[నారాయణరావు కోరికకి అమృత, వివేక్ విస్తుపోతారు. అయితే కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషిస్తారు. తమకి ఒకరితో ఒకరికి పెళ్ళేంటి అని అమృతా, వివేక మనసులో బాధపడతారు. నారాయణరావుని చూడ్డానికి వచ్చిన పూజారి గారు మర్నాడే నిశ్చితార్థానికి ముహూర్తం ఉందని చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. ఆసుపత్రిలోనే ఓ గదిలో నిశ్చితార్థం జరుపడానికి డాక్టర్లు అంగీకరిస్తారు. అమృత, వివేక్ కళ్లనిండా నీళ్లు.. ఏం మాట్లాడాలో కూడా వాళ్లకి అర్థం కాదు. అయితే అవి ఆనంద బాష్పాలని సుమిత్ర, శారద భావిస్తారు. అమృత మౌనంగా ఉండడం చూసిన నారాయణరావు బావ మీద అలిగిందని భావిస్తాడు. వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే ముందు తండ్రి ఆరోగ్యం బాగుపడాలని, ఆ తర్వాతే ఏదైనా అని అమృత అంటే నారాయణరావు కాదంటాడు. నిశ్చితార్థం జరగాల్సిందే అని అంటాడు. అమృత వివేక్ క్యాంటిన్‌లో కూర్చుని మాట్లాడుకుంటారు. తమ మధ్య ఉన్న బంధం అన్నాచెల్లెళ్ళ బంధం అని పెద్దలకి చెప్పడం ఎలా అని సతమతమవుతారు. ఇంతలో నారాయణరావుకి ఆయాసం వస్తోందని, డ్యూటీ డాక్టర్ అటెండ్ అవుతున్నారనీ ఓ నర్సు వచ్చి చెప్తుంది. తామిద్దరి మనసులో మాట చెప్పే అవకాశం లేనందుకు అమృత దిగులుపడుతుంది. – ఇక చదవండి.]
[dropcap]తె[/dropcap]లవారింది.. సూర్యకిరణాలు నేలంతా పరచుకుంటున్నాయి. కొబ్బరి చెట్లు, పూల చెట్లు, పిచుకల కిలకిలారావాలు. జామచెట్ల మీద వయ్యారంగా కూర్చొని జామపండును ముక్కుతో పొడుచుకొని తింటున్న రామచిలకలు. ఎక్కడి నుండో ఎగిరి వచ్చిన తెల్లటి పావురం బిక్కు బిక్కు మంటూ అటు ఇటు చూస్తూ ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు ఎగురుతూ కనిపించింది.
బ్రష్ పట్టుకొని అక్కడకు వచ్చిన వివేక్ మనసులో అలజడి. ఒకప్పుడు ఆ వాతారణంలో లీనమైపోయేవాడు. కాని ఇప్పుడు తన మనసు దేన్ని పట్టించుకోవడం లేదు. మనసులో ఒకటే బాధ.. తనకి, అమృతకి నిశ్చితార్థం.. నిజం చెప్పాలంటే పవిత్రమైన అన్నా, చెల్లెల బంధం కంటే ఎక్కువ అనురాగం, అభిమానం, ప్రేమ ఉంది.. కాని అంతటి పవిత్ర బంధానిని వీళ్లందరూ బావ మరదళ్లు బంధంతో ముడిపెడితే ఎలాగు?
“అమృతా! నా మాట విను తల్లి.. మేము గుండెని రాయి చేసుకొని బ్రతకడం లేదు..? కలలోనైనా ఆయన ఆరోగ్యం ఇలా అవుతుందనుకోలేదు.. నువ్వు ఇలా ఏడుస్తూ నిశ్చితార్థం చేసుకోకూడదు.. మీ నాన్నని సంతోషపెట్టాలంటే.. ఆయన కోరిక తీర్చాలంటే.. మీ నాన్నకి సంతోషంగా కనబడాలి.. నీ బాధని, నీ గుండెలోనే దాచుకో తల్లి” అంది సుమిత్ర.
“వదిన ఎంత బాధపడుతుందో మీరెవరు ఊహించలేరు.. తిండి, నిద్రహారాలు మాని భర్త కోసం ఏడుస్తుంది.. కాని తను బాధపడుతునట్లు అన్నయ్య తెలియకుండా, జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు మనందరం చేయవలసింది ఒక్కటే.. మన బాధని దిగమింగి, అన్నయ్య సంతోషంగా ఉండేటట్లు చేయాలి.. ఒక్కటి అర్థం చేసుకో అమృత.. నీ పెళ్లి.. ఎవరు ఊహించలేనంత ఘనంగా మీ నాన్న చేయాలనుకున్నాడు.. కాని ఇప్పుడు తను ఉంటానో, లేదో అన్న బాధతో, నీ నిశ్చితార్థం హాస్పటల్‌లో జరిపిస్తున్నాడు.. నాన్న కోరిక తీరుస్తున్నందుకు నువ్వు సంతోషంగా ఉండాలి.. ఇలా కళ్ల నీళ్లతో ఎప్పుడు నాన్నకి కనబడకూడదు.. ఏరా? అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? అమృత ఎవరి మాట వినదు. నీ ఒక్కడి మాట తప్ప.. ఏం చేస్తావో తెలియదు.. అమృతని సంతోషంగా ఉంచే పూచీ నీదే” అని కొడుకుని మందలించి, ఎవరో పిలవడంతో లోపలికి నడిచింది శారద.
ఇన్నాళ్లు మనసు బాధపడితే, ఆ బాధ ఉపశమనం పొందడానికి మాత్రమే కన్నీళ్లు వస్తాయి అనుకున్నాడు.. కాని ఇప్పుడు కన్నీళ్లకు అర్థమే మారిపోయింది.. తన మెడలో పసుపు తాడు పడుతుందన్న భయంతో, అమృత కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని ఎవరు గుర్తించలేకపోతున్నారు.
పిచ్చి పిల్ల.. ఒక ప్రక్క నిశ్చితార్థం జరుగుతుందన్న బాధ, భయం, దిగమింగి సంతోషంగా ఎలా కనబడగలదు?
“అమ్మూ! వింటున్నావా అందరి మాటలు. ఇప్పుడు మనం వాళ్లందరూ అనుకుంటున్నట్లుగానే ప్రవర్తించాలి.. అంతే కాని జరుగుతున్న నిశ్చితార్థం గురించి బాధపడుతున్నట్లు మాత్రం ఎవరికి తెలియకూడదు..” అన్నాడు.
“అంటే నువ్వు చెప్పేది.. నిశ్చితార్ధం జరిగితే సగం పెళ్లయిపోయినట్లే అంటారు.. వీవి! నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం, ప్రేమ అభిమానం అన్నీ.. అన్నీ ఉన్నాయి.. ఎందుకంటే నువు అమెరికా వెళ్లిపోయాక నాకేం తోచలేదు. పిచ్చెక్కిపోయాను.. ఈ విషయమే నీతో అన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో తెలుసా?
నీకు నాకు మధ్య 20 వేల కిలోమీటర్ల దూరం ఉండొచ్చు.. ప్లైట్ ఎక్కితే ఇక్కడికి రావడానికి 24 గంటలు పట్టొచ్చు.. ఫోను చేస్తే మాత్రం సెకండ్లలో కనెక్ట్ కావచ్చు.. కాని నన్ను నువ్వయినా, నిన్ను నేనయినా మనసులో తలచుకుంటే సెకను కూడ అక్కరలేదు అన్నావు.. కరక్టుగా చెప్పావు అనుకున్నాను.. ఇరవై ఏళ్లు అపురూపంగా పెరిగిన ఓ ఆడపిల్ల ముక్కు మొఖం తెలియని వ్యక్తితో ఎంతదూరం అయినా వెళుతుంది.. తన వాళ్లు గుర్తొచ్చినప్పుడల్లా తన వాళ్లు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్లని తలచుకొని తృప్తి పడుతుంది. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. రేపు పెళ్లయి ఎక్కడికో వెళితే.. అప్పుడు అక్కడ వీవి ఉండడు కదా అని నన్ను నేను సముదాయించుకున్నాను.”
“అమ్మూ!.. ఏంటి నువ్వు చెబుతున్నది” అన్నాడు కంగారుగా
“నిన్ను రకరకాల పేరుతో పిలిచేదానిని.. నువ్వు నా నుండి దూరం వెళ్లాక ఒక clarity వచ్చింది.. నువ్వు అమెరికా నుండి రాగానే అందరికి నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలియ చేయడానికి ‘అన్నయ్యా’ అని పిలవాలనుకున్నాను.
నిజం చెప్పు వీవి.. ఒక అన్నా చెల్లెలు మధ్య ఉన్న రక్తసంబంధం కన్నా, ప్రేమ అనురాగం కన్నా భార్య భర్తల బంధం గొప్పదా? అంత గొప్పదయితే 5 సంవత్సరాలు ప్రేమించుకొని, ఆ తరువాత పెళ్లి చేసుకొని, 4 సంవత్సరాలు తరువాత విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు. తరువాత మళ్లా వేరే వాళ్లని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు?
మరి అన్నా, చెల్లెల్లు, అక్కా, తమ్ముళ్ల బంధాలల్లో వస్తే పొరపొచ్చాలో, చిన్న చిన్న మనస్పర్థలో వస్తుంటాయి. పోతుంటాయి.. భార్యాభర్తల బంధాల్లోలా డివోర్సులు.. విడిపోవడాలు ఉండవు.. ఇవన్నీ ఆలోచించే నేను పెళ్లి చేసుకునే వ్యక్తి కన్నా.. మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి విలువనిచ్చి ‘అన్నయ్యా’ అని పిలవాలనుకున్నాను” అని అమృత అంటుండగానే..
“అమ్మూ!.. ఇంకా కబుర్లు అయిపోలేదా? వివేక్ ఎక్కడికి వెళ్లిపోడులే!.. వాడిని చూస్తే దీనికి కబుర్లు ఆగవు శారదా.. అరగంటలో బయలుదేరాలి” అని గట్టిగా సుమిత్ర అనడం విని అమృత, వివేక్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
ఇద్దరు లోపలికి అడుగులు వేసారు.. సెల్ రింగ్ కావడంతో కంగారుగా ‘హలో’ అన్నాడు వివేక్..
“కంగ్రాట్స్!.. వివేక్!.. ఘోరం రా!.. ఫ్రెండ్స్.. మాకు చెప్పకుండా engagement చేసుకుంటున్నావ్.. హాస్పటల్ MD గారు చెప్పే వరకు, ఈ రోజు హాస్పటల్‌లో నిశ్చితార్థం అన్న విషయం తెలియదు” అని డా. మురారి అన్నాడు.
“నేరు ముయ్యరా!.. ఒక ప్రక్క నేను వర్రీలో ఉంటే..” అని వివేక్ అన్నంతలో..
“ఇందాక నన్ను నోరుముయ్ అన్నావు.. ఇప్పడు నేను అంటాను.. నోరు ముసుకొని.. కాస్త హుషారుగా ఉండు. జీవితంలో ఎవరికైనా ఒకసారి మాత్రమే వివాహం అనే అద్భుతమైన ఘట్టం ఉంటుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా.. అటువంటి స్వీట్ మెమరీస్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. సరే తరువాత క్లాసు తీసుకుంటానుగాని, నీ తీరు చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. కొంపదీసి అక్కడ ఏ తెల్ల అమ్మాయినో లవ్ చేయలేదు కదా?..” అని నవ్వుతూ ఫోను పెట్టేసాడు డా. మురారి.
డా. మురారి మాటలకి గబాలున వివేక్‌కి దివ్య గుర్త వచ్చింది.
ప్రేమ విచిత్రమైనది.. ప్రేమకి ఉన్నన్ని రూపాలు ఇంక దేనికి ఉండవేమో..
ఒక మనిషిని చూసిన తొలిక్షణంలోనే ప్రేమలో పడిపోయిన వాళ్లున్నారు.. కొద్ది రోజులు పరిచయం అయ్యాక ప్రేమలో పడిన వాళ్లు ఉన్నారు. ద్వేషించి దూరం జరిగే వాళ్లు ఉన్నారు. ప్రాణం అనుకున్న వాళ్లు ఈ లోకం విడిస్తే వాళ్ల మీద ప్రేమ చంపుకోలేక చనిపోయిన వాళ్లు ఉన్నారు..
మొదటి సారి దివ్యను చూసినప్పుడు తనకి ఏం అనిపించలేదు.. రోజులు గడుస్తున్నా ఇద్దరి మధ్య ఎటువంటి feelings లేవు. కాని రోజులు గడుస్తున్న కొలది దివ్య down to earth మనిషి, తన ప్రవర్తన, వర్క్ పట్ల డెడికేషన్, అన్నీ తనని ఆకర్షించాయి.. ఆకర్షణలో నుండి దివ్య మీద ఇంట్రస్ట్ పెరిగింది. ఆ ఇంట్రస్ట్ ప్రేమే అని తెలిసింది.. తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు కాని.. ఇప్పుడు.. ఇలా.. వివేక్ కళ్ల నిండా నీళ్లు నిండాయి..
“ఏంటి వివేక్ బాబూ!.. పిచ్చి పిల్ల.. మా మాటలు విని అదిగో తయారయ్యింది.. బాధ లేనిది ఎవరికి? ఈ రోజు చాలా ముఖ్యమైనది. డాక్టరువై వుండి.. మాకు ధైర్యం చెప్పి, నువ్వు ధైర్యంగా ఉండాలి, తొందరగా రెడీ అవ్వు వివేక్ బాబూ!..” అంది సుమిత్ర..
‘ప్చ్!.. ప్రతీ మనిషి జీవితంలో ముఖ్యమైన రోజు కాబట్టే అమ్మూ తను.. ఏం చేయాలో తోచక బాధపడుతున్నాం’.
‘మా ఇద్దరి కన్నీళ్లు ఎవరికి అర్థం కానందుకు భగవంతునికి థాంక్స్ చెప్పాలి..’
మావయ్యకి ఆరోగ్యం బాగోలేదన్న విషయం విని గుండెని అరచేతిలో పెట్టుకొని వచ్చాడు. జరుగుతున్న పరిణామంతో గుండె జారిపోయింది..
అందరూ హడావిడి చేయడంతో మౌనంగా కారెక్కారు. వరుసగా కార్లు బయలుదేరాయి. హాస్పటల్ చేరుకున్నాయి కార్లు. హాస్పటల్ అంతా కొత్త పెళ్లి కూతురిలా తయారయింది. అందరూ స్పెషల్ రూమ్ లోకి నడిచారు.. అప్పటికే అక్కడ నారాయణరావుగారిని movable bed మీద తీసుకువచ్చారు. పంతులుగారు పూజకి కావలసిన సామానులన్ని సర్దుకోసాగారు.. అమృతని, వివేక్‌ని చూసిన నారాయణరావు కళ్లతోనే దగ్గరకు రమ్మన్నట్లు చూడడంతో గబగబా ఇద్దరు వెళ్లి నారాయణరావుగారి బెడ్‌కి చెరో వైపు నిలబడ్డారు.
నిస్సత్తువగా, తేలిపోతున్న కళ్లని బలవంతంగా విప్పి ఇద్దరిని చెరో చెత్తో పట్టుకొని.. చిన్నగా నవ్వి.. “ఎందుకు తల్లీ ఆ కళ్లలో నీళ్లు.. అరె డాక్టరువి అయిండి ఆడపిల్లలా ఆ కళ్లల్లో నీళ్లు ఏమిటి? అసలు ఎందుకు మీరిద్దరు అలా డల్‌గా ఉన్నారు.. నా కోరిక తీరుస్తున్నారు.. కాదు, కూడదు.. ఇప్పుడు నిశ్చితార్థం వద్దని మీరంటే నేను ఏమీ చేయలేకపోయేవాడిని.. కాని నా మాటకి, నాకు ఇంత గౌరవం ఇచ్చి నా మీద ప్రేమ చూపిస్తున్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. నేను ఒక్కడిని సంతోషంగా ఉంటే సరిపోదు.. మీ ఇద్దరి ముఖంలో సంతోషం చూడాలి. అప్పుడే నేను మనస్ఫూర్తిగా – నేను చేసిన ఈ పనికి అర్థం ఉందని సంతోషపడతాను” అని ఆయసం రావడంతో ఉక్కిరిబిక్కిరి కావడం చూసి “నాన్నా!..”అని అమృత; “మావయ్యా!..” అని వివేక్, కంగారుగా నీళ్లు తెచ్చి ఇద్దరు కలిసి నారాయణారావుని జాగ్రత్తగా పట్టుకొని నీళ్లు తాగించి, తిరిగి పడుకోబెట్టారు.
నారాయణరావు నీరసంగా కళ్లు మూసి తెరిచారు. కళ్ల నిండా నీళ్లు.
“నాన్నా!.. ఎందుకు ఆ కళ్లల్లో నీళ్లు.. నేను సంతోషంగా ఉన్నాను.. చూడు” అని అమృత ముఖంలో సంతోషం తెచ్చుకొని “బాబూ!.. అలా చూస్తావేమిటి?.. చెప్పు నాన్నతో.. సంతోషంగా ఉన్నాం అని” కళ్లతో సైగ చేసింది అమృత.
“అవును మావయ్యా!.. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అరె.. ఏంటి మామయ్యా ఆ కన్నీళ్లు?” అన్నాడు కంగారుగా వివేక్.
చిన్నగా నవ్వి “ఈ కన్నీళ్లని.. ఆనంద బాష్పాలంటారు” అన్నాడు నారాయణరావు.
వస్తున్న దుఃఖాన్ని ఆపుకోకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ ఏదో గుర్తు వచ్చిన దానిలా “నాన్నా!.. ఇందాక నువ్వు చెప్పవే ఆనంద బాష్పాలని.. అవి నాన్నా” అని గభాలున వివేక్ వైపు చూసి.. “వీవి కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు..” అని అమృత అంటుండగానే శాస్త్రిగారు, అమృతని, వివేక్‌ని వచ్చి పీటలమీద కూర్చోమనడంతో కూర్చున్నారు..
నిశ్చితార్ధం జరుగుతుండగా Hospital MD విఠల్ గారు వచ్చారు..
అందరిని ఉద్దేశించి MD విఠల్ గారు చెప్పడం ప్రారంభించారు – “కోవిడ్ టైమ్‌లో ఎందరో కోవిడ్ బాధితులను వాలంటరీగా నారాయణరావుగారు ఆదుకున్నారు. ఎందరి ఇళ్లల్లోనో నారాయణరావుగారి ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు. అంత మంచి మనిషి నన్ను చిన్న కోరిక కోరారు. ఆపరేషన్‌కి ముందు నా కూతురు నిశ్చితార్థం చూడాలని ఉంది అని అన్నారు. చాలా సంతోషంగా ఉంది నిశ్చితార్ధం జరగడం” అని నారాయణరావుగారి దగ్గరకు వెళ్లి “Are you happy నారాయణరావుగారు?” అని అన్నాడు.
“థాంక్స్ డాక్టరుగారు” అంటుండగానే ఆపరేషన్ ధియేటర్ స్టాఫ్ వచ్చి నారాయణరావుగారిని తీసుకువెళ్లసాగారు.
“నాన్నా!” అని అమృత, “మావయ్యా” అని వివేక్ గబగబా దగ్గరకు వెళ్లారు. సుమిత్ర, శారద నాలుగడుగులు వేయగానే “బావా!.. నేను వస్తున్నాను..” అని రమణ రిమోట్ సహాయంతో wheel chair తోసుకుంటూ నారాయణరావు దగ్గరకు వెళ్లి గభాలున తన రెండు చేతులతో నారాయణరావు పాదాలు తాకి కళ్లకు అద్దుకున్నాడు. వెంటనే కంగారుగా.. “ఛ!.. ఛ!.. ఏంటీ పని బావా!.. నాకు నువ్విలా చేయడం చాలా బాధగా ఉంది” అని నారాయణరావు అంటుండగానే.. “అలా అనకు బావా. నా వాళ్లనుకున్న వాళ్లు నేను వీల్ చైర్‌కి పరిమితం అయ్యానని నన్ను దూరం పెట్టారు. కాని నువ్వు నన్ను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఇంటికి తీసుకువచ్చావు.. అవిటి వాడినని చూడకుండా కొత్త అల్లుడిలా చూస్తున్నావు.. ఇంత మంచితనం నీకెలావచ్చింది” అని కన్నీళ్లు కార్చసాగాడు రమణ.
అప్పటికే ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ నెమ్మదిగా బెడ్ మూవ్ చేస్తూ వెళ్లసాగారు. వెనకాల గబగబా నడుచుకుంటూ వెళ్లి జనరల్ సర్జన్ M.V.Rao ని – తనని థియేటర్ లోకి allow చేయమని అడిగి, పర్మిషన్ ఇవ్వడంతో, థియేటర్ డ్రస్ వేసుకొని గబగబా నారాయణరావు దగ్గరకు నడిచి.. “మావయ్యా!.. నేను నీ దగ్గరే ఉంటాను..” అని వివేక్ అన్నాడు. అప్పటికే మత్తు డాక్టరు నారాయణరావుకి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. నారాయణరావు మత్తుతో కళ్లు మూసుకున్నాడు.
ఆపరేషన్ థియేటర్ బయట అందరూ కూర్చొని ఉండి, థియేటర్ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయోమో అని చూడసాగారు.
అందరి కళ్ల నిండా కన్నీళ్లు నిండి చెంపల మీద నుండి జారడానికి సిద్ధంగా ఉన్నాయి.
సంతోషం అయినా, బాధ అయినా, గుర్తు వచ్చేది భగవంతుడు కాదు.. అమృత నుండి వచ్చే మాట నాన్నా, నానీ, వీ.వి, బాబూ.. కాని ఇప్పుడు వాళ్లెవరు గుర్తు రావడం లేదు. ఎందుకంటే తన మనసులో జరుగుతున్న సంఘర్షణ, బాధ.. వాళ్లిద్దరితో చెప్పకోలేదు. ఇక మిగిలింది దేవుడు..
ప్రతీ మనిషి స్వార్థపరుడే!..
కష్టాల్లో, బాధల్లో, కావలసిన కోరికలు తీర్చమని అడగడంలో తప్పకుండా దేవుడు గుర్తు వస్తాడు. అంతే వాళ్ల వాళ్ల తాహతు బట్టి పాపం నోరు తెరిచి అడగని ఆ దేవునికి కానుకల రూపంలో లంచాలు సమర్పించుకుంటారు.. తరువాత రిజల్ట్ కోసం చూస్తారు.. వాళ్లు కోరిన కోరికలు తీరలేదు.. ఇంకేం చేయాలి నీకు స్వామి!.. పూజలు చేశాము, కానుకలు సమర్పించాం.. అయినా అలా మౌనంగా కూర్చుంటే ఎలాగు అని దేవుడిని కూడ ప్రెజరు పెట్టే మనుషులున్నారు..
కాని పాపం అమృత.. తన మనసులో సంఘర్షణ మాత్రమే చెప్పుకొని.. అందరూ.. ఇక్కడున్నా, అందరూ నాన్నకి ఆకస్మాతుగా ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ జరుగుతుందని మాత్రమే కంట తడి పెడుతున్నారు. కాని.. తను, వీవి మాత్రమే.. తమకి జరిగిన నిశ్చితార్ధం జీర్ణించుకోలేక, త్వరలో కళ్ల ముందు కనబడే కళ్యాణం – కళ్లల్లో కనబడి కన్నీరు ప్రవహించి, తండ్రి కోసం తపిస్తున్న కన్నీళ్లతో కలిపి గుండె ఆగిపోతుంది ఏమో అన్న భయం కలుగుతుంది అమృతకి.
(సశేషం)