Site icon Sanchika

మేనల్లుడు-3

[విమాన ప్రయాణంలో ఉన్న వివేక్ తన గతం గుర్తుచేసుకుంటాడు. వివేక్ చిన్నతనంలోనే అతడి తండ్రి రమణ అప్పులు చేసి ఇల్లు వదిలి పారిపోతాడు. మేనమామ నారాయణరావు వచ్చి ఆ అప్పులు తీర్చి, చెల్లెలు శారదని, మేనల్లుడి వివేక్‍ని తన ఊరుకి తమ ఇంటికి తీసుకువెళతాడు. నారాయణరావు భార్య సుమిత్ర ఆడపడుచుని, మేనల్లుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది. శారదని తాను ఇన్నాళ్ళు ఓ నరకకూపంలో ఉంచానని అనుకుంటాడు నారాయణరావు. వివేక్‍కి నచ్చే వంటలన్నీ చేసి పెడతారు. తమ ఆదరణతో శారద తన దుఃఖాన్ని మరిచేటట్టు చేస్తారు నారాయణరావు సుమిత్ర దంపతులు. – ఇక చదవండి.]

[dropcap]రో[/dropcap]జులు దొర్లుతున్నాయి. హాలులో కూర్చోని పేపరు చదవసాగాడు నారాయణరావు.

“తిను వివేక్ బాబూ! అలా వదిలేయకూడదు.. బాగా తింటే బలం వస్తుంది. బలం వస్తే బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయవచ్చు” అంది సుమిత్ర.

“వదినా!..” అని సంతోషం నిండిన మొహంతో “గ్లాసెడు పాలు తాగించావు. మూడు ఇడ్లీలు తినడానికి వాడి పొట్ట ఖాళీ ఉండొద్దు?” అంది శారద.

“నీ దిష్టే తగిలేటట్టు ఉంది..” అని మిగిలిన ఇడ్లీ ముక్క దిష్టి తీసి “ఏమీ అనుకోకు శారదా.. ఒకొక్కప్పుడు తల్లి దిష్టి కూడా తగులుతుందట” అంది.

“అయ్యో!.. వదినా.. నిజం చెప్పమంటావా? తల్లి లాంటి వదినని పెట్టుకొని అక్కడ నరకకూపంలో ఎందుకు ఉన్నానా? అని బాధపడుతున్నాను.”

“ఇద్దరూ కబుర్లు తరువాత చెప్పుకుందురుగాని ముందు వివేక్ బాబుకి ఎదురు వచ్చి, స్కూలికి వెళ్లడానికి కారు ఎక్కించండి.. మొదటి రోజు కదా? నేను వెళ్లి.. వివేక్ బాబుని క్లాసులో కూర్చోబెట్టి వస్తాను” అన్నాడు నారాయణరావు.

“పక్క సందులో స్కూలుకి కారులో వెళ్లడం ఏమిటండి? మీకు చాదస్తం ఎక్కువయిపోయింది” అంది సుమిత్ర.

“అన్నయ్యా! ఆ మాత్రం వాడు నడవకపోతే ఎలా? అయినా సీతమ్మ వాడిని నడవనీయకుండా ఎత్తేసుకుంటుంది..” అంది శారద.

“వివేక్ బాబూ! ఆ స్కూల్లో చదవడం ఏమిటి? రాజమండ్రి St. Anns స్కూల్లో జాయిన్ చేసాను.. చాలా మంచి స్కూలు.. అలాంటి స్కూలో జాయిన్ చేస్తే కలెక్టరో? డాక్టరో? అవుతాడు.. ఏం వివేక్ బాబూ! నిజమేనా?” అన్నాడు.

“అవును మావయ్యా!.. అమ్మని ఇన్ని రోజులు నాన్న ఏడిపించాడు కాబట్టి నేను డాక్టరై బోలేడు ఇంజక్షనులు నాన్నకి చేస్తాను.. అప్పుడు నాన్న కూడా ఏడుస్తాడు” అన్నాడు వివేక్.

అందరూ షాకైయ్యారు.

‘వాడి చిన్న మనసులో తండ్రి పట్ల ఎంత కోపం ఉంది?’ మనసులో అనుకొని వివేక్‌ని తీసుకొని కారెక్కాడు నారాయణరావు.

***

ఆదివారం కావడంతో మేనల్లుడు వివేక్‌కి నలుగు పెట్టి తల మీద ఆయిల్ వేసి మర్ధనా చేయడం చూసి – “అమ్మగారు!.. మీరలా కూర్చోండమ్మా.. నేను బాబుకి స్నానం చేయిస్తాను..” అంది మంగమ్మ.

“నువ్వే కూర్చొని చూడు.. నా మేనల్లుడికి నేను తలంటుకుండా నువ్వు అంటడం ఏమిటి?” అని స్నానం చేయించి, సీతమ్మ తెచ్చిన సాంబ్రాణి వివేక్ క్రాఫ్‌ని చెల్లా చెదురు చేస్తూ ఆరబెట్టి, చంకన వేసుకొని, డైనింగ్ టేబిల్ దగ్గరకు నడిచి “వివేక్ బాబూ! నీకిష్టమైన సాంబారు అన్నం, చికెన్ ఫ్రై.. చక్కగా తినేసి బజ్జుందువుగాని..” అని తినిపించి, మూతి తుడిచింది.

“అత్తయ్యా! నిద్ర వస్తోంది.. జోకొట్టవా?” అన్నాడు వివేక్. అంతా చూస్తున్న శారద నవ్వుతూ అంది.

“ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలి అంటారు కాని.. మీ అత్తయ్యకి 24 గంటలు ముద్దు వస్తావు” అని సుమిత్ర దగ్గర వచ్చికూర్చుంది శారద.

సుమిత్ర ఒళ్లోనే నిద్రపోయిన వివేక్‌ని మంచం మీద పడుకోబెట్టబోయింది సుమిత్ర.

“అత్తా!.. నీ దగ్గరే పడుకుంటాను” అని సుమిత్ర ఒళ్లో గువ్వలా ఒదిగిపోయి గట్టిగా కుడి చేత్తో సుమిత్రని పట్టుకున్నాడు.

చప్పున సుమిత్ర కళ్లల్లో నీళ్లు నిండాయి.

“వదినా!.. బాధపడకు.. సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. తప్పకుండా నీకు పిల్లలు పడతారు.. మందులు వాడుతున్నావా?” అంది.

“వాడుతున్నాను శారద.. ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా నాలాంటి వాళ్లు చాలా మంది ఉంటూనే ఉన్నారు” అంది నిరాశగా సుమిత్ర.

“లేదు వదినా!.. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు మాత్రం ఎందుకు బాధపెడతాడు?.. తప్పకుండా నీకు పిల్లలు పుడతారు..” అంది శారద.

అప్పటికే ఒళ్లో పడుకున్న వివేక్ కళ్లు తెరిచి, చూసి.. “నా చాక్‌లెట్ ఎక్కడ?” అన్నాడు.

నవ్వుతూ ప్రక్కనే ఉన్న చాక్‌లెట్ కవరు తీసి ఇచ్చింది. లాలీపాప్ చప్పరించసాగాడు వివేక్.

“వదినా!.. ప్రపంచాన్ని నడిపిస్తున్న అద్భుతమైన శక్తి ఏదో ఉంది.. అది మన కళ్లకు కనిపించదు.. ఆ శక్తిని నమ్మకున్న మనిషి ఫలితం పొందుతాడు.. నిన్న గుడిలో శాస్త్రిగారు పిల్లలు కలగని దంపతులకు నిష్ఠతో పూజ ఎలా చేయాలో.. మూడు రాత్రులు మూడు గర్భగుడుల్లో నిదురించి పూజలు చేసి, పేదలకు అన్నదానం చేసి వాళ్ల కడుపులు నింపాలని.. అందరి, ఆశీస్సులతో దంపతులు శుభవార్త వింటారని, సంతానం కలుగుతుందని చెప్పడం విన్నాను..” అంది శారద.

నిర్లిప్తంగా నవ్వింది సుమిత్ర “శారదా!.. నీకు చిన్నతనం పోలేదు.. నేను దేవుడు లేడు అని వాదించే నాస్తికురాలని కాను.. కాని.. నువ్వు చెప్పేవి నమ్మే వెర్రిదానిని కాను.. ఈ కళ్లల్లో కన్నీటి తడి నేను బ్రతికి ఉండే వరకు ఉంటుంది.. అని అనుకునే దానిని.. కాని నా మేనల్లుడు.. నా కళ్లల్లో తడి చేరకుండా అడ్డుపడ్డాడు” అని సుమిత్ర అంటుండగానే కంగారుగా అంది శారద.

“నేను చెప్పేది నిజం వదినా.. నీకు తప్పకుండా బాబు పుడతాడు.. ఎందుకో నా మనసు పదే పదే చెబుతుంది” అని అంటుండగానే.. గభాలున ఒళ్లో నుండి లేచి “బాబు కాదమ్మా.. బుజ్జిపాప పుడుతుంది.. నేను ఆ పాపతో ఆడుకుంటాను అత్తయ్యా.. ఏడవకు..” అని వచ్చి రాని మాటలతో కొంచెం నత్తితో అన్నాడు వివేక్ బాబు.

శారద, సుమిత్ర ఆశ్చర్యంగా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు..

సంతోషంగా కళ్లతో వారించింది శారద.

మంచం మీద పడుకున్నాడే కాని నారాయణరావుకి నిద్ర పట్టలేదు.

ప్రక్కకు తిరిగి చూసాడు. సుమిత్ర మంచి నిద్రలో ఉంది. మొహంలో ప్రశాంతత స్పష్టంగా కనబడతుంది. శారద వాళ్లు రాక ముందు చాలా నిరాశ నిస్పృహలతో కాలం గడిపేది. అర్థరాత్రి దాటుతున్నా సుమిత్ర కళ్లల్లో తడైనా చూసేవాడు లేదా శూన్యంలోకి చూస్తూ ఆ కళ్లు కనిపించేవి కాని ఇప్పుడు.. శారద వాళ్లు వచ్చాక సుమిత్ర కళ్లల్లో సంతోషం మాత్రమే చూస్తున్నాడు.

ఎంతలో ఎంత మార్పు? మనసు మాట వినదు అని అనుకుంటాం కాని కొన్ని సందర్భాలలో వింటుంది. మనసు మరి మొండిది కాదు.. పరిస్థితులను బట్టి adjust కావడానికే చూస్తుంది. సుమిత్ర దానికి అతీతురాలేం కాదు. సంతానం కలుగలేదని డిప్రెషన్‌లో ఉండేది.. కాని మేనల్లుడిని చూసి తన బాధని మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంది. సుమిత్రా!.. నువ్విలా ఉంటే నాకింకేం అక్కర లేదని భార్య వైపు చూస్తూ తనలో అనుకున్నాడు నారాయణరావు.

వీధిలో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది సుమిత్ర. హాలులో నుండి సుమిత్రని చూసి, చిన్నగా నవ్వుతూ అంది శారద.. చేతిలో కాఫీ కప్పు ఉంది..

“వదినా కాఫీ తాగకుండా అక్కడ పెట్టేసి వచ్చావు.. వస్తాడు లే వివేక్, ముందు నువ్వు ఈ కాఫీ తాగు..”

“ఈ పాటికే వచ్చేయాలి, అయినా St. Anns school కి అంత దూరం పంపాలా? మన దగ్గరలో నున్న స్కూలుకి ఏమయింది? పసి బిడ్డను చూడకుండా.. అంత దూరం.. అయినా ఆ మనిషి నా మాట వినడు.. నా కొడుకుని అంత దురం పంపనని చెప్పేయ్ శారదా” అంది సుమిత్ర.

“ముందు నువ్వు కాఫీ తాగు” అని కాఫీ కప్పు సుమిత్రకి అందించింది శారద.

కాఫీ తాగి కప్పు తిరిగి శారదకిచ్చి..“ఈ రోజే మీ అన్నయ్యతో.. నా కొడుకుని అంత దూరం పంపను అని చెప్పేయ్!” అంది సుమిత్ర.

కారు ఇంటిలోకి ఎంటర్ కావడం చూసి, గబగబా ఎదురు వెళ్లింది సుమిత్ర..

కాఫీ కప్పుతో హాలులోకి వచ్చిన శారదను చూసి,. “శారదా! ఒక సారి గదిలోకి రా తల్లీ” అని గబగబా లోపలికి వెళ్లాడు నారాయణరావు.

‘ఏం జరిగింది?.. ఏ విషయమైన అందరి ముందే మాట్లాడతాడు అన్నయ్య’ అని మనసులో అనుకొని గబగబా గదిలోకి నడిచి..“అన్నయ్యా!.. నీకు ఒంట్లో ఎలాగుంది? అన్నట్టు నీకు అప్పుడప్పుడు తల నొప్పి వస్తుంది. టాబ్‌లెట్‍కి తగ్గలేదని, నాతో తల మీద ఆయిల్ పోయించుకొని, మర్దనా చేయించుకుంటావు. ఒక్క నిముషం” అని డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకు నడుస్తూ “అన్నయ్యా!.. ఏది వచ్చినా.. డాక్టరు దగ్గరకు వెళ్లవు. ఇలా అయితే ఎలా అన్నయ్యా!.. నీకు తెలుసా?.. ఏడాదికి ఒక సారి ప్రతీ ఒక్కరు general checkup చేయించుకుంటున్నారు. కనీసం ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టరు దగ్గరకు వెళ్లాలన్నయ్యా!” అని ఆయిల్ సీసాతో దగ్గరకు వెళ్లింది..

గభాలున ఆయిల్ సీసా అందుకొని పక్కన పెట్టి, శారద చెయ్యి పట్టుకొని తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని, “శారదా! నీతో ఒక ముఖ్య విషయం మాటాడాలి.. రమణ ఎక్కడ ఉన్నాడో తెలిసింది. నీతో ఒక మాట చెప్పి, రేపు వెళ్లి రమణని ఇంటికి తీసుకు వద్దామని” అన్నాడు నారాయణరావు.

“ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‍లో ఫైనల్స్‌లో గెలిచి కప్పు సాధించాడనా?.. లేక ఏ వృద్ధాశ్రమానికో, అంధుల, చిన్నారులకు చూపు రావడానికి డబ్బు దానం చేసిన మహానుభావుడని.. వెళ్లి ఆ వ్యక్తిని ఇంటికి తీసుకురావాలా? ప్చ్!.. అవన్నీ వద్దు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని, కన్న కొడుకుని రోడ్డు మీదకు తెచ్చిన ఆ మనిషిని ఇంటికి తీసుకురావడం ఏమిటన్నయ్యా?.. పసివాడిని, నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసిన వాడి గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. నువ్వు లేకపోతే నా కొడుకు నేను ఎక్కడ తల దాచుకునే వాళ్లం? ఇంత జరిగినా ఆ మనిషిలో కాసింత మానవత్వం కూడ రాలేదు.. తను చేసిన తప్పు, తెల్సుసుకొని, ఇక మీదట జీవితంలో ఎలాంటి తప్పులు చెయనని, వాగ్దానం చేసిన నాడు ఆ మనిషి గురించి ఆలోచిద్దాం అన్నాయ్యా!.. అంత వరకు ఆ మనిషి గురించి ఎప్పుడు నా దగ్గర మాటాడొద్దు అన్నయ్యా!..” అంది శారద.

“మనిషికి ఎదురైన సమస్యలు, బాధలు తట్టుకోలేక ప్రశాంతత కోసం, మనసు కుదుటపడడానికి ఆలయానికి వెళతాడు.. ఆ పవిత్రమైన గర్భగుడో ఉన్నంత సేపు ఆ మనిషి మనసు ప్రశాంతత పొందుతుంది.. నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాను.. దూరం చేయకన్నయ్యా!..” అంది.

“శారదా!.. ఇంకా నా కళ్లకి ఏమీ అడిగినా, నీ ఇష్టం అన్నయ్యా అనే శారదే అనుకున్నాను.. నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు.”

“అవునన్నయ్యా!.. ఇది అంతా ఇదిగో నా మెడలో పడిన తాళి.. నన్ను మార్చేసింది.. నా విషయం వదిలేయ్!.. ప్లీజ్ అన్నయ్యా!.. నా కోసం నువ్వు ఒక పని చేయాలి. నీకు ఇలాంటివి నమ్మవని తెలుసు.. కాని నా కోసం, వదిన కోసం చెయ్యాలి.. అయినా నేను మంత్రాలు.. తాయత్తులు జోలికి వెళ్లమనడం లేదు. భగవంతుడికి శాస్త్రిగారు చెప్పిన యాగం, పూజలు చేయమంటున్నాను.. సంతానం కోసం శాస్త్రిగారు చెప్పినట్లు నువ్వు, వదిన చేయాలంటున్నాను.. నువ్వు కాదనవన్న నమ్మకంతో రేపు లక్ష్మీనరసింహస్వామి గుడికి వస్తామని చెప్పాను.. నీ మేనల్లుడికి రేపటి నుండి శెలవలు. అందరం కలిసి వెళదాం అన్నాయ్యా” అంది శారద.

అప్పటికే గుమ్మం దగ్గరకు వచ్చిన సుమిత్ర చిరుకోపంతో అంది.

“అడిగి, అడిగి విసిగిపోయి ఊరుకున్నాను.. ఇప్పుడు ఊ అన్నా పూజ టైమ్‌కి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతారు.. సంతానలక్ష్మి హోమం చేస్తే నా కడుపు పండుతుంది, ఇంట పసి బిడ్డడు తిరుగుతాడని ఇంటి పూజారిగారు ఎంత చెప్పినా వినలేదు.. డాక్టర్లు చేయలేని పని మంత్రాలు, తాయొత్తులు, పూజలు ఏం చేయలేవన్నారు. అయినా.. ఇప్పుడు ఈయన్ని ఎవరు బ్రతిమిలాడుతూ కూర్చోరు. నా మేనల్లుడున్నాడు” అని సుమిత్ర అంటుండగానే “వదినా!.. వదినా.. నా మాట విను.. అన్నయ్య అన్నీ చేయడానికి ఒప్పుకున్నాడు.. నీకు తప్పకుండా నీ మేనల్లుడు లాంటి కొడుకు పుడతాడు” అని శారద అంటుండగానే..

“అమ్మా బాబూ! వద్దు.. బుజ్జి పాప పుడుతుంది.. గౌను వేసుకుంటుంది. సీతమ్మ కూతురు పద్మలా రెండు జడలు వేసుకుంటుంది. అప్పుడు మేము ముగ్గురం చక్కగా ఆడుకుంటాం!..” నత్తితో గుక్క తిప్పుకోకుండా అన్నాడు వివేక్.

అందరూ వివేక్ మాటలకు ఆశ్చర్యపోయాడరు.

పని మీద గదిలోకి వచ్చిన సీతమ్మ సంతోషంగా రెండు చేతులు జోడించి, దణ్ణం పెడుతూ, “బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు.. ఖచ్చితంగా బంగారం లాంటి బిడ్డడు మీకు పుడతాడమ్మా” అంది.

“మా అత్తయ్యకి పాప పుడతుంది, రెండు జడలు వేసుకుంటుంది, నాతో ఆడుకుంటుంది, కదు అత్తయ్యా ” అన్నాడు వివేక్.

ఏం మాట్లాడాలో తెలియని దానిలా వివేక్ రెండు బుగ్గల మీద ముద్దుల వర్షం కురింపించిది సుమిత్ర.

ఇప్పుడే మనుషుల్లో పడింది అని అనుకుంటే.. మళ్లీ సుమిత్ర మనసులో ఆశ మొక్కని వీళ్లందరూ నాటుతున్నారు. నాటిన చిన్న మొక్క వృక్షం అయినట్లు సుమిత్ర మనసులో చోటు చేసుకున్న ఆశ పెరిగిపొతూ నిరాశ – నిస్పృహలతో బాధపడే స్థాయికి చేరుకుంటే, తను అసమర్థుడిలా చూడడం తప్ప ఏం చేయలేడు అని మనసులో అనుకున్నాడు నారాయణరావు.

శాస్త్రి గారు చెప్పినట్లు తు.చ. తప్పకుండా అన్నయ్యతో వదినతో శారద దగ్గరుండి చేయించింది పూజలు, హోమాలు.

ఊరిలో ఉన్న మహిమగల గుళ్లు చుట్టూ సుమిత్రని తీసుకువెళ్లి పూజలు చేయించింది శారద. సుమిత్రతో పాటు వివేక్ కూడ పోర్లు దండాలు పెట్టడం చూసి తన బాధని మరిచిపోయి.. సంతోషంగా వివేక్‌ని దగ్గరకు తీసుకొని “నాకు కూతురు పుడితే, అప్పుడు నువ్వు మేనల్లుడి వల్లా అల్లుడవుతావు” అంది సుమిత్ర. రోజులు దొర్లుతున్నాయి.

సుమిత్రని తీసుకొని హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్లిన శారద డాక్టరు చెప్పింది విని సంతోషంగా సుమిత్ర వైపు చూసింది.

“డాక్టర్! మరోసారి వదినని చెకప్ చేయండి.. వదినని తల్లి అవుతుందని ఆశ పెట్టి, తరువాత సారీ అంటే తను భరించలేదు” అంది శారద.

“What Sarada?.. ఏమిటి మీరు మాటాడుతున్నది? మా treatment మీద మీకు నమ్మకం ఉంది. ఒకొక్కసారి first time fail అవుతుంటుంది. ఈసారి ష్యూర్‌గా.. ప్రెగ్నెంట్ confirm అవుతుందని expect చేసాం.. అదే జరిగింది.. Now she is pregnant.. సుమిత్రగారిని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. Bed rest అవసరం. నేను వ్రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.” అని చెబుతున్న డాక్టర్ ప్రమీల చేతులు గభాలున వెళ్లి పట్టుకొని “థాంక్యూ డాక్టర్! ఈ ఒక్క మాట చాలా చిన్నది.. ముందు అర్జంటుగా ఇంటికి వెళ్లాలి. అన్నట్టు ఈ విషయం.. ఇంత సంతోషకరమైన వార్త వింటే అన్నయ్య ఒక ఇంచు కూడ కదలనివ్వడు.. అరచేతుల్లో వదినని నడిపిస్తాడు.. కనుక మీరు చెకప్ చేయడానికి ఇంటికి వస్తుండండి.. కారు పంపిస్తాడనయ్య రా వదినా!..” అని గభాలున వెళ్లి సుభద్ర చెయ్యి పట్టుకొని.. “నెమ్మదిగా నడువ్ వదినా” అంది శారద.

డాక్టర్ ప్రమీల చిరునవ్వతో అంది “శారదా!.. ఆవిడకు బెడ్ రెస్ట్ అవసరం అన్నాను. బరువైన పనులు, బరువులు ఎత్తడాలు, మేడ మెట్లు పది సార్లు ఎక్కడం, దిగడం ఇలాంటివి చెయ్యకూడదన్నాను.. తన పనులు తను చేసుకోవచ్చు.. చిన్నగా గార్డన్‌లో వాక్ చేయవచ్చు.. O.K.”

“ష్యూర్!.. డాక్టర్” అని సంతోషంగా సుమిత్రతో కారెక్కింది శారద.

హాలులో నారాయణరావు, వివేక్‌తో కబుర్లు చెబుతూ కనిపించాడు.

కారు దిగి హాలులో అడుగు పెట్టిన శారద, సుమిత్ర మొఖాలు చూసి “ఇద్దరి మొఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. అర్థం అయింది హాస్పటల్ నుండి అలా వెళ్లి.. చీరలో, నగలో కొనుక్కుని ఉంటారు.. మీ ఆడవాళ్లు ఇలాంటివి కొంటేనే కదా ఎక్కువ సంతోషపడిపోయేది” అన్నాడు నారాయణరావు నవ్వుతూ.

“పొరపడ్డావన్నయ్యా!.. జీవితంలో మొదటిసారిగా ఆడపిల్ల సంతోషపడిపోయేది మెడలో తాళి కట్టిన భర్త మంచివైడైతే, తరువాత సంతోషపడేది తల్లి అయినప్పుడు.. ఈ సంతోషాల ముందు బట్టలు, నగలు సాటి రావు అన్నయ్యా” అంది శారద.

గభాలున వివేక్‍ని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించి “సీతమ్మ నువ్వు చెప్పింది కరక్ట్.. బాలవాక్కు బ్రహ్మ వాక్కు.. నేను తల్లి నవుతున్నాను వివేక్ బాబూ!.. నీతో ఆడుకోవడానికి మరో బుజ్జి బాబు వస్తాడంది” సుమిత్ర.

షాకైయ్యాడు నారాయణరావు.. నిజమే అన్నట్లు చూసాడు.

(సశేషం)

Exit mobile version