[తన గురించి, తండ్రి గురించి సునీల్‌కి చెబుతుంది అమృత. తనకి సునీల్ పట్ల ఇష్టం ఎలా కలిగిందో గుర్తు చేసుకుంటుంది. ఆమెని బాధపడద్దని అంటాడు సునీల్. ఇకనుంచి స్నేహితుల్లా ఉందామంటుంది అమృత. రాజమండ్రిలో ఫ్లయిట్ దిగుతారు. సునీల్ స్నేహితుడు డా. కళ్యాణ్ తన కారునిచ్చి డ్రైవర్ చలపతిని ఎయిర్‍పోర్టుకి పంపుతాడు. పలకరింపులు అయ్యాక, అమృతని సునీల్‍కి కాబోయే భార్యగా భావించి, జంట బాగుందని అంటాడు చలపతి. తరువాత సునీల్‍కి కారు ఇచ్చేసి చలపతి వెళ్లిపోతాడు. ఏమనుకోవద్దని చెప్పి అమృతని వాళ్ళ ఊర్లో దింపి వెళ్తానని అంటాడు సునీల్. అమృత వాళ్ళ ఇంటికి చేరేసరికి అక్కడ తన మిత్రుడు డా. మురారి కనబడతాడు. సునీల్ అతన్ని పలకరించగానే, డా. మురారి – మిత్రుడితో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడి, తనకి వార్డులో అర్జెంటు పనులు ఉన్నాయని, నారాయణరావు పరిస్థితిని సునీల్‍ని మేనేజ్ చెయ్యమని చెప్పి వెళ్తాడు. విషయం వివేక్ చెప్పవద్దని, చెబితే కంగారుపడతాడని అంటాడు డా. మురారి. సునీల్ లోపలికి వెళ్ళి నారాయణరావుని చెక్ చేస్తాడు. డ్రిప్ ఇచ్చాకా నారాయణరావులో చలనం లేదని సుమిత్రా, శారద అంటే, కంగారు పడవద్దని రెండు మూడు రోజుల్లో ఆయన మామూలవుతారని చెప్తాడు. తమ వాళ్ళు సునీల్ పరిస్థితి తెలుసుకోకుండా తమ ఇంట్లో ఉండమంటున్నారని అంటుంది అమృత. పరవాలేదని అంటాడు. తన మనసులోని బాధను దాచుకుంటున్న అమృతని చూసి జాలి పడతాడు సునీల్. – ఇక చదవండి.]
[dropcap]అ[/dropcap]వును మరి.. ప్రేమకి ఉన్న శక్తి.. మనిషి బ్రతికి ఉండగానే.. ఎటువంటి అనారోగ్యం లేకుండానే.. మనిషిని కృంగదీస్తుంది.
ప్రేమ ఫలిస్తే మధురం.. విఫలమయితే నరకం. ‘సారీ! అమృతా!..’ అని మనసులో అనుకున్నాడు సునీల్!
***
ఇంట్లో అమృత లేకపోయేటప్పటికి.. నిశ్శబ్దం అయిపోయింది. వివేక్ ఆలోచిస్తున్నాడు. ‘మామూ!..’ అంటూ మాట్లాడేది. ఎంత మూడీగా ఉన్నా.. తన కోసం ఏవేవో వంటలు చేసేది. పాపం అమృత.. నాన్న తన ప్రాణం, తరువాతే అమ్మ అని అనేది.. తండ్రి ఆరోగ్యం అలా ఉండడంతో upset అయింది.. సడన్‌గా తండ్రి చివరి కోరిక.. అని తనతో అమృత పెళ్ళి చూడాలనేటప్పటికి షాకయ్యింది.. తండ్రి పరిస్థితి చూసి నోరు మెదపలేకపోయింది.. తను అంతే!.. సమస్య పరిష్కారం మాట అటుంచి.. అసలు ఇంత బాధను పాపం అమ్మూ తట్టుకోగలదా? మగాడు తనే.. భరించలేకపోతున్నాడు. మనుషులు దూరం అయితే.. ఆ మనిషి మీద ఉన్న ప్రేమగాని.. అభిమానంగానీ రెట్టింపు అవుతాయి అని దివ్య తనకి దూరం అయితేనే తెలిసింది. తను ఎదురుగా ఉన్నప్పుడు దివ్య తన మనిషి.. అన్న ఆలోచనలతో happy గా ఉండేవాడనిపిస్తుంది. దివ్య తన మనిషి అని అనుకునేవాడు.
ఇద్దరూ ఒకరితో ఒకరు I love you చెప్పకోకపోయినా.. దివ్య తనదే అన్న ధీమాలో ఉండేవాడు.. తను పి.హెచ్.డి తీసుకున్న వెంటనే దివ్యని ఇండియా తీసుకు వెళ్ళి మావయ్య blessings తీసుకోవాలనుకున్నాడు. కాని.. అనుకోని సంఘటనతో అంతా తలక్రిందులయింది..
ఆలోచనలతోనే కారు దగ్గరకు నడిచాడు.. ఆలోచనలతోనే డ్రైవ్ చేయసాగాడు. ఆలోచనల నిండా దివ్యే!.. పాపం దివ్య.. ఈ కాలం ఆడపిల్లల్లా.. అస్సలు behave చేయదు. ప్చ్!.. అలా చేయకపోవటం వలనే ఏమో!..
పరిస్థితిని బట్టి.. మావయ్య చివరి కోరిక అని అడగడం వలన.. తను, అమృత మౌనం వహించారు. కాని తామిద్దరి కన్నా ఎక్కువ దివ్య బాధపడుతుందని అనుపిస్తుంది.. ఎందుకంటే అమ్మూకి, తనకి.. కావలసింది మావయ్య సంతోషంగా ఉండడం, ఒక వైపు మృత్యువుతో పోరాడుతున్నా.. మరో వైపు తన ఒక్కగానొక్క కూతురు జీవితం బాగుండాలని తాపత్రయపడుతున్నాడు మావయ్య.. కాని దివ్యకి.. ఎవ్వరితో సంబంధం లేదు.. మనసా, వాచా తనని ప్రేమిస్తుంది.. తనతో పెళ్ళి జరగాలని ఎంతో ఓర్పుగా వెయిట్ చేస్తుంది.. ఫ్యూచర్‌లో ఏ జరుగుతుందో తెలియకపోయినా.. జరిగింది చెప్పే బాధ్యత తనకి ఉంది.
ఈ విషయాన్ని దివ్య ఏ విధంగా తీసుకుంటుందో? ఎంత బాధపడుతుందో.. ఇన్ని రోజులు దివ్యతో మాట్లాడడానికి వీలు కుదరలేదు.. నిజం చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియక, తనని ఎలా ఓదార్చాలో తెలియక.. మౌనం వహించాడు. దివ్య ఎంత బాధపడిందో తను ఊహించడమే కాదు, దివ్య ఎవరికి చెప్పకుండా పి.హెచ్.డి వదిలేసి వెళ్ళిపోవడమే కాదు, ఎవరి ఫోను లిఫ్ట్ చేయడం లేదని, రాధిక ఫోను ఎత్తి ‘నాకు కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలని ఉంది’ అని మాట్లాడిందని సునీల్‌తో చెప్పిందట రాధిక. రాధికని ఎన్నో విషయాలు దివ్య గురించి అడగాలనుకున్నాడు.. కాని తండ్రి చనిపోవడంతో ఇండియా వెళ్ళిపోయింది.. దివ్య గురించి తెలిసుకున్నా ఏం చెప్పి దివ్యని ఓదార్చగలడు?..
ఇన్నాళ్ళు మనిధ్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డామని.. మనిద్దరి మధ్య ప్రేమ అంకురించి, ఎంత వరకు వెళ్ళిందంటే.. సండే కూడా మనం మాట్లాడుకునే వరకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిద్దరి మనస్తత్వాలు ఒకటే!.. ఇన్నేళ్ళ బట్టి మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమే అని మనిధ్దరికి తెలుసు.. ఆ భావనతోనే.. మనిద్దరి మధ్య intimacy ఏర్పడింది.. ఇవన్నీ.. నిజం కాదు.. మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు అని నేను ఎలా చెప్పగలను దివ్యా!..
అసలు నీ మొఖంలోకి సూటిగా చూసే ధైర్యం లేదు.. ఒకవేళ చూసినా.. నిన్ను గభాలున గుండెకి హత్తుకొని.. నువ్వు నాకు దూరం అయినందుకు ఎంత బాధపడుతున్నానో చెప్పాలని ఉంది.. కాని.. ఏం చేయలేకపోతున్నాను.. నన్ను క్షమించు దివ్యా.. అని మనసులో అనుకున్నాడు వివేక్. క్యాంపస్‌కి వెళ్ళి తమ స్నేహితులంతా కూర్చుండే స్థలంలో కూర్చున్నాడు.
ఎదురుకుండా ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపించడంతో చప్పున చూసాడు..
రాధికని చూసి.. “వచ్చావా రాధికా!.. I am sorry.. నాన్నగారూ..” అని సునీల్ అంటుండగానే.. “ఓ.కే.. జనన మరణాలు అన్నది సహజం.. నాన్నగారి వయసు డెభై ఏళ్లు.. చాలా రోజుల బట్టి.. అనారోగ్య సమస్యలతో.. భగవంతుడు తనని తీసుకువెళ్ళిపోవాలని ఎవరు చూడడానికి వచ్చినా ఆ మాటే అనేవారు.. కాని జీవితంలో ఏం అనుభవించకుండానే, ప్రేమని మనసులో నింపుకొని జీవితం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యకి.. ఇప్పుడైనా.. సారీ చెబితే బాగుంటుంది ఏమో! నీ మటుకు నువ్వు.. నీకేం పట్టనట్టు.. నీ లైఫ్ నువ్వు చూసుకోవడం బావుండలేదు వివేక్..” అంది.
తప్పు చేసినవాడు కనీసం సారీ చెబితే.. చేసిన తప్పు పోకపోయినా క్షమించాలా వద్దా అన్నది తరువాత విషయం..
“నువ్వు దివ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేసావు.. నాలాంటి దానికి సారీ చెప్పకపోయినా పరవాలేదు.. ముందు దివ్యకి చెప్పు. ఎందుకంటే పిచ్చిది.. దాని మనసంతా నువ్వే ఆక్రమించావు. ప్చ్!.. నీకేం అర్థం కాదులే! .. ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది.. ప్రేమ ఫెయిల్ అయితే.. ఎంత నరకమో!.. ప్రాణం తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరని..” అని రాధిక అంటుండగానే..
“ఇక ఆపు రాధికా.. ఇంకా.. ఇంకా.. మాట్లాడుతూనే ఉంటావా?.. ఎంత సేపు దివ్య గురించే మాట్లాడుతున్నావు గాని అసలు ఏం జరిగింది?.. వివేక్ ఎందుకిలా చేసాడు?.. అని ఆలోచించవా?..” అని జరిగినగదంతా చెప్పి..
“ఇప్పుడు చెప్పు.. నా స్థానంలో ఎవరున్నా తన కృతజ్ఞతను చూపించవలసిన సమయంలో.. తన తల్లి ప్రాణాలతో ఉండడానికి.. జీవితం మీద తీపి కలిగించి తల్లీ బిడ్డని తన ఇంటికి తీసుకు వచ్చి.. క్రొత్త జీవితాన్ని ఇచ్చిన మావయ్యని.. ఆయన కోరిక చివరి కోరికని.. నేను అంగీకరించేది లేదని.. ఎలా చెప్పమంటావు?
నేను అయినా, అమ్మూ అయినా ఆ సమయంలో మా గురించి ఆలోచించలేదు..
మావయ్య మనసు అల్లకల్లోలం కాకూడదని, మావయ్య కోరిక చివరి కోరిక మేమిద్దరం అంగీకరించామన్న సంతోషంతో ఆయన ఉండాలన్న ఆలోచనతోనే నేను, అమ్మూ మౌనం వహించాం..
మావయ్య ఆందోళన, భయం ఒక్కటే. Cancerతో తను చనిపోతే ఒక్కగానొక్క కూతురు జీవితం ఏమయిపోతుందో? తన కూతురు సంతోషంగా ఉండాలంటే మేనల్లుడితోనే కూతురు వివాహం జరిపిస్తే.. తను ఉన్నా, లేకపోయినా పరవాలేదనుకున్నాడు.. చివరి దశలో ఉన్న మావయ్యని బాధపెట్టడం ఇష్టం లేక.. నేను, అమ్మూ మౌనం వహించాం.. నీ దృష్టిలో నేను చేసింది తప్పే కావచ్చు” అని వివేక్ అంటుండగానే గభాలున దగ్గరకు వచ్చి వివేక్ రెండు చేతులు పట్టుకొని.. “సారీ! వివేక్ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో.. అర్థం చేసుకోకుండా.. ఏవేవో అన్నాను.. I am sorry” అని “దివ్య.. పిచ్చిది.. దాని క్రొత్త ఫోను నెంబరు ఎవరికి ఇవ్వొద్దు అంది.. అన్నట్లు.. ఈ రోజు బయలుదేరి వచ్చేస్తుంది.. వాళ్ళ తాతయ్య కోసం వస్తుంది.. చూసి మళ్ళీ వెళ్ళిపోతానంది.. ప్లీజ్ వివేక్.. నేను చెప్పినట్లు చెయ్యి..”
నువ్వు ఫోను చేస్తే లిఫ్ట్ చేసినా.. నీ గొంతు విని ఫోను కట్ చేయవచ్చు.. నీ గురించి చెప్పడానికి try చేస్తాను.. అసలు ఆ టాపిక్ ఎత్తబోతే.. ప్లీజ్.. ఇంకేం మాట్లాడకు.. నాకు పనుంది అని ఫోను పెట్టేస్తుంది.. ప్లీజ్! వివేక్ ఎలాగైనా.. దివ్యతో మాట్లాడు” అని అంది రాధిక.
“ష్యూర్!” అన్నాడు వివేక్.
***
అమృత స్నానం చేసి, రెడీ అయి రాగానే శారద, అమృత చెరో వైపు చేరి ప్రశ్నల వర్షం కురిపించసాగారు..
“అదేంటే తల్లీ!.. ఇలా వచ్చేస్తున్నట్లు ఫోనులో చెప్పలేదు.. కొంపదీసి వివేక్ బాబుతో పోట్లాడి వచ్చేయలేదు కదా?” అంది సుమిత్ర.
“అదేంటి వదినా అలా అంటావు. చిన్నతనంలో వివేక్‍తో గొడవలు పడినా.. ఇప్పుడెలా పడుతుంది చెప్పు?..” అని శారద అంటుండగానే..
“అత్తయ్యా!.. మీ ఇద్దరికి పనీ పాట లేదు. మీ మట్టుకు మీరు ఏవేవో ఊహించుకొని మాట్లేడేస్తారు..” అంది అమ్మూ.
కంగారుగా, ఆశ్చర్యంగా ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకోసాగారు..
“చూసింది చాలు కాని, ఆకలి వేస్తుంది.. టిఫిన్ పెట్టేది ఉందా? లేదా?” అంది అమృత.
కంగారుగా సుమిత్ర.. మూతలు తీసి ప్లేటులో రెండు ఇడ్లీలు, రెండు వడలు పెట్టి, చట్నీ వేసి “సాంబారు ఉంది, వేసుకో” అని అనగానే – “పూరి కూర కూడా ఉంది” అంది శారద.
“ఇన్ని టిఫిన్లు ఎందుకు?.. నాకు అక్కరలేదు” అని తినసాగింది అమృత..
“డాక్టరు గారు వచ్చారు కదా? అందుకని చేసాం.. అన్నట్లు ఇందాక మంగమ్మ డాక్టరు గారి గదిలోకి వెళ్ళి చూసి వచ్చింది.. నిద్రపోతున్నారట.. ఈ పాటికి లేచే ఉంటారు” అంది శారద..
“అయితే టిఫిన్లు లోపలికి పంపించమంటావా?” అని శారద అంటుండగానే సునీల్ బెడ్ రూమ్‌లో నుండి రావడం చూసి.. కంగారుగా అంది సుమిత్ర..
“డాక్టరుగారు రెడీ అయి వచ్చేసారు.. లోపలికి పంపమంటారా టిఫిన్స్..”.
అప్పటికే డైనింగ్ టేబిల్ వరకు వచ్చేసాడు సునీల్.. డైనింగ్ రూమ్‍లో నుండి నారాయణరావుగారి గదిలోకి వెళ్ళాలి..
“అయ్యో!.. మీరు.. మీరందరూ డాక్టరుగారూ అనకండి ప్లీజ్.. వివేక్‌ని ఎలా పిలుస్తారో నన్ను అలానే పిలవండి.. సార్‍ని ఒకసారి చెకప్ చేసి వస్తాను” అని సునీల్ అంటుండగానే.. టిఫిన్ చేస్తున్న అమృత గభాలున అంది –
“ఇప్పుడే నాన్నని చూసి వచ్చాను.. నిద్రపోతున్నారు.. మీరు ముందు టిఫిన్ చేయండి..” అని.
“అవును డాక్టరుగారు..రండి.. కూర్చోండి..” అంది సుమిత్ర..
గబగబా వచ్చి ప్లేటు తీసి.. టిఫిన్స్.. అన్నీ వరుసగా పెట్టడం చూసి..
“మైగాడ్!.. ఆంటీ.. నేను.. రెండు ఇడ్లీలు.. మాత్రమే తింటాను..” అని వడ్డిస్తున్న శారద వైపు చూసి.. అన్నాడు..
గభాలున వెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చి “అత్తయ్యా మీరు ఉండండి.. నేను పెడతాను. నిన్న ఫ్లైట్‌లో కూడ ఏం తినలేదు” అని అమృత్ రెండు పూరీలు, రెండు వడలు టిఫిన్ ప్లేటులో పెట్టడం చూసి కంగారుగా అన్నాడు సునీల్..
“వద్దండీ. ఇవన్నీ తినడం.. ఇంకేమైనా ఉందా?”.
“ఆ.. ఏం ఉంది.. మహా అయితే.. ఒక్క రోజు కాదు.. కాదు.. ఇక్కడున్ని రోజులు.. డైట్ కంట్రోలు ప్రక్కన పెట్టయండి.. అత్తయ్య చేసిన సాంబారు అదిరిపోతుంది. అన్నట్లు మా అత్తయ్య సాంబారు చేసినట్లు ఎవరు చెయలేరు” అని ఇడ్లీలు మునిగేటట్లు అమృత సాంబారు వేస్తుంటే.. కంగారుగా చూసాడు..
టిఫిన్ తింటున్నాడే కాని మనసునిండా ఆలోచనలు.. ఇన్నేళ్ళబట్టి తనతో ఉన్న పరిచయం వలనే కావచ్చు.. అమృత టిఫిన్ వడ్డిస్తుంటే మనసులో ఏవో తెలియని బాధ.. గుండె పట్టేస్తుంది..
అన్నీ అనుకూలంగా జరిగితే అమృత భర్తగా ఈ ఇంట్లో అడుగుపెట్టేవాడు..
జీవితంలో ఎప్పుడు ఏది కావాలని అనుకోలేదు.. కాని అమృత తన అర్ధాంగి కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కలలు నెరవేరే సమయం వచ్చిందనుకున్న సమయంలో అమృత తనకి దూరం అయింది..
“ఏవండీ!..” అని అమృత అనగానే.. గభాలున ఆలోచనల నుండి తేరుకొని.. చుట్టూ చూసి.. చేతిలో నున్న ఇడ్లీ ముక్క వైపు చూసి నోటిలో పెట్టుకున్నాడు..
‘ఉఫ్!.. సునీల్ ఆలోచనలు ఏమిటో తనకి తెలుసు.. తను తప్పు చేసింది.. సునీల్‌లో లేని పోని ఆలోచనలు రేపింది.. ఫ్రెండ్‌గా accept చేయకుండా, ఫేస్‌బుక్‌లో contact లోకి వెళ్ళకుండా ఉంటే సరిపోయేది.. సారీ! సునీల్.’ అనుకుంది అమృత.
“బావుంది అమృత.. డాక్టరుగారు కాఫీ తాగి నాన్నని చూడడానికి వెళ్ళారు.. నీ ఆలోచన అర్థమయింది లే!.. వివేక్ బాబుని విడిచి పెట్టి వచ్చావ్.. అందుకేగా” అని సుమిత్ర అంటుండగానే..
“కరక్టుగా చెప్పావు వదినా.. వాళ్ళ నాన్న గుర్తు వచ్చి వచ్చేసింది.. ఇప్పుడు వాడు గుర్తు వస్తున్నట్లున్నాడు” అని శారద అనగానే సంతోషంగా నవ్వింది సుమిత్ర.. ఆ నవ్వులో శృతి కలిపింది శారద.
కోపంగా అంది అమృత – “మీ ఇద్దరీకీ వేరే పని లేదా?.. అసలు ఈ ఇంట్లో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళే ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటున్నారు.. అసలు.. నా మనసులో ఆలోచనలు ఏమిటో మీకెలా తెలుస్తాయి?” అని రయ్ మని నారాయణరావు గదిలోకి అడుగులు వేసింది అమృత.
ఒక్క నిమిషం ఇద్దరు మొహమొహాలు చూసుకన్నారు. కనుబొమలు చిట్లించి చూసుకొని పకపకా నవ్వసాగారు.. ప్లేట్లు తీయడానికి వచ్చిన మంగమ్మ “అదేంటమ్మా!.. పాపం అమృతమ్మకి కోపం వస్తే.. మీరిద్దరు నవ్వుతున్నారు” అంది..
“ఓసి పిచ్చిదానా? నీకు అర్థం కాలేదా?.. అమృత ఆలోచనల నిండా వివేక్ బాబు ఉన్నాడని మేమిద్దరం గ్రహించామని ఉడుక్కుంది..” అని తిరిగి సుమిత్ర, శారదా నవ్వుకోసాగారు..
“అలాగా అమ్మా!.. మొద్దుని.. నాకు.. అర్థం కాలేదు..” అని నవ్వసాగింది మంగమ్మ..
నారాయణరావు గదిలో నుండి వచ్చిన అమృత, సునీల్ వాళ్ళందరూ నవ్వు కోవడం చూసి ఆశ్చర్యంగా – ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు..
“వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో నాకు తెలుసు.. మీకు తెలుసా?” అంది అమృత..
ఏం మాట్లాడాలో తెలియనట్లు ఒక్క క్షణం మౌనం వహించి.. “ఆ.. తెలిసింది.. సార్.. అంకుల్ ఆరోగ్యం కాస్త కుదుట పడింది కదా?.. అందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఏమో అనిపిస్తుంది.”
“అయ్యో!.. అలా అనుకున్నారా?”..
“మా ఇంట్లో వాళ్ళందరూ ఈ మధ్యన నా పెళ్ళి గురించి ఊహాలోకంలో విహరిస్తున్నారు.. ఏం అనాలో కూడ తెలియడం లేదు..” అని.. “అమ్మా!.. నేను లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళదాం అనుకున్నాను.. కాని రంగడు పని మీద రాజమండ్రి వెళ్ళాడు.. అందుకని.. డాక్టరుగారికి గుడి చూపించనట్లు ఉంటుంది.. అని ఈయన్ని తీసుకొని గుడికి వెళుతున్నాను” అంది అమృత..
“నేనే రంగడిని బయటకు పంపానమ్మా.. డాక్టరుగారికి పులస చేప రుచి చూపించాలని.. వెళ్ళి తీసుకు రమ్మన్నాను.. ఆ చేప దొరకడం కష్టం అని” సుమిత్ర అంటుండగానే..
“అబ్బబ్బ.. ఇప్పుడా హిస్టరీ అంతా ఎందుకు? మేము వెళుతున్నాం.. రండి డాక్టరు గారు” అని బయటకు అడుగులు వేసింది అమృత.
కారు బయలుదేరింది. మౌనంగా కారు డ్రైవ్ చేయసాగాడు సునీల్..
“నా గురించి మీరేం అనుకుంటున్నారో నాకు తెలుసు” అంది అమృత.
కంగారుగా చూసాడు సునీల్.
(సశేషం)