మేనల్లుడు-25

0
1

[దివ్య వచ్చిందని తెలిసి ఆమెని కలవడానికి వాళ్ళ ఇంటికి బయల్దేరుతాడు వివేక్. ఇంటి ముందు కారు ఆపి, బెల్ కొట్టగా, డా. రంగారావు తలుపుతీస్తారు. ఆయనకి నమస్కారం చేసి బావున్నారా అని పలకరిస్తాడు. అయన నవ్వి, వివేక్‌ని లోపలికి తీసుకుని వెళ్తారు. వివేక్ వాళ్ళ మావయ్య గురించి మాట్లాడి, వివేక్ ఎంత డిస్టర్బ్‌డ్ మూడ్‍లో ఉంటాడో తాను ఊహించగలలని అంటారు. తాను సారీ చెప్పాలని వచ్చానని అంటాడు వివేక్. అయితే తనకి అన్ని విషయాలు దివ్య చెప్పిందని, వర్రీ అవ్వద్దని అంటారాయన. దివ్య వచ్చిందా అని అడిగితే, ఇప్పుడామెను పలకరించకపోవడమే మంచిదని అంటాడు. దివ్య చాలా డిస్టర్బ్‌డ్‍గా ఉందని, తనతో ఉన్న ఎటాచ్‍మెంట్ మరిచిపోలేక తిరిగి వచ్చిందనీ, ఆమెను మరింత బాధపెట్టడం తనకి ఇష్టం లేదని చెప్తారాయన. జరిగినవన్నీ మరిచిపోయి, మామూలుగా అయ్యేందుకు తనకి కాస్త టైమ్ కావాలని దివ్య చెప్పిందని అంటూ తనకి దివ్యకి మధ్య జరిగినదంతా ఆయన వివేక్‍కి చెప్తారు. తాను దివ్యని కలవకపోవడమే మంచిది అంటూ వివేక్ బయటకి వచ్చేస్తాడు. కానీ ఇంటికి వచ్చినా, దివ్య జ్ఞాపకాలు అతడిని వదలవు. తనకి సారీ చెప్పాలని భావించి, మొబైల్‍లో వాయిస్ మెసేజ్ పెడతాడు. తర్వాత గుర్తొస్తుంది వివేక్‍కి – దివ్య తమ అందరి కాంటాక్ట్‌లని బ్లాక్ చేసిందని. మర్నాడు ఉదయం ఊహించని విధంగా దివ్య నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. వివేక్ తమ ఇంటికి వచ్చినప్పుడు, తాను లోపలే ఉన్నాననీ, వివేక్ గొంతు విన్నాననీ, కానీ బయటకి రావాలనిపించలేదని చెప్తుంది దివ్య. వివేక్ క్షేమంగా ఉండటమే తనకి కావల్సినది అని చెప్పి, wish you happy married life.. అని చెప్పి ముగిస్తుంది. అది విని కుప్పకూలిపోతాడు వివేక్. అమృత వాళ్ళింట్లో భోజానల సమయం. డాక్టర్ గారు మొహమాట పడుతున్నారని, అందుకని అమ్మూనే ఆయనకి వడ్డించమని అంటుంది శారద. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చిన సునీల్ – అంత పెద్ద కంచాన్నీ, అందులో వడ్డించిన పదార్థాలని చూసి కంగారు పడతాడు. తాను అన్ని తినలేనని అంటాడు. కాసేపు అతన్ని ఉడికిస్తుంది అమృత. చివరికి ఎంత తినగలడో అంత తినమంటుంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. తన కళ్ళలో నీళ్ళు సునీల్ చూడకూడదనుకుని పక్కకి తిరుగుతుంది అమృత. పాపం అమృత, పైకి చెప్పలేక లోలోపల నరకం అనుభవిస్తోందని అనుకుంటాడు సునీల్. – ఇక చదవండి.]

[dropcap]“డా[/dropcap]క్టరు గారు!.. నాన్న.. ఇలా ఎన్ని రోజులు అపస్మారక స్థితిలో ఉంటారు?.. ఇలా చూడలేకపోతున్నాను” అంది తండ్రి ముఖంలోకి చూస్తూ అమృత.

“కిమో ఇస్తున్నప్పుడు పేషంట్ ఇలా..” అని ఏం చెప్పాలో తెలియనట్లు ఒక్క నిముషం మౌనం వహించి.. “పేషంట్ వీక్‌నెస్ ఫీలవుతాడు.. అంతే కాదు.. ఆ స్థితిలో ఇలా కొంచెం డ్రౌజీగా ఉంటారు. ట్రీట్‌మెంట్ స్టాప్ చేసినాక కోలుకుంటారు.. don’t worry” అని.. “సిస్టర్!” అని సిస్టర్ కోసం చూసాడు సునీల్..

కంగారుగా దగ్గరకు వచ్చి.. “సిస్టర్ లేదు..”  చెప్పింది అమృత..

“డ్రిప్ తీసేస్తాను. డా. మురారి మదర్ expire అయ్యారుట.. వాడు.. నన్ను చూసుకోమని request చేసాడు” అన్నాడు సునీల్..

“అయ్యో పాపం!..” అని,  “అన్నట్లు సిస్టర్‌ని వద్దన్నాను” అంది అమృత.

“సిస్టర్‌ని వద్దన్నారా? ఎందుకు?.. టైమ్‌కి మందులు వేయాలి!”

“నేను నాన్నగారిని చూసుకుంటాను.. నాకు.. ఇంక పని ఏముంది?..”

గభాలున అమృత వైపు చూసాడు.

“మామూతో USA వెళ్ళేవరకు నాన్నగారికి మందులు ఇవ్వడం, డైట్ ఇవ్వడం అన్నీ నేనే చూసుకునే దానిని.. నేను లేక సిస్టర్‌ని పెట్టారు.. అమ్మ, అత్తయ్య మాట నాన్న వినరు.. చెప్పండి? నేనేం చేయాలి?” అని దగ్గరకు వెళ్ళింది..

“నేను వెళ్ళి తెచ్చుకుంటాను..” అని మెడిసిన్స్ అన్నీ ఉన్న అలమార దగ్గరకు వెళ్ళాడు.

“నాకు చెప్పండి” అని సునీల్ వెంట వెళ్ళింది.

అప్పటికే గ్లౌస్‌లు వేసుకుంటుండగా, అర్థమయిన దానిలా కావలసినవన్నీ tray లో పెట్టుకొని బెడ్ దగ్గరకు నడిచింది అమృత.

మౌనంగా బెడ్ దగ్గరకు నడిచాడు సునీల్.

డ్రిప్ తీసేసి, నారాయణరావుగారిని స్టెత్‌తో పరీక్ష చేసి, ఇంజక్షన్ చేస్తుండగా చిన్నగా కళ్ళు తెరిచాడు..

కళ్లు మూసి, కళ్ళు తెరిచి, “వివేక్ బాబూ వచ్చేసావా?.. ఇంట్లో వాళ్ళు ఎవరితో చెప్పలేదు.. నేను బ్రతకను బాబూ!.. ఈ బాధలతో బ్రతకాలని లేదు.. కాని.. ఒకే ఒక్క కోరిక.. నా బంగారు తల్లి పెళ్ళి చూసినాక నేను పోయినా పరవాలేదు.. నీతో పెళ్ళి అయితే నా బంగారు తల్లి కళ్ళల్లో తడి అన్నదే ఉండదు.. నాకన్నా బాగా చూసుకుంటావు..” అని కళ్ళు మూస్తూ చెయ్యి చాచి.. “రా వివేక్ బాబూ..” అని అన్నాడు..

చాచిన చెయ్యి వణుకుతుండడం చూసి గభాలున చెయ్యి అందించాడు సునీల్..

వెంటనే చెయ్యి పట్టుకొని.. “నా బంగారు తల్లిని బాగా చూసుకుంటావు కదూ?.. పిచ్చోడిని మళ్ళీ అడుగుతున్నాను ఏమిటి?.. నువ్వు నాకన్నా నా కూతురిని బాగా చూసుకుంటావనే నీతో పెళ్ళి చేయాలనుకున్నాను” అన్నాడు నారాయణరావు. మత్తుగా, కళ్ళు మూసే అడుగుతున్న నారాయణరావు వైపు కంగారుగా చూశాడు సునీల్.

అంతలో.. “నాన్నా!..” అని కంగారుగా అమృత అంటుండగా అప్పటికే అక్కడకు వచ్చి వింటున్న శారద, సుమిత్ర కంగారుగా.. దగ్గరకు వచ్చారు..

“ఏవండీ!.. ఒక్కసారి ఇలా చూడండి” అని నారాయణారావుని కుదుపుతూ కంగారుగా అంది సుమిత్ర..

“అన్నయ్యా!.. ఒకసారి చూడు” అంది కంగారుగా శారద.

“నాన్నా!.. నాన్నా!.. అమృతని వచ్చాను. ఒకసారి చూడండి.. నేను నాన్నా!..” అంది కళ్ళల్లో నీళ్ళు నిండుతుండగా అమృత..

నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి.. గట్టిగా పట్టుకున్న తన చేతిలో ఉన్న చెయ్యి వైపు చూసి అర్థం గానట్లు చూసాడు నారాయణరావు..

గభాలున తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు..

“ఏవండీ!.. వివేక్ బాబు ఫ్రెండ్!.. డాక్టర్ సునీల్ గారండి.. దేవుడిలా వచ్చారు.. ఎంతో శ్రద్ధగా మిమ్ములను చూస్తున్నారు. అన్నట్లు అమృత వచ్చిందండి” అంది సుమిత్ర.

“అన్నయ్యా!.. నిన్ను విడిచి పెట్టి ఉండలేక అమృత వచ్చేసింది” అంది శారద.

గభాలున అటు ఇటు చూసి.. కళ్ళు పెద్దవి చేసి “అమ్మా!.. వచ్చావా?..” అని చెయ్యి చాచాడు.

వెంటనే తండ్రి చేతిలో అమృత చెయ్యి పెట్టింది.. కళ్ళనిండా నీళ్ళు నిండాయి..

అమృత చేతిని అభిమానంగా దగ్గరకు తీసుకొని చేతి మీద ముద్దుపెట్టి.. “అమ్మా వివేక్ బాబూ రాలేదా?.. నన్ను చూసుకోవడానికి డాక్టరుగారిని పంపాడా?.. సారీ బాబూ!.. ఇందాక..” అని నారాయణరావు అంటుగడానే..

“అయ్యో!.. నథింగ్.. పరవాలేదండి..” అన్నాడు సునీల్..

“డాక్టరుగారూ!.. ఆశతో అనుకోండి!.. నేను.. కాస్త ఎప్పుడు కోలుకుంటాను డాక్టరుగారూ?..” అన్నాడు నారాయణరావు..

“సార్!.. నన్ను సునీల్ అనండి.. మీరు పెద్దవారు.. నన్ను డాక్టరుగారు అని అనకండి.. సునీల్ అనండి.. అన్నట్లు ఇందాక అన్నారు.. ఎప్పుడు కోలుకుంటానని?.. తప్పకుండా కోలుకుంటారు. కాని నేను చెప్పినట్లు చేయాలి.. మీరు ప్రశాంతంగా ఉండాలి.. మీ ఆరోగ్యం ఇలా అయింది ఏమిటని అస్సలు ఆలోచించకండి. మీరు జాగ్రత్తగా మందులు వేసుకుని నేను చెప్పిన డైట్ తీసుకుంటే.. త్వరగా మీరు కోలుకుంటారు” అని పసివాడికి నచ్చ చెప్పినట్లు చెబుతున్న సునీల్ వైపు అందరు చూడసాగారు..

అమృత అలా చూస్తూ ఉండిపోయింది. అన్నేళ్ళ ఫ్రెండ్షిప్‌లో సునీల్ గురించి, తను ఏర్పరుచుకున్న అభిప్రాయం కరక్టే!.. ఎవరో తెలియని వ్యక్తితో పరిచయం, అతని మీద అభిప్రాయం పెంచుకోవడం.. friendship request accept చేయడం అన్నీ వరుసగా అమృతకి గుర్తురాసాగాయి..

‘సునీల్!.. యూ ఆర్ గ్రేట్.. ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయినా.. ఆ కుటుంబం కోసం.. నువ్వు చేస్తున్న service great..’

‘I miss you సునీల్’ అని మనసులో అనుకుంది..

“తప్పకుండా డాక్టరుగారూ.. అన్నట్లు అలా అనొద్దు అన్నావు కదూ?.. సరే.. బాబూ అంటాను.. కాదు.. కాదు డాక్టరు బాబూ అంటాను. మీరు ఏం చెప్పినా చేస్తాను.. మరి నా కూతురు పెళ్ళికి నేను లేచి తిరగగలనా డాక్టరు బాబూ!..” అన్నాడు నారాయణరావు.

గభాలున సునీల్ వైపు చూసింది అమృత..

“ష్యూర్ సార్” అని సునీల్ అంటుండగానే..

“ఇదిగో డాక్టరు బాబు!.. నువ్వనట్లుగానే.. నేను డాక్టరు బాబూ అంటున్నాను.. నువ్వు కూడ నన్ను అంకుల్ అని పిలువు.. మా వివేక్ బాబు ఎంతో నాకు నువ్వు కూడా అంతే!..” అని అన్నాడు

మొహమాటంగా చూసి “అలాగే సార్!..” అని.. “అలాగే అంకుల్” అన్నాడు సునీల్.

సునీల్‌ని చూస్తుంటే జాలి వేసింది అమృతకి..

ఒక ప్రేమ.. నలుగురు వ్యక్తులను బాధ పెడుతుంది..

ప్రేమ పేరుకి మాత్రమే ప్రేమ!.. కాని.. గతి తప్పితే.. ప్రళయం సృష్టిస్తుందని.. తమ మధ్య ఉన్న ప్రేమే ఋజువు చేస్తుంది..

“అమ్మా! అమృతా!.. నాన్న నీ చేత్తో అన్నం తింటారట..”

“అన్నట్లు డాక్టరు గారు.. దగ్గరే ఉంటారట.. ఎందుకనుకున్నావు?.. డాక్టరుగారు చెప్పినట్లు డైట్ మందులు తీసుకుంటే.. నాలుగు రోజులు లేచి తిరగగలరని చెప్పగానే నాన్నకి లేచి తిరగగలనన్న ఆశ పుట్టింది తల్లీ!.. అన్నట్లు ఏం ఆలోచిస్తున్నావు.. కొంపదీసి వివేక్ బాబు గురించి కాదు కదా” అంది నవ్వుతూ సుమిత్ర.

అమృత ముఖం మాడిపోయింది. సర్రున కోపం మొహంలో చోటు చేసుకుంది. గభాలున సునీల్ వైపు చూసింది.

ఆశ్చర్యంగా, కంగారుగా చూసాడు సునీల్..

“చూడండి డాక్టరుగారూ.. గుండెలో వివేక్ బాబు పట్ల గంపెడంత ప్రేమని పెట్టుకొని.. ఏదో పెద్దవాళ్ళం సరదాగా ఏదైనా అంటే అమృత కోపం తెచ్చుకుంటుంది.”

“అబ్బా!.. చాలులే అమ్మా.. ఇప్పటికే ఆయన మన కోసం చాలా చేస్తున్నారు.. ముందు నాన్నకి అన్నం పెడతాను” అని నడిచింది అమృత. వెనకాలే సుమిత్ర, శారద నడిచారు.

అమృత పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది? పాపం!.. తన మనసులో వివేక్ పట్ల ప్రేమ ఉందనుకొని.. ఏవేవో అంటున్నారు.. కాని నోరు తెరిచి చెప్పలేక.. తన మనసులో ఏముందో చెప్పలేక నరకం అనుభవిస్తుంది..

అల్లారు ముద్దుగా పెరిగిన అమృత.. ఆత్మీయుల దగ్గిర కూడ నోరు మెదపలేకపోతుంది.. ఇంత కష్టాన్నీ.. ఒక్కర్తీ భరిస్తుంది..

“డాక్టరు బాబు!.. మా అమృతమ్మ గురించి ఏం అనుకుంటున్నావు.. నా కూతురని చెప్పుకోవడం కాదు.. బంగారం.. వివేక్ బాబు అంటే ప్రాణం” అని నారాయణరావు చెబుతుండగానే భోజనం తీసుకొని వస్తున్న అమృత – తండ్రి మాటలు విని.. ‘నాన్నా!.. నువ్వు అన్నట్లు ‘మామూ’ అంటే ప్రాణం, ప్రేమ, ఇష్టం.. అన్నీను.. మరి.. సునీల్ అంటే కూడ ఇవన్నీ ఉన్నాయి.. అలా అని.. మాముని ఎలా చేసుకోగలను?.. ఇష్టం!.. ప్రేమ అన్నవి.. ఉన్నంత మాత్రాన పెళ్ళితో ముడిపెడితే ఎలా నాన్నా.. రక్త సంబంధీకుల మీద, స్నేహితుల మీద కూడా ఇష్టం ప్రేమ ఉంటాయి.. ప్చ్!.. మీ అందరికి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు’ అని మనసులో అనుకుంది అమృత.

***

రోజులు దొర్లుతున్నాయి.. సునీల్ నారాయణరావుకి బాగా అలవాటయిపోయాడు. “డాక్టరు బాబూ” అని పిలుస్తూ సునీల్‌తో కబుర్లు చెప్పసాగాడు నారాయణరావు.

నెమ్మదిగా వీల్ ఛైర్‌లో కూర్చోబెట్టి గార్డెన్ లోకి అమృత తీసుకురావడం చూసి అప్పుడే గదిలో నుండి వస్తున్న సునీల్.. గబగబా దగ్గరకు వచ్చి”మీరు వదలండి అమృతగారూ!.. నేను అంకుల్‌ని తీసుకువస్తాను” అని అన్నాడు..

గార్డెన్ లోకి వెళుతుండగా.. వివేక్ నుండి ఫోను రావడం చూసి “చెప్పు వివేక్.. అంకుల్‌తో మాట్లాడుతావా?..” అన్నాడు.

“లేదు.. రాత్రి.. అప్పుడే నువ్వు పడుకోవడానికి వెళ్ళవట.. నేను ఫోను చేసి మావయ్యతో మాట్లాడాను.. సునీల్!.. మావయ్య దగ్గర మార్కలు బాగా కొట్టేసావు.. ఒకటే పొగడ్తలు.. మావయ్య ఏమంటున్నారో తెలుసా?.. ఆయన మేనల్లుడు తరువాత.. నువ్వే ఆయన మనసుకి నచ్చిన వ్యక్తివట..” అని నవ్వుతూ.. “నిజం చెప్పాలంటే ఫస్ట్ స్థానం నీకే ఇవ్వాలిరా.. ఎందుకనుకున్నావు. ఫేస్‌బుక్‌లో నచ్చిన అమ్మాయి కోసం, నీ ప్రేమ నిలబెట్టుకోవాలని ఇండియా వెళ్ళావు.. నేను ప్రేమించిన దివ్యని ఎదురుగా పెట్టుకొని.. మావయ్య చివరి కోరిక తీర్చడానికి రెడీ అయ్యాను.. ప్చ్! ప్రేమించానని చెప్పే ధైర్యం లేని పిరికివాడు ప్రేమ జోలికి వెళ్ళకూడదు.. నా దృష్టిలో ప్రేమ విషయంలో నీకే మొదటి స్థానం రా” అన్నాడు ఆవేశంగా వివేక్.

“అదేం లేదురా!.. పరిస్థితులను బట్టి ప్రేమ కూడా మారిపోతుంటుంది.. ఏమి అనుకోనంటే చిన్న మాటరా..” అన్నాడు సునీల్..

“చెప్పరా..”

“నేను ఇక వెళదాం అనుకుంటున్నాను.. నా ఫ్రెండ్ కారు నా దగ్గరే ఉండిపోయింది.. ఫోను చేసి చెప్పాను వాడికి.. నా దగ్గర మూడు కార్లున్నాయి.. అర్జంట్ లేదు.. మీ వాళ్ళను చూసి వచ్చాక రిటన్‍లో కారు ఇవ్వు అన్నాడు.. రేపు మా ఊరు వెళ్ళి మరునాడే రిటన్ అయిపోదాం అనుకుంటున్నాను” అన్నాడు సునీల్.

“ఏంటి అప్పుడే రిటన్ అయిపోతావా?.. అసలు నీ ప్రేమ సంగతి ఏం చేసావు? నువ్వు వెతికి పట్టుకోవడం కష్టం అనిపిస్తే కొంచెం క్లూ ఇచ్చినా మావయ్య వాళ్ళ అడ్రస్ వెతికి పట్టుకుంటాడు.. అసలు నువ్వు ఒక పిచ్చోడివిరా.. ప్రేమలో పడ్డావుగాని అమ్మాయి details అడగకపోవడం ఏమిటి? నువ్వు ఎందుకు USA వచ్చేస్తానంటున్నావో అర్థమయింది. అమ్మాయి అడ్రస్ తెలిసి ఉండదు.. ముందు మావయ్యకో.. అమృతకో ఫోను ఇవ్వు.. ఏవో చిన్న క్లూ ఇచ్చినా.. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వెతికి పట్టుకుంటుంది” అని వివేక్ అనగానే..

సునీల్ కంగారుగా.. “అదేం లేదు.. ఆ అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ విషయం వదిలేయ్!.. మరి రేపు నేను బయలుదేరనా?” అన్నాడు.

“ఏంటిరా? నాకు అర్థమయింది.. నేను.. నాలుగు రోజుల నుండి డిప్రెషన్ లోనే ఉన్నాను.. దివ్య పరిస్థితి ఘోరంగా ఉంది.. వాళ్ళింటికి కూడ వెళ్ళాను” అని జరిగిదంతా చెప్పి.. “నేను ఇక్కడ దివ్యకి మోసం.. అదే.. అన్యాయం చేసాను.. అక్కడ ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది. ప్లీజ్ వర్రీ కాకు..” అని వివేక్ అంటుడగానే..

కంగారుగా అన్నాడు సునీల్.. “పాపం! ఆ అమ్మాయిని ఏమీ అనకురా.. చాలా మంచిది.”

“ఏంటి, వెళ్లి కలిసావా?” కంగారుగా అడిగాడు వివేక్.

“ఆ.. కలిశాను. “

“గట్టిగా నాలుగు చివాట్లు వేయలేకపోయావా?”

“ప్లీజ్!.. ఆ టాపిక్ వదిలేయ్!.. పాపం మీ మావయ్య చాలా మంచి మనిషిరా..”

“ఏం అమృత కాదా?.. అత్తయ్యా, అమ్మ కాదా?..” అన్నాడు నవ్వుతూ వివేక్..

“ఒరేయ్! ముందు నేను చెప్పింది చెయ్! నేను వెళతానని ఆయనతో చెబితే.. ఉండమంటారు ఏమో అని..”

“సరే, నే చూసుకుంటాను.. మావయ్యకి నేను చెబుతాలే!..” అన్నాడు వివేక్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here