Site icon Sanchika

మేనల్లుడు-5

[సుమిత్ర గర్భం దాల్చగా, ఆడపిల్ల పుడుతుందని అంటాడు వివేక్. పాప పుడితే అమృత అని పేరు పెడదామంటాడు. రోజులు గడిచి నారాయణరావు, సుమిత్ర దంపతులకు పాప పుడుతుంది. ముందు అనుకున్నట్టు గానే అమృత అని పేరు పెడతారు. వివేక్ ఇండియాకి వస్తున్న విమానం ఫ్రాంక్‍ఫర్ట్‌లో కాసేపు ఆగడంతో గతంలోకి వర్తమానంలోకి వస్తాడు. ఇంటికి ఫోన్ చేయగా అమృత ఎత్తి మాట్లాడుతుంది. నాన్న ఆరోగ్యం గురించి అమృత బాగా దిగులుపడుతుంటే – తనకి అమెరికాలో కోవిడ్ వచ్చి సీరియస్ అయిందని, డాక్టర్లు ఆశ వదులుకున్నారనీ – అయినా, తను బ్రతికి ఉన్నాననీ – అందుకని మావయ్య విషయంలో కంగారు పడద్దని, కావాలంటే తన స్నేహితురాలు దివ్యతో మాట్లాడి వివరాలు కనుక్కోమంటాడు. అయితే వివేక్ ఏం చెప్పినా నమ్మేయడానికి తానేం చిన్నపిల్లని కాదంటుంది అమృత. అమృతకి ధైర్యం చెప్తాడు వివేక్. ఫ్లయిట్ తిరిగి బయల్దేరుతుంది. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]జమండ్రి ఎయిర్ పోర్టులో ఆగింది ఫ్లైట్..

రంగడు కారుతో రెడీగా నిలబడి ఉన్నాడు. రెండు చేతులు కట్టుకొని, నీరు నిండిన కళ్లతో గబగబా దగ్గరకు వచ్చి “బాబూ! వచ్చావా?..” అని గభాలున చేతిలో సూటుకేసు అందుకొని బొంగురుపోయిన గొంతుతో అన్నాడు రంగడు.

“బాబూ! దేవుడికి సుస్తీ చేసింది.. నలుగురి మంచి చెడులు చూసే దేవుడిలాంటి మనిషికి ఇంత కష్టం వచ్చిందేమిటి బాబూ..” అని బాధపడుతూనే కారు డ్రైవ్ చేయసాగాడు రంగడు..

తనకి ఊహ వచ్చిన దగ్గర నుండి రంగడు పని చేస్తున్నాడు.. ఇంటికి వెళ్లమని ఒకటికి రెండు సార్లు చెప్పే వరకు ఇంటికి వెళ్లడు రంగడు.. ఆ ఇంటితో అంత బంధం ఉంది.. గభాలున గుర్తు వచ్చి, రంగడి భుజం మీద చెయ్యి వేసి తట్టి, “అరె అందరూ ఎందుకలా డీలా పడిపోతున్నారు? మావయ్యకి ఏం కాదు. నాలుగు రోజులు సుస్తీ చేస్తే మనం భయపడితే ఎలా రంగా?” అన్నాడు వివేక్! ..అలా అంటున్నాడే కాని వివేక్ మనసులో ఏదో తెలియని భయం, టెన్షన్..

కారు వెళుతుంది. గభాలున అమృత చెప్పిన మాట గుర్తు వచ్చి “రంగా! లక్ష్మీనరసింహస్వామి గుడికి పోనివ్వు..” అని వివేక్ అనగానే “బాబూ!.. ఇప్పుడా!” అని అన్నాడు రంగడు.

“అవును! ఇప్పుడే! అమ్మూ చెప్పింది. అమ్మూ ఆ దేవున్ని ఎక్కువగా నమ్ముతుంది. నీకు తెలుసు కదా?” అన్నాడు వివేక్.

“నాకు ఎందుకు తెలియదు బాబూ? ఆ దేవుడంటే అమ్మాయిగారికి చాలా నమ్మకం. ఆ దేశంలో మీరు ఉన్నప్పుడు మీ పుట్టిన రోజని.. అర్చన చేయంచడానికి గుడికి వచ్చారు. అమ్మాయిగారి నమ్మకం నిజం అయితే అంతకన్నా ఏం కావాలండీ?” అని కారు కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడికి పోనిచ్చాడు.

ఒక ప్రక్క మావయ్యను తొందరగా చూడాలన్న ఆత్రుతగా ఉన్నా, మరో ప్రక్క అమ్మూ నమ్మకాన్ని బలపరచాలనే గుడికి వచ్చాడు.

నమ్మకం ఒకొక్కసారి నిరాశపరుస్తుంది. ఒకొక్కసారి ఆశతో ముందుకు నడిచేలా చేస్తుంది. ప్రస్తుతం అమ్మూ ఆశతో తన భయాన్ని పొగొట్టకోవాలని చూస్తుంది. దానికి తను సహకరించాలి..

“వివేక్ బాబూ!.. నువ్వా! ఎప్పుడు వచ్చావు?” అన్నాడు పూజారి రామశాస్త్రి.

“ఇప్పుడే వచ్చానండి.. మీరు నాకు చిన్న సహయం చేయాలండి.. మావయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు.. నేను అర్జంటుగా వెళ్ళాలి.. మావయ్య పేరున అర్చన, ఇంకా ఏ పూజలు చేయాలో అవన్నీ చేయండి శాస్త్రిగారు” అన్నాడు వివేక్. చివరి మాటలు అంటున్నప్పుడు గొంతు జీరబోయింది.

చిన్నగా నవ్వి అన్నాడు రామశాస్త్రి.

“వివేక్ బాబూ! ఒక ఊరిలో ఎన్నో గుళ్లు ఉంటాయి.. ఎందరో దేవుళ్లు ఉంటారు. కాని ఆ ఊరికి మీ మావయ్యగారు ఒక్కరే దేవుడు. ఎందుకంటే మనిషికి ఎక్కువగా కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తు వస్తాడు.. ఆ ఊరి ప్రజలకి మీ మావయ్యగారే దేవుడు.. ఆ దేవుడికి ప్రజలు అర్చనలు, పూజలు చేయించకుండా ఎలా ఉంటారు.. రోజు మావయ్యగారి పేరున అర్చనలు.. పూజలు జరుగుతున్నాయి.. నారాయణరావుగారికి ఏం జరగదు. అమృతమ్మకి చెప్పండి.. నేను అర్చన, పత్రం, పూజ అన్నీ.. చేస్తాను.. అటు చూడండి. ఆ దేవుని మెడలో ఉన్న పచ్చల హారం, భక్తులు కూర్చోవడానికి కుర్చీలు అన్నీ నారాయణరావుగారు ఇచ్చినవే!.. అటు చూడండి గుడి ముందు ఉన్న ఆ కొత్త బండి నాకు నారాయణరావుగారు ఇచ్చినదే.. గ్రహాలు అడ్డుపడి ఆయనకు అనారోగ్యం చేసిందంతే.. నువ్వెళ్లు వివేక్ బాబు!..” అని రామశాస్త్రిగారు అనడంతో.. పరుగు లాంటి నడకతో కారు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.

కారు వెళ్లి హాస్పిటల్ ముందు ఆగింది. అదురుతున్న గుండెతో హాస్పిటల్ లోకి నడవడం మొదలు పెట్టాడు. ఆ ఊరి జనంతో నిండిపోయి ఉంది హాస్పిటల్.. నారాయణరావు స్నేహితులు గంగాధర్, మాణిక్యాలరావు గబగబా దగ్గరకు వచ్చి చెరో వైపు అభిమానంగా చేతులు పట్టుకొని “వివేక్ బాబూ సమయానికి వచ్చావు.. Tests, C.T scan, Gland Biopsy అన్నీ చేసారు.. ఇప్పుడే general surgeon ఈ విషయం చెప్పి, రేపే ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ‘USA నుండి ఆయన మేనల్లుడు వస్తున్నాడు. ఈపాటికి ఇండియా ల్యాండ్ అయ్యి ఉంటాడు, కొంచం టైమ్ ఇవ్వండి’ అని చెప్పిబయటకు వచ్చాం. నువ్వు డాక్టరువి కాబట్టి ఆపరేషన్ గురించి నీకు తెలుస్తుంది” అని వాళ్లు చెబుతుండగానే గబగబా డాక్టరుగారి గదిలోకి నడిచాడు. ఫేమస్ జనరల్ సర్జన్ M.V. Rao, ప్రక్క సీటులో డా.మురారి, డా.వర్ధన్ ఉన్నారు.. వాళ్లని చూసి “good morning డా. రావు సార్, గుడ్ మార్నింగ్ మురారి, వర్ధన్” అని వాళ్ల దగ్గర కూర్చొని నారాయణరావుగారి కేసు గురించి అడిగాడు.

జనరల్ సర్జన్ డా. M.V.Rao గారు చెప్పింది విని షాకయ్యాడు.

“పేషంట్‍కి thyroid cancer 2nd stage. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే పేషంట్ సేఫ్ సైడ్ ఉంటాడు. ఆపరేషన్ చేసి థైరాయిడ్ గ్లాండ్ (Thyroid gland) మొత్తం తీసేయ్యాలి. జీవితాంతం థైరయిడ్ హార్మోన్ వాడి జీవితాన్ని పొడిగించుకోవచ్చు” అని డాక్టర్ M.V.Rao చెబుతుండానే..

గభాలున అన్నాడు వివేక్..

“సార్! రేపే చేసేయండి ఆపరేషన్. ఒక్క రోజు కూడ ఆలస్యం చేయవద్దు డాక్టరుగారు” అని చిన్న పిల్లాడిలా కళ్ల వెంట నీళ్లతో కనబడుతున్న వివేక్ దగ్గరికి మురారి, వర్ధన్ రావడం, గభాలున కుర్చీలోంచి డా. M.V.Rao లేచి “Don’t worry Vivek. It is lucky to find in early stage. He will become alright after operation, but be careful giving hormones afterwards.. ok Vivek” అని డా. M.V.Rao అనగానే సంతోషంగా “ok డాక్టర్.. thank you very much” అని అన్నాడు.

సంతోషంలో ఒంటరిగా ఉన్నా మనిషి ఎవరిని పట్టించుకోడు.. కాని బాధలో ఉన్నప్పుడు.. పక్కన ఎవరైనా ఉండి ధైర్యం చెబితే, ఆ మనిషికి చాలా రిలీఫ్ కలుగుతుంది.

ఆ మనిషికి బాధ తగ్గినా, తగ్గకపోయినా, మనసుకి కాస్త ఊరట కలుగుతుంది.

“ఒరేయ్ వివేక్! డాక్టరువై ఉండి అలా డీలా పడిపోతావు ఏమిటిరా?.. డాక్టర్ M.V.Rao చెప్పారుగా.. nothing to worry” అన్నాడు మురారి.

“బాగా చెప్పావు. రిసెర్చ్ చేయడం నీ డ్రీమ్ అని వెళ్లావు.. నీ రిసెర్చ్ ఎంత వరకు వచ్చింది” అని అన్నాడు డా. వర్ధన్.

“ఇద్దరూ నోరు మూయండి రా!.. మీరు ఎన్ని కబుర్లు చెప్పి నా మైండ్‌ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. నేను, డాక్టరన్న విషయం మరిచిపోకండిరా.. నా గురించి పూర్తిగా మీకు తెలుసు.. అసలు ఇలా జరగడం ఏమిటిరా? పులిలా ఉండే మావయ్యని పేషంట్‌లా నేను చూడలేను” అని రెండు చేతుల మధ్యా ముఖం పెట్టిన వివేక్‌ని చూసి కంగారుగా అన్నాడు డా. మురారి..

“మనం మనుషులం రా! నువ్వు విన్నా, వినకపోయినా నేను చెబుతాను.. ఒక దంపతులకు పది సంవత్సరాలకు మగపిల్లాడు పుట్టాడు. వాడికి ఇప్పుడు పదేహేనేళ్లు.. రెండు కిడ్నీలు పాడైపోయాయి.. చాలా complicated case.. బ్రతికేది వాడు రోజులే.. ఆ తల్లిదండ్రుల బాధ చూడలేకపోతున్నాను..”

“బిడ్డను స్కూల్లో జాయిన్ చేయ్యడానికి సంతోషంగా తల్లిదండ్రులు తాతయ్యా, బాబయ్ కారులో వెళుతున్నారు.. పట్టపగలే.. ధనంతో సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ల అబ్బాయిలు ముగ్గురు తప్పతాగి కారు గుద్దేసారు.. పాప, బాబాయి, తాతయ్యా ఆన్ ద స్పాట్ చనిపోయారు. పాప తల్లి వెన్ను విరిగి బ్రతికినంత కాలం బెడ్‌కే పరిమితమై బ్రతుకుతుంది..

మనిషి జీవితంలో మొత్తం సంతోషం మాత్రమే ఉంటుంది అని అనుకోకు.. సంతోషం అయినా దుఃఖం అయినా ఎదురైతే భరించవలసిందే!.. మనసుకి ధైర్యం చెప్పి ముందుకు అడుగులు వేయవలసిందే.. ఇదే జీవితం..”

గభాలున డోరు తోసుకొని అమృత వచ్చి వివేక్‌ని గట్టిగా పట్టుకొని.. “వచ్చావా బాబూ!.. ఏంటి అలా ఉన్నావు. నాన్నకు ఏం కాదుగా” అని గుండె మీద వాలిపోయి ఏడ్వసాగింది..

ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు..

ఏం చెప్పి అమ్ముని ఊరుకోబెట్టగలడు? గభాలున ఏం మాట్లాడాలో తెలియని వాడిలా దగ్గరకు లాక్కొని, నడింపించుకుంటూ అడుగులు వేస్తూ “అమ్మూ!.. ఇలా అయితే ఏమయిపోతావు. ఎంత చిక్కిపోయావో తెలుసా?” అన్నాడు.

“ప్లీజ్! బాబూ! నువ్వింకేం మాట్లాడకు..” అని వివేక్‌ని విదిలించుకొని పరిగెత్తింది..

“అమ్మూ!..” అని వెనకాలే గబగబా అడుగులు వేసాడు.. స్పెషల్ రూమ్.. ఎదురుగుండా బోలెడు మంది మనుషులు. గబగబా డోరు దగ్గరకు నడిచాడు. అప్పటికే అమృత లోపలికి నడిచింది. రూమ్ లోకి అడుగులు వేస్తున్నాడే కాని వివేక్ గుండె దడదడ కొట్టుకోసాగింది.

మావయ్యని ఎప్పుడు పులిలా గంభీరంగా, ధృడంగా, ఆరోగ్యంగా ఉండడమే తను చూసాడు.. ఆరడగుల మనిషి.. నడిచి వస్తుంటే ఆపదలో అదుకునే వ్యక్తిలాగే కనబడతాడు. ఆ ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ. మనుషులతో మాట్లాడేటప్పుడు, అతనికి తెలియకుండానే ముఖంలో చిరునవ్వుతో కూడిన మంచితనం స్పష్టంగా కనబడుతుంది..

దైవత్వం అంటే ఏమిటి? ఎంతో దూరం, భగవంతుని దర్శించుకోవడానికి అందరూ ఎందుకు వెళ్తారు?.. తమ బాధలు చెప్పుకోవడానికి, తమ కోరికలు తీర్చమని.. దేవుణ్ణి నమ్ముకున్నందుకు మాకు మంచి చేశావని మొక్కు తీర్చుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్తారు.. ఆ భగవంతుని స్వరూపం చూసి పరవశించిపోతారు. అలాంటి భావనే ఆ ఊరి ప్రజలకి మామయ్యని చూస్తే కలుగుతుంది. తనకి మాత్రం ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని ప్రేమ, అనురాగం, సంతోషం, భరోసా మావయ్యలో కనపడుతుంది.. అందుకే తను ఈ రోజు స్వచ్ఛమైన మనిషిలా ఎదిగాడు..

బాధ్యతలు, బరువులు గాలికి వదిలేసి తండ్రి వెళ్లిపోయినా, ఆ లోటు లేకుండా తండ్రికన్నా ఎక్కువ ప్రేమ, అనురాగం అన్నీ ఇచ్చాడు మావయ్య! అలాంటి మావయ్యను ఇలా కాన్సర్‌తో చూస్తాడనుకోలేదు. ఇటువంటివి చూస్తేనే అసలు దేవుడిని నమ్మకూడదనిపిస్తుంది.

“వివేక్ బాబూ! వచ్చాడు.. ఇంకేం? నారాయణరావుగారి ప్రాణం కుదుటపడుతుంది. మనం ఎంత మందిమి ఉన్నా నారాయణరావుగారి కళ్లు మేనల్లుడిని వెతుకుతున్నాయి.”

“బాబూ!..” అని గభాలున దగ్గరకు వచ్చి వివేక్ కుడి చెయ్యి చుట్టూ తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని, తన తల వివేక్ భుజం మీద పెట్టి కళ్ల నీళ్లతో “నాన్నా! చూడు..” అంది అమృత.

“రా! వివేక్ బాబూ!.. వచ్చేసావా?” నారాయణరావు కళ్లల్లో సంతోషం..

ఒక్క ఉదుటున వెళ్లి చప్పున నారాయణరావు చెయ్యి పట్టుకొని తన ముఖం దగ్గర పెట్టుకొని, అప్యాయంగా నొక్కి “ఏంటి మావయ్యా ఇది?.. నీకు.. నీకు.. అనారోగ్యం ఏమిటి?” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా ఛ!.. ఛ!.. డాక్టరై ఉండి పేషంటుతో ఇలాగేనా మాట్లాడేది అని అనుకొని, మరుక్షణం.. “నేను కలలో కూడా నిన్ను ఇలా బెడ్ మీద చూస్తానని అనుకోలేదు. ఒక్క రోజు జ్వరంతో కూడా నిన్ను బెడ్ మీద చూలేదు. అందుకే emotional అయ్యాను.

అసలు వర్రీ కావలసిన పని లేదు.. ఇప్పుడే డాక్టర్స్‌తో మాట్లాడి వచ్చాను. You are perfectly alright” అన్నాడు.

“నువ్వు పెద్ద వాడివైపోయి పెద్ద మాటలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా వివేక్ బాబూ! ప్చ్.. నేను ఏం కాను, నాకేం జరగదని మూర్ఖంగా ఆలోచించే ఇంతవరకు తెచ్చుకున్నాను..

అయినా నాకేం బాధ లేదు.. నా మేనల్లుడు వచ్చాడు. ఈ కుటుంబం బరువు బాధ్యతలు నాకన్నా నువ్వు బాగా చూసుకుంటావని తెలుసు” అని నారాయణరావు అంటుండగానే..

చుట్టూ ఉన్న సుమిత్ర, శారద, శ్రేయోభిలాషులు నిట్టూర్పులు విడవడం – “బాబూ!.. మావయ్య ఇలానే మాట్లాడుతున్నారు” అని సుమిత్ర, “అవును నాన్నా, అన్నయ్య ఇలానే మాట్లాడుతున్నారు. అసలు అన్నయ్యకు ఏమయ్యందిరా?” అంది కళ్ల నిండా నీళ్లతో శారద.

“వివేక్ బాబూ!.. డాక్లర్లని అడిగితే.. డాక్టర్ వివేక్‌ని రానివ్వండి.. కంగారు పడవలసిన పని లేదు అంటున్నారు.. నాకు చాలా కంగారుగా ఉంది.. అసలు ఏమయ్యింది మావయ్యకు?.. చెప్పు బాబూ!..” అంది సుమిత్ర.

“ఏంటి మీరందరూ వివేక్ బాబుని ఇబ్బంది పెడుతున్నారు. ఆ దేవుడు వచ్చి నన్ను తీసుకువెళతానన్నా, ఒక్క నిముషం అని.. ఈ కుటుంబాన్ని.. ముఖ్యంగా నా బంగారు తల్లిని బంగారం లాంటి నా మేనల్లుడి చేతిలో పెట్టి, తృప్తిగా ఆ దేవుడుతో వెళ్లిపోతాను” అని నారాయణరావు అంటుడగానే..

“నాన్నా.. నానీ..” అని అమృత,

“మావయ్యా.. ఛ.. ఛ!.. ఏంటా మాటలు.. చిన్న problem.. ఆ మాత్రం దానికి.. ఏం లేదు.. ఇప్పటి వరకు డాక్టరుగారితో మాటాడాను.. అవసరం అయితే USA తీసుకువెళ్తనన్నాను.. అవసరం లేదన్నారు. క్లియర్‌గా కేసు గురించి explain చేసారు. M.V.Rao ఇప్పటికి ఇలాంటి operations చాలా చేసారు.. అన్నీ సక్సెస్ అయ్యాయి. నీకేం కాదు మామయ్యా..” అని అంటునప్పుడు వివేక్ గొంతు బొంగురపోయింది.

“చూసావా నానీ.. వీవి.. చెప్పింది కరక్టే.. నీకేం కాదు.. నువ్వు నా ముద్దుల నానీవి.. నాకు సంతోషం వచ్చినా, నా మనసులో మాట మొదటసారి నీతోనే చెబుతాను కదా?.. నువ్వు నాతోనే ఉంటావు.. కదు వీవి?” అంది అమృత.

“అవును అమ్మూ.. మావయ్యకి ఏం కాదు.. చిన్న ఆపరేషన్ అంతే!.. కొద్ది రోజుల్లో మామూలయిపోతాడు మావయ్య”

నిర్లిప్తంగా నవ్వుడు నారాయణరావు.. ఎంతలో ఎంత మార్పు..

పులిలా గంభీరంగా ఉండే మావయ్య వేటగాడి చేతికి చిక్కి నిస్సహాయంగా పడి ఉన్న లేడిలా ఉన్నాడు.

“మీ ఇద్దరూ ఒకసారి ఇలా నా దగ్గరగా రండి” అని రెండు చేతులు నారాయణరావు చాచడం, గభాలున ఇద్దరు వెళ్లి ఆ చేతుల్లో అమృత, వివేక్ చేతులు పెట్టడం, నెమ్మదిగా తన గుండె వరకు ఇద్దరు చేతులు లాగి ఉంచి “నాది చిన్న కోరిక.. మీరిద్దరూ నా మాట కాదనరని తెలుసు.. అయినా నా తృప్తి కోసం అడుగుతున్నాను.. ఎందుకంటే అమ్మూకి నువ్వంటే పంచప్రాణాలు.. నీ చిటికెన వేలు పట్టుకొని అడుగులు వేసింది. నువ్వుంటే దానికెవ్వరు అక్కర లేదు.. అమృత ఎవరి మాట విన్నా వినకపోయినా, నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగించినా, చివరికి నీ మాటే వినేది.. కోపం వచ్చినా, అలిగినా ఏమీ తినేదికాదు.. అది అంత మొండిగా, పెంకితనంగా తయారవ్వడానికి కారణం! లేక లేక పుట్టిన అమృతని గారాబం చేయడమే! కాని ఏం చేసేవాడివో మాకు తెలియదు గాని కడుపు నిండా తినిపించితే, చక్కగా నిద్రపోయేది అమృత..”

“అయ్యో!.. మావయ్యా!.. ఇప్పుడవన్నీ ఎందుకు.. ఎప్పటికి అమృత నా దృష్టిలో పసి బిడ్డే మావయ్యా..” అని వివేక్ అంటుడగానే.. “నాన్నా.. వీవిని నేను ఏం సతాయించను. అల్లరి చేయను.. నీకు వివేక్ బాబు అంటే ఎంత ఇష్టమే నాకు అంతే..” అని అమృత అంటుడగానే..

“అందుకే అమ్మా.. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం ప్రేమ, అభిమానం.. అన్నీ ఉన్నాయని తెలుసు.. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోరిక ఒకే ఒకటమ్మా.. మీరిద్దరూ నా కోరిక తీరుస్తారని తెలుసు.. అయినా మీ దగ్గర మాట తీసుకుంటే నిశ్చింతగా ఆపరేషన్ చేయించుకంటాను.. ఆ తర్వాత ఏది ఎలా జరిగినా పరవాలేదు” అని తన చెరో చేతుల్లో ఉన్న అమృత, వివేక్ బాబు చేతులు రెండు పట్టుకొని.. “మీ ఇద్దరి పెళ్లి కళ్లతో చూసి, నేను పోయినా పరవాలేదు” అన్నాడు నారాయణరావు.

అమృత, వివేక్ షాకయ్యారు.

‘ఏంటి వీవితో నాకు పెళ్లా? అసలు ఇలాంటి ఆలోచన నాన్నకి ఎలా వచ్చింది?’

వివేక్ తల గిర్రున తిరగసాగింది.. ‘ఛ!.. ఛ!.. అమృతతో తనకి పెళ్లి ఏమిటి? ఆ మాట వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది’.

“ఏంటి వివేక్ బాబూ!.. ఏంటి తల్లీ? ఇద్దరు మాట్లాడరేమిటి?..”

“అయ్యో!.. అన్నయ్యా.. నువ్వు టపీమని అడిగితే పాపం వాళ్లు ఏం చెబుతారు?” అని శారద అంటుడగానే..

“ఏవండీ!.. లేనిపోని ఆలోచనలు మీకెందుకు వస్తున్నాయి.. వాళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఒకరిని చూడకుండా ఒకరు, ఒకరితో మాట్లాడకుండా ఒకరు ఉండలేరు.. అంత దూరంలో వివేక్ బాబు ఉంటున్నా, ఇండియాలో ఉన్నప్పుడులాగే అలా కాల్స్ USA చేస్తునే ఉంటుంది. వీడియో కాల్స్‌లో మాట్లాడుతూనే ఉంటుంది.. పెళ్లికి తొందర ఏమిటి? వివేక్ బాబు రిసెర్చ్ పూర్తి కానివ్వండి..” అంది సుమిత్ర.

 “సుమిత్రా!.. నీకు తెలియదు..

ధనుంజయరావుగారి అమ్మాయి పద్మకి పెద్దింటి సంబంధం చేసి సంతోషించాడు.. కాళ్ల పారాణి ఆరకుండానే, భర్త దుర్మార్గుడు, శాడిస్ట్ అని, కట్టుబట్టలతో పుట్టింటికి చేరింది.. మొన్న సూసైడ్ చేసుకోబోయిందని బాధపడుతూ కళ్లనీళ్లు తుడుచుకున్నాడు ధనుంజయరావు..

కాలం బాగోలేదు.. ఎవరు ఎటువంటి వాళ్లో… ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.. ముక్కు ముఖం తెలియని వ్యక్తి చేతిలో నా బంగారు తల్లిని పెట్టలేను. చెప్పు వివేక్ బాబూ!..” అని నారాయణరావు అనగానే మాటలు రానివాడిలా గుటకలు మింగసాగాడు వివేక్..

“డాక్టరు వస్తున్నారు..” అన్న మాటలు వినబడడం, డా. M.V. Rao తన అసిస్టెంట్ లతో గబగబా పేషంట్ దగ్గరకు రావడం జరిగింది.

“ఎలా ఉన్నారు నారాయణరావుగారు. రేపే మీకు ఆపరేషన్. ఆపరేషన్ అయిన తరువాత మీ ఆరోగ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది.. నేను చెప్పేది ఏముంది లెండి? మీ మేనల్లుడు వచ్చేసాడుగా.. మేమందరం ఏం చెప్పినా మీరు పట్టించుకోరని తెలుసు.. కమాన్ డా. వివేక్.. మీ అంకుల్‌ని ఆపరేషన్‌కి మెంటల్‌గా ప్రిపేరు చెయ్యి. ఊరు ఊరంతా ఈయన్ని చూడడానికి వచ్చి sentimental dialogues, emotional words చెప్పి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు.. sorry ఇలా అంటున్నందుకు! పేషంట్‌కి ఉన్న సమస్య పెద్దదయినా చుట్టూ వున్న వాళ్లు పాజిటివ్‍గా మాట్లాడితే వాళ్లు త్వరగా కోలుకుంటారు.. చిన్న సమస్య ఉన్నా పేషంట్ చుట్టూ చేరిన వాళ్లు భూతద్దంలో చూసి ఏవేవో చెప్పి భయపెడతారు.. నాలుగు రోజుల్లో మాములుగా తిరగవలసిన వ్యక్తి నాలుగు నెలలైనా మంచం మీద ఉంటాడు.. ఏమీ లేకపోయినా, ఏదో ఉంది అనుకునేలా సైకలాజికల్‌గా బాధపడిపోతుంటారు. డాక్టరుగా నీకు ఈ విషయాలన్నీ తెలుసు.. వివేక్! Please take care of your uncle” అని అక్కడ నుండి డాక్టరు M.V.Rao తన అసిస్టెంట్ లతో సహా బయటకు అడుగులు వేసాడు.

(సశేషం)

Exit mobile version