Site icon Sanchika

మేనల్లుడు-21

[విమానం ఎక్కుతారు సునీల్, అమృత. కాసేపు మౌనంగా ఉంటారు. తమ విషయం వివేక్‌కి తెలియకూడదని అంటుంది అమృత. తనని అర్థం చేసుకున్నది అంతేనా అని అగుడుతాడు సునీల్. అమృత కన్నీరు పెట్టుకుంటుంది. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి జరగపోయినా, తాను బాధపడతానే తప్ప, బాధించే మనిషిని కాదంటాడు. తాను అమృతని ఎలా ఇష్టపడినదీ వివరిస్తాడు. అమృత వివేక్‌కి కాబోయే భార్య అని ముందే తెలిస్తే, తాను ఇండియా ప్రయాణమే పెట్టుకునేవాడిని కాదని అంటాడు. అప్పుడు అమృత తాను సునీల్ ఎంతగా ఇష్టపడినదీ చెప్తుది. చిన్నప్పటి నుండి వివేక్ తనని ఎంత అభిమానంగా చూసేవాడో చెప్తుంది. ఆ అభిమానాన్ని ఇంట్లో వాళ్ళు వివాహబంధంగా మార్చేసారని అంటుంది. తండ్రి అనారోగ్యం దృష్ట్యా తాము కాదనలేకపోయామని, ఆసుపత్రిలోని నిశ్చితార్థం జరిగిందని చెప్తుంది. తమ మధ్య వివేక్ నలిగిపోతున్నాడని అంటుంది. అవునంటూ దివ్య గురించి చెప్తాడు సునీల్.  దివ్య, సునీల్‍ల ప్రేమ గురించి తెలుసుకుని విస్తుపోతుంది అమృత. మాటల సందర్భంలో సునీల్ తన మనసులో స్థానం సంపాదించాడనీ, కానీ ప్రస్తుతం తన మనసులో నాన్న తప్ప ఎవరూ లేరని అంటుంది. – ఇక చదవండి.]

[dropcap]‘పా[/dropcap]పం! ఏమనుకున్నాడో?..’ అనుకుంది. అమాయకమైన కళ్ళు.. చూడగానే అందగాడు కాకపోయినా గభాలున ఏదో తెలియని ఆకర్షణ.. సునీల్ మొఖంలోకి చూసింది.. గతంలో ఫొటో చూసినప్పుడు ఆ మొఖంలో తెలియని ఏదో డీసెన్సీ, మంచితనం నచ్చి తనకి ఇటువంటి వ్యక్తి భర్తగా కావాలనుకుంది.. ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఎన్నో ఏళ్ళ తరువాత friend request పంపితే ఓ.కే. అంది.. నాన్నకి అలా జరగకపోతే.. ఖచ్చితంగా ఫోనులో మావయ్యకి సునీల్ గురించి చెప్పాలనుకుంది..’

చిన్న దగ్గు వినిపించడంతో ఆలోచనల నుండి తేరుకొని ప్రక్కకు చూసింది. వాటర్ తీసుకొని సునీల్ తాగుతూ.. కంగారుగా అన్నాడు..

“ప్లీజ్ బాధపడకండి.. కళ్ళు మంకెన పువ్వుల్లా ఉన్నాయి.. నా వలన పొరపాటు జరిగి మిమ్మలను బాధపెట్టాను ఏమో అనిపిస్తుంది.”

“అయ్యో!.. ఎందుకలా అనుకుంటున్నారు” అని నిర్లిప్తంగా నవ్వి.. “ఇందాక అన్నారు అది నిజం.. విధి ముందు మనుషులందరూ బలహీనులే!.. మనమూ అంతే.. ఓ.కే.. ఇప్పటి నుండి మనం బెస్ట్ ఫ్రెండ్స్” అని లేని నవ్వు తెచ్చుకొని చెయ్యి చాచింది.

చురుక్కున అమృత కళ్ళలోకి చూసాడు. ఒక్క నిముషం తడబడ్డాడు..

‘బాపు బొమ్మలా ఉంది.. పెద్ద కళ్ళు, చిన్న కళ్ళు అనడం విన్నాడు కాని ఇంత అందమైన కళ్ళు ఉంటాయని తెలియదు. కళ్ళే కాదు.. మనిషే అందమయినది.. ఫోటోలో ఇలా లేనే లేదు.. ఇప్పటి వరకు అమృత వైపు సరిగ్గా చూడనే లేదు. కారణం.. వివేక్‌కి కాబోయే భార్య అని తెలిసి షాక్ అయ్యాడు.. ఒక్క అందమే కాదు చాలా మంచి అమ్మాయి.. ఈ రోజుల్లో అసలు ఇలాంటి అమ్మాయిలుంటారా?.. ప్రేమించిన వాడితో తల్లిదండ్రులకు కనీసం చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు, కులాంతర వివాహం అంగీకరించమన్నారని.. నువ్వు వివాహం చేసుకుంటే.. మేము ఉరి వేసుకు చస్తామని తల్లిదండ్రులు అంటే మీ ఇష్టం అన్నట్లు తమకిష్టమైన వాడితో వెళ్ళిపోయిన ఆడిపిల్లలే ఎక్కువ ఉన్నారు.. కాని అమృత తండ్రి కోసం ప్రేమించిన వాడి గురించి ఆలోచించకుండా..’

“ఏంటండీ!.. నేను అడిగిన దానికి అంతలా ఆలోచిస్తున్నారు.. ఓ.కే.. అర్థమయింది లెండి.. నన్ను ఫ్రెండ్‌గా accept చేయడం ఇష్టం లేనట్లుంది. ఒకసారి ఆల్ రెడీ ఓ.కే అని.. ఇలా చేసింది.. మళ్ళీ  ఫ్రెండ్‌గా అని అంటుంది ఏమిటి? అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా” అంది..

కంగారుగా.. “నో.. నో..” అని గభాలున అమృతకి చెయ్యి అందించాడు.

***

రాజమండ్రిలో ఫ్లైట్ దిగారు..

“నేనే మాముతో.. నేను వస్తున్నట్లు మా ఇంటిలో చెప్పవద్దన్నాను.. ప్రశ్నల వర్షం కురిపిస్తారు.. అయినా సడన్‌గా వెళ్ళి అందరిని surprise చేద్దామని.. విషయం తెలిస్తే కారు పంపేవాళ్ళు.. క్యాబ్ బుక్ చేస్తారా?” అంది..

అప్పటికే “వచ్చేరా సార్” అని కారు తాళాలు తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చాడు డ్రైవర్ చలపతి.

“బాగున్నావా చలపతీ?.. కళ్యాణ్ సార్ ఎలా ఉన్నారు?” అన్నాడు.

“ఎమర్జన్సీ కేసు వస్తే ఆపరేషన్ చేయడానికి థియేటరులోకి వెళ్ళారండి” అని కారు తాళాలు సునీల్ చేతికిచ్చి, “తమరిని అమెరికా తిరిగి వెళ్ళేటప్పుడు రెండు రోజులు ఇంట్లో ఉండేటట్లు రమ్మన్నారు డాక్టరుగారు” అన్నాడు చలపతి.

“ఈ మాట ఫోనులో పది సార్లు చెప్పాడు.. మళ్ళీ నీకు కూడా చెప్పాడా?.. సరే నువ్వు వెళ్ళు.. నేను మాట్లాడుతానులే..” అని అంటుండగానే అమృత చేతిలో బ్యాగ్, పెట్టి తీసుకొని, “మీ బాక్స్ కూడా ఇవ్వండి సార్” అన్నాడు.

“నీకున్నవి రెండే చేతులు కదా చలపతీ!.. అయినా సామానులు మోయడం మాకూ అక్కడ అలవాటే.. పద పద.. నడువు” అని నడుస్తూ.. “రండి అమృత గారు..” అన్నాడు.

తన ముందు నుండి నడిచి వెళుతున్న సునీల్ వైపు చూసి మనసులో అనుకుంది.. తన అంచనా కరక్టే.. అతనితో మాట్లాడినప్పుడు.. ఒకే మాట అనుకునేది..

‘చాలా మంచి వ్యక్తి’ అని, ‘ఎంత గౌరవంగా తనతో మాట్లాడుతున్నాడు’ అని..

“అమృతగారూ!..  ఈ కారే!.. ఎక్కండి” అన్నాడు.

ఆలోచనలతో వెళ్ళిపోతున్న అమృత.. గభాలున ఆగి ఏం చేయాలో తెలియనట్లు అటు ఇటు చూసి.. సునీల్ కారు డోరు తెరిచి పట్టుకోవడంతో గభాలున కారు ఎక్కింది..

“చలపతీ!.. నువ్వు కారెక్కు.. ఎక్కడ డ్రాప్ చేయలో చెప్పు?..” అన్నాడు సునీల్..

“లేదు సార్!.. అదిగో బస్ స్టాప్!.. నేను బస్ ఎక్కి వెళ్ళిపోతాను” అని రెండు చేతులు జోడించి, “ఉంటాను సార్, ఉంటానమ్మా!..” అని తల గోక్కుని.. “చూడముచ్చటగా ఉందయ్యా మీ జంట.. శివ, పార్వతుల్లా ఉన్నారు” అన్నాడు సంతోషంగా నిండిన మొఖంతో చలపతి.

ఇద్దరూ కంగారుగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకునేలోగా.. చలపతి వెళ్ళిపోవడం చూసి..

“సారీ అమృత గారూ!.. నేను USA నుండి వచ్చినప్పుడల్లా ఇంట్లో దిగి కారు తీసుకొని కాకినాడ వెళతాను.. రిటన్‌లో.. కారు ఇచ్చేసి USA వెళ్ళిపోతాను.. చలపతి చాలా మంచోడు.. అన్నట్లు నా ఫ్రెండ్ కళ్యాణ్‌కి ఉన్న ఊరు వదలి విదేశాలు వెళ్ళడం ఇష్టం లేదు.. సర్జన్ చేసి ప్రాక్టీసు పెట్టాడు.

మేమందరం.. ప్రాక్టీసు లాభం లేదురా.. ఈగలు తోలుకోవాలి అని అంటే.. చూస్తాను.. కాదు కూడదంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు.. కాని ఇప్పుడు నెంబరు వన్ డాక్టర్ రాజమండ్రిలో.. రివర్స్ అయింది. ఇప్పుడు వాడి చుట్టూ ఈగల్లా పేషంటులు.. అన్నట్లు వాడు పెళ్ళి కూడా చేసుకొని ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాడు. నన్ను, వివేక్‌ని.. ఇంకెప్పుడు పెళ్ళి చసుకుంటారు అని ఫోనులో సతాయిస్తుంటే త్వరలోనే అని దివ్య గురించి చెప్పి, నాది లవ్ మ్యారేజ్.. త్వరలో నా మ్యారేజ్ ఉంటుందన్నాను.. ఆ విషయం తెలిసే అనుకుంటాను.. చలపతీ అలా  అన్నాడు.. again సారీ అమృత గారూ” అన్నాడు సునీల్.

కంగారుగా అంది..

“దేనికండీ?..” అని.. “ప్లీజ్.. మీరు ఏదో  mistake చేసినట్లు ఫీల్ కాకండి.. అలా అయితే నేను కూడ సారీ చెప్పాలి” అని గభాలున తల పక్కకి తిప్పి.. రోడ్డు ఇరువైపుల పచ్చని తివాచీ పరిచినట్లున్న వరి పంట వేపు చూసింది.. కళ్ళల్లో నీళ్ళు నిండసాగాయి..

***

ఇంటి ముందు కారాగింది. కారు దిగారు ఇద్దరు. మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.

“మరి నేను వెళ్ళనాండి.. మీరు.. మీరు ఇంకేం ఆలోచించకండి.. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా.. “సారీ!.. ఇతను ఎవరు ఇవన్నీ చెప్పడానికి అని అనుకోకండి.. ఇన్నాళ్ళు మనిద్దరం.. అదేనండి.. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ accept చేసారు.. మనం.. మనం.. ఫ్రెండ్స్ అనుకున్న ఉద్దేశంతో అలా చెప్పాను” అన్నాడు తడబడుతూ.. సునీల్..

నిర్లిప్తంగా నవ్వింది.. “తప్పు చేసింది నేను.. నా ప్రొఫైల్ డిలీట్ చేసి కనీసం ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు.. ఇంకా నన్ను ఫ్రెండ్‌గా అనుకుంటున్ననందుకు థాంక్స్. అన్నట్లు ఇంత దూరం వచ్చారు.. లోపలికి రాకుండా.. నాన్నగారిని చూడకుండా వెళ్ళిపోతారా?” అని అమృత అంటుడగానే.. లోపలి నుండి డా. మురారి రావడం చూసి.. “డాక్టరు గారు వచ్చారు, నాన్న ఎలా ఉన్నారో” అని కంగారుగా అడుగులేయడం, అప్పటికే డా. మురారి గారితో పాటు వస్తున్న రంగడు చూసి “అమ్మాయిగారు..” అని సంతోషంగా లోపలికి వెళ్లాడు..

“హలో డాక్టర్!.. మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని సునీల్ అనగానే..

“నువ్వా? నోరుముయ్యారా.. దూరం వెళ్ళిపోయావుగాని.. నువ్వు, వివేక్ మాకు అలా గుర్తు వస్తూనే ఉంటారు..” అని.. “అంకుల్‌కి కొంచెం కాఫ్ వచ్చి.. respiration ప్రోబ్లమ్ రావడంతో ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు. నారాయణరావుగారు హాస్పటల్‌కి రానని పేచీ పెట్టడంతో.. ఇంట్లోనే డ్రిప్‌లో మిక్స్ చేసి కిమో స్టార్ట్ చేసాను.. ఆంటీ వాళ్ళు కంగారు పడి ఉండమంటున్నారు.. వార్డ్‌లో అర్జంటుగా చూడవలసిన కేసులున్నాయి.. ప్లీజ్.. నువ్వు ఎలాగు వచ్చావ్! ప్లీజ్.. కొంచెం మెనేజ్ చేస్తావా?” అన్నాడు మురారి.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా  “సరే” అన్నాడు సునీల్.

“ఉంటాను” అని రెండు అడుగులు వేసిన డా. మురారి వెనక్కి వచ్చి..”సునీల్!.. అన్నట్లు వివేక్‌కి ఈ విషయం చెప్పకు.. వాడు.. ఇప్పటికే నారాయణరావుగారికి ఆరోగ్యం ఇలా అయిందని చాలా suffer అవుతున్నాడు. వివేక్‌కి చెబితే tension ఫీలవుతాడు.. వివేక్ అలా నాకు ఫోను చేస్తూనే ఉంటాడు” అన్నాడు.

“Sure!.. నువ్వు.. వివేక్‌తో ఆయన బాగానే ఉన్నారని చెప్పు” అని సునీల్ గబగబగా లోపలికి అడుగులు వేయబోతుంటే.. ఎదురుగా అమృత గబగబా నడుచుకుంటూ వచ్చి.. “ఏవండీ!..” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా “డాక్టర్ గారూ!.. నాన్న.. నాన్న.. నాన్నకి ఏం బావుండలేదు.. నేను USA వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు. కొంచెం నీరసంగా కనిపించారు.. కాని ఇప్పుడు.. జుత్తంతా ఊడిపోయి.. నల్లబడిపోయి.. కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని ఉన్నారు.. అర్జంటుగా మామూని రమ్మని ఫోను చేస్తానండి” అని ఏడుపు గొంతుతో అంది.

కంగారుగా చూసి అన్నాడు సునీల్..

“మీరు.. మీరు ఇందాకా.. నన్ను.. ఎవరో తెలియని వ్యక్తిని అన్నట్లు డాక్టరు గారు అన్నారు” బాధపడుతున్నట్లు అని.. “మరి నేను మీ నాన్నగారిని ఎగ్జామిన్ చేసి, అవసరం అయితే.. అప్పుడు వివేక్‌కి ఫోను చేస్తాను..” అని గబగబా లోపలికి అడుగులు వేయసాగాడు..

“డాక్టరు గారు!.. left కి పదండి..” అని అమృత అంటుండగానే గభాలున వెనక్కి తిరిగి..

“ప్లీజ్!.. డాక్టర్ అని అనకండి.. ఎప్పటిలాగే పిలవండి.. ఎందుకో తెలియదు డాక్టరు గారు అంటుంటే..” అని అంటుండగానే.. “ఇటు రండి డాక్టరు బాబు..” ఎదురు వచ్చాడు రంగడు.

నారాయణరావు బెడ్ దగ్గరకు నడిచిన సునీల్.. ఒక చేతికి డ్రిప్.. శ్వాస తీసుకోడానికి ఆక్సిజన్ పెట్టి ఉండడం.. సిస్టర్ అక్కడే ఉండడం  చూసి.. “సిస్టర్!.. కొంచెం case sheet ఇస్తారా” అనగానే, గభాలున  ఇచ్చింది..

సీరియస్‌గా.. గబగబా చదివి.. నారాయణరావు చెయ్యి పట్టుకొని పల్స్ చూడసాగాడు సునీల్.

సుమిత్ర, శారద కళ్ళనిండా నీళ్ళతో సునీల్ దగ్గరకు వచ్చి “నమస్కారం డాక్టరుగారు! ఆయన పరిస్థితి ఏం బావుండలేదు..  ఈ రోజు.. మేము మా వివేక్ బాబుకి ఫోను చేయాలనుకున్నాం.. అనుకోకుండా.. మా అమ్మాయి, తనతో పాటు మీరు వచ్చారు” అని సుమిత్ర అంటుండగానే..

“వివేక్ బాబు అక్కడే ఉన్నాడే గాని.. వాడి మనసంతా ఇక్కడే ఉంది.. తను ఉండడానికి వీలు కాక వెళ్ళాడు.. అయినా వాడు ఉండలేక మేనమామని ఒకసారి చూడమని కాబోలు మిమ్మలను పంపాడు.. దేవుడిలా వచ్చారు.. మీరు ఉంటే మాకు కొండంత ధైర్యం” అని శారద అంటుండగానే..

కంగారుగా అన్నాడు సునీల్..

“నేను..”

“డాక్టరుగారు.. మీరు రావడం మా వాళ్ళకి ధైర్యంగా ఉంది. హాస్పటల్‌లో జాయిన్ చేస్తామంటే నాన్నగారు ఒప్పుకోవడం లేదుట.. అందుకే ఇంటిలోనే ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.. డ్రిప్ ఇస్తున్నప్పుడు, మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు పేషంట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని..” అని ఆపింది అమృత.

“నేను రిపోర్ట్స్ అన్నీ చూసాను. సార్‌కి ఏం పరవాలేదు” అన్నాడు సునీల్.

“డాక్టరుగారు!.. మీరీ మాట చెబుతుంటే మా నెత్తి మీద పాలు పోసినట్లుంది.. మొన్నటి దాకా మాతో అంతో ఇంతో మాట్లాడుతున్నారు. డ్రిప్ ఇవ్వడం మొదలు పెట్టగానే ఇలా అయ్యారు” అంది కళ్ళ నీళ్ళతో సుమిత్ర.

“కంగారు పడకండమ్మా.. డ్రిప్ ఇస్తున్నప్పుడు ఇలానే ఉంటుంది.. రెండు రోజుల్లో సార్ మామూలు అవుతారు.”

“చాలా సంతోషం డాక్టరుగారు.. అన్నట్లు సార్ అంటున్నారు ఏమిటి? మా వివేక్ బాబు ఎంతో మీరు అంతే!.. అంకుల్ అనండి” అని..

“అమృత!.. డాక్టరు గారిని వివేక్ బాబు గదిలోకి తీసుకువెళ్ళు.. గది ఎలా ఉందో చూడు తల్లి. మీరిద్దరూ లేకపోయినా.. పనివాళ్ళు గదులు శుభ్రం చేస్తారు.. వెళ్ళండి డాక్టరుగారు.. స్నానం, అన్నీ ముగించుకుంటే టిఫిను చేద్దురుగాని” అంది సుమిత్ర.

“వదినా!.. డాక్టరుగారు బెడ్ కాఫీ తాగుతారు ఏమో?.. నేను వెళ్ళి పంపిస్తాను.. అమృతా!.. నువ్వు వెళ్ళు”  అని గబగగా వంటగదిలోకి వెళ్ళింది శారద.

“రండి డాక్టరుగారు!..” అని వివేక్ గదిలోకి నడవసాగింది.. ఇబ్బందిగా చూసి అమృత వెనకాలే నడిచాడు..

గదిని మూలలా చూసి.. గభాలున వాష్‌రూమ్ తలుపు ఒపెన్ చేసి చూసి, తిరిగి తలుపు వేసి “డాక్టరు గారు.. అంతా బాగానే ఉంది. ఫ్రషప్ అవ్వండి” అని సునీల్ మొఖంలోకి చూసింది.

కంగారుగా అంది అమృత – “మీరు అదోలా ఉన్నారు. అర్థమయింది.. వాళ్ళు కంగారు కొద్ది.. భయంతో.. మిమ్మలను ఉండమన్నారు. కనీసం మిమ్ములను అడగకుండానే..”

“అయ్యో! అదేం లేదండి!..” అన్నాడు.

“లేదు.. మీరు అదోలా ఉన్నారు.. మీకు ఇక్కడ ఉండడం ఇబ్బంది అయితే.. మా అమ్మకి, అత్తయ్యకు చెబుతాను.. చెప్పండి.. డాక్టరుగారు” అంది అమృత..

“ఇదిగో!.. మీరిలా డాక్టరుగారూ అనడం.. ఏం బావుండలేదు.. అన్నట్లు మీరే అన్నారు.. మనం ఫ్రెండ్స్ అని..” అని సునీల్ అంటుండగానే..

“ప్చ్!.. మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు.. మన ఇన్నేళ్ళ పరిచయం.. మనిద్దరం ఒకరికి ఒకరు తెలుసు అన్న విషయం మా వాళ్ళకు తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లో మన విషయం వాళ్ళకు తెలియకుండా ఉంటేనే మంచిది.. నాకు అలా పిలవడం, బాధగానే ఉంది.. ఇంకోలా మామూకి మిమ్ములన్నీ పరిచయం చేయాలనుకున్నాను. అనుకున్నవన్నీ జరగవు కదండీ..” అని.. కళ్ళల్లో నీళ్ళు నిండడం ఇష్టం లేనిదానిలా గబ గబా బయటకు అడుగులు వేసింది అమృత

అమృత.. ఇంత బాధపడతుందా?.. మనసులో అంత బాధను దాచుకొని బయటకు మాములుగా ఎలా ఉండగలుగుతుంది?..

తన ప్రేమ బ్రేకప్ అయినందుకు తను ఎంత బాధపడుతున్నాడో.. అంతే.. అమృత కూడా బాధపడుతుంది..

(సశేషం)

Exit mobile version