మేనల్లుడు-20

0
1

[ఇండియా వెళ్ళిపోవాలన్న అమ్మూ నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడవుతాడు వివేక్. అక్కడికి వెళ్ళాకా మావయ్యకి ఏమీ చెప్పవద్దని, తనకే ఆలస్యం అవుతుందని చెప్తానని అంటాడు. సౌమ్య ఆత్మహత్యకి ప్రయత్నించిందని తెలిసినప్పటి నుండి తన మనసు చెదిరిపోయిందని, ఏవేవో భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయని అంటుంది అమృత. వివేక్‌కీ, తనకీ మధ్య ఉన్న అనుబంధాన్ని భార్యాభర్తల బంధంగా మాత్రమే చూడాలనుకునే పెద్దవాళ్ళ మీద కోపం తెచ్చుకుంటుంది. మావయ్య పరిస్థితిని గుర్తు చేసి ఆయనని నిందించకూడదంటాడు వివేక్. తాను వివేక్‌లా ఆలోచించలేకపోతున్నానని అంటుంది అమృత. కారులో ఎయిర్‍పోర్టుకి బయల్దేరుతారు. ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు వివేక్. అమ్మూ కలిసి ప్రయాణించబోయే తన స్నేహితుడు నీల్ గురించి చెప్తాడు. నీల్ ప్రేమ విఫలమైన సంగతి, నీల్ బాధలో ఉన్న సంగతి చెప్తాడు. ఎయిర్‍పోర్టుకి చేరాకా, తమ కోసం ఎదురు చూస్తున్న నీల్‌ని చూపించి, తాను కారు పార్క్ చేసి వస్తానని వెళ్తాడు వివేక్. సునీల్, అమృత ఒకరినొకరు చూసి షాక్‌కి లోనవుతారు. ఆశ్చర్యపోతారు. తమకి ఇప్పటికే పరిచయం ఉన్న సంగతి వివేక్‌కి చెప్పద్దంటుంది అమృత. ఇంతలో అక్కడికి వచ్చిన వివేక్ – సునీల్‌తో మాట్లాడుతూ నీ మనసులోని బాధ మా అమ్మూకి చెప్పు, కొంచెమయినా తగ్గుతుంది అంటాడు. చెకింగ్ కోసం కదులుతాడు సునీల్. అమృతని సునీల్‍కి కంపెనీ ఇవ్వమంటాడు వివేక్. తనని క్షమించమని అడుగుతుంది అమ్మూ. మన మధ్య క్షమాపణలేంటి అంటాడు వివేక్. అమ్మూ లోపలికి వెళ్ళిపోతుంది. – ఇక చదవండి.]

[dropcap]మౌ[/dropcap]నంగా బట్టలు సర్దుకోసాగింది అమృత..

ఇద్దరు ఫ్లైట్‌లో కూర్చున్నారు.

ఫ్లైట్ బయలుదేరింది.

ఎవరికి వారే మౌనంగా ఉన్నారు.

సమయం దొర్లుతున్నా.. ఇద్దరూ కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు.. అపరిచిత వ్యక్తుల్లా కూర్చున్నారు..

Air hostess వచ్చి ఏవేవో తెచ్చి ఇచ్చింది.

“తీసుకోండి” అన్నాడు..

“మాముకి మన విషయం తెలియకూడదు.”

నిశ్శబ్దం!..

“మిమ్మలనే!.. మన విషయం తెలియకూడదు.”

“ప్చ్!.. నేనంత దుర్మార్గుడిని అనుకున్నారా?.. మన అన్నేళ్ళ ఫ్రెండ్షిప్‌లో అంతే అర్థం చేసుకున్నారా?..”

చివ్వున తల తిప్పి సునీల్ మొఖంలోకి చూసింది.

అమృత కళ్ళనిండా నీళ్ళు..

కంగారుగా అన్నాడు సునీల్..

“ఇప్పుడే మన్నానండి.. ఆ కళ్ళల్లో నీళ్ళు ఏమిటి? ప్లీజ్ కన్నీళ్ళు తుడుచుకోండి..”

“ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి జరగపోయినా, నేను బాధపడతానే తప్ప, బాధించే మనిషిని కాదు..”

“అసలు జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమిస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు..”

“ప్రేమించాక.. అది ఫెయిల్ అయితే ఆ ప్రేమని మరిచిపోలేను అని ప్రతీ నిమిషం నా మనసు సూది గుచ్చినట్లు ఉంటుంది అని అనుకోలేదు. “

“ప్రేమకు ఇంత పవరుందని తెలియదు.”

“పిచ్చోడు పొద్దు ఎరగడు అన్నట్లు మన అన్నేళ్ళ స్నేహంలో మీరు నా మనసుని ఎంతో ఆకర్షించారు. పెళ్ళి చేసుకుంటే మీలాంటి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను.. తరువాత నా పిచ్చి ఆలోచనకి నాకు నవ్వు వచ్చింది. మీలాంటి అమ్మాయి నాకు దొరకవద్దు?.. మిమ్ములనే పెళ్ళి చేసుకోవాలి.. ఆలోచన రావడమే తడవుగా నేను మీతో మాట్లాడడానికి ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలుసు. ప్చ్.. ఇవన్నీ చెప్పడం.. అనవసరం.. కాదు wrong.. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే.. పెళ్ళి కాబోయే ఒక స్త్రీని.. ఇబ్బంది పెట్టే మనిషిని కాదు.. ఎప్పటికి మన గురించి వివేక్‌కు చెప్పను.. వివేక్ నైస్ గై!.. నిజం చెప్పాలంటే ఫేస్‌బుక్‌లో మీ ప్రొఫైల్ ఎందుకు తీసారో.. అసలు ఏమయ్యారో తెలియక చాలా బాధపడ్డాను.. నిజం చెప్పాలంటే మీ గురించి నా దగ్గర ఉన్న కొద్ది ఆధారాలతో మిమ్ములను వెతికే పని పెట్టుకొని ఇండియా బయలుదేరాను. మీరే వివేక్‌కి కాబోయే భార్య అని తెలిస్తే చస్తే నేను ఇండియా బయలుదేరేవాడిని కాదు.. వివేక్ నాకు ఎంతో, మీరు అంతే!.. వివేక్ నా బెస్ట్ ఫ్రెండ్.. don’t worry అండీ.. happy గా ఉండండి” అని సునీల్ అంటుండగానే..

వెక్కి వెక్కి ఏడుస్తూ.. రెండు చేతుల మధ్య ముఖం దాచుకుంది అమృత.

కంగారుగా అన్నాడు సునీల్.

“సారీ!.. సారీ!.. అమృత గారు!.. మీరు చాలా ఆందోళన చెందుతున్నారని అర్థమవుతుంది.”

“నన్ను మీరు ఇంతేనా అర్థం చేసుకున్నారు.. మిమ్ములను ఎంతో గొప్పగా, ప్రేమగా.. ఎప్పటికి మీ మనసుని బాధపెట్టకుండా.. చూసుకోవాలనుకున్నాను.. మీకు పెళ్ళయినా.. ఎక్కడ ఉన్నా.. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను..”

“ఒక్కసారి మనసా, వాచా, ప్రేమించిన అమ్మాయిని.. ప్రేమ ఫెయిల్ అయితేనో, వేరే వ్యక్తితో ఆ అమ్మాయికి పెళ్ళయితేనో.. ప్రేమించిన వాడు శాడిస్ట్‌లా ఎందుకు ప్రవర్తిస్తాడో నాకైతే అర్థం కాదు.. మీరు నిశ్చింతగా ఉండండి.. వివేక్.. చాలా మంచి మనిషి.. నిజం చెప్పాలంటే వాడు ఒక డైమండ్..” అని సునీల్ అంటుండగానే కోపంగా అంది..

“ఎంత సేపు.. మీ ప్రేమ ఎంతో గొప్పదన్నట్లు మాట్లాడుతారేం?.. మీకన్నా ఎక్కువ మిమ్ములను ప్రేమించాను.. ప్రేమించాను అనే కన్నా.. నా మనసులో మీరు స్థానం సంపాదించారు.. ఇరవై ఏళ్ళు ఆడుతూ, పాడుతూ.. చీకు చింతా లేకుండా పెరిగిన నా మనసులో స్థానం మీరు సంపాదించారు. ఆ స్థానంని ఇష్టం అనో, ప్రేమ అనో అనుకోవచ్చు.. ఇన్నాళ్ళు నా లోకం నా వాళ్ళు అనుకున్న నేను.. నా లోకం మీరేలా తయారయ్యాను.. ఈ విషయం ఎంతో ఇష్టం అయిన ‘మాము’తో చెబుతామని అనుకున్నాను.. తక్కిన విషయం మాము చూసుకుంటాడనుకున్నాను..”

“కాని ఈలోగా.. అనుకోని ఘోరం.. ఎవరు కలలో కూడా ఊహించని పులిలాంటి మా నాన్న మంచం పట్టారు..”

“100 ఏళ్ళు.. ఆరోగ్యంతో ఉంటాడనుకునే మా నాన్న.. అనారోగ్యంతో కాన్సర్ థర్డ్ స్టేజిలో మంచం పట్టారు.. ముందు అసలు నాన్నకి కేన్సర్ ఏమిటి అనుకున్నాం.. పులిలా ఎంతో ఆరోగ్యంగా ఉండే నాన్న పిల్లిలా అయ్యారు.. “

“బాధల్లో ఉన్న వాళ్ళకి తన చెయ్యి అందించి వాళ్ళ జీవితాల్లో సంతోషం కలిగించిన నాన్న.. నాకు తెలిసినంత వరకు.. నోరు తెరిచి ఎవరిని చిన్న సహాయం కోరని నాన్న.. కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని.. తన ఒక్కగానొక్క కూతురి జీవితం తను చనిపోయాక ఎలా ఉంటుందో అన్న భయంతో.. తన మేనల్లుడితో కూతిరి పెళ్ళి నిశ్చయించాడు. నేను, మామూ షాక్ అయ్యాం.. నేను.. నిజం చెప్పాలంటే మామూ కళ్ళెదుట పుట్టాను.. మాము నన్ను ఎత్తుకొని.. అప్పుడప్పుడు ఎత్తేసేవాడు, ఆయాస పడేవాడు.. అన్నం తినిపించేవాడు.. నోరు తుడిచేవాడు.. ఇలా చెప్పుకు పోవాలంటే.. నన్ను ఎంతో గారాబంగా, ప్రేమగా, అభిమానంగా చూసేవాడు.. మాము అంటే నాకు ప్రాణం.. ఇష్టం.. ప్రేమ.. అభిమానం అన్నీను. మామూకి అంతే!.”

“కాని నాన్నా, ఇంట్లో వాళ్ళందరూ మా మధ్య ఉన్న బంధాన్ని వివాహ బంధంగా మార్చేసారు.. మా ఇద్దరి మద్య స్నేహబంధం ఉండకూడదా?.. ఇష్టం, ప్రేమ ఒక్క వివాహ బంధంలోనే ఉంటుందా? తక్కిన వాళ్ళ మధ్య ఉండదా? ఏది అడగాలన్నా.. అక్కడ నాన్న పరిస్థితి బట్టి, అక్కడ వాతావారణం బట్టి, ఊరు ఊరంతా కాకుండా ప్రక్క ఊర్ల నుండి కన్నీళ్ళతో నాన్నను చూడడానికి వచ్చే జనాలతో అందరం బరువెక్కిన గుండెలతో ఉన్నాం.. నాన్న బ్రతకాలి.. ఆపరేషన్ జరగాలి.. కీమోథెరఫి ఇచ్చాక నాన్న ఆరోగ్యం మెరుగు పడుతుందా? అన్న అయోమయ స్థితిలో ఉన్నాం.. నాన్నకి తన పరిస్థితి అర్థమయిపోయింది. తను బ్రతికి ఉండగా.. నా పెళ్ళి ‘మామూ’తో చూడాలన్నారు.. అదే తన చివరి కోరిక అన్నారు.. నా కూతురు జీవితం నా మేనల్లుడితో అయితే నాకన్నా బాగా నా చిన్నారి తల్లిని చూసుకుంటాడు.. అని మా ఇద్దరిని.. చెరో చేతితో పట్టుకొని అభ్యర్ధించాడు.. ఎవరికి వాళ్ళమే నిర్ఘాంతపోయాం.. నోట మాట రాలేదు.. చుట్టూ ఉన్న వాళ్ళు.. మా పెళ్ళి జరుగుతుందని భరోసా ఇచ్చేసారు.. “

“మేరు పర్వతంలా ఉండే నాన్న.. మంచుకొండలా కృశించి పోయి కళ్ళల్లో ప్రాణం నింపుకొని అడగడం చూసి మేము ఇద్దరం మౌనం వహించాం.. నిశ్చితార్థం హాస్పటల్ లోనే జరిగింది..”

“హాస్పటల్‌కి నాన్న.. ఎన్నో విధాలుగా సహాయం చేసారు.. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండరులు, వెంటిలేటర్స్ ఇచ్చారు..” అని మాట్లాడుతున్న అమృత.. ఇక మాట్లాడలేని దానిలా మోనం వహించింది. కళ్ళ నుండి ఏకధాటిగా.. కన్నీళ్ళు జారసాగాయి..

కంగారుగా అన్నాడు సునీల్..

“ఏమండీ!.. ప్లీజ్ !.. అలా బాధపడకండి..”

“పాపం ‘మామూ’ చాలా నలిగిపోతున్నాడు.. బాధ అనిపించినప్పుడల్లా నేనయినా.. ఇలా.. బాధ తగ్గే వరకు ఏడుస్తాను కాని.. తన బాధని తన గుండెలోనే ఉంచుకొని నలిగిపోతున్నాడు.. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు.. ఎవరికి జరిగి ఉండదు.. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే ధ్యేయం!.. నాన్న కోసం ఏం జరిగినా పరవాలేదు.. మా జీవితాలు ఏం అయినా.. పరవాలేదు. ఫ్యూచర్ కోసం ఆలోచించే పని లేదు.. మేము ఇద్దరం ఎప్పటిలాగే ఉంటాం. నా గురించి కన్నా మామూ గురించే ఎక్కువ బాధగా ఉంది, పాపం మామూ..” అంది అమృత.

“అవునండి!.. ఇండియా నుండి వచ్చిన వివేక్ చాలా change అయిపోయాడు.. మౌనంగా, గంభీరంగా బాధగా.. ఎన్నో shades చూసి మేము దివ్యకి అన్యాయం చేసానని బాధపడుతున్నాడు ఏమో అనుకున్నాం.” అన్నాడు.

అశ్చర్యంగా, కంగారుగా అంది – “దివ్య! ఎవరు? అన్యాయం చేయడం ఏమిటి?”

“మీకు వివేక్ చెప్పలేదా దివ్య గురించి.. అఫ్‍కోర్సు.. దివ్యకి అన్యాయం అన్న మాట కరక్ట్ కాదేమో?”

“మేమంతా పి.హెచ్.డిలో చేరాం.. దివ్య, రాధిక.. ఇలా మేమంతా కలిసి వర్క్ చేస్తున్నాం.. నిజం చెప్పాలంటే మీరు ఏమనుకోనంటే ఒక మాట. మనం ఫేస్‌బుక్ ద్వారా ఒకరికి ఒకరం పరిచయం అయ్యాం.. మనిద్దరి మధ్య intimacy ఏర్పడింది.. వాళ్ళద్దరి మధ్య కూడా అంతే! కాని.. ఇద్దరూ ఒక ప్లేస్‌లో ఉండడంతో.. వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నా బయటకు చెప్పుకోలేదు.. వాళ్ళిద్దరి లవ్ చాలా విచిత్రమైనది.. silent love.. వివేక్‌కి తనంటే లైకింగ్ ఉంది, తన వాడే అని దివ్య, అలానే వివేక్ కూడా అనుకున్నాడు ఏమో!.. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి లైకింగ్ ఉందని మాత్రం తెలుసు.. ప్చ్!.. పాపం దివ్య.. వివేక్ రాక కోసం ఎంతో ఎదురు చూడసాగింది. మీతో వివేక్ వచ్చాడని తెలిసి షాక్ అయింది..”

“మైగాడ్!.. ఇంత బాధని మనసులో పెట్టుకొని, నన్ను ఓదార్చడానికి, నా బాధని పోగొట్టడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు.. వి.వీ! .. గ్రేట్.” అంది.

“వి.వీ.. ఏంటి” అన్నాడు ఆశ్చర్యంగా.

చిన్నగా నవ్వుతూ అంది..

“చిన్నప్పుడు మావయ్యకి నత్తి ఉండేది.. నన్ను అమృత అని పిలవలేక నానా అవస్థపడి, చివరికి ‘అమ్మూ’ అని పిలిచేవాడు.. అమృత అని పిలువు అని పేచీ పెట్టేదానిని.. అయినా ‘అమ్మూ’ అనే పిలిచేవాడు.. అప్పుడు. అని చిన్న నవ్వి.. “చిన్నతనం తెలియక.. ‘నన్ను అమ్మూ అంటావా?’ .. అయితే నిన్ను మావయ్యా అనను, వివేక్ అనను.. మామూ అని వి.వీ అని అంటాను’, అని అలానే పిలిచే దానిని.. పాపం మావయ్య అలానే పిలువు అనేవాడు.. పాపం మావయ్య.. నేను కొట్టినా, తిట్టినా ఏడిపించినా, ఎంత అల్లరి చేసినా భరించేవాడు.. చాలా మంచోడు.. అన్నట్లు.. ఇప్పుడు దివ్య ఎక్కడుంది?.. ఏ పరిస్థితుల్లో ఎంగేజ్‌మెంట్ జరిగిందో మావయ్య చెప్పలేదా?.. “ అంది..

“వివేక్ మిమ్మల్ని తీసుకొని వచ్చాను అన్న వెంటనే దివ్య ఇంట్లో వాళ్ళ తాతయ్యకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది.. మా ఫోనులు కూడా ఎత్తడం లేదు. బహుశా అందరి సానుభూతి, అందరి ఓదార్చే మాటలు వినలేక అనుకుంటాను..”

“జీవితంలో ఎన్నో విలువైనవి, ఆప్తులను, దగ్గిర వాళ్ళను కోల్పోతుంటాం.. అది కాలచక్రం ప్రభావం.. మనిషన్నవాడు భరించవలసిందే అనుకుంటాం.. కాని.. జీవితం ప్రారంభించిన తొలి అడుగులోనే చతికిలబడడం ఎంతో బాధాకరమైన విషయం!.. దేనినైనా సమయం దొర్లే కొద్ది మరిచిపోగలమేమో గాని మనసులో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమని ఎలా మరిచిపోగలడు మనిషి?.. నాకైతే impossible అనిపిస్తుంది” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా “సారీ అండీ, ఏవెవో మాట్లాడేస్తున్నాను.. కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి” అన్నాడు.

అర్థం కానట్లు చూసి, “సారీ ఎందుకు? ఇప్పుడేమన్నారు?” అంది.

ఒక్క నిముషం ఆగి ‘ఓహో! నేను అన్న మాటలు వినలేనట్లుంది..’ అని మనసులో అనుకొని.. గట్టిగా కళ్ళు మూసుకొని “విధి చాలా విచిత్రాలు చేస్తూ ఉంటుంది.. మిమ్ములను.. అసలు చూడగలనా? లేదా? అనుకున్నాను.. కాని మీతో కలిసి 24 గంటలు ప్రయాణం చేస్తున్నాను.. అన్నట్లు మన పరిచయం ఏది కూడా వివేక్‌కి తెలియకూడదు..” అన్నాడు.

ఒక్క నిముషం చూసి.. “మీకు మా మామూ గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు.. అసలు మీ గురించి మా మాముతో చెబుదాం అనుకున్నాను.. నాన్నకి చెప్పాలన్న ఆలోచన రాలేదు.. ఎందుకంటే నాకేం కావలసి వచ్చినా.. నేను ఏం చేయాలనుకున్నా.. నేను అనుకున్నది జరగాలంటే ఇంట్లో వాళ్లు యక్షప్రశ్నలు వేస్తారు. కాని మామూ ఏం చెప్పినా ఒక్క నిమిషం ఆలోచించికుండా సరే అంటాడు. ‘అసలే అల్లరి పిల్ల.. నువ్వు ఇలా అమృత ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటూపోతే కొండ మీద కోతి కావాలంటుంది.’ అని అమ్మ అనేది.. ‘మామూ’ మీద ఉన్న భరోసాతో.. మీ గురించి.. అదే మన గురించి మాముతో చెప్పాలనుకున్నాను కాని..”

సునీల్ – “అయితే నేను కొండ మీద కోతినా?” అన్నాడు నవ్వుతూ..

కంగారుగా సునీల్ మొఖం వైపు చూసి, ఏదో అర్థం అయిన దానిలా పగలపడి నవ్వసాగింది అమృత.

“సారీ!.. సారీ!.. మీరు కొండ మీద కోతి ఎలా అవుతారు?.. నా మనసులో స్థానం సంపాదించుకున్నారు..” అని ఏదో గర్తు వచ్చిన దానిలా.. కంగారుగా, “సారీ పిచ్చిదానిలా ఏదో అనేసాను.. ఇప్పుడు ప్రస్తుతం.. నా మనసులో మా నాన్న.. మా నాన్న తప్ప ఎవరు లేరు. అంతే!” అని.. “నాకు కొంచెం తలనొప్పిగా ఉంది” అని అటు తిరిగి పడుకుంది అమృత..

ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, “ఒ.కే.. ఒ.కే..” అని అన్నాడు సునీల్.

‘నా మనసులో స్థానం సంపాదిచారు’ అన్న అమృత మాట పదే.. పదే సునీల్‌కి వినిపించసాగింది.. తన కంగారు అర్థమైంది.. ఇప్పుడు నా మనసులో నాన్న తప్ప ఎవరు లేరు అంది. ‘ఎంత సున్నితంగా తనకి అర్థమయ్యేలా చెప్పింది’ అని మనసులో అనుకున్నాడు సునీల్.

అటు తిరిగి పడుకున్న అమృత కళ్ళలో నీళ్ళు నిండసాగాయి. ‘ఛ!.. ఛ !.. బుద్ధి లేకుండా, నా మనసులో స్థానం సంపాదించుకున్నారు అని అంది’.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here