్లుడిని దగ్గరకు తన హృదయానికి హత్తుకుంటూ, కుడి చేత్తో శారద భుజం మీద చెయ్యి వేసి బుజ్జగిస్తున్నట్లు “అమ్మా!.. శారదా!.. ఒకొక్కసారి విధి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటుంది.. ఒకసారి ఆనందాన్ని ఇస్తుంది.. ఒకసారి దుఃఖాన్ని ఇస్తుంది.. రెండు అనుభవించాలి. సంతోషం జరిగినప్పుడు దేవుడున్నాడని, బాధ కలిగినప్పుడు దేవుడు లేడని అనుకోకూడదు.. ఆ బాధని పొగొట్టుకోవడానికి, దాని నుండి బయటపడడానికి ప్రతీ మనిషి ప్రయత్నం చేయాలి.. జరిగినవన్నీ మరిచిపోవడానికి ప్రయత్నించాలి. ఒకొక్కసారి ఎంత బాధ కలిగినా, ఆ బాధని మరిపించే అద్భుతమైనది ఏదో ఒకటి భగవంతుడు ఇస్తాడు.. నీకు కూడా ఇచ్చాడు” అని నారాయణరావు అనగానే గభాలున నారాయణరావు ముఖంలోకి చూసి నిర్లిప్తంగా అంది శారద.

“ప్చ్!.. చెల్లెలుని కదా.. ఎన్నయినా చెబుతావు.. నిజాయితీ తప్ప అబద్ధం ఆడని నువ్వు నా కోసం ఎన్ని అబద్ధాలయినా చెబుతావు.. కాని భగవంతుడు తొందరపడి చాలా పెద్ద కానుక ఇచ్చేసాడు మీ బావగారి రూపంలో.. ఇంకా ఏ కానుకలు ఇస్తాడనన్నయ్యా?.. నేను ఆశ పడడంలో అర్థం లేదు..” అంది బాధగా.

“శారదా!.. పొరపడుతున్నావు.. ఇటు చూడు నా మేనల్లుడిని.. ఆకాశంలో చందమామకైనా మచ్చ ఉంటుందేమో కాని నా మేనల్లుడికి లేదు.. నువ్వు కన్న కలలన్నీ వీడి రూపంలో నీకిచ్చాడు.. వీడు మామూలోడు కాదు.. ఏదో ఒక రోజు ఇటువంటి బిడ్డకు తల్లినయ్యాను అని గర్వంగా అందరివైపు చూస్తావు.. ఈ మాటలు నిన్ను సముదాయించడానికి చెప్పడం లేదు.. మూడేళ్ల బట్టి నా మేనల్లుడిలోనే తేజస్సుని, తెలివితేటలని.. వాడి చేతలని, మాటలని చూసి చెబుతున్నాను.. నేను ఉట్టినే వివేక్ అని పేరు పెట్టాననుకుంటున్నావా?..” అని “ఏం బంగారం! బాగా చదువుకుని మంచి పేరు తెచ్చిపెడతావా?” అన్నాడు నారాయణరావు. వివేక్ అప్పుడప్పుడు నత్తిగా మాట్లాడుతాడు.

“ఓ!.. బోలేడు పేరులు తెచ్చిపెడతాను మావయ్యా.. మరి అమ్మ ఏడవకూడదు.. అమ్మ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది..” అని తల్లి వైపు చూసి “అదిగో!.. అమ్మ కళ్లనిండా నీళ్లు” అన్నాడు వివేక్.

కంగారుగా కళ్లల్లో నీళ్లు తుడుచుకుంది శారద.

“శారదా!.. ఇప్పుడు కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటే సరిపోదమ్మా.. ఇక మీదట ఎప్పుడు నీ కళ్లల్లో నీళ్లు.. ఒక్క బొట్టు కూడా రాకూడదు” అని నారాయణరావు అంటుండగానే కంగారుగా “అర్థం అయింది అన్నయ్యా!.. పెళ్లి అయ్యే వరకు నా లోకం మా అన్నయ్య అనుకున్నాను.. పెళ్లయ్యాక నా లోకం భర్త అనుకున్నాను.. కాని ఇప్పుడు నా కొడుకే నా లోకం అన్నయ్యా.. కొండంత అండగా నువ్వు ఉన్నావు.. ఇంకా నాకేం కావాలన్నయ్యా” అంది శారద.

“మావయ్యా!.. ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాము?” అన్నాడు వివేక్.

“మన ఇంటికి బాబు” అన్నాడు.

“అంటే మా ఇంటికా!.. అక్కడైతే అమ్మ ఏడుస్తుంది. మీ ఇంటికి వెళదాం.. అక్కడ నువ్వు ఉంటావు కదా?.. అమ్మ ఏడవదు..” అన్నాడు వివేక్..

కంగారుగా కొడుకు వైపు.. నారాయణరావు వైపు చూసింది శారద.

“మనింటికి వివేక్ బాబు” అని ఒక్క నిమిషం ఆగి, “మనందరం.. ఒకే ఇంట్లో ఉంటాం.. అంటే మనందరిది ఒకే ఇల్లు.. అర్థం అయిందా?..” అన్నాడు.

“అర్థం అయింది మావయ్యా.. అక్కడ ఉన్న ఇంటికి మనం ఎప్పడు వెళ్లొద్దు మావయ్యా!..” అని వివేక్ అంటుండగానే.. కంగారుగా భయంగా అంది శారద.

“వద్దు నాన్నా.. అస్సలు ఆ ఇంటికి వెళ్లొద్దు. నేను.. నేను ఎప్పుడు ఏడవను.. ఎప్పటికీ నా కళ్లల్లో నీళ్లు నువ్వు చూడవు.”

అప్పటికే కారు విశాలమైన ఎకరం పొలంలో ఉన్న ఇంటి ముందు ఆగింది..

అప్పటికే వసారాలో సుమిత్ర, పనివాళ్లు నిలబడి ఉన్నారు.. కారు దిగిన శారదకి ఎదురు వెళ్లి గభాలున శారద చెయ్యి పట్టుకొని “శారదా!.. ఒక్కటి గుర్తు పెట్టుకో!.. నేను వదినని, ఆయన అన్నయ్య కాదు; నీ తల్లిదండ్రులం.. నాకు బిడ్డవు.. మనకి దేవుడు ఇచ్చిన వరం వివేక్.. ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు సంతోషంగా గడిపేద్దాం.. వీలయితే నలుగురికి సహయపడదాం” అంది సుమిత్ర.

మాటలు రాని దానిలా గభాలున వెళ్లి సుమిత్ర భుజాల మీద వాలిపోయింది శారద.

ప్రపంచంలో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని తెలుసు.. కాని తనకన్నా రెండేళ్లు పెద్ద అయిన సుమిత్రలో ఇంత పెద్ద మనసా?.. అసలు ఇలాంటి వ్యక్తులుంటారా?.. ఉన్నా.. తనకి వదినగా రావడం ఎంత అదృష్టం.

“మావయ్యా! అటు చూడు.. అమ్మ ఏడవను అని చెప్పింది కదా?.. అదిగో కళ్లల్లో నీళ్లు” అన్నాడు వివేక్.

కంగారుగా కళ్లల్లో నీళ్లు తుడుచుకుంది శారద.

తన కళ్లలో నిండుతున్న కన్నీళ్లని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.. “లేదు నాన్నా!.. అవి కన్నీళ్లు కాదు.. వాళ్ల వదినని చూసిన సంతోషంలో వచ్చిన కన్నీళ్లు..” అని “కొండమ్మా, బాబుని తీసుకొని వెళ్లి స్నానం చేయించి పాలు ఇవ్వు” అన్నాడు నారాయణరావు.

“అలాగే! అయ్యగారూ!..” అని గభాలున వివేక్‌ని ఎత్తుకోబోయింది కొండమ్మ.

“వద్దు కొండమ్మా!.. నేను అప్పుడు వచ్చినప్పుడు ఎత్తుకున్నావు.. అప్పుడు చిన్నవాడిని.. ఇప్పుడు పెద్దవాడి నయిపోయాను” అన్నాడు వివేక్.

నవ్వుతూ “ఏంటి బాబూ!.. నీవు ఇక్కడకు వచ్చి మూడు నెలలు అయింది.. అప్పుడే పెద్దవాడివి అయిపోయావా?” అంది కొండమ్మ.

“అవును!.. కావాలంటే మామయ్యని అడుగు” అన్నాడు వివేక్.

“అవునవును.. వివేక్ బాబు పెద్దవాడయిపోయాడు. ఇంట్లో అందరూ వివేక్ బాబు చెప్పినట్లు చెయ్యాలి. అర్థం అయిందా?” అన్నాడు నారాయణరావు.

వస్తున్న నవ్వుని ఆపుకొని.. “అలాగే అయ్యగారు, వివేక్ బాబు చెప్పినట్లే చేస్తాం” అన్నారు పనివాళ్లు.

“వివేక్ బాబూ!.. ఎవరైనా నీ మాట వినకపోతే నాతో చెప్పు.. నేను పనిష్మెంట్ ఇస్తాను” అన్నాడు నారాయణరావు.

“స్కూల్లో bad boys కి, చెప్పిన మాట వినకపోతే పనిష్మెంట్ ఇస్తారు టీచర్.. నువ్వు వద్దులే మావయ్య వీళ్లకి పనిష్మెంట్ నేనిస్తాను..” అన్నాడు వివేక్.

అందరూ పకాలున నవ్వారు.. బాధలని మరిచిపోయి గభాలున కొడుకుని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించి నవ్వింది శారద.

“ఒక్కసారి నీ కొడుకుని నాకివ్వు” అని శారద చేతుల్లోంచి వివేక్‌ని తీసుకొని ముద్దాడింది సుమిత్ర.

తను ఇన్నాళ్లు నరకకూపంలో శారదని ఉంచాడా? ప్రపంచంలో ఏ బంధాలయినా కొన్నాళ్లే సాగుతాయి. కాని మానవ సంబంధాలు మాత్రమే మనిషి, బ్రతికి ఉన్నంత వరకు ఉంటాయి.. అందుకే పక్షులు, జంతువులు మధ్య సంబంధం కొన్నాళ్లే సాగుతుంది. కాని మానవ సంబంధాలు బలహీనంగా ఉన్నా.. బలపరచుకోవడానికి ఆరాటపడతారు.. ప్రయత్నాలు చేసారు.. అందుకే రమణకి అవకాశం ఇచ్చాడు. పేకాట, తాగుడుకి అకస్మాతుగా అలవాడు పడ్డాడు రమణ.

మంచికి మనిషి తొందరగా అలవాటు పడడు, కాని చెడుకి మాగ్నెట్‌లా అతుక్కుపోతాడు.

అవకాశం ఇస్తే అలవాట్లను దూరం చేసుకుంటాడనుకున్నాడు. కాని రమణ ఆ పని చేయలేదు.. ఆస్తులన్నీ హారతి కర్పూరంలా పేకాటలకి, తాగుడికి ఆర్పేస్తే, మిగిలిన పొలాన్ని వివేక్ బాబు పేరున రిజిష్టర్ చేయించాడు.. ఇంటి మీద అప్పు చేస్తాడన్న ఆలోచన రాలేదు.. బ్యాంక్ లోను తెచ్చుకోవడానికి శారద సంతకం పెడుతుందని ఊహించలేకపోయాడు. శారదని ఎంత బాధ పెట్టి సంతకాలు తీసుకున్నాడో!

భగవంతుడికి ఒక్క విషయంలో ఎప్పటికీ ఋణపడి ఉంటాడు.. ఇన్నాళ్లు శారద తన బాధని కన్నీళ్ల రూపంలో ఉపశమనం పొందింది కాని తన ప్రాణాలన్ని నిలుపుకుంది.

“ఏంటండీ!.. ఎంత సేపటికి గదిలో నుండి రావడం లేదు. భోజనానికి రండి.. అందరం మీ కోసం చూస్తున్నాం!..” అని డైనింగ్ టేబిల్ దగ్గర నుండి పిలిచింది సుమిత్ర.

అందరూ భోజనానికి కూర్చున్నారు.

“అన్నట్లు సుమిత్రా!.. శారదకి నువ్వు చేసే పప్పు టామోటా, బెండకాయ వేపుడు ఇష్టం కదా చేసావా? చికెన్ బిరియాని వదిన చేసినట్లు నాకు కుదరదు.. ఏం అనుకోకుండా తినన్నయ్యా అంటుంది.. అన్నీ చేసావా?..” అన్నాడు.

కొంచెం కంగారుగా అంది “అవేవీ చేయలేదండి.”

“అవన్నీ చేయలేదా?.. ఓహో నాకిష్టమైనవో, నీకిష్టమైనవో చేసి ఉంటావు..” అన్నాడు కోపంగా.

“అది కాదన్నయ్యా!..” అని శారద అంటుండగానే “నువ్వుండమ్మా.. ఏం చేసావు? చెప్పు” అన్నాడు నారాయణరావు.

“సాంబారు, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై..”

“చికెన్ ఫ్రై చేసే బదులు చికెన్ బిరియానీ చేయలేకపోయావా?”

“మావయ్యా!.. అత్తయ్యని ఏమీ అనుకు..” అని వివేక్  అంటుండగానే..

“ఏం తింటావు వివేక్ బాబు! అని అడిగితే.. ఇవన్నీ చేయమని చెప్పాడు.. మనం ఏమైనా తింటాం. ఇప్పుడే చెబుతున్నాను.. ఇక మీదట.. ఈ ఇంట్లో వివేక్ బాబు చెప్పినవి మాత్రమే వండుతాను.. మీ కిష్టమైతే తినండి లేదా వద్దు” అంది నవ్వుతూ సుమిత్ర.

మనసారా.. నవ్వి.. “ఈ విషయం ముందు చెప్పలేదేం?.. ఈ రోజే కాదు.. ఇక మీదట వివేక్ బాబుకి ఇష్టమైనవే వండు..” అన్నాడు.

“ఏంటన్నయ్యా! నువ్వింత అభిమానం చూపెడితే నేను తట్టుకోలేకపోతున్నాను” అని ‘ఎవరున్నా లేకపోయినా, నీలాంటి అన్నయ్య.. ఆడపిల్లకు ఉంటే ఏం అక్కరలేద’ని మనసులో అనుకుంది శారద.

“మావయ్యా! అత్తయ్య చాలా మంచిది.. అత్తయ్యని ఏమైనా అంటే పనిష్మంట్ ఇస్తాను..” అన్నాడు తింటూ వివేక్.

గలగలా నవ్వాడు నారాయణరావు..

“ఆ పని చెయ్యి వివేక్ బాబూ!” అంది నవ్వుతూ సుమిత్ర.

(సశేషం)

Exit mobile version