Site icon Sanchika

మేనల్లుడు-6

[రాజమండ్రి విమానశ్రయంలో దిగుతాడు వివేక్. రంగడు కారుతో సిద్ధంగా ఉంటాడు. ఊరికి వెళ్తూ దారిలో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళి, స్వామి వారికి పూజలు చేయించమని పూజారితో చెప్పి హాస్పటల్‍కి చేరుతాడు వివేక్. జనరల్ సర్జన్ ఎం. వి. రావు, తోటి డాక్టర్లు మురారి, వర్ధన్‍లు నారాయణరావు పరిస్థితిని వివేక్‌కి వివరిస్తారు. మావయ్యకి థైరాయిడ్ కాన్సర్, సెకండ్ స్టేజి అని తెలిసి షాకవుతాడు. మర్నాడే ఆపరేషన్ చేయమని అడుగుతాడు. అయితే ఆపరేషన్ తరువాత నారాయణరావు బాగానే ఉంటారని, హార్మోనులు ఇవ్వాల్సి ఉంటుందని డాక్టరు చెబుతారు. మురారి, వర్ధన్‍లు వివేక్‌కి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు. అమృత వచ్చి వివేక్‌ని పట్టుకుని ఏడుస్తుంది. మావయ్యని పలకరించి ధైర్యం చెబుతాడు. బేలగా ఉన్న కుటుంబసభ్యులకి కూడా ధైర్యం చెబుతాడు. తన చివరి కోరికగా తన కూతురు అమృతని పెళ్ళి చేసుకోమని కోరుతాడు. అమృత, వివేక్‍లు విస్తుపోతారు. కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు. డాక్టర్ ఎం.వి.రావు వచ్చి మర్నాడే ఆపరేషన్ అని చెప్పి నారాయణరావుకు భరోసా ఇస్తారు. – ఇక చదవండి.]

[dropcap]నా[/dropcap]రాయణరావు అమృత చేతిని తన చేతిలో పెట్టి అన్న మాటలతో డా. వివేక్ తన ఉనికిని తానే మరిచిపోయాడు. వినకూడని మాట విన్నట్టు షాక్ అయ్యాడు. ఇలాంటి ఆలోచన మావయ్య మనసులో ఉందా?

‘ఏంటి నాన్నకి.. నాకూ వీ.వికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? వీ.విని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆరోగ్యం బాగోక, ఏమైనా అయిపోతేనేమో అన్న ఆలోచనతో, తను బ్రతికి ఉండగా పెళ్లి చేయాలన్న ఆలోచనతో అలా అనేసాడా?..’

“శివునికి అభిషేకం చేసి, మీ పేరున అర్చన చేసి, మీరు కోలుకున్న వెంటనే వరుసగా పాలతో, నేతితో హోమం చేస్తానని.. నారాయణరావుగారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శివయ్యకి అప్లికేషన్ పెట్టాను సార్” అని తన కూడా తెచ్చిన కుంకం, విభూతి నారాయణరావు నుదిటి మీద పెట్టాడు శివాలయం అర్చకుడు లింగయ్య శాస్త్రి.

“చాలా సంతోషం శాస్త్రిగారు.. మీరందరూ చూపెట్టే అభిమానం నా ఒక్కడితోనే ముగిసిపోకూడదు.. నా మేనల్లుడు వచ్చేసాడు.. ఆ అయినా ఇంకా మేనల్లుడంటున్నా ఏమిటి.. నా అల్లుడు కాబోతున్నాడు.. రేపే నాకు ఆపరేషన్. డాక్టర్లు ఏం పరవాలేదని చెబుతారు.. అలా చెప్పకుండా.. మీకు కాన్సరండి.. ఆపరేషన్ చేసినా, ఎంత మందులు వాడినా కొద్ది రోజులే బ్రతుకుతారు.. I am sorry? అంటరా.. మా ఇంట్లో వాళ్ల ఆరాటం, తాపత్రయం చూస్తుంటే వాళ్లందరూ నా గురించి చాలా బాధపడిపోతున్నారన్న బాధ నన్ను వెంటాడుతుంది. నేను అన్ని బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ.. అన్నీ.. అనుభవించాను. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది.. అది కోరిక అనేకన్నా.. నా బంగారు తల్లి జీవితం నా కళ్ల ముందు.. ఎలా ఉంటుందో అన్న భయం నన్ను వేధిస్తుంది.. పిచ్చోణ్ణి, నా భయాన్ని పోగొట్టుకునే  ఛాన్స్ నా చేతుల్లోనే ఉంది. నా కూతురు జీవితం నా మేనల్లుడితో ముడిపెడితే అమోఘంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నా దగ్గర కన్నా నా మేనల్లుడి దగ్గరే నా కూతురు సంతోషంగా ఉంటుంది. దానికి వాడంటే ప్రాణం. వాడికి అదంటే పిచ్చి ఇష్టం. అది వాడిని మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నా ముచ్చటపడేవాడు.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో తెలుసా శాస్త్రిగారూ.. నా మేనల్లుడు అల్లుడయ్యాడన్న శుభవార్త నాకు వినాలని ఉంది” అని నారాయణరావు అంటుండగానే ఆయన కళ్ల నుండి ఆకాశం నుండి కురుస్తున్న వర్షంలా కన్నీరు కారసాగింది.

నెత్తిన పెద్ద పిడుగు పడినట్లయ్యాడు వివేక్.

‘నాన్నా!.. నేను వీ.విని పెళ్లి చేసుకోవడం ఏమిటి? నాకు వీ.వి అంటే ప్రాణం.. చచ్చేంత ప్రేమ.. నిజం చెప్పాలంటే వీ.వి.. నా ఊపిరి.. కాని ఇన్ని ఉన్నా నాకెప్పుడు వీ.విని పెళ్లి చేసుకోవాలనిపించలేదు’ ఆలోచనలతో పిచ్చిదానిలాగ తండ్రి వైపు చూడసాగింది అమృత.

“నారాయణరావుగారు!.. మీలాంటి మహానుభావుడు ఒక్క కోరిక ఉంది అని అనడం ఏమిటండి? ఎందరి ఇల్లల్లోనో దీపాలు వెలిగించారు.. ఎందరి కడుపులో నింపారు.. మీరు కోరినది చిన్న కోరిక.. ఆ చిన్న కోరిక తీరుతుందండి.. ఎప్పుడో కాదు.. రేపు ప్రొద్దున్న ఎనిమిది గంటలకి దివ్యమైన ముహుర్తం ఉంది.. మీ కళ్లతో నిశ్చితార్థం చూసి ఆపరేషన్‌కి వెళ్లండి.. మీ అల్లుడు కూతురిని దీవించి ఆపరేషన్ చేయించుకోండి” అన్నాడు లింగయ్య శాస్త్రి.

బెడ్ చుట్టూ ఉన్న జనాన్ని రెండు చేతులతో నెట్టుకుంటూ వీల్ చైర్ రిమోట్ సహాయంతో నడిపించుకుంటూ రమణ వచ్చి”లింగయ్య శాస్త్రిగారూ!.. మా నెత్తిన పాలు పోశారు.. మా బావగారికి ఒకే ఒక కోరిక.. అంత చిన్న కోరిక కోరినది ఈ సమయంలో ఎలా తీరుతుంది? అంత మంచి మనిషి కోరిక ఎలాగైనా తీర్చమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.. కాని దేవుడిలా వచ్చి రేపే నిశ్చితార్థం చేసుకోవచ్చని చెప్పారు” అని అంటుండగానే.. “శాస్త్రిగారు.. నిశ్చితార్థం రేపు ప్రొద్దున్న 8 గంటలకు అంటున్నారు.. ఈయన ఆపరేషన్ ప్రొద్ధున్న 10 గంటలకు.. అంటున్నారు” అని సుమిత్ర అంటుండగానే..

“శాస్త్రిగారు!.. మీరు ఏం చేస్తారో, ఎలా చెస్తారో మాకు తెలియదు.. అన్నయ్య కోరిక నెరవేరాలి” అని శారద అంటుండగానే..

“మీరేం హైరానా పడకండమ్మా. నిశ్చితార్థానికి అబ్బాయి, అమ్మాయి ఉంటే చాలు.. ఇదిగో ఈ గదిలో నారాయణరావుగారి కళ్లెదుట బ్రహ్మాండంగా నిశ్చితార్థం జరిపిస్తాను.. ఎటొచ్చి మీ బంధువులు, స్నేహితులందరిని కాకుండా ముఖ్యమైన వాళ్లని పిలుచుకోండి” అని అన్నాడు లింగయ్య శాస్త్రి.

“శాస్త్రిగారూ!.. ఈసారికి.. హాస్పిటల్ వాళ్లే వీళ్లని ఆశీర్వదిస్తారు” అని అమృతని, వివేక్‌ని దగ్గరకు రమ్మని కళ్లతో సంజ్ఞ చేశాడు నారాయణరావు.

అమృత, వివేక్ కళ్లనిండా నీళ్లు.. ఏం మాట్లాడాలో కూడా వాళ్లకి తెలియడం లేదు. అసలు ఇద్దరికి వివాహం అన్న మాటని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఏం చేయాలో, ఏం మాటాడాలో, తెలియని స్థితిలో, గుండెలో బాధతో గుండె బరువు ఎక్కి, బాధను తప్పుకోలేక కళ్ల నిండా నీళ్లు నిండి చెంపల మీద కారసాగాయి.

“ఏమండీ!.. అటు చూడండి.. పాపం వాళ్లిద్దరూ వాళ్ల మనసులో మాట పైకి చెప్పలేక సంశయిస్తున్నారు.. మీరు వాళ్లిద్దరి నిశ్చతార్థం నిశ్చయించడంతో సంతోషం పట్టలేక వాళ్లిద్దరి కళ్లల్లో నీళ్లు” అని సుమిత్ర అంటుండగానే..

“అయ్యో వదినా.. నవ్వలా చెబితే.. అన్నయ్య కంగారు పడతాడు.. సంతోషం కలిగినా, దుఃఖం కలిగినా మనిషి కళ్లల్లో నీళ్లు వస్తాయి.. ఇప్పడు వాళ్ల కళ్లల్లో వస్తున్నవి కన్నీళ్లు కావు.. ఆనంద బాష్పాలు..”  అంది సంతోషంగా శారద.

“కరెక్ట్‌గా చెప్పావు శారదా!..” అంది మెచ్చుకోలుగా సుమిత్ర.

“నా చెల్లెలు ఎప్పుడు కరెక్ట్‌గానే చెబుతుంది” అన్నాడు నారాయణరావు.

రౌండ్‌కి డాక్టరు, సిస్టర్ రావడంతో అందరూ పేషంట్ దగ్గర నుండి దూరంగా జరిగారు.

“డా. వివేక్!.. If you don’t mind.. మీకు తెలుసు.. పేషంట్ రిలాక్స్‌గా, రిలీఫ్‌గా, రెస్ట్‌లో ఉండాలి. రేపు సార్‍కి ఆపరేషన్.. అందరూ ఇళ్లకి వెళ్లిపోండి.. ముఖ్యమైన వాళ్లు మాత్రమే రండి.. ఏమంటావు డా. వివేక్” అన్నాడు డ్యూటీ డాక్టర్ అమర్.

మౌనంగా ఉన్న డా. వివేక్ వైపు చూసి, ఆశ్చర్యంగా “What doctor, మీరు అంత upset అయ్యారు ఏమిటి? డాక్టరుగా మీ అంకుల్‌కి మీరు ధైర్యం చెప్పాలి. అలా సైలెంట్‌గా ఉంటే ఎలా డాక్టర్?” అన్నాడు డా. అమర్.

కంగారుగా అన్నాడు డా. వివేక్ –

“మావయ్యకి ఏం కాదని తెలుసు.. ఆపరేషన్ అయ్యాక తిరిగి ఎన్ని రోజుల్లో మామూలుగా అవుతాడు? అని ఆలోచిస్తున్నాను.. అంతే” అని.

“నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను” అంది కంగారుగా అమృత..

అందరూ బయటకు అడుగులు వేస్తూ.. “శాస్త్రిగారూ! రేపు ప్రొద్దున్న నిశ్చితార్థానికి కావలసినవన్ని మీరు తీసుకోండి. ఇంటికి వచ్చి డబ్బు తీసుకోండి” అంది సుమిత్ర.

“అయ్యో!.. వస్తానమ్మ ఇంటికి.. మీరేం హైరానా పడకండి.. అంతా నేను చూసుకుంటాను. నూతన వస్త్రాలతో అమృతమ్మని, డా.బాబుని తీసుకురండి” అన్నాడు లింగయ్య శాస్త్రి.

డా. అమర్ నారాయణరావుని పరీక్ష చేసి ఏఏ మందులు పేషంట్‌కి ఇవ్వాలో సిస్టర్‌కి చెప్పి, అడుగులు బయటకు వేశాడు.

అమృత, వివేక్ మిగిలారు.

ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం లేని వాళ్లలా ఉండడం చూసి చిన్నగా నారాయణరావు నవ్వి “ఏంటి తల్లి వివేక్ బాబు మీద అలిగావా? చూడు వివేక్ బాబూ!.. నేను హాస్పటల్‌లో జాయిన్ అయిన రోజు నుండి, ‘వీవి వస్తే బాగుండను. తను వస్తే డాక్టరు కాబట్టి అన్ని చూసుకుంటాడు..’ అని నీకు పోను చేసే వరకు పేచీ పెట్టింది. వివేక్ బాబు వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేడు.. రీసెర్చ్ మధ్యలో డిస్టర్బ్ చేయవద్దన్నా ఎవరి మాట వినలేదు.. ఇలారా వివేక్ బాబూ! రేపే నా ఆపరేషన్.. కంఠం దగ్గర ఆపరేషన్.. ప్చ్.. బ్రతికి బట్టకట్టినా.. మాటడగలనో లేదో.. అన్న భయం వెంటాడుతుంది” అని నారాయణారావు అంటుండగానే కంగారుగా అన్నాడు వివేక్..

“మావయ్యా! ఎందుకలా భయపడుతున్నావు, ఆపరేషన్ అయిన రోజునే మాట్లాడగలవు. ప్లీజ్ మావయ్యా అనవసరంగా లేని పోనివి ఊహించుకుని బయపడుతున్నావు.. నువ్వేంటి? ఇలా మాటాడడం ఏమిటి?.. నేనంటే నీకు నమ్మకం ఉంది కదా?..” అని.

వివేక్ అంటుండగానే.. “నువ్వు వస్తావో, లేవో, నువ్వు లేకుండా ఆపరేషన్ చేయంచుకోవాలా? వద్దా?.. నా మనసులో తీసుకున్న నిర్ణయం చెప్పకుండానే, నా ప్రాణం పోదు కదా అని భయపడ్డాను వివేక్ బాబు.. ఇప్పుడు నాలో ఎటువంటి భయం గాని ఆందోళన గాని ఏం లేవు.. ఎందుకంటే నువ్వు వచ్చేసావు. నా బంగారు తల్లిని నీ చేతుల్లో పెట్టేసాను. నా కళ్లరా రేపు నిశ్చితార్థం చూస్తాను.. తరువాత మీ పెళ్లి చూడకపోయినా పరవాలేదు.. ఎందుకుంటే తరువాత నేను నానీగా మీ కడుపున పుడతాను.. ఏం తల్లీ.. నాన్నమ్మ నన్ను నానీ అని పిలిచేది అని చెప్పిన దగ్గర నుండి.. నాన్న కన్నా నానీ.. అంటేనే బాగుంది నాన్న అని అన్నావు.. నీ ఇష్టప్రకారమే.. నానీ అని పిలుచుకో తల్లి” అని నారాయణరావు అనగానే.. “ఏమిటి నాన్న ఇదంతా? పెళ్లి ఏమిటి? నీ ఆరోగ్యం ఇలా ఉంటే.. ముందు నువ్వు ఎప్పటిలా అవ్వాలి.. ప్లీజ్ నాన్న..” అని అమృత అంటుండగానే కంగారుగా అన్నాడు నారాయణరావు.

“ఏంటి తల్లీ! నువ్వుంటున్నది?” అని నారాయణరావు అంటుండగానే గభాలున చెయ్యి పట్టుకొని..  “అమ్మూ!.. నీ గురించి చాలా వర్రీ అయిపోయింది. నీకేం కాదని ఎంత చెప్పినా వినడం లేదు.. అందుకని అలా అంటుంది.. నువ్వు కాసేపు కళ్లు మూసుకొని పడుకో మావయ్యా..” అన్నాడు వివేక్.

“అమ్మూ!.. కాఫీ ఏమైనా తాగుతావా” అన్నాడు వివేక్.

“దాన్ని అడిగితే వద్దనే అంటుంది. చూడు ఎలా అయిపోయిందో? ఏమైనా తినిపించు వివేక్ బాబూ!.. నువ్వు ఏమైనా తిను.. నువ్వు వచ్చావన్న సంతోషంలో చాలా ఎక్కువ మాట్లాడేసాను” అని మాటాడుతూనే కళ్లు మూసుకున్నాడు నారాయణరావు.

అమృత చెయ్యి పట్టుకొని క్యాంటిన్ వైపు నడిచాడు వివేక్. ఇద్దరు అపరిచితుల్లా మౌనంగా క్యాంటిన్ లోకి అడుగులు వేసి టేబిల్ దగ్గర కూర్చున్నారు.

సర్వర్ రాగానే.. అమృతకి ఏం కావాలో ఆర్డరిచ్చి “అమ్మూ ఎందుకంత upset అయ్యావు?” అని వివేక్ అంటుండగానే “బాబూ!..” అని వివేక్ భుజం మీద వాలిపోయి తన చేత్తో వివేక్ చెయ్యి గట్టిగా పట్టుకొని ఉండుండి ముక్కు పీల్చి, శ్వాస వదిలి, ఏడుస్తూనే ఉంది.

సర్వర్ తెచ్చి టిఫిన్ టేబుల్ మీద పెట్టాడు.. గ్లాసులతో నీళ్లు పెట్టాడు..

“అమ్మూ!.. Control yourself. ఇలా ఎంత సేపు ఏడుస్తావు? ముందు కళ్లు తుడుచుకో” అన్నాడు వివేక్..

“ఎంత సేపయినా ఏడుస్తాను.. అసలు నీతో పెళ్లి చేయాలన్న ఆలోచన నాన్న కెందుకు వచ్చింది?..”

“అన్ని రకాల బంధాలు ప్రేమతో ముడిపడి ఉంటాయి. ప్రేమతో ముడిపడిన బంధాలలో అన్నా, చెల్లి, అక్కా తమ్ముడూ లేరా?.. అంతదాక ఎందుకు నువ్వంటే చాలా ఇష్టం.. అలా అని నాన్నంటే ఇష్టమా? నువ్వంటే ఇష్టమా? అని ఎవరైనా అడిగారనుకో.. ఖచ్చితంగా చెప్పగలను.. First నాన్న second నువ్వు, ఆ తరువాతే మిగిలిన అందరూ అని.. ఇష్టాలని, ప్రేమని పెళ్లితో ముడిపెడితే ఎలా బాబూ!.. నువ్వే చెప్పు.. అసలు ఆ ఆలోచన నన్ను నిలబడనివ్వడం లేదు” అని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

“అమ్మూ!.. నీకు ఒక విషయం అర్థం కావడం లేదు. నువ్వు నేను బావా, మరదళ్లం.. అన్నా, చెల్లెలు రోడ్డు మీద నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతుంటే, వాళ్లని చూసి తప్పుగా అనుకునే కొంతమంది మనుషులుంటారు. కాని.. బావ, మరదరలంటేనే ఆటపట్టించే వాళ్లే, ఎక్కువ ఉంటారు. ఇద్దరిని ఒక చోట చూస్తే హాస్యాలాడేవాళ్లు, చలోక్తులు విసిరేవాళ్లు, ఆట పట్టించేవాళ్లు ఎక్కువగానే ఉంటారు.. మన ఇద్దరి వరస బట్టి, మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానం, అనురాగం, ప్రేమని చూసి మన వాళ్లు మనిద్దరికి పెళ్లి అంటున్నారు.. మనిద్దరి మధ్యా ఉన్నది అన్నా, చెల్లెలు బంధమో, స్నేహ బంధమో, చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగిన, మనుషుల మధ్య ఏర్పడే మానవ సంబంధమేమో అని వాళ్లు ఆలోచించలేకపోయారు అమ్మూ..” అన్నాడు ఆవేదనగా వివేక్..

కంట్లో నలక పడినా నాన్నా అని నాన్న దగ్గరకు వెళ్లి చెప్పే తను, వీవితో పెళ్లి చేస్తున్న నాన్నని ఏమీ అనలేకపోతంది., గుండెని పిండేస్తున్న ఈ బాధని ఎవరితో చెప్పను నాన్నా అని మనసులో బాధపడసాగింది అమృత.

“అమ్మూ!.. ఇప్పుడు మావయ్యని అసలు బాధ పెట్టే పని చేయకూడదు.. ఇప్పుడు పేషంట్‌కి కావలసింది మనోధైర్యం, మనసు ప్రశాంతంగా ఉంచడం, సంతోషంగా ఉంచడం.. అలా మావయ్యని ఉంచితేనే తను త్వరగా తేరుకుంటాడు” అని అన్నాడు వివేక్..

“వీవి.. ఏంటి నువ్వు చేప్పేది.. నాన్న చెప్పినట్లు చేయడానికి డిసడైపోయావా?.. అసలు అలా ఎలా అనుకోగలుగుతున్నావు..” అని అమృత అంటుంటగానే..

బాధగా అన్నాడు వివేక్..

“ఏం చేయమంటావు అమ్మూ! మావయ్య ఒక్కడే కాదు.. అత్తయ్య, అమ్మ.. అందరూ.. మన ఇద్దరికీ పెళ్లి చేయడానికే రెడీ అయిపోయారు.. మనిద్దరం ఎదురు తిరిగి మావయ్యని బాధ పెట్టమంటావా? ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటే.. అమృత, నాకు మధ్య స్నేహబంధం, అన్నా చెల్లెల మధ్య ఉండే బంధం తప్ప వివాహాం చేసుకోవడానికి కావలసిన బంధం లేదు అని ఖచ్చితంగా, స్పష్టంగా చెప్పేవాడిని. బహుశా మనిద్దరికి వచ్చినలాంటి సమస్య ఎవరికి రాదు ఏమో?..” అని అంటుండగానే సిస్టర్ పరిగెత్తుకొని – క్యాంటిన్‌లో ఉన్న అమృత, వివేక్ దగ్గరకు వచ్చి “సార్, పేషంట్ ఆయస పడుతున్నారు. డ్యూటీ డాక్టరు చూస్తున్నారు” అని చెబుతుండగానే గభాలున వివేక్ చెయ్యి పట్టుకొని కళ్ల నీళ్లతో “నాన్నకి ఏం కాదుగా” అంది అమృత.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా భారంగా ఊపిరి పీల్చుకొని “ఏం కాదు అమ్మూ!.. కాని నువ్వు ఇలా ఉండకూడదు.. Now he is patient. రేపు సర్జరీ.. ప్లీజ్! అర్థం చేసుకో!..” అని వివేక్ అనగనే అంత వరకు వివేక్ చెయ్యి గట్టిగా పట్టుకొని నడుస్తున్న అమృత ఏదో గుర్తు వచ్చిన దానిలా టపీమని వివేక్ చెయ్యి వదిలేసి దూరంగా నడవసాగింది.

అమృతకి, తనకి పెళ్లన్న దగ్గర నుండి చాలా అప్‌సెట్ అయిపోయింది. మానసికంగా ఎంత నలిగిపోతుందో తను ఊహించగలడు. ఎందుకంటే తను ఆ పరిస్థితిలోనే ఉన్నాడు..

తామిద్దరిని ప్రాణంగా ప్రేమించే తమ కుటుంబం ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడంతో, వాళ్లందరూ ఏకమై తమని ఒంటరి వాళ్లు చేసారు ఏమో అనిపిస్తుంది.

ఒకరికి సంతోషం కలిగించే విషయం వేరొకరికి సంతోషం కలిగించదని మాత్రం అర్థమయింది. అలా అని తామిద్దరి మనసులో మాట చెప్పే అవకాశం లేదు.

(సశేషం)

Exit mobile version