మేనల్లుడు-29

0
2

[అమెరికా బయలుదేరిన నారాయణరావు కుటుంబం, రామచంద్రుడు కుటుంబం బోస్టన్‍లో దిగుతాయి. రాధిక, డేవిడ్ వచ్చి వాళ్లకు స్వాగతం చెప్తారు. మేనల్లుడు అంటే అంత అభిమానం చూపిన నారాయణరావు గ్రేట్ అంటుంది రాధిక. వివేక్‍కి మరిచిపోలేని కానుక అందిస్తున్నారని అంటుంది. మరి తన మేనల్లుడు అనుభవించిన క్షోభ సామాన్యమైనదా అని అంటాడు నారాయణరావు. మామూ ఇదంతా సీరియస్‍గా తీసుకుంటాడేమో అని అమృత భయపడితే, నారాయణరావు ధైర్యం చెపుతాడు. రాధిక వెళ్ళి సునీల్ పెళ్ళికి బయల్దేరమని, రంగారావు గారికి, దివ్యకి చెబుతుంది. అమెరికాలో సునీల్ పెళ్ళి ఏంటని దివ్య అనుమానం వ్యక్తం చేస్తుంది. సునీల్ ప్రేమించిన అమ్మాయి ఎం.ఎస్. చెయ్యడానికి యూఎస్ వచ్చిందని, పెళ్ళికి ఒప్పుకుందని అంటుంది రాధిక. దివ్యని పెళ్ళి కూతురులా తయారై రమ్మటుంది. అక్కడికి వివేక్ వస్తాడు కదా అని అడుగుతుంది దివ్య. తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాడు అని అంటారు రంగారావు గారు. పెళ్ళి జరిగే హాలుని అందంగా, గ్రాండ్‍గా అలంకరిస్తారు. వివేక్ ఇంకా రాలేదేమని నారాయణరావు కంగారు పడుతుంటే, గిఫ్ట్ కొనడానికి వెళ్ళాడని, వచ్చేస్తున్నాడని చెప్తాడు సునీల్. హాల్లోకి వచ్చిన దివ్య, అమృతని చూసి – ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే అని రాధికతో అంటుంది. ఆలోచించు, సమాధానం దొరుకుతుంది అని చెప్తుంది రాధిక. దివ్యని, వాళ్ళ తాతగారిని రాధిక నారాయణరావుకి పరిచయం చేస్తుంది. రంగారావుకి గారికి నమస్కరించి, దివ్యని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించి – భార్యకి, చెల్లెలికి పరిచయం చేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వివేక్ వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతాడు. మేనమామ ఇంత దూరం ప్రయాణం ఎందుకు చేశాడని అడుగుతాడు. అప్పుడు నారాయణరావు తనకి అన్నీ తెలిసాయని వివేక్‍ని, అమృతని బాధపెట్టడం ఇష్టం లేకపోయిందని, అందుకే ఈ పెళ్ళి చేస్తున్నాన్ని చెప్తాడు. గతంలో వివేక్ అన్నట్టు – ఆ విధే – నాన్నకి నిజం తెలిసేలా చేసిందని అమృత అంటుంది. – ఇక చదవండి.]

[dropcap]“వి[/dropcap]వేక్ బాబూ!.. ఆ రోజు నేను నిజం తెలుసుకోలేకపోతే.. మీ ఇద్దరి జీవితాలు ఏం అయ్యేవో.. ఊహించడానికే భయం వేస్తోంది..” అంటూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పసాగాడు నారాయణరావు.

***

అమృత గదిలో నుండి చిన్నగా.. ఏడుపు.. ఎవరో మాట్లాడుతున్నట్లు నిద్దట్లో ఉన్న నారాయణరావుకు వినిపించి అప్పటికే చిన్నగా అడుగులు వేస్తున్న ఆయన అమృత గది దగ్గరగా వెళ్ళాడు.

గదిలో మంచం మీద కూర్చున్న అమృత కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ..

“ప్లీజ్!.. నా కోసం మీ ప్రయాణం ఆపుకోవద్దు. నేను ఎవరిని?.. మీకేం అవుతాను.. మీరు ఎదురుకుండా ఉంటేనే..” అని అంది సునీల్‍తో.

“ప్లీజ్!.. అలా అనకండి.. మీతో అన్నాళ్ళ పరిచయం.. ఆ పరిచయం వలన.. మనం బెస్త్ ఫ్రెండ్స్‌గా ఉండకూడదా?..”

“ఉండకూడదండి! ఎందుకంటే.. మీరు నా ఫ్రెండ్ అని నా మనసుకి నచ్చజెప్పలేను.. ఎందుకంటే.. మీ మంచితనంతో.. మీ బిహేవియర్‍తో నా మనసులో.. మీరు స్థానం సంపాదించారు. ఇప్పుడు సడెన్‍గా ఫ్రెండ్‍ అని ఎలా అనుకోమంటారు?”

“ప్చ్!.. మీరేనా ప్రేమించినది? మిమ్మల్ని వెతుక్కుంటూ.. నేను ఇండియా వచ్చాను.. నా దగ్గర.. మీ గురించి ఉన్న వివరాలతో.. మిమ్మల్ని ఎలాగైనా కలవగలనన్న ఆశతో ఉన్నాను. కానీ నేను ప్రయాణం చేస్తున్నది నేను ప్రేమించిన అమ్మాయితోనే అని తెలిసి.. షాకయ్యాను.. ఇండియా వచ్చాకా ఫ్లయిట్ దిగలేకపోయాను.. ఒంట్లో శక్తి అంతా ఎటో పోయింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మీ అమ్మగారు, అత్తయ్యగారు.. ఒక మాట అన్నారు. ‘ఫ్లయిట్ దిగిన దగ్గర నుండి.. ఏం తినడం లేదు.. నీరసంగా ఉంటున్నావు, ఏంటమ్మా, అంటే జెట్ లాగ్ అన్నావు.. చూడూ.. ఇప్పుడు ఎలా కళ్ళు తిరిగి పడిపోయావో అని అన్నారు’. అంటే మీరు ఇంకా మనిద్దరి మధ్య చోటు చేసుకున్న ప్రేమ గురించే ఆలోచిస్తున్నారని అర్థమయిపోయింది.” అంటూ ఇంకా చెప్తున్నాడు సునీల్.

“ప్లీజ్!.. మన ప్రేమ.. మీ నాన్నగారి చివరి కోరిక తీరకుండా.. అనారోగ్యంతో. ఆయన బాధపడుతూ ఉండడం మీకు మాత్రం ఇష్టమా చెప్పండి? విధికి మన ప్రేమని కలపడం ఇష్టం లేదు.. ప్చ్!.. జరిగిన దాని గురించి మనం మరిచిపోతేనే.. సార్.. మీ నాన్నగారు.. ప్రాణాలతో ఉంటారు. ఆయన చివరి కోరిక తీర్చిన వాళ్ళం అవుతాం.. ప్లీజ్ అండీ.. జరిగిపోయినది మర్చిపొండి. ఇలా అయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు ఎక్కడున్నా బాగుండాలి. మీకేం జరిగినా ఈ సునీల్ భరించలేడండి..” అని కంగారు పడి.. “అదేనండి.. ఫ్రెండ్‍గా..” అని అంటుండగా…

కన్నీళ్ళతో గొంతు పూడ్చుకుపోయి., అమృత అంది:

“మీరు.. ఏమైనా చెప్పగలరు.. మగవాడు, ఆడది అన్నింటిలో సమానం అంటున్నారు కానీ.. ప్రేమ విషయంలో మీలా అలోచించలేదు. ఎందుకంటే నేను.. ఒక ఆడపిలలను.. నా మనసులో.. మిమ్మల్ని పెట్టుకుని.. మామూలుగా ఎలా ఉండగలను? మూడు పూటలా తిండి ఎలా తినగలను?.. నేను ఇలానే ఉంటాను.. ఈమాత్రం అయినా నేను ఇలా ఉండడానికి కారణం నాన్నగారే.. నాన్న కోసమే నేను బ్రతుకుతున్నాను.. నా జీవితంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. నాన్న ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం.. ఏమీ అనుకోనంటే ఒక మాట..” అంటూ ఆపింది.

“ఏమిటో చెప్పండి” అన్నాడు సునీల్ కంగారుగా.

“ఈరోజు.. మీ ఊరు వెళ్ళబోయి నా కోసం ఆగిపోయారు.. రేపు పొద్దున్నే.. మీ ఊరు వెళ్లిపోండి.. మీరు ఎదురుకుండా నాకు కనబడవద్దు.. ప్లీజ్” అంది రెండు చేతుల మధ్య ముఖం దాచుకుని అమృత.

బాధగా చూసి, “సరే!.. వెళ్ళిపోతానండి.. కానీ రేపు ఒక్కరోజు.. మీ pulse weak గా ఉంది. Pulse rate rapid గా ఉంది. మీరు కొంచెం డైట్ తీసుకుంటే..” అని సునీల్ అంటుండగానే..

“ప్లీజ్! ఇంకేం మాట్లాడకండి. సుష్టుగా తింటాను.. మీరు మాత్రం రేపు వెళ్ళిపొండి” అంది.

నారాయణరావు గబగబా.. కొంచెం ఆయాసపడుతూనే వాకింగ్ స్టిక్‍తో అమృత గదిలోకి వెళ్లి.. “అల్లుడుగారు వెళ్ళరమ్మా. ఎందుకు వెళ్ళాలి?” అని కూతురు దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేసి.. “ఈ నాన్నని ఇంతేనా అర్థం చేసుకున్నావు?.. నీ ప్రేమని చంపేసే క్రూరుడు అనుకున్నావా తల్లీ?.. ఇన్నాళ్ళూ నువ్వూ, వివేక్ బాబూ ఎంత నలిగిపోయారా?” అని అన్నాడు.

అమృత, సునీల్ ఆశ్చర్యంగా నారాయణరావు వైపు చూసారు.

“నాన్నా!..” అని గభాలున నారాయణరావు గుండె మీద వాలిపోయింది.

“తల్లీ!.. ఇప్పటివరకు బాధపడింది చాలు.. ఇలా రండి అల్లుడుగారూ..” అని నారాయణరావు అనగానే దగ్గరకు వచ్చాడు సునీల్.

గభాలున సునీల్ చెయ్యి పట్టుకుని.. ఆ చేతిలో అమృత చెయ్యి పెట్టి.. “నువ్వు ప్రేమించిన మనిషి చాలా గొప్పవాడు. ఎందుకనుకున్నావు?.. తండ్రి కోసం నువ్వు.. నీ ప్రేమని త్యాగం చేసావు.. కాని ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం.. అల్లుడుగారు అలా ఆలోచించడం.. చాలా గొప్ప విషయం..” అన్నాడు.

అప్పటికే సుమిత్ర, శారద అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని.. సంతోషంగా దగ్గరికి వచ్చారు..

“నిన్నూ, వివేక్‍ని మేమందరం చాలా అపార్థం చేసుకున్నాం.. ఇష్టం అభిమానం, ప్రేమ.. మనుషుల మధ్య ఉంటుంది కానీ.. ప్రేమికుల మధ్యే ఉండే ప్రేమ వెలకట్టలేనిది. ఆ ప్రేమ ఇద్దరి జీవితాలను కలుపుతుందని మా బుర్రలకు అర్థం కాలేదు..” అంది సుమిత్ర.

“అవునా వదినా.. అమృతని, వివేక్‍ని.. పెళ్ళి.. అంటూ ఏవేవో మాట్లాడి వాళ్ళని బాధపెట్టాం” అంది శారద.

“అత్తాయ్యా! నీ కొడుకు.. నాన్నా నీ మేనల్లుడు.. తనతోనే పి.హెచ్.డి. చేస్తున్న దివ్యని ఇష్టపడ్డాడుట..” అంటూ జరిగినదంతా చెప్పింది అమృత.

“అల్లుడుగారూ!.. మనమందరం అమెరికా వెళ్లాలి.. అర్జెంటుగా..” అన్నాడు నారాయణరావు.

“మనం వెళ్ళాలా? ఎందుకండి? ఇలాంటి సమయంలో మీరు జర్నీ చేయకూడదు”

“ఎవరు చెప్పారు?.. ఆ మాట నేను చెప్పాలి.. నేను ప్రయాణం చేయగలను.. అన్నట్లు మీవాళ్ళు ఎంతమంది వస్తారో కనుక్కోండి.. కావలసిన వాళ్ళని రమ్మనండి.. ఎవరికైనా పాస్‌పోర్ట్‌లు లేకపొతే ఆ పని చేయడానికి ఒక మనిషి ఏడుకొండలు ఉన్నాడు. సుమిత్రా, శారదా… అందరూ అమెరికా వెళ్ళడానికి రెడీ అవ్వండి” అన్నాడు నారాయణరావు.

“అయితే ఇప్పుడే మామూకి ఫోన్ చేసి చెబుతాను నాన్నా..” అని సెల్ తీయబోయింది అమృత.

గభాలున సెల్ అందుకొని “వద్దామ్మా.. వివేక్ బాబు సంగతి తెలుసు కదా?.. నేను ప్రయాణం చేయకూడదని తను బయలుదేరి వచ్చేస్తాడు. అంతేకాదు.. వచ్చి నీ పెళ్ళి జరిపిస్తాడు.. కానీ తన పెళ్ళి గురించి ఆలోచించడు.. అంతే కాదు ఆ అమ్మాయి.. ఈ లోగా ఎంత బాధపడుతుందో.. ప్చ్! ఇప్పటి వరకు జరిగింది చాలు.. నీ పెళ్ళే కాదమ్మా.. నా మేనల్లుడి పెళ్ళి కూడా నా కళ్ళతో చూడాలి.” అమృతతో అని, “అన్నట్లు అల్లుడుగారు.. అమెరికాలో మనమందరం బస చేయడానికి, పెళ్ళి ఎరేంజ్‍మెంట్స్‌కి, ప్రయాణం ఖర్చులకి కావలసినదంతా గుమాస్తా చూసుకుంటాడు.. ప్రొద్దున్న గుమాస్తా వస్తాడు..” అని నారాయణరావు అంటుండగానే..

“నేను చూసుకుంటాను మావయ్యా.. నేను వెళ్ళి మా వాళ్ళని తీసుకువస్తాను.. అన్నట్లు..” అని ఒక్క నిమిషం ఆగి.. “నానమ్మ ఉంది.. వయసు దగ్గరగా 90 ఏళ్ళు.. ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి నా పెళ్ళి చూడాలి అని, మనవరాలిని చూడాలి అని మావాళ్ళని వేపుకు తింటుంది.. మావాళ్లతో పాటు నాయనమ్మని తీసుకువస్తాను.. అమృతని చూపెడదామని..” అన్నాడు సునీల్.

“ఏంటి అల్లుడుగారు.. అంత మొహమాటపడితే ఎలాగండి.. పెద్దవాళ్ళ ఆశీర్వాదం దొరకటం ఎంత అదృష్టం బాబూ?.. ఆవిడని కూడా అమెరికా తీసుకువెళదాం.. చాలా టైమ్ అయింది.. అందరు వెళ్ళి పడుకోండి” అని, “అన్నట్లు ఆడపెళ్ళివారం మేమే ముందు మీ ఇంటికి రావాలి.. వాళ్లు ఎందుకు బాబూ?.. బాగోదు” అన్నాడు నారాయణరావు.

“మావయ్యగారూ!.. మీరు అమెరికా బయలుదేరే వరకు రెస్ట్‌లో ఉండాలి.. మా వాళ్ళు అలా లెక్కలు వేసే మనుషులు కాదు.. నేను వెళ్ళి మావాళ్ళని తీసుకువస్తాను” అన్నాడు సునీల్.

***

చెప్పడం పూర్తి చేసాడు నారాయణరావు. జరిగినదంతా విన్న వివేక్, ఆయన దగ్గరకు వెళ్ళి కౌగిలించుకుని, “మావయ్యా! నా కోసం.. ఇంత దూరం వచ్చావా?.. నేను ఎంత అదృష్టవంతుడిని మావయ్యా!” అని అన్నాడు.

“నువ్వు కాదు వివేక్ బాబూ!.. నీలాంటి మేనల్లుడు ఉండడం నా అదృష్టం..” అని దివ్య కేసి చూసి, “ఏంటమ్మా, ఇంకా అక్కడే ఉన్నావు.. రా తల్లీ!” అని చెయ్యి చాచాడు.

గబగబా దగ్గరకు వచ్చి.. గభాలున వంగి నారాయణరావు కాళ్ళకి నమస్కరించింది.

“ఏంటి బాబూ!.. అలా చూస్తావు.. నువ్వూ పెద్దాయన కాళ్ళకి నమస్కరించు.. దంపతులు కలిసే ఆశీర్వాదం తీసుకోవాలి.. అప్పుడే ఫలితం దక్కుతుంది” అంది కైలాసమ్మ.

గభాలున వంగి నారాయణరావు కాళ్ళకి నమస్కరించాడు వివేక్.

“వివేక్ బాబూ!.. మీరిద్దరూ బామ్మగారి ఆశీర్వాదం తీసుకోండి.. అన్నట్లు బామ్మగారు సునీల్ నానమ్మ గారు..” అన్నాడు నారాయణరావు.

“వద్దులే నారాయణరావు గారూ!.. ముహూర్త సమయం దగ్గరవుతోంది.. అన్నట్లు పంతుళ్ళు ఒకరు కాదు ఇద్దరు వస్తున్నారని అబద్ధం చెప్పి నన్ను నమ్మిస్తున్నారా?.. అయ్యో.. అయ్యో శాస్త్రులు గారు లేకుండా, మంత్రాలు లేకుండా, కొబ్బరి మట్టలతో మండపం లేకుండా పెళ్ళి ఏమిటి?” అంటూ రాగాలు తీయసాగింది కైలాసమ్మ.

“బామ్మా! కాస్త నోరు తగ్గించు!.. అదిగో ఒకరు కాదు.. ఇద్దరు శాస్త్రుళ్లు వస్తున్నారు” అంటూ ఫుల్ సూటులో స్టయిల్‍గా వస్తున్న.. మేరు పర్వతాల్లాంటి పర్సనాలిటీలతో ఉన్న వాళ్ళని చూపించి, “నమస్తే విశ్వనాథ శాస్త్రి గారు, శంకరశాస్త్రి గారు! ఆలస్యం చేసారు.. మా నాయనమ్మ గారు ఒకటే వర్రీ అయిపోతున్నారు..” అన్నాడు సునీల్.

“నోరు మూసుకోరా.. నేనెంత చదువుకోకపోతే మాత్రం.. వీళ్ళు పంతుళ్ళు అంటే నమ్ముతాననుకుంటున్నావా? గాదె కింద పందికొక్కుల్లా ఉన్నారు.. పిలకలు లేవు.. నుదుటి మీద బొట్టులు లేవు” అని కైలాసమ్మ అంటుండగానే గభాలున దగ్గరకు వెళ్ళి.. “మైగాడ్! వాళ్లు విన్నారో ఏమో!.. కొంపలంటుకుంటాయి..” అని భయంగా వాళ్ళ వైపు చూసాడు సునీల్.

“We cannot hear what did the old woman say” అన్నారు విశ్వనాథ శాస్త్రి, శంకరశాస్త్రితో.

గభాలున అన్నాడు నారాయణరావు.. “చూడండి శాస్త్రి గారు.. పెద్దావిడ.. ఊరి నుండి వచ్చారు.. మనవడి పెళ్ళి శాస్త్రోక్తంగా జరగాలని ఆవిడ కోరిక.. ఊళ్ళల్లో శాస్త్రుళ్ళు ఇలా ఉండరు కదా.. ఆవిడ డౌటు పడుతోంది”

విశ్వనాథ శాస్త్రి, శంకర శాస్త్రి పకపకా నవ్వి.. “ఓహ్!.. అదా మీ డౌటు?” అని

“Be Roman, when you are in Rome.. అన్నారు..” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా, “బామ్మగారూ! మేము అసలు సిసలైన వేద పండితులం.. అమెరికా రావడానికి ఎన్నో పరీక్షలు.. వేదాల్లోవి.. వ్రాసి పాసయి వచ్చాం.. మీరు నిశ్చింతగా ఉండండి.. అన్నట్లు మేము రాజమండ్రి వాసులం” అని శంకరశాస్త్రి గారు అనగానే..

“సంతోషం నాయనా.. ఇలాగే పెళ్ళి జరిపిస్తారా?” అంది కైలాసమ్మ.

“పండూ! మా బట్టలు డ్రెస్సింగ్ రూమ్‍లో పెట్టు” అన్నారు విశ్వనాథశాస్త్రి.

“అలాగే సార్!” అని బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు పండు.

శంకరశాస్త్రి, విశ్వనాథ శాస్త్రి ముందుకు అడుగులు వేయబోయారు.

“ఒక్క నిమిషం శాస్త్రి గారు” అని, “కాస్త దగ్గరిగా వస్తారా?”అని అటూ ఇటూ చూసింది కైలాసమ్మ.

దగ్గరకు వెళ్ళి “చెప్పండి బామ్మగారు?” అన్నారు శంకరశాస్త్రి.

“అడగడానికి కాస్త మొహమాటంగానే ఉంది.. కానీ అడిగేస్తున్నాను.. రెండు జంటలకు తొలిరాత్రి.. అదే శాస్త్రులు గారు.. శోభనంకి ముహూర్తం పెట్టారా?.. ఒకవేళ పెట్టకపోతే పెళ్ళయిన వెంటనే కానీ, రేపు కాని శోభనానికి ముహూర్తం పెట్టించండి.. నాకో మునిమనవడు పుడితే.. వాడిని కళ్ళారా చూసి నేను స్వర్గానికి పోతాను” అంది కైలాసమ్మ.

అందరూ పగలబడి నవ్వసాగారు.

“ఏంటమ్మా! ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా.. మాట్లాడడమేనా?” అన్నాడు రామచంద్రుడు.

“అసలు అనవసరంగా అమ్మని తీసుకువచ్చాం అన్నయ్యా..” అన్నాడు హరిశ్చంద్రుడు.

“నువ్వు నోరు ముయ్యరా.. నేను ఏవో అనకూడని మాటలన్నట్టు అన్నయ్య అనీ అనగానే.. ఏదో ఒకటి అంటావు” అంది కైలాసమ్మ.

“పోనీలెండి! పెద్దావిడ.. మునిమనవడు కావాలని అడగడంలో తప్పులేదు.. ఈ రోజు పెళ్ళి కాదు బామ్మగారు.. ఎంగేజ్‍మెంట్.. అంటే నిశ్చితార్థం.. రేపు పెళ్ళి.. ఈ రోజు సంగీత్ పార్టీ పెట్టుకున్నారు.. మరి నేను వెళ్ళి పట్టుపంచ కట్టుకుని వస్తాను” అని అడుగులు వేశారు విశ్వనాథ శాస్త్రి.

“ఏంటీ సంగీతా..” అని ఆశ్చర్యంగా గడ్డం పట్టుకొని.. “ఆఁ, ఆఁ, ఈ మధ్యనే టి.వి.లో చూసాను.. పెళ్ళికి ముందు.. గెంతుతారు పాటలకి.. అదేనా?.. అయినా నీకేం గెంతడం వచ్చురా?.. ముఖాలకి రంగులు రాసుకునే సినిమా వాళ్ళు గెంతుతారు.. ఆ పిచ్చి పాటల కోసం పెళ్ళి రేపటికి వాయిదా వేసావా సుబ్బు?” అంది కైలాసమ్మ.

“సుబ్బు.. సుబ్బు.. ఎవరు?” అంటూ కంగారుగా చూసాడు వివేక్.

నవ్వుతూ.. “మామూ.. ఇదిగో.. ఈయనే..” అన్నట్లు చెయ్యి సునీల్ వైపు చూపింది అమృత.

అందరూ పగలబడి నవ్వసాగారు.

అటూ ఇటూ చూసి గభాలున వివేక్ నడుము దగ్గర నుండి చెయ్యి పోనిచ్చి గట్టిగా చెయ్యి పట్టుకొంది దివ్య.

వివేక్ కళ్ళు సంతోషంతో మెరిసాయి.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here