మేనల్లుడు-26

0
1

[సునీల్, అమృత మాట్లాడుకుంటూ ఉంటారు. నారాయణరావు ఇంకా ఎన్నాళ్లు అపస్మారక స్థితిలో ఉంటారని సునీల్ అడుగుతుంది అమృత. కీమో ఇస్తున్నప్పుడు పేషంట్లకు కొంత డ్రౌజీగా ఉంటుందని చెప్తాడు సునీల్. సిస్టర్ అని పిలిస్తే, సిస్టర్‍ని రావద్దన్నానీ, ఇకపై ఆ పనులన్నీ తాను చూసుకుంటానని చెప్తుంది అమృత. అమెరికా వెళ్ళకముందు తండ్రికి మందులు ఇవ్వడం, డైట్ ఇవ్వడం అన్నీ తానే చూసుకునేదాన్నని అంటుంది. నారాయణరావుని పరీక్ష చేస్తుండగా ఆయనకి కొద్దిగా స్పృహ వస్తుంది. సునీల్‍ని వివేక్‍గా భావించి – తన కూతురిని బాగా చూసుకోవాలి అని చెప్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సుమిత్ర, శారద నారాయణరావుని కుదిపి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వచ్చింది వివేక్ కాదని, వివేక్ స్నేహితుడు డాక్టర్ సునీల్ అని చెప్తారు. తాను ఎప్పుడు కోలుకుంటాను డాక్టరు గారు అని నారాయణరావు అడిగితే – తనని సునీల్ అని పిలవమని, త్వరలోనే తప్పక కోలుకుంటారని చెప్తాడు సునీల్. ఇదంతా చూస్తున్న అమృత – సునీల్‍తో తన పరిచయాన్ని, అతని మీద ఇష్టం పెంచుకోడాన్ని గుర్తు చేసుకుని, బాధపడుతుంది. తనిని సార్ అనద్దనీ, అంకుల్ అనమని సునీల్‍తో అంటాడు నారాయణరావు. అమృత వివేక్‍ని మర్చిపోలేక పోతోందని, అందుకే అన్యమనస్కంగా ఉంటోందని సుమిత్ర, శారద సునీల్‍తో అంటారు. రోజులు గడిచే కొద్దీ సునీల్‍పై అభిమానం పెంచుకుంటారు ఆ కుటుంబ సభ్యులు. ఒకరోజు సునీల్ వివేక్‍కి ఫోన్ చేసి, తాను అమెరికా వచ్చేద్దామనుకుంటున్నానని చెబుతాడు. తొందరపడద్దని, సునీల్ ప్రేమించిన అమ్మాయి వివరాలిస్తే అమృత కానీ, తన మావయ్య కానీ వివరాలు కనుక్కుంటారని వివేక్ అంటాడు. అవసరం లేదు, ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగిపోయిందని చెప్తాడు సునీల్. బాధపడద్దని అంటాడు వివేక్. సునీల్ వెళ్లడానికి మావయ్యని తాను ఒప్పిస్తానని అంటాడు వివేక్. – ఇక చదవండి.]

[dropcap]తె[/dropcap]ల్లవారింది..

టిఫిన్లు అన్నీ టేబిల్ మీద పెట్టసాగారు సుమిత్ర, శారద.

“వదినా!.. నా మనసుకి కాస్త ఊరటగా ఉంది. కనిపెట్టావా?.. అన్నయ్య చాలా సంతోషంగా, ధైర్యంగా ఉన్నాడు.. అన్నయ్య అలా మారడానికి కారణం.. డాక్టరుగారే!.. చాలా మంచి అబ్బాయి.. ఎవరు చేసుకుంటారో గాని ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు..” అంది శారద.

అప్పటికే automatic wheel chair లో డైనింగ్ టేబిల్ దగ్గరకు రావడం చూసి “శారదా!.. అటు చూడు మీ అన్నయ్య” అంది సుమిత్ర..

“అన్నయ్యా!.. ఎలా వచ్చావు?” అంది ఆశ్చర్యంగా శారద..

“ఇది అంతా డాక్టరుబాబు పుణ్యమే.. అసలు నెమ్మదిగా నడిచే వద్దాం అనుకున్నాను.. కాని మీరందరూ కంగారు పడతారని, అదీ గాక మిమ్మలను surprise చేద్దామని ఇలా వచ్చాను” అని చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్న భర్తని చూసి కళ్ళల్లో నీళ్లు నిండుతుంటే.. “కొద్ది రోజుల్లో ఎప్పటిలా నడుద్దురుగాని..” అని..

“ఏవండీ!.. పాపం డాక్టరు బాబు ఊరు వెళ్ళకుండా.. ఇక్కడే ఉండిపోయాడు.. ఏనాటి ఋణానుబంధమో!.. మిమ్మలను కంటికి రెప్పలా చూసుకున్నాడు.. ఇంట్లో డాక్టరు ఉంటే ఎంత ధైర్యం అండీ?” అని సుమిత్ర అంటుండగానే..

“కరక్టుగా చెప్పావు వదినా!.. డాక్టరు బాబు రేపటి నుండి ఉండడు.. కాస్త బెంగగానే ఉంది..” అంది శారద.

“ఇది అంతా కాదు శారదా?.. డాక్టరు బాబు ఋణం ఏం ఇచ్చినా తీర్చుకోలేం..” అని సుమిత్ర అంటుండగానే..

“నాకూ అలానే అనిపించింది సుమిత్రా.. నాకు ఇంకో కూతురుంటే.. కాళ్ళు కడిగి కన్యదానం చేసేవాడిని..” అని నారాయణరావు అంటుండగానే.. గదిలో నుంచి వచ్చిన సునీల్, తన గదిలో నుండి వచ్చిన అమృత నారాయణరావు మాటలు విన్నారు.. అమృత భారంగా కళ్ళెత్తి సునీల్ వైపు చూసి గభాలున అక్కడ నుండి డైనింగ్ టేబిల్  దగ్గరకు.. నడుస్తూ..

‘కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడతారనట్లు, ప్రేమ కోసం, తను ప్రేమించిన అమ్మాయిని వెతికి పట్టుకోవాలని వచ్చిన సునీల్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్ధమయింది. నాన్న అన్న మాటలు సునీల్‌ని ఇంకా బాధిస్తాయి.. సునీల్‌నే కాదు నన్నూ బాధిస్తాయి.’

‘నాన్న ఆరోగ్యంగా ఉంటే.. నాన్న కోరినట్లు, సునీల్ ఈ ఇంటి అల్లుడు అయ్యేవాడు..’ అనుకుంది.

“అమృతా!.. ఏంటి తల్లీ, అలా నిలబడిపోయి ఆలోచిస్తున్నావు?.. చూడండి డాక్టరు గారు?.. అమృత నా ఆరోగ్యం గురించి బెంగతో ఎంతో వీక్ అయిపోయింది.” అన్నాడు నారాయణరావు.

“అవును డాక్టరు బాబూ!.. USA నుండి వచ్చిన దగ్గర నుండి సరిగా భోజనం చేయడం లేదు. పడుకోవడం లేదు.. తనకెంతో ఇష్టమైన బిరియానీ కూడా తినడం లేదు” అని శారద అంటుండగానే..

“ఏమైనా అంటే jet log అంది.. ఇన్నాళ్ళు ఉంటుందా? చాలా వీక్ అయిపోయింది.. ఇలా అయితే ఎలాగు?.. అన్నట్లు బలానికి ఏదైన టానిక్ వ్రాయండి డాక్టరుగారు” అంది సుమిత్ర..

బయట నుండి కంగారుగా మంగమ్మ పరిగెత్తుకొని వచ్చి గుండె మీద చేతులు కొట్టుకుంటూ “అమ్మగారు, ఘోరం జరిగిపోయింది.. అమృతగారి స్నేహితురాలు సౌమ్య చనిపోయిందమ్మ..” అంది.

అందరూ ఆశ్చర్యంగా.. షాకైపోయారు.. అమృత షాకై కంగారుగా.. “సౌమ్య.. సౌమ్య చనిపోవడం ఏమిటి?” అంది ఆశ్చర్యంగా.

“మామూలుగా చనిపోలేదమ్మా.. ఉరేసుకున్నారట. తెల్లవారు జామున” అంది మంగమ్మ.

“ఉరేసుకుందా?” అంది కంగారుగా సుమిత్ర.

“అవునుమ్మా!.. పాపం ఆ తల్లికి అంగవైకల్యం ఉన్న బిడ్డ పుట్టాడంట.  ఆ బాధలోనే పిచ్చిదయిపోయిందట.. ఇప్పుడా తల్లి ప్రాణాలు తీసుకుంది.. అందరూ చెప్పకుంటున్నారమ్మా బజారులో” అని మంగమ్మ చెబుతుండగానే.. కుర్చీలో కూర్చున్న అమృత ప్రక్కకు ఒరిగి ధనాలున క్రింద పడిపోయింది.

“అమృతా!..” అని అందరూ దగ్గరకు పరిగెత్తారు.

గభాలున అమృత దగ్గరకు వెళ్ళి పల్స్ చూసి, రెండు చేతులతో పైకి ఎత్తి.. పట్టుకొని.. కంగారుగా అందరి వైపు చూసాడు సునీల్..

“డాక్టరుగారు.. ఆ రూమ్ లోకి..” అని “నా బంగారు తల్లికి ఏమయింది.. ఏం తినడం లేదు.. నీరసంగా ఉంటుంది అని అనుకుంటున్నాను” అని సుమిత్ర అన్నంతలో.. “అమృత సరిగా తినడం లేదని నాతో ఎందుకు చెప్పలేదు..” అని కంగారుగా.. wheel chair రిమోట్‍తో press చేస్తూ సునీల్ వెనకాలే వెళ్ళాడు నారాయణరావు. అందరూ కంగారుగా రూమ్ లోకి నడిచారు.. అమృతని బెడ్ మీద పడుకోబెటుతుండగా వాంతి చేయడంతో సునీల్ ఛాతీ మీద, చెయ్యి మీద పడింది..

“అయ్యో! అయ్యో! డాక్టరుగారి వంటి మీద వాంతి పడింది.. సారీ బాబూ” అంది కంగారుగా సుమిత్ర.

“నేను.. నేను తుడుస్తాను.. మంగమ్మా నీళ్ళు, టవలు తీసుకురా.. “ అంది కంగారుగా శారద..

“ఏంటండి మీరందరూ? వాంతి పడితే ఏమయింది? ముందు అమృతకి ఏమయిందో చూడాలి” అని అమృత చెయ్యి పట్టుకొని పల్స్ చూస్తూ “మంగమ్మా.. స్టెత్ తీసుకురా” అన్నాడు సునీల్.

మంగమ్మ పరిగెత్తుకొని వెళ్ళి స్టెతస్కోప్ తెచ్చింది..

చెంబుతో నీళ్ళు, టవలు పట్టుకొని సునీల్ దగ్గరగా వచ్చి “ఒక్క నిమిషం డాక్టరుగారూ! .. క్లీన్ చేస్తాను” అంది శారద..

“ఏంటండి?.. ముందు అమృతగారికి ఏమైయిందో చూడనివ్వండి?.. ప్లీజ్!.. నన్ను ముందు టెస్ట్ చేయనివ్వండి!..” అని స్టెత్‌తో అమృతని పరీక్ష చేసి,..”మంగమ్మా సెలయిన్ స్టాండ్ తీసుకురా!.. తక్కినవన్నీ.. నేను తీసుకుంటాను..” అని గబగబా వాష్ రూమ్ వైపు నడవడం చూసి “డాక్టరు బాబూ!.. నేను క్లీన్ చేస్తాను” అంటూ, “అన్నట్లు శారదా, డాక్టరు బాబు గదిలోకి వెళ్ళి షర్టు తీసుకురా, షర్టు మార్టుకుంటారు” అని సుమిత్ర అనగానే కాస్త కోపంగానే అన్నాడు సునీల్..

“అమృతగారికి పల్స్ చాలా lowగా ఉంది. ముందు సెలయిన్ పెట్టాలి.. ఆ పని అయినాక షర్టు మార్టుకుంటాను” అని, తనే క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టి, గబగబా క్లీన్ చేసుకొని.. సెలయిన్ బాటిల్ అన్నీ తెచ్చుకొని, అమృత చేతికి సెలయిన్ ఎక్కించసాగాడు..

తనని తాను.. మరిచిపోయి సునీల్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు నారాయణరావు.. ఆయన కళ్ళల్లో తడి చోటు చేసుకుంది..

***

“దివ్యా!.. థాంక్స్!.. ఫోను లిఫ్ట్ చేసినందుకు!.. ఎప్పుడూ ఒక మనిషిని చూసి.. ఏం చెప్పలేం.. నాకు ఎలా చెప్పాలో కూడ తెలియడం లేదు.. ఐ మీన్!.. నువ్వే కాదు.. నేనూ వివేక్‌ని అపార్ధం చేసుకున్నాను.. పరిస్థితిని బట్టి వివేక్ అలా చేయవలసి వచ్చింది.. ప్లీజ్.. దివ్యా..” అని రాధికా అనబోయేంతలో.. “కాస్త నోరు మూస్తావా?.. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు నువ్వు వివేక్ గురించి చెబుతున్నావా?.. వివేక్ దూరం అయ్యాడు.. అంత మంచి మనిషికి దూరం అయ్యానని బాధపడుతున్నాను కాని.. వివేక్ పెళ్ళి చేసుకుంటున్నాడని కాదు.. ఎప్పటికీ వివేక్ నా మనసులో ఉంటాడు” అని టపీమని ఫోను పెట్టేసింది దివ్య.

ఒక్క నిమిషం షాకైయింది రాధికా. ‘ప్చ్!.. పిచ్చిదాన్ని నేను వివేక్‌ని అపార్ధం చేసుకున్నాను..’ అని అనుకుంది తనలో రాధిక.

***

ఫ్లైట్‌లో నారాయణరావు కుటుంబం, సునీల్ కుటుంబం, దగ్గిర చుట్టాలు అంతా బయలుదేరారు.. అందరి మొఖాల్లో సంతోషం.

Window aisle seat లో సునీల్ చెయ్యి గట్టిగా పట్టుకొని కూర్చొంది అమృత..

కూతురిని అలా చూసిన నారాయణరావు కళ్ళల్లో సంతోషం!..

సుమిత్ర, శారద సంతోషంగా చిన్నగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పకోసాగారు..

“అమృతా!.. ఒక్క నిమిషం” అని అమృత చెయ్యి తీసి నిలబడి.. బ్యాగ్‌లో నుండి మందులు తీసి, వాటర్ బాటిల్ పట్టుకొని నారాయణరావు దగ్గరకు వెళ్ళి.. “టైమ్ అయింది ట్యాబ్‌లెట్స్ వేసుకోండి మావయ్యా!..” అన్నాడు సునీల్..

“ఏంటి డాక్టరు బాబూ! అర్జంటు ఏముంది? తరువాత వేసుకునేవాడిని కదా” అన్నాడు నారాయణరావు..

నవ్వుతూ అన్నాడు సునీల్.. “ముందు డాక్టరు బాబూ!.. అని పిలవకండి మావయ్యా!.. సునీల్ అనండి, ఇక మందులు అంటారా? టైమ్‌కి వేసుకోవాలి మావయ్యా!..”

“నేను వేసుకోకపోయినా, నువ్వు ఊరుకోవు కదు డాక్టర్ బాబూ!..” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా.. “అల్లుడుగారూ” అన్నాడు నారాయణరావు.

“అవునండి!.. డాక్టరుబాబూ కన్నా అల్లుడుగారు అంటే చాలా బాగుంది.. మన సొంత మనిషి.. మన ఇంటి మనిషిలా అనిపిస్తుంది.. డాక్టరుబాబూ అంటే ఎవరో పరాయి వ్యక్తిలా అనిపిస్తుంది.. అల్లుడు గారూ మేము అలానే పిలుస్తాం” అన్నారు సుమిత్ర, శారద..

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా నవ్వి, వచ్చి అమృత ప్రక్కన కూర్చున్నాడు..

“అందరూ అల్లుడు గారు అంటారు.. మరి నేను ఏమని పిలవనండి డాక్టరుగారు” అంది నవ్వుతూ అమృత..

చిన్నగా నవ్వి అన్నాడు.. “నువ్వెలా పిలిచినా ఓకే”

“డాక్టరుగారూ మరి అంత మెత్తగా ఉండకండి.. నెత్తికెక్కి కూర్చుంటాను..” అంది నవ్వుతూ..

“అంతేకదా?.. నీ ఇష్టం.. ఎక్కి కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు.. ఎందుకంటే నువ్వు నా ప్రాణం.. ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా” అన్నాడు సునీల్..

ఒక్క నిమిషం సునీల్ కళ్ళలోకి చూసి.. “బంగారం అనే పిలుచుకుంటాను.. అన్నట్లు ఇండియా వెళ్ళినాక లక్ష్మీనరసింహస్వామి గుడికి నన్ను తీసుకువెళతారు కదూ?” అంది.

“Sure.. నేనూ మొక్కుకున్నాను..”

ఆశ్చర్యంగా అంది – “ఏంటి?.. లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకున్నారా?”

“అంటే!.. నీ కోసం ఇండియా బయలుదేరినప్పుడు నువ్వు కనబడితే ఈ ఒక్క దేవుడే కాదు అన్ని గుళ్ళకి వస్తానని మొక్కుకున్నాను..”

“మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదూ?”

“ఎలా చెబుతాను?.. నువ్వు.. అదే నీకు వివేక్‌తో ఎంగేజ్‌మెంట్ అయిందని తెలిసినాక ఆ విషయం ఎలా చెబుతాను?” అన్నాడు.

ఒక నిమిషం ఆగి.. “సరే!.. ఇంతకీ ఏ దేవుడికి నేను కనబడాలని మొక్కుకున్నారు?..” అంది చిన్నగా నవ్వుతూ..

“చెప్పాను కదా?.. అన్ని గుళ్ళకి వస్తానని.. కాని..”

“కాని.. నా? .. ప్లీజ్ చెప్పండి ఆ కానీ ఏమిటో? ..”

“అంటే.. నేను.. కాకినాడ అబ్బాయినే కాబట్టి.. లక్ష్మీనరసింహస్వామికే ముందు మొక్కాను. కాని తరువాత నువ్వు కనబడతావో,లేదో అన్న భయంతో అందరి దేవుళ్ళకి కూడా మొక్కుకున్నాను.”

ఒక్క నిమిషం సునీల్ వైపు చూసి.. గభాలున సునీల్ చెయ్యి గట్టిగా పట్టుకొని భుజం మీద తల ఆన్చి అంది అమృత..

“అయితే మనిద్దరిని లక్ష్మీనరసింహస్వామి కలిపాడు.. నా నమ్మకం బలపడేలా ఆ స్వామి చేసాడు.. నేను చాలా అదృష్టవంతురాలిని..”

“మరి నేను అదృష్టవంతుడిని కాదా?” అన్నాడు సునీల్ నవ్వుతూ..

“అయ్యో!.. రామచంద్రా!.. నా ప్రాణాలు పోయేటట్లు ఉందిరా?.. ఊపిరి అందడం లేదు.. ఎంత పని చేసావురా?..” అని రాగాలు తీయడం మొదలు పెట్టింది సునీల్ నాయనమ్మ కైలాసమ్మ..

“ఏంటమ్మా! ఆ మాటలు?.. నీ చిరకాల వాంఛ.. సునీల్ పెళ్ళి చూడాలని.. వాడి పెళ్ళి చూడనిదే.. చస్తే నేను చావను.. యమధర్మరాజు వచ్చి.. నువ్వు చస్తే స్వర్గానికి పంపిస్తాను అంటే.. నా మనవడు పెళ్ళి చూడనిదే స్వర్గం అయినా, అక్కర లేదని చెబుతానని, సునీల్ పెళ్ళి త్వరగా చెయ్యి అని రోజూ నన్ను సతాయిస్తున్నావు కదమ్మా?.. “ అన్నాడు సునీల్ తండ్రి రామచంద్రుడు.

“చెట్టంత అయ్యావుగాని నాతో తిట్లు తింటావు ఎందుకురా?.. ఇంకోసారి సునీలో.. గినీలో.. అంటే ఊరుకోను.. నిక్షేపంలా ఆయన… మీ నాన్న పేరు సుబ్బయ్య అని పెట్టమంటే.. పాతచింతకాయ లాంటి పేరు అని నా మాట వినకుండా.. నీ పెళ్ళాం మాట బెల్లం అయిపోయి.. మీ నాన్న పేరు ‘సు’ కలిపి వెధవ పేరు సునీల్ అని పెట్టావు.. సుబ్బయ్య అని పెట్టనందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా?..” అంది.

“సరే లేమ్మా!.. ముందు నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో.. అన్నట్లు తినడానికి ఏమైనా కావాలామ్మా..” అన్నాడు రామచంద్రుడు..

“నోరు మూయరా అక్కుపక్షి.. కళ్ళు ముసుకుంటే ఏకంగా.. కళ్ళు మూస్తానేమో అని భయం వేస్తుంది.”

“అయ్యో!.. అంత మాట అనకండి అత్తయ్య..” అంది కంగారుగా తులసి..

“చాల్లే అమ్మా!.. నంగనాచి కబుర్లు.. అసలు ఈ పెళ్ళి ఆ దొరల దేశంలో పెట్టుకోవడానికి నువ్వే అసలు కారణం అయి ఉంటుంది..”

“నేనా అత్తయ్యా?.. అయ్యో!..”

“నేనేం తెలివి తక్కువదాన్ని కాదు.. నీ మొగుడు చిన్నప్పుడు ఆకాశంలో విమానం ఎగురుతుంటే అమ్మా విమానం ఎక్కుతానని పేచీ పెట్టేవాడమ్మా అని అంటే.. అలాగా అత్తయ్యా! నాకు విమానం ఎక్కడం అంటే ఇష్టం అని మరిసిపోయావు..”

వెనక సీటులో కూర్చున్న హరిశ్చంద్రుడు గభాలున వచ్చి”అమ్మా!.. పాపం వదినని ఏం అనకమ్మా!..” అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here